Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: బెంగాల్ ఎన్నికల ఫలితాలు – 1/2

ఎమ్బీయస్‍:  బెంగాల్ ఎన్నికల ఫలితాలు – 1/2

ఈ ఫలితాలు వచ్చి నెలన్నర దాటింది కదా, యింకా వాటిని అధ్యయనం చేయాలా అనుకునేవారి కోసం ఓ మాట చెప్పాలి. సుమారు రెండేళ్లగా బిజెపి బెంగాల్‌పై దృష్టి పెట్టి, సకల అస్త్రాలను ప్రయోగించింది. మమతను హిందూద్రోహిగా, దుర్మార్గులిగా, పరిపాలన చేతకాని అసమర్థురాలిగా చిత్రీకరించింది, ప్రచారం చేసింది. ఆమె చేతిలో బెంగాల్ నాశనమవుతుందని యితర రాష్ట్రాల వాళ్లు కూడా నమ్మేటంత స్థాయిలో ప్రచారం జరిగింది. బిజెపి తరఫున ఎందరో కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. గవర్నరు, ఎన్నికల కమిషనరు అందరూ కేంద్ర పార్టీ తరఫునే పనిచేశారు. తృణమూల్ పార్టీ నుంచి అనేక మందిని తమ పార్టీలోకి గుంజుకుని, మమత పని ఖాళీ అనే అభిప్రాయాన్ని కల్పించారు.

అలాటిది యీ రోజు చూస్తే, మమత బెంగాల్‌లో బలంగా వుంది. బెంగాల్ ప్రజలు మమతనే నమ్ముకున్నారని గ్రహించిన గోడదూకురాయుళ్లందరూ మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నారు. ‘మే 2, దీదీ జాచ్చే’ (దీదీ వెళ్లిపోతోంది) అని మోదీ సభల్లో అనేకసార్లు చేతులతో అభినయించి చూపారు. కానీ యీ రోజు ఆయన పార్టీ నుంచే ఎమ్మెల్యేలు ‘జాచ్చే’! బిజెపి తన ఎమ్మెల్యేలను, నాయకులను కాపాడుకోవడానికి రక్షణ పేరుతో కేంద్ర బలగాలను మోహరించి, మరీ అవస్థ పడుతోంది. మమత హిందూద్రోహి ఐతే, మరి బెంగాల్ హిందూ ఓటర్లు ఆమెకు ఎందుకు ఓట్లేసినట్లు? ఆమె పాలనలో అసమర్థత, అవినీతి రాజ్యం చేస్తే ప్రజలు మళ్లీ ఆమెనే ఎందుకు గెలిపించారు? ఏ యే వర్గాలు ఆమెను అంటిపెట్టుకుని వున్నాయి? ఆమె తన తప్పులను ఎలా దిద్దుకుంది?

2016లో 3 సీట్లు మాత్రమే గెలవగలిగిన బిజెపి యీనాడు 77 గెలిచిందంటే, అది ఏయే వర్గాలను ఆకట్టుకుంది? గెలుపు తథ్యం అనుకుని హడావుడి చేసిన వారు ఎన్నికల విషయంలో ఎలాటి పొరపాట్లు చేశారు? బెంగాల్ తీర్పు దేశ రాజకీయాల్లో ఒక వాటర్‌షెడ్ ఘట్టం. బిజెపికి ఎంత అంగబలం, ఆర్థికబలం, అధికారబలం వున్నా బలంగా వున్న ఒక ప్రాంతీయ పార్టీ దాన్ని ఓడించగలదు అని నిరూపించిన ఆ వైనాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం వుందనే దీన్ని రాస్తున్నాను. బోరనిపిస్తే వదిలేయవచ్చు.

