Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: బెంగాల్ ఎన్నికల ఫలితాలు – 2/2

ఎమ్బీయస్‍:  బెంగాల్ ఎన్నికల ఫలితాలు – 2/2

బెంగాల్‌లో బిజెపి అనుసరించిన డిఫెక్షన్ విధానం లోపభూయిష్టమైనదిగా నిరూపితమైంది. 2015 నుంచి అమిత్ షా బెంగాల్‌పై కన్నేసి వున్నారు. ఎంత ప్రయత్నించినా, హిందూత్వ నినాదం ప్రజలను ఆకట్టుకోవటం లేదనీ, రాజకీయంగా పాతుకుపోయిన లెఫ్ట్, తృణమూల్‌ క్యాడర్‌కు పోటీగా బిజెపి క్యాడర్ ఎదగడం లేదని 2016 అసెంబ్లీ ఎన్నికలలో గ్రహించి అడ్డదారులు వెతికారు. ఫిరాయింపులు ప్రోత్సహించ సాగారు. 2019 పార్లమెంటు ఎన్నికలలో మోదీ యిమేజితో గెలిచిన ధైర్యం పెరిగి ఫిరాయింపుల జోరు పెంచారు.

అప్పుడే తృణమూల్‌కు సలహాదారుగా చేరిన ప్రశాంత కిశోర్ ‘వీళ్ల వలన పార్టీకి చెడ్డపేరు వస్తోంది. వీళ్ల ప్రాధాన్యం తగ్గించండి’ అనడంతో మమత ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇటు పార్టీలో యిబ్బంది, అటు ‘మా పార్టీలో చేరితే మీ మీద కేసులు నానుస్తాం’ అని బిజెపి ఊరించడంతో అనేక పార్టీ నాయకులు బిజెపిలోకి దూకారు. తృణమూల్ టిక్కెట్టు దొరక్క ఆఖరి నిమిషంలో వచ్చినవారికి సైతం పార్టీ టిక్కెట్టు యిచ్చి నిలబెట్టారు. ఇది స్థానికి బిజెపి కార్యకర్తలను మండించింది. వాళ్లు మనస్ఫూర్తిగా పని చేయలేదు.

ముఖ్యంగా బిజెపి శుభేందు అధికారికి పెద్ద పీట వేసి, ముకుల్ రాయ్‌ను వెనక్కి నెట్టడం పార్టీకి చెఱుపు చేసింది. 2019లో బిజెపి గెలవడానికి గల కారణాల్లో ముకుల్ రాయ్, దిలీప్ ఘోష్ యిద్దరూ కలిసి కలిసికట్టుగా పనిచేయడం. మమత నందిగ్రామ్ సేనాపతి శుభేందు పార్టీలో చేరడం తమకు గొప్ప విజయంగా భావించి, బిజెపి అతనికే సర్వాధికారాలు కట్టబెట్టేసింది. అభ్యర్థుల ఎంపిక అతనికి అప్పగించింది. ముకుల్ రాయ్‌ని ఎన్నికల బరిలో నిలబడమంది. నేను నిలబడి 20 ఏళ్లయిందని మొత్తుకున్నా వినలేదు. సంస్థాగత వ్యవహారాల్లో అతని ప్రమేయం లేకుండా చేయడంతో అతను తన నియోజకవర్గానికి పరిమితమై పోయాడు. చివరకు అతను గెలిచాడు కానీ యిప్పుడు మళ్లీ తృణమూల్‌లో చేరిపోయాడు.

ఈ ఫిరాయింపుల స్ట్రాటజీ చీదేసింది. ఇంతమంది పార్టీ ఫిరాయించడం, బయటకు వచ్చి అప్పటిదాకా దుర్గామాతగా పొగిడిన మమతను తిట్టడంతో ఓటర్లకు మమతపై సానుభూతి పెరిగింది. వీళ్లందరూ మీర్ జాఫర్లు అని తృణమూల్ చేసిన ప్రచారం వాళ్లు నమ్మారు. పైగా తృణమూల్ పార్టీ నాయకులుగా తమను పీడించిన నాయకులే కాషాయ శాలువా కప్పుకుని వచ్చి ఎదుట నిలబడితే ఎందుకు ఆదరించాలనుకున్నారు. అందుకే ఫిరాయింపుదారుల్లో అత్యధికులు ఓడిపోయారు. ఫిరాయింపులు తృణమూల్‌ను దెబ్బ తీస్తాయనుకున్నారు కానీ బిజెపినే దెబ్బ తీశాయి. ఇది బిజెపికి గుణపాఠం కావాలి. అన్ని రాష్ట్రాలలోను పార్టీ విస్తరణకు అది ఫిరాయింపుదారుల మీదే ఆధారపడుతోంది. ప్రస్తుతం బిజెపిలో ఆరెస్సెస్ మూలాల వారి కంటె కాంగ్రెసు మూలాల వారే ఎక్కువ కనబడుతున్నారు.

హిందూత్వను రెచ్చగొట్టి, ముస్లింలను బూచిగా చూపించి ఎన్నికలు గెలుద్దామన్న బిజెపి పాచిక బెంగాల్‌లో పారలేదు. విభజన సమయంలో మతకల్లోలాల వినాశనాన్ని అనుభవించిన రాష్ట్రం కాబట్టి, బెంగాల్‌ మతపరమైన చీలికను హర్షించలేదు. బహుశా పంజాబ్‌లో కూడా బిజెపి అందుకే ముందుకు సాగటం లేదు. మమత ముస్లింలను బుజ్జగిస్తే బుజ్జగించనీ అని వూరుకున్నారు కాబోలు. ఇది మమత గ్రహించింది కాబట్టి నిబ్బరంగా వుంది. హైందవత్వంలో తను ఎవరికీ తీసిపోనని చూపించుకోవడానికి సభల్లో శ్లోకాలు పఠించినా, మన వంగ సమాజంలో మతపరమైన చీలిక వద్దు, మానవత్వమే ముద్దు అంటూ రామకృష్ణ పరమహంస, వివేకానంద సూక్తులను వల్లిస్తూ వచ్చింది. హిందూత్వ పేరుతో పోలరైజేషన్ చేసి, లాభపడుదామనుకున్న బిజెపి హిందూ ఓట్లలో పోలరైజేషన్ (ప్రశాంత కిశోర్ లెక్క ప్రకారం మెజారిటీ మతస్తులలో 55%కు మించి పోలరైజేషన్ జరగదు) పరిమితులతో ఆగిపోయింది.

దేశంలో అనేక రాష్ట్రాలలో హిందూ పోలరైజేషన్ వలన బిజెపి లాభపడుతోంది. ఇక్కడా లాభపడింది కానీ అది ఆశించినంత కాదు. ఎందుకు అని లోకనీతి సర్వే విశ్లేషించింది. 2019లో దానికి 57% మంది హిందువుల మద్దతు లభించింది. ఈసారి 50% మాత్రమే! అవి మోదీని ప్రధాని చేసిన జరిగిన ఎన్నికలు. ఇప్పుడు మమతను ముఖ్యమంత్రిని చేసిన ఎన్నికలు. 2019లో తృణమూల్‌కు హిందువుల్లో 32% మంది వేస్తే, యీసారి 39% మంది వేశారు. మరి మమత ముస్లింలను బుజ్జగిస్తోందన్న ప్రచారం వారిని ప్రభావితం చేయలేదా? బెంగాలీ హిందువుల ఆలోచనావిధానం ఎలాటిది? బాబ్రీ మసీదు పడగొట్టడం సమంజసమే అని భావించే హిందువుల శాతం జాతీయస్థాయిలో 40 వుంటే బెంగాల్‌లో అది 20 మాత్రమే వుంది. దేశంలో యితర మతాలకూ చోటుంది అని భావించే హిందువుల శాతం జాతీయంగా 74 వుంటే బెంగాల్లో 81 వుంది. ప్రభుత్వం మైనారిటీల హక్కులను కాపాడాలి అని భావించే బెంగాలీ హిందువుల శాతం 58గా వుంది.

మమతా బెనర్జీ ముస్లిములను బుజ్జగిస్తోంది అనే వాదన నిజమేననే హిందువులు 36% మంది వున్నారు. వారిలో 18% మంది తృణమూల్‌కు, 72% మంది బిజెపికి ఓటేశారు. ఓ మేరకు నిజమే అనే హిందువులు 32% మంది వున్నారు. వారిలో 45% మంది తృణమూల్‌కు, 41% మంది బిజెపికి ఓటేశారు. అంటే వాళ్లు మిగతా అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని భావించాలి. కానీ యీ క్రమంలో ముస్లిం ఓట్ల పోలరైజేషన్‌తో తృణమూల్ లాభపడింది. మైనారిటీలకు యిలాటి పరిమితులు వుండవు కాబట్టి గతంలో లెఫ్ట్, కాంగ్రెసులకు ఓటేసిన ముస్లిములు కూడా యీసారి బిజెపిని అడ్డుకోవడానికి మమతకు భారీగా ఓట్లేశారు.

ముస్లిములలో 75% మంది తృణమూల్‌కు 7% మంది బిజెపికి ఓటేశారని లోకనీతి సర్వే చెపుతోంది. వాళ్లు భారీ సంఖ్యలో వున్న జిల్లాలలోని 89 సీట్లలో 81 సీట్లు తృణమూల్‌కు వచ్చేశాయి. పౌరసత్వ చట్టాన్ని తెచ్చిన బిజెపిని చూసి వాళ్లు భయపడ్డారు. కూచ్ బిహార్‌లోని శీతల్‌కుర్చిలో కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు ముస్లిములు మరణించడం వారిని మరింత భయభ్రాంతుల్ని చేసింది. రాష్ట్రీయ మజ్లిస్ ముస్లిము ఓట్లను చీల్చబోయింది కానీ, ముస్లిములు చెదరలేదు. మూకుమ్మడిగా మమత వెంట నిలిచారు. ఓటర్లలో ముస్లిములు 40% కంటె ఎక్కువ వున్న చోట్ల హిందువుల్లో 65% బిజెపికి ఓటేశారు. 30-39% ఉన్నచోట్ల 53%, 20-29% వున్నచోట్ల 68% ఓటేశారు.

హిందువుల్లో కులాల విషయానికి వస్తే - 30 లక్షల ఓట్లున్న మటువా ఓట్లపై బిజెపి చాలా ఆశలు పెట్టుకుంది. కానీ వాళ్లు గంపగుత్తగా ఏమీ ఓటేయలేదు. రాజకీయాభిమానాలతోనే ఓటేశారు. వారిలో ఎక్కువమంది తృణమూల్‌కు, కొద్దిమంది బిజెపికి వేశారు. వాళ్లకు కులపెద్దగా వున్న వీణాపాణి దేవి 2019 మార్చిలో మరణించాక వాళ్లలో చీలిక వచ్చింది. అందువలన ఎవరి పాటికి వాళ్లు ఓటేశారు. వాళ్లు యిప్పటిదాకా తమ తమ గురువులను పూజిస్తూ వచ్చారు. వారి చేత బిజెపి ‘జై శ్రీరామ్’ అనిపించడం మొదలుపెట్టడంతో వాళ్లు కంగారు పడ్డారు. తమ ఐడెంటిటీ పోతోందని భయపడి, చాలామంది బిజెపికి వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్లు బలంగా వున్న ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నాడియా జిల్లాలలో తృణమూల్‌కు వచ్చిన సీట్లు చూస్తే ఆ విషయం తేటతెల్లమౌతుంది.

మటువాలు నామశూద్ర దళిత వర్గానికి చెందుతారు. వారిలో 58% మంది బిజెపికి, 31% మంది తృణమూల్‌కు ఓటేశారని లోకనీతి సర్వే చెపుతోంది. ఇతర దళితులలో 37% తృణమూల్‌కు, 52% బిజెపికి వేశారు. తృణమూల్‌కు, బిజెపికి కులాల వారీగా వచ్చిన ఓట్ల శాతాలివిగో! అగ్రవర్ణాలు (42-46), ఒబిసిలు (36-49), రాజవంశీలు (38-59), ఆదివాసీలు (42-46), ఇతరులు (19-53). 2019లో ఒబిసిలలో 68% మంది బిజెపికి ఓటేశారు. ఇప్పుడు 19% తగ్గింది. రాజవంశీల విషయంలో 16%, ఆదివాసీల విషయంలో 16%, అగ్రవర్ణాల (బ్రాహ్మణ, కాయస్థ, వైద్య.. వగైరా) విషయంలో 4% తగ్గాయి. 2019 ఫలితాలు చూసి ఆదివాసీలు హిందూత్వకు ఆకర్షింపబడి బిజెపి వైపుకి వచ్చేశారని విశ్లేషకులు అనుకున్నారు. కానీ ఎస్‌టి నియోజకవర్గాలలో తృణమూలే ఎక్కువగా గెలిచింది.

ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి బెంగాల్‌లో స్థిరపడిన బెంగాలీయేతరులందరూ బిజెపికి ఓటేస్తారనుకున్నది పూర్తి స్థాయిలో జరగలేదు. అదే జరిగి వుంటే గ్రేటర్ కలకత్తాలో తృణమూల్‌కు 53% ఓట్లు, బిజెపికి 32% ఓట్లు వచ్చేవి కావు. బిజెపి ఈ ఫలితాలు హరాయించుకోలేక పోయింది. మమత గెలుపు కంటె బిజెపి పరాభవం ఎక్కువగా వార్తల్లోకి రావడంతో అది 72 స్థానాల్లో వెయ్యిలోపు మార్జిన్‌తో ఓడిపోయామన్న ప్రచారం మొదలుపెట్టింది. అదెంత అబద్ధమో, వేరే వ్యాసంలో రాశాను.

దీనిలో మరి కొన్ని వివరాలు యిస్తున్నాను. 1% ఓట్ల కంటె తక్కువ మార్జిన్‌తో తృణమూల్ 3 గెలిస్తే బిజెపి 10 గెలిచింది. 1-5% మార్జిన్‌తో తృణమూల్ 34 గెలిస్తే బిజెపి 22 గెలిచింది. 5-15% మార్జిన్‌తో తృణమూల్ 84 గెలిస్తే బిజెపి 41 గెలిచింది. 15% కంటె ఎక్కువ మార్జిన్‌తో తృణమూల్ 92 గెలిస్తే బిజెపి 4 గెలిచింది. పోలైన ఓట్లలో 30% కంటె తక్కువ ఓట్లు తెచ్చుకున్న స్థానాలు తృణమూల్‌కు 1, బిజెపికి 55 వున్నాయి. 30-40 రేంజిలో తృణమూల్‌కు 23, బిజెపికి 94 ఉన్నాయి. 40-50 రేంజిలో తృణమూల్‌కు 154, బిజెపికి 123 వున్నాయి. 50%కు మించి ఓట్లు తెచ్చుకున్న స్థానాలు తృణమూల్‌కు 110 వుంటే బిజెపికి 20 ఉన్నాయి.

రాష్ట్రమంతా తృణమూల్ హవా యింత బలంగా వీచినా, నందిగ్రామ్‌లో మమత ఓడిపోవడం ఆశ్చర్యం గొలుపుతుంది. శుభేందు గట్టిపోటీ యిచ్చాడని చెప్పక తప్పదు. కానీ రీకౌంటింగుకి అడిగితే ఒప్పుకోకపోవడమేమిటో అర్థం కాదు. శుభేందు ద్వారా మమతకు బుద్ధి చెప్పాలని పైనుంచి ప్రయత్నాలు జరిగాయేమో తెలియదు. విషయం కోర్టులో వుంది. దానిలో తల దూర్చడానికి జడ్జిలే భయపడుతున్నారు. తీర్పు వచ్చేవరకు వ్యాఖ్యానించడం సబబు కాదు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కాకుండా మమతను ఎవరూ ఆపలేకపోయారు. శుభేందు గెలిచి మమతకు కంటిలో నలుసుగా మారి, వేపుకు తింటాడని సులభంగా వూహించవచ్చు. మమత-బిజెపి పోరాటం ఎన్నికలతో ముగిసిపోలేదు.

చివరిగా చెప్పాలంటే – మమత విజయం ఎంత గణనీయమో, బిజెపి ఎదుగుదల కూడా అంతే గమనార్హం. ప్రతిపక్షాలను బతకనీయకూడదంటూ మమత లెఫ్ట్, కాంగ్రెసులను నయానా, భయానా నాశనం చేసేయడంతో ఆమె పార్టీయే భ్రష్టు పట్టి, నాయకులు అవినీతిపరులయ్యారు. లెఫ్ట్, కాంగ్రెసు ఏదో ఒక స్థాయిలో బలంగా వుండి వుంటే బిజెపి యీ స్థాయిలో ఎదిగేది కాదు. ముక్కోణపు పోటీలో ఓట్లు చీలి వుండేవి. వాళ్లు రంగంలో లేకపోవడంతో మమత వ్యతిరేకులు బిజెపిని ఆశ్రయించారు. గెలుపుకై ఆరాటపడిన బిజెపి అడ్డదారులు తొక్కి, హడావుడి చేయడంతో యీసారి చతికిలపడింది. 

రాబోయే ఐదేళ్లలో పార్టీ నిర్మాణంపై శ్రద్ధ పెట్టి, హిందూత్వ నినాదాన్ని పక్కన పెట్టి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మెలగితే, తృణమూల్ స్థానంలో వాళ్లు వచ్చే అవకాశం తప్పకుండా వుంది. దీనికి గాను కావలసినది ఓర్పు, బెంగాలీ సంస్కృతికి అనువైన హుందాతనం. కానీ ఎన్నికల అనంతర ఘటనలు బిజెపి ఆ మార్గాన్ని ఎంచుకోలేదని చూపిస్తున్నాయి. వారు తమ ధోరణిని సవరించుకుని, మమత వంటి నియంతను అడ్డుకోగలుగుతారని ఆశిద్దాం. (సమాప్తం) (ఫోటో బెంగాల్ ఎన్నికలలో బిజెపి అతిరథులు – మోదీ, ఇన్‌చార్జి కైలాశ్ విజయవర్గీయా, శుభేందు, అమిత్ షా, పైన దిలీప్ ఘోష్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?