cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: యాంటీబాడీలు ఏ మేరకు?

ఎమ్బీయస్: యాంటీబాడీలు ఏ మేరకు?

టీకా తీసుకుంటే యాంటీబాడీలు పెరుగుతాయని, పెరగాలని అందరికీ తెలిసింది. ఏ మేరకు పెరిగాయి అన్నదానిపైనే టీకా సామర్థ్యాన్ని లెక్క వేస్తున్నారు. ‘క్లినికల్ దశ ప్రయోగాలలో మా టీకా మొదటి డోసు వేసుకున్న యిన్ని రోజులకే యింత శాతం పెరిగాయి’ అని కంపెనీలు చెప్పుకుంటూ వుంటాయి. ఇప్పుడు టీకాలు (కోవిషీల్డు, కోవాక్సిన్) వేయించుకున్న తర్వాత నాకు తెలిసిన కొందరు యాంటీబాడీలు ఎంత పెరిగాయా అని టెస్టు చేయించుకుని, పెద్దగా పెరగలేదని పెదవి విరిచారు. ఆ పెరుగుదల కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా వుంది. దీని గురించి మన దేశంలో జరిగిన నికార్సయిన అధ్యయనం ఏదైనా శాతాలతో సహా వుందాని చూడబోతే నాకేమీ కనబడ లేదు.

స్పుత్నిక్ సామర్థ్యం 91 అని చెప్పుకుంటోంది కానీ అది తీసుకున్న భారతీయులు రెండు లక్షల మందే వున్నారు. దేశంలో 88% మందికి యిచ్చినది కోవిషీల్డే కాబట్టి దాని గురించే మాట్లాడుకోవడం మంచిది. కోవాక్సిన్ సామర్థ్యం దాని దరిదాపుల్లో వుండవచ్చు. హిందూస్తాన్ టైమ్స్ జులై 4 సంచికలో కోవిషీల్డు తీసుకున్న రెండో డోసు తీసుకున్న వారిలో 16% మందికి డెల్టా వైరస్‌ను ఎదుర్కోగల యాంటీబాడీలు తయారు కాలేదని రాశారు. ఐసిఎమ్మార్ పరిశోధకులు కనుగొన్నదాని ప్రకారం కోవిషీల్డు ఒక డోసు మాత్రమే తీసుకున్నవారిలో యీ యాంటీబాడీలు 58% మాత్రమే తయారయ్యాయట. శ్రీలంకలో జయవర్ధనే యూనివర్శిటీలో 553 మంది మీద చేసిన మరో అధ్యయనంలో కోవిషీల్డు ఒక డోసు తీసుకున్న వారిలో 4 వారాల తర్వాత యాంటీబాడీలు తగ్గిపోయాయట. 60 ఏళ్ల వయసుదాటిన వారిలో 16 వారాల తర్వాత మరీ తగ్గిపోయాయట. రెండో డోసు త్వరగా వేయవలసిన అవసరాన్ని యిది చాటి చెప్తోంది అంటున్నారు వాళ్లు.

జులై 30 ఫ్రంట్‌లైన్ ప్రకారం ‘‘నేచర్’’ మ్యాగజైన్‌లో జులై 8న వచ్చిన మరో వ్యాసంలో (ఇది పియర్ రివ్యూడ్) ఫైజర్ కానీ ఆస్ట్రాజెన్‌కా కానీ సింగిల్ డోస్ తీసుకుంటే బీటా, డెల్టా వేరియంట్లపై ఏమంత ప్రభావం చూపడం లేదని (పూర్లీ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎఫిషియంట్) చెప్పారు. రెండు డోసులు తీసుకుంటేనే డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోగలుగుతున్నాయిట. (సఫిషియంట్లీ న్యూట్రలైజింగ్ రెస్పాన్స్). మన దేశంలో రెండో డోసు వేయకుండా గడువు పెంచుకుంటూ పోతూండడంతో దేశంలో 7% మందికి మాత్రమే రెండు టీకాలు పడ్డాయి. అంటే డెల్టా వేరియంట్ సోకితే 93% మందికి రక్షణ లేనట్లే.

