Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అరుణాచల్‌లో మతమార్పిడి వ్యతిరేక బిల్లురద్దు

ఎమ్బీయస్‌: అరుణాచల్‌లో మతమార్పిడి వ్యతిరేక బిల్లురద్దు

ఇతర పార్టీలన్నీ మైనారిటీలను బుజ్జగిస్తూ ఓటుబ్యాంకులుగా చూస్తాయని, తాము మాత్రం అలాటివాటి జోలికి పోకుండా హిందువులను రక్షిస్తామని బిజెపి చెప్పుకుంటూ ఉంటుంది. ఇటీవల కొన్ని రాష్ట్రాలలో ఒక్క ముస్లిముకు కూడా టిక్కెట్టు యివ్వకుండా విజయాలు సాధించింది కూడా. అలాటి బిజెపి పార్టీకి చెందిన ముఖ్యమంత్రి 40 ఏళ్లగా అమలులో ఉన్న మతమార్పిడి వ్యతిరేక బిల్లును రద్దు చేస్తున్నాడంటే దాని అర్థమేమిటి? బిజెపి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం అమలు చేస్తోందనా? హజ్‌ సబ్సిడీని రద్దు చేసిన నెల తర్వాత 2018 ఫిబ్రవరిలో నాగాలాండ్‌లో ఎన్నికల సందర్భంగా బిజెపి 'క్రైస్తవులకు జెరూసలెంకు వెళ్లడానికి ఉచిత పర్యటనలు ఏర్పాటు చేస్తామ'ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరచింది. అవతల కాంగ్రెసు జెరూసలెం ట్రిప్పులకు సబ్సిడీ యిస్తానంటే, యివతల బిజెపి ఏకంగా ఉచితంగానే పంపిస్తానంది. ఎందుకిదంతా అంటే అక్కడ క్రైస్తవ ఓటర్లు ఎక్కువ. వాళ్లను ఆకర్షించాలి. ఇంతకు మించిన సిద్ధాంతం లేదు. ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లో గిరిజన మతావలంబుల సంఖ్య తగ్గుతోంది, హిందువుల సంఖ్య తగ్గుతోంది, క్రైస్తవుల సంఖ్య పెరుగుతోంది. వాళ్ల ఓట్లు కావాలి. అందువలన యీ చట్టాన్ని రద్దు చేస్తానని ప్రకటించాడు బిజెపి ముఖ్యమంత్రి పేమా ఖండూ.

1951 గణాంకాల ప్రకారం ఆ రాష్ట్రంలో (అప్పట్లో దాని పేరు నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ప్రావిన్స్‌) క్రైస్తవులు ఎవరూ లేరు. స్థానిక తెగల మతాలు ప్రబలంగా ఉండేవి. హిందువులూ ఉండేవారు. క్రైస్తవ మిషినరీలు అక్కడ పాగా వేశాయి. రకరకాల మార్గాల్లో ఆ తెగల వారిని ఆకర్షించసాగాయి. ఆ ఆచారాల ప్రకారం పెళ్లిళ్లు, చావులు వంటి వేడుకలకు బాగా ఖర్చు పెట్టాలిట. క్రైస్తవంలోకి చేరితే అవన్నీ తప్పుతాయని, మతం మారారని కొందరు పరిశీలకులు అంటారు. ఆ మాత్రం కారణానికే పుట్టి పెరిగిన మతం వదులుకుంటారంటే నమ్మశక్యంగా ఉండదు. మతం అనేది మనిషి అభిమతంపై ఆధారపడుతుంది. ఏ మతంలో పుట్టినా, పెద్దయ్యాక మరో మతసిద్ధాంతాలు నచ్చితే ఆ మతంలోకి మారే స్వేచ్ఛ ఉంటుంది. అనేకమంది పాశ్చాత్యులు హిందూమతంలోకి మారుతూండడం చూస్తూ ఉంటాం. మరో మతంలోకి మారకుండా దైవభావనే వదులుకున్న సందర్భాలూ ఉంటాయి. మన దేవుడు కాకపోయినా ఏదైనా మొక్కు తీరిస్తే ఆ దేవుడి మతంలోకి మారుతూంటార కూడా. అందువలన కొంత మేరకు మతమార్పిడులు అర్థం చేసుకోవచ్చు. కానీ అవి భారీ స్థాయిలో జరుగుతున్నపుడు వాటి వెనక విశ్వాసాలు కాకుండా డబ్బో, ప్రలోభమో, మరేదో ఉన్నాయని, ఎవరో ఒక వ్యూహం ప్రకారం వీటిని నడిపిస్తున్నారనీ సందేహించవలసి వస్తుంది.

అరుణాచల్‌ మతమార్పిడుల వెనుక యిలాటి వ్యూహం ఉందని అప్పటి పాలకులకు అనుమానం వచ్చింది కాబోలు 1978లో మత మార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు పాస్‌ చేశారు. స్వచ్ఛంద మార్పిడులను నిషేధించడం మౌలిక హక్కులకు విఘాతం కాబట్టి డబ్బుతో కాని, ప్రలోభపెట్టి కానీ, బలవంతాన కానీ మతం మారకూడదు, మార్చకూడదు అని ఆ చట్టం చెపుతుంది. ఆ చట్టం అమల్లో ఉండగానే క్రైస్తవం విపరీతంగా వ్యాపించేసింది. కొన్ని గణాంకాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. 1981లో అరుణాచల్‌ వాసుల్లో 52% మంది డోన్యీ-పోలో అనే స్థానిక మతానికి చెందినవారు. ఈనాడు జనాభాలో దాని అనుయాయులు 26%! అంటే సగానికి సగం మంది తగ్గిపోయారు. 2001 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 34.6%, డోన్యీ-పోలో వారు 30.7%, క్రైస్తవులు 18.7%, అన్యమతాల వారు 16%. 2011 వచ్చేసరికి హిందువులు 29.4%, (6% తగ్గారు) డోన్యీ-పోలో వారు 26.2%, (5% తగ్గారు) క్రైస్తవులు 30.3%, (12% పెరిగారు) అన్యమతాల వారు 15%! 2018 కి క్రైస్తవుల శాతం మరింత పెరిగి ఉండవచ్చు. 55%కి చేరిందని కొందరంటున్నారు. వీళ్లంతా క్రైస్తవసిద్ధాంతాలకు మురిసి చేరారని నమ్మడం కష్టం. ఇప్పుడు వారిలో ఇంజనియర్లు, డాక్టర్లు, లాయర్లు, స్థానిక సంస్థల నాయకులు ఉండి, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థితికి వచ్చారు. ఇలాటి సమయంలో ఆ చట్టాన్ని మరింత దృఢంగా అమలు చేయకపోగా మొత్తానికి ఎత్తేస్తాననడంలో ఏం విజ్ఞత ఉంది?

పైగా యీ ప్రకటన చేసిన సందర్భం ఏమిటో తెలుసా? ప్రేమ్‌ భాయ్‌ అనే స్థానిక క్రైస్తవ మిషనరీ దశమవర్ధంతి సభ! అతగాడు గండరగండడు. 1983 నుంచి పాతికేళ్ల పాటు అరుణాచల్‌లో క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడానికి అతను రకరకాల మార్గాలు అవలంబించాడు. వడ్రంగిలా, రైతులా, కటికవాడిలా అనేక మారువేషాలు వేశాడు, పర్వతాల్లో, మంచులో వందలాది కిలోమీటర్లు నడిచి గ్రామాలను చేరేవాడు, రాత్రుళ్లు సభ ఏర్పాటు చేసి మతబోధ చేసేవాడు. కొంతమందిని పోగేసి బాప్టయిజ్‌ చేస్తున్నందుకు స్థానికుల చేత దెబ్బలు కూడా తిన్నాడు, 8 సార్లు అరెస్టయ్యాడు, ఐదుసార్లు జైలుపాలయ్యాడు. చట్టవిరుద్ధమైన పనులు చేసినందుకు రూ.10 వేల జరిమానా, 2 సం.ల జైలుశిక్ష కూడా వేయించుకున్నాడు. పదేళ్ల క్రితం శ్రీలంకలో మరణించాడు. కాథలిక్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన అతని వర్ధంతి సభలో మాట్లాడుతూ పేమా ''ఇప్పుడా చట్టం అర్థరహితం. అది ఏ మతానికి సహాయకారీ కాదు, హానికారీ కాదు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టాన్ని ఎత్తేస్తాం. ఎందుకంటే అది మతస్వేచ్ఛను హరిస్తోంది. క్రైస్తవులను టార్గెట్‌ చేస్తోంది. సెక్యులర్‌ ఇండియాలో దానికి స్థానం లేదు.'' అని సభలో హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?