Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బిహార్ ఎన్‌డిఏ – ఓట్ల బదిలీ జరిగేనా?

ఎమ్బీయస్: బిహార్ ఎన్‌డిఏ – ఓట్ల బదిలీ జరిగేనా?

బిహారులో మూడో దశ పోలింగు యివాళ్టితో ముగుస్తోంది. మరి కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతాయి. రేపు పేపర్లలో వస్తాయి. నవంబరు 10న అసలు ఫలితాలు వచ్చినపుడు మళ్లీ చర్చలు జరుగుతాయి. ఎగ్జిట్ పోల్స్‌ ఏ మేరకు కరక్టో తేలతాయి. 

ఈ చర్చలన్నీ అర్థం కావాలంటే అక్కడి రాజకీయ వాతావరణం కొంత తెలిసి వుండాలి. దాని గురించి అవగాహన పెంచడానికే యీ వ్యాసాలు. అక్కడ ఎన్‌డిఏ కూటమి అధికారంలో వుంది.

దాని తరఫున పోటీ చేసేవారిలో బిజెపి 110 స్థానాల్లో (గతంలో గెలిచినవి 54), నీతీశ్ పార్టీ ఐన జెడియు 115 (గతంలో 71), ఇబిసిల పార్టీగా పేరుబడిన జితన్ రామ్ మాంఝీ నాయకత్వంలోని హిందూస్తాన్ అవామీ మోర్చా 7 (గతంలో 1), 2018లో నిషాద్ కులస్తుల పార్టీగా ముకేశ్ సాహ్నీ నేతృత్వంలో వెలసిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ 11 ఉన్నాయి. 

కుశావహా కులస్తుల పార్టీగా పేరుబడిన రాష్ట్రీయ లోక సమతా పార్టీ నాయకుడు ఉపేంద్ర కుశావహా వీరితో గతంలో కలిసి 2 సీట్లు గెలుచుకున్నాడు. తర్వాత విడిపోయి, యీసారి బిఎస్‌పితో కలిసి రాష్ట్రమంతా పోటీ చేస్తున్నాడు. తక్కిన పార్టీల మాట ఎలా వున్నా బిజెపి, జెడియుల మధ్య పొత్తు ఎలా వుండబోతోంది అనేది ఆసక్తి కలిగించే అంశం.

అసలు బిజెపి నీతీశ్‌తో పొత్తెందుకు పెట్టుకోవాలి? విడిగా పోటీ చేయవచ్చు కదా అనుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికలలో మోదీ యిమేజితో బిజెపి దుమ్ము దులిపేస్తున్నా, అసెంబ్లీ ఎన్నికల వరకు వచ్చేసరికి, బిజెపి సొంతంగా ఎక్కడా గెలవటం లేదు – 41 లక్షల జనాభా వున్న త్రిపురలో తప్ప! ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునో, తర్వాత ఫిరాయింపులు ప్రోత్సహించే, లేదా కొందర్ని కలుపుకునో అధికారాన్ని పొందుతున్నారు.

మరి బిహార్ చూడబోతే 12.40 కోట్ల జనాభా (ఆంధ్ర జనాభా 5.4 కోట్లు, తెలంగాణ జనాభా 3.9 కోట్లు) వున్న పెద్ద రాష్ట్రం. అక్కడ సొంతంగా గెలవాలంటే ధైర్యం చాలలేదు. కానీ బిహార్‌లో గెలుపు బిజెపికి అత్యవసరం. త్వరలో జరగబోయే బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది కాబట్టి. తమిళనాడులో బిజెపి ఉనికి మరీ అంత ఎక్కువేమీ కాదు, కొన్ని సీట్లు తెచ్చుకుంటే చాలు. కానీ పొరుగున వున్న బెంగాల్‌పై బిహార్ ప్రభావం పడుతుందని అంచనా.

మోదీ సర్కారు కోవిడ్‌ను సరిగ్గా హేండిల్ చేసిందా లేదా, వలస కార్మికుల పట్ల సరిగ్గా వ్యవహరించా లేదా అనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ ఎన్నికలలో గెలుపు లభిస్తే ప్రజలు దానిని ఆమోదించారు అని బిజెపి ప్రచారం చేసుకోవచ్చు. 

బిజెపి అధ్యక్షుడు నడ్డా అప్పుడే ట్రంప్ ఓటమి కోవిడ్ కారణంగానే, అదే మన మోదీ చూడండి, ఎంత బాగా చేశారో అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏ కారణంగానైనా ఓడిపోతే మోదీపై విమర్శకులు విరుచుకు పడిపోతారు. వలస కార్మికుల కడగండ్లే బిజెపిని ఓడించాయి అని అర్థాలు తీస్తారు. అందువలన బిహార్ గెలుపు బిజెపికి అతి ముఖ్యమైనది.

ప్రతి అసెంబ్లీ ఎన్నికలో బిజెపి ఎదుర్కుంటున్న సమస్య ఒక్కటే. మోదీ యిమేజి కారణంగా పార్లమెంటు ఎన్నికలలో గెలుపు సిద్ధిస్తోంది. కానీ మోదీతో తూగే రాష్ట్రనాయకుడు దొరక్క అసెంబ్లీ ఎన్నికలలో చతికిలపడుతోంది. బిహార్‌లో బిజెపి నాయకుడు సుశీల్ మోదీకి లాలూ అవినీతిని బయటపెట్టిన నాయకుడిగా పేరున్నా, మాస్ లీడరు కాదు.

ఇప్పటివరకు బిహార్‌లో పాప్యులర్ నాయకులు అనేవారు – లాలూ, నీతీశ్ మాత్రమే. కానీ వాళ్లు కూడా సొంతంగా రాష్ట్రమంతా గెలిచే పరిస్థితి లేదు. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి. ఇద్దరూ చేతులు కలిపితే మాత్రం, 2015లోలా దుమ్ము దులపగలరు.

2017లో నీతీశ్ లాలూ అవినీతిని కొత్తగా కనిపెట్టినట్లు నటించి, అతనితో తెగతెంపులు చేసుకుని, బిజెపితో చేతులు కలిపి, పదవిలో కొనసాగాడు. ఇప్పుడు బిజెపి నీతీశ్‌ను వదిలేస్తే లాలూ దగ్గరకి మళ్లీ వెళ్లిపోతాడేమోనన్న భయం వుంది. ఎందుకంటే అతనికి కావలసినది అధికారం.

సరైన భాగస్వామి లేకపోతే దెబ్బ తింటామని బిజెపికి 2015లో బాగా తెలిసి వచ్చింది. అప్పుడు అది 157 సీట్లలో పోటీ చేసి 54 (34 శాతం) తెచ్చుకుంది, కానీ భాగస్వామి పక్షాలైన ఎల్‌జెపి, ఎచ్‌ఏఎమ్, ఆర్‌ఎస్‌విపికి 86 కేటాయిస్తే వాళ్లు 5 మాత్రమే (6 శాతం) గెలిచారు. 

జెడియు వంటి బలమైన భాగస్వామి దొరికితే గెలుపు ఖాయమని వారి లెక్క. బిజెపికి అప్పుడు 24.4 శాతం ఓట్లు వచ్చాయి. జెడియుకి 16.8 శాతం ఓట్లు వచ్చి, 71 సీట్లు తెచ్చుకుంది. ఎందుకంటే ఆర్‌జెడికి అది చాలా సీట్లు యివ్వవలసి వచ్చింది. ఇప్పుడు బిజెపి, జెడియు కలిస్తే 41 శాతం ఓట్లు, 133-143 సీట్లు తెచ్చుకోవాలి మరి. తెచ్చుకుంటుందా? పార్లమెంటు ఎన్నికలలో 46.3 శాతం తెచ్చుకుంది. కానీ ఆ పరిస్థితి వేరు.

జెడియు, బిజెపితో చేతులెందుకు కలుపుతోంది? ఎంత బాగా పాలిస్తాడన్న పేరున్నా నీతీశ్‌ గతంలో 71 తెచ్చుకున్నాడు, యీ సారి మహా అయితే 80, 90 తెచ్చుకోగలడు కానీ ప్రభుత్వ ఏర్పాటుకి అది సరిపోదు. లాలూతో చేతులు కలపడానికి సిగ్గు. బిజెపి అతనిపై 2017లో కొత్త కేసు పెట్టగానే, మరుక్షణం లాలూ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాడు. 

ఉపముఖ్యమంత్రి తేజస్వితో ‘నువ్వు 14 ఏళ్ల వయసులో అవినీతికి పాల్పడ్డావని ఆరోపణ వచ్చింది. అందుకని రాజీనామా చేయి’ అని పట్టుబట్టి, అతను నిరాకరిస్తే, తనంతట తానే తన ప్రభుత్వాన్ని కూలదోసుకుని, మళ్లీ కొన్ని గంటల్లోనే బిజెపితో కలిసి పదవి చేపట్టాడు. గతంలో మోదీని నానా తిట్లు తిట్టినా, అదంతా మర్చిపోయి వాటేసుకున్నాడు. 

