Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఆంధ్రలో సర్వే ఫలితాలు

ఎమ్బీయస్: ఆంధ్రలో సర్వే ఫలితాలు

వైసిపి మూడేళ్ల పాలన తర్వాత ప్రజల నాడి ఎలా వుందో తెలుసుకోవడానికి గ్రేట్ ఆంధ్ర చేసిన సర్వే ఫలితాలను ‘‘జగన్‌కే జనామోదం’’ పేర ఆర్టికల్‌లో రాశారు. ఆ సర్వే ఫలితాలను మీ అందరిలాగానే నేనూ చూశాను. దాని శాంపుల్ గురించి, నిర్వహించిన వారి స్థాయి గురించి నాకు ప్రత్యేకమైన సమాచారమేమీ లేదు. నేను గ్రేట్ ఆంధ్ర ఉద్యోగి ననుకుని భ్రమపడే కొందరు పాఠకులు ‘అదేమిటి, పక్క డెస్క్ కెళ్లి కనుక్కోవచ్చుగా’ అనుకోవచ్చు. కానీ నేను ఫ్రీలాన్సింగ్ కాలమిస్టును కాబట్టి వాళ్ల ఆఫీసుకెళ్లి కనుక్కోలేను. నేను ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌కూ రాస్తాను, బిబిసి వెబ్‌సైట్‌కూ రాస్తాను. మరొకరికీ రాస్తాను. అందువలన ఒక పరిధి దాటి తెలుసుకోలేను. ఇలాటి సర్వేల విషయంలో నేను గమనించిన దేమిటంటే చేసే సంస్థ ప్రామాణికత, తీసుకున్న శాంపుల్ సైజు అనేవి ముఖ్యం. సర్వే అన్నది చాలా ఖరీదైన వ్యవహారం. ‘‘హాసం’’ నడిపే రోజుల్లో పాఠకుల అభిప్రాయాలు కనుక్కుందామని సర్వే చేయించబోతే ఆ ఖర్చుతో మరో మూడు సంచికలు వేసుకోవచ్చని తేలింది. దాంతో సర్వే ఐడియా డ్రాప్ చేశాం.

అంత ఖర్చు పెట్టి సర్వే చేయించడానికి బలమైన మోటివ్ ఉండాలి. ఎన్నికలకు ముందయితే రాజకీయ పార్టీలు ధారాళంగా ఖర్చు పెడతాయి కాబట్టి భారీ ఎత్తున సర్వేలు చేయించవచ్చు. మోతుబరి టీవీ సంస్థలు కూడా కథనాలు వెలువరించి, ప్రేక్షకులను ఆకట్టుకుని, యాడ్స్ తెచ్చుకోవడానికి పెద్ద స్థాయి సర్వేలే చేయించవచ్చు. మామూలు రోజుల్లో ఒక ఆర్టికల్ రాయించడం కోసం అంతంత ఖర్చు పెట్టడం కిట్టుబాటు వ్యవహారం కాదు. పార్టీలు తమ కోసం చేయించుకున్న సర్వేలను రహస్యంగా సంపాదించి వేసుకునే అవకాశాలూ లేకపోలేదు. అందువలన యీ సర్వే ప్రామాణికత గురించి నేను ఎలాటి సర్టిఫికెట్టూ యివ్వటం లేదు. కానీ అది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది అనే నాకు తోచింది. ఆ అవగాహనతోనే సర్వే ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తున్నాను.

వైసిపి అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. అందువలన ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది. అది యీ సర్వేలో తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద చూస్తే వైసిపికి 51%మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. 51%అనుకూలం అంటే సామాన్యమైన విషయం కాదు. 35%పైన ఎంత ఉన్నా దాన్ని గొప్పగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఎటూ తేల్చనివారు (కాన్ట్ సే వర్గం) ఏ 15-20 శాతమో ఉంటారు. వాళ్లే చివర్లో ఫలితాలను అటూయిటూ చేయగలుగుతారు. ఈ 51 ఎక్కువే అనిపిస్తున్నా, 2019లోనే వైసిపికి 50%ఓట్లు వచ్చాయి. దానితో పోలిస్తే 1%మాత్రమే పెరిగాయి. అప్పుడంటే టిడిపి పాలనతో విసిగి వేసి వుండవచ్చు. జగన్ పాదయాత్రలో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడనే ఆశతో వేసి వుండవచ్చు. ఇప్పుడు టిడిపి ప్రతిపక్షంలో ఉంది. వైసిపి వాగ్దానాల సంగతి చూడబోతే – కొన్ని సంక్షేమపథకాలు అమలు చేశారు, చెప్పకపోయినా మరి కొన్ని సంక్షేమపథకాలు చేర్చారు. కొన్నిటిని చేయలేదు, ఆర్థిక విషయాల విషయంలో చేసిన హామీల విషయంలో నెరవేర్చినవి కొన్నే! చాలా వాటి విషయంలో యింత ఖర్చు ఉంటుందని అనుకోలేదు, పొరపాటున చెప్పేశాం అనేశారు.

పోలవరం నిర్మాణం కేంద్రం బాధ్యత అయినా బాబు తన నెత్తిన వేసుకుని పొరపాటు చేశారని ప్రతిపక్షంలో ఉండగా ఊదరగొట్టిన వైసిపి, తను అధికారంలోకి రాగానే కేంద్రానికి అప్పగించేయలేదు. తనూ నెత్తిన వేసుకుంది. మూడేళ్లయినా ప్రగతి అంతంతమాత్రంగానే ఉంది. అలాగే అమరావతిలో కుంభకోణం జరిగింది, ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ (అసలీ పదం యిక్కడ వర్తించదు) అంటూ ‘‘సాక్షి’’లో నెలల తరబడి కథనాలు వేసి అధికారంలోకి వచ్చి, రికార్డులన్నీ తన చేతిలోకి తెచ్చుకున్నా టిడిపి ఆర్థికమద్దతుదారులపై కేసులు పెట్టలేక పోయారు. రాజధాని చీల్చడం వరకూ సరే కానీ, అమరావతికి భూములిచ్చిన రైతుల విషయంలో ఏ విధమైన న్యాయమూ చేయలేదు. భూములు వెనక్కి యివ్వడమో, రోడ్లూ అవీ వేసి, డెవలప్ చేసిన స్థలాలు అప్పగించడమో ఏదో ఒకటి చేయాలి కదా, అదేం చేయలేదు.

ప్రతిపక్షంలో ఉండగా జరిగిన కోడికత్తి కేసులో లోకేశ్‌కు, వైజాగ్ ఎయిర్‌పోర్టు కాంటీన్ కాంట్రాక్టరుకి సంబంధం ఉందంటూ కథనాలు వండివార్చిన వైసిపి, అధికారంలోకి వచ్చాక నిజానిజాలు బయటపెట్టలేదు. ఇక వివేకా హత్య కేసైతే చెప్పనే అక్కరలేదు, అప్పుడు బాబే చంపించారంటూ ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ సంచలనం సృష్టించి, యిప్పుడు కిమ్మనటం లేదు. విచారణలో ఆలస్యాన్ని సిబిఐపై తోసేసి తప్పించుకోలేరు. బంధుత్వం పక్కన పెట్టినా, ఒక మాజీ ఎంపి, మాజీ మంత్రి దారుణ హత్యకు గురైతే కేసు నడిపించే తీరు యిదా? ఇక అప్పుల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా చాలదు. బాబు ఐదేళ్లలో చేసిన అప్పులు జగన్ సగకాలంలోనే చేసి, ఖర్చు పెట్టేశారు. ఇన్ని లోపాలున్నా సర్వేలో 51% మంది మద్దతు ఉందంటే గొప్పే!

జగన్ పథకాలు, సంక్షేమ పథకాల విషయంలో మెచ్చుకోదగిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల స్థితి మెరుగుపరచడం, ఇన్నోవేటివ్‌గా కొన్ని వర్గాల వారికి ఆసరా యివ్వడం యివన్నీ జరిగాయి. కానీ ఆర్థిక ఆరాచకత్వం యీ మంచినంతా తుడిచిపెట్టేసేట్లు ఉందని చెప్పి తీరాలి. ఆర్థికాన్ని నిర్వహిస్తున్న తీరు చూస్తూంటే సంక్షేమ పథకాల కొనసాగింపు మాట దేవుడెరుగు, అసలు జీతాలకు కూడా ఎసరు వచ్చేట్లు ఉందని భయపడుతున్నారు. వచ్చేట్లు ఏమిటి, వచ్చేసింది కూడా. జీతాలు సవ్యంగా యివ్వక, ఎరియర్స్ యివ్వక ఉద్యోగి వర్గాలను అష్టకష్టాలకు గురి చేస్తున్నారు. ఇక నిఘంటువులో ఆంధ్ర ప్రభుత్వానికి నచ్చని మాట ఏదైనా ఉందా అంటే - బిల్లుల చెల్లింపు అనే మాట! అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అయితే టిడిపి హయాంలో జరిగిన పనులలో అవకతవకలున్నాయేమో పరిశీలించి, సమీక్షించి చెల్లిస్తాం అని కొన్నాళ్లు వాయిదా వేశారు. తర్వాత్తర్వాత వైసిపి హయాంలో యిచ్చిన పనులకు కూడా బిల్లులు చెల్లించటం లేదు. రోజువారీ నిర్వహణకే అప్పులు తేవాల్సిన దుస్థితిలో ఆంధ్ర ఉంది.

కరోనా వలన ఆదాయానికి గండిపడింది వంటి సాకులు ఎన్ని చెప్పినా, మితిమీరిన సంక్షేమాలే దీనికి కారణమని అందరికీ తెలుసు. అన్నిటికీ ఎగనామం పెట్టి సంక్షేమానికి దోచి పెడితే పెరిగిన ఓట్ల శాతం ఎంత? ఒక్కటంటే ఒక్క శాతం! దాని కోసం రాష్ట్రాన్ని దివాలా తీయించాలా? దానికి బదులు ఆ నిధులను అన్ని వ్యాపార, ఉద్యోగ వర్గాలకు, అభివృద్ధి పనులకు కేటాయించినా ఆ 1% ఓట్లు వచ్చేస్తాయేమో! సరిగ్గా చేస్తే, అది 2%కూడా కావచ్చేమో! అనే ఆలోచన వైసిపి ప్రభుత్వానికి రావాలి. అప్పులు తెచ్చేసి, అమరావతిని పూర్తి చేసేసి వుంటే యీ సంక్షేమానికీ ప్లస్ అభివృద్ధికీ కూడా డబ్బులు వచ్చేసి వుండేవి అనే వాదనను నేను నమ్మను. మళ్లీ అధికారంలోకి రావడానికి బాబు యిదే ఫార్ములాను వల్లిస్తారు కానీ పూర్తి అంకెలు యివ్వరు. జగన్ లాగానే హామీలిచ్చేసి, తర్వాత రైతు ఋణహామీలోలా, కాలిక్యులేషన్‌లో చిన్న మిస్టేక్ వచ్చిందండీ అనేయగలరు. 

అమరావతిని మూడోవంతు రాజధాని చేయడం, టిడిపికి నిధులిచ్చే వర్గాలపై దాడి చేసి, వాళ్ల ఆదాయానికి గండి కొట్టడం, వాళ్లకు అనుకూలంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు చేసే తప్పులపై కేసులు పెట్టి అదుపు చేయడం యివన్నీ రాజకీయపరమైన అంశాలు. సామాన్య ప్రజలకు యివి పట్టవు. రేపు మరో పార్టీ వచ్చినా యిలాటివి చేస్తుంది, అప్పుడు వైసిపి కక్షపూరితమైన చర్యలు అంటూ యాగీ చేస్తుంది. బిజెపికి సొంతంగా సంపూర్ణ మెజారిటీ వచ్చేసి, మా మద్దతుపై ఆధారపడే పరిస్థితి రాలేదు కాబట్టి ప్రత్యేక హోదా గురించి అడిగినా సాధించలేకపోయాం అని చెప్పుకుంటే అవునులే అనుకోవచ్చు ప్రజలు. పోలవరం మరింత ఆలస్యమైనా, భారీ ప్రాజెక్టులు ఆలస్యం కావడం దశాబ్దాలుగా చూస్తున్న వ్యవహారమే అని సరిపెట్టుకోవచ్చు. ఆర్థిక నిర్వహణ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగు పరచడం, యివే ప్రధాన విషయాలు. వాటిలో లోపం ఏర్పడింది కాబట్టి రాష్ట్రప్రగతి కుంటుపడింది. అప్పుచేసి పప్పుకూడు తినిపిస్తున్నాడు అనే స్పృహ సామాన్యుడికి కలిగిన రోజున ‘ఇకపై అప్పు పుట్టించలేడేమో’ అనే సందేహం కలిగి, వైసిపికి మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

పాతకాలం కథ ఒకటుంది. ఒకడు ఒక జన్మలో కొంత పుణ్యం చేస్తే వచ్చే జన్మలో మెరుగైన పరిస్థితి అమరడంతో బాటు పూర్వజన్మ సృతి కూడా కలిగింది. ‘అంత చేస్తేనే యింత వచ్చింది. ఇప్పుడు యింకా ఎక్కువ చేస్తే వచ్చే జన్మలో యింకెంత వచ్చేస్తుందో’ అనే ఆశతో విరగబడి దానాలు చేసేవాడట. దానం యిస్తూ ‘అంతకింతైతే ఇంతకెంత?’ అని అడుగుతూండేవాడు. దానగ్రహీతలకు ఆ ప్రశ్న అర్థం కాక తలగోక్కుని వెళ్లిపోయేవారు.  ఓ రోజు ఒక సాధువు మాత్రం ‘ఎంతైనా అంతే’ అని సమాధాన మిచ్చాడు. ఇతను ఆశ్చర్యపడి ‘అదేమిటి స్వామీ’ అని అడిగాడు. ‘ఆ జన్మలో యిలాటి లెక్కలేవీ వేసుకోకుండా దానం యిచ్చావు కాబట్టి పుణ్యం వచ్చింది. ఈసారి ఆశ పెట్టుకుని, లెక్కలేసుకుని చేస్తున్నావు కాబట్టి, అదనంగా ఏమీ రాదు’ అని సమాధానమిచ్చాడు సాధువు.

వైసిపికి 51% ఓట్లు అంటే నాకు యీ కథే గుర్తుకు వచ్చింది. మొదట్లో ప్రజలు మనకు మంచి చేస్తున్నాడని అనుకుని ఉపయెన్నికలలో, స్థానిక ఎన్నికలలో గెలిపిస్తూ వచ్చారు. ఇంకాయింకా చేస్తే 75% ఓట్లు, 175 స్థానాలూ వచ్చేస్తాయి అనుకుని, జగన్ అతి చేసేసినా, ప్రజలు ‘ఇంతకు మించి ఏమీ రాలదు బ్రదర్’ అని చెప్పేశారన్నమాట. ఎంతసేపూ బిసి, ఎస్సీ, మైనారిటీ జపం జపిస్తూ వాళ్లకే అన్నీ దోచి పెడితే సమాజంలో ఉన్న మిగతా వర్గాల వాళ్లు మా మాటేమిటి అని అనుకుంటున్నారు కాబోలు. వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే మన జీతాలు, చెల్లించవలసిన బిల్లులు కూడా లాక్కుని వాళ్లకు మేడలు, మిద్దెలు కట్టిపెట్టేస్తాడు కాబోలు అనే భయంతో విముఖత ప్రదర్శించారని అనుకోవాలి.

