Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: అసభ్యాంధ్రరాజకీయాలు

ఎమ్బీయస్: అసభ్యాంధ్రరాజకీయాలు

రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణ పోగా మిగిలినదాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అనసాగారు. నేను సింపుల్‌గా ఆంధ్ర అని రాస్తూంటే కొందరు అభ్యంతర పెట్టేవారు. కొన్ని పత్రికలు, టీవీలు అంటున్నట్లుగా నవ్యాంధ్ర అనవచ్చుగా అని కొందరు, బంగారు తెలంగాణకు పోటీగా స్వర్ణాంధ్ర అని కొందరు అడిగేవారు. అనేక చిక్కుల్లో పడిన సందర్భంలో ఓ వ్యాసానికి ‘ఆపసోపాంధ్ర’ అని పేరు పెడితే కొందరు నొచ్చుకున్నారు. విభజనానంతరం ఆంధ్ర ఎక్కడికో వెళ్లిపోతుందని చంద్రబాబు కల్పించిన ఆశలు ఆ రేంజిలో ఉండేవి. క్రమేపీ అందరికీ ఆశలు అడుగంటి యిప్పుడు ప్రభుత్వోద్యోగులకు జీతాలు వస్తే చాలు, ప్రభుత్వంకై చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే చాలు అనే దశకు వచ్చారు. ఇక రాజకీయాలు అధమ స్థితికి దిగజారి, అసభ్యత చుట్టూనే పరిభ్రమించడం చూస్తూంటే అశ్లీలాంధ్రరాజకీయాలు అన్నా తప్పు లేదనిపిస్తోంది. అశ్లీల విశేషణం ఆంధ్రరాజకీయాలకు తప్ప ఆంధ్రకు కాదని గమనించాలి.

ఇన్నాళ్లూ కొడాలి నాని, వంశీ మార్కు ఆడియో పొల్యూషనే ఉంటూ వచ్చింది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ తాలూకు వీడియో పొల్యూషన్ కూడా వచ్చి చేరింది. మాధవ్‌పై టిడిపి చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికి వైసిపి వారు టిడిపి వారికి సంబంధించిన యిలాటి వీడియోల వేటలో పడ్డారట. టిడిపి వారు మాత్రం ఊరుకుంటారా? అందువలన రాబోయే రోజుల్లో యిలాటివి మరిన్ని మార్కెట్లోకి వచ్చిపడతాయి. ఇంటి నాలుగు గోడల మధ్య నేనేం చేస్తే ఎవరికి తెలుస్తుంది అనుకోకూడదు. గోడలకు చెవులే కాదు, కళ్లూ ఉంటాయి. పడగ్గదిలో లైట్లు ఆర్పేసి జాగ్రత్త పడతాం అనుకుంటే చాలదు, పబ్లిక్ ప్లేస్‌కు వెళ్లినపుడు, హోటళ్లలో దిగినపుడు, టాయిలెట్స్‌లో, బాత్‌రూముల్లో ఎక్కడైనా దొరకవచ్చు. కాస్త దొరికితే యాప్‌ల ద్వారా చిలవలు పలవలు చేర్చవచ్చు. మరీ దొరక్కపోతే పూర్తిగా ఫేక్‌వి తయారు కావచ్చు. ఫేకో, ఒరిజినల్లో తేల్చడం ఆంధ్ర పోలీసులకు చేతకాని విద్య. అందువలన మాది ఒరిజినలే అంటూ చెప్పుకుంటూ వాట్సాప్‌లలో యివి వీరవిహారం చేయవచ్చు. ఈ క్రమంలో ఆంధ్ర రాజకీయాలు, అశ్లీల రాజకీయాలుగా దిగజారతాయని భయపడడంలో ఆశ్చర్యమేముంది?

ఆంధ్ర నాయకులలో చాలామంది అసభ్యంగా మాట్లాడుతూంటే కొడాలి నాని, వంశీలనే ఎందుకు ఎత్తి చూపాలనే ప్రశ్న రావచ్చు. చంద్రబాబు, ఆయన అనుయాయులు జగన్‌ను ఉద్దేశించి సైకో, ఉన్మాది, జాంబీ వంటి అభ్యంతరకరమైన పదాలు వాడుతున్న మాట నిజమే. కానీ కొడాలి, వంశీ లుచ్ఛా వంటి తిట్లు వాడుతూన్నారు. అదీ తేడా. టిడిపి నాయకుడు పట్టాభి బొసెడి.. పదం వాడి కేసు ఎదుర్కుంటున్నారు. ఆ పదం సర్వసాధారణమైనదని, మేమందరం ఎడాపెడా వాడుతూంటామని కొందరు టిడిపి నాయకులు బుకాయించారు. ఆంధ్రజ్యోతి ఆర్కె పెద్ద వ్యాసమే రాశారు. ఆ మాటను రుజువు చేయడానికి కాబోలు బాలకృష్ణ రాబోయే సినిమాల్లో ఆ మాట ఉపయోగించినట్లు టీవీ యాడ్స్ ద్వారా తెలుస్తోంది. దానిపై వ్యాసం రాసినపుడు దాని అర్థం తెలియదు కానీ, పాఠకులు తెలియచెప్పాక జాగ్రత్తగా గమనించాను. ‘‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’’ సినిమాలో వాడిన బూతుపదాల్లో అదొకటి. కేసు కోర్టులో ఉంది కాబట్టి యింతకంటె చర్చ అక్కర్లేదు. వాళ్ల తీర్పు వచ్చేలోగా, ‘‘పైసా వసూల్’’ సినిమాలో గుప్పిటిని అదోలా ఆడించి, దానికి సెన్సార్ ఆమోదం పొందిన బాలకృష్ణ వంటి టిడిపి నాయకులు దీన్ని మర్యాదకరమైన సంబోధనగా ఎస్టాబ్లిష్ చేయడానికి తంటాలు పడుతున్నారు. ఆ విధంగా ఆంధ్రలో పబ్లిక్ డీసెన్సీని మరో మెట్టు దిగజార్చడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

అంగప్రదర్శన ఆరోపణ ఎదుర్కుంటున్న గోరంట్ల మాధవ్ ఉదంతం గురించి రాయడానికే యిబ్బందిగా ఉంది. కానీ ఆ వీడియో గురించి చర్చలు ఎడతెగకుండా సాగుతున్నాయి. గతంలో అంబటి, అవంతి ఆడియో క్లిప్పుల గురించి చదివినప్పుడు అవి వినలేదు. ఏదో ప్రయివేటు వ్యక్తుల మధ్య సంభాషణ, పదవీ దుర్వినియోగం, ప్రజాధనవ్యయం లేదు. చర్చ ఎందుకు అనుకున్నాను. పృథ్వీ ఆడియో కూడా వినలేదు కానీ, పార్టీ చర్య తీసుకుంది కాబట్టి పదవీదుర్వినియోగం జరిగి ఉంటుందని అనుకున్నాను. మాధవ్ వీడియో చాలాకాలం చూడలేదు. కానీ ఆయన ఏ మాత్రం తగ్గటం లేదు కాబట్టి రాయవలసి వస్తోంది. వీడియోలో ఏది ఎంతవరకు చూపించాడన్నది విస్మరిద్దామనుకున్నా, నోటి దురుసు ఏ లెవెల్లో ఉందో స్వయంగా చూపించాడు. కొందర్ని ఉద్దేశించి, ఒక కులాన్ని ఉద్దేశించి నా కొడుకులు అంటూ బహిరంగంగా తిట్టడమా!? ఇంతటి అసభ్యత ఎప్పుడైనా చూశామా? దీన్ని పార్టీ ఆమోదించి తల ఊపడమా!? ఘోరం కదూ!

పైగా వైసిపి నాయకులందరూ ఒకటే పాట – బాధిత మహిళను ముందుకు రమ్మనండి, ఫిర్యాదు చేయమనండి అంటూ. అవతలివైపు మహిళ బాధితురాలా? లేక వలవిసిరిన వనితా? బాధితురాలైతే సెక్స్ పరంగా బాధితురాలా? మాటలు వినిపిస్తే తప్ప చెప్పలేము. వీడియో చూస్తే ఎంపీ గారు చెప్పుకున్నట్లు జిమ్‌లో ఉన్నట్లు అస్సలు తోచదు. మొదట టాప్‌లెస్‌గా కనబడి, హఠాత్తుగా కెమెరా కిందకు దిగింది. గోప్యంగా ఉండవలసినది బహిర్గతమైంది. వీడియోలో పూర్వభాగంలో తనే ఉన్నా, ఉత్తరభాగంలో మార్ఫింగ్ జరిగిందని ఎంపీ గారంటారు. ఏది ఏమైనా సదరు వ్యక్తి హావభావాలు చూస్తే రొమాంటిక్ మూడ్‌లో ఉండి అంగప్రదర్శన కావించినట్లు తోచదు. నేనేమైనా చేయగలను జాగ్రత్త అని హెచ్చరించడానికో, ఔద్ధత్యం చూపడానికో వాట్సాప్ కాల్ ద్వారా ప్రదర్శించినట్లు తోస్తుంది.

వాట్సాప్‌ను రికార్డు చేయలేరు కాబట్టి, ఈయన యిలా చేయబోతాడని ముందే ఊహించిన అవతలి వాళ్లు వేరే సెల్‌తో వీడియో తీసి రికార్డు చేశారు. అలా రికార్డు చేసిన దాన్ని వేరెవరో సెల్‌లో చూస్తూండగా, దాన్ని ఏదో పశువుల కొట్టంలో రికార్డు చేసి జనాల మీదకు వదిలారు. అందుచేత యిది థర్డ్ హేండ్ వీడియో. నేను చూసిన వెర్షన్ యిదే. ఆంధ్ర పోలీసులు కూడా దీన్నే చూసినట్లున్నారు. ‘ఫోరెన్సిక్ వారికి పంపడానికి యిది పనికి రాదని, ఒరిజినల్ కావాలని’ ఫకీరప్పగారు అంటున్నారు. ఇది చాలని, దీన్ని పట్టుకునే అమెరికాలో ఓ ఫోరెన్సిక్ సంస్థ ఒరిజినల్ అని సర్టిఫై చేసిందని టిడిపి వారు అంటున్నారు. ‘ఔనా? వారి దగ్గర ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉందా? అడ్రసు చెప్పండి, మేం వారిని సంప్రదిస్తాం’ అనే ఆతృత వైసిపి ప్రభుత్వం చూపడం లేదు. పోనీ అది కాకపోతే వేరే లాబ్‌కు పంపిస్తామన్న ఉత్సాహమూ వారికి లేదు.

వీడియో బయటకు రాగానే ‘అది ఒరిజినల్ అని తేలితే మాధవ్‌పై అనూహ్యమైన తీవ్రమైన చర్య తీసుకుంటాం చూడండి’ అని ప్రకటించిన సజ్జల ఒరిజినలో కాదో తేల్చడానికి యింతకంటె లోతుగా వెళ్లదలచు కోలేదు. పోలీసులే తేల్చలేక పోయారు, మేమేం చేస్తాం? అని చేతులు ముడుచుకుని కూర్చుని, ఎంపీగారిని అచ్చోసి వదిలేశారు. ఇక ఆయన రెచ్చిపోయారు. ఆంధ్ర పోలీసులు ‘ఈ వీడియో ఒరిజినలో కాదో చెప్పగల సాంకేతిక జ్ఞానం మనకు లేదు. అందువలన యిది ఫేకో, కాదో చెప్పలేం’ అంటే ‘ఫేక్ అని తేలిపోయింది’ అర్థం తీసి ఎంపీ గారు అందర్నీ చెడామడా పరమ అసహ్యంగా తిట్టాడు. ఒక కులాన్ని ప్రత్యేకించి తిట్టాడు. అన్నిటికన్న ఘోరం ఒరిజినల్ చూపిస్తా రండి అంటూ ఆహ్వానించాడు. ఆయనంటున్నది వీడియో గురించి కాదని అందరికీ తెలుసు. వీడియో ఫేక్ అయినప్పుడు ఒరిజనల్, డూప్లికేటు ఎలా ఉంటాయి? ఆయన చూపిద్దామనుకున్న ఒరిజినల్ వేరే అయితే దాన్ని చూడడానికి యితరులు పలవరిస్తున్నారని ఆయన అనుకుంటున్నాడా?

ఇలా చూపడం, ఇలా మాట్లాడడం చట్టరీత్యా నేరమా కాదా అనేది న్యాయనిపుణులు చెప్పాలి. కానీ పబ్లిక్ లైఫ్‌లో ఎవరికైనా ఔచిత్యం అనేది ఉంటుంది. ఒక ఎన్నికల టూరులో దేవీలాల్ పర్యటిస్తూ మధ్యలో లఘుశంక కలిగి, వ్యాన్ దిగి రోడ్డు పక్కన నిలబడి మూత్రవిసర్జన చేస్తూంటే ఒక పత్రిక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తే ‘రిలీవింగ్ హిమ్‌సెల్ఫ్..’ అంటూ కాప్షన్ పెట్టి పత్రికలో పేజీ నిండా వేశారు. చూడగానే ఛీ అనిపించింది. అలాటి అవసరం ఆ ఫోటోగ్రాఫర్‌తో సహా ఎవరికైనా కలగవచ్చు. దాన్ని పత్రికలకు ఎక్కించాలా? ‘‘కోతికొమ్మచ్చి’’లో ముళ్లపూడి రమణగారు ఓ జర్నలిస్టు చెప్పినదాన్ని సరదాగా రాశారు. బ్రహ్మానంద రెడ్డిగారు ఏదో జిల్లా పర్యటనకు వెళ్లి వస్తున్నారట. ముందూ వెనకా అనేక కార్లు. పొలాలు బాగా ఉన్నచోట హఠాత్తుగా ఆయన కారు ఆగిందట.

ఏమైందోనని కంగారు పడుతూ కార్లన్నీ ఆగిపోయాయట. ఆయన కారు దిగి పక్కకు వెళ్లబోతూ ఉంటే, వీళ్లూ వెంట వెళ్లబోయారట. ఆయన వీళ్లందరి వైపు తిరిగి దణ్ణం పెట్టి చిటికిన వేలు చూపి పొలాల కేసి వెళ్లారట. ఇవన్నీ మానవసహజాలు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నపుడు యితరుల దృష్టికి వస్తాయి. ఈ ఎంపీ గారు కూడా ఏ పుష్కరాల్లోనే స్నానం చేస్తూండగా తువ్వాలు పక్కకు తొలిగితే, అది కెమెరాల కంటికి చిక్కితే అయ్యోపాపం అనుకోవచ్చు. కానీ యిక్కడ వీడియోలో వ్యక్తి కావాలని వీడియో కాల్ ద్వారా అవతలి వ్యక్తికి ప్రదర్శిస్తున్నట్లు కనబడుతోంది.

ఇది ప్రయివేటు వీడియో కదాని వాదించవచ్చు. కొన్ని ప్రయివేటు వీడియోలు పబ్లిక్‌లోకి వచ్చినా డామేజి జరుగుతుంది. 1977 ఎన్నికలలో జనతా పార్టీ నెగ్గాక ప్రధాని పదవికి ముగ్గురు పోటీ పడ్డారు. మొరార్జీ, చరణ్ సింగ్, ఆఖరి క్షణంలో పార్టీ ఫిరాయించి వచ్చిన జగ్‌జీవన్ రామ్. చరణ్ తప్పుకుని మొరార్జీకి మద్దతు యివ్వడంతో జగ్‌జీవన్‌కు ఛాన్సు మిస్సయింది. నిజానికి అత్యధిక ఎంపీల మద్దతు అతనికే ఉంది. మొరార్జీ మొండిఘటం, వేగడం కష్టం అని వారి భావన. అయితే జగ్‌జీవన్‌పై అవినీతి ఆరోపణలున్నాయి కాబట్టి చరణ్‌కు యిష్టం లేదు. పోనుపోను మొరార్జీ, చరణ్‌ల మధ్య పొసగక ప్రభుత్వానికి ముప్పు వచ్చే ప్రమాదం ఏర్పడడంతో వాళ్లిద్దరినీ తీసేసి జగ్‌జీవన్‌ను చేద్దామా అనే ప్రయత్నాలు జరిగాయి. అయితే జగ్‌జీవన్ కొడుకు సురేశ్ రామ్ స్కాండల్‌తో అంతా నాశనమైంది.

సురేశ్ వివాహితుడు. సుష్మ అనే ప్రియురాలితో కలిసి ఒక గెస్ట్‌హౌస్‌లో సుఖిస్తూ తమ సరదా కోసం పోలరాయిడ్ ఫోటోలు తీసుకున్నాయి. వాటిలో ప్రింటు అప్పటికప్పుడు వచ్చేస్తుంది. ఆ ప్రింట్లు చూసుకుంటూ ఆనందిస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఎలా వచ్చాయో కానీ అవి బయటకు వచ్చి మేనకా గాంధీకి దొరికాయి. ఎమర్జన్సీ టైములో అన్ని పదవులూ అనుభవించి, చివరి క్షణంలో కాంగ్రెసును నట్టేట ముంచి, జనతా పార్టీతో చేతులు కలిపి, ఎన్నికలలో దెబ్బ కొట్టిన జగ్‌జీవన్ అంటే ఇందిర కుటుంబం రగులుతోంది. ఈ ఫోటోలు దొరకగానే మేనక తను ఎడిట్ చేస్తున్న ‘‘సూర్య’’ పత్రికలో ప్రచురించింది. దెబ్బకు అల్లరల్లరి అయిపోయింది. సురేశ్ సుష్మను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. జగ్‌జీవన్ రాజకీయ భవిష్యత్తు నాశనమైంది. దీనిలో జగ్‌జీవన్ పాత్ర లేదు. ఔచిత్యభంగం కలిగిందంతే! ఇద్దరు వ్యక్తులు తమ ఆనందం గురించి తీసుకున్న ఫోటోలను ఎవరికో చూపించడం వలననో ఏమో పుట్టి మునిగింది.

ప్రస్తుత కేసులో ఒక వ్యక్తి తన యింట్లోనే ఉన్నా, వీడియో కాల్‌లో అవతలి వ్యక్తికి అంగప్రదర్శన చేయడం ద్వారా పబ్లిక్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి మాధవో కాదో తేల్చడానికి పోలీసులకు ఆధారం సరిపోకపోవచ్చు. అతనికి శిక్ష పడకపోవచ్చు. ఇప్పటికి మాధవ్‌ను నేరస్తుడు (అది చట్టరీత్యా నేరమైతే) అనలేం కానీ ఆరోపితుడు అనవచ్చు. దానిపై విచారణ చేసే జ్యూరీలో నేను సభ్యుడనైతే ఎలా తర్కిస్తామో అలా తర్కించి చూస్తున్నాను. వీడియో చూస్తే యిది హనీ ట్రాప్ అని తోచదు. బలహీనత కారణంగా హనీ ట్రాప్‌లో పడితే ఆయనకు వ్యక్తిగతంగా నష్టం. పదవిని దుర్వినియోగం చేస్తే ప్రజలకు నష్టం. ఎవరైనా మహిళను వేధిస్తే అది నేరం. టిడిపి వాళ్లు ఆ లైన్ తీసుకుని రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలన్నిటికీ, దీనికీ లింకు పెట్టేస్తున్నారు. మహిళా కమిషన్ ఏం చేస్తోందని గద్దిస్తున్నారు.

వీడియోలో మాటలేవీ వినబడటం లేదు కాబట్టి సంభాషణను ఊహించుకోవలసినదే. ఆ వ్యక్తి మొహం చూస్తే ఇది రాసలీల తాలూకు ముచ్చట అనిపించదు. మొహంలో శృంగారమో, కొంటెతనమో మరోటో నాకు కనబడలేదు. ఎవరినో బెదిరిస్తూనో, వారి మీద చికాకు పడుతూనో ఉన్నట్లుంది. మొరటుతనంతో నేనెంత ఘనుడినో చూడు అంటూ అంగప్రదర్శన చేసినట్లుంది. కోపం కొద్దీ మధ్యలో జిప్ తీసినట్లు లేదు. జిప్ విప్పదీసి తిరుగుతున్నట్లుంది. తన భావాన్ని వ్యక్తీకరించడానికి హస్తచాలనం చేసినట్లుంది. అవతలి వ్యక్తిపై ఆధిపత్య ధోరణి కనబడింది. ఆ వ్యక్తి ఈయనకి బాకీ ఉన్నారో, చెప్పిన పని చేయలేదో, ఏదో అలాటి వ్యవహారంగా తోస్తోంది.

ఇదేదో యిద్దరు ప్రయివేటు వ్యక్తుల మధ్య వ్యవహారమైతే మనం చర్చించనక్కరలేదు. కానీ దీనిలో యిరుక్కున్నది ఒక ఎంపీ. 13.40 లక్షల మంది ఓటర్లకు ప్రజాప్రతినిథి. మన జీవితాలను శాసించే చట్టాలను తయారు చేసే పార్లమెంటులో సభ్యుడు. ఈయన యిప్పటిదాకా పార్లమెంటు చర్చల్లో ఎన్నిటిలో పాల్గొన్నాడో, ప్రజాహితం కోరి ఎన్ని ప్రశ్నలు వేశాడు తెలియదు కానీ ఆయన ప్రజాధనంతో సకల సౌకర్యాలు పొందుతున్నాడు. ఆయన కిచ్చే నెల జీతం, పెన్షన్‌ నిధితో పాటు అనేకానేక ఎలవెన్సులు, ప్రయాణపు ఖర్చులు, ఫోన్ ఖర్చులు, సెక్యూరిటీ ఖర్చులు అన్నీ మనమీద రుద్దుతున్నారు. అలాటి వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలి? ఎంత హుందాగా ఉండాలి? వీడియో కాల్స్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆరోపణ రాగానే బూతులు లంకించుకోవడమా? కులం కార్డు వాడుకోవడానికి చూడడమా?

అసలు యీ చేష్టలకు, కులానికి సంబంధం ఏముందో తలకాయ బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. కులసంఘం వాళ్లు మద్దతుగా నిలబడడమేమిటి? దిల్లీ నుంచి వస్తే ఊరేగింపుగా తీసుకెళ్లడమేమిటి? ఆయన చేసిన ఘనకార్యమేమిటి? పోనీ వీడియో ఫేక్ అనుకున్నా, ఆయన ఆడిన దుర్బాషల మాటేమిటి? అటువంటివాడు తమ కులానికి చెందినవాడని గర్విస్తున్నారా? అయినా ఆ కులం ఓట్లతో మాత్రమే ఆయన గెలిచాడా? ఆ నియోజకవర్గంలో జగన్ వేవ్ ప్రభావం, టిడిపి పట్ల వ్యతిరేకత ఏమీ లేదా? కమ్మలను యింత తిడుతున్నాడు. వాళ్లెవరూ ఆయనకు ఓట్లేయలేదా? నియోజకవర్గ ప్రతినిథిగా వాళ్ల ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత ఆయనకు లేదా? అచ్చన్నాయుడిపై కేసు రాగానే బిసిలపై దాడి అని చంద్రబాబు అన్నట్లుగానే యీ ఆరోపణ రాగానే బిసిలపై దాడి అనే లైను తీసుకుంటే ఎలా?

టిడిపి దీన్ని అస్త్రంగా చేసుకుని మాధవ్‌ను కీచకుడి రూపంలో చూపిద్దామని చూస్తోంది. ఇలాటి వాటిని తిప్పికొట్టడానికి వైసిపి వద్ద ఉన్న ఏకైక అస్త్రం, లోకేశ్ అమ్మాయిలతో ఉన్న ఫోటోలు! అవి అతను ప్రజాజీవితంలోకి రావడానికి ముందువనుకుంటాను. అదే అయితే అది ప్రయివేటు వ్యవహారం. ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉండగా అటువంటి చేష్టలు చేస్తే గర్హనీయమే. పృథ్వీ ప్రజాధనంతో సౌకర్యాలు అనుభవిస్తున్న దశలో యిలాటి ఆరోపణ వచ్చింది కాబట్టి పార్టీ శిక్షించిందనుకోవాలి. మరి మాధవ్ కేసులో పార్టీ డిఫెన్స్ లోంచి అఫెన్స్ లోకి ఎందుకు వెళ్లింది? సస్పెండు చేయకపోతే పోయె, కనీసం మందలించలేదే!

అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే యిదంతా ఎందుకు జరుగుతోంది? పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిథుల్లో రసికులు లేరా? లేరని ఎలా అంటాం? ఎటొచ్చీ వాళ్లకు ఔచిత్యం తెలుసనుకోవాలి. గుట్టు రట్టు కాకుండా హుందాగా వ్యవహారం చక్కబెట్టుకోవడం తెలుసనుకోవాలి. ఆంధ్రలో మాత్రం ఏం చేసినా చెల్లుతుందని ధీమా ప్రజా ప్రతినిథులకు ఉన్నట్లుంది. వారిలో 86 శాతం మంది వైసిపి వారే కాబట్టి, ఆ పార్టీయే యీ పతనానికి బాధ్యత వహించాలి. ఓడిపోయినవాళ్లు ఉక్రోషం కొద్దీ నోరు పారేసుకోవచ్చు. కానీ విజేతలు హుందాగా ఉండాలని, ఔదార్యం చూపాలని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు గోరంట్ల వ్యవహారంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ యిచ్చి వెనకేసుకుని రావచ్చు. ఏ చర్యా తీసుకోకపోవచ్చు. కానీ తనకు వైకేరియస్ లయబిలిటీ ఉంటుందని జగన్‌ గ్రహించాలి. జగ్‌జీవన్ రామ్ కథను నేను ఊరికే చెప్పలేదు. కొడుకు శృంగారానికి భారీ మూల్యమే చెల్లించాడాయన. వీడియో ఫేక్ అని నమ్మి ఊరుకున్నా, బహిరంగంగా వాడిన దుర్బాషలకు క్షమాపణ చెప్పించలేదేం?

ఏ చర్య తీసుకున్నా, అతను రిజైన్ చేస్తానని బెదిరించాడా? చేస్తే, ఉపయెన్నిక వస్తే గెలవలేమనే భయం వైసిపికి ఉందా? ఇప్పటిదాకా రాష్ట్రంలో ఏ ఉపయెన్నికలోనూ టిడిపి గెలవలేదు. మాధవ్ చేష్టల పట్ల ప్రజావ్యతిరేకత ఉందని సర్వేలో తేలితే వైసిపి అభ్యర్థిని మార్చి గెలవవచ్చు. ఏ చర్యా తీసుకోకుండా వదిలేస్తే ప్రజలు మర్చిపోతారనుకునే భ్రమలో వైసిపి ఉందా? దిద్దుబాటు చర్యలు తీసుకునే వరకు ప్రతిపక్షాలు చెలరేగిపోతూ ప్రజలు మర్చిపోకుండా చూస్తూంటాయి. ఏహ్యత కలిగించే యీ సబ్జక్టును టిడిపి సాగదీస్తోంది. ఈ వీడియోకు, మహిళలపై అత్యాచారాలకు ముడిపెట్టి రచ్చ చేద్దామని చూస్తోంది. ఈ క్రమంలో మహిళా నాయకురాళ్లు బ్యాక్‌గ్రౌండ్, ఫ్రంట్‌గ్రౌండ్ అంటూ సభ్యత మరిచి, హద్దు మీరి మాట్లాడుతున్నారు. మన సెన్సిటివిటీపై వీడియోలో వ్యక్తి విజువల్‌గా దాడి చేస్తే, యీ మహిళా నేతలు వెర్బల్‌గా దాడి చేస్తున్నారు.

టీవీ 5 యాంకర్ వీడియోలో ప్రదర్శింపబడిన అవయవం తన భర్తదో కాదో చెప్పాలని గోరంట్ల భార్యకు పబ్లిక్‌గా విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు ఎంత హేయంగా తయారయ్యాయో చూడండి. రోత రాజకీయాలకు పాల్పడేవారికి చెక్ పెట్టకపోతే ఆంధ్ర రాజకీయం గోప్యాంగాల చుట్టూనే తిరుగుతుంది. గోరంట్ల వీడియోను అంశంగా చేయడం వలన టిడిపి బిసిలకు దూరమై పోతోందని సాక్షి టీవీ మహా యిదై పోతోంది. అక్కడికి మాధవ్ ఒక్కడే సమస్త బిసిలకు ప్రతినిథి అయినట్లు! బిసి, ఓసి, ఎస్సీ ఎవరైనా సరే అసహ్యించుకునే ప్రవర్తన ఆయనది. దాన్ని ఖండించడం వలన టిడిపి కొన్ని బిసి ఓట్లు నష్టపోయినా ఏం ఫర్వాలేదు. పబ్లిక్ లైఫ్‌లో డీసెన్సీ నిలబెట్టుకోవడానికి త్యాగం చేశామని చెప్పుకోవచ్చు. దానితో పాటు తన పార్టీ నాయకుల నోళ్లకు కూడా తాళాలు వేస్తే నేను టిడిపిని ప్రశంసిస్తాను. అక్కడ నాకు ఓటు లేదు కాబట్టి, విరాళం పంపిస్తాను.

పట్టాభి ముఖ్యమంత్రిపై నోరు పారేసుకున్నపుడు కేసు పెట్టిన వైసిపి ప్రభుత్వం యిప్పుడీ మాధవ్‌పై కూడా కేసు పెట్టకపోతే ‘ముఖ్యమంత్రిని మాత్రం ఎవరూ ఏమనకూడదు, ప్రతిపక్ష నాయకుణ్ని మాత్రం ఏమైనా అనవచ్చని ఆ పార్టీ అనుకుంటోంది’ అనే సందేశం ప్రజల్లోకి వెళుతుంది. తొడగొట్టడాలు, ఆడది కనబడితే కడుపు చేసేయాలనే ప్రలాపాలు వగైరాలు జనం హర్షించలేదు కదా! ఉపయెన్నికలలో కాదు కదా, స్థానిక ఎన్నికలలో కూడా టిడిపిని గెలిపించటం లేదు కదా! మేమూ వాళ్లలాగే ఉంటామని, వాళ్ల కంటె నాలుగు అవాచ్యాలు ఎక్కువ వల్లిస్తామని వైసిపి వాళ్లనుకుంటే మర్యాద, ప్రజాదరణ పోగొట్టుకుంటారని గ్రహించాలి. వంశీ భువనేశ్వరిగారికి క్షమాపణ చెప్పిన రీతిలో మాధవ్ తన వాచాలత్వానికి క్షమాపణ చెప్పుకునే వరకు వైసిపి దోషిగానే నిలబడుతుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?