గతంలో 54 వచ్చినా, ఇప్పుడు బిజెపికి సొంతంగా 70, 80 సీట్లు తెచ్చుకునే సత్తా వుంది. వాళ్లతో చేతులు కలిపితే చాలు, హాయిగా మళ్లీ ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఇదీ అతని లెక్క.

ఇది పెర్‌ఫెక్ట్ కాంబినేషన్ అయినప్పుడు మరి పొత్తుపై సందేహాలెందుకు? ఎందుకంటే రెండు పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం కుదిరిందా? ఇద్దరూ ఒకరి నొకరు నమ్మి ఓట్ల బదిలీ చేసుకుంటారా అనేది సందేహాస్పదంగా వుంది. 

ఇక్కడ నీతీశ్ ఓటర్ల మనోభావాల గురించి మాట్లాడాలి. అతను స్వతహాగా సోషలిస్టు. జయప్రకాశ్ నారాయణ్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. అలాటివాడు బిజెపి సారథ్యంలో ఎన్‌డిఏతో చేతులు కలిపాడంటే దానికి కారణం వాజపేయి వ్యక్తిత్వం. వాజపేయి ముస్లిములకు కూడా ఆదరపాత్రుడైన నాయకుడు. 

తనతో విభేదించేవారిని కూడా కలుపుకుని పోగల సామర్థ్యం ఆయనకుంది. అందుకనే నీతీశ్ ఆయన కాబినెట్‌లో కేంద్రమంత్రిగా వున్నాడు. ఆయన ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాడు. అతని అనుయాయులకు యిబ్బందేమీ కలగలేదు.

కానీ వాజపేయి బిజెపికి, మోదీ బిజెపికి చాలా తేడా వుంది. వాజపేయి జమానాలో సెక్యులరిజం, గాంధియన్ సోషలిజం వంటి సూక్తులు వినబడేవి. ఇప్పుడు మోదీ హయాంలో అవి నిషిద్ధపదాలుగా, తిట్లగా మారిపోయాయి. 

మోదీతో చేతులు కలిపి నీతీశ్ యిప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లలేదు. పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాడు. అప్పుడు ఓట్ల బదిలీ బాగా జరిగింది, 40టిలో 39 సీట్లు గెలుచుకున్నారు. కానీ అవన్నీ మోదీని ప్రధానిగా చేయడానికి ఉద్దేశించినవే. ఇప్పుడు సమస్య ముఖ్యమంత్రి గురించి. నీతీశ్ అనుయాయులలోని మైనారిటీలు, అణగారిన వర్గాలు స్థానిక బిజెపి నాయకులను ఆమోదిస్తారా లేదా అన్నది చూడాలి.

ఈ అనుమానం బిజెపి వాళ్లకు కూడా వచ్చినట్లుంది. అందుకని చిరాగ్‌ను దువ్వుతున్నారని అనుకోవాలి. 

ఈ అనుమానం జెడియు నాయకులు బాహాటంగా వ్యక్తపరుస్తున్నారు. తమ అభ్యర్థి లేనిచోట తమ ఓటు జెడియుకి వెళ్లకుండా ఎల్‌జెపికి వేయమని తమ ఓటర్లకు చెప్తున్నారా? జెడియు కార్యకర్తలకు యీ సందేహం కలిగిననాడు వారు తమ అభ్యర్థి లేనిచోట బిజెపికి ఓటేస్తారా? జెడియు లేనిచోట వాళ్లు భావస్వామ్యం వున్న ఆర్‌జెడికి ఓటేస్తే..? ఎందుకంటే నీతీశ్, లాలూ యిద్దరూ చాలాకాలం కలిసి పనిచేశారు. ఒకే భావజాలం కలవారు. లాలూ అవినీతిపరుడు, అహంభావి. నీతీశ్ నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు. అదీ తేడా.

కానీ తేజస్వికి లాలూ పోలిక వచ్చిందా లేదా అన్నది ప్రధానమైన ప్రశ్న. అతను ఉపముఖ్యమంత్రిగా వుండగా అవినీతి ఆరోపణలు రాలేదు. లాలూ ముస్లిములకు, యాదవులకు తప్ప తక్కినవారికి తన పార్టీలో ప్రాముఖ్యత లేకుండా చేశాడు. కానీ తేజస్వి ఇన్‌క్లూజివ్ లీడర్‌గా చూపించుకుంటున్నాడు. 

తనతో వున్న వర్గాలు ఎలాగూ వుంటాయి అనే లెక్కతో అగ్రవర్ణాలకూ, ఇబిసిలకు భారీ సంఖ్యలో టిక్కెట్లిచ్చాడు. అతని 144 అభ్యర్థులలో 58 మంది యాదవులు, 17 మంది ముస్లిములు వుండగా, తక్కిన సీట్లు యితర కులాలకు యిచ్చాడు. వారిలో 24 సీట్లు ఇబిసి (అతి వెనకబడిన జాతులు, బిహార్‌లోని 7.10 కోట్ల ఓటర్లలో వీళ్లది 30 శాతం)కి యిచ్చి నీతీశ్ నుంచి ఆ ఓటుబ్యాంకును గుంజుకుందామని చూస్తున్నాడు.

తేజస్వి తన ఉపన్యాసాల్లో కులప్రస్తావన తగ్గించి, అభివృద్ధి, యువత ఎదుర్కుంటున్న సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నాడు. 2019 లోకసభ ఎన్నికలలో అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనకబడినవారికి 10 శాతం రిజర్వేషన్ యిచ్చారు కాబట్టి, దాన్ని ఆఫ్‌సెట్ చేయడానికి ఒబిసి రిజర్వేషన్ 10 శాతం పెంచాలని డిమాండ్ చేశాడు. ఈసారి అది వదిలేశాడు. 

తన తండ్రి 15 ఏళ్ల పాలన ఒక పొరబాటు (భూల్) అంటూ క్షమాపణ చెప్పాడు. కానీ ప్రత్యర్థి పక్షాలు దాన్ని తీసిపారేయడంతో ఆ మాట వదిలేసి ‘నయీ సోచ్, నయా బిహార్’ నినాదం ఎత్తుకున్నాడు, తనపై లాలూ వారసత్వభారం లేదని చూపించుకోవడానికి. మా నాన్న మీద అనవసరంగా కేసులు పెట్టారు వంటి సింపతీ కార్డు ఉపయోగించడం లేదు.

నీతీశ్‌పై గౌరవం ప్రకటిస్తూనే ‘ఆయన శారీరకంగా, మానసికంగా అలిసిపోయాడు, విశ్రాంతి యివ్వండి’ అని ఓటర్లకు చెప్తున్నాడు. మర్యాదగా మాట్లాడుతూ తటస్థులను ఆకర్షించడానికి చూస్తున్నాడు. అంతేకాదు, తన మహాగఠ్‌బంధన్ కూటమి విజయానికై కష్టపడుతున్నాడు. 

కాంగ్రెసు 70 స్థానాలలో నిలబడినా రాహుల్ 8 చోట్ల మాత్రమే ర్యాలీ చేశాడు. తేజస్వి మాత్రం కాంగ్రెసు నిలబడిన 47 స్థానాలకు వెళ్లి ప్రచారం చేశాడు. అదే విధంగా సిపిఎంఎల్, యితర లెఫ్ట్ అభ్యర్థులు నిలబడిన 23 చోట్లకు వెళ్లి ప్రచారం చేశాడు.

నీతీశ్ బిహార్ పరిస్థితి మెరుగుపరిచాడు కానీ, అది సరిపోదని గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్ర తలసరి ఆదాయం 2018-19లో రూ.30,617 వుంటే 2019-20కి రూ.43,000 అయింది కానీ అది జాతీయ సగటు రూ.1.36 లక్షల్లో యిది సగం కంటె తక్కువ. తేజస్వి హైలైట్ చేస్తున్న నిరుద్యోగిత ప్రధాన అంశంగా మారింది. 46.6 శాతంతో అది దేశంలో మూడో స్థానంలో వుంది. 

నీతీశ్‌ను నిలబెట్టడానికి మోదీ బిహార్ వెళ్లి 12 చోట్ల ప్రసంగించారు. అనేక ముఖ్యసమావేశాలను జూమ్ ద్వారా నిర్వహిస్తున్న ప్రధాని వీటికి స్వయంగా వెళ్లారు. చిరాగ్‌ను బిజెపియే నిలబెట్టారని ప్రజలు అనుకుంటే బిజెపి అభిమానులు తమ అభ్యర్థి లేనిచోట చిరాగ్‌కు వేయవచ్చు తప్ప జెడియుకి వేయకపోవచ్చు. 

అప్పుడు జెడియు పూర్తిగా దెబ్బ తింటే అదీ కష్టమే. బిజెపి లెక్క ప్రకారం జెడియుకి కొన్ని సీట్లు రావాలి కానీ తమ కంటె తక్కువ రావాలి. అలా వస్తేనే బిజెపి వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి నీతీశ్ ఒప్పుకుంటాడు. అతను పూర్తిగా దెబ్బ తిని తేజస్వి బలమైన లీడరుగా గెలిస్తే అదో చిక్కు.

ఏమౌతుందో చూద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?