యుకెలోని యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లండన్ పరిశోధకులు 600 మంది మీద ప్రయోగాలు చేసి, ఫైజర్, ఆస్ట్రాజెన్‌కా (మన దేశంలో కోవిషీల్డు)ల వలన ఏర్పడిన యాంటీబాడీలు 10 వారాల్లో 50%కి పడిపోతున్నాయని రాసిన వ్యాసం లాన్సెట్‌లో వచ్చిందని జులై 28 సాక్షిలో వార్త వచ్చింది. ఫైజర్ టీకా తీసుకున్న 21-41 రోజులకు యాంటీబాడీ లెవెల్స్ ప్రతి మి.మీలకు 7506 యూనిట్లకు తగ్గిపోయాయి. 70 రోజుల సమయానికి 3320 యూనిట్లకు తగ్గాయి. ఆస్ట్రాజెన్‌కా విషయానికి వస్తే 20 రోజుల్లోపు 1201కు తగ్గాయి, 70 రోజులు దాటాక 190కి పడిపోయాయి. అంటే ఆస్ట్రాజెన్‌కా ఫైజర్ కంటె నాసిగా వుందన్నమాట.

తమ వాక్సిన్ సామర్థ్యంపై శంకలు తొలగించడానికి కాబోలు ఆక్స్‌ఫర్డ్ వాళ్లు వాళ్ల యూనివర్శిటీ వాళ్లతోనే ఒక అధ్యయనం చేయించారు. కొంతమంది స్విస్ సైంటిస్టులను కలుపుకున్నారు. అందరూ కలిసి ‘ఆస్ట్రాజెన్‌కా కొత్త వేరియంట్ల మీద కూడా అద్భుతంగా పనిచేస్తుందని, అంతేకాకుండా శరీరంలోని టి-సెల్స్‌కు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించి రాబోయే వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ కూడా యిచ్చేస్తుంది కాబట్టి లైఫ్‌లాంగ్ రక్షణ వచ్చేస్తుంద’ని రాశారు. (డిఎన్‌ఏ ఇండియా జులై 16) అసలు వాక్సిన్ వచ్చి ఏడాది కూడా కాలేదు. పైగా వైరస్ యింకా రూపాంతరాలు చెందుతూనే వుంది. దీన్ని ఏ మేరకు నమ్మాలో తెలియకుండా వుంది.

మన దేశంలో వాక్సిన్ వేయించుకున్నా యాంటీబాడీలు పెరగడం లేదనే ప్రశ్నలు రావడం మొదలెట్టడంతో నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ గారు మే 28న ‘అబ్బెబ్బే అనవసరంగా టెస్టులు చేయించుకుని, చూసుకుని కంగారు పడద్దు. యాంటీబాడీలూ అవీ ముఖ్యం కాదు. దీర్ఘకాలికంగా సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్సే ముఖ్యం.’ అని కవర్ చేసేశారు. పోనీ ఆ రెస్పాన్సేదో దాన్ని ఎలా లెక్కవేయాలో చెప్పలేదు. నిజంగా ఆయన చెప్పినదే నిజమైతే అంతర్జాతీయంగా యాంటీబాడీ లెవెల్స్ చెక్ చేసేవాళ్లందరూ అమాయకులా? చెప్పానుగా ఈ పాల్ గారు దబాయించడంలో సిద్ధహస్తుడు.

పాల్ గారు చెప్పినట్లు మన వాక్సిన్లు ప్రభావవంతంగా పని చేస్తూంటే మూడో డోసు ఎందుకు వేసుకోవాలో అర్థం కాదు. కోవిషీల్డ్ మూడో డోసు యిస్తే భేష్ అని ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం అంటోంది. (జ్యోతి జూన్ 29) పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ అనే సంస్థ మేలో అధ్యయనం చేసి డెల్టా వేరియంట్ సోకితే కోవిషీల్డ్ ఒక్క డోసు మాత్రమే తీసుకున్నవారికి 33% మాత్రమే రక్షణ యిస్తుందని, రెండు డోసులు వేసుకుంటే 59% రక్షణ యిస్తుందని చెప్పింది. (హిందూ మే 24) అందువలన యుకెలో, తక్కిన యూరోప్ దేశాల్లో మొదటి డోసు ఆస్ట్రాజెన్‌కా యిచ్చి రెండో డోసు కింద ఫైజర్ లేదా మోడెర్నా యిస్తున్నారు. అందుకే కాబోలు ఆక్స్‌ఫర్డ్ యిలా చెప్పింది. కోవాక్సిన్ కూడా బూస్టర్ డోస్ వేసుకుంటే మంచిదని ఆ సంస్థ బిజినెస్ హెడ్, డా. ఎల్లా కృష్ణ తనయుడు ఎల్లా రేచస్ చెప్తున్నారు. రెండు డోసులు చొప్పున యివ్వడానికే ప్రభుత్వం దగ్గర టీకాలు లేవు. డిసెంబరు 31 లక్ష్యం పూర్తి కావడానికి రోజుకి కోటి టీకాలు కావాలి. ఇప్పుడు సగటున 45 లక్షలు మించి యివ్వలేక పోతున్నారు. మా దగ్గర కేసులు పెరిగిపోతున్నాయి, జనాభా ప్రాతిపదికన కాకుండా పెరుగుతున్న కేసుల్ని చూసి ఎక్కువ టీకాలివ్వండి అని కేరళ ప్రభుత్వం అడుగుతుంటే పంపటం లేదు. ఇక మూడో డోసు కూడా అంటే ఏం చేయాలో తెలియటం లేదు.

వాక్సినేషన్ పరిస్థితి బాగుపడాలంటే మార్కెట్లోకి చాలా టీకాలు రావాలి. వచ్చేవి బాగా పనిచేస్తేనే డెల్టా ప్లస్‌ను ఎదుర్కోగలం. రాబోయే టీకాల్లో బయోలాజికల్-ఇ, అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న కార్బెవాక్స్ ఒకటి. రెండు డోసులూ కలిపి రూ. 500 లోపునే యిస్తాననడంతో ప్రభుత్వం దీనిపై ఆశలు చాలానే పెట్టుకుంది. ప్రతి నెలా 7-8 కోట్ల డోసుల ఉత్పత్తి జరుగుతుందని డిసెంబరు లోగా 30 కోట్ల డోసులు ప్రజలకు అందిస్తామని, వాటికై రూ.1500 అడ్వాన్సు చెల్లించామని ప్రకటించింది. జూన్‌లో మూడో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా మూడో దశ ప్రయోగాలను 30 వేల మంది మీద చేస్తారు. దీన్ని 1268 మీద ప్రారంభించారని జూన్ 6నాటి జ్యోతి చెపుతోంది. తర్వాత యింకా కొంతమంది వాలంటీర్లు చేరారేమో ఆ విషయం కంపెనీ వారి వెబ్‌సైట్‌లో కూడా కనబడలేదు. ఈ వాక్సిన్ 65% పూర్తయిందని మాత్రం కనబడింది. మరి జూన్‌లో చెప్పినపుడు ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తాం అన్నారు. వెబ్‌సైట్ చూస్తే ఆ ధీమా కలగటం లేదు. సెప్టెంబరు కల్లా మొదటి బ్యాచ్ బయటకు వస్తేనే డిసెంబరులోపున 30 కోట్ల లక్ష్యం చేరగలుగుతుంది.

వాక్సిన్‌లు అందరికీ పనికి రావటం లేదు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలు మార్పించుకున్న వారికి వాక్సిన్ పనిచేయటం లేదని చదివాను. బయటి నుంచి కొత్త అవయవం రాగానే శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్యూనిటీ) దాన్ని తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది. అందువలన ఆ రక్షణవ్యవస్థను అణిచిపెట్టడానికి ఇమ్యూనో సప్రెసెంట్ మందుల్ని తీసుకోమంటారు. వీళ్లను ఇమ్యునో కాంప్రమైజ్‌డ్ అంటారు. వీళ్లే కాదు, ఆస్త్మా, ఆర్త్రయిటిస్, కాన్సర్, ఎయిడ్స్ పేషంట్లు కూడా ఇమ్యునో కాంప్రమైజ్‌డ్‌గా వుంటారు. ఈ కాటగిరీ వ్యక్తుల్లో ప్రస్తుత వాక్సిన్‌లు తగినన్ని యాంటీబాడీలు పుట్టించలేకపోతున్నాయి అని బ్రిటిష్ మెడికల్ జర్నల్, అమెరికన్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పత్రికలలో వచ్చింది. ఈ కేటగిరీలోని కొందరు కోవిడ్ వాక్సిన్ వేయించుకోకపోతే కొంప మునుగుతుందన్న భయంతో కొన్నాళ్లపాటు ఇమ్యునో సప్రెసెంట్లు మానేస్తున్నారట. మరి కొంతమంది టీకా మూడు, నాలుగు డోసులు వేయించేసుకుంటున్నారట. అలాటి చేష్టలు ప్రమాదకరం అని ఆ జర్నల్ హెచ్చరించింది.

