Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: బాపు అనువాద కథ – 'ఆజ్‌గుడ్'

ఎమ్బీయస్‍: బాపు అనువాద కథ – 'ఆజ్‌గుడ్'

ఆగస్టు 31న బాపుగారి వర్ధంతి. ఆ సందర్భంగా ఆయన ‘‘బాల’’ అనే పిల్లల మాస పత్రికకు తన 16 వ ఏట పంపిన అనువాద కథ ‘‘ఆజ్‌గుడ్’’ను పరిచయం చేస్తున్నాను. చందమామ పత్రిక కంటె ముందు పుట్టిన ‘‘బాల’’ ప్రోత్సహించిన బాలబాలికలలో బాపురమణలు వున్నారు. రమణ కథలు రాసేవారు, బాపు బొమ్మలు వేసేవారు. రేడియో అన్నయ్య, అక్కయ్య (న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి) అనే దంపతులు మద్రాసులో నడిపిన ‘‘ఆంధ్ర బాలానంద సంఘం’’ పిల్లలలో కళాభిరుచిని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టేది. వాటిలో ‘‘బాల’’ ప్రచురణ ఒకటి. దీని తర్వాతనే ‘‘చందమామ’’, ‘‘బాలమిత్ర’’ వచ్చాయి. వాటిలో కథలు ఎక్కువగా వుండేవి. దీనిలో గేయాలు, గేయనాటికలు, ‘‘లటుకు-చిటుకు’’, ‘‘రాము-సోము’’, ‘‘కలం స్నేహితులు’’ వంటి శీర్షికలు, పజిల్స్, విజ్ఞానసంబంధిత విషయాలు, ఔత్సాహిక చిత్రకారుల బొమ్మలు.. యిలా బాలల సర్వతోముఖాభివృద్ధికి ఉపకరించే విషయాలన్నీ వుండేవి.

‘రచన’ శాయి గారు ‘వాహినీ బుక్ ట్రస్ట్’ పేరిట బాల (1945-1959) విహంగ వీక్షణ సంపుటి అని నాలుగు భాగాలుగా ప్రచురించారు. వాటిలో నాల్గవ భాగంలో ఈ కథ, దీనితో బాటు ముళ్లపూడి రవణ (అప్పుడు ఆయనకు 19 ఏళ్లు) రాసిన స్వతంత్ర రచన ‘‘రత్నాలగని’’ సీరియల్ కనబడతాయి. ‘‘ఆజ్‌గుడ్ విచిత్రగాథ’’ బాల 1950 మార్చి సంచికలో, ‘‘రత్నాలగని’’ 1950 జూన్-అక్టోబరు సంచికల్లో ప్రచురితమయ్యాయి. వీటి గురించే నాకు యిటీవలిదాకా తెలియదు. ఎవరూ ప్రస్తావించలేదు కూడా. అనుకోకుండా కంటపడ్డాయి. అద్భుతరచనలు అని ఖితాబు యివ్వనక్కరలేదు కానీ, పిల్లలకు నచ్చేట్లుగానే వున్నాయి. తక్కినవారి మాట ఎలా వున్నా బాపురమణల అభిమానులను అలరించేందుకు, వారిపై పరిశోధన చేసేవారికి ఉపయోగపడేందుకు వాటిని పరిచయం చేస్తున్నాను.

ఆజ్‌గుడ్ పర్షియాలోని ఓ దేశానికి యువరాజు. పిరికివాడు. అతని ఇరవయ్యవ ఏట తండ్రి చనిపోయి, యితనికి రాజయ్యే అవకాశం వచ్చింది. అయితే రాజు కాబోయే ముందు పెద్ద సింహంతో పోరాడవలసిన ఆనవాయితీ వుంది. మంత్రి ఆ మాట చెప్పగానే యితనికి భయం పట్టుకుంది. బతికుంటే బలుసాకు తినవచ్చనుకుని ఆ రాత్రే కాస్త డబ్బు తీసుకుని గుర్రం మీద ఉడాయించాడు. మూడు రోజులు ప్రయాణం సాగించి అరణ్యాల మధ్య ఉన్న ఊరు చేరి ఒక రైతు దగ్గరకు చేరాడు. అతను మర్నాడు తన గొఱ్ఱెల కాపరితో పాటు మైదానానికి పంపాడు. ఆ కాపరి వేణుగానం వింటూ, ఆ పచ్చికలో పడుక్కుని ఎప్పడూ యిలాగుంటే బాగుంటుంది అనుకున్నాడు మనవాడు. సాయంత్ర మవుతూండగానే కాపరి ‘చీకటి పడేలోగా యింటికి వెళ్లిపోదాం. లేకపోతే సింహాలు వస్తాయి. ఓసారి యిలా ఆలస్యం చేస్తే ఓ సింహం నాపై దాడి చేసి నా మోచేతికి గాయం చేసింది’ అంటూ ఆ మచ్చ చూపించాడు.

ఇక్కడున్నా ప్రమాదమే అనుకుని మనవాడు అక్కణ్నుంచి యింకో మూడు రోజులు ప్రయాణం చేసి ఒక ఎడారి ప్రాంతాన్ని చేరాడు. అక్కడ ఓ షేకు యితన్ని చూసి ముచ్చటపడి ‘నీకు మంచి గుఱ్ఱం యిచ్చి నిన్ను నా సైన్యంలో చేర్చుకుంటా. అయితే దానికి ముందు నీ సాహసం నాకు రుజువు కావాలి. రేపు బల్లెం, డాలూ పట్టుకుని యీ గుర్రం మీద వెళ్లి ఒక సింహాన్ని చంపి దాని చర్మం పట్రా.’ అన్నాడు. వెంటనే మనవాడు యింకో ఊరు పారిపోయాడు. అది అందమైన నగరం. దానిలో చక్కని భవనం లోపల అమీరూ, అతని కూతురు అందాల పెరిచాన్ కూర్చుని వున్నారు. ఇతన్ని చూసి ముచ్చటపడి ఆతిథ్యం యిచ్చారు. విందు జరుగుతూండగా రాకుమారి వీణ వాయించింది. మధ్యలో ఎవరో గర్జించినట్లయింది. మనవాడు ఉలిక్కిపడి అదేమిటని అడిగితే, రాకుమారి నవ్వి ‘‘కాపలావాడు బౌలక్ ఆవలిస్తున్నట్టున్నాడు.’’ అంది. విందు, ముచ్చట్లు అయ్యాక మనవాడు మేడమీది తన గదిలోకి వెళదామని చూస్తే మెట్ల మీద పెద్ద సింహం అడ్డుగా పడుకుని వుంది. అమీరు ‘‘వాడే బౌలక్, కాపలావాడు. మా పెంపుడు సింహం. నువ్వు ఏ భయమూ లేకుండా వుంటే ఏమీ చేయదు. భయపడుతున్నావని పసిగడితే మాత్రం ఊర్కోదు.’ అన్నాడు.

మనవాడు ‘అయితే నేను యీ గదిలోనే సోఫాలో పడుక్కుంటాను.’ అంటూ వెనక్కి వచ్చేసి గది తలుపులు, కిటికీలు బిడాయించుకుని కూర్చున్నాడు. భయంతో నిద్ర రావటం లేదు. బయట సింహం పచారు చేస్తోంది. ఒక్కోసారి గర్జిస్తూ గది తలుపు మీద కురికేది. మళ్లీ తమాయించుకుని పచార్లు చేసేది. కాస్సేపటికి మేడమీదకు వెళ్లిపోయింది. మనవాడు ఆలోచించడం మొదలుపెట్టాడు – ‘ప్రమాదం లేని చోటు లోకంలో ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్లినా సింహం తారసిల్లుతోంది. అలాటప్పుడు నా రాజ్యంలో సింహంతో వేగితేనే మంచిది కదా. పిరికివాడిలా పారిపోయి వచ్చి చెడ్డపేరు తెచ్చుకోవడం దేనికి?’ అని. తెల్లవారి లేచి తనెవరో వారికి చెప్పి, రాజ్యానికి తిరిగి వెళుతున్నానని చెప్పాడు. దారిలో షేకు, రైతులను కూడా కలిసి తనెవరో చెప్పి, తన నిర్ణయాన్నీ చెప్పాడు. వాళ్లంతా హర్షించారు.

మనవాడు రాజ్యానికి వెళ్లి మంత్రితో తను సింహంతో పోరాడ్డానికి రెడీ అన్నాడు. మర్నాడు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇతన్ని చూడగానే సింహం భయంకరంగా గర్జించింది. కానీ యితనికి భయం లేదుగా, ఒక చేతిలో డాలు, మరో చేతిలో బల్లెం ధరించి సింహానికి ఎదురుగా నడిచాడు. సింహం ఒక్క గెంతు గెంతింది. మళ్లీ పెద్దగా గర్జించి, యువరాజు తల మీదుగా వురికింది. అతనికేమీ అపాయం చెయ్యకుండా గబగబా అతని దగ్గర కొచ్చి ప్రేమపూర్వకంగా అతని చేయి కుక్కపిల్లలా నాకటం మొదలెట్టింది. అప్పుడు మంత్రి ‘చూశావా, యీ సింహం మచ్చికది. నీకు ఆ విషయం తెలియక భయపడ్డావు. లోకంలో చాలా విషయాలు యిలాగే వుంటాయి. భయం వీడితేనే మంచిరాజువి కాగలవు.’ అన్నాడు. అతి త్వరలోనే ఆజ్‌గుడ్‌కి పట్టాభిషేకం, పెరిచాన్‌తో వివాహం ఒకే రోజున జరిగాయి. అందరూ హాయిగా వున్నారు.

ఇదీ కథ. ఎలాగూ బాపుగారు అనువదించిన కథ చెప్పాను కాబట్టి రమణగారు సొంతంగా రాసిన సీరియల్ కథ కూడా చెప్పేస్తాను - ఫర్ రికార్డ్ సేక్! దీని పేరు ‘‘రత్నాలగని’’. లలిత అనే పధ్నాలుగేళ్ల అమ్మాయికి పదహారేళ్ల శంకర్ అన్నయ్య. వాళ్లకు అమ్మానాన్న లేరు. తాతా అవ్వా వాళ్లని పెంచుతున్నారు. వాళ్ల అవ్వ రోజూ వీరగాథలు చెప్తూండేది. తమ మూలపురుషులు రాజ్యమేలేవారని, వాళ్ల ధనాగారం దాచిన రహస్యప్రదేశానికి దారి చూపే కాగితం తాతముత్తాతల నుంచి తన చేతికి వచ్చిందని చెప్తూ వుండేది. ఓ కాగితం చూపించేది కూడా. కానీ ఊళ్లో వాళ్లందరూ అవ్వ కాకమ్మ కబుర్లు చెపుతోందనేవారు. కానీ యీ అన్నాచెల్లెలు తాము ఎవరితో చెప్పకుండా వెళ్లి ఆ గనిని కనిపెడదా మనుకున్నారు. శంకర్ వయసు వాడే ఐన అతని స్నేహితుడు చంద్రం వారితో వస్తానన్నాడు. ఓ రోజు అవ్వ పడుకున్నాక ఆ కాయితం వెతికితే దొరికింది. నాసికా త్రయంబక దుర్గాలకి చుట్టుపట్ల వున్న పర్వతాల్లో రహస్యమార్గం ద్వారా పోవాలని వుంది కానీ దాని గురించి వివరాలు లేవు. అయినా వీళ్లు బయలుదేరారు. లలిత తనతో పాటు తన పెంపుడు పిల్లి లీలను తెచ్చుకుంది.

ఓ రోజు తెల్లవారడానికి ముందే ముగ్గురూ గుర్రాలెక్కి బయలుదేరారు. లలిత ఆకతాయి చేష్టలతో మొదటిరోజు ప్రయాణం వేగంగా సాగలేదు. వాళ్ల వూళ్లో రణమల్లు, వీరమల్లు అనే యిద్దరు పగటిపూట వర్తకులుగా వుంటూ, రాత్రిళ్లు దార్లు కాచి దోపిడీ చేస్తూంటారు. పిల్లలు పారిపోయారని గ్రహించి ఏడుస్తున్న అవ్వను ఓదార్చడానికి వెళ్లారు వాళ్లు. అవ్వ సంగతంతా చెప్తే, వాళ్లు ‘‘ఆ దారి మాకు చెప్పు. వెళ్లి పిల్లల్ని వెతికి తీసుకుని వస్తాం.’’ అన్నారు. అవ్వ తనకు గుర్తున్నదంతా చెప్తే వాళ్లకు ఆశ పుట్టింది. తామే గని వెతుకుదామనుకున్నారు, ఒకవేళ పిల్లలకు గని దొరికితే వాళ్లను బెదిరించి లాక్కుందామనుకున్నారు. గుఱ్ఱాలపై బయలుదేరారు. సాయంకాలమైంది, చీకటైంది. పెద్ద మఱ్ఱిచెట్టు కనబడగానే రణమల్లు సంతోషంగా ‘‘ఇదిగో అవ్వ చెప్పిన చెట్టు. దీనికి ఈశాన్య దిక్కుగా ఆరు మైళ్లు వెళ్తే కొండలో కాళికాదేవి గుడి వుంటుంది.’’ అన్నాడు. ఇద్దరూ సంతోషంగా గుఱ్ఱాలను అటువైపు పరిగెత్తించబోయారు కానీ అంతలోనే ‘‘ఆఁ’’ అని గుండెలు పగిలేలా అరుస్తూ ఆకులు కప్పిన ఓ గోతిలో పడ్డారు.

మర్నాడు పొద్దున్నకి పిల్లలు ఆ మఱ్ఱి చెట్టు దగ్గరకు చేరారు. భుజాన వున్న సంచిలోని తన పిల్లి అటూయిటూ కదలడంతో సర్దుకోవడానికి లలిత కాస్త ఆగడంతో పది గజాలు వెనకబడింది. ఈలోగా శంకర్, చంద్రం గుఱ్ఱాలు ఆ మాయ గోతిలో పడ్డాయి. అది చూస్తూనే లలిత పైనుంచి వేళ్లాడుతున్న మఱ్ఱి ఊడ పట్టుకుంది. ఆమె గుఱ్ఱం కూడా గోతిలో పడింది. ఊడ సాయంతో చెట్టు పైకెక్కి కూర్చుంది. అక్కణ్నుంచి తూర్పున ఓ కోయగూడెం కనబడింది. వాళ్లే యీ గోతిని తవ్వి వుంటారు అనుకుంది. గోతికి అవతల వున్న మరో పెద్ద మర్రి వూడ యీ చెట్టుకి కట్టి వుంది. అది గట్టిగా పట్టుకుని లీలను భుజం మీద కెక్కించుకుని ఒక్క వూపులో చెట్టు వదిలివేసింది. ఊడ మీద వేలాడుతూ గోతిలోకి చూస్తే అక్కడ అన్న, చంద్రం కనబడలేదు. ఏమయ్యారో అనుకుంటూ పరధ్యాన్నంగా వూడ వదిలివేసింది. ఆ వేగానికి తిన్నగా వెళ్లి పక్కన ప్రవహిస్తున్న నదిలో పడింది. ఈదుకుంటూ ఒడ్డుకి చేరింది.

అడవి దట్టంగా వుంది. లీల ఎక్కడికి పోయిందో తెలియదు. కాసిని నేరేడు పళ్లు తిని, ఓ చెట్టెక్కి మూడు కొమ్మల మధ్యలో నిద్దరోయింది. లేచి చూసేసరికి, ఎక్కణ్నుంచి వచ్చిందో లీల వచ్చి పక్కనే కూర్చుంది. రాత్రి పడేదాకా ఆగి, కిందకి దిగి నడుస్తూ పోయింది. ఎక్కణ్నుంచో వస్తున్న బాజాల చప్పుడు విని భయంతో ఓ కొండ గుహలో దూరింది. అక్కడో చిన్న గుడి. దానిలో పెద్ద కాళికా విగ్రహం. బాజాల శబ్దం దగ్గరపడడంతో విగ్రహం పైకి ఎక్కింది. ఆమె తల మంటపం పైన చెక్కిన పువ్వుకి తగిలి, ఆ పువ్వు కదిలి, ఒక రహస్యగది కనబడింది. అక్కడకు వెళ్లి కూర్చుంది. బాజాలు గుహ వద్దకు వచ్చి ఆగాయి. కొందరు కోయలు నలుగురు మనుష్యుల్ని తెచ్చి స్తంభాలకు కట్టేసి ‘‘జై కాళీ’’ అంటూ కత్తులతో చంపి కాళికి బలివ్వబోతున్నారు. ఆ నలుగురూ అన్న, చంద్రం, రణమల్లు, వీరమల్లు. లలిత కాళిక మాట్లాడుతున్నట్లు ‘‘మీ భక్తికి మెచ్చాను. వాళ్లను ఇప్పుడే చంపకండి. ఇక్కడే వుంచి, పొద్దున్న వచ్చి బలి యివ్వండి.’’ అని ఆదేశించింది. కాళికాదేవే అలా చెప్పిందనుకుని వాళ్లందరూ బయటకు వెళ్లిపోయారు.

అప్పుడు లలిత కిందకు దిగి, బొడ్లో బాకుతో బందీలందరి కట్లు తెంపింది. రణమల్లు, వీరమల్లు లను విగ్రహం పైనున్న రహస్యపు అరుగు దగ్గరకు తీసికెళ్లింది. దానికి పక్కనే అగాధం, కింద మహాప్రవాహం. వాళ్లు దొంగలని తెలుసు కాబట్టి, తమను చంపి, ధనం లాక్కుందా మనుకుంటున్నారని ఊహించి, వాళ్లని ప్రవాహంలోకి తోసేసింది. తర్వాత అన్నను, చంద్రాన్ని పైకి తీసుకుని వచ్చింది. ‘‘ఈ గుహలో కిందికి మెట్లుంటాయి. అవి దిగితే ఓ కాలువ. ఇంకా ముందుకు వెళితే గని.’’ అన్నాడు శంకర్. ఈ చీకట్లో మెట్లెలా తెలుస్తాయి? అప్పుడు లలిత తన పెంపుడు పిల్లి మెడకి ఓ గుడ్డపీలిక కట్టి దాన్ని పట్టుకుంది. పిల్లికి చీకట్లో కళ్లు కనబడతాయి కాబట్టి అది మెట్లు కనిపెట్టి దిగింది. వెనకాలే వీళ్లు ముగ్గురూ నడిచారు. మెట్లు అయిపోయాక తాడు పట్టుకుని పాకి, కాలవగట్టు చేరుకున్నారు. అక్కడే ఓ పడవ, దానిలో ఓ మూల రెండు కాగడాలు, నూనె, అగ్గిపెట్టె వున్నాయి. తక్షణం వాళ్లు ఆ పడవ ఎక్కి పోసాగారు.

కొంతసేపటికి ఆ కాలువ రెండు పాయలుగా చీలింది. ‘విశాలమైన ప్రదేశంలో వున్న నదికి దారి తీస్తోంది కాబట్టి ఒక పాయ వేగంగా వెళుతోంది. మరొకటి నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఈ పాయకు కొద్ది దూరంలో ధనాగారం అడ్డుగా వుండి వుండవచ్చు. అందుకే యిలా ప్రశాంతంగా వుంది. ఇటే వెళదాం.’ అన్నాడు శంకర్. కాస్సేపటికి కాలవ అయిపోయి, ఒక చిన్న గుట్ట దగ్గరకు చేరారు. వీళ్లు పడవ దిగి, గుట్ట ఎక్కి, అవతలివేపు దిగారు. సన్నటిదారి కనబడింది. ఫర్లాంగు దూరం వెళ్లేసరికి దారి అయిపోయింది. కాగడా సహాయంతో ముందుకు సాగి, కర్రతో అక్కడక్కడ తట్టారు. ఓ చోట లోపల గుల్లగా వినపడింది. రాతిలో కలిసివున్న ఓ గొళ్లెం తీసి శంకర్ తలగుడ్డతో లాగాడు. తలుపు పైకి లేచింది. అడుగున మెట్లు. కిందకు వెళితే పెద్ద గదిలో బంగారు సింహాసనాలు, బంగారు జరీ బట్టలు, కానీ అవి పట్టుకెళ్లడం ఎలా?

శంకర్ ఓ కాగడా పట్టుకుని ప్రతీ గోడా వెతికాడు. ఓ గోడ మీద ఆరుపద్మాలు చెక్కి వున్నాయి. తక్కినవన్నీ ఎర్రగా వున్నా నాలుగోది మాత్రం పచ్చగా వుంది. దాన్ని కాలితో తంతే కదిలింది. ఆ పద్మం విరిగిపడి తలుపు తెరుచుకుంది. అదో గది. కానీ ఖాళీగా వుంది. ఓ మూల దుమ్ము కుప్పగా పడి వుంది. శంకర్ కాలితో తన్నాడు. తుప్పట్టిన పెద్ద తాళం చెవి కనపడింది. తాళం చెవి పట్టే కన్నం కోసం వెతికితే ఓ స్థంభానికి కన్నం కనపడింది. తెరిస్తే రత్నాలు, వజ్రాలు, కెంపులు, ముత్యాలు, హారాలు అన్నీ కుప్పలుతెప్పలుగా కింద పడ్డాయి. తక్కిన స్థంభాలకూ కన్నాలున్నాయి. తెరిస్తే అక్కడా యిలాగే పడ్డాయి. నేలంతా వీటితో నిండిపోయింది. ముగ్గురూ ఆనందంతో గెంతి, అలసిపోయి, నిద్రపోయారు. ఓ గంట పోయాక నిద్ర లేచి, వీపున్న ఉన్న సంచీల్లో పట్టేటన్ని నింపుకున్నారు. లలిత ఓ కిరీటం, ఓ జరీబట్ట వెతికి తీసి సంచిలో వేసుకుంది.

వచ్చిన దారినే ముగ్గురూ కాలవ ద్వారా వెనక్కి వస్తూండగా పడవ ప్రవాహంలోకి ప్రవేశించింది. వేగంగా వెళుతూ పెద్ద రాయికి కొట్టుకుని ముక్కలుముక్కలై పోయింది. వీళ్లు సుడిగుండాల్తో నిండిన అఖాతంలో పడిపోయినా గజ యీతగాళ్లు కాబట్టి బయటపడి, ఓ గట్టుకి చేరారు. సాయంత్రమైంది. ఎలాగోలా అడవి దాటితే చాలు అనుకుంటూండగా రణమల్లు, వీరమల్లు కర్రలు పట్టుకుని ఎదురొచ్చారు. వాళ్లు ప్రవాహంలోంచి బయటపడి, పిల్లలు ఎప్పటికైనా యీ దారిన రాకపోతారా అని కాచుకుని ఉన్నారు. లలిత ఓ వజ్రం తీసి తీసుకోండి అంటూ అందిస్తున్నట్లు నటించి రణమల్లు దగ్గరకి రాగానే మొహం మీద కొట్టింది. అతని కన్ను దెబ్బతిని కూలబడ్డాడు. వీరమల్లుని చూసి, అతని కాళ్ల వైపు చూపు సారించి, బాబోయ్ పాము అని అరిచింది. అతను తుళ్లిపడి కర్ర కింద పడేసి, కిందకు చూశాడు. వెంటనే లలిత అతన్ని బాకుతో పొడిచేసింది. అదే అదనుగా చంద్రం కూడా అతన్ని బాకుతో పొడిచాడు. అతనూ కిందపడగానే, పిల్లలు పారిపోయారు.

చీకటి పడేసరికి దారిలో ఓ గూడెం తగిలింది. అక్కడ అందరూ గుంపుగా చేరి, ఆడిపాడుతున్నారు. వాళ్లని తప్పించుకుని వెళ్లడం అసాధ్యమని గ్రహించిన లలితకు ఒక ఉపాయం తట్టింది. గుహ నుంచి తెచ్చుకున్న జరీబట్ట పైన కప్పుకుని, మెడలో వజ్రహారాలు వేసుకుని, తలకి రత్నహారాలు పెట్టుకుని రాణీగారిలా నటిస్తూ, వీళ్లిద్దరినీ సేవకులుగా నటిస్తూ కిరీటం పట్టుకోమంది. గుంపులోకి వెళ్లి ఆ కోయదొర దగ్గరకి వెళ్లి ఆశీర్వదించింది. ‘‘బిడ్డా, మేము కాళీవరప్రసాదులము. మీ భక్తికి మెచ్చి కాళి మమ్ము పంపింది.’’ అంటూ శంకర్ చేతిలో నుంచి బంగారు కిరీటం తీసుకుని అతని తలపై పెట్టింది. మరో హారాన్ని కోయదొరసాని మెడలో వేసింది. వాళ్లామెకు నమస్కరించారు. ‘‘బిడ్డా! ఉత్సవం కొనసాగించు. మమ్మల్ని పల్లకీలో అడవి చివర దింపించు.’’ అంది లలిత. కోయదొర సరేనన్నాడు. తెల్లవారేసరికి వంద కాగడాలతో, తూర్యనాదాలతో వాళ్లను అడవి చివరకు, ఊరికి దగ్గరగా చేర్పించాడు.

పల్లకీ దిగి, ఊళ్లోకి వెళ్లి పొద్దున్నే అందరూ యిల్లు చేరారు. అవ్వా, తాతా, చంద్రం తండ్రి అంతా సంతోషించారు. పిల్లలు మర్నాడు ఊరందరినీ పిలిచి ధనం తెచ్చిన విషయం చెప్పారు. ఆరు నెల్లనాటికి ఆ వూళ్లో పెద్దతోటలో ఓ భవనం లేచింది. అందులో బాలరాజ్యం వెలిసింది. చిన్నప్పటి నుంచి ధైర్యం, బలం వుండేలా బాలల్ని పెంచుతారక్కడ. కొన్నాళ్లకి చంద్రం లలితను పెళ్లాడి రాజయ్యాడు. శంకర్ మంత్రి అయ్యాడు. ఇదీ కథ. చూశారుగా. అడుగడుగునా ఎన్ని ట్విస్టులున్నాయో! ఆనాటి పిల్లలకు బాగా నచ్చే వుంటాయి. మీకు పిల్లలకు చదివి వినిపిస్తే వాళ్ల స్పందన ఎలా వుందో తెలుస్తుంది. తర్వాతి రోజుల్లో చందమామలో ఏళ్ల తరబడి నడిచే యిలాటి సీరియల్స్ చాలా వచ్చాయి. ఈ సీరియల్‌కు బాపు వేసిన బొమ్మలు చూస్తే చందమామలో చిత్ర, శంకర్ అనే చిత్రకారుల బొమ్మలు గుర్తుకు వస్తాయి. మొదటిది ఆజ్‌గుడ్‌కు వేసినది, తక్కినవి రత్నాలగనికి వేసినవి.

ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?