cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఇరాకీ ట్రైబల్ లీడర్నీ మురిపించిన ఆశా పారేఖ్

ఎమ్బీయస్‍:  ఇరాకీ ట్రైబల్ లీడర్నీ మురిపించిన ఆశా పారేఖ్

2004 జులైలో బ్లాక్ బ్యానర్ అనే ఇరాకీ గెరిల్లా సంస్థ ఇరాక్ గడ్డపై పని చేసే యితర దేశాల సంస్థలపై దాడి చేస్తూండేది. కువాయిత్ గల్ఫ్ లింక్ ట్రాన్స్‌పోర్ట్ అనే కంపెనీ వారి వాహనాలపై దాడి చేసి దానిలో వున్న డ్రైవర్లను కిడ్నాప్ చేసి, విడుదల చేయాలంటే తమ డిమాండ్లు తీర్చాలని షరతులు పెట్టింది. ఆ డ్రైవర్లు భారతీయులు కావడంతో మనకు చిక్కొచ్చింది. ప్రభుత్వం కిడ్నాపర్లతో బేరసారాలు సాగించడానికి ప్రయత్నించింది. ఇరాక్‌లోని 16,500 మంది ట్రైబల్ లీడర్లకు అధినేతగా వున్న షేక్ హిషామ్ దులైమీ అనే ఇరాకీ ప్రముఖుణ్ని కిడ్నాపర్లు తమ మధ్యవర్తిగా వుండమని కోరారు. అతని మాటకు ఇరాక్‌లో ఎదురే లేదని ప్రతీతి. ‘‘ఔట్‌లుక్’’ పత్రిక ప్రతినిథి అతన్ని కలిసి మాట్లాడినప్పుడు అతను అనేక విషయాలు ముచ్చటిస్తూ హిందీ సినిమాలంటే తనకు యిష్టమని చెప్పాడు. తన అభిమాన నటి ఆశా పారేఖ్ అని చెప్తూ ‘ఆమె కనుక నాకు ఒక్కసారి ఫోన్ చేసి రిక్వెస్టు చేస్తే బందీలు యీ రోజే విడుదలయ్యేట్లు చూస్తాను.’ అన్నాడు.

అతనికి అంతగా పిచ్చెక్కించిన ఆశా పారేఖ్ ఎవరు? 1998-2001 మధ్య సెన్సార్ బోర్డు చైర్‌పర్శన్‌గా వుండి వివాదాల్లో యిరుక్కుంది కాబట్టి కొందరికి తెలుసేమో కానీ, పాఠకులలో చాలామందికి తెలిసి వుండకపోవచ్చు. 1942లో పుట్టిన ఆమె 1959 నుంచి ఇరవై యేళ్ల పాటు గ్లామర్ క్వీన్‌గా వెలిగింది. మన పాత్రికేయులు శోకపాత్రల్లో రాణించిన వారి గురించే ఎక్కువగా రాస్తూంటారు కాబట్టి హుషారైన పాత్రల్లో రాణించిన ఆశా గురించి పెద్దగా ఎవరూ రాయలేదు. చివరకి ఆమే ‘‘ద హిట్ గర్ల్’’ పేర ఆత్మకథ రాసుకుంది. నిజంగా ఆమె సినిమాలన్నీ హిట్సే. ఆనాటి హీరోయిన్లందరి కంటె ఎక్కువ పారితోషికం తీసుకుందామె. ఎన్నో మంచిమంచి పాటలు ఆమెపై చిత్రీకరించబడ్డాయి. అందమైన చిలిపిపిల్లగా కనిపించడం, హాయిగా చిందేయడం తప్ప ఆమెకు పెద్దగా నటనేమీ రాదు అనుకునేవాళ్లు ‘‘కటీ పతంగ్’’, ‘‘మై తులసీ తేరే ఆంగన్‌కీ’’ వంటి సినిమాల్లో ఆమె గంభీరమైన నటన చూసి ముక్కున వేలేసుకున్నారు.

ఆశా తండ్రి బచ్చూభాయ్ పారేఖ్ గుజరాతీ హిందువు. తల్లి సల్మా బోరా ముస్లిము. పెళ్లయ్యాక సుధ అని పేరు మార్చుకుంది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంది. క్విట్ ఇండియా ఉద్యమంలో జోరుగా పాల్గొంటున్నపుడు అక్టోబరు 2న ఆశా పుట్టింది. నేను 1974లో భావనగర్ వెళ్లినపుడు ‘100 కి.మీ.ల దూరంలో కశ్మీర్ ఆఫ్ సౌరాష్ట్రగా పేరుబడిన మహువా అనే వూరుంది.’ అని చెపితే అక్కడకు వెళ్లాను. ఊరేమీ గొప్పగా లేదు. చూడ్డానికి ఏముంది? అని అడిగితే ఆశా పరేఖ్ పుట్టిన యిల్లుంది అన్నారు. సరే,  అభిమాన నటి యిల్లు కదాని చూడబోతే అతి సాధారణంగా వుంది. ఆమె బొంబాయిలోనే పెరిగి, అక్కడే స్థిరపడింది. తల్లి చిన్నపుడే ఆమెకు నృత్యం నేర్పించింది. సినిమాల్లో బాలనటిగా చేర్పించింది. ఆమె నృత్యప్రదర్శన చూసిన బిమల్ రాయ్ తన ‘‘మాఁ’’ (1952) సినిమాలో ఛాన్సిచ్చాడు. ఆయనే ‘‘బాప్ బేటీ’’ (1954)లో కూడా వేసింది. తర్వాత విజయ్ భట్ తీసిన ‘‘చైతన్య మహాప్రభు’’ (1954)లో కూడా వేసింది.

నృత్యం బాగా నేర్చుకుంటే అవకాశాలు బాగా వస్తాయని, బాలపాత్రలు వేస్తూనే అనేక మంది గురువుల దగ్గర నేర్చుకుంది. నటిగా ఎస్టాబ్లిష్ అయ్యాక కూడా ప్రముఖుల వద్ద నేర్చుకుంటూ కథక్‌లో ప్రావీణ్యత సంపాదించింది. అప్పట్లో వైజయంతీమాల, వహీదా, పద్మిని వంటివారు భరతనాట్యంలో దిట్టలు. వారికి భిన్నంగా కథక్‌లో యీమె పేరు తెచ్చుకుంది. అందువలన సినిమాల్లో వెస్టర్న్ డాన్స్ చేయవలసినప్పుడు అవలీలగా చేసేసేది. విజయ్ భట్ ‘‘గూంజ్ ఉఠీ షహనాయీ’’ (1959) సినిమా ప్లాను చేస్తూ రాజేంద్ర కుమార్ సరసన కొత్త హీరోయిన్‌కు అవకాశ మిద్దామనుకున్నాడు. ఆశా వెళితే స్క్రీన్ టెస్టు చేసి, నీకు స్టార్ మెటీరియల్ లేదు పొమ్మన్నాడు. అప్పటికే హీరోయిన్ అయిన అమితాను సెలక్ట్ చేశాడు. కొన్నాళ్లు పోయాక చూస్తే అమితా వెనకబడి పోయింది. ఆశా స్టార్‌గా వెలిగిపోయింది.

1958 ప్రాంతాలలోనే ఫిల్మిస్తాన్ సంస్థ అధిపతి శశధర్ ముఖర్జీ నుంచి పిలుపు వచ్చింది. వాళ్ల సంస్థలోనే రచయితగా వున్న నాసిర్ హుస్సయిన్‌ (హీరో ఆమీర్ ఖాన్‌కు పెదతండ్రి) కు ముఖర్జీ ‘‘తుమ్‌సా నహీ దేఖా’’ (1957) సినిమాతో దర్శకత్వం ఛాన్సిచ్చాడు. శమ్మీ కపూర్, అమితా హీరోహీరోయిన్లగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాతి సినిమాగా ‘‘దిల్ దేకే దేఖో’’ (1959) ప్లాన్ చేశారు. శమ్మీని హీరోగా కొనసాగిస్తూ వహీదాను తీసుకుందామా, సాధనాను తీసుకుందామా అని ఆలోచిస్తూ వుంటే ఆశాను స్క్రీన్ టెస్ట్ చేసిన నాసిర్ ఆశాకే మొగ్గు చూపాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక అప్పణ్నుంచి నాసిర్, ఆశాను హీరోయిన్‌గా నమ్ముకున్నాడు. సొంత బ్యానర్ పెట్టి ఆమెతో ఏక్‌దమ్ ఐదు సినిమాలు తీశాడు.

దేవ్ ఆనంద్‌తో ‘‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’’ (1961), జయ్ ముఖర్జీతో ‘‘ఫిర్ వహీ దిల్ లాయా హూఁ’’ (1963),  శమ్మీ కపూర్‌తో ‘‘తీస్రీ మంజిల్’’ (1966), రాజేశ్ ఖన్నాతో ‘‘బహారోంకె సప్నె’’ (1967), శశి కపూర్‌తో ‘‘ప్యార్ కా మౌసమ్’’ (1969) జితేంద్రతో ‘‘కారవాఁ’’ (1971).. అన్నీ లైట్ రొమాంటిక్ మ్యూజికల్సే, అన్నీ బాక్సాఫీసు హిట్లే. 12 ఏళ్ల పాటు సాగిన యీ ప్రస్థానంలో నాసిర్, ఆశా వ్యక్తిగతంగా కూడా దగ్గరయ్యారు. నాసిర్ అప్పటికే వివాహితుడు. మార్గరెట్ అనే నృత్యదర్శకురాల్ని ప్రేమించి పెళ్లాడి వున్నాడు. ఆశా అతన్ని పెళ్లాడాలా లేదా అని చాలాకాలం ఊగిసలాడి, చివరకు అతని కుటుంబాన్ని భగ్నం చేయడమెందుకని ఆగిపోయింది. కొంతకాలానికి అమెరికాలో ఓ ఇండియన్ ప్రొఫెసర్‌ను చేసుకుందామనుకుంది. కానీ అతను పెళ్లయినా తన గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచిపెట్టనని చెప్పడంతో అతన్ని వదులుకుంది, అవివాహితగానే మిగిలింది.

చాలాకాలం పాటు నాకు అజ్ఞాత బాయ్‌ఫ్రెండ్ వున్నాడు అని చెప్పుకునేది కానీ నాసిర్ మరణానంతరం వెలువరించిన తన ఆత్మకథలో ఆ బాయ్‌ఫ్రెండ్ నాసిరే అని చెప్పేసింది. ‘‘కారవాఁ’’ తర్వాత నాసిర్ ‘‘యాదోఁ కీ బారాత్’’ (1973) సినిమా నుంచి వేరే వాళ్లను హీరోయిన్లగా తీసుకున్నా, ఆశాతో స్నేహం వదులుకోలేదు. ‘‘బహారోం కె సప్నే’’ సినిమా నుంచి ఆమెను ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో దింపాడు. ‘మూవీ జెమ్’ పేరుతో ఆమె 14 ఏళ్ల పాటు 21 సినిమాలు పంపిణీ చేసి, బాగానే గడించింది. నాసిర్ ‘‘మంజిల్ మంజిల్’’ (1984)లో ఓ అతిథి పాత్ర వేసింది కూడా. అతని తమ్ముడు తాహిర్ హుస్సేన్ తీసిన ‘‘జఖ్మీ’’ (1975) సినిమాలో నటించింది.

నాసిర్ సినిమాల్లో వేస్తూనే యితరుల సినిమాల్లో కూడా వేసింది. ప్రమోద్ చక్రవర్తి తను తీసిన ‘‘జిద్దీ’’ (1964), ‘‘లవ్ ఇన్ టోక్యో’’ (1966)లలో మంచి పాత్రలు యిచ్చాడు. శక్తి సామంత ‘‘పగ్లా కహీఁ కా’’ (1970), లో క్లిష్టమైన పాత్ర యివ్వడంతో బాటు ‘‘కటీ పతంగ్’’ (1970)లో  వితంతువు పాత్ర నిచ్చాడు. దానికి ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ ఎవార్డు వచ్చింది. రాజ్ ఖోస్లా ‘‘దో బదన్’’ (1966), ‘‘చిరాగ్’’ (1969)లలో గంభీరమైన పాత్రలిచ్చాడు. ‘‘మేరా గాఁవ్ మేరా దేశ్’’ (1971) లో మంచి పాత్ర యిచ్చాడు. ‘‘మై తులసీ తేరే ఆంగన్ కీ’’ (1978)లో యిచ్చిన పాత్ర ఆమెకు చాలా పేరు తెచ్చింది. 1992లో పద్మశ్రీ అవార్డు రావడానికి దోహదపడింది. తను దిలీప్ కుమార్‌తో తప్ప ఆనాటి అగ్రహీరోలందరితో వేసింది. రాజ్ కపూర్‌తో వేసిన ‘‘చోర్ మండలి’’ సినిమా విడుదల కాలేదు.

పైన ఉదహరించిన సినిమాలు కాకుండా ఆమె వేసినవాటిల్లో చెప్పుకోదగ్గవి – ‘‘ఘూంఘట్’’ (1960), ‘‘ఘరానా’’ (1961), ‘‘మేరీ సూరత్ తేరీ ఆంఖేఁ’’ (1963), ‘‘భరోసా’’ (1963), ‘‘ఆయే దిన్ బహార్‌కే’’ (1966), ‘‘ఉప్‌కార్’’ (1967), ‘‘షికార్’’ (1968), ‘‘కన్యాదాన్’’ (1968), ‘‘సాజన్’’ (1969), ‘‘మహల్’’ (1969), ‘‘ఆయా సావన్ ఝూమ్‌కే’’ (1969), ‘‘భాయ్‌భాయ్’’ (1970),  ‘‘జవాన్ మొహబ్బత్’’ (1971), ‘‘నాదాన్’’ (1971), ‘‘సమాధి’’ (1972), ‘‘హీరా’’ (1973), తెలుగు మనుషుల్లో దేవుడు రీమేక్ ‘‘ఉధార్ కా సిందూర్’’ (1976), ‘‘ప్రేమ్ వివాహ్’’ (1979).

హిందీరంగంలో వేసేవారు ప్రాంతీయ సినిమాల్లో వేయడం పరువుతక్కువగా భావిస్తారు. కానీ ఆశా తన కెరియర్ పీక్‌లో వుండగానే ‘‘అఖండ్ సౌభాగ్యవతి’’ (1963) అనే గుజరాతీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో వేసింది. తర్వాత ‘‘కంకణ్ దే ఓహ్‌లే’’ (1971). ‘‘లంబార్దారిణీ’’ (1976) అనే పంజాబీ సినిమాలలో కూడా వేసింది. ‘‘శరవేగద సర్దార’’ (1989) అనే కన్నడ సినిమాలో కూడా! హీరోయిన్ పాత్రలు తగ్గిపోయాక కొన్ని సినిమాల్లో కారెక్టరు పాత్రలు వేసింది కానీ తనకు తృప్తి నీయలేదు. వాటిలో ‘‘మానవుడు-దానవుడు’’ రీమేక్ ‘‘ఆధా దిన్ ఆధీ రాత్’’ (1977) ఒకటి. దాంతో టెలివిజన్ వైపు దృష్టి మరల్చింది. 1990లలోనే ‘‘జ్యోతి’’ అనే గుజరాతీ టీవీ సీరియల్‌ను డైరక్టు చేసింది. ఓ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి అనేక హిందీ సీరియల్స్ నిర్మించింది. డాన్సింగ్ స్కూలు పెట్టి అనేక బ్యాలేలు ప్రదర్శించింది.

వీటితో బాటు హిందీ సినీపరిశ్రమకు సంబంధించిన అనేక సంస్థల్లో పదవులు అలంకరించింది. 1994లో ఆర్టిస్టుగా రిటైరై పోయాక, 2000 వరకు సినీ ఆర్టిస్ట్‌స్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా, సెన్సార్ బోర్డుకు చైర్‌పర్శన్‌గా, సినీ, టీవీ ఆర్టిస్ట్‌స్ అసోసియేషన్కు కోశాధికారిగా చేసింది. ఆమెకు చాలా అవార్డులే వచ్చాయి. ప్రస్తుతం ఒక డాన్స్ ఎకాడమీని నడుపుతోంది. శాంతాక్రూజ్‌లో తన పేర ఉన్న ఆశా పారేఖ్ హాస్పటల్ నిర్వహణ చూసుకుంటోంది. తన స్నేహితురాళ్లు వహీదా, హెలెన్, బిందు యిత్యాదులతో కలిసి విహారయాత్రలు చేస్తూ 79 ఏళ్లు నిండినా ఆరోగ్యంగా వుంది. ఆమెపై చిత్రీకరించిన కొన్ని సినిమా పాటల లింక్స్ క్రింద యిస్తున్నాను. వీలుంటే చూడండి. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

mbsprasad@gmail.com

‘‘ఫిర్ వహీ దిల్ లాయా హూఁ’’ (1963)లో ‘ఆంఖోంసే జో ఉతరీ’, 

‘‘జిద్దీ’’ (1964) లో ‘రాత్ కా సమా’ ,

‘‘మేరే సనమ్’’ (1965) లో ‘జాయియే..’ ,

‘‘తీస్రీ మంజిల్’’ (1966) లో ‘ఆజా ఆజా’ ,  

‘‘ఆన్ మిలో సజనా’’ (1970) లో అచ్ఛా తో హమ్ చల్‌తే హై’ 

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు