cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: అయోధ్య యువరాణి కొరియాకు రాణి

ఎమ్బీయస్‍:  అయోధ్య యువరాణి కొరియాకు రాణి

ఈ నెల 4న దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్య కిమ్ జంగ్-సూక్ దీపావళి ఉత్సవాలలో పాల్గొనడానికి అయోధ్యకు వచ్చి అక్కడ వున్న హియో రాణి స్మారక ఉద్యానవనాన్ని సందర్శించారు. ఈ హియో రాణి కొరియాను క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఏలిన కిమ్ సురో రాజు భార్య. ఆవిడ స్మారకచిహ్నంగా అయోధ్యలో పార్కు ఎందుకు కట్టారూ అంటే ఆవిడ కొరియాకు వెళ్లడానికి ముందు అయోధ్య యువరాణి కనుక! కొరియా అనగానే ఒటిటిలో కె-డ్రామాలు మాత్రమే గుర్తుకు వచ్చేవారికి, వాటికి మించిన సినిమా కథ లాటి హియో జీవితగాథ తెలియకపోవచ్చు. 

అమెరికాలో నా బాల్యమిత్రుడు డెంటల్ సర్జన్‌గా, డెంటిస్ట్రీ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా వున్నాడు. వాడోసారి చైనా వెళ్లినపుడు ఒక కొరియా వ్యాపారవేత్త తగిలాడు. ‘మీది ఇండియానా? రెండు వేల ఏళ్ల క్రితం నాటి మా పూర్వీకురాలు మీ దేశానికి చెందినదే. మా కిమ్-హే (గిమ్‌హే అని కూడా పలుకుతున్నారు)  కిమ్ వంశం చాలా ప్రఖ్యాతి చెందినది. మేం 60 లక్షల మంది దాకా వుంటాం. మా అందరికీ ఆవిడ మూలదేవత లాటిది. కిమ్-హే నగరంలోని ఆవిడ సమాధిని ఏటా సందర్శిస్తూ వుంటాం.’ అంటూ చాలా యిదైపోయి, మర్యాదలు చేసేశాడట. కంబోడియాకు చెందిన అంకుర్‌వాట్‌కు ఇండియా కనక్షన్ వుందని విన్నాను తప్ప కొరియాతో కూడా వుందని నేను వినలేదు.

ఆ తర్వాత 2000 మార్చిలో ఔట్‌లుక్‌లో ‘టు లివ్ ఫెయిరీ టేల్ మెమరీస్’ పేరుతో ఒక కథనం వచ్చింది. అయోధ్యకు చెందిన ఒక యువరాణి కొరియాలోని ఒక రాజ్యానికి రాణి అయిందని, ఆవిడ పేర అయోధ్యలో ఒక స్మారకోద్యానవనాన్ని కట్టడానికి సంకల్పించారని చదివాను. కిమ్-హే  నగరాన్ని అయోధ్యకు సిస్టర్ సిటీ (సహనగరం)గా ప్రకటించింది కొరియా ప్రభుత్వం. అప్పుడు ఆవిడ చరిత్రపై ఆసక్తి కలిగి చదివాను. ఆవిడ మూలం అయోధ్యయా కాదా అన్నదానిపై సందేహాలున్నాయని తెలిసింది. ఆమె జీవితగాథను ఇర్యాన్ (1206-1289) అనే సన్యాసి సంగుక్ యుసా అనే పుస్తకంలో గ్రంథస్తం చేశాడు. దానిలో ఆమె ‘అయోతా రాజ్యానికి చెందినది’ అని రాశాడు. ఈ అయోతా ఎక్కడిది అన్నదానిపై వాదనలున్నాయి. అయోధ్య అందామంటే అక్కడ ఆమె రికార్డు ఏమీ లేదు. పైగా అయోధ్య అనేది నగరం పేరే కానీ, రాజ్యం పేరు కాదు. ఆ రాజ్యం పేరు కోసల.

అందువలన థాయ్‌లాండ్‌లోని ఆయూతా రాజ్యం నుంచి వచ్చి వుంటుంది అని కొందరన్నారు. ఆ రాజ్యం తర్వాత ఎప్పుడో వచ్చింది కానీ 2 వేల సం.ల క్రితం లేదు అన్నారు మరి కొందరు. ఆ సమయంలో పాండ్యులకు సామంతులుగా వున్న ఆయ రాజ్యం కన్యాకుమారిని పాలించింది. ఆ రాజ్యానికి చెందినదై వుంటుంది అనే ఊహ ఒకటి వుంది. తనతో పాటు ఒక త్రిశూలాన్ని, మీనద్వయం వున్న చిహ్నాన్ని తీసుకుని వెళ్లింది కాబట్టి, అది పాండ్యుల రాజచిహ్నం కాబట్టి అక్కడిదే అనే వాదన మరొకటి వుంది. 

నిజానికి అదే కరక్టు కావచ్చు. ఎందుకంటే ఆమె కథలో సముద్రంలో ఓడపై కొరియా వెళ్లినట్లుంది. కన్యాకుమారి నుంచి ఆమె హిందూ మహాసముద్రంలో ప్రయాణించడానికి ఆస్కారం ఎక్కువుంది. అయోధ్య దగ్గర సరయూ అనే చిన్న నది (350 కిమీల పొడవు) ఉంది. అది మరో ఘాఘరా అనే మరో చిన్న నదిలో వెళ్లి కలుస్తుంది. అది గంగానదికి ఉపనది. అయోధ్య నుంచి సముద్రతీరం వున్న కలకత్తాకు చేరాలంటే రోడ్డు మార్గాన వెయ్యి కి.మీ.లు ప్రయాణించాలి. కన్యాకుమారి ఐతే యింట్లోంచి బయటకు కాలుపెడితే సముద్రమే!

ఈ లాజిక్‌లు ఎలా వున్నా కొరియా వాళ్లు ఆవిడ అయోధ్య నుంచి వచ్చిందని తీర్మానించి, అక్కడే స్మారకచిహ్నం అనుకున్నారు. 2000లో మొదలుపెట్టారు. ఏడాది తర్వాత నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవం జరిగి, కొరియానుంచి సందర్శకులు రాసాగారు. 2016లో కొరియన్ డెలిగేషన్ ఒకటి వచ్చి మేం దీన్ని యింకా అభివృద్ధి పరుస్తాం అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సరేనన్నాడు. 2018 నవంబరులో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్-బాక్ భార్య కిమ్ జుంగ్-సుక్ (ఈవిడా హియో వంశజురాలే) వచ్చి శంకుస్థాపన రాయి వేసింది. ఆ పనులు పూర్తవడంతో యిప్పుడు ఆ పార్కును ప్రారంభించడానికి వచ్చిందావిడ. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నరు రామ్ నాయక్‌లు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. అక్టోబరులోనే హియో కథపై ఐసిసిఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్), కొరియన్ సెంటర్ ఫర్ కల్చర్ కలిసి ఒక మ్యూజికల్‌ను ప్రదర్శించాయి. నటుడు ఇమ్రాన్ ఖాన్ దానికి దర్శకత్వం వహించారు.

