Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: యండమూరి ‘అష్టావక్ర’ 02

ఎమ్బీయస్: యండమూరి ‘అష్టావక్ర’ 02

దీని ముందుభాగం యండమూరి ‘‘అష్టావక్ర’’ 01లో చదవవచ్చు. రంజిత కోలుకున్నాక తను విన్నమాటలు భర్త రవికి అప్పజెప్పింది. అష్టావక్ర పదాన్ని అవతార్ బాబా దగ్గర కూడా విన్నాడు కదా, ఈ టేపులోనే అదే మాట! తర్వాత తన తండ్రిది హత్యేమో అని రవికి అనుమానం వచ్చింది. అప్పుడున్న నౌకర్లమీదకు అనుమానం వచ్చి వాకబు చేస్తే వాళ్లలో ఒకడు కృష్ణాపురం వెళ్లాడని తెలిసింది. ఈ అవతార్ బాబాకు ఈ ఘోరాలకు లింకుందని అనిపించింది. ఓ రోజు కృష్ణాపురం వెళ్లాడు. అవతార్ బాబా ఆశ్రమం గోడ మీద కనపడీ పడనట్టు ‘ఉస్సోక్' అని రాశాడు. రెండు రోజులు పోయాక ఒకతను దాన్ని చూసి ఉలిక్కిపడడం గమనించాడు. అతని వద్దకు వెళ్లి 'ఉస్సోక్' అన్నాడు. అతను నిర్మానుష్యమైన చోటుకి తీసుకెళ్లి 'ఏమిటి? మళ్లీ మీటింగా?” అన్నాడు. 'నేను చేరాలనుకుంటున్నాను' అన్నాడు. 'మిత్రమా నువ్వు అదృష్టవంతుడివి. అష్టావక్రుడు కొద్దిరోజుల్లో జన్మించబోతున్నాడు. కాష్మోరాని నమ్మనివాళ్లు ఊచకోత కోయబడతారు. నువ్వు ఆఖరి క్షణాల్లో బుద్ధి మార్చుకుని యిటు వచ్చావు.' అన్నాడు.

అష్టావక్ర మాట వినగానే షాడో ఉలిక్కిపడ్డాడు. అంటే నిజంగా తన చెల్లి కడుపున ఒకడు పుట్టడం, వాడు పుట్టగానే యీమె చావడం ఖాయమా? అనుకున్నాడు. దాంతో ప్రాడో లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తిరగేశాడు. అష్టావక్ర గురించి తంత్ర పుస్తకాల్లో రాసినది తెలుసుకున్నాడు. షాడో తను ఉస్సోక్ లో చేరడానికి నిశ్చయించుకుని రంజిత యిచ్చిన వాచీ పెట్టుకుని వెళ్లాడు. రాకేష్‌కి జరిగినట్టే యితనికీ అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. కానీ యితను తన ఉద్దేశ్యాలను దాచగలిగాడు. ఎలా అంటే రంజిత యిచ్చిన వాచీ ద్వారా. ఉస్సోక్ వాళ్ల గదిలో మంత్రతంత్రాలు ఏమీ లేవు. ప్రకంపనాలు సృష్టించి మనస్సును ప్రభావితం చేస్తారు. ఇతని వాచీ రెండు అడుగుల మేర యింకో మాగ్నటిక్ ఫీల్డు సృష్టించి, ఆ ప్రకంపనాలు పనిచేయకుండా చేసింది. అలాగే రంజిత బంధింపబడినప్పుడు కూడా యితను స్విచ్చి ఆఫ్ చేసేసి ఆమెపై కూడా యిది పని చేయకుండా చేస్తాడు.

