Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బిశ్వజీత్‌కు ఎవార్డు

ఎమ్బీయస్: బిశ్వజీత్‌కు ఎవార్డు

జనవరి 16-24 మధ్య గోవాలో జరిగిన 51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ‘‘ఇండియన్ పర్శనాలిటీ ఆఫ్ ద ఇయర్’ అవార్డు 84 ఏళ్ల బిశ్వజీత్ చటర్జీ అనే ఆయనకు యిస్తున్నారని ఆయన హిందీ, బెంగాలీ సినిమాల్లో నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు, రాజకీయనాయకుడు అని వార్త వెలువడినప్పుడు దానితో బాటు ఆయన ఫోటో వేసినప్పుడు నాతరం వాళ్లలో చాలామంది తమకు తెలిసిన అందాల నటుడు బిశ్వజీత్, యీ బిశ్వజీత్ చటర్జీ ఒకరే అని గుర్తు పట్టకపోవడంలో ఆశ్చర్యం లేదు. 

ఎందుకంటే హిందీ సినిమాల్లో బిశ్వజీత్‌గానే ప్రసిద్ధి కెక్కాడు తప్ప అతను తన పూర్తి పేరు ఉపయోగించలేదు. జయ్ ముఖర్జీలాగానే తన అందంతో, సగటు నటనతో ఒక పదేళ్లపాటు (1962-72) వెలిగాడు. చాలాచాలా కాలంగా, అంటే 40 ఏళ్లగా, కారెక్టర్ యాక్టర్‌గా కూడా, హిందీ తెరపై కనబడకపోవడం చేత జీవితుడో కాదో తెలియని పరిస్థితి. అతను పాటగాడు, దర్శకుడు అని కూడా ఎవరికీ తెలియదు. బిశ్వజీత్ తన సౌందర్యానికి, సౌమ్యతకు, హుందాపాత్రలకు పేరు తెచ్చుకున్నాడు తప్ప గొప్ప నటుడిగా ఎవ్వరూ పరిగణించలేదు. నటనకు జాతీయ ఎవార్డులు ఎన్నడూ రాలేదు. మరి అలాటివాడికి హఠాత్తుగా యింత పెద్ద ఎవార్డు ఎందుకు? కారణం తెలియదు. ఊహించవచ్చు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. అక్కడి గెలుపు బిజెపికి అతి ముఖ్యం. హఠాత్తుగా నేతాజీ సుభాష్ బోస్‌కి పరాక్రమం వుందని గుర్తుకి వచ్చింది. ఆయన జన్మదినాన్ని పరాక్రమ్ దివస్ అనేశారు. గత సంవత్సరం నుంచి యీ సంవత్సరం లోపున ఆయన చూపిన పరాక్రమం ఏమీ లేదు. కానీ గతేడాది ఎన్నికలు లేవు, యీ ఏడాది ఉన్నాయి. బజెట్ ఉపన్యాసంలో తిరువళ్లువర్ కొటేషన్ తప్పనిసరిగా వింటూ వచ్చాం. ఎందుకంటే ఆర్థికమంత్రుల్లో చాలామంది తమిళులే కాబట్టి. ఈసారి టాగూర్ కూడా మెరిశారు. ఇక బజెట్ కేటాయింపుల్లో కూడా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు మాత్రమే సింహభాగం దక్కిందని వేరే చెప్పనక్కరలేదు. వాటిల్లో బెంగాల్ ఒకటి. 

ఈ బిశ్వజీత్ రాజకీయాల్లో ఎప్పుడూ లేడు కానీ ఏం పుట్టిందో ఏమో 2014లో తృణమూల్‌ పార్టీలో చేరి, దిల్లీలో పోటీ చేసి, 909 ఓట్లు తెచ్చుకున్నాడు. తర్వాత నాలిక కరుచుకుని, 2019లో బిజెపిలో చేరాడు. ప్రస్తుతం ఆ పార్టీ సభ్యుడు. ఇవన్నీ కాదు కానీ, అతని కొడుకు ప్రసేన్‌జిత్ బెంగాలీ చిత్రసీమలో ప్రసిద్ధనటుడు. చాలా ఎవార్డులు తెచ్చుకున్నాడు. వయసు దాదాపు 60 సం.లుంటుంది. నిర్మాత కూడా. బెంగాల్‌లో చాలా ఫాలోయింగ్ వుంది. రాజకీయాల్లోకి వస్తావా అని అడిగితే రాను అని చెప్పాడు. అది 2016 మాట. ఇప్పుడు బిజెపి అతనికి నచ్చచెప్పి పార్టీలో చేర్చుకుంటుందేమో, దానికి నాందిగా తండ్రికి ఎవార్డు యిచ్చిందేమో తెలియదు. వేచి చూస్తే తప్ప ఏమీ చెప్పలేం. ఏది ఏమైనా ఓ ఎవార్డు వచ్చిన సందర్భంగా బిశ్వజీత్ గురించి పాత విషయాలు నెమరేసుకోవడం సంతోషదాయకం.

