cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : బెంగాల్‌లో మహిళా ఓటర్లు కీలకం

ఎమ్బీయస్ : బెంగాల్‌లో మహిళా ఓటర్లు కీలకం

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల కంటె బెంగాల్ ఎన్నికే రసవత్తరంగా వుంది. తక్కిన రాష్ట్రాలలో ఫలితాలు ముందే తెలిసిపోయినట్లు అనిపిస్తోంది కానీ బెంగాల్‌లో మమత గెలుస్తుందా, గెలిస్తే ఎన్ని సీట్లతో గెలుస్తుంది అనేది ఆసక్తికరంగా వుంది. నిజానికి మమత కంటె బిజెపి బెంగాల్ సమరాన్ని ‘డూ ఆర్ డై బాటిల్’గా చూస్తోంది. నెగ్గడానికి అది వేయని ఎత్తు లేదు. నియమాలను మారుస్తున్నారు, వంచుతున్నారు.

మోదీ అప్పుడే 25 సార్లు రాష్ట్రానికి వచ్చినట్లున్నారు. దానికి రెట్టింపు సార్లు వచ్చిన అమిత్ షా దీన్ని వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్నారని అంటున్నారు. ఎన్నికలలో గెలిచినా, గెలవకపోయినా ఫిరాయింపుదార్లతోనైనా బిజెపి బెంగాల్‌లో అధికారం చేజిక్కించుకుంటుందని అనుకోవచ్చు. అయితే గెలుపుకి దగ్గరగా వచ్చి ఆగితేనే అది సాధ్యం. ఏ మేరకు గెలుస్తుంది అనేది ఆసక్తికరం. అందువలన తక్కిన రాష్ట్రాల గురించి ఒక్కో వ్యాసంతో సరిపెట్టినా బెంగాల్ గురించి ఎక్కువే రాయవలసి వస్తోంది.

మమతా బెనర్జీ కాలుకి కట్టు కట్టుకుని ప్రచారంలోకి దిగడం ప్రశాంత కిశోర్ ఐడియా అని కొందరు అన్నారు. వాళ్లకు తెలియదేమో, ప్రశాంత్ ఎలిమెంటరీ స్కూల్లో వుండగానే మమత యిలాటి ట్రిక్కులు వేసేసిందని. 1990లలోనే యిలాటివి మొదలుపెట్టింది. తలకు బ్యాండేజి కట్టుకుని సిపిఎం గూండాలు కొట్టారనేది. నందిగ్రామ్ ఆందోళన టైములో గుండెపోటు వచ్చిందంది. అప్పుడు ఈ శుభేందుయే యింట్లోంచి బయటకు వచ్చి, నినాదాలిస్తున్న కార్యకర్తలతో ‘దీదీకి విశ్రాంతి కావాలి. నినాదాలు ఆపండి.’ అని కోరాడు. ఇదివరకు వాళ్లు కలిసి నాటకాలాడారు. 

ఇప్పుడు విడివిడిగా ఆడుతున్నారు, తేడా అంతే. ఈ కాలి ఘటన యాక్సిడెంటు అని అందరికీ తెలుస్తోంది. తెరిచివున్న కారు డోరు ఒక ఎలక్ట్రిక్ పోల్‌కు కొట్టుకుని వచ్చి ఆమె కాలిని బలంగా తాకింది. ‘కాదు, నలుగురైదుగురు బిజెపి కార్యకర్తలే కావాలని దాన్ని అలా విసిరి కొట్టారు’ అనడం రాజకీయ ప్రహసనం. ఆమెను రక్షించడంలో విఫలమైనందుకు ఇద్దరు పోలీసు ఆఫీసర్లను ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేశారు. దెబ్బ నిజం, అయితే అంత కట్టు అవసరమా లేదా అనేది డాక్టర్లే చెప్పాలి. ‘బెంగాల్ ఆడపులి బిజెపిలోని మగవీరులపై ఒంటికాలిపై లేస్తోంది’ అని ఫిగరటివ్‌గా చెప్పడానికి అనువుగా కుదిరింది. మహిళల సానుభూతి పొందడానికే యిదంతా అని కొందరంటున్నారు.

ఎన్నికలలో గెలవడానికి మహిళా ఓటర్లే కీలకం. మమత మొత్తం మీద 70 సంక్షేమ పథకాలు పెట్టినా, వీటిల్లో మహిళలను ఉద్దేశించిన పథకాలు చాలా వున్నాయి. ‘‘బంగ్లా మాత్రి ప్రకల్ప’’ క్రింద తొలిసారి తల్లి అయిన స్త్రీకి మూడు విడతల్లో రూ.5 వేలిస్తారు. ఇంట్లో కాకుండా ఆసుపత్రిలో పురుడు పోసుకోవడాన్ని ప్రోత్సహించడం కోసం‘‘మాత్రి యాన్’’ కింద ప్రసవ సమయంలో ఉచితంగా ఆంబులెన్సు యిస్తారు. 9 నుంచి 12 తరగతి చదివే ఆడపిల్లలకు సైకిళ్లిచ్చే ‘‘సబూజ్ సాథీ’’ పథకం (2015లో పెట్టారు,  85 లక్షల మంది లబ్ధిదారులు) ‘‘కన్యాశ్రీ ప్రకల్ప’’ కింద 13-18 వయసు మధ్య ఉన్న విద్యార్థినులకు నెలకు రూ.750 స్టయిపండ్ యిచ్చి, 18 ఏళ్ల వయసు వచ్చాక ఇంకా చదువుకుంటానంటే  రూ.25 వేలు యిస్తారు. (దీని కింద 69 లక్షల మందికి 2013 నుంచి రూ. 10 వేల కోట్లు యిచ్చారు, దీనికి 2017లో యునైటెడ్ నేషన్స్ ప్బలిక్ సర్వీస్ అవార్డు యిచ్చారు.)

వార్షికాదాయం రూ. 1.50 లక్షల కంటె తక్కువ వున్న కుటుంబాలలో అమ్మాయిల పెళ్లికి రూ. 25 వేలిచ్చే ‘‘రూపశ్రీ’’ పథకం, 9 నుంచి 12 తరగతి చదివే ఆడపిల్లలకు సైకిళ్లిచ్చే ‘‘సబూజ్ సాథీ’’ పథకం (2015లో పెట్టారు, ఈ పథకం కింద చదువుకున్న ఆడపిల్లలకై 2020లో కృష్ణనగర్‌లో కన్యాశ్రీ యూనివర్శిటీ పెట్టారు. సుందర్‌బన్స్ నుంచి వచ్చిన విద్యార్థినులకై డైమండ్ హార్బర్ యూనివర్శిటీ 2013లో పెట్టారు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థినులకై ప్రభుత్వం 21 హాస్టళ్లు నడుపుతోంది. ప్రభుత్వాఫీసుల్లో మహిళలకు మెటర్నిటీ లీవు రెండేళ్లు యిస్తున్నారు. ఆరోగ్యశ్రీ తరహాలో చేసిన ‘‘స్వాస్థ్య సాథీ హెల్త్ కార్డ్’’ను ఇల్లాలి పేర జారీ చేశారు. భర్త, పిల్లలు, తలితండ్రులు, అత్తమావలు కూడా యీ పథకం కింద రూ.1.50 లక్షల వరకు కవర్ అవుతారు.

సంక్షేమ పథకాలలో మహిళలను ఆకట్టుకునే పథకాలు ఎక్కువగా వుండడంలో విశేషమేమీ లేదు. ఎందుకంటే బిహార్‌లో ఓడిపోబోతున్న నీతీశ్‌ను గట్టెక్కించింది మహిళలే. మగవాళ్లలో 54.7శాతం ఓట్లేయగా మహిళా ఓటర్ల శాతం 59.7 వుంది. బిహార్‌లో శాంతిభద్రతలు కాపాడడం, మద్యపాన నిషేధం విధించడం, చదువుకునే బాలికలకు సైకిళ్లు యివ్వడం వంటి పథకాల ద్వారా నీతీశ్ మహిళల ఆదరాన్ని పొందాడు. బెంగాల్‌లో మహిళా ఓటర్లు పురుష ఓటర్లతో సంఖ్యాపరంగా సమానంగా వున్నారు. ఎన్నికలు హింసాత్మకంగా వుండేవి కాబట్టి గతంలో వాళ్లు పోలింగుకి వచ్చేందుకు భయపడేవారు. ఇప్పుడు వాళ్లూ ధైర్యంగా వస్తున్నారు. అందుకే వాళ్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి.

2019లో ఎదురు దెబ్బ తర్వాత మమత ‘బంగ జననీ వాహినీ’ పేర మహిళా బ్రిగేడ్‌లను ఉత్తేజితం చేసింది. వాళ్లు మహిళల సమస్యలకు సంబంధించి ర్యాలీలు నిర్వహిస్తూ మహిళలలో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తున్నారు.  జనవరి 4న మమత బీర్భూమ్‌లో ప్రచారం నిర్వహిస్తూ రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్లో వంట వండుతున్న ఓ మహిళకు వంటలో సాయపడింది. ఇది నాయకులందరూ చేసే పనే. మగవాళ్లయితే బట్టలు యిస్త్రీ చేస్తారు, టీ అమ్ముతారు. కానీ మమత విషయంలో బెంగాల్‌లో బిజెపి వ్యవహారాలు చూసే కైలాశ్ విజయవర్గీయా (మధ్యప్రదేశీ) ‘‘ఐదు నెలల తర్వాత చేయాల్సిన పని మమత యిప్పుడే మొదలుపెట్టేశారు.’’ అని వెక్కిరించాడు. దాంతో తృణమూల్ మహిళలందరూ విరుచుకుపడ్డారు. ‘‘దేశంలో వున్న ఏకైక మహిళా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే తీరు యిదేనా? రాజకీయ నాయకురాలంటే వంటింటికే పరిమితమని వారి భావం కాబోలు. అందుకే తాము పాలించే రాష్ట్రాలలో ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేదు.’’ అని.

బెంగాలీ కుటుంబాలలో సాంప్రదాయకంగా మహిళలు ముఖ్యభూమిక వహిస్తారు. ఠాగూర్, శరత్‌బాబు నవలలో కూడా చైతన్యవంతంగా వున్న తెలివైన మహిళా పాత్రలను చూడవచ్చు. యుపి, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలోని మహిళలను అణచి వుంచుతారనేది అందరికీ తెలిసిన సత్యం. బిజెపి ఆ ప్రాంతాలకు చెందిన పార్టీగా ముద్ర వేసుకుంది. పైగా ఆ ప్రాంతాల నుంచి బెంగాల్‌లో స్థిరపడిన ఓటర్లపై కన్నేసింది. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన బిజెపి నాయకులతో ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. పైగా సీతను శీలపరీక్షకు గురిచేసి, అడవుల పాలు చేసిన రాముణ్ని ముందు పెట్టుకుని ఎన్నికలలో తలపడుతోంది. (మోదీ తన సొంత భార్యనే తన కర్మానికి వదిలేశాడని 2019లోనే తృణమూల్ ఓటర్లకు గుర్తు చేసింది) కానీ బెంగాల్‌లో తరతరాలుగా పూజలందుకుంటున్నది మహిళా దేవతలే – దుర్గ, కాళీ!

పరువుహత్యలకు పేరుబడిన యుపి రాష్ట్రపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యిక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీని రానిస్తే మన మహిళల స్థాయి కూడా యుపి మహిళల స్థాయికి చేరుతుంది జాగ్రత్త, అక్కడలాగే యిక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అని అని తృణమూల్ మహిళా ఓటర్లను హెచ్చరిస్తోంది. నిజానికి కలకత్తా అంత పెద్ద నగరమైనా మహిళాభద్రత విషయంలో దానికి మంచి రికార్డే వుంది. నార్త్ ఇండియన్ కల్చర్ చొరబడితే, పరిస్థితి మారుతుందనే బెరుకు కలకత్తా వాసులకుంది. దేవలీనా దత్తా అనే నటీమణి టీవీ షోలో మాట్లాడుతూ ‘దుర్గాపూజ టైములో బీఫ్ తినడానికి నాకు అభ్యంతరం లేదు’ అన్నపుడు, అది నచ్చనివారు ఆమెను వేరే రకంగా తిట్టవచ్చు. కానీ గోరక్షకులు ట్రోలింగ్‌లో ఆమెను రేప్ చేస్తామని బెదిరించడంతో ‘చూశారా, ఇదీ బిజెపి కల్చర్’ అని తృణమూల్ యాగీ చేసింది.

ఈ విమర్శలకు ప్రతిగా హాథ్రాస్‌లో దళిత యువతిపై జరిగిన బలాత్కారాన్ని బిజెపి వాడుకుంటోంది. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్‌లో బలాత్కారాలు ఏ పాటి అని తృణమూల్ తిప్పికొట్టింది. ‘తృణమూల్ గూండాల కారణంగా శాంతిభద్రతలకు హాని కలుగుతోంది. మేం అధికారంలోకి వస్తే వాళ్లను అణచివేస్తాం.’ అని బిజెపి మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి చూస్తోంది. తృణమూల్ రణన్నినాదం ‘ఖేలా హోబే’ (ఆట జరుగుతుంది – ఓ పట్టు పడదాం అనే భావంలో వాడతారు). దీనికి ప్రతిగా మోదీ అంటున్నది – ‘ఖేలా శేష్’ (మీ ఆట ముగిసిపోయింది, మనం మిగిలిపోయినదాన్ని శేష్ అంటాం. కానీ వాళ్లు ఆఖరిది, అయిపోయినది అనే అర్థంలో శేష్‌ను వాడతారు)!