ఇక్కడ గౌరి యింటికి ఓ యోగీశ్వరుడు వచ్చి ఈమె పొట్టకేసి చూసి, కాష్మోరా భూమ్మీదకు రాకుండా చేయాలంటే బ్రహ్మయజ్ఞం చేయాలి అంటూ వెళ్లిపోయాడు. ఆమె పట్టించుకోలేదు కానీ కొన్ని రోజులకు మొగుడు సిద్ధార్ధకు చెప్పింది. అతనికి నమ్మకాలు బాగానే వున్నాయి. భయం పట్టుకుంది. ఈ కృష్ణాపురంలో వుంటే వికృతరూపుడు పుట్టడం ఖాయం అనుకుని ఊరు వదలి వెళ్లిపోదామన్నాడు. కానీ గౌరి 'నాకు డాక్టర్ రంగప్రసాద్ పై నమ్మకం. నేను యిక్కడే పురుడు పోసుకుంటాను' అని పట్టుబట్టింది. మాటల్లో అతనెవడో వచ్చి హెచ్చరించిన సంగతి చెప్పింది. ఇక సిద్ధార్థ అతన్ని వెతుకుతూ ఊళ్లమీద పడ్డాడు. ఆ స్వామి ఒక్కడే అష్టావక్ర పుట్టకుండా ఆపగలడని అతని నమ్మకం. అతను హిమాలయాల్లో వున్నాడని ఎవరో చెబితే యితను అక్కడకు వెళ్లాడు. అక్కడకు రాకేష్ కూడా వచ్చాడు. సిద్ధార్థను చంపమని మహాదష్ట పంపించాడతన్ని.

హిమాలయాల్లో ఎక్కడో శిఖరాల పై వుండగా వాళ్లను తీసుకు వెళుతున్న షెర్పా హఠాత్తుగా తెలుగు మాట్లాడడం మొదలెట్టాడు. 'రాకేష్, నిన్నూ, సిద్ధార్థనూ యిద్దర్నీ చంపేయమని మహాదష్ట ఆదేశించారు' అంటూ పిస్టల్ పేల్చబోయే సరికి, అంతలోనే అవలాంచీ, అంటే హిమపాతం వచ్చిపడింది. అతను క్షణాల్లో మంచులో కూరుకుపోయి మరణించాడు. తను ఎటువంటి విషవలయంలో యిరుక్కున్నానో రాకేష్‌కు అర్ధమైంది. రాకేష్ నిజస్వరూపం తెలిసినా సిద్ధార్థ అతనికి సహాయం చేయబోయాడు. దానితో రాకేష్ పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. మంచు పడి అతని కాళ్లు చచ్చుబడ్డాయి. లోకాన్నే శాసిద్దామనుకున్న అతను దిక్కుమాలిన పరిస్థితిలో మరణించాడు. రాకేష్ చచ్చిపోతూ పోతూ అష్టావక్రను ఆపడానికి మార్గం ఏమిటో సిద్ధార్ధకు తెలియపరచాడు. మహాదష్టకు తెలియకుండా విషాచి సమాధి వద్ద తను దాచేసిన కాగితంలో ఆది వుందన్నాడు.

దాని ప్రకారం హైదరాబాదులోని పాతబస్తీలో వున్న ఓ సూఫీ యోగిని వద్ద మంత్రం నేర్చుకోవాలి. సిద్ధార్థ ఆగమేఘాల మీద పాతబస్తీకి వచ్చి వాళ్లను ఆశ్రయించాడు. ఆ సూఫీ మంత్రం కాగితంపై కలంతో రాయకూడదని యోగిని అంటే ‘అయితే నా శరీరం మీద కత్తితో రాయండి’ అన్నాడు. తన భార్య పురుటి సమయానికి ఆమె వద్దకు చేరబోయాడు. ఈ లోపున యీ మిస్టరీ టెక్నికల్‌గా చాలానే విడిపోయింది. ఇప్పటిదాకా చెప్పినది క్షుద్రవిద్యల గురించి కదా. దీనిలో వున్న జెనటిక్ యాంగిల్ గురించి కాస్త చెబుతాను. ఇందాకా రంగప్రసాద్ కేసు గురించి చెప్పాను కదా. అతని తండ్రి వీర్యం ద్వారా అతను పుట్టి వుంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ బై హస్బండ్, ఎఐఎచ్ అంటారు. భర్త వీర్యంలో బొత్తిగా శుక్లకణాలు లేకపోతే భార్య గర్భం దాల్చలేదు కదా, అటువంటప్పుడు వేరెవరిదైనా వీర్యం సంపాదించి ఈమెలో ప్రవేశపెడతారు. దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ బై డోనార్, ఎఐడి, అంటారు.

అయితే ఈ డోనార్ ఎవరో తెలిస్తే ఒక యిబ్బంది, తెలియకపోతే మరో యిబ్బంది. తెలిస్తే మనసులో ముల్లు గుచ్చుకుంటూ వుంటుంది. తెలియకపోతే వాడికి ఏ రోగాలు వున్నాయో, బుద్ధి ఎలాటిదో అన్న భయాలు వుంటాయి. నవలంతా ఈ పాయింటు మీదనే తిరుగుతుంది. రంగప్రసాద్ కేసులో ఎఐఎచ్ అనుకున్నది ఎఐడి కావడంతో అతని జీవితం దుర్భరం అయింది. కానీ ఎఐడి ఆమోదించేవాళ్లు కూడా చాలామంది వున్నారు. ‘‘విక్కీ డోనార్’’ సినిమా వచ్చాక స్పెర్మ్ డొనేషన్ గురించి చాలామందికి తెలిసింది కానీ నవల రాసే సమయానికి ఆ సినిమా రాలేదు. అందుకని కొన్ని వివరాలు యిచ్చారు రచయిత. 1957 నాటికే ఈ ఎఐడి వల్ల పుట్టిన పిల్లలు అమెరికాలో లక్ష మంది వున్నారట. బ్రిటన్‌లో, జపాన్‌లో కొంతమంది స్పెర్మ్ బ్యాంకు మేన్టేన్ చేస్తున్నారు. వీర్యాన్ని ఫ్రీజ్ చేసే ప్రక్రియ మొదలయ్యాక మరింత సులభం అయింది. నైట్రోజన్ ద్రవం ద్వారా మైనస్ 196.5 డిగ్రీల వద్ద ఫ్రీజ్ చేసి వుంచితే ఎంతకాలమైనా జీవంతో వుంటుంది.

ఇప్పుడు కలక్ట్ చేసిన స్పెర్మ్‌ని మరో వందేళ్ల తర్వాత వాడితే ఆ భార్యాభర్తలకు ఈ వీర్యదాత ఎక్కడో బతికున్నాడన్న శంక కూడా వుండదు. అలా వీర్యం యిచ్చేది ఓ గొప్పవాడు, ఓ సినిమా యాక్టరో, ఓ స్పోర్ట్స్ మెన్నో అయితే మంచిది కదాన్న ఆలోచన వున్న ఆధునిక మహిళలూ వున్నారుట. ఇలాటి వాళ్లకోసం గొప్పగొప్పవాళ్లకు డబ్బిచ్చి వాళ్ల స్పెర్మ్‌స్ సేకరించి వాళ్ల సర్టిఫికెట్టుతో సహా పిల్లలేని వాళ్లకు రహస్యంగా అమ్ముకునే సంస్థ ఒకదాని గురించి రాసుకొచ్చారు వీరేంద్రనాధ్. ఆ సంస్థ పేరు స్పెర్మ్ సెల్లింగ్ ఏజన్సీ, ఎస్ఎస్ఏ. దాన్ని నడుపుతున్నది రంగప్రసాద్ కు పరిచయమైన డాక్టర్ వంశీకృష్ణయే. అతని క్లయింటు ఓ అగర్వాల్ వున్నాడు. అతను నపుంసకుడైనా ఓ అందమైన తెలుగమ్మాయిని పెళ్లాడాడు. తన వ్యాపారావసరాలకు ఆమె అందాన్ని వాడుకుందామని చూశాడు. ఆమె ఒప్పుకోలేదు. పిల్లలు పుట్టకపోతే తన పరువు పోతుందని ఈ వంశీకృష్ణ వద్దకు తీసుకొచ్చి కృత్రిమ గర్భధారణ చేయించబోయాడు. పరాయివాడి గర్భం నేను ధరించనంది. అగర్వాల్ కి ఏం చేయాలో పాలుపోలేదు.

అప్పుడు వంశీకృష్ణ ఎస్ఎస్ఏ నుండి ఫోన్ చేయించాడు. జగదీష్ అనే సినిమా యాక్టర్ పోయాడు కదా, అతని వీర్యం మా వద్ద వుంది. రెండు లక్షలకు అమ్ముతాం అని. ఈ అగర్వాల్ భార్యకు ఆ యాక్టరంటే మోజుంది. పైగా అతను పోయాడు కదాని ఆమె ఒప్పుకుంది. ఇక్కడ ఓ టెక్నికల్ విషయం వుంది. ఒక చుక్క స్పెర్మ్‌లో అసంఖ్యాకమైన శుక్లకణాలుంటాయి. వాటిలో ఏ ఒక్కటైనా సరే స్త్రీలో అండాన్ని సరైన సమయంలో చేరుకుంటే అప్పుడు స్త్రీ గర్భాన్ని దాలుస్తుంది. ఒక్కొక్క కణంలో 23 క్రోమోజోమ్స్ వుంటాయి. అలాగే స్త్రీ అండంలో మరో 23 క్రోమోజోమ్స్ వుంటాయి. రెండూ కలిసి 23 జతలుగా మారటమే సృష్టి. ఒక క్రోమోజోమ్‌లో 500 జీన్స్ వున్నాయనుకుందాం. ఒక్కో జీన్ ఒక్కో అవయవాన్ని, ఒక్కో లక్షణాన్ని నిర్ధారిస్తుంది. పురుషుడి జీన్ ప్రకారం కళ్ల రంగు నీలమైతే, స్త్రీ జీన్ ప్రకారం నలుపైతే ఏది డామినేటింగ్ జీన్‌యో, ఆ జీన్ ప్రకారం బిడ్డ కళ్లరంగు ఏర్పడుతుంది.

ఇందాకా చెప్పినట్టు పోయినవాళ్ల వీర్యాన్ని ఫ్రీజ్ చేసినప్పుడు రేడియో యాక్టివిటీ వల్ల కొన్ని క్రోమోజోమ్స్ దెబ్బ తినవచ్చు. ఉదాహరణకి ముఖంకు సంబంధించిన జీన్స్ ఫ్రీజింగు వల్ల పాడయిపోతే పుట్టే బిడ్డ ముఖం భాగంలో వికృతంగా పుడతాడు. ఇప్పుడు వంశీకృష్ణ సంస్థ ఎస్ఎస్ఏలో జరిగినదదే! వాళ్లు దాచిన స్పెర్మ్ రేడియో యాక్టివిటీ వల్ల చెడిపోయింది. దానివల్ల బొంబాయిలోని అగర్వాల్ భార్యకు వికృతమైన శిశువు పుట్టాడు. అది చూసి ఆమెకు పిచ్చి ఎక్కింది. దాంతో వంశీకృష్ణకు భయం పట్టుకుంది. ఇలా ఎందుకు జరిగిందో అతనికి తెలియలేదు. ఎవరిమీదనైనా ప్రయోగం చేసి కనుక్కోవాలి. కూలీనాలీ చేసే స్త్రీల మీద చేస్తే పేపర్లకెక్కదు. అనుకుని జెనటిక్ యిన్‌స్టిట్యూట్ పక్కనున్న కృష్ణాపురంలో ఏడెనిమిది మంది స్త్రీలకు మత్తు యిచ్చి వాళ్ల మీద ఈ ప్రయోగాలు చేశారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టేసరికి జరిగిన దేమిటో తెలిసింది. అప్పుడు జగదీశ్ స్పెర్మ్ డిఫెక్టివ్ అయిపోయిందని తెలిసి, దాన్ని కిల్ చేసేశాడు.

ఆ టైములో వంశీకృష్ణకు ఈ వికృత శిశువుల జననాన్ని తన స్వార్థానికి ఎందుకు వుపయోగించుకో కూడదన్న ఐడియా వచ్చింది. అప్పటికే అవతార్ బాబా అని ఒకడు వెలిసి తన మేజిక్‌తో జనాల్ని ఆకర్షిస్తున్నాడు. ఇతను అతన్ని చంపి అతని స్థానంలో ప్రవేశించాడు. అప్పుడే అతనికి మహాదష్టతో పరిచయం ఏర్పడింది. అతను ఓ మతిభ్రష్టుడు. అష్టావక్ర తప్పకుండా పుడతాడని నమ్ముతున్నాడు. దాని గురించి ఉస్సోక్‌ని నడుపుతున్నాడు. ఇద్దరూ చేతులు కలిపారు. మహాదష్టను కూడా మెస్మరైజ్ చేస్తూ వంశీకృష్ణ అరాచకాలు చేయడం మొదలెట్టాడు. దేశదేశాల రాజకీయాలను ప్రభావితం చేశాడు. అష్టావక్రుడు అంటూ ఒకడు పుడితే వాడిని అడ్డం పెట్టుకుని మరో పదేళ్లు ఉస్సోక్‌ని ఏలవచ్చనుకున్నాడు.

ఈ మహాదష్ట ఎవరో తెలుసా? డాక్టర్ హరిహరరావు! తన జీవితం చిన్నాభిన్నం అయినందుకు బాధపడి హిమాలయాలకు వెళ్లినా అతనికి భక్తి కలగలేదు. తంత్రశక్తి పట్ల ఆసక్తి పెరిగింది. బుర్ర పక్కదారులు పట్టింది. విలియమ్స్‌పై పగ పెరిగింది. అతని వల్లనే తన కుటుంబం నాశనమైందని అనిపించింది. అతన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేద్దామని పగబట్టాడు. విలియమ్స్‌కు పిల్లలు లేరు. కానీ అతని తమ్ముడే భీమశంకరం. అతని కూతురు గౌరి. గౌరి గర్భాన అష్టావక్రుడు పుట్టేట్లు చేసి, ఆమెను చంపాలనుకున్నాడు. భీమశంకరం అల్లుడు సిద్ధార్థను, కొడుకు షాడోను చంపుదామనుకున్నాడు. రాకేష్ ద్వారా వాళ్ల జీవితాలతో ఆడుకుని, రాకేష్ ను చంపించాడు.

అయితే ఈ ప్లాన్లన్నీ షాడో, సిద్ధార్థ, డాక్టర్ రంగప్రసాద్ ఒకటొకటిగా తెలుసుకున్నారు. క్రమక్రమంగా నిజం బయటకు వచ్చింది. షాడో, రంజిత వంశీకృష్ణ డెన్‌లో టైంబాంబు పెట్టి తప్పించుకున్నారు. రంగప్రసాద్‌ను చంపబోయిన వంశీకృష్ణ అలా చేయలేకపోయాడు. సూఫీ మంత్రాలు రాయించుకుని వచ్చిన సిద్ధార్థ శ్మశానంలో తన భార్యను వెతుకుతూ తిరుగుతున్నాడు. క్లయిమాక్స్‌కి వచ్చేసరికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు సిద్ధార్థకు ఓ గుడిలో ఓ వికృత శిశువు కనబడ్డాడు. తన భార్య కనబడలేదు. కాస్త దూరం వెళ్లాక కనబడింది. అప్పుడే ఆమె పండంటి కొడుకుని ప్రసవించింది. అతనిలో ఏ లోపమూ లేదు. తను సూఫీ మంత్రం రాయించుకుని రావడం చేతనే అనుకున్నాడు సిద్ధార్థ.

ఇంతలో మహాదష్ట, అదే డాక్టర్ హరిహరరావు ప్రత్యక్షమయ్యాడు. “ఏడీ గౌరి కడుపున పుట్టిన మా నాయకుడు అష్టావక్ర?” అన్నాడు. సిద్ధార్థ “మా అబ్బాయి బాగానే వున్నాడు. ఆ గుడిలో ఓ శిశువు పడివుంది” అన్నాడు. జరిగిందేమిటంటే గౌరి కడుపున మామూలు బిడ్డే పుడతాడని వంశీకృష్ణకు ముందే తెలుసు. అందువల్ల పదిరోజుల క్రితం పుట్టిన మామూలు బిడ్డ ఒకడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ముఖం వికృతంగా చేసి అక్కడ పడేశాడు. ఈ గౌరి స్పృహ తప్పిపోతే బిడ్డను మార్చేద్దామనుకున్నాడు. డాక్టర్ హరిహరరావు అది గుర్తించాడు. 'అష్టావక్రుడు పుట్టలేదు, నువ్వు మోసం చేశావ్” అంటూ ఓ ఎముకతో వంశీకృష్ణను పొడిచాడు. రంగప్రసాద్‌పై తుపాకీ కాల్చబోయిన వంశీకృష్ణ ఆ ఎముకపోటుకి చచ్చిపోయాడు. తుపాకీ గుండు తగిలినా చలించకుండా మహాదష్ట అతని శవాన్ని సమాధుల మధ్యకు విసిరేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.

ఇక్కడితో నవల ఆఖరైంది. ఉపసంహారం ఏమిటంటే గౌరి, సిద్ధార్థ వాళ్ల పిల్లాడు అందంగా వున్నా అష్టావక్ర అని పేరు పెట్టుకుంటారు. ఇదేం పేరురా? అని ఎవరైనా అడిగితే వాడు కథంతా చెప్పాలని వాళ్ల ఉద్దేశంట. ఈ నవలలో వీరేంద్రనాథ్ మార్క్‌ మసాలాలు అన్నీ వున్నాయి. నవల ఉత్తరార్ధంలో విలన్ డెన్‌లో షాడో సాహసకృత్యాలు, మంచుకొండలపై సిద్దార్థ ధైర్యసాహసాలు, విజ్ఞాన విశేషాలు చాలా వుంటాయి. నవల పుస్తక రూపంలో దొరుకుతోంది. చదివితే బాగుంటుంది. (సమాప్తం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా