Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: వలస కూలీలను ఏం పట్టించుకున్నాం?

ఎమ్బీయస్‌: వలస కూలీలను ఏం పట్టించుకున్నాం?

వలస కార్మికులను తిరిగి పంపడం ఎలా అన్న సమస్య కంటె పంపితే తిరిగి వస్తారా లేదా అన్న బెంగ యిప్పుడు పట్టుకుంది మన పాలకులకు. యెడ్యూరప్ప వద్దకు బిల్డర్లు వచ్చి ‘‘ఆర్థిక ప్రగతి కోసం మీరు ఓ పక్క మమ్మల్ని రియల్‌ ఎస్టేటు రంగాన్ని పునరుద్ధరించమంటున్నారు.  మరో పక్క వలస కార్మికులను శ్రామిక్‌ రైళ్ల ద్వారా వెనక్కి పంపేస్తున్నారు. వెళ్లే వారిలో చాలామంది యువకులు, మంచి కోపం మీద ఉన్నారు. తిరిగి వస్తారని గ్యారంటీ ఏముంది? రాకపోతే మేం వ్యాపారం ఎలా చేయగలం?’’ అని మొత్తుకున్నారు. దాంతో ఆయన రైళ్లు కాన్సిల్‌ చేయమని రైల్వేని కోరాడు. దానిపై దేశమంతా విమర్శలు రావడంతో మర్నాడే దాన్ని రివర్స్‌ చేయాల్సి వచ్చింది. వాళ్లు మనకు అంత ముఖ్యమైనవారైతే మనం యిన్నాళ్లూ వాళ్లని పట్టించుకోలేదేం? ఇప్పటికైనా పట్టించుకుంటున్నామా?

ఔరంగాబాద్‌ వద్ద రైలు పట్టాల మీద పడుక్కున్న 16 మంది వలస కూలీలపై నుంచి గూడ్సు బండి వెళ్లిపోవడంతో చచ్చిపోయారు. వాళ్ల పేర్లు ఏ జాతీయ పత్రికా ప్రకటించలేదు.  విమానప్రమాదంలో 300 మంది చనిపోయినా అందరి పేర్లూ వేస్తారు. బంధువులు సంప్రదించ వలసిన హెల్ప్‌లైన్‌ ఫోన్‌ నెంబర్లు టీవీల్లో కూడా చూపిస్తారు. మరి వీళ్ల తాలూకు వాళ్లు ఏం వెతపడినా మనకు పట్టదు. పోయినవాళ్లు ఎవరో తెలియక మనవాళ్లేనేమో అని ఆ గ్రామాల వాళ్లందరూ బెంగపెట్టుకున్నా మనకు చీమ కుట్టదు. వాళ్ల గురించి యిప్పటికైనా పట్టించుకోవాలనే స్పృహను కోవిడ్‌ మనకు కలిగించింది.

వాళ్లు మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లిపోవడం మనకు వింతగా తోస్తోంది కదా! వాళ్లకు నడక అలవాటేట. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి సంపాదించుకున్నాక, ఆర్జనలో కాస్త టిక్కెట్టుపై ఖఱ్చుపెట్టడం దేనికి, దేవుడిచ్చిన కాళ్లను సద్వినియోగం చేద్దాం అనుకుని నడుస్తారట.  ఓ 40 కి.మీ.లు నడిచాక సాయంత్రానికి ఏ ధాబా దగ్గరో, టీ స్టాల్‌ దగ్గరో ఆగి, వాళ్లకు కాస్త పనిచేసి పెట్టి దానికి బదులుగా భోజనం పెట్టించుకుని, అక్కడే నిద్రపోయి, మర్నాడు పొద్దున్నే నడక ప్రారంభిస్తారు. ఈ సారి లాక్‌డౌన్‌ కారణంగా ఆ దుకాణాలన్నీ మూతపడడంతో తిండి దొరకకుండా పోయింది. దాంతో ఆకలి, డీహైడ్రేషన్‌, వాటి వలన డయేరియా, యితర రోగాలు, కరోనా గురించే మాట్లాడేవారికి యివన్నీ తోచలేదు.  

వలస కార్మికులు రెండు రకాలు - సీజను వచ్చినపుడు వేరే రాష్ట్రం వెళ్లి అక్కడే ఐదారునెలలు ఉండి, కాసిన్ని డబ్బులు సంపాదించుకుని, మళ్లీ సొంతూరు వచ్చేస్తూ వుంటారు. రెండో రకాన్ని సంచారకార్మికులు అనవచ్చు. వీళ్లు ఒక కాంట్రాక్టరుతో బేరం కుదుర్చుకుని అతనెక్కడికి తీసుకుపోతే అక్కడకు వెళుతూ వుంటారు. ఓ బిల్డింగ్‌కు తీసుకెళ్లి నెలో నెలన్నరో అక్కడే షెడ్లలో వుంచి, వండ్రంగం పనో, సెంటరింగ్‌ పనో, మార్బుల్‌ పనో చేయిస్తాడు. పని అయిపోగానే బస్సు ఎక్కించి, యింకో వూరు తీసుకుపోతాడు. ఎక్కడా స్థిరంగా వుండలేరు. వీళ్లు లక్షల్లో వుంటారు.

జీవనం సాగడానికి, మెరుగైన అవకాశాల కోసం వలస వెళ్లడంలో శతాబ్దాలుగా సాగుతోంది. రాకపోకలు పెరిగాయి కాబట్టి గత శతాబ్దకాలంలో బాగా పెరిగింది. గత 28 ఏళ్లలో మరింత పెరిగిందట. 2021 సెన్సస్‌ వచ్చేసరికి యింకెన్ని వాస్తవాలు బయటపడతాయో కానీ 2011 జనాభా గణన ప్రకారం 2001-2011 మధ్య స్వతంత్ర భారత దేశంలో అంతకు ముందెన్నడు జరగనంత స్థాయిలో వలసలు జరిగాయట. భారత జనాభాలో మూడింట రెండు వంతుల మంది గ్రామప్రాంతాల్లోనే ఉంటారు కాబట్టి అక్కడ జనాభా పెరగడం సహజం. కానీ 2011లో లెక్కేసిచూస్తే తేలిందేమిటంటే గ్రామీణ జనాభా కంటె నగరజనాభా ఎక్కువ పెరిగింది. అంటే గ్రామాల్లో పుట్టి నగరాలకు వలస వచ్చేవారి సంఖ్య యిబ్బడిముబ్బడిగా పెరిగిందన్నమాట.

పోనీ నగర జనాభా పెరగడం వన లాభమేమైనా వుందా అంటే వాళ్లలో 24% మంది మురికివాడల్లోనే ఉంటున్నారు. వాటివలననే అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. నేరాలు ఎక్కువౌతున్నాయి. కుటుంబాలకు దూరంగా వుండేవారి వలన నిర్భయ కేసు వంటి మానభంగాలు, హత్యలు పెచ్చుమీరుతున్నాయి. ఇప్పుడీ కరోనా కారణంగా రివర్స్‌ మైగ్రేషన్‌ అంటే నగరాల నుంచి గ్రామాలకు వెళ్లడం జరిగింది. వాళ్లు తిరిగి రావలసిన అవసరం లేకుండా గ్రామాల్లో, పట్టణాల్లో అవకాశాలు కల్పిస్తే రెండు సమస్యలు ఒకేసారి తీరతాయి. ఇప్పుడు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో గ్రామాల్లో, పట్టణాల్లో పరిశ్రమలు పెట్టేవారికి అదనపు సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తే మంచిది. దానితో బాటు నగర ప్రాంతాల్లో పెడితే యివ్వమని కూడా చెప్పాలి.