ఇంతకీ హియో కథ ఏమిటి? భారతదేశంలో వుండగా సూర్యరత్న (సూరిరత్న, సిరిరత్న అని కూడా అంటారు). క్రీ.శ. 32లో పుట్టింది. ఆమెకు 16 ఏళ్ల వయసులో ఆమె తండ్రికి కలలో దేవుడు కనబడి నీ కుమార్తెను ప్రశాంతోదయ సీమ (కొరియాను అప్పట్లో అలా అనేవారట)కు పంపు అని ఆదేశించడంతో ఆమెను పరివారంతో సహా ఒక నౌకపై పంపాడట. మధ్యలో తుపాను వచ్చి ఓడలో కొంత భాగం ముక్కలైనా రెండు నెలల ప్రయాణం తర్వాత ఆగ్నేయ కొరియాలోని గ్యూంగ్‌వాన్ గయా అనే దేశంలోని కిమ్-హే అనే ఊరిని ఓడ చేరింది. ఆ దేశాన్ని ఏలుతున్న సురోను పెళ్లి చేసుకోమని రాజాస్థానంలోని వారందరూ చాలాకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఎంతోమంది కన్యలను చూపించారు కూడా. కానీ నా భార్యెవరో దేవుడే నిర్ణయిస్తాడు అంటూ అతను వాయిదా వేశాడు.

ఒక రాత్రి అతనికి స్వప్నంలో నీకు కాబోయే భార్య నీ దేశం చేరింది చూసుకో అనే సంకేతం వచ్చింది. మర్నాడు ఉదయమే తన ఆంతరంగికుణ్ని పిలిచి, నువ్వు ఒక గుఱ్ఱాన్ని, ఒక నావను తీసుకుని రాజధానికి దక్షిణాన ఉన్న దీవికి వెళ్లు అని ఆజ్ఞాపించాడు. అతను అక్కడకు వెళ్లగానే ఎఱుపురంగు కలిగిన పతాకం కలిగిన ఓడ తీరాన్ని చేరుతోంది. అతను నావలో ఆ ఓడను చేరి, దాన్ని క(గ)యా (ఇప్పుడు దాన్నే కిమ్-హే(గిమ్‌హే) అంటున్నారు)కు చేర్చాడు. రాజుగారికి యిదీ విషయమని కబురంపాడు. రాజు తొమ్మిదిమంది వంశప్రముఖులను పిలిచి, మీరు వెళ్లి ఆ ఓడలోని ప్రయాణీకులను నా సౌధానికి తోడ్కొని రండి అని పంపించాడు.

ఆ ఓడలోంచి హియో దిగింది. ఈ తొమ్మిదిమంది చెప్పినదాన్ని విని ‘నేను అపరిచితుల సౌధానికి వెళ్లను’ అని రాజసం చూపించింది. అప్పుడు రాజు తన సౌధానికి దగ్గరగా వున్న పర్వతసానువుల్లో ఒక గుడారం వేయించి, ఆమెను అక్కడకి పరివారంతో సహా చేర్పించాడు. ఆమెతో వచ్చిన బానిసలు బంగారం, వెండి, మణిమాణిక్యాలు, పట్టువస్త్రాలు పట్టుకుని వచ్చారు. రాజు వివాహప్రతిపాదన చేసినపుడు ఆమె సమ్మతించింది. కృతజ్ఞతాపూర్వకంగా ఆ పర్వతానికి పట్టువస్త్రాలు సమర్పించి, వివాహవేదికకు వెళ్లింది. వివాహానంతరం ఆమె పేరు మహారాణి హ్వాంగ్-ఓక్‌గా, హియో అనేది యింటిపేరుగా మార్చబడింది. 

రాణి వెంట వచ్చినవారిలో యిద్దరు తప్ప తక్కినవారందరూ, రాజుగారిచ్చిన బహుమతులు తీసుకుని స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. హియోకు పన్నెండుమంది పిల్లలు కలిగారు. పదిమంది కొడుకులు, యిద్దరు కూతుళ్లు. కొడుకులలో యిద్దరికి తమ పుట్టింటివారి యింటిపేరు పెట్టాలని రాణి కోరితే రాజు సమ్మతించాడు. ఆమె 157వ ఏట క్రీ.శ. 189లో మరణించింది. తన ప్రజల మనస్సులలో సుస్థిర స్థానాన్ని పొందింది. అంతేకాదు, రెండు వేల సంవత్సరాల తర్వాత భారత్-కొరియాల మధ్య సాంస్కృతిక వారధిగా వన్నె కెక్కుతోంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు