cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: అసాం ఎన్నికలు

ఎమ్బీయస్: అసాం ఎన్నికలు

అసాం ఎసెంబ్లీ ఎన్నికలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. రెండో దశ ఏప్రిల్ 1న, మూడో దశ ఏప్రిల్ 6న జరుగుతాయి. మొత్తం 126 స్థానాలు. మార్చి 25 నాటి టైమ్స్ నౌ-సి ఓటర్ సర్వే ప్రకారం 126 స్థానాల అసాంలో ఎన్‌డిఏ కూటమి 69 స్థానాలతో మళ్లీ అధికారంలోకి వచ్చేస్తుంది. 2016 ఎన్నికలలో బిజెపి 29% ఓట్లతో 60 సీట్లు, దాని భాగస్వామి ఎజిపి (అసాం గణ పరిషద్) 8% ఓట్లతో 14 సీట్లు, మరో భాగస్వామి బిపిఎఫ్ (బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్) 12 తెచ్చుకున్నాయి. మొత్తం 96. మూడు దఫాలుగా పాలన చేస్తున్న కాంగ్రెసును ఓడించి, బిజెపి అధికారం చేపట్టింది. ఈసారి 69 వస్తే 17 తగ్గినట్లన్నమాట. ఈ కూటమిలో నుంచి యీసారి బిపిఎఫ్ వైదొలగి దాని స్థానంలో యుపిపిఎల్ (యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్) వచ్చి చేరి 8 సీట్లు పోటీ చేస్తోంది. బిజెపి 92టికి, ఎజిపి 26టికి చేస్తున్నాయి.

2016లో బిజెపి అధికారంలోకి రాగానే దశాబ్దాలుగా కాంగ్రెసు నాయకుడిగా, 14 ఏళ్లు మంత్రిగా వెలిగి దానిలో నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరిన హిమాంత విశ్వశర్మ ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నారు. కానీ అతనికి హెల్త్, ఫైనాన్స్, విద్య, పిడబ్ల్యుడి శాఖలన్నీ యిచ్చి ఊరుకోబెట్టి, ఆరెస్సెస్ మద్దతున్న శర్వానంద సోనోవాల్‌ను ముఖ్యమంత్రిని చేసింది, అధిష్టానం. శర్మకు బాధేసినా దిగమింగి, 2019లో నేను పార్లమెంటుకి వెళ్లిపోతా అన్నాడు. అప్పుడు మోదీయే పిలిచి ‘నీ అవసరం, చాకచక్యం ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో ఉంది. ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రానికే కట్టుబడి వుండిపోవాల్సి వస్తుంది. ఎంపీ అయితే రాష్ట్రానికి దూరంగా వుండవలసి వస్తుంది.’ అని నచ్చచెప్పి ఆ ప్రయత్నాన్ని విరమింప చేశాడు.

ఇప్పుడు కూడా శర్మకు ఆశ పోలేదు. అందుకనే బిజెపి తన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పకుండా లాక్కుని వస్తోంది. ఎన్నికల తర్వాత శర్మ, సోనోవాల్‌లలో ఎవరిని పదవి వరిస్తుందో చూడాలి. టిక్కెట్ల పంపిణీ శర్మ ద్వారా జరిగింది కాబట్టి అతను తన అనుచరులందరికీ టిక్కెట్లు యిచ్చుకుని, సోనోవాల్ అనుచరులు కొందరికి టిక్కెట్టు యివ్వలేదు. అసాంలో యథేచ్ఛగా ఫిరాయింపులు సాగుతూనే వున్నాయి. గోలాఘాట్ నియోజకవర్గంలో ఇప్పటి బిజెపి అభ్యర్థి 2016లో కాంగ్రెసు అభ్యర్థి, ఇప్పటి కాంగ్రెసు అభ్యర్థి, 2016లో బిజెపి అభ్యర్థి! నెగ్గడానికి అవకాశమున్న ఎవరినైనా సరే, ఏ పార్టీలో నుంచైనా బిజెపి లాక్కుంటోంది. సిటింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందికి మళ్లీ టిక్కెట్టివ్వలేదు. వారిలో ఒక మంత్రి కూడా వున్నాడు.

ముఖ్యమంత్రిగా సోనోవాల్ బాగానే పాలిస్తూ వచ్చాడు. కేంద్రం ఉదారంగా యిచ్చిన నిధులతో రాష్ట్రంలో అనేక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపట్టాడు. నాలుగు భారీ ఫ్లయిఓవర్లు పూర్తి చేశాడు. ఒకటి బ్రహ్మపుత్ర నది మీదుగా కట్టారు. చిన్న ప్రాజెక్టులు కూడా అనేకం పూర్తి చేయగలిగాడు. మిలిటెంటు సంస్థలతో శాంతి చర్చలు మొదలు పెట్టాడు. అవి ఒక కొలిక్కి రాలేదు కానీ రాష్ట్రంలో శాంతిభద్రతలకు లోటు రాకుండా చూశాడు. అసాం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను క్షాళన చేసి నియామకాల్లో అవినీతి లేకుండా చేశాడు. మన రాష్ట్రాలలాగానే అక్కడ కూడా సంక్షేమ పథకాలు జోరుగానే వున్నాయి. అరుణోదయ అనే స్కీము ద్వారా వితంతువులు, దివ్యాంగులు వున్న కుటుంబాలలోని 40 లక్షల మందికి నెలనెలా రూ. 830 డైరక్టుగా పంపుతున్నారు. ఎన్నికలకు ముందే దాన్ని రూ.3 వేలకు పెంచారు. కోవిడ్ సమయంలో పేదవారికి తలా రూ.2 వేలు యిచ్చారు.

యువతకు ఎంపవర్‌మెంట్ మూవ్‌మెంట్ అని పెట్టి ఏదైనా సర్వీసు యూనిట్ కానీ తయారీ పరిశ్రమ కానీ పెట్టుకోవడానికి డైరక్ట్ కాష్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. గ్రామాల్లో సాంస్కృతిక కేంద్రాలుగా పనిచేసే నామ్‌ఘర్‌లకు ధారాళంగా డబ్బు సరఫరా చేశారు. ఒక్కో దానికి రూ. 2.50 లక్షల చొప్పున 2020 ఆగస్టులో 8,756 నామ్‌ఘర్‌లకు డబ్బిచ్చారు. వీటన్నిటికోసం పాలనాకాలం చివరి దశలో రూ.80 వేల కోట్లు అప్పు తీసుకున్నారట. వీటితో పాటు నెరవేర్చని వాగ్దానాలు కూడా వున్నాయి. తమ విజన్ డాక్యుమెంటులో బిజెపి ‘జనాభాలో 42% మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం లేదు. మేం వారికి అందిస్తాం.’ అన్నారు.

2021 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వపు ‘జల్ జీవన్ కమిషన్’ నివేదిక ప్రకారం 63.35 లక్షల యిళ్లుండగా వాటిలో 7.77% ఇళ్లకు మాత్రం నీళ్లు యివ్వగలిగారు. 25 వేల పై చిలుకు గ్రామాలుండగా 160 గ్రామాలకు మాత్రమే యింటింటికి కుళాయిలున్నాయి. ముఖ్యమైన సమస్య ఏమిటంటే, అసాం నుంచి అనేక మంది కార్మికులు, విద్యావంతులు కూడా యితర రాష్ట్రాలకు వెళ్లి పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వారంతా వెనక్కి రావలసి వచ్చింది. అవస్థలు పడిన వలస కార్మికులలో అసామీలూ వున్నారు. ఇక్కడకు వచ్చాక వారి ఆర్థిక పరిస్థితి బాగా లేదు. చిన్న రాష్ట్రం కావడం చేత ఉద్యోగాలు లేవు. మళ్లీ బయటకు వెళ్లి సంపాదించు కుందామన్నా దేశ ఆర్థిక పరిస్థితి యింకా కుంటుతూనే వుంది.

టీ కార్మికుల వేతనాల అంశం బిజెపిని చాలా యిబ్బంది పెడుతోంది. వాళ్లకు రోజు కూలీ రూ.167 ఉంది. 2016 మానిఫెస్టోలో బిజెపి దాన్ని రూ.351కి పెంచుతానని వాగ్దానం చేసింది. కానీ టీ ఎస్టేటు యజమాన్లకు కోపం వస్తుందని భయపడి పట్టించుకోలేదు. టీ కార్మికులు ఆగ్రహంగా వున్నారనీ, 9 నియోజకవర్గాలలో ప్రభావం చూపగలరని గ్రహించి, కాబినెట్ చివరి సమావేశంలో రూ.50 జీతం పెంచింది. వెంటనే టీ యజమానులు కోర్టుకి వెళ్లారు. కోర్టు స్టే యిచ్చింది. ‘మేం తీర్పు యిచ్చేదాకా మీరు ఎంత వీలుపడితే అంత పెంచుకోవచ్చు, ఈలోపున ప్రభుత్వం మిమ్మల్ని ఒత్తిడి చేయకూడదు’ అంటూ యజమానులకు వెసులుబాటు యిచ్చింది. టీ కార్మికుల కోపాన్ని తన ఓట్లుగా మార్చుకుందామని కాంగ్రెసు చూస్తోంది. ప్రియాంకా గాంధీ వచ్చి వాళ్లతో పాటు టీ ఆకులు కోస్తూ ఫోటో తీయించుకుంది. వాళ్ల రోజు కూలీ రూ.365 చేస్తామని కాంగ్రెసు తన మానిఫెస్టోలో రాసింది.

టీ జాతులతో సహా 6 జాతులను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో చేరుస్తానని 2016 మాట యిచ్చిన బిజెపి తర్వాత మాట తప్పింది. ట్రైబల్ ఓట్లు ప్రభావితం చేయగలిగిన నియోజకవర్గాలు 12 ఉన్నాయి.  బిజెపికి ఇంకో యిబ్బంది భాగస్వాముల ద్వారా వచ్చింది. ఎజిపిలో ప్రఫుల్ల మహంత వర్గం సిఏఏను వ్యతిరేకించింది. చివరకు మహంతకు, మరో అతనికి టిక్కెట్లు యివ్వలేదు. బోడోలాండ్‌లో 2016లో కలిసి పోటీ చేసిన బిపిఎఫ్‌తో బిజెపికి 2020 డిసెంబరులో బిటిసి (బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్)కి జరిగిన ఎన్నికలలో చెడింది. బిజెపి యుపిపిఎల్‌తో, జిఎస్‌పితో కలిసి పోటీ చేసి బిపిఎఫ్ నుంచి అధికారాన్ని గుంజుకోగలిగింది.

ప్రతిపక్షంలో వున్న కాంగ్రెసు అంతఃకలహాలలో మునిగి బిజెపికి గట్టి పోటీ యివ్వలేకపోతోంది.  సోనోవాల్‌తో సరితూగే పాప్యులర్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ ఆ పార్టీ పక్షాన లేకపోయినా అయితేగియితే ఎవరు ముఖ్యమంత్రి కావాలి అని పోటీ వడేవాళ్లలో కీర్తిశేషుడు తరుణ్ గొగోయ్ కొడుకు గౌరవ్ ఒకడు. ఇతని కోసం తరుణ్ తనను పక్కకు పెట్టడంతోనే హిమాంత శర్మ పార్టీలోంచి వెళ్లిపోయాడు. మరో మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా కొడుకు దేవవ్రత మరో అభ్యర్థి. రాష్ట్ర అధ్యక్షుడు రిపున్ బోరా యింకో అభ్యర్థి. తరుణ్ గొగోయ్‌కు సన్నిహితంగా పనిచేసిన ప్రద్యుత్ బొర్దొలోయ్ కూడా అభ్యర్థే.

సర్వే ప్రకారం ఈసారి యుపిఏ కూటమికి 56, ఇతరులకు 4 వస్తాయి. 2016లో కాంగ్రెసు 31% ఓట్లతో 26 సీట్లు, దాని భాగస్వామి ఎఐయుడిఎఫ్ (ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్) 13% ఓట్లతో 13 సీట్లు గెలిచాయి. మధ్యలో వచ్చిన 2019 పార్లమెంటు ఎన్నికలలో మొత్తం 14 స్థానాల్లో 36% ఓట్లతో బిజెపికి 9, 35% ఓట్లతో కాంగ్రెసుకు 3, 8% ఓట్లతో ఎఐయుడిఎఫ్‌కి 1, యితరులకు 1 వచ్చాయి. తక్కిన పార్టీలకు సీట్లు రాలేదు. 2.30 కోట్ల మంది ఓటర్లుంటే ఆ ఎన్నికలలో 1.65 కోట్లమంది ఓటేశారు. ఎన్‌డిఏకి కాంగ్రెసుకు మధ్య ఓట్ల వ్యత్యాసం 20 లక్షలు మాత్రమే. 2021 వచ్చేసరికి బిజెపి కూటమిలోంచి బయటకు వచ్చిన బిపిఎఫ్ యీ కూటమిలో చేరి 12 సీట్లకు పోటీ చేస్తోంది. కాంగ్రెసు 94టిలో, ఎఐయుడిఎఫ్ 14టిలో పోటీ చేస్తున్నాయి.

ఈ కూటమిలో కమ్యూనిస్టులతో సహా వున్న 5 యితర పార్టీలు కలిసి 6 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. యునైటెడ్ రీజనల్ ఫ్రంట్ కూటమిలో అసాం జాతీయ పరిషద్ 68, రైజోరీ దళ్ 29 పోటీ చేస్తున్నాయి. ఇక భాగస్వామి ఎఐయుడిఎఫ్‌తో కలిసి నడవాలా వద్దా అనే చర్చ కాంగ్రెసు పార్టీని చీల్చింది. 2011 సెన్సస్ ప్రకారం జనాభాలో 35% ముస్లింలు కాబట్టి, 33 నియోజకవర్గాల్లో ముస్లింలు మెజారిటీలో వున్నారు కాబట్టి, వారితో పొత్తు అనివార్యం అని కాంగ్రెసులో కొంతమంది అంటారు. వాళ్లతో వుంటే బిజెపి మనకు ముస్లిం ముద్ర కొడుతుంది కాబట్టి వద్దని కొందరంటారు. ఆ పార్టీ గొడవేమిటంటే – అది ప్రారంభించినది మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ అనే అత్తరు వ్యాపారి. అనేక స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి వాటి ద్వారా పేద ప్రజలను ఆదుకుంటూ వుంటాడు. అతనంటే వాళ్లందరికీ గురి. అయితే అతన్ని బంగ్లాదేశీ ముస్లిము అక్రమవలసదారుల గాడ్‌ఫాదర్‌గా తక్కినవాళ్లందరూ అభివర్ణిస్తారు.

ఆ పార్టీ అధికారికంగా చెప్పినదేమిటంటే – ‘మేము అసాం గణపరిషద్‌తో సహా అన్ని ప్రాంతీయ పార్టీలు అడుగుతున్నట్లే అసాం ఒప్పందం అమలు చేయాలని కోరుతున్నాము. దాని ప్రకారం 1971 తర్వాత అసాంలో ప్రవేశించిన వారందరినీ మతంతో సంబంధం లేకుండా వెనక్కి పంపించేయాలి. అయితే బిజెపి ప్రవేశపెట్టిన సిఏఏ మాత్రం అక్రమంగా వచ్చిన హిందువులను ఉంచాలని, ముస్లిములను వెనక్కి పంపించేయాలని అంటోంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం.’ అని.

నిజానికి అసాం ప్రజలందరూ, హిందూ, ముస్లింలతో సహా కోరుతున్నది యిదే. బంగ్లాదేశ్ నుంచి వచ్చిపడుతున్న బెంగాలీల వలన తమ సంస్కృతి నాశనమౌతోందని వారి ఫిర్యాదు. బంగ్లాదేశీ హిందువులతో కూడా వాళ్లకి పేచీయే. వెనక్కి పొండి అంటున్నారు. బిజెపి వాళ్లు మాత్రం అనుమతి లేకుండా వచ్చిన హిందూ బంగ్లాదేశీలను ‘శరణార్థులు’ అంటున్నారు, ముస్లిం బంగ్లాదేశీలను ‘చొరబాటుదారులు’ అంటున్నారు. బయటి నుంచి వచ్చినవారందరూ వెళ్లిపోయి అసాం సంస్కృతి కాపాడబడాలని అంటున్నా అజ్మల్‌పై అసాం వ్యతిరేకి అనే ముద్ర కొట్టడం చేత, అతని పొత్తు మాకొద్దు అని ప్రాంతీయ పార్టీలు గొడవ చేస్తున్నాయి. మా కూటమి నెగ్గినా మేం ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఉపముఖ్యమంత్రి పదవి కూడా అడగం అని అజ్మల్ ప్రకటించాడు.

2014లో బిజెపి జాతీయ స్థాయిలో అచ్ఛే దిన్, స్విస్ నల్లధనం, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగకల్పన యిలాటివి మాట్లాడింది. 2019 వచ్చేసరికి అవన్నీ ఎగిరాయి. పాకిస్తాన్, సిఏఏ గురించే మాట్లాడింది. అసాంలోనూ అంతే, 2016లో అభివృద్ధి, అసాం అసామీయులకే, సిఏఏ అమలు అవీ మాట్లాడింది. 2014లోనే మోదీ ‘మేం కేంద్రంలో అధికారంలోకి రాగానే బంగ్లాదేశీయులందరూ మూటాముల్లె సర్దుకుని పోవాల్సిందే’ అన్నారు. దానికి తగ్గట్టుగానే 2016 అసెంబ్లీ ఎన్నికలలో మాట్లాడారు. ఆ తర్వాత బంగ్లాదేశీ హిందువులను ఉంచుతాం అంటూ సిఏఏ తెచ్చారు. ఇప్పుడు సిఏఏ గురించి బెంగాల్‌లో మాట్లాడుతోంది తప్ప యిక్కడ మాట్లాడటం లేదు.

ఎందుకంటే మాట్లాడితే హిందూ బంగ్లాదేశీయుల ఓట్లు పోతాయి. అందుకని యిప్పుడు దానికి బాగా వచ్చిన హిందూ-ముస్లిం పాటే పాడుతోంది. ‘ఇది రెండు సంస్కృతుల మధ్య పోరాటం. అజ్మల్‌, అతనితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెసు మనపై మొఘలాయీల్లా దాడి చేస్తున్నారు’ అంటోంది. బెంగాల్‌లో మమత ‘బయటివాళ్లు’ అంటే అంత తీవ్రంగా స్పందించినవాళ్లు, అసాంను దశాబ్దాలుగా పాలిస్తూ వచ్చిన కాంగ్రెసును విదేశీరాజుగా మార్చేయడం విడ్డూరం. బిజెపి సిఏఏను వ్యతిరేకిస్తూన్న ప్రాంతీయ పార్టీలలో రెండు బలంగా వున్నాయి. ఆసు (ఆల్ అసాం స్టూడెంట్స్ యూనియన్) నుంచి యిటీవల ఉద్భవించిన అసాం జాతీయ పరిషద్ (ఎజెపి) వాటిలో ఒకటి.

నిజానికి ఎజిపి, ఆసు నుంచి పుట్టినదే. అయితే అది రాజకీయక్రీడల్లో పూర్తిగా మునిగిపోయి, అసాం హక్కులను పరిరక్షించటం లేదన్న ఉద్దేశంతో అదే ఆసు నుంచి ఎజెపి పుట్టింది. ఎజెపి నాయకుడు లురిన్‌జ్యోతి గొగోయ్. అతను కాంగ్రెసు కూటమిలో చేరుదామనుకున్నాడు కానీ అతనితో కలిసి పనిచేస్తున్న రైజోర్ దళ్‌కు ఆ చర్య నచ్చలేదు. అది ప్రధానంగా రైతు ఉద్యమం నుంచి పుట్టినది. దాని నాయకుడు. అఖిల్ గొగోయ్ సిఏఏకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటే ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసి, మావోయిస్టులతో లింకులున్నాయంటూ దేశద్రోహం కేసు మోపి, అతన్ని జైల్లో పెట్టింది. కాంగ్రెసు కూటమిలో అజ్మల్ పార్టీ వుంటే మేం కలవమని చెప్పడమే కాదు, బహిరంగంగా ఓ లేఖ విడుదల చేశాడు, అఖిల్ గొగోయ్. ఇప్పుడు ఎజిపి, ఆర్‌డి కూటమిగా పోటీ చేస్తున్నాయి కానీ కొన్ని చోట్ల స్నేహపూర్వకమైన పోటీలంటూ తలపడుతున్నాయి. బిజెపి కూటమిలోనూ, కాంగ్రెసు కూటమిలో కూడా స్నేహపూర్వకమైన పోటీలున్నాయి.

బోడోలాండ్‌కు సిఏఏ వర్తించదు కాబట్టి బిపిఎఫ్‌కు దానిపై ఏ అభిప్రాయమూ లేదు. సిఏఏను వ్యతిరేకిస్తున్నవారందరిలో పెద్ద పార్టీ కాబట్టి అసామీయులు పెద్ద సంఖ్యలో వున్న 36 నియోజకవర్గాల్లో తమకు గెలుపు కలుగుతుందని కాంగ్రెసు ఆశ. 2016లో వీటిల్లో 4 సీట్లు మాత్రమే గెలవగలిగింది. అసామీయుల బాధ అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 1991లో అసామీ భాషీయులు 58% వుంటే 2011 నాటికి అది 48% అయింది. అదే సమయంలో బెంగాలీ మాట్లాడేవారు 22% నుంచి 30% కు పెరిగారు. సిఏఏ చట్టం ద్వారా బంగ్లాదేశ్ హిందువులకు పౌరసత్వం యివ్వడానికి వారు వ్యతిరేకం. మోదీ మొదటి టర్మ్‌లో సిఏఏ బిల్లు రాజ్యసభలో వీగిపోవడంతో అమ్మయ్య అనుకున్నారు. కానీ రెండో టర్మ్‌లో రాజ్యసభలో కూడా నెగ్గించుకున్నారు.

ఇది అసామీయులకు బాధగా వుంది. వారి 36 నియోజకవర్గాల్లో తమకు దెబ్బ తగులుతుందని భయపడి, బిజెపి ఆ ప్రాంతానికే చెందిన సోనోవాల్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అతను సిఏఏను ఆహ్వానించలేదు. అలా అని విమర్శించనూ లేదనుకోండి. సెక్రటేరియట్‌లో అసామీయులను చీఫ్ సెక్రటరీ, డిజిపి వంటి ప్రముఖ స్థానాల్లో నియమించాడు. అంతేకాదు, పదో క్లాసు వరకు అసామీ భాషను తప్పనిసరి సబ్జక్టుగా చేశాడు. అలా చదవనివారికి యికపై గవర్నమెంటు ఇంజనీరింగు, మెడికల్ కాలేజీల్లో ఎడ్మిషన్ వుండదన్నాడు. ప్రభుత్వోద్యోగానికి అప్లయి చేసుకోకూడదన్నాడు.

తమకు భూమి హక్కుల దఖలు పరచాలని స్థానికులు ఎప్పణ్నుంచో ఆందోళన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు జనవరిలో ఒక లక్ష మందికి పట్టాలిచ్చారు. రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలలో అసామీయులకు 80% ఉద్యోగాలు రిజర్వ్ చేయాలని సిఫార్సు చేసిన కమిటీ నివేదిక ఒకటి బల్ల మీద పెట్టుకుని కూర్చున్నారు. స్థానికులకు ఇలా వారిని ఆకట్టుకునేందుకు సోనోవాల్‌ను ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో సిఏఏ చట్టం ద్వారా అక్రమ బంగ్లాదేశీ హిందువుల ఓట్లను ఆకర్షిస్తూ అసామీ సంస్కృతిని రక్షిస్తున్నాం అంటూ ఎగువ అసాములోని అసామీలను ఆకర్షిద్దామని ప్రయత్నిస్తోంది. సర్వేలు చూస్తే పథకం ఫలించేట్లు కనబడుతోంది.

ఒకప్పుడు కాంగ్రెసు, ప్రాంతీయ పార్టీల చేతిలో వుంటూ, బిజెపికి అడుగు పెట్టేందుకు అవకాశం కూడా లేని ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి, 2014 తర్వాత నుంచి పాగా వేస్తూ, ఒక్కో రాష్ట్రానికీ విస్తరిస్తూ పోయింది. వాటన్నిటికి ముఖద్వారం వంటి అసాంలో తమ అధికారాన్ని నిలుపుకోవడం బిజెపికి అత్యంతావశ్యకం. అందుకే చిన్న రాష్ట్రమే అయినా, మోదీ అమిత్ షా అనేక ట్రిప్పులు వేసి, ప్రచారం ఉధృతంగా చేస్తున్నారు. కానీ కాంగ్రెసు అధిష్టానానికి అలాటి చింతేమీ లేదు.  రాహుల్, ప్రియాంకా చాలా తక్కువసార్లు వచ్చారు. నిజానికి అసాంలో గెలిస్తే పార్టీ అధ్యక్షుడిగా జూన్‌లో గెలవడానికి రాహుల్‌కి మంచి అవకాశం. గెలవకపోయినా వేరెవర్నీ రానివ్వమన్న ధీమా అతనిది.

2016 వరకు కాంగ్రెసు పక్షాన తరుణ్ గొగోయ్ వంటి వృద్ధుడు 15 ఏళ్లగా పాలిస్తూరావడంతో ఆ ఎన్నికలలో యువత బిజెపి వైపు ఆకర్షితులయ్యారు. వారిని వెనక్కి తెచ్చుకోవాలంటే తమ పార్టీ తరఫున ఎవరైనా యువ ముఖ్యమంత్రిని చూపించాలన్న యింగితమే కాంగ్రెసుకు లోపించింది. ఫలితాల కోసం ఎదురు చూడనక్కరలేక పోయినా, ఎన్నికల తర్వాత శర్మ ఏ స్థానంలో వుంటాడన్నదొకటే ఆసక్తి కలిగించే అంశంగా వుంది. (ఫోటో ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, చక్రధారి హిమాంత విశ్వశర్మ)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

mbsprasad@gmail.com

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×