ముందుగా గణాంకాలు – అసెంబ్లీలో మొత్తం సీట్లు 294. అభ్యర్థుల మరణం కారణంగా 292టిలో ఎన్నికలు జరిగాయి. వాటిలో తృణమూల్‌కు 213 వచ్చాయి. 2016లో 294లో 211 గెలుచుకుని, 2019లో 164 అసెంబ్లీ సిగ్మెంట్లలో మాత్రమే ముందంజలో వుండి, పదేళ్లగా అధికారంలో వున్నా సీట్లు పెరగడం విశేషం. 2016లో 45% ఓట్లు వస్తే యీ సారి 48% వచ్చాయి. 160 స్థానాలు నిలుపుకుని, బిజెపికి 48 పోగొట్టుకుంది, బిజెపి నుంచి 1 గెలుచుకుంది. కాంగ్రెసు నుంచి 29, సిపిఎం నుంచి 20, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పిల నుంచి తలా ఒకటి గెలుచుకుంది. 1 రాష్ట్రీయ మజ్లిస్‌కి పోగొట్టుకుంది.

2016లో 10% ఓట్లు, 3 సీట్లు తెచ్చుకున్న బిజెపి యీసారి 38% ఓట్లు, 77 సీట్లు తెచ్చుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 40% ఓట్లతో 121 అసెంబ్లీ సిగ్మెంట్లలో గెలిచింది కాబట్టి యీసారి అంతకంటె ఓ 50 సీట్లయినా ఎక్కువ గెలుస్తుందని వేసుకున్న అంచనాలు (పైకి 200 దాటి వస్తాయని అమిత్ షా మాటిమాటికీ ప్రకటించారు) తారుమారై, 43 సీట్లు తగ్గాయి. గతంలో వున్న 3టిలో 2 నిలుపుకుంది, ఒకటి తృణమూల్‌కు పోగొట్టుకుంది., కొత్తగా గెలిచిన 75టిలో తృణమూల్ నుంచి 49, కాంగ్రెస్ నుంచి 15, సిపిఎం నుంచి 6, ఆర్‌ఎస్‌పి, గూర్ఖా మోర్చాల నుంచి తలా 2, స్వతంత్రుడి నుంచి 1 ఉన్నాయి. 

2019లో బిజెపి ప్రధాని అభ్యర్థి మోదీ కాబట్టి అన్ని ఓట్లు పడ్డాయి. 2021లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి శుభేందుయో, దిలీప్ ఘోషో, ముకుల్ రాయో కాబట్టి (ఏ పేరూ చెప్పలేదు) యిన్ని ఓట్లే పడ్డాయి. కేరళలో తన స్థానం కూడా గెలవలేని శ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన బిజెపి బెంగాల్‌కు వచ్చేసరికి ఎవరో ఒకరి పేరు చెప్పాల్సింది. పేరు చెప్పకుండా మోదీనే మమతకు ప్రతిగా నిలబెడితే చాలు అని అనుకున్న బిజెపి కంగు తినాల్సి వచ్చింది. మోదీ-అమిత్ ద్వయాన్ని ఒంటి చేత్తో, కుంటికాలుతో మమత ఓడించేసింది. లోకనీతి సర్వే ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిగా మమతను 42% మంది ఆమోదిస్తే, దిలీప్ ఘోష్‌ను 5% మంది, శుభేందును 3% మంది ఆమోదించారు. మోదీ, మమతలలో ఎవరెక్కువ యిష్టం అని అడిగితే 45% మంది మమతే అన్నారు, 29% మోదీయే అన్నారు. మమత ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేసినవారు 38%, ఓ మాదిరి అన్నవాళ్లు 30% ఉన్నారు. మోదీ ప్రభుత్వంపై 23% మంది సంతృప్తి వ్యక్తం చేస్తే, ఓ మాదిరి అన్నవాళ్లు 29%.

అయితే 2016తో పోలిస్తే బిజెపికి 28% ఓట్లు ఎక్కువ వచ్చాయని యిక్కడ గమనించాలి. ఎలా వచ్చాయి? 2016లో లెఫ్ట్‌కు 26%, కాంగ్రెసుకు 12% (మొత్తం 38) ఓట్లు, 76 సీట్లు వచ్చివున్నాయి. ఈ సారి 5, 3 శాతాలు (మొత్తం 8) ఓట్లు, 0 సీట్లు వచ్చాయి. వాళ్లకు తగ్గిన 30%లో 28% బిజెపికి, 2% తృణమూల్‌కు వెళ్లి వుంటాయి. ఇంకో 1% యితరుల నుండి తృణమూల్‌కు వచ్చి వుండవచ్చు. మమత అంటే పడనివాళ్లు బిజెపిని ఎంచుకోవడంతో, బిజెపికి హఠాత్తుగా బలం పెరిగింది. అలాగే బిజెపి అంటే పడని లెఫ్ట్, కాంగ్రెసు ఓటర్లు మమత విజ్ఞప్తి మేరకు తృణమూల్‌కు ఓటేశారు. సాంప్రదాయకంగా లెఫ్ట్‌కు ఓటేసే వారిలో 40% మంది 2019లో బిజెపికి ఓటేస్తే, యీసారి 33% మంది మాత్రమే ఓటేశారని లోకనీతి సర్వే చెపుతోంది. అలాగే సాంప్రదాయకంగా కాంగ్రెసుకు ఓటేసేవారిలో 33% మంది 2019లో బిజెపికి ఓటేస్తే, యీసారి అది 25%కు తగ్గింది. దాంతో బెంగాల్‌లో లెఫ్ట్-కాంగ్రెసు స్థానాన్ని బిజెపి ఆక్రమించేసిందని చెప్పవచ్చు. మొట్టమొదటిసారి బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్, లెఫ్ట్ సభ్యులు కనబడరు. గతంలో వాళ్లకు 76 వస్తే యీసారి బిజెపికి 77 వచ్చాయి. ఇకపై అదే ప్రధాన ప్రతిపక్షం. ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచి అది చేస్తున్న హంగామా గురించి మరో వ్యాసంలో చెప్పుకోవచ్చు. దీన్ని కేవలం ఫలితాలకు పరిమితం చేద్దాం.

2019 పార్లమెంటు ఎన్నికలలో తగిలిన దెబ్బ తృణమూల్‌కు మంచి చేసింది. అది తప్పులు దిద్దుకుని ప్రజాదరణను పొందింది. ఉదాహరణకి జంగల్ మహల్ ప్రాంతంలోని 40 అసెంబ్లీ స్థానాల్లో 2019లో బిజెపి 30 స్థానాల్లో ముందుంది. ఇప్పుడు వాటిల్లోంచి 16 స్థానాలను తృణమూల్ లాక్కుని 26 గెలవగలిగింది. జంగల్ మహల్ తమ చేజారుతోందని బిజెపి ముందే గ్రహించి వుండవచ్చు. ఝార్‌గ్రామ్‌లో టాప్ బిజెపి లీడర్లతో మీటింగు పెట్టినా జనం రాకపోవడంతో అమిత్ తన మీటింగును కాన్సిల్ చేసుకున్నాట్ట. ఇక ఉత్తర బెంగాల్‌లో 54 నియోజకవర్గాల్లో 2019లో బిజెపి 37టిలో ముందంజలో వుండగా, యీసారి 26 మాత్రమే గెలిచింది. అక్కడ బిజెపికి 42% ఓట్లు రాగా, తృణమూల్‌కు 45% వచ్చాయి.

కీలకమైన దక్షిణ బెంగాల్‌లో కూడా బిజెపి తన స్థానాలను నిలుపుకోలేక పోయింది. వీర్‌భూమ్ జిల్లాలో గతంలో 5టిలో ముందంజలో వుంది. ఈసారి ఒకటే గెలిచింది. హుగ్లీలో గతంలో 8 అయితే, యీసారి నెగ్గింది ఒకటే. నాడియా జిల్లాలో మెరుగు. గతంలో 11, యీసారి 8. ఉత్తర 24 పరగణాలలో గతంలో 12 అయితే, యీసారి 5 మాత్రమే. తక్కిన 28 తృణమూల్‌కు వెళ్లాయి. దక్షిణ 24 పరగణాలలో 31టిలో 30 తృణమూలే గెలిచింది. రామాలయాలు, బజరగంబళి ఆలయాలతో బిజెపి హోరెత్తించిన హౌడాలోని 16 సీట్లూ తృణమూల్ కైవసమయ్యాయి. సౌత్ ఈస్ట్ బెంగాల్‌లో బిజెపికి 33%, తృణమూల్‌కు 50% రాగా, సౌత్ వెస్ట్ బెంగాల్‌లో బిజెపికి 42%, తృణమూల్‌కు 47% వచ్చాయి. పైన యిచ్చిన మ్యాప్ చూస్తే బిజెపి ఉత్తర కొసన, సౌత్ వెస్ట్‌లో తన సత్తా చూపగలిగిందని, తూర్పున కాస్త వుండగా. దక్షిణాన బొత్తిగా తక్కువగా వుందని అర్థమౌతుంది.

యాంఫన్ తుపాను నష్టపరిహారం పంపిణీ విషయంలో జరిగిన అవినీతి తృణమూల్‌కు దెబ్బ కొడుతుందని వేసిన అంచనాలు తప్పాయి. ఆ ప్రాంతాల్లో తృణమూల్ గెలిచింది. పకడ్బందీగా అమలు చేసిన దాదాపు 25 సంక్షేమ పథకాల వలన ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, వెనుకబడిన తరగతుల వారు, గ్రామీణులు మమత పక్షాన నిలిచారు. వీటివలన ఏటా 12-20 వేల కోట్ల రూ.లు ఖర్చవుతోంది కానీ గ్రామీణాదాయం పెరగసాగింది. 2011-12లో 20% ఉన్న గ్రామీణదారిద్ర్యం 2017-18 నాటికి 14%కి తగ్గింది. తలసరి వ్యయం 5% పెరిగి ఆర్థికవ్యవస్థ మెరుగుపడింది. లోకనీతి సర్వే ప్రకారం జనాభాలో 3% మందికి 9-11 పథకాలు అందుతుంటే వారిలో 83%, 14% మందికి 6-9 స్కీములు అందుతుంటే వారిలో 72%, 46% మందికి 3-5 అందుతుంటే వారిలో 49%, 29% మందికి 1-2 అందుతుంటే వారిలో 37%, ఏ పథకమూ అందని 8% మందిలో 25% మంది తృణమూల్‌కు ఓటేశారు. ఏ స్కీములో అందనివారిలో 54% మంది, 1-2 అందుతున్నవారిలో 48% మంది బిజెపికి ఓటేశారు.

పథకాల డెలివరీ మెకానిజంలో అవినీతిని అరికట్టడానికై ప్రశాంత్ కిశోర్ సలహాపై 2020 డిసెంబరులో ప్రవేశపెట్టిన ద్వారే సర్కార్, పరాయే సమాధాన్, జై జోహర్, తపోశీలీ బంధు పథకాలు, స్వాస్థ్య సాథి బాగా పాప్యులర్ అయి, ప్రభుత్వ వ్యతిరేకతను బలహీనపర్చాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో యిలాటి పథకాలు లేవు కాబట్టి వాళ్లు అధికారంలోకి వస్తే వీటిని రద్దు చేస్తారని తృణమూల్ చేసిన ప్రచారాన్ని ఓటర్లు నమ్మినట్లున్నారు. ఎవరైనా కమిషన్లు అడిగితే దీదీకి ఫోన్ చేయండి అంటూ ప్రవేశపెట్టిన ‘దీదీకె బోలో’ పథకాన్ని 28 లక్షల మంది ఉపయోగించుకున్నారు. ఎక్కడ అవినీతి జరుగుతోందో మమతకు కూడా పూర్తి అవగాహన వచ్చింది. అందుకే ప్రశాంత్ 80 మంది ఎమ్మెల్యేలను మార్చేద్దామంటే సరేనంది.

కోవిడ్ సరిగ్గా హేండిల్ చేయకపోవడం విషయంలో రాష్ట్రస్థాయిలో మమతది తప్పున్నా, జాతీయ స్థాయిలో మోదీది తప్పుండడాన్ని మమత హైలైట్ చేసింది. లాక్‌డౌన్ కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి చితికిపోవడం, కేంద్రం కరోనా సాయాన్ని కార్పోరేట్లకే తప్ప చిన్న వ్యాపారస్తులకు యివ్వకపోవడం, బయటకు వెళ్లిన వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి రావడానికి పడిన అగచాట్లు, తిరిగి వచ్చాక పడిన కడగండ్లు వీటన్నిటి గురించి మమత 111 పబ్లిక్ మీటింగులలో నొక్కినొక్కి చెప్పింది. దాంతో ఆ కోపమంతా బిజెపిపై చూపారు ఓటర్లు. నిజానికి 8 విడతల్లో పోలింగు నిర్వహించడం వలన బిజెపి నష్టపోయింది. ఓటర్లలో 24% మంది చివరి నిమిషం దాకా ఎటూ తేల్చుకోలేరని సర్వే చెపుతోంది. వాళ్లలో 54% మంది తృణమూల్‌కు ఓటేయగా, 33% మంది బిజెపికి వేశారు. మలిదశలో కరోనా విజృంభణతో మమత పబ్లిక్ ర్యాలీలు పెట్టనన్నా బిజెపి పెట్టి సాధించినది ఏమీ లేదు. 6,7,8 స్టేజిలలో తృణమూల్‌కు 48, 52, 52 శాతం ఓట్లు రాగా బిజెపికి 28, 20, 21 వచ్చాయి. మొదటి రెండు దశల్లో అయితే తృణమూల్‌కు 46, 47 రాగా బిజెపికి 43, 45 వచ్చాయి. మధ్యలో 3,4,5 దశల్లో తృణమూల్‌కు 50, 48, 43 రాగా బిజెపికి 30, 26, 30 వచ్చాయి.

బిజెపి దేశంలోని తన అగ్రనాయకులందరినీ దింపడంతో బెంగాలీలు కంగారు పడ్డారు. వీళ్లంతా వచ్చి తమ సంస్కృతిని నాశనం చేసి, తమ రాష్ట్రాన్ని కూడా యుపి, బిహార్‌, గుజరాత్‌లలా చేస్తారని భయపడ్డారు. ప్రచారానికి వచ్చిన ప్రతీవాళ్లూ మమతపై విరుచుకుపడడంతో ఆమెపై సానుభూతి పెరిగింది. ముఖ్యంగా మోదీ ‘దీదీ ఓ దీదీ’ అని కేకలు పెట్టడం వెగటు పుట్టించింది. రోడ్‌సైడ్ రోమియోలా ఆ పిల్లికూతలేమిటి? అని అత్యధిక మహిళలు చీదరించుకున్నారు. మగవాళ్లలో 46% మంది తృణమూల్‌కు ఓటేయగా, మహిళలు 50% మంది వేశారు. బిజెపికి పడినవి 37% మాత్రమే. పేద, దిగువ మధ్యతరగతి మహిళలలో 34%, మధ్యతరగతి, సంపన్న మహిళలలో 42% మంది బిజెపికి ఓటేశారు. పేద మహిళలలో 52%, దిగువ మధ్యతరగతిలో 55%, మధ్యతరగతిలో 45%, సంపన్న మహిళలలో 40% తృణమూల్‌కు ఓటేశారు. ముమ్మారు తలాక్ బిల్లు తర్వాత ముస్లిం మహిళలందరూ బిజెపిని ఆదరిస్తున్నారని అంటున్నారు కానీ బెంగాల్ ముస్లిం మహిళల్లో 7% మాత్రమే బిజెపికి ఓటేశారు. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?