లేకపోతే టిడిపికి ఓట్ల శాతం అంత ఉండకూడదు. ఎంత ఉంది అన్నది సర్వే చెప్పలేదు. కానీ గణనీయంగానే ఉండి ఉండాలి. లేకపోతే వైసిపికి యింత తక్కువ వచ్చి వుండేది కాదు. టిడిపికి 2019లో 39% వచ్చింది. ఆ తర్వాత వరుస ఓటములు. అయినా ఓటింగు శాతం ఎప్పుడూ 35%కి తగ్గలేదు. టిడిపి నాయకులకు యీ విషయం అర్థం కావటం లేదు. పార్టీ పని అయిపోయింది (అచ్చెన్నాయుడు కామెంటు ఉటంకించ దలచుకోలేదు) అనే ఆలోచనాధోరణితో ఉన్నారు. అందుకే అరుగు దిగటం లేదు, జేబులో చేయి పెట్టటం లేదు. టీవీలో, ప్రెస్‌లో రంకెలే తప్ప క్షేత్రస్థాయిలో ఉద్యమాలు లేవు. బాబు, లోకేశ్ కూడా యిలాగే ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉంటూ, విజిట్లకు వస్తున్నారు. వర్చ్యువల్‌గా ఉరుములు, మెరుపులు కురిపిస్తున్నారు తప్ప, మైదానంలోకి దిగటం లేదు. బాబు పాలనలో ఉండగానూ సిజి మిథ్యా ప్రపంచాన్ని నమ్ముకున్నారు, ప్రతిపక్షంలో ఉండగానూ మిథ్యాప్రపంచంలో బతుకుతున్నారు.

పైన తిరిగే చేపలో వేరే ఏ భాగానికీ బాణం తగలకుండా కన్నుకు మాత్రమే తగిలేట్లా కొట్టగలిగిన విద్యను అర్జునుడు ప్రదర్శించాడు. ఇప్పుడు బాబు ఆ విద్యను ప్రాక్టీసు చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న మోదీ విధానాలను పన్నెత్తి మాట అనకూడదు, గ్యాస్ సిలండరు ధర పెరిగినా జగన్నే తప్పు పట్టాలి. కేంద్రవిధానం లోపభూయిష్టంగా ఉన్నా కానీ కేంద్రాన్ని ఏమీ అనరు. దాన్ని ప్రతిఘటించనందుకు జగన్ని అంటారు. మరి బాబు మాత్రం ప్రతిఘటిస్తున్నారా? ఈ వైఖరి పురాణకాలంలో అర్జునుడికి చెల్లింది కానీ యిప్పుడు బాబుకి చెల్లదు. జగన్‌కైతే కేసుల భయముంది, మరి ఈయనకేం భయం? అంటూ ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. ఒకలా చెప్పాలంటే ప్రజలకు టిడిపిపై ఉన్న నమ్మకం, టిడిపి నాయకులకు, అధిష్టానానికి తమపై తమకు లేదు. బాబు, ఆయన అనుచరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను రెండిటినీ చీల్చి చెండాడుతూ ఉంటే వాళ్లను ఉద్యమకారులుగా ప్రజలు గుర్తించేవారు.

ఇక మరో ప్రతిపక్షమైన జనసేన విషయానికి వస్తే, రాయడానికి ఏమీ లేదు. స్టేటుమెంట్లు యిస్తూండడమే రాజకీయ పార్టీ నిర్వహణ అని ఎవరు చెప్పారో తెలియదు. అలా అయితే చిరంజీవి 18% ఓట్లు తెచ్చుకున్న తన ప్రజారాజ్యం పార్టీని మూసేసి, కాంగ్రెసులో విలీనం చేసేవారు కారు. స్టేటుమెంట్లు పడేస్తూ కాలక్షేపం చేసేవారు. సినిమాలు మానేసే వారే కాదు. ఇప్పుడు పవన్ స్టార్‌గా వెలుతున్నారు. పొలిటీషియన్‌గా గెస్ట్ రోల్ వేస్తున్నారు. అందుకే ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. గోదావరి జిల్లాలలో తప్ప దాని ప్రభావం వేరే చోట పెద్దగా లేదని సర్వే చెపుతోంది. అతిథి పాత్రల వలన సినిమా నడవదు. సినిమాకి యాక్షన్ ఎంత అవసరమో, పార్టీకి కూడా యాక్షన్ అవసరం, అంటే పార్టీ కార్యకలాపాలుండాలి. థింక్ ట్యాంక్, చింతన్ శిబిర్, చలో ఫలానా ఊరు లాటి కార్యక్రమాలు ఊరూరా నిర్వహించాలి. వీటికి డబ్బు అవుతుంది. పవన్ జేబులోంచి తీయరు. నాయకులెవ్వరూ తియ్యరు. వేరెవ్వరూ స్పాన్సర్ చేయరు. మీడియా కవరేజి ఉండదు. ఇంకేం లాభం?

జనసేనకు 2019లో వచ్చినన్ని ఓట్లయినా మళ్లీ వస్తాయా అనేది కూడా నాకు డౌటే. ఎందుకంటే వైసిపి వ్యతిరేక కూటమిలో టిడిపిని చేర్చుకోవాలని పవన్ బిజెపిపై ఒత్తిడి తెస్తున్నారు. రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానంటే అదే అర్థం. మీరు టిడిపితో పొత్తుకి సరేనంటే అప్పుడు ముందుకు కదులుదాం, లేకపోతే యిలాగే తాత్సారం చేస్తాను అని హెచ్చరించారు. అంతే తప్ప ఎన్నికల టూరు ఏ రూటులో వెళ్లాలి అనేది బిజెపి చెప్పాలని పవన్ అభిప్రాయం కాదు. పవన్ టిడిపితో పొత్తులో ఉన్నారనగానే, అది అధికారంలోకి వస్తే బాబే సిఎం అని అందరికీ తెలిసిపోతుంది. 2019లో జనసేనకు వచ్చిన 6% ఓటర్లలో సగం మంది, పవన్ కాబోయే సిఎం అని నమ్మి వేసి వుంటారు. ఈసారి ఆయన కాదు, వేరేవాళ్లు సిఎం అనగానే వీళ్లకు ఎంత ఉత్సాహం ఉంటుందో తెలియదు. ఇక తక్కిన పార్టీల్లో బిజెపి గురించి రాయడమే అనవసరం. కాంగ్రెసు, లెఫ్ట్‌ల గురించి తలచుకోవడం కూడా దండగ.

దేశంలో ప్రతిపక్షాల పరిస్థితి ఎలా వుందో, ఆంధ్రలోనూ అలాగే వుంది. వాళ్లపై వాళ్లకే నమ్మకం లేదు. ఇక మేము సరైన ప్రత్యామ్నాయం అని ప్రజల్ని ఎలా నమ్మిస్తారు చెప్పండి. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రభుత్వం, బలంలో కాస్త తక్కువున్నా, చురుకుతనంలో ఎక్కువున్న ప్రతిపక్షం ఉండాలి. అప్పుడే ప్రభుత్వం బాధ్యత ఎరిగి ప్రవర్తిస్తుంది. ప్రతిపక్షం శాసనసభను బాయ్‌కాట్ చేస్తే హమ్మయ్య అనుకుని యిష్టారాజ్యంగా ఏలుతుంది. ఆంధ్రలో బలమైన ప్రతిపక్షం టిడిపియే. అది తనను తాను సీరియస్‌గా తీసుకోవడం లేదు. టిడిపి హయాంలో ఓ వెలుగు వెలిగి, అనేక లాభాలు పొందిన రాఘవేంద్రరావు, మురళీమోహన్ లాటి వాళ్లు, యిప్పుడు గప్‌చుప్ అయిపోయారంటే తన అనుచరుల గురించి బాబు ఛాయిస్ ఎంత తప్పో అర్థమౌతుంది.

టిడిపి తన అనుకూల మీడియాలో జగన్‌ను పొద్దస్తమానం తిట్టి, తన డ్యూటీ ముగించానని అనుకుంటోంది. మా పార్టీ వాళ్లను అరెస్టు చేశారు, మా వాళ్ల నామినేషన్లు తిరస్కరించారు అంటూ తన బాధల గురించి ప్రజలకు చెప్తోంది తప్ప, ప్రజల బాధలు వినటం లేదు. తన భార్య పేరెత్తి అసెంబ్లీలో అవమానించారంటూ అబద్ధాలు చెప్పి బాబు వెక్కివెక్కి ఏడ్చినపుడు సీనియర్ జర్నలిస్టు విజయబాబు ఒక మాట అన్నారు – ‘నాయకుడు ప్రజల కష్టాలు విని కళ్లనీళ్లు పెట్టుకోవాలి తప్ప, తన కష్టాలకై కంటనీరు పెట్టుకోకూడదు’ అని. వరదబాధితులను, కరువుబాధితులను, పుష్కరమృతులను చూసినపుడు బాబు ఎన్నడూ కన్నీరు కార్చరు. ముఖం గంభీరంగా పెట్టుకుని ‘సంబంధిత అధికారులను శిక్షిస్తాను’ వంటి వాక్యాలు చెప్తారు.

తన దగ్గరకు వచ్చేసరికి ‘నాకు కష్టం కలిగింది, మీరు ఓదార్చి, ఓట్లేయండి’ అంటే ఎలా? ఆ ఉదంతంలో జనం దాని ప్రస్తావన చేస్తే బాబు ‘పోనీయండి, మీతో పోలిస్తే నా కష్టం ఓ కష్టమే కాదు’ వంటి డైలాగులు కొడితే ‘అబ్బ, ఎంత త్యాగి’ అనుకునేవారు ప్రజలు. అది జరగకపోవడంతో ప్రజలు దాని గురించి మర్చిపోయారు. తమిళనాడులో జయలలితకు వచ్చిన ఎడ్వాంటేజి యిక్కడ బాబుకి రాలేదు. ఇంకో విషయమేమిటంటే ప్రజల్ని తప్పుపట్టే పని ఏ నాయకుడూ చేయకూడదు. పవన్ కళ్యాణ్ బహిరంగసభలో ‘మీరు నన్ను రెండు చోట్ల ఓడించారు’ అంటూ ఓటర్లను బ్లేమ్ చేశారు. ఆయన కంటె ఎంతో సీనియరైన బాబు ‘జగన్ వచ్చి ఒక్క ఛాన్స్ అని అడిగితే, మీరు అది విని, నన్ను ఓడించి, తప్పు చేశారు. అందుకే అనుభవిస్తున్నారు’ అంటూ ఓటర్లను నిందిస్తున్నారు. నాయకుడు అలా చేయవచ్చా? ‘మా వలన తెలిసో, తెలియకో పొరపాట్లు జరిగాయి. అందుకే మమ్మల్ని శిక్షించారు. మళ్లీ అవకాశం యివ్వండి, యీసారి పొరబాటు జరగకుండా చూసుకుంటాం’ అని నచ్చచెప్పే విధానంలో మాట్లాడాలి. జగన్‌ను తిట్టడం నెగటివ్ ప్రచారం. ‘మేం అధికారంలోకి వస్తే జగన్ తప్పులు ఫలానావిధంగా సవరిస్తాం’ అంటూ బ్లూప్రింట్ చూపించి పాజిటివ్ ప్రచారం చేసుకోవాలి.

ఇది అండర్‌లైన్ చేయవలసిన పాయింటు. భవిష్యత్తులో మేం ఏం చేయబోతున్నాం అనేదే మాట్లాడాలి తప్ప గతం గురించి మాట్లాడడం వేస్టు. అది బాబుకి ఎప్పటికీ తెలిసిరాదు. మొన్న ఐఎస్‌బి ఫంక్షన్‌కు మోదీ వచ్చినపుడు కూడా ‘ఆ సంస్థ నేనే పెట్టాను, దాని గురించి కష్టపడ్డాను.’ అంటూ మహానాడులో పెద్ద ఉపన్యాసం యిచ్చారు. నిజమే, బాబు ఎన్నో సంస్థలు పెట్టించారు. అయితే ఓటర్లను అవి యింప్రెస్ చేశాయా? ఆ మాటకొస్తే దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో నెలకొక సంస్థ వెలుస్తుంది. అయితే ఆ ఎడ్వాంటేజి ముఖ్యమంత్రికి కలుగుతోందా? ప్రభుత్వాలు మారటం లేదా? కలాంను రాష్ట్రపతి చేశాను, హైదరాబాదు కట్టించాను... యిలా ఎన్ని చెప్పుకున్నా 2004లో ఓడించారు కదా! 2009లో మళ్లీ రానీయలేదు కదా! 2014లో నైనా ఉమ్మడి రాష్ట్రం ఉండి వుంటే గెలిపించేవారా? రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఛాన్సు వచ్చింది. అది కూడా బిజెపి, పవన్ కళ్యాణ్‌ల అండతో వైసిపిని కొద్ది మార్జిన్‌తో ఓడించగలిగారు. 2019లో సొంతంగా నిలబడితే ఘోరంగా, పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంత యిదిగా ఓడిపోయారు.

బాబుకి యిది అర్థం చేసుకోరు. ఉపన్యాసంలో సింహభాగం గతం గురించే! హైదరాబాదుకు ఏం చేశారో ఇరవై, పాతికేళ్ల క్రితం కబుర్లే చెప్తారు. పాతవిషయాలు తలిదండ్రులు చెపితేనే పిల్లలు వినరు. ‘నీ స్కూలు ఎడ్మిషన్ కోసం నేను ఎండలో సైకిలు మీద వెళ్లి, హెడ్మాస్టరుని బతిమాలి, యింటినుంచి పట్టుకెళ్లిన కాఫీ ఆయనకు తాగించి...’ అని చెప్తూంటే, ‘నీ సోది ఆపు. ఇప్పుడు 50 లక్షలు పెట్టి అమెరికాకు పంపుతావా లేదా అది చెప్పు చాలు’ అంటాడు కొడుకు. అలాగే ‘పాతికేళ్ల నాటి విషయం ఎందుకు? మూడేళ్ల కితం నాటి సంగతి చెప్పు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కట్టావా? పోలవరం నీ నెత్తిన వేసుకుని ఏం పూర్తి చేశావు? సినిమావాళ్లతో ఉన్న పరిచయాలతో ఒక్క స్టూడియో కట్టించావా?’ అని ఓటరు అడగడం మొదలుపెడితే ఏం సమాధానం చెప్తాడీయన?

అసలు హైదరాబాదు పోగొట్టుకోవడమనేదే ఆంధ్రులకు ఎమోషనల్ యిస్యూ. ఇప్పటికీ దాని గురించి మర్చిపోలేకుండా ఉన్నారు. అలాటప్పుడు దాన్ని మళ్లీ మళ్లీ కెలికి, ‘హైదరాబాదుకి అంత చేశా, యింత చేశా’ అని గుర్తు చేస్తే ‘అవున్నాయనా, మాకు ఎండగట్టి, అంతా అక్కడే దోచిపెట్టావు. రాష్ట్రం విడగొట్టమని లేఖ యిచ్చి కొంప ముంచావు. వాళ్లు హైదరాబాదు పట్టుకెళ్లి తెలంగాణకు కట్టబెట్టారు. మీ పార్టీ తెలంగాణ ఎంపీలు దానికి వంత పాడారు, అడ్డొచ్చిన ఆంధ్ర టిడిపి ఎంపీలను చావగొట్టారు. అంతా కలిసి మా నోట్లో మట్టికొట్టారు.’ అని ఆంధ్ర ఓటరు గుర్తు చేసుకుంటాడు.

అవసరమా యిదంతా? అందుకని గతం గతః అని హైదరాబాదు పాట వదిలేయాలి. లేదా వేదిక మీద పక్కవాళ్లు ఆ విషయాలు ప్రస్తావించి మెచ్చుకుంటూ ఉంటే, సగం చెప్పనిచ్చి, ఆ పై వద్దని వారించాలి. తన బాకా తనే ఊదుకోకూడదు. అన్నిటికన్న ముఖ్యంగా మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ తప్పులు ఎలా సవరిస్తారో అంకెలతో సహా వివరించి ఒప్పించాలి. పార్టీ వేదికల మీదనే కాక, మేధావుల ఫోరం లాటి వాటిల్లో చర్చించి వాళ్ల చేత యిది సాధ్యమే అనిపించాలి. ఈ పని లోకేశ్ చేపడితే అతని యిమేజి పెరుగుతుంది. అతను స్లిమ్‌గా అయి, చురుగ్గా కనబడుతున్నాడు. ఫిజికల్ యిమేజి బాగుపడింది కాబట్టి, మేధోపరమైన యిమేజి కూడా బిల్డప్ చేసుకోవాలి.

ఈ సర్వే అబద్ధం, మాకు 160 సీట్లు రావడం ఖాయం అనే భ్రమలో మునిగిపోకుండా టిడిపి యీ సర్వేనే ఆధారం చేసుకుని కొన్ని చర్యలు చేపట్టవచ్చు. ఉదాహరణకి, ఈ 51% అనేది రాష్ట్రం మొత్తం మీద ఏవరేజి. కొన్ని చోట్ల 61%, మరి కొన్ని చోట్ల 41% ఓట్లు రావచ్చు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యర్థి కంటె ఎక్కువ శాతం ఓట్లున్నాయని సర్వే చెప్పటం లేదు. అందువలన గతంలో వచ్చిన 151 సీట్లు మళ్లీ రాకపోవచ్చు. రాయలసీమలోని నాలుగు జిల్లాలలో 60% ఓట్లున్నాయంటున్నారు. ఇక్కడ టిడిపి పుంజుకోవటం లేదు. దయనీయ స్థితిలో ఉందంటోంది సర్వే. అంటే 25% ఓట్లు అనుకుందామా? 50కి పైగా సీట్లున్న రాయలసీమ నాలుగు (పాత లెక్క) జిల్లాలలో టిడిపి పుంజుకోవాలంటే వాళ్లకు మర్యాద యివ్వడం నేర్చుకోవాలి. రాయలసీమ సంస్కృతిని దిగజార్చి మాట్లాడకూడదు.

జగన్‌ను తిట్టడానికై రాయలసీమ మొత్తాన్ని రౌడీయిజానికి, హింసకు పుట్టినిల్లుగా చిత్రీకరించడం వలన జగన్ ఒక్కడే రాయలసీమ మానసపుత్రుడు అనే యిమేజి కల్పిస్తోంది టిడిపి. రాయలసీమ మూలాలున్న బాబు దాన్ని వదులుకుని అమరావతికి అంకితమైపోతే ఎలా? పోనీ అమరావతి ప్రాంతం ఆయన్ని వాటేసుకుందా? స్థానిక ఎన్నికలలో రాజధాని ప్రాంతంలో వైసిపియే గెలిచింది కదా! రాజధాని కోస్తాకు యిచ్చినపుడు, హైకోర్టు రాయలసీమకు యివ్వడం న్యాయం. ఆ న్యాయాన్ని అమలు చేయకపోవడం చేత, 2019 ఎన్నికలలో టిడిపి రాయలసీమలో ఘోరంగా దెబ్బ తింది. కియా యిప్పించాను కదా, హైకోర్టు ఎందుకు అంటే, దేని దారి దానిదే అన్నారు వాళ్లు. అది ఎమోషనల్ యిస్యూ. ఇప్పటికైనా ‘మళ్లీ అధికారంలోకి వస్తే హైకోర్టును కర్నూలుకి తరలిస్తా’ అని బాబు హామీ యివ్వాలి. హైకోర్టే, బెంచీ కాదు. కావాలంటే ఆ బెంచీయో కుర్చీయో అమరావతిలో పెట్టుకోండి.

దాదాపు 30% సీట్లున్న రాయలసీమలో టిడిపియే కాదు, అయితే గియితే దాని భాగస్వామి జనసేన కూడా బలంగా లేకపోవడం పెద్ద మైనస్ కదా! కుప్పంలో వైసిపి గెలుపు బాబు ప్రతిష్ఠను దెబ్బ తీసిన వ్యవహారం. దిద్దుబాటు చర్యలు కుప్పంకే పరిమితం చేయకుండా, యావత్తు రాయలసీమకు విస్తరించాలి. కొందరు ఎమ్మెల్యేల పట్ల విముఖత ఉందని, అందువలన వైసిపికి సీట్లు తగ్గవచ్చని సర్వే అంటోంది. ఇప్పుడీ బస్సు యాత్ర, గడపగడప టూర్ల ద్వారా ఎమ్మెల్యేలను ప్రజల యింటికి పంపి, ఆ లోపాన్ని వైసిపి పూరించుకోగలిగితే ప్రతిపక్షాలకు నష్టం. బాబు అర్జంటుగా రాయలసీమపై ఫోకస్ పెట్టాలి. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప‌రిధిలో ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా రాయ‌ల‌సీమ త‌ర‌హాలోనే వైసిపికి సానుకూల‌త ఉందని సర్వే అంది. నెల్లూరు మాట ఎలా ఉన్నా, ప్రకాశంలో టిడిపి పుంజుకునే అవకాశం ఉంది. నిజానికి రాష్ట్రం విడిపోతే దొనకొండ రాజధాని అవుతుందని అందరూ అనుకున్నారు. ప్రకాశం జిల్లా వాళ్లు మరీ గట్టిగా అనుకుని ఉంటారు. చాలామంది బయటివాళ్లు కూడా అక్కడ భూములు కొన్నారట.

అలాటిది బాబు వచ్చి మొండిచెయ్యి చూపించడంతో వాళ్లకు మండి ఉంటుంది. దాంతో ఆ జిల్లా టిడిపి చేజారింది. దొనకొండలో ప్రభుత్వభూమి చాలా ఉంది కాబట్టి రాజధాని కాకపోయినా, మరో పెద్ద వెంచర్ పెడతానని హామీ యిచ్చి టిడిపి వాళ్లను ఆకట్టుకోవాలి. నెల్లూరుకు వస్తే, టిడిపి వృద్ధనాయకత్వాన్ని వదుల్చుకుని, యువతను ముందుకు తీసుకురావాలి. ఆ మాట కొస్తే ప్రతీ జిల్లాలోనూ యిదే సమస్య. ఎక్కడ చూసినా టిడిపి నాయకుడంటే 60 దాటినవాళ్లే కనబడుతున్నాడు. ఎన్టీయార్ హయాంలో ఆయనొక్కడే వృద్ధుడు. అనుచరులు, సహచరులు అందరూ యువకులు, మధ్యవయసువారు. టిడిపి పెట్టినపుడు వాళ్లు ఉత్సాహంతో సొంత ఆస్తులు అమ్ముకుని, నిధులు సమకూర్చారు. ఇప్పుడలాటి పరిస్థితి లేదు. పార్టీ నాకేమిస్తుంది అనే చూస్తున్నారు. వయసు వస్తూన్నకొద్దీ మనిషికి కాపీనం పెరుగుతుంది. ఆదర్శాలు వెనకబడతాయి. వారసుల కోసం కూడబెట్టాలని, కనీసం నిలబెట్టాలనే యావ పెరుగుతుంది. అందుకే టిడిపి ఖర్చంతా బాబే పెట్టుకోవలసి వస్తోంది.

ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలకు వస్తే అర్బన్ ఏరియాల్లో వైసిపి హవా తగ్గిందనేది నమ్మేట్లుగానే ఉంది. వైసిపి ఆర్థిక విధానాలు, బిసి, ఎస్సీ, మైనారిటీ జపం మధ్యతరగతి వాళ్లను, అగ్రవర్ణాల వాళ్లను విసిగిస్తోందన్నది వాస్తవం. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న ఆ జిల్లాలలో 50 శాతమే ఓట్లున్నాయట, అది కూడా రూరల్ ఓట్లు కలిపితే! అర్బన్ ప్రాంతం మాత్రం తీసుకుంటే, అది ఏ 35-40% ఉండి వుండవచ్చు. సాంప్రదాయకంగా టిడిపికి బలమైన జిల్లాలు కూడా యివే. అందుచేత టిడిపికి 40% దాకా ఓట్లున్నా ఆశ్చర్యం లేదు. టిడిపి పుంజుకోవడానికి యిక్కడే చాలా అవకాశాలున్నాయి. అది చూసుకుని, టిడిపి ఫోకస్ ఎంతసేపూ యిక్కడే వుంటోంది. ఇది జేబులో ఎలాగూ వుంది కాబట్టి, తక్కిన ప్రాంతాలపై దృష్టి పెట్టి, అక్కడ ఊపు తెప్పిస్తే, యీసారి గెలుస్తుందనే ఆశతో యిక్కడ టిడిపికి మరిన్ని సీట్లు వస్తాయి.

గోదావరి జిల్లాల్లో కూడా వైసిపికి 40% ఓటే ఉందట. 35% టిడిపికి 25% జనసేనకు ఉన్నాయట. . టిడిపి, జనసేన చేతులు కలిపితే వైసిపికి దెబ్బే, 60-40 పోటీలో దిబ్బయిపోతుందని తీర్మానించలేం. ఎందుకంటే విడివిడి శాతాలు వేరు, కలిపితే వచ్చే రిజల్టు వేరు. పైగా పొత్తు కుదిరి, పవన్ సిఎం అభ్యర్థి కాడని తేలితే జనసేన ఓట్లశాతం ఏ మేరకు తగ్గుతుందో తెలియదు. ఎలా చూసినా యీ జిల్లాల్లో సగం సీట్లు మాత్రమే వైసిపికి రావచ్చు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసిపికి 54% మొగ్గు కనబడడంలో ఆశ్చర్యం లేదు. వైజాగ్‌కి యిస్తున్న ప్రాముఖ్యత, బిసిలను ఆకట్టుకోవడానికి చేస్తున్న సకలయత్నాలు వైసిపిని ముందంజలో నిలిపి వుంటాయి. టిడిపికి ఒకప్పుడు కంచుకోటగా వున్న యీ ప్రాంతం, బాబు కాపులను బిసిల్లో చేర్చడానికి ప్రయత్నించడంతో బీటలు వారింది. మళ్లీ పుంజుకున్నట్లు ఎక్కడా కనబడటం లేదు. నోరు పెట్టుకుని విరుచుకు పడే నేతలే కనబడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో నిరసనోద్యమాలు చేసేవాళ్లు కనబడటం లేదు.

మొత్తం మీద చూస్తే, యిప్పటి పరిస్థితుల బట్టి (ఇది అండర్‌లైన్ చేసుకోవాలి, రాబోయే రెండేళ్లలో ఏమైనా జరగవచ్చు) 2024లో వైసిపియే అధికారంలోకి రావడం నిశ్చయంగా అనిపిస్తోంది. ఎన్ని సీట్లతో అనేదే ప్రశ్న! మామూలుగా అయితే జగన్ తెచ్చిపెట్టిన ఆర్థిక అస్తవ్యస్తత కారణంగా ఏ 90 సీట్లో తెచ్చుకుని గట్టెక్కాలి. కానీ ప్రతిపక్షాలైన టిడిపి, జనసేన సరిగ్గా వ్యవహరించకపోవడం చేత అది 100 దాకా వెళుతుందని అనుకుంటూ వచ్చాను. ఇప్పుడీ సర్వే చూస్తే అది 115-120 దాకా వెళ్లవచ్చేమో అనిపిస్తోంది. టిడిపి కనుక తన పద్ధతులు మార్చుకుని, తెలివిగా వ్యవహరించి, ప్రజల పక్షాన ఉన్నానని చూపించుకుంటే వైసిపిని 90-100కు మధ్య పరిమితం చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా యిదంతా గెస్‌వర్కే.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

mbsprasad@gmail.com

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా