cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: కలాంను బాబే రాష్ట్రపతి చేశారా?

ఎమ్బీయస్: కలాంను బాబే రాష్ట్రపతి చేశారా?

రాజకీయాలకు అతీతంగా సైంటిస్టు ఐన డా. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడం వాజపేయి ప్రభుత్వం చేసిన గొప్ప పనుల్లో ఒకటి. దానికి కారణం తనే అనీ, తనే కలాంను రాష్ట్రపతిగా ప్రతిపాదించి, ఆయన పేరు అందరూ ఆమోదించేట్లు చేశానని బాబు చెప్పుకుంటూ ఉంటారు. కలాం పోయినప్పుడు కూడా యీ విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని కలాం తన ‘‘టర్నింగ్ పాయింట్స్, ఎ జర్నీ త్రూ ఛాలెంజెస్’’ పుస్తకంలో రాశారని కూడా బాబు చెప్పారు. కలాం తన పుస్తకంలో రాసినదేమిటంటే ‘ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది, వాజపేయి గారు మాట్లాడదామనుకుంటున్నారని. నేను వెయిట్ చేస్తున్నాను. ఇంతలో నా సెల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఫోను వచ్చింది.  ‘ప్రధాని నుంచి ఒక ఆఫర్ వస్తుంది. కాదనకండి, ప్లీజ్’ అన్నారాయన. బాబుతో మాట్లాడుతూండగానే వాజపేయి గారు లైన్లోకి వచ్చారు. నాకు దేశాధ్యక్ష పదవి ఆఫర్ చేశారు.’

అంటే దీని అర్థం, వాజపేయి చెప్పేందుకు ముందే బాబు కలాంకు ఫోన్ చేసి ఆ పదవిపై హింట్ యిచ్చారు. ఒప్పుకోమని సూచించారు. అంతేకానీ బాబే ఆ పదవికి తనను ప్రతిపాదించి, యితరులను ఒప్పించారని కలాం రాయలేదు. ఎందుకంటే ప్రధాని ఫోన్ చేసేందుకు కొన్ని రోజుల ముందు నుంచి, ఎవర్ని ఎంపిక చేయాలన్న దానిపై ఎన్‌డిఏ ప్రభుత్వ భాగస్వాముల మధ్య తర్జనభర్జనలు జరిగాయి. ఎంపిక చేయగానే సరి కాదు, ఆయన అభ్యర్థిత్వం ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెసు,తృతీయ ఫ్రంట్ (అప్పట్లో పీపుల్స్ ఫ్రంట్ అని పేరు పెట్టుకున్నారు) కూటమికి కూడా ఆమోదయోగ్యం చేయడానికి కొంత కసరత్తు చేయవలసి వచ్చింది. ఎవరెవరు ఏయే అభ్యర్థిని ప్రతిపాదించారు అనేది ‘‘ఇండియా టుడే’’ 2002 జూన్ 25 సంచికలో విపులంగా రాశారు. దాని ఆధారంగానే యీ వ్యాసం రాస్తున్నాను. దీన్ని బట్టి కలాం ఎంపికలో బాబు పాత్ర ఎంతో పాఠకులకు తెలుస్తుంది.

రాష్ట్రపతిగా ఉన్న కెఆర్ నారాయణన్ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన స్థానంలో ఎవర్ని ఎంచుకోవాలా అని ఎన్‌డిఏ నాయకులైన వాజపేయి, ఆడ్వాణీ ఒక బృందాన్ని ఏర్పరచారు. దానిలో వీళ్లిద్దరితో పాటు ఫెర్నాండెజ్, జస్వంత్ సింగ్, ప్రమోద్ మహాజన్, వెంకయ్య నాయుడు సభ్యులు. వీళ్లు జూన్ 5న సమావేశమై నారాయణన్‌ను కొనసాగించకూడదని, ఆయన స్థానంలో పిసి అలెగ్జాండర్‌ను చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ముందుగా నారాయణన్‌ను ఎందుకు కొనసాగించకూడదు? అనే దాని గురించి చెప్పాలంటే ఆయన కాంగ్రెసు ఎంపీ. రాజీవ్ హయాంలో మంత్రిగా ఉన్నాడు. పివి హయాంలో 1992లో ఉపరాష్ట్రపతి అయ్యాడు. 1997 జులైలో కాంగ్రెసు మద్దతుతో నడిచిన యునైటెడ్ ఫ్రంట్ హయాంలో ఐకె గుజ్రాల్ ప్రధానిగా ఉండగా రాష్ట్రపతి అయ్యాడు. ఆ ప్రభుత్వం కూలి, 1998లో వాజపేయి 13 నెలల ప్రభుత్వం వచ్చినపుడు, అది కూలి 1999లో మళ్లీ ప్రధాని అయినప్పుడు కూడా రాష్ట్రపతిగానే ఉన్నాడు. కానీ ఎన్‌డిఏతో ఆయనకు సఖ్యత లేదు. న్యాయమూర్తుల నియామకం, 356 వినియోగం, వివిధ రాజ్యాంగ సంస్థలకు నియామకాలు.. యిలాటి వాటిపై నారాయణన్ ఇబ్బందికరమైన ప్రశ్నలు వేశారు. అందువలన ఆయనను కొనసాగించడం వాజపేయికి యిష్టం లేదు.

ఆయన దళితుడు కాబట్టి, కొనసాగించకపోతే బిజెపిని దళిత వ్యతిరేకి అంటారేమోననే భయం ఉంది. అందుకని ఆయన స్థానంలో మైనారిటీలకు చెందిన వ్యక్తిని వేస్తే చెడ్డపేరు రాదు. అందుకే అలెగ్జాండరు పేరు ముందుకు వచ్చింది. ఎంపిక చేసే వ్యక్తి తమకే కాక, కాంగ్రెసుకు, మూడో ఫ్రంట్‌కు కూడా కాస్తయినా ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మొత్తం ఎలక్టొరల్ కాలేజీలో ఉన్న 11 లక్షల ఓట్లలో ఎన్‌డిఏకు 55శాతం మాత్రమే ఓట్లున్నాయి. ప్రతిపక్షాలు ఒకటై, ఏదైనా మాయ చేస్తే తమ అభ్యర్థి ఓడిపోకూడదు. అలా అని వామపక్షవాదినో, కాంగ్రెసు సంస్కృతిలో మునిగి తేలినవాణ్నో తెచ్చుకోకూడదు. అందుకని అలెగ్జాండర్ అయితే ఫర్వాలేదనుకున్నారు.

ఎవరీ అలెగ్జాండర్? 1921లో పుట్టాడు. 1948కి చెందిన ఐఏఎస్ క్యాడర్ అధికారి. ఇందిరా గాంధీ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశాడు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్‌లో, యునైటెడ్ నేషన్స్‌లో పనిచేసి సమర్థవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. 1988లో రాజీవ్ గాంధీ అతన్ని తమిళనాడు గవర్నరుగా వేశాడు. రెండేళ్లు ఆ పదవిలో ఉన్నాడు. పివి ప్రధాని అయ్యాక ఆయన ఇతన్ని 1993లో మహారాష్ట్ర గవర్నరుగా వేశారు. 2002 వరకు ఆ పదవిలో ఉన్నాడు. ఏ పార్టీ పట్ల పక్షపాతం చూపకుండా, నియమాలకు కట్టుబడి వ్యవహరించడంతో ఏ పార్టీకి అతని పట్ల అభ్యంతరం లేదు. అలెగ్జాండర్ పేరుకి బాల ఠాకరే, ఎన్‌సిపి లీడరు శరద్ పవార్ కూడా సరేనన్నారు. ఆయితే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే ముందు భాగస్వామ్య పక్షాలను కూడా సంప్రదించాలనుకుని ఆ బాధ్యతను ఫెర్నాండెజ్‌కు అప్పగించారు.

మర్నాడే ఆడ్వాణీ ఒక విందు యిచ్చి ఎన్‌డిఏ కన్వీనరైన బాబుని ఆహ్వానించి అలెగ్జాండరు పేరు అనుకుంటున్నామని చెప్పారు. వెంటనే బాబు తాను అలెగ్జాండరు పేరు ఒప్పుకోనని, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ను రాష్ట్రపతి చేయాలని, ఒకవేళ అది కుదరకపోతే ఉపరాష్ట్రపతి పదవిలో కృష్ణకాంత్‌ను కొనసాగించాలని డిమాండు చేశారు. దళితుణ్ని తీసి వేసి అగ్రవర్ణ హిందువును చేస్తే బిజెపికి దళిత వ్యతిరేకి అనే పేరు వస్తుందని, పైగా రాష్ట్రపతిగా ఎవరైనా తటస్థుణ్ని వేసినా, ఉపరాష్ట్రపతిగా బిజెపి నాయకుణ్ని వేసుకునే అవకాశం తమకు ఉండాలని (తర్వాత ఆగస్టులో బైరన్ సింగ్ షెకావత్‌ను వేసుకున్నారు) ఆడ్వాణీ వాదించారు. కృష్ణకాంత్ పేరు యితర భాగస్వాములకు కూడా సూచిద్దామని, ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నిద్దామని బాబు అన్నారు. బాబుకి యింత బాగా నచ్చిన కృష్ణకాంత్ ఎవరు?

ఆయన కాంగ్రెసు కుటుంబానికి చెందినవాడు. సోషలిస్టు భావాలున్న కాంగ్రెసు నాయకుడు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండే రోజుల్లో చంద్రశేఖర్, మోహన్ ధారియా యిత్యాదులతో కలిసి ‘యంగ్ టర్క్స్’ అనే గ్రూపుగా ఏర్పడి బ్యాంకుల జాతీయకరణ వంటి చర్యలు చేపట్టేట్లు ఇందిరపై ఒత్తిడి తెచ్చినవారిలో ఒకడు. ఆమె ఎమర్జన్సీ విధించినప్పుడు యితను వ్యతిరేకించాడు కానీ యితన్ని ఇందిర అరెస్టు చేయించలేదు. ఎమర్జన్సీ తర్వాత తన మిత్రులు చంద్రశేఖర్ వగైరాలతో కలిసి జనతా పార్టీలో చేరాడు. తర్వాత జనతా దళ్‌లో చేరాడు. 1989లో జనతా దళ్ ప్రభుత్వం ఏర్పడినపుడు చంద్రశేఖర్ ప్రధాని విపి సింగ్‌కు చెప్పి 1990 ఫిబ్రవరిలో కృష్ణకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా వేయించాడు. అప్పట్లో కాంగ్రెసు ప్రభుత్వం ఉండేది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. 1997 ఆగస్టు వరకు గవర్నరుగానే ఉంటూ, యునైటెడ్ ఫ్రంట్ తరఫున ఐకె గుజ్రాల్ ప్రధానిగా ఉండగా ఉపరాష్ట్రపతి అయ్యాడు.

ఆయన కాంగ్రెసు నేపథ్యం, జనతా దళ్ నేపథ్యం చూస్తే చంద్రబాబు ఆయనను సిఫార్సు చేయవలసిన పనంటూ కనబడదు. కానీ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనరుగా ఉండే రోజుల్లో ఆయన్ని ఉపరాష్ట్రపతి చేయాలని పట్టుబట్టింది చంద్రబాబే! అంతే కాదు, దరిమిలా రాష్ట్రపతిని చేయాలని పట్టుబట్టిందీ బాబే! ఆయన ఆ పదవీ కాలం కొన్ని నెలల్లో ముగుస్తోందనగా 75వ ఏట చనిపోతే, హైదరాబాదులోని యూసుఫ్ గూడాలో కట్టించిన పార్కుకు ఆయన పేరు పెట్టినదీ బాబే! పార్కులకీ వాటికీ ముఖ్యమంత్రుల పేర్లు, ప్రధానుల పేర్లు, దేశనాయకుల పేర్లూ పెడతారు తప్ప, గవర్నర్ల పేర్లు పెట్టరు. కృష్ణకాంత్ ఆంధ్రప్రదేశ్‌కు ఒరగబెట్టినదీ ఏమీ లేదు. మరి చంద్రబాబుకి ఆయనపై ఎందుకింత మోజు? ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ఏమీ ఒరగబెట్టలేదు కానీ బాబుకి ముఖ్యమంత్రి పదవి ఒరగబెట్టాడు.

చంద్రబాబు ఎన్టీయార్‌కు వెన్నుపోటు పొడిచినపుడు ఆయనకు అండగా నిలిచినది స్పీకరూ, గవర్నర్లే! 1995 ఆగస్టు 25న ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీయార్ అసెంబ్లీని రద్దు పరచాలని తీర్మానం చేసి ఉదయం 7.45కి గవర్నరు కిస్తే ఆయన కిమ్మనలేదు. ఆ క్షణానికి ఎన్టీయార్ మెజారిటీని కోల్పోలేదు. అయినా గవర్నరు ఆయన సలహాను ఎందుకు తోసిరాజన్నాడో ఎక్కడా వివరించలేదు. 9.30కి చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో వస్తే, వారి సంఖ్య లెక్కపెట్టే బాధ్యత స్పీకరు చూడాలని అన్నారు. స్పీకరు యనమల ఎటూ బాబు మనిషే. సెప్టెంబరు 7 నాటి అసెంబ్లీ సమావేశంలో ఎన్టీయార్‌కు మాట్లాడే అవకాశమే యివ్వలేదు. అకారణంగా సస్పెండ్ కూడా చేశాడు. అలాటి స్పీకరుకి యీ అధికారం కట్టబెట్టడమే కాకుండా, ఆగస్టు 30 కల్లా అసెంబ్లీలో మీ బలాన్ని నిరూపించుకోండి అని ఎన్టీయార్‌కు కృష్ణకాంత్ ఆగస్టు 27న ఉదయం చెప్పారు.

గతంలో గవర్నరు రామ్‌లాల్ తనకు బలం ఉందని క్లెయిమ్ చేసిన నాదెండ్లకే 30 రోజుల గడువిచ్చారు, యిప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఆ మాత్రం గడువివ్వరా అని ఎన్టీయార్ అడిగినా కృష్ణకాంత్ ఒప్పుకోలేదు. కావాలంటే ఇంకొక్క రోజు గడువిస్తా, ఆగస్టు 31 కల్లా నిరూపించుకోండి అన్నారు. అప్పటికే 158 మంది ఎమ్మెల్యేలు బాబు వెంట ఉన్నారనుకుంటే ఎన్టీయార్ కోరిన గడువు యివ్వడానికి అభ్యంతరమేమిటి? నాదెండ్ల 30 రోజులు పాలించారు, అయినా ఎన్టీయార్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు జారిపోలేదే! అలాగే బాబు వెనక ఉన్న ఎమ్మెల్యేలు కూడా స్థిరంగా ఉండి వుండేవారు కదా! ఆగస్టు 25నే వైస్రాయి సంఘటన, ఎన్టీయార్ వ్యాన్‌పై చెప్పులు పడడం జరిగాయి. కొందరు ఎమ్మెల్యేలలో అది మనస్తాపం, పశ్చాత్తాపం కలిగించింది. నెల్లాళ్ల గడువు యిస్తే వాళ్లు వెనక్కి వెళ్లిపోతారేమోనని బాబుకి బెంగ. అందుకే గవర్నరు ఎన్టీయార్‌కు గడువు యివ్వలేదు. గవర్నరు వలపక్షంతో వ్యవహించి ఉండకపోతే తను అంత సులభంగా ముఖ్యమంత్రి అయి వుండేవాణ్ని కాదని బాబుకి తెలుసు. అందుకే కృష్ణకాంత్ పట్ల అంత కృతజ్ఞతాభావం.

కానీ యీ కృతజ్ఞతాభారం ఎన్‌డిఏ భాగస్వాములెవరికీ లేదు. నేషనల్ ఫ్రంట్ కన్వీనరు పోస్టు నుంచి రాత్రికి రాత్రి ఊసరవెల్లి అసూయ పడే వేగంతో బాబు ఎన్‌డిఏ కన్వీనరు పోస్టుకి మారిపోయారు కానీ వాజపేయి వాళ్లూ మారలేదు. అందువలన తమ సిద్ధాంతాలకే వాళ్లు కట్టుబడ్డారు. జీవితంలో చాలాభాగం జనసంఘ్, బిజెపిలకు వ్యతిరేకంగా పోరాడి, తృతీయ ఫ్రంట్‌కు చెందిన కృష్ణకాంత్‌ను వాటేసుకోవడానికి వాళ్లు సిద్ధంగా లేరు. అందుకని జూన్ 6, 7లలో ఫెర్నాండెజ్ తమను సంప్రదించినపుడు మమతా బెనర్జీ నుంచి నవీన్ పట్నాయక్ వరకు ఏ భాగస్వామీ కృష్ణకాంత్‌ పట్ల అనుకూలత వ్యక్తం చేయలేదు. బాల ఠాక్రే అయితే, కృష్ణకాంత్‌ను చేస్తే తన మద్దతు ఉపసంహరించి, ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని కూలుస్తానని కూడా బెదిరించాడు. భాగస్వామి కాకపోయినా, మూడవ ఫ్రంట్‌లో ఉంటూ కాంగ్రెసు అధికారంలోకి రాకుండా 1999లో అడ్డుపడిన ములాయం కలాం పేరు సూచించారు. కానీ ఆ పేరు తక్కినవారి ఆమోదం పొందలేదు.

జూన్ 7న బృందం మరోసారి సమావేశమై అలెగ్జాండరు పేరు ఖరారు చేసింది. వాజపేయి బాబుకి ఫోన్ చేసి విషయం చెప్పారు. బాబు ‘అప్పుడే ఏమీ తేల్చకండి, నిర్ణయం మరో రోజు వాయిదా వేద్దాం’ అన్నారు. మర్నాడు అలెగ్జాండరు పేరు ఖరారు చేసిన తీరుని ప్రశ్నించారు. దాంతో కంగారు పడిన బిజెపి నాయకులందరూ బాబుకి ఫోన్ చేసి ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ బాబు ఎవరి మాటా వినలేదు. ఓ పక్క వాజపేయి ముఖ్య కార్యదర్శి బ్రజేశ్ మిశ్రా, కాంగ్రెసు నాయకుడు నట్వర్ సింగ్‌తో మాట్లాడడం బాబుకి కోపాన్ని తెప్పించింది. జూన్ 9, 10 ఉదయం కూడా ఎవరి పేరూ తేలకుండానే గడిచిపోయాయి.

చివరకు జూన్ 10 సాయంత్రం 6.30కి ఫెర్నాండెజ్, మహాజన్, వెంకయ్య, ఆడ్వాణీ సమావేశమై అనేక పేర్లు చర్చించారు. ఎన్‌డిఏ ఎవరి పేరు సూచించినా దాన్ని వ్యతిరేకిస్తూ పోటీ అభ్యర్థిని పెట్టాలని లెఫ్ట్ ఆధ్వర్యంలోని పీపుల్స్ ఫ్రంట్ కంకణం కట్టుకుంది. కాంగ్రెసుకు కూడా అలెగ్జాండరు ఎంపికపై అభ్యంతరాలున్నాయని తెలిసింది. అలెగ్జాండరు కాకపోతే మరో ప్రముఖ మైనారిటీ ఎవరాని ఆలోచిస్తే ఎన్‌డిఏ ప్రభుత్వానికి సైంటిఫిక్ ఎడ్వయిజర్‌గా పని చేస్తున్న వివాదరహితుడు, అందరికీ ఆప్తుడు కలాం పేరు తట్టింది. నాలుగు నెలల క్రితం జరిగిన గోధ్రా అల్లర్లతో ముస్లిం వ్యతిరేకిగా బిజెపికి  పడిన ముద్ర దీనితో మాసిపోతుందని. ములాయం మొదట్లోనే ఆయన పేరు సూచించాడు కాబట్టి పీపుల్స్ ఫ్రంట్ సంగతెలా ఉన్నా ఆయన కలిసి వస్తాడని అంచనా వేశారు. కలాం పేరు ఖరారు చేసి, వెళ్లి వాజపేయికి చెప్తే ఆయనా భేష్ అన్నాడు. అప్పుడు బాబుకి ఫోన్ చేసి చెప్తే ఆయన సరేనన్నాడు. తన కృష్ణకాంత్‌కు సపోర్టు తెప్పించలేక కలాం పేరుకు సరేనన్నాడు తప్ప, మొదటే కలాం పేరును ఆయన సూచించలేదు. ఆయన కోసం తక్కిన భాగస్వాములతో కాన్వాస్ చేయలేదు. ఆ పని ఫెర్నాండెజే చేశాడు.

కలాం పేరు చెప్పగానే ములాయం ఇంత చక్కటి ముస్లిం అభ్యర్థిని వ్యతిరేకిస్తే మా పార్టీ మద్దతుదారులు ఒప్పుకోరు అన్నాడు. మాయావతి కూడా అదే అంది. ఎన్‌డిఏ కలాం అనే క్షిపణి వేయడంతో పీపుల్స్ ఫ్రంట్ చెల్లాచెదురైంది. కాంగ్రెసు సందిగ్ధంలో పడింది. ‘మతతత్వ’ పార్టీ ఐన బిజెపి ఒక ముస్లింను దేశ ప్రథమపౌరుడిగా ప్రతిపాదిస్తే సెక్యులర్ పార్టీ ఐన తాము అడ్డు చెప్పడమా? ఎలా? అనే మీమాంసలో పడింది. నారాయణన్ దగ్గరకు వెళ్లి మీరు మళ్లీ పోటీ చేయండి అని అడిగింది. సంఖ్యాబలం లేదుగా అన్నాడాయన. ఒంటరిగా మిగిలిన లెఫ్ట్ ఫ్రంట్ మాత్రం ములాయంను ఫాసిస్టు అని తిట్టి, ఏమైతే అది అయిందని తన ఫ్రంట్ తరఫున లక్ష్మీ సెహగల్‌ను అభ్యర్థిగా నిలిపింది. కలాంకు 90శాతం ఓట్లు వస్తే (ఎన్‌డిఏకు ఉన్నది 55శాతం ఓట్లేనని గుర్తు పెట్టుకోవాలి) ఆవిడకు 10శాతం ఓట్లు వచ్చాయి.

ఇదీ కలాం రాష్ట్రపతిగా ఎన్నికైన విధం. ఈసారి బాబు కనుక మీ వద్దకు వచ్చి ‘నేనే కలాంను రాష్ట్రపతిగా చేశాను’ అంటే మీరు చిరునవ్వు నవ్వి ‘అలాగేలే’ అనేసి ఊరుకోండి తప్ప సీరియస్‌గా తీసుకోకండి. అనేసి అక్కణ్నుంచి వెళ్లిపోండి. లేకపోతే ఆయన కలాంకు సైన్సు నేర్పించింది నా హయాంలోనే అని మొదలెడతాడు. తట్టుకోలేరు! 

తాజాకలం: నిన్న నా వ్యాసం అప్‌లోడ్ అయ్యాక నా వాదనను ఖండిస్తూ ఒక పాఠకుడు 2002 జూన్ 10 నాటి ‘‘టైమ్స్ ఆఫ్ ఇండియా’’లో హైదరాబాదు నుంచి రాత్రి 8 గం.లకు వెలువడిన ఒక కథనాన్ని పంపారు. దానిలో కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో బాబు ప్రధాన పాత్ర పోషించారు అని ఉంది. వార్తకు సోర్స్‌గా ‘ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు’ అని కథనంలోనే రాశారు. నేను వెంటనే ‘‘టైమ్స్ ఆఫ్ ఇండియా’’ న్యూ ఢిల్లీ ఎడిషన్ జూన్ 8 నాటికి సంచిక చూశాను. ఎందుకంటే నేను వ్యాసంలో రాసినట్లు కలాం ప్రతిపాదన జూన్ 10 దాకా రాలేదు. దానిలో రేసులో ఉన్నది అలెగ్జాండరు, కృష్ణకాంత్ యిద్దరేననీ, కృష్ణకాంత్‌కు బాబు మద్దతుతో పాటు, తృతీయ ఫ్రంట్‌లోని కొందరి మద్దతు ఉందని రాశారు. అంటే అర్థమేమిటి? కలాం బాబు ఫస్ట్ ఛాయిస్ కాదు. కృష్ణకాంత్ కోసమే ఆయన పోరాడారు. అయితే వాజపేయి ఎప్పుడైతే కలాం పేరు ప్రతిపాదించారో కాదనలేకపోయారు.

ఎందుకంటే గోధ్రా సంఘటన తర్వాత కూడా బాబు ఎన్ డిఏ కన్వీనరుగా కొనసాగడంపై టిడిపి ముస్లిం ఓటర్లు మండిపడ్డారు. అందుకే బాబు మోదీని తిట్టి, ముస్లిం రక్షకుడి అవతారం ఎత్తారు. కలాం పేరుకి అడ్డుకొడితే, ఆ యిమేజికి భంగం కలగుతుందని తెలిసే వాజపేయి బాబుపై కలాం అస్త్రం వేశారు. ఒకసారి ఒప్పుకున్నాక కలాం ఎంపిక ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి పిఆర్ ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టారు. అందుకనే రాత్రి 8 గంటలకు ‘‘టైమ్స్ ఆఫ్ ఇండియా’’కు న్యూస్ లీక్ యిచ్చి, ఇక అప్పణ్నుంచి, తనే కలాంను ప్రతిపాదించానని చెప్పుకోసాగారు. కలాం తన పుస్తకంలో బాబు ఫోన్ చేసి ముందుగా వార్త తెలిపారు అని చెప్పారు తప్ప, తనను ఎంపిక చేశారని చెప్పలేదు. అయినా బాబు ‘కలాం తన పుస్తకంలోనే రాశారు చూడండి’ అని చెప్పేసుకున్నారు. చేసినదానికి పబ్లిసిటీకై పాకులాడడం అర్థం చేసుకోవచ్చు. చేయనిదానికి కూడా పబ్లిసిటీ తెచ్చుకోవాలని చూడడాన్ని అర్థం చేసుకోలేము.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?