నేను వాక్సిన్ గురించి ప్రతిసారీ ‘మీరే టీకాల గురించి భయపెట్టి, ప్రజల్ని తీసుకోవద్దన్నారు. అందుకే వాళ్లు తీసుకోలేదు...’ అంటూ వ్యాఖ్యలు రాస్తారు కొందరు. నాకు నవ్వు వస్తుంది. నేను చెప్తే వేయించుకోవడానికి లేదా మానివేయడానికి ఎవరూ చిన్నపిల్లలు కారు. పైగా నా విస్తృతి ఎంత? తెలుగువాళ్లలో 0.1% మంది చదువుతారనుకుందామా? దేశంలో అన్ని భాషల వాళ్ల సంగతేమిటి? ఫ్రాన్సులో హెల్త్‌కేర్ వర్కర్లందరూ టీకాలు వేయించుకోవాలని అధ్యక్షుడు ఆర్డరేస్తే వేయించుకోకుండా వుండే హక్కు మాకుంది అని వాళ్లు నిరసన తెలుపుతున్నారు. వాళ్లూ నా వ్యాసాలు చదువుతున్నా రనుకుందామా? నేను చెప్పినదేమిటి? వాక్సిన్‌లపై ప్రజలకు నమ్మకం కలిగేట్లా ప్రభుత్వం ప్రవర్తించలేదు అనే! రిసెర్చి పూర్తయిపోయి 2020 ఆగస్టు 15 కల్లా టీకా మార్కెట్‌లోకి వచ్చేయాలి అని ఐసిఎమ్మార్ చెపితే నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించాను.

సామాన్యప్రజలకు కామన్‌సెన్స్ వుంటుంది. ఏదైనా రోగానికి చికిత్సకై మొదట ఔషధం కనిపెడతారు. తర్వాతే చాలా ఏళ్లకు నివారణకై టీకా కనిపెడతారు.  చాలా వాటికి మందులున్నాయి కానీ టీకాలు లేవు. కరోనా విషయంలో యిప్పటివరకు సరైన మందే లేదు. చికిత్సా విధానాన్ని యింకా మారుస్తూనే వున్నారు. మొన్నటిదాకా భేషుగ్గా వున్నాయని చెప్పినవన్నీ యీరోజు వాడడానికి వీల్లేదు అంటున్నారు. వైరస్ రూపాంతరాలు చెందుతోందని పేపర్లో, టీవీలో రోజూ వస్తూనే వుంది. అలాటప్పుడు ఆదరాబాదరాగా ఎమర్జన్సీ కింద చేసిన వాక్సిన్‌ను తిరుగులేని నివారిణి అని ఎవరనుకుంటారు? ఎందుకనుకుంటారు? మన దేశంలో టీకాలంటే భయం. మా చిన్నపుడు టీకాలు వేస్తున్నారని తెలిస్తే స్కూలుకి పంపించేవారు కాదు చాలామంది తలిదండ్రులు. ఆ పరిస్థితి మారి, పిల్లలకు టీకాలు వేయించే స్థితికి వచ్చాం. కానీ ఎడల్ట్ వాక్సిన్లు యింకా ప్రజాదరణ పొందలేదు.

ప్రభుత్వం తప్పుడు సమాచారం యిచ్చి, క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండా మార్కెట్లోకి తోలేసి, స్టాండ్‌బై వాక్సిన్ అని ముద్ర కొట్టి, ప్రజల్లో విశ్వాసాన్ని చెడగొడితే యీ వాక్సినే కాదు, మరే వాక్సినూ వేయించుకోవడం మానేస్తారనే నేను ఆందోళన పడ్డాను. అదే రాశాను. వాక్సినేషన్ మొదలుపెట్టాక సగానికి సగం మంది డాక్టర్లే వేయించుకోలేదు. అందుకే ప్రజలూ ఉత్సాహం చూపలేదు. సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చి ప్రాణాలు హరించడంతో భయపడిన ప్రజలు టీకాలకై క్యూ కట్టారు. నేను టీకాలు వేయించుకోండి అని పిలుపు నివ్వలేదు కదా, అయినా వెళ్లి వేయించుకుంటున్నారు కదా! అందువలన దీనిలో టీకాకరణను ప్రభావితం చేయగల శక్తి నాకు లేదని రుజువౌతోంది.

టీకాలు వేయించుకునే వాళ్లు వారివారి కారణాలతో వేయించుకుంటున్నారు. కొందరు చుట్టుపట్ల వాళ్లు, కుటుంబసభ్యులు, ఆఫీసులో కొలీగ్స్ ఒత్తిడి చేస్తే వేయించుకుంటున్నారు. టీకా సర్టిఫికెట్టు లేకపోతే థియేటర్స్, మాల్స్‌లో రానివ్వం అని రూలు పెడతారట. మా స్నేహితుడు టీకా వేయించుకోనని కరాఖండీగా చెప్పాడు. అయితే అతని బాడ్మింటన్ క్లబ్ వాళ్లు టీకా వేయించుకోకపోతే ఆడనివ్వం అన్నారు. ఆ సాయంత్రమే వెళ్లి వేయించుకుని వచ్చాడు. టీకా వేయించుకోవడం గురించి సామాన్యజనులకు వాళ్ల లెక్కలు వాళ్లకున్నాయి. వివరిస్తాను చూడండి.

టీకాలకై క్యూలు, టీకా సెంటర్లలో టీకాలు సరిపోక జనం హాహాకారాలు.. అని టీవీల్లో చూపిస్తున్నారు కదా! అదే సమయంలో ప్రయివేటు సెక్టార్‌కై కేటాయించిన 25% టీకాలలో 7% మాత్రమే ఉపయోగపడ్డాంటే చిత్రంగా లేదా? జులై 20న రాజ్యసభలో ఖర్గే వేసిన ప్రశ్నకు సమాధానంగా మే 1 నుంచి జులై 15 లోగా 7% టీకాలు మాత్రమే ప్రయివేటు సెంటర్ల ద్వారా వినియోగింపడ్డాయని ఆరోగ్యశాఖ చెప్పింది. ఈ విషయంపై పీయూష్ గోయల్ ప్రయివేటు సెక్టార్‌పై మండిపడ్డారని జులై 25 పేపర్లో వచ్చింది. ‘నా దగ్గరకు కొన్ని ఇండస్ట్రీ గ్రూపులు వచ్చి మాకు వాక్సినేషన్ కేటాయించండని అడిగాయి. ఒకళ్లు రోజుకి కోటి వేస్తామన్నారు. మరొకరు మేం మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి గ్రామీణులకూ వేసేస్తాం అన్నారు. ఆచరణలో ఏదీ జరగలేదు. బిహార్, ఝార్‌ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేసి వాళ్లలో వాక్సిన్ సంకోచాలను వదలగొట్టి టీకాలు వేసినవాడు ఒక్కడు లేడు.’ అన్నారు పీయూష్. ఉద్యోగాలు కల్పిస్తాం, మాకు లక్షల కోట్ల రాయితీలు యివ్వండి అని కార్పోరేట్లు అడగడం, ప్రభుత్వం వారికి దోచిపెట్టడం కళ్లారా చూశాం. ప్రజాహితం కోరే కార్యక్రమాల్లో వాళ్ల చిత్తశుద్ధి ఎలా వుందో మంత్రే బహిరంగంగా చెప్పారు.

ఈ విషయమై ‘‘ఇండియా టుడే’’ జులై 29న వివరణాత్మకమైన కథనం యిచ్చింది. వాక్సిన్ పాలసీని సవరించి ప్రభుత్వం వాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి చాలామంది జనాలు డబ్బు పెట్టి కొనడం దేనికి అనే ఆలోచనలో పడ్డారు. 4గురు సభ్యులున్న కుటుంబానికి ఏ కోవాక్సినో వేయించుకోవాలంటే డోసుకి రూ.1410 చొప్పున రెండు డోసులు కలిపి, 9300 అవుతుంది. కోవిషీల్డు అయినా డోసుకి రూ. 780 చొప్పున 6300 అవుతుంది. అదీ ప్రయివేటు సెంటర్ల వాళ్లు కరక్టుగా తీసుకుంటే! మా దగ్గర కోవిషీల్డుకి కొన్ని సెంటర్లు 850 చొప్పున తీసుకుంటున్నారు. ఆదాయాలు పడిపోయిన యీ రోజుల్లో యిది భారమే కదా! కోవిడ్ వచ్చి ఆసుపత్రి పాలయితే లక్షల్లో ఖర్చవుతోందిగా, దాని కంటె యిది మేలు కదా అని వారు అనుకోవటం లేదు. అదీ చిత్రం!

ఇలా ఖర్చు పెట్టడానికి సిద్ధపడే వాళ్లు నగరాల్లో వుంటున్నారు కాబట్టే యీ 7% ఐనా ఖర్చవుతోంది. గ్రామాల్లో వాళ్లు ఖర్చుకి వెరుస్తారన్న భావన చేత ప్రయివేటు వాళ్లు వాళ్ల దగ్గరకు వెళ్లటం లేదు. గ్రామాలకు వెళితే కనీసం కొందరు ధనికులైనా వేయించుకోవచ్చనే కోణంలో ఆలోచించటం లేదు. ఎందుకంటే లాజిస్టిక్స్‌కు ఖర్చవుతుంది. పైగా కనీసం 3 వేల డోసులు తీసుకోవాలనే నిబంధన పెట్టింది ప్రభుత్వం. అంటే రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టి రవాణా ఖర్చులు పెట్టుకుని, అనేక జాగ్రత్తలు తీసుకోవడానికి ఖర్చుపెట్టి గ్రామాలకు వెళితే అక్కడ ఎంతమంది వేయించుకుంటారో ఓ రెణ్నాళ్లు ఆగితే గవర్నమెంటు సెంటర్లో ఫ్రీగా వేయించుకోవచ్చని ఆగుతారో తెలియదు.

ముఖ్యంగా వీళ్లకు వచ్చిన యిబ్బంది ఏమిటంటే టీకా యిచ్చేందుకు తీసుకునే చార్జి రూ.150కు మించకూడదు అని ప్రభుత్వం విధించిన పరిమితి! అది వీళ్లకు చాలటం లేదు. ప్రజలకు అదే భారమనిపిస్తోంది. నిజానికి జూన్ రెండో వారంలో మా ఎన్‌క్లేవ్‌లో కొన్ని కార్పోరేట్ ఆస్పత్రులు కాంప్‌లు నిర్వహించాయి. కోవిషీల్డుకి ఒకళ్లు రూ.950, యింకోళ్లు రూ.1050 తీసుకున్నారు. తీసుకోవాల్సింది రూ.780 మాత్రమే, యిలా కుదరదు అని ప్రభుత్వం కట్టడి చేయనారంభించిందో ఏమో కానీ కాంప్‌లు మానేశారు. ప్రయివేటు సెంటర్లో టీకా సెంటర్ శుభ్రంగా మేన్‌టేన్ చేయాలంటే దానికి బాగానే ఖర్చవుతుంది. తగినంత డిమాండ్ వుంటే తప్ప వారికి కిట్టుబాటు కాదు. మొదటిరోజు సినిమా ఆట చూడడానికి ఎంతైనా ఖర్చుపెట్టే జనాలు టీకాలకు ఖర్చు పెట్టడానికి వెరిస్తే ఆసుపత్రులను నిందించి ప్రయోజనం ఏముంది? టీకా సెంటరుకి కేటాయించిన స్పేస్‌లో బెడ్స్ వేసుకుంటే లక్షల్లో డబ్బులొస్తాయి.

ఇలాటి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక నోడల్ ఆఫీసర్ను నియమిస్తామని చెప్పిందట. కొన్ని చోట్ల నియమించలేదట. మరి కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేదట. ఏతావతా ప్రయివేటు ఆసుపత్రులలో 2.60 కోట్ల డోసులు నిరుపయోగంగా పడి వున్నాయని జులై 19న ప్రభుత్వం ప్రకటించింది. ఇలాటి సమస్యలను ప్రభుత్వాలే సంబంధిత వర్గాలతో మాట్లాడి, పరిష్కరించాలి. అది జరగకుండా ఎమ్బీయస్ రాశాడు కాబట్టి టీకాలు వేయించుకోవడం లేదంటూ పిచ్చి వాదనలు చేస్తే ఎలా? సొంత డబ్బు పెట్టి వాక్సిన్‌లు వేయించుకుని ప్రజలు పండగలంటే మాత్రం ఖర్చుకి వెనకాడటం లేదు. వాళ్లని నిందించండి. ఈ పండగలను అనుమతిస్తున్న పాలకులను నిలదీయండి. సుప్రీం కోర్టు బక్రీద్ మినహాయింపులపై కేరళ ప్రభుత్వానికి, కన్వర్ యాత్ర మినహాయింపులపై యుపి ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. భేషైన పని. మరి బోనాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకివ్వలేదు?

జనతా పాస్ చేస్తే మెరిట్ ఉన్న విద్యార్థులకు నష్టమంటూ ఆంధ్ర ప్రభుత్వం పరీక్షలు పెడితే ఎవరైనా ఛస్తే మీరే బాధ్యత వహించాలి. మనిషికి కోటి రూ.లు యివ్వాలి అని హుంకరించిన కోర్టు బోనాల విషయంలో మౌనంగా వుందేం? కేరళ బక్రీద్ విషయంలో సిపిఎంను తిట్టిపోసిన (పోయాల్సిందే) బిజెపి బోనాల్లో ఎందుకు పాల్గొంటోంది? ఏమైనా అంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోమని అనుమతించాం అంటుంది ప్రభుత్వం. పాటిస్తున్నారా? బోనం ఎత్తుకున్న మంత్రిగారికే మాస్కు వుండదు. వీధిలో మీరూ, నేనూ మాస్కు లేకుండా కనబడితే వెయ్యి రూపాయలు ఫైన్ వసూలు చేస్తారు. కిటికీలు మూసేసిన కార్లో ఒక్కరమూ డ్రైవ్ చేసుకుంటే వెళ్లినా మాస్కు లేకపోతే జరిమానా తప్పదు.

అయినా గుడిలో మూడడుగుల సామాజిక దూరం పాటించాలంటే ఎంతమంది భక్తులను అనుమతించాలో అధికారులకు తెలియదా? ఉత్సవాళ్లో వెళితే ప్రమాదమని జనాలకు తెలియదా? ఇలా చిత్తం వచ్చినట్లు ప్రవర్తించి, ఆసుపత్రి పాలయ్యాక, ఆక్సిజన్ లేదంటూ ప్రభుత్వంపై రంకెలు వేస్తే వూరుకుంటుందా? అందుకే ఆక్సిజన్ కొరత చేత మరణాలే లేవని ఢంకా బజాయించింది. కొన్నాళ్లు పోతే కోవిడ్ చేత ఎవరూ పోలేదు, అన్నీ ఆత్మహత్యలే అనేస్తుందేమో కూడా. ఒక విధంగా అదీ నిజమే! ఛస్తే స్మశానంలో కూడా చోటు అరుదై పోయిందని తెలిసి కూడా పండగల్లో, ఫంక్షన్‌లలో, ఎన్నికల ర్యాలీలో పాల్గొనేవారు ఆత్మహత్య చేసుకుంటున్నట్లే కాదా!

ఏమిటి దీనికి పరిష్కారం అంటే టీకాలు వేస్తే కనీసం సగం రక్షణైనా వుంటుందేమో అనే ఆశాభావం. అది సగమో, పావో, ముప్పావో దేవుడికే తెలియాలి. కనీసం రోగతీవ్రతైనా తగ్గుతుందని ఆశ. టీకాలు పడాలంటే ప్రభుత్వమే కొని ఉచితంగా వేయాలి. లేకపోతే జనాలు వేయించుకునేట్లు లేరు. ప్రభుత్వానికి తగినన్ని టీకాలు అందుబాటులో లేవని గత వ్యాసాల్లో రాశాను. ఫైజర్, మోడెర్నాలను రారమ్మనమన్నా బెట్టు చేస్తున్నాయనీ రాశాను. అవి వచ్చినా 30, 40 లక్షల డోసులు మాత్రమే కదా! కావాలంటే 5 కోట్లిస్తాం, కానీ మీరు మాకు దాసోహం అనాలి అని ఫైజర్ అంటోందని ఫ్రంట్‌లైన్ జులై 2 సంచిక రాసింది. ఈ వాక్సిన్‌ను అడ్డుపెట్టుకుని ఫైజర్ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సంస్థ ఆరోపించింది. లాటిన్ అమెరికా దేశాలతో నైతే ఇండెమ్నిటీ అడిగేటప్పుడు తమ వైపు నిర్లక్ష్యం, ఫ్రాడ్, దురుద్దేశం ఉన్నా, సప్లయిలో ఆలస్యం, తయారీలో, పాకేజిలో లోపాలున్నా సరే పరిహారం అడగకూడదని పట్టుబడుతోందట. కొన్ని దేశాలతో అయితే హామీగా దేశపు ఆస్తులను తనఖా పెట్టమంటోందట. ఆ దేశాలకు దిక్కులేకుండా పోతోంది.

మన దేశాన్ని ఏమడుగుతోందో, ఆ ఒప్పందాన్ని బయట పెడతారో లేదో తెలియదు. ఎందుకీ పరిస్థితి వచ్చింది? ఆ టెక్నాలజీ మనం అభివృద్ధి చేసుకోక దిగుమతుల మీద ఆధారపడడం చేతనే కదా! ఇది దశాబ్దాల పాపం. రిసెర్చిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, స్వదేశీ ఉత్పత్తిని రంగాన్ని అటకెక్కించి, దిగుమతుల మీదనే బతకడం చేత వచ్చిన అనర్థం. విద్యాలయాల్లో రిసెర్చి జరగటం లేదు, పరిశ్రమల్లోనూ జరగటం లేదు. గతంలో ఆర్ అండ్ డిపై పెట్టిన ఖర్చుకి 150% రాయితీ వుండేది. మోదీ సర్కారు వచ్చాక, దాన్ని తగ్గించి, కొంతకాలానికి మొత్తం ఎత్తి పారేశారు. ఈ రోజు హఠాత్తుగా రిసెర్చి కావాలంటే ఎక్కణ్నుంచి వస్తుంది? ఔషధరంగమే కాదు, వైద్యరంగంలో మాత్రం రిసెర్చి జరుగుతోందా? అసలు అధ్యాపకులున్నారా?

వైద్యుడు కాగానే కార్పోరేట్ ఆసుపత్రులలో చేరి ఫీజుల రూపంలో లక్షలు సంపాదించడంలోనే పడ్డారు తప్ప పాఠాలు చెప్పి వందమంది మంచి వైద్యులను తయారు చేద్దామని ఎవరైనా అనుకుంటున్నారా? ఇంజనియర్లు మాత్రం? ఏ విభాగానికి చెందిన వారైనా సరే, కంప్యూటర్ నేర్చుకుని సేవారంగంలో లక్షల ప్యాకేజికి ఎగబడుతున్నారు తప్ప బోధనారంగానికి వెళ్లటం లేదు. అందువలన మనకు ఇంజనియరింగు కాలేజీలున్నాయి తప్ప ఉపాధ్యాయులు లేరు. గ్రాంట్ల కోసం ఫాకల్టీ మెంబర్లుగా కొందరి పేర్లు చూపిస్తారు. నిజానికి వారక్కడ పని చేయరు. ఇప్పుడు కొత్త వైద్యకళాశాలు తెరిచినా అదే పరిస్థితి. చేయవలసిన దేమిటంటే హెచ్చు జీతాలిచ్చి పరిశోధనా రంగాన్ని, బోధనా రంగాన్ని ఆకర్షణీయంగా చేయాలి. రిసెర్చికి నిధులు విరివిగా కేటాయించాలి.

అది చేయకుండా ఉన్నట్టుండి వాక్సిన్లు, మందులు ఊడిపడాలంటే పడవు. యుద్ధరంగంలో అప్పటికప్పుడు నీళ్లు కావాలని భీష్ముడడిగితే బాణం వేసి పాతాళగంగను తెప్పించగలిగాడు అర్జునుడు. అందరి వలనా అది సాధ్యం కాదు. మనలాటి వాళ్లం బావి కోసం ముందే ప్లాను చేసుకోవాలి, కొంప అంటుకున్నాక కాదు. సైన్సుకి పెద్ద పెద్ద పీట వేస్తే ప్రజల్లో కూడా శాస్త్రీయ దృక్పథం అలవడుతుంది. అజ్ఞానంలోంచి బయటపడి, క్రమశిక్షణతో వుంటారు. ఆరోగ్య విషయమే కాదు, అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా వుంటారు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2021)

mbsprasad@gmail.com

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×