cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బెంగాల్‌లో కింగ్‌మేకర్ల అవసరం పడుతుందా?

ఎమ్బీయస్: బెంగాల్‌లో కింగ్‌మేకర్ల అవసరం పడుతుందా?

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. తక్కిన రాష్ట్రాలకు వస్తే అనుకున్నట్లుగానే వున్నాయి కానీ బెంగాల్ విషయంలోనే గందరగోళం వుంది. చాలా సర్వేలు తృణమూల్ కొద్ది తేడాతో ముందంజలో వుందంటున్నాయి. ఒకటి రెండు బిజెపి ముందంజలో వుందంటున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్ సర్వే మమతకు 44% ఓట్లు, బిజెపికి 43% ఓట్లు వస్తాయంటున్నారు. ఇద్దరికీ రేంజ్ సమానంగా యిస్తూ బిజెపికి కాస్త ఎక్కువ ఫేవరబుల్‌గా వుందన్నారు. తటస్థ పరిస్థితి ఏర్పడితే లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి కింగ్‌మేకర్ పాత్ర పోషించవచ్చు. కానీ ఆ సర్వే ప్రకారం కూటమికి సీట్లేవీ వచ్చేట్లు లేవు. హోరాహోరీ పోరాటం జరిగేటప్పుడు అంతిమ ఫలితం ఏమవుతుందో చివరి దాకా తెలియదు. ఫలితం వచ్చినపుడు వాటిని అర్థం చేసుకోవడానికి యీ విశ్లేషణ ఉపయోగపడుతుంది.

బిజెపి యీ స్థాయి దాకా వచ్చిందంటే దాని రణనీతితో పాటు ముస్లిం ఫ్యాక్టర్ బాగా ఉపయోగపడిందని చెప్పవలసినదే. మమతకు వ్యతిరేకంగా హిందువులను కూడగట్టడానికి బిజెపి ముస్లిములను శత్రువులుగా చిత్రీకరించి, సాధించిందనే అనుకోవాలి. ముస్లిము ఓట్లు అత్యధికంగా వున్న 74 సీట్లు వదులుకోవడానికి సిద్ధపడితే తక్కిన 220 సీట్లలో హిందూ ఓట్లను సంఘటితం చేసి గెలవవచ్చని బిజెపి లెక్క. తమను అంతటి ద్వేషభావంతో చూస్తున్న బిజెపిని ఓడించాలని ముస్లిములు అనుకుంటే ఆశ్చర్యం లేదు. అయితే వారి ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి తృణమూల్, రెండు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి.

34 ఏళ్లు రాష్ట్రంలో పాలించిన లెఫ్ట్ కూటమికి బెంగాల్‌లో గ్రామగ్రామాన సానుభూతిపరులున్నారు. అయితే మమత అధికారంలోకి వచ్చి, నియంతలా మారి, తమ క్యాడర్‌పై దాష్టీకం చలాయించడంతో కొందరు లెఫ్ట్ నాయకులు ఆ పార్టీలో చేరిపోయారు. మరి కొందరు నిస్తేజంగా వుండిపోయారు. పోనుపోను మమత ఆగడాలు మితిమీరుతున్నా, ఆమెను అడ్డుకునేవారు లేక వాళ్లు విలవిలలాడారు. అలాటిది 2019 పార్లమెంటు ఎన్నికలలో మమత రథాన్ని ఆపడానికి మేమున్నాం అంటూ బిజెపి ముందుకు వచ్చింది. తమ పార్టీకి విజయావకాశాలు ఎటూ లేవు కాబట్టి, మమతకు బుద్ధి చెప్పడానికి, సిద్ధాంతపరమైన భేదాలెన్ని వున్నా లెఫ్ట్ ఓటర్లలో 40% మంది బిజెపికి ఓటేశారు. 30% మంది తృణమూల్‌కి వేశారు. అందువలననే 2016లో 26.6% వున్న లెఫ్ట్ ఓటు 2019లో 7.5కి పడిపోయింది. కాంగ్రెసు ఓటర్ల విషయానికి వస్తే 32% మంది బిజెపికి, 29% మంది తృణమూల్‌కు మరలిపోయారు. ఈ షిఫ్టింగ్ కారణంగా 2016లో 10.2% ఓటున్న బిజెపికి 2019లో 40.3% ఓట్లతో 18 సీట్లు తెచ్చుకుంది.

దీనితో తృణమూల్‌కు 43% ఓట్లు, 22 సీట్లు మాత్రం దక్కి, మమత అహంకారం తగ్గింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. లెఫ్ట్, కాంగ్రెసు (దీనికి 2019లో 5% వచ్చాయి) ఊరడిల్లాయి. కానీ యింతలోనే వారికి జ్ఞానోదయం అయింది. మమత మీద కోపంతో బిజెపికి ఓట్లేయడం వలన యిప్పుడు బిజెపియే ప్రధాన ప్రతిపక్షం అయిపోయింది. పైగా తాము ఓడించిన తృణమూల్ వాళ్లే యిప్పుడు బిజెపిలో ఫిరాయించి, ఆ పార్టీ అభ్యర్థులుగా ప్రత్యక్షం కావడం లెఫ్ట్ ఓటర్లకు బాధగా వుంది. 2021 బెంగాల్ ఎన్నికను తృణమూల్, బిజెపిల మధ్య పోటీగానే చూస్తున్నారు తప్ప లెఫ్ట్, కాంగ్రెస్‌లను లెక్కలోకి తీసుకోవడం మానేశారు. ఈసారి తాము చురుగ్గా వుండి, తమ ఓట్లు తాము వేయించుకోకపోతే పార్టీ ఆఫీసులు మూసుకోవాలి. అందువలన గోదాలోకి దిగి, లెఫ్ట్-కాంగ్రెసులు కూటమిగా ఏర్పడి తమకు బలమున్న స్థానాల్లో గట్టి పోటీ యిచ్చి, ప్రత్యామ్నాయంగా ఎదుగుదామని చూస్తున్నాయి. 2019లో లెఫ్ట్ నుంచి బిజెపికి వెళ్లిన ఓట్లు వెనక్కి వచ్చేస్తే తృణమూల్‌కు, బిజెపికి మధ్య ఓట్ల శాతంలో గణనీయంగా తేడా వస్తుంది.

కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తృణమూల్ ప్రభుత్వాల విధానాల పట్ల వ్యతిరేకత వున్నవాళ్లు తమకు ఓటేస్తారని లెఫ్ట్‌కు ఆశ. ముఖ్యంగా యువకులు చాలా కోపంగా వున్నారు. అందుకని వృద్ధుల పార్టీగా పేరుబడిన సిపిఎం యీసారి ఎన్నికలలో యువతకు విరివిగా టిక్కెట్లు యిచ్చింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఎపిలో ఎవరి ఓట్లు చీలుస్తాడో తెలియక అందరూ కంగారు పడ్డారు. చివరకు కాంగ్రెసు, టిడిపి రెండిటి ఓట్లు చీల్చినట్లు తేలింది. అలాగే యిప్పుడీ లెఫ్ట్ కూటమి ఓట్లు చీల్చడం చేత ఎవరికి, ఎక్కడ నష్టమో తెలియటం లేదు. వాళ్లకు 10 సీట్లు వచ్చినా, త్రిశంకు సభ ఏర్పడే పక్షంలో వారు ఎవరికి మద్దతిస్తే వాళ్లకు అధికారం సిద్ధిస్తుంది.

వాళ్లు ఉనికిలో లేకుండా వుంటే ముస్లిములంతా తనకే గంపగుత్తగా ఓటేస్తారు కదాని మమత ఆశ. అందుకని ఏప్రిల్ 3నాటి తారకేశ్వర్ సమావేశంలో మైనారిటీలను ఉద్దేశించి ‘సైతాను మాటలు విని మీ ఓట్లు చీలనివ్వకండి. బిజెపి నుంచి డబ్బు పుచ్చుకుని వాళ్లు హిందూ, ముస్లిముల మధ్య చీలిక తెస్తున్నారు.’ అని పిలుపు నిచ్చింది. ‘మతాన్ని చూపించి, ఓట్లు అడుగుతున్నారు’ అనే కారణం చూసి ఎన్నికల కమిషనర్ (ఇసి) మమతను 24 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధించాడు.

ఇంతకీ స్వీయరక్షణకై ముస్లిములు ఎవరికి ఓటేయాలి? ఈ రాజకీయ పక్షాలన్నీ అవసరార్థం మాట్లాడి, ఎన్నికల తర్వాత తమ ఓట్లతో గెలిచిన సీట్లు చూపించి బేరమాడుకుని స్వీయరాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటాయి తప్ప, కడదాకా తమదాకా పోరాడేవి కావని వారి అనుమానం. ఇన్నాళ్లూ అందరితో పాటు కలిసి ఓటేసినా సరిపోయింది. కానీ బిజెపి అధికారంలోకి వచ్చి, తమను ప్రత్యేకంగా చూసి, యిబ్బంది పెడితే దిక్కేమిటి? మీకు దిక్కుగా నేనున్నాను అంటూ మజ్లిస్ పార్టీ దిగింది. బిహార్‌లో 5 అసెంబ్లీ సీట్లు గెలిచింది కాబట్టి దానికి ధైర్యం పెరిగింది. మజ్లిస్‌కు వచ్చిన పెద్ద యిబ్బందేమిటంటే హైదరాబాదులో వున్న మజ్లిస్ అధిష్టానానికి ఉర్దూ, హిందీ వచ్చు తప్ప బెంగాలీ రాదు. బిహార్‌లో ఉర్దూ, హిందీ చెల్లాయి కానీ బెంగాలీ ముస్లిములకు బెంగాలీయే వచ్చు. దానితో స్థానిక నాయకులతో కనెక్ట్ కాలేకపోతున్నారు.

మజ్లిస్‌ను తక్కిన పార్టీలు విశ్వసించటం లేదు. తమకు ఎటూ పడని ముస్లిం ఓట్లను చీల్చి, ప్రతిపక్షాల సీట్లు తగ్గించడానికి బిజెపియే మజ్లిస్‌ను ప్రోత్సహిస్తోందని వాళ్ల అనుమానం. అందుకని ప్రత్యామ్నాయంగా మరో ముస్లిము నేత అబ్బాస్ సిద్దిఖీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పేర పార్టీ పెట్టి ముందుకు వచ్చాడు. బెంగాల్‌లో దాదాపు 30% వున్న ముస్లిములకు సంబంధించి రెండు ముఖ్య మతకేంద్రాలున్నాయి. ఒకటి హుగ్లీలో వున్న ఫుర్‌ఫురా షరీఫ్‌. దీనికి దక్షిణ బెంగాల్‌లోని హుగ్లీ, వర్ధమాన్, ముర్షీదాబాద్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలలో పలుకుబడి వుంది. 3 వేల మసీదులు దీని అధీనంలో వున్నాయి. మరొకటి దేవబందీ సిద్ధాంతాలకు చెందిన జమాయిత్ ఉలేమా ఎ హింద్. దీని అనుయాయులు కలకత్తా, హౌడా, ఉత్తర 24 పరగణాలలో కొంతభాగం, ఉత్తర బెంగాల్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలలో ఉన్నారు.

రెండో వర్గం కంటె మొదటిదే బలమైనది. అది తృణమూల్‌నే సమర్థిస్తూ వచ్చింది. ముఖ్యంగా అబ్బాస్ సిద్దిఖీ పెదతండ్రి సీనియర్ పీర్జాదా త్వాహా సిద్దిఖీ మమతకు అనుయాయి. అయితే సిఏఏ బిల్లు గురించి పార్లమెంటులో ఓటింగు జరిగినపుడు తృణమూల్‌కు చెందిన 8 మంది ఎంపీలు గైరుహాజరు కావడంతో కంగు తిన్న అబ్బాస్ సిద్దిఖీ తన పెదతండ్రిని ధిక్కరించి, జనవరి 21న ఐఎస్ఎఫ్ (ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్) పేర పార్టీ స్థాపించాడు. దీనిలో ఆదివాసీలు, దళితులు, బిసిలు, హిందువులైన మటువాలకు చెందిన 8 సంస్థలు భాగస్వాములుగా వున్నాయి. మంచి వక్త ఐన అతనికి ముస్లిములలోనే కాక, దళితులు, ఆదివాసీలలో కూడా మద్దతుందని ప్రచారం జరుగుతోంది. అతనికి ప్రతిగా మమత ఆల్ బెంగాల్ ఇమామ్స్ అసోసియేషన్‌ను ఉసిగొల్పింది. 23 వేల మసీదుల్లో సభ్యులున్న ఆ అసోసియేషన్ సిద్దిఖీ పరోక్షంగా బిజెపికి సాయపడుతున్నాడని ఆరోపించింది.

అసలు ముస్లిములకు వేరే పార్టీ వుండాలన్న ఆలోచన యిన్నాళ్లూ లేదు కదా, యిప్పుడెందుకు వస్తోంది? అనే ప్రశ్నకు బదులుగా కొందరు ముస్లిము నాయకులు గణాంకాలు వల్లిస్తున్నారు. ‘‘రిజర్వేషన్ల దగ్గర్నుంచి ప్రతీదానికీ జనాభా ప్రాతిపదికన మాట్లాడుతున్నారు. కానీ ప్రజాప్రాతినిథ్యం వచ్చేటప్పటికి యీ లెక్క తప్పుతోంది. దేశం మొత్తం మీద చూసినా మొదట్లో కొన్ని కులాలవారే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వుండేవారు. పోనుపోను బిసి కులాలలో చైతన్యం వచ్చింది. మా జనాభాకు తగిన నిష్పత్తిలో మాకెందుకు పదవులు లేవు? అని అడగసాగారు. ఉదాహరణకి యుపిలో యాదవులు అలాగే అడిగి సమాజ్‌వాదీ పార్టీ పెట్టుకున్నారు. దరిమిలా ఆ కులానికి చెందిన ప్రజాప్రతినిథులు పెరిగారు. అనేక రాష్ట్రాలలో యీ చైతన్యం వచ్చింది.

‘‘ముస్లిముల విషయానికి వస్తే పోనుపోను ఆ వర్గానికి చెందిన ప్రజాప్రతినిథుల సంఖ్య తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. జనాభా ప్రకారం చూస్తే బెంగాల్‌లో 27% మంది ముస్లిము ఎమ్మెల్యేలు, ఎంపీలు వుండాలి. ఉన్నారా? పోనీ ముస్లిములలో జనాభా పెరుగుదల శాతం ఎక్కువనుకున్నా, కనీసం పాతికేళ్ల క్రితం నాటి నిష్పత్తి ప్రకారమైనా వుండాలిగా! ఇతర పార్టీలు మొహమాటానికైనా ముస్లిములకు పదోపరకో టిక్కెట్లు విదిలిస్తాయి. బిజెపికి అలాటి శషభిషలు లేవు. జనాభాలో ఎంతమంది వున్నా ఒక్క టిక్కెట్టూ యివ్వం. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటోంది. ఇలాటి పరిస్థితిలో మాకంటూ పార్టీ పెట్టుకుని, ఎన్నికలలో పోటీ చేస్తే తప్పేముంది? ప్రజామోదం వుంటేనే కదా నెగ్గుతాం. నెగ్గాక ముస్లిములకే సేవ చేస్తూ కూర్చుంటే వచ్చే ఎన్నికలలో తక్కినవాళ్లు ఓట్లేయరన్న భయం వుంటుంది కదా!’ అంటున్నారు.

మజ్లిస్, ఐఎస్ఎఫ్ రెండూ తృణమూల్‌తో విడివిడిగా పొత్తు పెట్టుకుందామని చూశాయి. 50 సీట్ల దాకా  యిమ్మన్నాయి. అయితే మమత ఒప్పుకోలేదు. బిజెపి వాళ్లు యిప్పటికే బేగమ్ అంటున్నారన్న భయమే ఏమో! అయితే ఐఎస్‌ఎఫ్‌తో పొత్తు పెట్టుకోవాలని లెఫ్ట్ కూటమి నిశ్చయించింది. దానితో పెట్టుకుంటే, తమపై కూడా ముస్లిం బుజ్జగింపు ముద్ర పడి హిందూ ఓట్లు సంఘటితమై బిజెపికి పడతాయేమోనన్న బెదురు వున్నా అది రిస్కు తీసుకోదలిచింది. ఎందుకంటే ఏదో ఒక స్థాయి బలమైన ప్రత్యామ్నాయంగా చూపుకోకపోతే ముస్లిం ఓట్లు తృణమూల్‌కు, హిందూ ఓట్లు బిజెపికి పడి తాము సోదిలోకి లేకుండా పోతామన్న భయం దానిది. నిజానికి ఫుర్‌ఫురా ముస్లిములు మొన్నమొన్నటిదాకా లెఫ్ట్‌కే ఓట్లేశారు. 2011లో తక్కిన జనాభాతో పాటే వాళ్లకు దూరంగా జరిగి  మమతను గెలిపించారు.

ఇప్పుడు మమతకు, కొందరు ముస్లిములకు మధ్య దూరం పెరిగింది కాబట్టి, ఐఎస్ఎఫ్ ద్వారా కొన్ని ముస్లిము ఓట్లు కూడా తెచ్చుకుని, 2019లో విడిగా పోటీ చేసి 5% ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెసును కూడా కలుపుకుంటే, తాము నిలుపుకున్న 7.5% ఓట్లకు తోడు, 2019లో బిజెపి, తృణమూల్‌లకు వేయించిన 10 ప్లస్ 9, 19% ఓట్లు వెనక్కి తెచ్చుకుంటే కొన్ని సీట్లు గెలవవచ్చని లెఫ్ట్ ఆశ. అయితే సంయుక్త మోర్చాలో దాని భాగస్వామి ఐన కాంగ్రెసు ఊహ వేరేలా వుంది. ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో వున్న ముర్షీదాబాద్ (జనాభాలో 66% ముస్లిములు), మాల్డా (51%), ఉత్తర దినాజ్‌పూర్ (50%) జిల్లాలలో కాంగ్రెస్సే ఎప్పుడూ గెలుస్తూ వస్తోంది. 2016లో తృణమూల్ 211 సీట్లు గెలిచినపుడు కూడా యీ మూడు జిల్లాలలోని 43 సీట్లలో కాంగ్రెసు 25 గెలిచింది. 2019 వచ్చేసరికి యీ 43 సెగ్మెంట్లలో తృణమూల్‌కు 23, కాంగ్రెసుకు 9 రాగా బిజెపికి 11 వచ్చాయి.

‘లెఫ్ట్ ఓట్లు బిజెపికి పడ్డాయి కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు బిజెపి అధికారంలోకి వచ్చేస్తుందేమోనన్న భయం వెంటాడుతూండగా ముస్లిములు తమకు కాక వేరెవరికి వేస్తారు? అలాటప్పుడు బలమెంతో తెలియని యీ కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని, కొన్ని సీట్లు వాళ్లకు ధారపోయడం దేనికి?’ అని స్థానిక కాంగ్రెసు నాయకుల వాదన. కానీ సోనియా అలా అనుకోలేదు. జిల్లా స్థాయిలో కాంగ్రెసు బలంగా వున్నా, రాష్ట్రస్థాయిలో బిజెపిని ఒంటరిగా ఎదుర్కునే స్థాయిలో లేదని బెంగాల్ ముస్లిములకు తెలుసనీ, అందువలన బిజెపిని నిరోధించడానికి వాళ్లు తృణమూల్‌నే ఎంచుకుంటారనీ ఆమె అభిప్రాయపడింది. అందువలన పొత్తు పెట్టుకుని తీరాల్సిందే అంది. చివరకు గత్యంతరం లేక పొత్తు పెట్టుకున్నా ‘మేం లెఫ్ట్‌తో పొత్తు పెట్టుకుంటే అది ఐఎస్ఎఫ్‌తో పొత్తు పెట్టుకుంది’ అని చెప్పుకుంటున్నారు. మొత్తం 294 సీట్లుంటే లెఫ్ట్ 165 సీట్లకు, కాంగ్రెసు 92 సీట్లకు, ఐఎస్ఎఫ్ 37 సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఎవరితోనూ పొత్తు కుదరని మజ్లిస్ విడిగా 7 సీట్లకు పోటీ చేస్తోంది.

తాము కింగ్‌ కాలేమని యీ పార్టీలకు తెలుసు, కానీ కింగ్‌మేకరయ్యే అవకాశం వుందని ఆశ. తృణమూల్, బిజెపిలలో ఎవరికీ మెజారిటీ రాదని, తాము ఎవరికి మద్దతిస్తే వారే అధికారంలోకి వస్తారని వారి లెక్క. కాంగ్రెసు పార్టీ అధినాయకత్వం బెంగాల్‌ ఎన్నికల మొదటి నాలుగు విడతల్లోనూ కానరాలేదు. ఎందుకంటే అప్పటివరకు కేరళ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కాంగ్రెసు లెఫ్ట్‌తో తలపడుతోంది. బిజెపి, లెఫ్ట్ ఒకలాటివే అని ఆరోపిస్తోంది. అదే నోటితో యిక్కడకు వచ్చి, బిజెపిని ఓడించండి, లెఫ్ట్‌కు ఓటేయండి అనాలంటే యిబ్బంది. అందుకని ఆ ఎన్నికలయ్యాక యిక్కడకు వచ్చారు. అయితే యింతలో కరోనా విజృంభించడంతో రాహుల్ పర్యటనలు రద్దు చేసుకున్నాడు. మరి కూటమి ఏ మేరకు సఫలమైందో ఫలితాలు చెప్తాయి.

ఎన్నికల అనంతరం అవసరమైతే మమతకు కాంగ్రెసు మద్దతిస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే బెంగాల్ కాంగ్రెసు అధినేతగా నియమితుడైన అధీర్ చౌధురికి కాంగ్రెసులో యిద్దరూ వున్న రోజుల నుంచి పడేది కాదు. 1996 అసెంబ్లీ ఎన్నికలలో చౌధురికి, మరో ముగ్గురికి టిక్కెట్లు యిస్తే తను ఆత్మహత్య చేసుకుంటానని మమత బెదిరించింది. అప్పటికే ఆమె పివి కాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన నాయకురాలయినా ఆమె మాట కాదని కాంగ్రెసు అధిష్టానం వాళ్లకు టిక్కెట్లు యిచ్చింది. వాళ్లు నెగ్గారు కూడా. వ్యక్తిగత కోపతాపాలు ఎలా వున్నా, 2016లో 45% ఓట్లతో, 211 సీట్లతో గెలవగానే మమత ‘44 సీట్లతో ద్వితీయ స్థానంలో వున్న కాంగ్రెసును, 32 సీట్లతో తృతీయ స్థానంలో వున్న లెఫ్ట్‌ను నేమ్‌ప్లేట్లకే పరిమితం చేస్తాను చూడండి.’ అంటూ చెప్పుకుని ఆ పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది. గత 9 ఏళ్లలో 18 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గుంజుకుంది. మరి యిప్పుడు కాంగ్రెస్ మమతను సమర్థిస్తుందా?

‘అసలీ ప్రశ్నే రాదు, ఎన్నికలు సాగుతున్న కొద్దీ బిజెపి బలపడుతూండడం చూసి భయపడి 2019లో లాగానే లెఫ్ట్, కాంగ్రెసు తమ ఓట్లను తృణమూల్‌కు బదిలీ చేశారు. అందువలన వాళ్లకు 2,3 సీట్లు మించి రావు.’ అంటున్నారు కొందరు టీవీ సమీక్షకులు. చూదాం మే2 ఏం చెపుతుందో! ఈలోగా మనకు వచ్చే మరో సందేహం - నందిగ్రామ్‌లో శుభేందు భాషలో ‘ఔట్‌సైడర్’ మమత గెలుస్తుందా? మమత భాషలో ‘ఔట్‌సైడర్’ బిజెపి బెంగాల్‌ను గెలుస్తుందా? వాటి గురించి వచ్చే వ్యాసంలో. (సశేషం)

ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021) mbsprasad@gmail.com

 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×