దీనితో బాటు హెలికాప్టర్‌ మనీ కాన్సెప్టు గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరిశ్రమలకు ఎన్నో రాయితీలు యిచ్చి వస్తూత్పత్తి చేయించినా కొనేవాడు లేకపోతే వాడు నష్టపోతాడు, ఋణాలిచ్చిన బ్యాంకులూ మునుగుతాయి. అందువలన కొనుగోలుదారుడి చేతికి డబ్బు అందేట్లా చేయడమనేది అతి ముఖ్యమైన పని. హెలికాప్టర్‌లోంచి నోట్లు వెదజల్లయినా సరే, వినియోగదారుడి చేతికి డబ్బు వచ్చే సాధనం చూడండి అని ఉత్ప్రేక్షాలంకారంగా చెప్పినమాట అది. నిజంగా అలా చల్లితే, నోట్ల కోసం జనాలు తన్నుకులాడి సగం జనాభా తగ్గిపోతారు. ప్రథమ ప్రపంచ సంగ్రామం తర్వాత ఆర్థిక మాంద్యంలోంచి దేశాన్ని బయట పడేయడానికి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ ప్రవేశపెట్టిన ‘‘న్యూ డీల్‌’’ గురించి అందరూ చెప్పుకుంటారు.

ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు ప్రారంభించి, ఉద్యోగాలు కల్పించి, కార్మికుల చేతికి డబ్బు వచ్చేట్లా చేయడం ‘‘న్యూ డీల్‌’’లో భాగమే. ఇప్పుడు భారత సర్కారు కూడా ఆ పని చేయక తప్పదు. అలా చేసినపుడు నగరాల్లో బుల్లెట్‌ రైళ్ల ప్రాజెక్టు కాకుండా ప్రతి గ్రామంలో రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, ఆసుపత్రులు, పేదలు అద్దెకుండేందుకు యిళ్లు వంటి అనేక పనులు చేపట్టి ఆ వూరి వారికి అక్కడే ఉపాధి దొరికేట్లా చేస్తే వలస కార్మిక సమస్య, అనర్థదాయకమైన నగరీకరణ సమస్య రెండూ ఒకేసారి పరిష్కారమౌతాయి. కార్మికులు, కర్షకుల చేతికి డబ్బు వస్తే వాళ్లు వస్తువులు కొంటారు. వాటిని ఉత్పత్తి చేసిన పారిశ్రామికవేత్త నిలదొక్కుకో గలుగుతాడు.

అక్కడున్న తాగునీటి, డ్రైనేజి, ఆరోగ్య, వసతులపై వీళ్ల భారం అదనంగా పడుతుంది. ఇప్పటివరకు వలసకార్మికులు తమ సొంత రాష్ట్రాలకు పంపే డబ్బు సుమారు రూ. 1.50 లక్షల కోట్లు వుంటుందట. వీళ్లు తిరిగి వెళ్లకపోయినా, కొంతమందే వెళ్లినా ఆ మేరకు ఆ రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్లే. చేతిలో కాసులు ఆడక ఆ కుటుంబాలు ఖర్చు పెట్టడం మానేస్తే అక్కడి వ్యాపారాలు దెబ్బ తింటాయి. పోషకాహారం సరిపోక వారు జబ్బు పడితే చికిత్స చేయించడం కూడా కష్టమే. ఎందుకంటే మూడింట రెండు వంతుల జనాభా వున్న గ్రామాల్లో మొత్తం డాక్టర్లలో, నర్సులో మూడో వంతు మంది మాత్రమే పనిచేస్తున్నారు.

వలస కార్మికులలో మళ్లీ కొంతమందైనా నగరాలకు, పెద్ద పట్టణాలకు వచ్చి పనిచేయాలంటే కాంట్రాక్టర్లు వాళ్లకు భారీ అడ్వాన్సులు యిచ్చి రప్పించాలి, జీతం బకాయిులు వుంటే తీర్చేయాలి. కానీ వీళ్ల దగ్గర అంత డబ్బుందా అనేది ప్రశ్న. నిర్మాణరంగం చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కట్టిన ఫ్లాట్లు కూడా అమ్ముడుపోతాయన్న నమ్మకం లేదు. ఉద్యోగానికి, వ్యాపారానికి  భద్రత లేదని సందేహించే సమయంలో ఫ్లాట్లు బుక్‌ చేసే సాహసం ఎంతమంది ఉద్యోగులకు, వ్యాపారస్తులకు వుంటుంది? వాళ్ల వద్ద బుకింగ్‌లు ఆమోదించే ధైర్యం ఎంతమంది బిల్డర్ల కుంటుంది? ఆ  బిల్డర్లతో కాంట్రాక్టు కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు ఏ మేరకు కార్మికులపై పెట్టుబడి పెట్టగలరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?