పదేళ్ల మమతా బెనర్జీ పాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే వుంది. ప్రజలకు మమతాపై ఆదరం వుంది కానీ స్థానిక నాయకులపై లేదు. లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో, అదీ సెకండ్ హాఫ్‌లో అవినీతి చొరబడింది కానీ తక్కువ స్థాయిలోనే వుండేది. కమిషన్ల ద్వారా వచ్చే డబ్బు పార్టీ నిర్వహణకు పోయేది. అయితే తృణమూల్ వచ్చాక, అభివృద్ధి పనులు, వాటితో బాటు కమిషన్ (కట్ మనీ అంటారక్కడ) పెరిగింది. అది స్థానిక నాయకుల జేబుల్లోకి వెళ్లి వాళ్లు బాగా బలిశారు. గతంలో సైకిళ్ల మీద తిరిగినవాళ్లు కార్లలో తిరగసాగారు. తృణమూల్‌లో వుంటే లాభదాయకంగా వుందని గ్రహించి ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైనా సరే, దీనిలో చేరితే డబ్బు చేసుకోగలమని గ్రహించి, యీ పార్టీకి ఫిరాయించసాగారు. ఇతర పార్టీలను తృణమూలాలతో సహా నాశనం చేసేస్తున్నాను కదాన్న ఆనందంతో మమత దీన్ని ప్రోత్సహించింది. పాతవాళ్లు, కొత్తవాళ్లు అందరూ కలిసి బాగా దోచుకోసాగారు.

ఇది ప్రజలందరికీ స్పష్టంగా కనబడి వారు వ్యతిరేకమయ్యారు. లెఫ్ట్ ఫ్రంట్‌కి చివరి రోజుల్లో పట్టుకున్న జాడ్యం వీళ్లకు యింత త్వరగా పట్టుబడిందేమిటని ఆశ్చర్యపడ్డారు. మమత ఎంత సమర్థురాలైనా, నియంత. చాలా ఎమోషనల్. పార్టీలో ప్రజాస్వామ్యమనేదే లేదు. లెఫ్ట్ ఫ్రంట్ అయితే వివిధ పార్టీల సమ్మేళనం కాబట్టి, తరచు సమన్వయ కమిటీల సమావేశాలు జరిగేవి కాబట్టి, క్షేత్రస్థాయి వాస్తవాలు నాయకులకు తెలిసి, దిద్దుబాటు చర్యలు తీసుకునేవారు. తృణమూల్‌లో ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజల్లో రగులుతున్న అసంతృప్తిని ఆమె దృష్టికి ఎవరూ తేలేదు. 2019 పార్లమెంటు ఎన్నికలలో తగిలిన దెబ్బతోనే ఆమె మేల్కొంది. ప్రశాంత కిశోర్ టీము అవినీతి ఆధారాలు చూపించింది. వెంటనే కొందరు పార్టీ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని బహిరంగంగా ఒప్పుకుని, కట్ మనీ వెనక్కి యిచ్చేయమని వాళ్లకు ఆదేశాలిచ్చింది.

దీనివలన ప్రజల్లో ఎటువంటి స్పందన వచ్చిందో ఎన్నికల ఫలితాలు చెప్తాయి. నిజానికి ప్రజలు మార్పు కోరుతున్నారు. ‘లెఫ్ట్ ఫ్రంట్‌ను చూశాం, తృణమూల్‌ను చూశాం, కొత్త పార్టీకి ఓ ఛాన్సిస్తే తప్పేముంది?’ అనే ఆలోచన కొందరిలో వుంది. అయితే గతంలో తృణమూల్ చేసిన ఫిరాయింపుల తప్పే బిజెపి చేస్తోంది.

తృణమూల్ దశాబ్దాలుగా పార్టీ నడిపి, క్రమేపీ చేర్చుకుంటూ పోయింది. బిజెపి ఏడాదిన్నర లోపునే చకచకా ఫిరాయింపులతో పార్టీని పెద్దది చేసేసింది. వచ్చినవాళ్లందరూ తృణమూల్‌లో వుండగా మచ్చపడిన వాళ్లే కాబట్టి, ప్రజల్లో వాళ్ల పట్ల వ్యతిరేకత వుంది. కేవలం కాషాయం రంగు చూసి, వాళ్లు పునీతులై పోయారని ప్రజలు అనుకుంటారా లేదా అన్నది మేలో తేలిపోతుంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వపు ఆర్థిక విధానాలపై బెంగాల్ మధ్యతరగతి అసంతృప్తితో వుంది. మమత వ్యతిరేకత, మోదీ వ్యతిరేకత మధ్య బెంగాల్ ఓటరు ఊగిసలాడుతున్నాడు. మహిళా ఓటరు నిర్ణయంపై అంతిమ ఫలితం ఆధారపడవచ్చు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

mbsprasad@gmail.com

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×