Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: తొందరెందుకు సుందర‘వర్ధనా’?

ఎమ్బీయస్: తొందరెందుకు సుందర‘వర్ధనా’?

కోవిడ్ వాక్సిన్ గురించి నేను మొదటినుంచీ భయపడుతూ వస్తున్నది నిజమౌతోందనిపిస్తోంది. పబ్లిసిటీ యావలో పడి ప్రభుత్వం సాధారణ ప్రజల ఆరోగ్యంతో రిస్కు తీసుకోబోతోందని అంటూ వచ్చాను. తీరా చూస్తే యిప్పుడు వైద్యుల, వైద్యసిబ్బంది ఆరోగ్యంతో రిస్కు తీసుకుంటోంది. ఇది మరీ ప్రమాదం. అసలే మనకు కావలసినంత మంది వైద్యులు లేరు, నర్సులు లేరు. కోవిడ్ పేరు చెప్పి కార్పోరేట్ ఆసుపత్రులు డబ్బులు చేసుకున్నాయి కానీ వాటిల్లో పనిచేసే వైద్యులు జబ్బుల పాలయ్యారు. పైగా ప్రజల చేత అవమానాల పాలయ్యారు. కోవిడ్ ఉధృతం తగ్గి, హమ్మయ్య అనుకుంటూండగా యిప్పుడు టీకా వేస్తాం జాగ్రత్త అంటోంది ప్రభుత్వం. వాళ్ల ప్రాణాలకేమైనా అయినా, కనీసం అస్వస్థులైనా రోగులైన మనం ఛస్తాం. అదీ నా బెంగ!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ విషయంలో భారత్ ప్రభుత్వం ముందంజ వేసి వాక్సిన్ తయారుచేయించి, ప్రజలను కాపాడేసింది అని ప్రచారం చేసుకోవాలని పాలకుల యావ. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు వాక్సిన్ వచ్చేసింది అని ప్రకటించి, జండాతో బాటు కాలరు కూడా ఎగరేద్దామనుకున్నారు. అందుకే ప్రభుత్వ సంస్థ ఐసిఎమ్మార్ ఆ తేదీ కల్లా వాక్సిన్ తెచ్చి మా చేతిలో పెట్టాలి, ఖబడ్దార్ అంది. పరిశోధనలను ఎవరైనా శాసించగలరా అంటూ లోకమంతా నవ్వింది. అప్పటికి రెండో దశ ప్రయోగాలే పూర్తి కాకపోవడంతో ఐసిఎమ్మార్ చప్పబడింది. మనకు ముఖ్యమైన మరో తేదీ జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం. విదేశీ పాలకుణ్ని అతిథిగా పిలిచే సందర్భం కూడా.  ఐంద్రజాలికుడు టోపీలోంచి కుందేలు లాగి జనం కళ్ల ముందు ఆడించినట్లు అవేళ ఏదో ఒక వాక్సిన్‌ను బయటకు తీసి, ఇదంతా మా ప్రజ్ఞే అని టోపీలో తురాయి తురుముకోవాలని తాపత్రయం.

ఈ ప్లానుకు అనుగుణంగా గబగబా అడుగులు వేసేస్తున్నారు. అయితే వున్న పరిస్థితి ఏమిటి? ఫైజర్ కోవిడ్ వాక్సిన్ చేసేశాం అంటూ ఒకటి బయటకు వదిలింది. దాన్ని నిలువ చేసే సామర్థ్యం మన దగ్గర లేదు కాబట్టి అది మనకు పనికి రాదు. వాక్సిన్ రంగంలో అనుభవం లేని మోడెర్నా మా వాక్సిన్ రెడీ అంది. ఆ టెక్నాలజీని మొదటిసారిగా మనుషులపై ప్రయోగిస్తున్నారు. దాన్ని పాశ్చాత్యదేశాలు బుక్ చేసుకున్నాయి. ఇప్పట్లో యిక్కడ అందుబాటులోకి రాదు. చైనా వాక్సిన్‌ను నమ్మలేం కాబట్టి, చైనాతో ప్రస్తుతం వైరం నడుస్తోంది కాబట్టి దాన్ని వాడలేం. రష్యా దానిపై కూడా నమ్మకం తక్కువే కాబట్టి, రెడ్డీ లాబ్స్ వాళ్లు యిక్కడ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి చూపిస్తే తప్ప అనుమతి యిచ్చే పరిస్థితి లేదు. జైడస్ కాడిలా మూడో దశ మొదలుపెట్టలేదు. ఇక సీరం, భారత్ వాళ్లు చేస్తున్న వాక్సిన్‌లు మూడో దశ ప్రయోగాల్లో వున్నాయి.

అవన్నీ అయి, అధ్యయనం చేశాక కానీ అనుమతులు యివ్వకూడదు. 2021 జూన్ నాటికి వాక్సిన్ విడుదల చేసే అవకాశం వుందని నవంబరు మధ్యలో భారత్ బయోటెక్ ప్రకటించింది. అవకాశం మాత్రమే అనేది యిక్కడ ముఖ్యమైన పాయింటు. ఎందుకంటే మూడో దశ ప్రయోగాలలోనే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ బోల్తా పడుతున్నాయి. భారత్ బయోటెక్‌కు రెండో దశ ప్రయోగాలకే వాలంటీర్లు దొరకలేదు. 750 మంది మీద ప్రయోగాలు చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారు కానీ ఏ కారణం చేతనో సగానికి సగం తగ్గించి, 380 మంది మీదనే చేశారు. పరీక్షలు పూర్తయ్యేయో లేదో, వాటి డేటాను విశ్లేషించే సమయం కూడా తీసుకోకుండా మూడో దశ ప్రయోగాలకు అనుమతి యిచ్చేశారు ప్రభుత్వం వారు. మూడో దశ ప్రయోగాలను 26000 మంది మీద చేస్తామని తలపెడితే డిసెంబరు 22 నాటికి 13 వేల మంది మాత్రమే దొరికారు. తక్కిన వాళ్లు ఎప్పుడు దొరుకుతారో, వాళ్ల మీద ప్రయోగాలు ఎప్పటికి చేయాలో, ఎలాటి ఫలితాలు వస్తాయో అంతా అగమ్యగోచరం.

ఇక సీరమ్ వాళ్ల వాక్సిన్ ఇంగ్లండు, బ్రెజిల్‌లలో మూడో దశ పూర్తి చేసుకుంది కాబట్టి, ఫలితాలు పూర్తిగా విశ్లేషించకుండానే బ్రిటన్ ఎమర్జన్సీ యూసేజ్ పర్మిషన్ యిచ్చేసింది. ఆ ప్రయోగాలు యిక్కడ వర్తించవని తెలిసే, యిక్కడ మళ్లీ మన జనాభా మీద చేయమని ప్రభుత్వం చెప్పింది. రష్యా వాక్సిన్‌కు అదే చెప్పింది. తక్కిన వ్యాధుల విషయంలో కంటె ఎక్కువగా కోవిడ్‌కు యిది బాగా వర్తిస్తుంది. ఎందుకంటే దీనిలో ఎత్నిక్ వేరియేషన్ (ఒక్కో జాతిపై ఒక్కోలా ప్రవర్తన) బాగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి మన దగ్గర కోవిడ్ తీవ్రత బాగా తగ్గింది. కొత్త కేసులు ఎక్కువగా రావటం లేదు, వచ్చినవాళ్లు కోలుకుంటున్నారు. మరణాల సంఖ్యా తగ్గింది. ప్రజల్లోనూ ధీమా పెరిగింది. ఫంక్షన్‌లకు హాజరవుతున్నారు. సామాజికదూరమా? అదేమిటి? అని అడుగుతున్నారు. షేర్ ఆటోల్లో కిక్కిరిసి కూర్చుంటున్నారు. మాస్కులు మూతికి కాకుండా గడ్డానికి కట్టుకుంటున్నారు. కోవిడ్ వస్తే ఆస్పత్రులకు వెళ్లి లక్షలు ధారపోయటం లేదు. సాధ్యమైనంత వరకు యింట్లోనే వుండి వైద్యం చేయించుకుంటున్నారు.

మరి అనేక దేశాల్లో కోవిడ్ తడాఖా చూపిస్తూనే వుంది. కొన్ని దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి. కొన్ని ఆలోచిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. చెప్పవచ్చేదేమిటంటే కోవిడ్‌ వైరస్‌ దశావతరాలూ ఒకేసారి ఎత్తేస్తోంది. ఒక్కో దేశంలో ఒక్కో అవతారం. ఇలాటి పరిస్థితుల్లో బ్రెజిల్‌లో పనిచేసినట్లే వాక్సిన్ మన దగ్గర పనిచేయాలని లేదు కాబట్టే యిక్కడ పరీక్షలు తప్పకుండా అవసరం. అయితే ఇక్కడ వాలంటీర్లు ఓ పట్టాన దొరకటం లేదు. వాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌ల గురించి వున్న సందేహాలతో వెనుకంజ వేస్తున్నారు. సాధారణంగా ఏదైనా రోగానికి వాక్సిన్‌ పనిచేయకపోతే, మందు వేసి తగ్గిస్తారు. కోవిడ్ విషయంలో మందే లేదు. తీరి కూర్చుని రోగాన్ని రప్పించుకున్నట్టవుతుందని భయం. భారత్ వాక్సిన్‌కు దొరకనట్లే సీరం వాక్సిన్‌కూ వాలంటీర్లు దొరకటం లేదు. ముంబయిలో ఒక్కో ఆసుపత్రిలో వెయ్యేసి మందిని రిక్రూట్ చేసుకుందామనుకుంటే ఒక దానిలో 120 మంది, మరో దానిలో 360 మంది దొరికారని చదివి వున్నాను. దేశం మొత్తం మీద 17 కేంద్రాలలో 1600 మంది మీద చేశారని ‌డిసిజిఐ అన్నారు.

ఇప్పుడు భారత్ సిఎండీ ఎల్లా కృష్ణగారు సీరం వాళ్లు 100 మంది మీద మాత్రమే ప్రయోగాలు చేశారంటున్నారు. పైగా అది వాడిన వారిలో 60 శాతం మందికి సైడ్ ఎఫెక్‌ట్స్ కనిపించాయన్నారు. దానికి ఖండనగా సీరం సిఇఓ ఆదార్ పూనావాలా ఏదైనా సంఖ్య చెపితే అసలు విషయం తెలుస్తుంది. ఇలా ఏ వాక్సినూ యిప్పట్లో వచ్చేట్లు కనబడటం లేదు. అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదు అన్నట్లు వాక్సిన్ వచ్చేదాకా రిపబ్లిక్ డే ఆగదు. ఆ రోజు ఎలాగైనా సరే కరోనాను పీచమణిచామన్న ప్రకటన చేసి తీరాలి. అందుకని ఎమర్జన్సీ రూటులో వాక్సిన్‌కు అనుమతి యిచ్చేయదలచుకున్నారు. కరోనా ఉధృతి తీవ్రంగా వున్న సమయంలో మలేరియా మందుతో సహా, నానా రకాల మందులూ (రీపర్పస్‌డ్ డ్రగ్స్) వాడిచూడండి అన్నారంటే అర్థం చేసుకోగలం. అది ఎమర్జన్సీ. వరదలో కొట్టుకుపోతున్నవాణ్ని గట్టున పడేయడానికి చేతి కందిన పుల్లో పుడకో అందిస్తాం.

కానీ యిప్పుడు? తక్కిన దేశాల మాట ఎలా వున్నా మన దేశంలో కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదు. థియేటర్ల దగ్గర్నుంచి అన్నీ తెరిచేశాం. ప్రజాజీవనం కుదుటపడుతోంది. ఇప్పుడు ఎమర్జన్సీ పేరుతో నిరూపితం కాని వాక్సిన్‌లు యివ్వడం దేనికి? నదిలో తన పాటికి తను ఈదుతున్నవాడికి తాడో, పామో తెలియనిది చేతికి అందించినట్లయింది. సరే, ఏమైతేనేం, వాక్సిన్ వచ్చేసిందొహోయ్ అనదలచుకున్నారు. అనేస్తున్నారు. అనిపించుకోవడానికి సీరం వాళ్ల వాక్సిన్ రెడీగా వుంది. ఎందుకంటే దానికి యిక్కడ కాకపోయినా వేరే దేశాల్లో అయినా మూడో దశ పరీక్షలు పూర్తయ్యాయి. బ్రిటన్ ఎమర్జన్సీ అనుమతి యిచ్చేసింది. అది చూసి యిక్కడా యిచ్చివేయవచ్చు. అందువలన సీరంకు యివ్వడంలో బేసబబు ఏమీ లేదని ప్రభుత్వం సర్దిపెట్టుకోవచ్చు.

కానీ యిక్కడో చిక్కు వచ్చింది. ’భారతదేశం వాక్సిన్‌లకు పుట్టిల్లు, ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది’ వంటి కబుర్లు టీవీల్లో వినివిని గందరగోళ పడేవారి కోసం చెప్పాల్సి వస్తోంది. మన దేశంలో వాక్సిన్‌లు రిసెర్చ్ చేసి డెవలప్ చేయరు. రిసెర్చి ఎందుకు చేయరు అంటే అదంతా పెద్ద కథ. ప్రభుత్వం ప్రోత్సహించదు. గ్రాంట్లు యివ్వదు, రాయితీలు యివ్వదు. ప్రయివేటు సెక్టార్‌ కూడా బయట నుంచి టెక్నాలజీ తెచ్చి చేద్దామనుకుంటుంది తప్ప రిస్కు తీసుకుని రిసెర్చి చేద్దామనుకోదు. ఇదొక్కటే కాదు, అనేక రంగాల్లో మనకు రిసెర్చి అలవాటు లేదు. వాక్సిన్‌ రంగంలోనైతే, నాకు తెలిసి శాంతా బయోటెక్నిక్ వారి కలరా వాక్సిన్ ఒక్కటే మన దగ్గర ఒరిజినల్‌గా తయారైంది. తక్కినవన్నీ యితర ప్రాంతాల్లో అల్‌రెడీ తయారు చేసిన వాక్సిన్‌లను మనం వేరే రూట్లో కనుక్కున్నామంతే. ఎటొచ్చీ మన దగ్గర చౌకగా, నాణ్యంగా వాక్సిన్ తయారీకి అద్భుతమైన సరంజామా వుంది. అందువలన ప్రపంచం మనకేసి చూస్తున్నది ఉత్పత్తి కోసమే. వాక్సిన్ కనిపెట్టడానికి కాదు.

సీరం వాక్సిన్ కూడా యిక్కడ కనిపెట్టలేదు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా కలిసి డెవలప్ చేస్తే, వారితో కాంట్రాక్టు కుదుర్చుకుని సీరం యిక్కడ ఉత్పత్తి చేస్తోంది. అందువలన అది మన ఉత్పాదన అనడానికి లేదు. ఎన్‌డిఏ ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో ఏర్పాటు ఏమిటి? ఈ నేల మీద వస్తువు ‘మేక్’ చేస్తారు కానీ టెక్నాలజీ, పెట్టుబడి వగైరాలన్నీ బయటివాళ్లవే. ఇక్కడ నేల, కార్మికవేతనాలు చౌక కాబట్టి వాళ్లు యిక్కడకు వస్తున్నారు తప్ప దీనిలో మన ఘనత ఏమీ లేకుండా పోతోంది. ఇప్పుడీ సీరం వాక్సిన్ సంగతీ అంతే. మామూలు పరిస్థితుల్లో యిది ఓకేయే కానీ ఆత్మనిర్భర్ భారత్ అని హోరెత్తిస్తున్న యీ రోజుల్లో మనమే చేశాం అని చూపుకోవడానికి ఒకటైనా లేకపోతే ఎలా అనుకున్నారు. దానికి అవకాశం వున్నది జైడస్ కాడిలా, భారత్ బయోటెక్ వాక్సిన్‌ల విషయంలో! జైడస్‌ మూడో దశలో అడుగు కూడా పెట్టలేదు కాబట్టి భారత్‌నే ముందుకు నెట్టింది ప్రభుత్వం.

ఐవిఐ, ఐసిఎమ్మార్‌ల ద్వారా దానికి కాండిడేటు అందించారు. జంతుపరీక్షలు ఎక్కడ, ఎప్పుడు జరిగాయో ఎవరూ చెప్పటం లేదు. ఫలితాలు బాగా వచ్చాయని మాత్రం చెప్పి వూరుకున్నారు. భారత్ వాళ్ల వాక్సిన్ మొదటిదశ ప్రయోగం మొదలు పెట్టిన రోజునే ‘కరోనాపై విజయం’ అని శంఖనాదం చేశారు. అప్పణ్నుంచి దాదాపు వారానికి ఓ సారైనా హడావుడి చేస్తున్నారు. మన తెలుగునాట యిది మరీ ఎక్కువగా వుంది. ‘ఈనాడు’ కిరణ్ తన వియ్యంకుడి కంపెనీని పల్లకీ ఎక్కించడంలో వింతేమీ లేదు. రామోజీరావుగారికి బిజెపి నాయకులతో వున్న సంబంధాలు తక్కువవి కావు. పైగా భారత్ బయోటెక్‌కు చంద్రబాబుగారితో, వెంకయ్యనాయుడు గారితో బలమైన అనుబంధం వుంది. అందువలన ఆ కంపెనీ ప్రభుత్వం ప్లాన్లకు అనుగుణంగా నడవడానికి ఒప్పుకుంది.

ప్రభుత్వం ఆ కంపెనీ వాక్సిన్‌పై స్వదేశీ ముద్ర కొట్టి, సీరం వాక్సిన్‌కు దీటుగా దాన్ని పెంపుడు కొడుకుగా, దీన్ని సొంత కొడుకుగా పరిగణిస్తూ అనుమతి యివ్వదలచింది. భారత్ వాక్సిన్‌కు రెండో, మూడో దశలలో సగం మంది వాలంటీర్లు మాత్రమే దొరికారంటే ఎబ్బెట్టుగా వుంటుందని, హఠాత్తుగా వాలంటీర్ల సంఖ్య పెంచమంది. అందువలన పది రోజుల వ్యవధిలోనే జనవరి 2 నాటికి 13 వేల నుంచి 23,000 అయిపోయారు. ఇప్పుడు ఐసిఎమ్మార్ ప్రతినిథులు ‘మూడో దశ ప్రయోగాలు దాదాపు 24 వేల మంది మీద (ఈ అంకె ఒక్కోప్పుడు 25 వేలు దాటుతోంది) చేస్తున్నారంటే అది తక్కువ సంఖ్యేమీ కాదు’ అని వాదిస్తున్నారు. వారిలో సగం మంది మీద ప్రయోగాలు యింకా ప్రారంభమే కాలేదన్న సంగతి దాచేస్తున్నారు.

ఇక్కడ అతి ముఖ్యమైన విషయమేమిటంటే, మొదటి దశలో టీకా సురక్షితమైనదా (సేఫ్టీ) కాదా అని పరీక్షిస్తారు. రెండో దశలో యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తోందా లేదా (ఇమ్యూనోజెనిసిటీ) అని చూస్తారు. పని చేస్తోందా లేదా (ఎఫికసీ) అనేది తేలేది మూడో దశలోనే. ఈ దశలోనే ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్ దగ్గర్నుంచి అన్ని వాక్సిన్‌లకూ చిక్కులు వచ్చాయి. మొదటి రెండూ వెయ్యి లోపుమందికి చేస్తే చాలు. టీకా బయటకు వచ్చాక కోట్ల మందికి వేస్తారు. అందువలన మూడో దశలో 30 వేల మందిపై ప్రయోగం చేయమంటారు. ఇంకోటేమిటంటే మొదటి రెండు దశల ప్రయోగాలూ ఆరోగ్యవంతులపై చేస్తారు. మూడో దశలో అన్ని రకాల వారినీ తీసుకుంటారు. వారిలో సగం మందికి టీకా యిచ్చి, తక్కిన ప్లాసెబో యిచ్చి, డబుల్ బ్లయిండ్ సిస్టమ్‌లో (ఎవరికి ఏమిచ్చారో పేషంటుకీ తెలియదు, డాక్టరుకూ తెలియదు) నిర్వహిస్తారు. అత్యంత కీలకమైన మూడో దశ పూర్తి కాకుండానే కోట్లాది మందికి వాక్సిన్ వేసేస్తారంటూ వార్తలు రాగానే అందరూ దడుచుకుంటున్నారు.

ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వసంస్థలు పని చేయసాగాయి. జనవరి 3న సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్‌స్ కమిటీ (సిడిఎస్‌సిఓ) సిఫార్సు మేరకు డిసిజిఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్) ఈ రెండు వాక్సిన్‌లకు ఎమర్జన్సీ పరిస్థితుల్లో రిస్ట్రిక్టెడ్ యూసేజికి (పరిమిత వినియోగానికి) షరతులతో కూడిన అనుమతి యిచ్చారు. ఈ ఎమర్జన్సీకి అర్థమేమిటో తెలియటం లేదు. మనిషి చావుబతుకుల్లో వుంటే ఏదో ఒకటి యిచ్చి కాపాడడం ఎమర్జన్సీ అనుకుంటాం. రోగనివారణకు ఉపయోగపడే వాక్సిన్‌ను ఎమర్జన్సీ ఎలా అంటాం? కోవిడ్ విషయంలో దేశపరిస్థితిలో ఎమర్జన్సీ వుందంటే కాస్త అర్థమవుతుంది. ప్రస్తుతం అది లేదు కాబట్టి టీకా వేయాల్సిన వైద్యుడికి ఎమర్జన్సీ పరిస్థితి వుందనుకోవాలా?

ఇక్కడ తమాషా ఏమిటంటే, రెండు వాక్సిన్‌లకు అత్యవసర పరిస్థితుల్లో నియమిత వాడకానికి.(రిస్ట్రిక్టెడ్ యూజ్ యిన్ ఎమర్జన్సీ సిట్యుయేషన్) అంటూ అనుమతి యిస్తూ దానితో బాటు భారత్ వాక్సిన్‌ విషయంలో ‘అత్యంత ముందు జాగ్రత్తలతో, ప్రజాహితం కోసం, క్లినికల్ ట్రయల్స్ మోడ్‌లో (..ఇన్ పబ్లిక్ యింట్రస్ట్ ఏజ్ ఏన్ ఎబన్డంట్ ప్రికాషన్, ఇన్ క్లినికల్ ట్రయల్స్ మోడ్) యిస్తున్నాం అని చేర్చారు. మాట్లాడేటప్పుడు ‘బ్యాకప్ వాక్సిన్‌గా మాత్రమే అనుమతి యిచ్చాం’ అని చెప్తున్నారు. దశాబ్దాలుగా వాక్సిన్‌ రంగంలో వున్నవారు కూడా యీ బ్యాకప్‌ వాక్సిన్ ఏమిటో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. బ్యాకప్ అంటే క్రికెట్‌లో ఆటగాళ్లలో ఎవరికైనా దెబ్బ తగిలితే దిగాల్సిన 12వ ఆటగాడిలాగానా? లేక తెలుగులో చెప్పాలంటే ఆటల్లో అరటిపండు అనా? సీరం వాక్సిన్ దొరక్కపోతే వట్టి చేతులతో పంపడం దేనికని దీన్ని యిచ్చి పంపిస్తారా? లేక దానివలన సైడ్ ఎఫెక్ట్‌లు వస్తే యిది యిస్తారా? లేక అది యిచ్చాక ఎందుకైనా పడి వుంటుందని యిదీ యిస్తారా? ప్రభుత్వం వారే చెప్పాలి.

పైగా దీనికి అనుమతి యివ్వడం క్లినికల్ ట్రయల్స్ మోడ్ కింద యిస్తున్నారు. అంటే వాక్సిన్‌ తీసుకునేవాళ్లంతా వాలంటీర్లగా మారుతున్నారన్నమాట. మర్యాదగా అడిగితే రావడం లేదని బలవంతపు బ్రాహ్మణార్థంగా టీకా పొడిచి పంపుతారు. దానికి గాను ఎంచుకుంటున్నది డాక్టర్లను! వాళ్లకు ఏ దుష్ఫలితాలూ రాకపోతే, పని చేసిందో లేదో తేలితే అప్పుడు మనకు యిస్తారన్నమాట. ఈ ప్రయోగానికి పాపం డాక్టర్లెందుకు, రాజకీయనాయకులనే వాడవచ్చు కదాని కొందరంటారు. ఏ సౌకర్యం ప్రకటించినా మేముమేమంటూ ముందువరసలో నిల్చునే రాజకీయనాయకులు దీని విషయంలో మాత్రం పట్టుబట్టడం లేదు. ఆరోగ్యశాఖా మంత్రులకు మాత్రం తప్పదు కాబట్టి ‘భయం లేదు, నేను వేయించుకుంటున్నాను చూడండి’ అంటున్నారు. వాళ్లకు టీకా యిస్తున్నారో, ప్లాసెబో యిస్తున్నారో మనకు తెలియదు కదా!

తమ వాక్సిన్‌కు ప్రభుత్వం యిస్తున్న ప్రాధాన్యత చూసి మురిసిన భారత్ సిఎండి కృష్ణగారు ‘మా వాక్సిన్‌ను పోనుపోను మంచినీళ్ల బాటిల్ కంటె తక్కువ ధరకు అందిస్తాం’ అని ప్రకటించారు. ప్రభుత్వం తనపై సవతితల్లి ప్రేమ చూపిస్తూ భారత్‌ను చంకనేసుకుందన్న అక్కసుతో కాబోలు సీరం సిఇఓ ఆదార్ పూనావాలా ‘ఫైజర్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ మాత్రమే వాక్సిన్‌లు. తక్కినవి మంచినీళ్లంత సురక్షితమైనవి.’ అని వెక్కిరించాడు. ‘మా వాక్సిన్‌ను మంచినీళ్లతో పోల్చడమా?’ అంటూ కృష్ణ ఆక్రోశం వెలిబుచ్చారు. దానితో బాటు స్వదేశీ కోణం జోడించారు. ఒక స్వదేశీ వాక్సిన్‌ను యిలా అవమానిస్తారా? అన్నారు. ఈ స్వదేశీ యాంగిల్ బిజెపి వాళ్లు ముందు రోజే వాడేశారు.

మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే, డేటా లేకుండానే అనుమతులు ఎందుకిచ్చారో, హర్షవర్ధన్ వివరణ యివ్వాలి అని కాంగ్రెసు నాయకులు అడిగిన సబబైన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ‘వాక్సిన్ విషయంలో రాజకీయాలు చేయవద్దు’ అని ఆయన జవాబిచ్చాడు. కాంగ్రెసు వాళ్లు కాదు, టీకా తీసుకోవాల్సిన వైద్యుడే ‘ఎందుకీ తొందర హర్షవర్ధనా?’ అని అడిగితే ఆయనేం చెప్తాడు? ఆ వైద్యుడికి రాజకీయ ప్రయోజనం లేదు కదా! సమాధానాలు చెప్పలేని పక్షంలో బిజెపి దేశభక్తి తురఫు ముక్కను వాడుకుంటుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ‘భారతీయమైన దేనినీ కాంగ్రెసు సహించలేదు.’ అంటూ లంకించుకున్నారు. ప్రతిపక్షాలు ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతున్నారన్నారు.

ఇదెక్కడి వాదన? భారతీయ సైంటిస్టులు ఇస్రో నుంచి ఉపగ్రహాలను పంపుతూంటే యిలాటి సందేహాలు వచ్చాయా? లేదే! మనం స్వదేశీ మందులు వాడటం లేదా? స్వదేశీ వాక్సిన్‌లు వాడటం లేదా? చదువు పూర్తి కాకుండానే, పరీక్ష పెట్టకుండానే పాస్ చేసేసినట్లు ప్రకటించిన విద్యార్థికి సబ్జక్టు వచ్చా, రాదా అని అడిగితే దేశభక్తి లేనట్లా? నిజానికి యిటువంటి తొందరబాటు పనుల వలన మనదేశపు సాంకేతిక పరిజ్ఞానంపై విదేశీయులకు అనుమానం వస్తే అది దేశానికి మేలు చేసినట్లా? హాని చేసినట్లా? ఇప్పటికే మానవ గౌరవం (హ్యూమన్ డిగ్నిటీ) విషయంలో మనదేశం ఎక్కడో అడుగున వుందంటారు. దీని కారణంగా మానవప్రాణాలకు ఇండియాలో విలువే లేదు, కోట్లాది మంది మీద ఏ ఒప్పందమూ లేకుండా క్లినికల్ ప్రయోగాలు చేస్తున్నారు అనే మాట వస్తే మన దేశగౌరవం ఏం కావాలి? క్లినికల్ ట్రయల్స్ విషయంలోనైతే వాలంటీరుకు అనేక రక్షణలు వుంటాయి. సీరం వాక్సిన్ విషయంలో ఓ వాలంటీరు కేసు వేస్తానన్నాడు కూడా. ఇప్పుడీ భారత్ వాక్సిన్ వేయించుకున్న వాళ్లకు ఆ రక్షణ ఉండదుగా!

హర్షవర్ధన్ యింకో మాట కూడా అన్నారు. బ్రిటిష్‌లో కొత్తగా వచ్చిన వైరస్ రూపాంతరం మీద కూడా కోవాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని. ఆట్టే మాట్టాడితే, రాబోయే వేరియంట్స్‌ పైనా పని చేస్తుందట. ఈ ముక్క భారత్ వాళ్లు ఎలాగూ అంటున్నారు. బ్రిటన్ వైరస్ అంటుకున్నవారిని యింకా ఏరుతున్నారు. వాళ్లకు యిది యివ్వనూ లేదు, పరీక్ష చేయనూ లేదు. అయినా ఎలా చెప్తున్నారంటేట, యిది నిర్జీవంగా మారిన పూర్తి స్థాయి వైరస్‌తో చేసిన ఇనాక్టివేటెడ్ వాక్సిన్‌ట. ఈ ముక్క ఐసిఎంఆర్ బలరాం భార్గవ నొక్కి వక్కాణించారు. ఎయిమ్స్ డాక్టరొకాయన ‘చైనా వాక్సిన్ కూడా యీ పద్ధతిలో చేసినదే. అది 80 శాతం బాగా పనిచేస్తోందని చైనా చెప్తోంది. అందువలన యిదీ అలాగే పనిచేస్తుంది.’ అని సర్టిఫికెట్టు యిచ్చారు.

చైనావాళ్లవీ, రష్యా వాళ్లవీ అంకెలు మనమే కాదు, లోకంలో ఎవరూ నమ్మటం లేదు. అందుకే ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం చైనా అంకెలు వీళ్లు వాడుకుంటున్నారు. అంత నమ్మకమే వుంటే చైనా, రష్యా వాక్సిన్‌లు ఎకాయెకీ వాడేసేయవచ్చుగా! డేటా లేకుండా ఎలా యిస్తారు అని అడిగితే ఐసిఎంఆర్ ప్రతినిథి ‘డేటా వస్తుంది, దానికో నెల పడుతుంది. వాలంటీర్లు పెరిగే కొద్దీ డేటా పెరుగుతుంది’ అంటున్నారు. డేటా వచ్చాక వాక్సిన్‌లో లోపాలున్నాయని తేలితే అప్పటిదాకా యిచ్చినవాళ్లందరికీ యాంటీడోట్‌లు యిస్తారా? అనుమతి యిచ్చేదేదో నెల తర్వాతే యివ్వవచ్చుగా!

డిసిజిఐ సోమానీ యీ టీకాలు 110 శాతం సురక్షితం అని ఓ పక్క చెపుతూండగా, ఐసిఎంఆర్‌కు చేందిన సమీరనం పాండా ‘తేడాలొస్తే మేం అనుమతి విత్‌డ్రా చేసేస్తాం కూడా’ అంటున్నారు. అంటే వాళ్లకే ధైర్యం లేదని స్పష్టమౌతోంది. ఇలాటి పరిస్థితుల్లో యింత తొందర అవసరమా? అనేదే అందరి ప్రశ్న! వైద్యో నారాయణో హరిః అంటారు. ధన్వంతరీ రూపాలైన మన దేశ వైద్యులను ఆ నారాయణుడే కాపాడాలని కోరుకుంటున్నాను.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?