cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: క్రైమ్‌: బ్యాంకుకు టోకరా వేసి లక్ష పౌండ్లు...4/4

ఎమ్బీయస్‌: క్రైమ్‌: బ్యాంకుకు టోకరా వేసి లక్ష పౌండ్లు...4/4

ఈ తతంగమేమీ తెలియని నోయెస్‌ ఇదే ఆఖరుసారి అనుకుంటూ మర్నాడు అంటే మార్చి 1న పొద్దున్నే కాష్‌ విత్‌డ్రా చేయడానికి కాంటినెంటల్‌ బ్యాంకుకి వెళ్లాడు. 'కొంత క్యాష్‌ పౌండ్లలో యివ్వండి, కొంత ఫ్రాంకుల్లో యివ్వండి' అన్నాడు. మొత్తం పౌండ్లయితే యిప్పుడే యిచ్చేద్దుం కానీ, విదేశీ కరెన్సీ తెప్పించడానికి టైము పడుతుంది, కాస్సేపాగి రండి అన్నారు బ్యాంకు వాళ్లు. అతను తిరిగి వచ్చేలోపున బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ నుంచి వర్తమానం తెలిసిపోయింది. పోలీసులు వచ్చి కాచుకున్నారు. నోయెస్‌ అడుగుపెట్టగానే బ్యాంకు క్లర్కు అతన్ని చూపించాడు. పోలీసులు పట్టుకున్నారు. అతని రాక కోసం కాఫీహౌస్‌లో వేచి ఉన్న జార్జి, మేక్‌ ఏమైందో చూద్దామని బయలుదేరి బ్యాంకువైపుకి నడిచారు.

పోలీసులు నోయెస్‌ను తీసుకుపోతున్నారు. చుట్టూరా ఉన్న జనం నోట 'వేలాది పౌండ్లు..' 'ఫోర్జరీలు..' 'దొంగ బిల్లులు...' 'బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌..' అనే మాటలు వారి చెవిన పడ్డాయి. నోయెస్‌ వీళ్ల కేసి చూసి, తల వంచుకున్నాడు. ఏ భావమూ కనబరచలేదు. విడిగా వచ్చాక 'ఏం చేద్దాం, జార్జి?' అని అడిగాడు మేక్‌ కంగారుగా. 'చేసేదేముంది? నోయెస్‌ తను అమాయకుణ్నని, నార్టన్‌ నిజరూపం తనకు తెలియదని చెప్పి సులభంగా తప్పించుకోగలడు. అందుకు తగిన డాక్యుమెంట్లు ముందే యిచ్చాం. మనం ఏం చేశామని పోలీసులు మనల్ని పట్టుకోవడానికి వస్తారు?' అన్నాడు జార్జి.

అతనూహించినట్లుగానే నోయెస్‌ వీళ్ల గురించి నోరిప్పలేదు. నేను కేవలం ఉద్యోగిని మాత్రమే, యజమాని మోసాలతో నాకు సంబంధం లేదు అని చెప్పుకున్నాడు. కానీ ఇంతటి మేధావి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేశాడు. వందలాది సంవత్సరాల తమ చరిత్రలో యింతటి ఘోర అవమానం మున్నెన్నడూ జరగకపోవడంతో బాంకు విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. మరో లక్ష పౌండ్లు పోయినా సరే, వీళ్లని పట్టుకుని జైల్లో పడేయించాలని పంతం పట్టింది. స్కాట్లండ్‌ యార్డ్‌లోని గూఢచారులందరినీ రంగంలోకి దింపింది. బ్రిటిష్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను అపహాస్యం చేసిన అమెరికన్ల పని పట్టాల్సిందే అనే కసితో వాళ్లూ చిత్తశుద్ధితో పని చేశారు.

మరో రెండుగంటల్లో 'వారెన్‌/హార్టన్‌ పేర్లతో తిరుగుతున్నతని ఆచూకీ చెప్పినవారికి 500 పౌండ్ల బహుమతి' అనే ప్రకటన వెలువడింది. అతని వర్ణన కూడా దానిలో యిచ్చారు. సోమవారం రాత్రి కల్లా పోలీసులు టైలరింగు షాపు గ్రీన్‌ని క్షుణ్ణంగా విచారించారు. మాటల్లో ఒకసారి 'వారెన్‌' తన బట్టలను ఉత్తర ఇంగ్లండ్‌లోని హాగర్‌స్టోన్‌లో ఎన్‌ఫీల్డ్‌ రోడ్డులో హోటల్‌కు యిమ్మనమని చెప్పిన విషయం బయటకు వచ్చింది. నిజానికి అది యీ ముగ్గురూ వ్యూహం పన్నడానికి ముందు నివాసమున్న హోటల్‌. అక్కడకు వెళ్లి చూస్తే ఎవరూ లేరు కానీ ముగ్గురు అమెరికన్లు కలిసి ఉండేవారని మాత్రం తెలిసింది. అంటే ఈ 'వారెన్‌'తో బాటు మరో యిద్దరు అమెరికన్లు కూడా ఉన్నారన్న మాట అనేది నిశ్చయమైంది. మంగళవారం సాయంత్రానికి ఆ అమెరికన్లలో ఒకడి సంగతి తెలిసిపోయింది.

ఎలా అంటే జార్జి నివాసముండే సెయింట్‌ జేమ్స్‌ ప్లేస్‌ హోటల్‌ యజమాని పోలీసులకు రిపోర్టు చేశాడు - 'మా హోటల్లో ఉంటున్న కాప్టెన్‌ జార్జి మెక్‌డొనెల్‌ అనే ఒక అమెరికన్‌ కదలికలు అనుమానాస్పదంగా ఉంటాయి. అతని దగ్గరకు అప్పుడప్పుడు వచ్చే మరో అమెరికన్‌ పద్ధతి కూడా మిస్టీరియస్‌గానే ఉంటుంది' అని. మారుపేర్లు ఉపయోగించండి అని జార్జి ఎంత మొత్తుకున్నా దుస్సాహసి మేక్‌ పట్టించుకోలేదు. హోటల్‌ రిజిస్టరులో అసలు పేరే రాశాడు. పోలీసులు వెళ్లేందుకు కొన్ని గంటల ముందే రూము ఖాళీ చేశాడు. అతని రూమంతా క్షుణ్ణంగా వెతికితే ఫైర్‌ ప్లేస్‌లో పూర్తిగా కాలని కొన్ని కాగితాలు కనబడ్డాయి. ఒక బ్లాటింగ్‌ కాగితపు (రాసేటప్పుడు సిరా ఎక్కువైతే ఒత్తి ఆరేట్లా చేసే మందమైన పేపరు) ఉండ కనబడింది. విప్పి చూస్తే దానిపై ఏక్సెప్టెడ్‌.. పేయబుల్‌ ఎట్‌... బాంక్‌ ఆఫ్‌ బెల్జియం... వంటి మాటలు రివర్స్‌లో కనబడ్డాయి. అంటే ఫోర్జరీ పత్రాలు యిక్కడే తయారయ్యాయన్నమాట అనుకున్నారు పోలీసులు. ఆ సాయంత్రాని కల్లా మేక్‌ వర్ణనతో పట్టుకుంటే 500 పౌండ్ల బహుమతి ప్రకటన వెలువడింది.

మేక్‌కు ఒక గర్ల్‌ ఫ్రెండ్‌ ఉంది. పేరు డైసీ గ్రే. ఒక బారులో బార్‌మెయిడ్‌. మార్చి 6న లివర్‌పూల్‌ నుంచి న్యూయార్కుకి బయలుదేరే పెరూవియన్‌ అనే ఓడలో తనతో సహా న్యూయార్క్‌కు తీసుకెళదామనుకుని రెండు టిక్కెట్లు కొన్నాడు. ఆమెను ముందుగా లివర్‌పూల్‌ వెళ్లి వెయిట్‌ చేయమని చెప్పి, తన హోటల్‌ ఖాళీ చేసి ఆమె నివాసముండే పిమ్లికో లాడ్జింగ్స్‌కు మారిపోయాడు. అంతకు ముందు రోజే ఒక ట్రంకు పెట్టెను ఓడ ద్వారా న్యూయార్క్‌కు బుక్‌ చేశాడు. దానిలో పాతబట్టలున్నాయని దరఖాస్తులో రాసినా, ఆ బట్టల మడతల మధ్య 2.25 లక్షల డాలర్ల విలువైన అమెరికా ప్రభుత్వపు బాండ్లు ఉన్నాయి. మర్నాడు లివర్‌పూల్‌కు అతను వెళ్లేటప్పటికే తన వర్ణనతో ప్రకటన రావడంతో తననెవరో వెంటాడుతున్నారని అతనికి అనుమానం వచ్చింది. తన ప్రియురాలిని కలిస్తే ఆమెకూ ప్రమాదం అనుకుని, వెనుతిరిగి రైల్లో సౌంతాంప్టన్‌ చేరి, అక్కడ న్యూయార్క్‌కు వెళ్లే ఓడ కనబడితే అది ఎక్కేశాడు.

లివర్‌పూల్‌లో అతని కోసం కాచుకుని ఉన్న డైసీకి అతను రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. లండన్‌కు తిరిగి వచ్చేసింది. మేక్‌ను నిలదీద్దామని అతనుండే జేమ్స్‌ ప్లేస్‌ హోటల్‌కు వెళితే పోలీసులు తారసిల్లారు. అసలే మేక్‌ మోసం చేశాడని భగభగమంటూన్న డైసీ తనకు తెలిసున్నదంతా కక్కేసింది. వెంటనే స్కాట్లండ్‌ యార్డ్‌ వాళ్లు బ్రిటన్‌ నుంచి అమెరికాకు వెళ్లే నౌకల ప్రయాణికుల జాబితాలు తిరగేశారు. ఆస్టిన్‌, జార్జి 40 మారు పేర్లు ఉపయోగించారు కానీ మేక్‌కు అది చికాకు కాబట్టి అమెరికాకు పారిపోతూ కూడా తన పేరే వాడాడు. అంతే, స్కాట్లండ్‌ యార్డు వాళ్లు ఓడ సిబ్బందికి కేబుల్‌ పంపించారు. దాంతో మేక్‌ న్యూయార్కులో అడుగు పెట్టకముందే అరెస్టు అయిపోయాడు.

ఈ గొడవలేమీ తెలియని ఆస్టిన్‌ హవానాలో హనీమూన్‌ జరుపుకుంటున్నాడు. లండన్‌ నుంచి వచ్చేశాను, యిక భయం లేదనుకున్న అతను సొంత పేరే వాడుతున్నాడు. పెళ్లి కూడా సొంత పేరుతోనే చేసుకున్నాడు. హవానాలో మంచి హుషారుగా పార్టీలు యిస్తూ సందడి చేసుకుంటున్నాడు. అక్కడున్న బ్రిటిషువారి కళ్లల్లో పడ్డాడు. డైసీ యిచ్చిన సమాచారంతో స్కాట్లండ్‌ యార్డ్‌ వాళ్లు వివిధ దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలకు పేరుతో సహా రాసినపుడు, హవానాలోని బ్రిటిషు కాన్సల్‌ యితన్ని వెంటనే గుర్తు పట్టింది. డిన్నర్‌ పార్టీ యిస్తూండగా అతను అరెస్టయ్యాడు. ఆ విధంగా నేరం బయటపడిన మూడు వారాల్లో ముగ్గురు అరెస్టయ్యారు. జార్జి ఒక్కడే మిస్సింగ్‌. బాంకు వాళ్లు రెట్టించిన పట్టుదలతో 75 మంది డిటెక్టివ్‌లను నియోగించారు.

తన పేరు, మొహం ఎవరికీ తెలియదని జార్జి చాలా ధీమాగా ఉన్నాడు. నిజానికి మార్చి 1నే అతను ఇంగ్లండు విడిచి పారిపోయి వుండవచ్చు కానీ అలాటి అవసరం లేదనుకున్నాడు. తన ఉంపుడుగత్తె నెల్లీ వెర్మాన్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. అక్కణ్నుంచే హార్టన్‌- నోయెస్‌ ఎగ్రిమెంటు తయారుచేసిన లాయరుకు 300 పౌండ్లు పంపించి, నోయెస్‌ తరఫున కోర్టులో వాదించమన్నాడు. మార్చి 4న లండన్‌ తిరిగి వచ్చి, మేక్‌ను చూడబోయాడు. అప్పటికే అతను మాయమై పోవడంతో, యిక తనూ మకాం ఎత్తేద్దామనుకున్నాడు. తన దగ్గరున్న బాండ్లను, బంగారాన్ని సులభంగా తీసుకుపోవడానికి వీలుగా వజ్రాలుగా మార్చేశాడు. నెల్లీకి బ్యాంక్‌ ఫ్రాడ్‌ గురించి తెలియకపోయినా తన అసలు పేరు వివరాలూ తెలుసు. అందుకని ఆమె నోరు విప్పకుండా ఉండడానికి అమెరికా తీసుకెళ్లి పోదామనుకున్నాడు. ఈ ముందు జాగ్రత్తే అతని కొంప ముంచింది.

'మనం ఐర్లండ్‌ నుంచి అమెరికాకు ఓడలో వెళదాం. నేను నీకు నా లగేజంతా అప్పగిస్తాను. నువ్వు అది తీసుకుని మార్చి 6న యూస్టన్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చేయి. హోలీపెడ్‌కు వెళ్లి అక్కణ్నుంచి రాత్రి రైల్లో డబ్లిన్‌కు వెళదాం.' అన్నాడు. ఆమె సరేనంది. అయితే యూస్టన్‌ స్టేషన్‌లో ఆమె భారీ లగేజి పోలీసుల దృష్టిని అకర్షించింది. తెరిచి చూపించమన్నారు. 2717 పౌండ్ల విలువున్న బంగారం దొరికింది. ఇంత బంగారం నీకెక్కడిది అని నిలదీశారు. కంగారు పడిన నెల్లీ, జార్జి గురించి తనకు తెలిసున్నదంతా చెప్పేసింది. జార్జికి యిదంతా ఏమీ తెలియదు. యూస్టన్‌ స్టేషన్‌లో తాము అనుకున్న చోటికి నెల్లీ రాకపోవడంతో కాస్సేపు వేచి చూసి, తనొక్కడే హోలీపెడ్‌కు వెళ్లిపోయాడు. అక్కణ్నుంచి బోటెక్కి డబ్లిన్‌కు మార్చి 7న చేరాడు. నెల్లీ వస్తుందేమోనని ఎదురు చూశాడు కానీ ఆమె రాలేదు సరి కదా తన పేరు, వర్ణన, పట్టుకుంటే 500 పౌండ్ల ప్రకటన పేపర్లలో రావడంతో ఆమె పట్టుబడిందని అర్థం చేసుకున్నాడు. ఇక తను ఇంగ్లండు నుంచి బయటపడడం ఎలా అనేదే ఆలోచించాలి అనుకున్నాడు.

డబ్లిన్‌ రేవుల్లో పోలీసులు తన కోసం కాపు వేసి ఉంటారు కాబట్టి దానికి దక్షిణాన ఉన్న కార్క్‌ అనే చిన్న రేవు నుంచి అమెరికాకు వెళ్లే ''క్యూబా'' అనే ఓడ ఎక్కుదామనుకున్నాడు. డబ్లిన్‌ నుంచి రైల్లో కార్క్‌ చేరాడు. స్టేషన్‌లోంచి బయటకు వస్తూండగానే ఓ పోలీసు కనబడి ''మీరీ ఊరికి యింతకు ముందెప్పుడైనా వచ్చారా సార్‌?'' అని అడిగాడు. ''ఓ, బోల్డుసార్లు'' అనేసి యితను బయటకు వచ్చేసి, ఓ హోటల్‌కి వెళ్లి 'ఛార్లెస్‌ బర్టన్‌' అనే పేర రూము తీసుకున్నాడు. తను యిక్కణ్నుంచి ఓడెక్కడం అసాధ్యమని అతనికి అర్థమైంది. ఎందుకంటే యిక్కడ జనాభా తక్కువ. కొత్తవాణ్ని సులభంగా కనుక్కోగలరు. పైగా పేపర్లలో తన పేరూ వివరాలూ మాటిమాటికీ తెగ వస్తున్నాయి. ఇక్కడి కంటె రద్దీగా ఉండే స్కాట్లండ్‌ నుంచి మారుపేరుతో పారిపోవడం సులభమనిపించింది. అంటే డబ్లిన్‌ వెళ్లి, అక్కణ్నుంచి రైల్లో బెల్‌ఫాస్ట్‌ వెళ్లి, అక్కణ్నుంచి ఓడలో గ్లాస్గో వెళ్లాలి.

ఓ అర్ధరాత్రి రైల్లో డబ్లిన్‌కు చేరి ఓ హోటల్లో మకాం వేశాడు. ఫ్రెంచ్‌వాడిలా వేషం మార్చుకున్నాడు. డబ్లిన్‌ రైల్వే స్టేషన్‌లో టిక్కెట్టు కొనేటప్పుడు కావాలని బ్రోకెన్‌ ఇంగ్లీషు మాట్లాడాడు. అక్కడే కాపు కాసిన యిద్దరు డిటెక్టివ్‌లు మోసపోయారు. రాత్రి 9 గంటలకు బెల్‌ఫాస్ట్‌ చేరుతూనే గ్లాస్గో వెళ్లే స్టీమరు ఎక్కాడు. బెల్‌ఫాస్ట్‌ స్టేషన్‌లో యితన్ని చూసిన డిటెక్టివ్‌లకు అతనే జార్జి ఏమోనని అనుమానం వచ్చింది. అతను ఓడెక్కగానే వాళ్లూ వచ్చి అతని గురించి వాకబు చేశారు. అప్పటికి అతను వాష్‌రూములో ఉన్నాడు. పోలీసులు తన గురించి అడుగుతున్నారని తెలిసినా ఏ మాత్రం కంగారు పడకుండా అద్దంలో చూసుకుంటూ, మీసాలు దువ్వుకుంటూ, టోపీ సర్దుకుంటూ ఉండడంతో ఆ ధీమా చూసి యితనై ఉండడనుకున్నారు పోలీసులు. అదే ఓడలో వేరే అతన్ని పట్టుకున్నారు. అవేళ, అంటే మార్చి 10న బెల్‌ఫాస్ట్‌లో మరో 12 మందిని పట్టుకున్నారు. గ్లాస్గోలో దిగుతూనే జార్జి ఎడింబరాకు వెళ్లిపోయాడు. మారుపేరుతోనే కంబర్‌లాండ్‌ వీధిలోని ఓ లాడ్జిలో గది తీసుకుని నిర్వ్యాపారంగా ఉండిపోయాడు.

ఐర్లండ్‌, స్కాట్లండ్‌ మధ్య జార్జి మాయమై పోవడంతో పోలీసులకు ఏం చేయాలో తెలియలేదు. ఎక్కడా అతని జాడ తెలియటం లేదు. ఓ పక్క బ్యాంకు ఊదరగొట్టేస్తోంది - ఎంతమంది ప్రయివేటు డిటెక్టివ్‌లనైనా సమకూరుస్తాం, పట్టుకోండి అంటూ. జార్జి చాలా జాగ్రత్తగా మసలు కుంటున్నాడు. రోజంతా గదిలోనే గడుపుతాడు. పొద్దున్న డండాస్‌ వీధిలోని బుక్‌స్టోర్‌కు వచ్చి లండన్‌, ఎడింబరాలలో వచ్చే ఇంగ్లీషు పేపర్లు కొనుక్కుని వచ్చి అన్నీ క్షుణ్ణంగా చదువుతాడు, తన గురించి పేపర్లలో ఏం వస్తోందో చూడడానికి. ఇలా ఓ వారం చేశాక, ఎందుకైనా మంచిదని బ్రోటన్‌ వీధిలోని బుక్‌షాప్‌కు వెళ్లసాగాడు. ఈ లోపునే యీ షాపతనికి ఒక ఫ్రెంచ్‌ పెద్దమనిషి ఇంగ్లీషు పేపర్లు యింత శ్రద్ధగా కొనుక్కోవడం వింతగా తోచింది. కాస్త ఆలోచిస్తే పేపర్లలో వస్తున్న జార్జి బిడ్‌వెల్‌ పోలికలు యితనిలో ఉన్నట్లు తోచింది. తన ఆలోచనను అతను ఒక కస్టమరుతో పంచుకున్నాడు. అతను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండుకు ఎడింబరాలో ఉన్న ఏజంట్ల వద్ద గుమాస్తా. అతను తన అధికారులకు యీ విషయం చెప్పాడు. వాళ్లు ఎందుకైనా మంచిదని ఓ యిద్దరు ప్రయివేటు డిటెక్టివ్‌లను నియమించి యీ ఫ్రెంచ్‌ పెద్దమనిషిని గమనించమన్నారు.

వాళ్లు డండాస్‌ వీధి బుక్‌షాపు దగ్గర రెండు వారాలు కాపు కాసినా జార్జి అటు రాలేదు. అప్పుడు వాళ్లకు బల్బు వెలిగి, షాపతని వద్దకు వెళ్లి అతనుండే చోటు తెలుసా అని అడిగారు. కంబర్‌లాండ్‌ వీధిలో ఉంటాడనుకుంటా అన్నాడతను. ఏప్రిల్‌ 2న పొద్దుణ్నుంచి ఒక డిటెక్టివ్‌, ఒక పోలీసు కానిస్టేబుల్‌ అతని గది ముందు కాపలా కాశారు. మధ్యాహ్నం జార్జి మెట్లు దిగి వచ్చి ఒక పోస్టు బాక్సు వద్దకు వచ్చి ఉత్తరం పోస్టు చేశాడు. తననెవరో గమనిస్తున్నారని గ్రహించాడు. గబగబా నడవసాగాడు. అది సరిపోదనుకుని పరిగెత్త సాగాడు. గోడలెక్కాడు, ఓ యింట్లో దూరాడు, ఏమైతేనేం కాస్సేపట్లో అతన్ని పట్టుకోగలిగారు. ''నన్నెందుకు వెంటాడుతున్నారు? నేను ఫ్రెంచ్‌వాణ్ని'' అని అతను బుకాయించాడు. కానీ అతని గది వెతికితే వజ్రాలు కనబడ్డాయి. జార్జి బిడ్‌వెల్‌ పేర వచ్చిన ఉత్తరాలు కనబడ్డాయి. అరెస్టు చేశారు.

నేరస్తుల వద్ద 73,420 పౌండ్లు దొరికాయి. వీళ్లను బోను ఎక్కించడానికి బాంకు 42,420 పౌండ్లు ఖర్చు పెట్టింది. జార్జి ముఠా నేర్పిన గుణపాఠం వలన బిల్స్‌ ఆఫ్‌ ఎక్స్‌ఛేంజ్‌ విషయంలో వెంటనే ఆథెంటికేట్‌ చేయించుకునే పద్ధతి ప్రవేశపెట్టింది. కేసు నడిచినప్పుడు 100 మంది సాక్ష్యం చెప్పారు. జార్జి, ఆస్టిన్‌, మేక్‌ ముగ్గురూ నోయెస్‌ను రక్షించడానికి చూశారు. ముగ్గురూ 'తప్పంతా నాదే' అన్నారు. కానీ కోర్టు నలుగురూ నేరస్తులే అంది. 'బ్యాంక్‌ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బ తీశారు మీరు. అందుచేత కఠిన శిక్ష పడాలి. మీ అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను' అన్నారు జడ్జి. 14 ఏళ్ల తర్వాత అనారోగ్య కారణాలతో జార్జిని వదిలేశారు. ఇంకో ఐదేళ్లకు, అంటే 1892లో ఆస్టిన్‌ను వదిలేశారు. అన్నదమ్ములిద్దరూ 1899లో నెల తేడాతో చచ్చిపోయారు. రసవత్తరమైన యీ కథను ''ఫోర్‌ ఎగెనెస్ట్‌ ద బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌'' పేరుతో ఏన్‌ హక్స్‌లీ పుస్తకంగా రాశారు.  185 ఏళ్ల తర్వాత కూడా, టెక్నాలజీ ఎంతో పెరిగిన రోజుల్లో సైతం బ్యాంకుల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి కాబట్టే యీ కథను చెప్పబుద్ధయింది. 
(సమాప్తం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2018)
mbsprasad@gmail.com

 


×