1936లో కలకత్తాలో పుట్టిన బిశ్వజీత్ చటర్జీ బెంగాలీ సినిమాల్లో నటించాడు. ఇక్కడో చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. బెంగాలీ హీరోల్లో చటర్జీలు ఎక్కువ. ఉత్తమ్ కుమార్, సౌమిత్ర, అనిల్, తర్వాత వచ్చిన ధృతిమాన్, శుభేందు, ప్రసేన్‌జిత్, సిద్ధాంత్, అభిషేక్, అబీర్,... యిలా ఎందరో. వీళ్లు బెంగాలీ బ్రాహ్మణులు, బ్రాహ్మల్లో వేరే శాఖ వారైన ముఖర్జీలు, బెనర్జీలు, గంగూలీలు, కూడా చాలామంది హీరోలు, నటీనటులు వున్నారు. మొత్తమంతా వాళ్లే డామినేట్ చేసేశారని, తక్కినవాళ్లు రాకుండా తొక్కేశారనీ అనగా ఎన్నడూ వినలేదు. బిశ్వజీత్ రేడియో నాటకాల్లో, స్టేజి నాటకాల్లో వేస్తూ వచ్చాడు. ‘‘మాయామృగ’’ (1960) అనే సినిమా అతని తొలి బెంగాలీ హిట్. ‘‘దాదా ఠాకూర్’’ అనే సినిమాలో ముఖ్యపాత్ర ఛబీ బిశ్వాస్ నటించగా యితను ఒక యువకుడి పాత్ర ధరించాడు. 1957లో ప్రారంభమైన ఆ సినిమా 1962లో విడుదలైంది.

ఈలోగా అతను నాటకాలు వేస్తూన్నాడు. బిమల్ మిత్రా అనే రచయిత రాసిన ‘‘సాహెబ్, బీబీ, గులామ్’’ అనే నవలను అదే పేరుతో 1956లో సినిమాగా తీశారు. దానిలో భూతనాథ్ అనే ఉద్యోగి పాత్రను తెరపై ఉత్తమ్ కుమార్ వేశాడు. బిశ్వజిత్ రంగస్థలంపై ఆ పాత్ర వేసేవాడు. ఆ సినిమాను హిందీలో నిర్మిద్దామని అనుకున్న గురుదత్ కలకత్తా వచ్చి బిశ్వజిత్ నటన చూసి, బొంబాయి రప్పించాడు. అంతా ఓకే అనుకున్నాక ఐదేళ్ల కాంట్రాక్ట్ రాయమంటే బిశ్వజీత్ ఒప్పుకోలేదు. దాంతో గురుదత్తే ఆ పాత్ర వేశాడు. వెనక్కి వెళ్లి బెంగాలీ సీమలో ఉత్తమ్ కుమార్, సౌమిత్ర చటర్జీ వంటి హేమాహేమీల మధ్య నెగ్గుకు రావడం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ ఒక ఆఫర్ యిచ్చాడు.

షెర్లాక్స్ హోమ్స్ అనే డిటెక్టివ్ పాత్రతో ఆర్థర్ కానన్ డాయల్ రాసిన ‘‘హౌండ్ ఆఫ్ బాస్కర్‌విల్లి’’ అనే నవల ఆధారంగా 1951లో బెంగాలీలో ‘‘జిఘాంశా’’ (చంపుదామనే కోరిక) పేరుతో సినిమా తీశారు. దానికి సంగీతం అందించిన హేమంత్ కుమార్ దాని ఆధారంగా హిందీలో ‘‘బీస్ సాల్ బాద్’’ (1962) అనే సినిమా తీస్తూ యితనికి వహీదా రెహమాన్ పక్కన హీరో పాత్ర యిచ్చాడు.

‘బేకరార్ కర్‌కే హమేఁ’ https://www.youtube.com/watch?v=8YGueBsYzeI), వంటి మంచి పాటలతో, ‘అదరగొట్టే’ నేపథ్య సంగీతంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 

ఆ తర్వాత డాఫ్నె డి మారియర్ రాసిన ‘‘రెబెకా’’ నవల ఆధారంగా తీసిన ‘‘కొహ్‌రా’’ (1964)లో కూడా బిశ్వజీత్, వహీదాయే వేశారు. హేమంత్ తీసిన ‘‘బీవీ ఔర్ మకాన్’’ (1966) కూడా బెంగాలీ రీమేకే. ‘జయ్ మా కాలీ బోర్డింగ్’ సినిమాను హిందీలో హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వంలో తీశారు. ఇది అనేక భాషల్లోకి రీమేక్ అయింది. తెలుగులో ‘‘చిత్రం భళారే విచిత్రం’’ (1991)గా వచ్చింది. ‘‘పలాటక్’’ అనే బెంగాలీ సినిమా ఆధారంగా హేమంత్ తీసిన ‘‘రాహ్‌గీర్’’ (1969) అనే సినిమాలో బిశ్వజీత్ తనకు నటన కూడా వచ్చని నిరూపించుకున్నాడు. కానీ సినిమా ఆడలేదు. వీటన్నిటిలో బిశ్వజీత్‌కు హేమంత కుమారే గొంతు అరువిచ్చారు.

‘‘బీస్ సాల్ బాద్’’ సూపర్ హిట్ కావడంతో బిశ్వజీత్‌కు అవకాశాలు కుప్పలుతిప్పలుగా వచ్చి పడ్డాయి. అగ్ర తారామణులందరి సరసన నటించాడు. ‘‘బిన్ బాదల్ బర్సాత్’’ (1963), ‘‘మేరే సనమ్’’ (1965)లలో ఆశా పరేఖ్, ‘‘శెహ్‌నాయీ’’ (1964) ‘‘దో దిల్’’ (1965), ‘‘సగాయీ’’ (1966)లలో రాజశ్రీ, ‘‘ఏప్రిల్ ఫూల్’’ (1964)లో సైరా బాను, ‘‘ఏ రాత్ ఫిర్ న ఆయేగీ’’ (1966)లో శర్మిలా టాగూర్, ‘‘ఆస్‌రా’’ (1966), ‘‘నయీ రోశ్‌నీ’’ (1967- తెలుగులో పుణ్యవతి), ‘‘జాల్’’ (1967), ‘‘నైట్ ఇన్ లండన్’’ (1968) ‘‘దో కలియాఁ’’ (1968- తెలుగులో లేతమనసులు). ‘‘ప్యార్‌ కా సప్నా’’ (1969), ‘‘పైసా యా ప్యార్’’ (1969- తెలుగులో ఆస్తులు, అంతస్తులు) లలో మాలా సిన్హా, ‘‘కిస్మత్’’ (1969)లో బబితా, ‘‘మై సుందర్ హూఁ’’ (1971- తెలుగులో సర్వర్ సుందరం)లో లీనా చందావర్కార్, ‘‘పరదేశి’’ (1970), ‘‘శరారత్’’(1972)లలో ముంతాజ్ అతని హీరోయిన్‌లు. వీటిలో కొన్ని సినిమాల గురించి ప్రస్తావించాలి.

‘‘కొహ్‌రా’’ సినిమాలో కథ, పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగుంటాయి. ముఖ్యంగా బిశ్వజీత్‌ పై చిత్రీకరించిన ‘ఏ నయన్ డరే డరే’. https://www.youtube.com/watch?v=2gMhbWeo30o వింటే మర్చిపోలేం. గుల్షన్ నందా నవలపై ఆధారపడి తీసిన ‘‘శెహనాయ్’’ సినిమా ‘‘ఆరాధనా’’ (1969)కు స్ఫూర్తి నిచ్చిందనిపిస్తుంది. ‘‘ఏప్రిల్ ఫూల్’’ రొమాంటిక్ కామెడీ. https://www.youtube.com/watch?v=IPjoq0BriRE. ప్రథమార్థానికై ‘‘కమ్ సెప్టెంబర్’’పై ఆధారపడిన ‘‘మేరే సనమ్’’ సినిమాకు రమేశ్ సిప్పీ (‘‘శోలే’’ ఫేమ్) అసిస్టెంటు డైరక్టర్.  పాటలన్నీ చాలా చాలా బాగుంటాయి. 

ముఖ్యంగా ‘పుకార్‌తా చలా హూఁ మైఁ’,https://www.youtube.com/watch?v=gLKBwutnPwA&list=RDgLKBwutnPwA&start_radio=1 ‘జాయియే ఆప్ కహాఁ జాయేంగే’. ‘ఏ హై రేశ్‌మీ జుల్ఫోంకా’. చివర చెప్పిన పాటలో వ్యాంప్‌గా అదరగొట్టిన ముంతాజ్ తర్వాతి రోజుల్లో బిశ్వజీత్ పక్కనే హీరోయిన్‌గా వేసింది. కానీ అవి ఆడలేదు. ‘‘ఏ రాత్ ఫిర్ న ఆయేగీ’’లో కూడా పాటలు చాలా బాగుంటాయి. లండన్‌లో తీసిన ‘‘నైట్ ఇన్ లండన్’’కు ‘‘ఏ రాత్ ఫిర్ న ఆయేగీ’’కు దర్శకత్వం వహించిన బృజ్‌యే దర్శకుడు. బిశ్వజీత్ దర్శకులలో బిరేన్ నాగ్, హృషీకేశ్ ముఖర్జీ, సుబోధ్ ముఖర్జీ, ఎస్‌డి నారంగ్, మన్‌మోహన్ దేశాయ్, సివి శ్రీధర్, కృష్ణన్-పంజు తదితరులు ఉన్నారు.

‘‘కిస్మత్’’ సినిమాలో ‘కజ్‌రా మొహబ్బత్ వాలా’ పాట చిత్రీకరణలో బిశ్వజీత్ ఆడవేషంలో, బబిత పఠాన్ వేషంలో నటించారు. ఆడవేషం (డ్రాగ్) లో బ్రహ్మాండంగా యిమిడిపోయాడు బిశ్వజీత్. తర్వాతి రోజుల్లో రిషి కపూర్, గోవిందా, కమలహాసన్ వగైరాలు వేశారు కానీ ప్రథమ ప్రయత్నం నాదే అంటాడతను. షంషాద్ బేగమ్ యితనికి ప్లేబ్యాక్ పాడింది. పాట బిశ్వజీత్ అంత బిజీగా, ఏడాదికి 5,6 సినిమాలలో నటించే స్థితిలో వుండడానికి కారణం, అతని క్రమశిక్షణ. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా కూడా ఒప్పుకున్నాడు. ‘‘చౌరంఘీ’’ (1968) అనే విజయవంతమైన బెంగాలీ సినిమాలో ఉత్తమ్ కుమార్‌తో బాటు వేశాడు. తెర మీద ఫ్రెష్‌గా కనబడుతూ, తెల్ల బూట్లు వేసుకుని, సుమారు నటనతో, ఓవరాక్షన్ చేయకుండా చక్కగా కెరియర్ నడుపుకున్నాడు. ఫలానా పాత్ర బిశ్వజీత్ వేయకపోతే కుదరదు అనే పరిస్థితి లేకపోవడంతో పదేళ్ల తర్వాత అతనికి వేషాలు తగ్గాయి.

ఆ టైములో ‘‘కహ్‌తే హైఁ ముఝ్‌కో రాజా’’ (1975) అనే సినిమా స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించాడు. తనొక్కడే వుంటే వుంటే లాభం లేదని ధర్మేంద్రను పెట్టుకుని అతని సరసన అతిథి పాత్రలో హేమమాలినిని వేయించాడు. తన పక్కన హీరోయిన్‌గా రేఖను పెట్టుకున్నాడు. ఆ వేషం వేయడానికి రేఖ ఒప్పుకోవడం ఒక విశేషంగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఓ ఫ్లాష్‌బ్యాక్ వుంది. వివాదరహితుడిగా పేరుబడ్డ బిశ్వజీత్, రేఖ కారణంగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. రాజా నవాథే అనే ఒక దర్శకుడు 1969లో ‘‘అన్‌జానా సఫర్’’ అనే సినిమా తీస్తూ బిశ్వజీత్ పక్కన 15 ఏళ్ల రేఖను హీరోయిన్‌గా పరిచయం చేశాడు. తెలుగులో చిన్న వేషాలు వేసిన రేఖకు హిందీలో అదే తొలి ఛాన్స్. దానిలో హీరోయిన్‌ను ముద్దు పెట్టుకునే సీను వుంది. అది ఫారిన్ ఎడిషన్స్‌లోనే వుంటుంది, హీరోయిన్‌కు చెప్పాను, ఒప్పుకుంది అని నిర్మాత బిశ్వజీత్‌కు చెప్పాడు. సరేనని ఆ శృంగార దృశ్యంలో బిశ్వజీత్ రేఖను ముద్దాడాడు.

అంతే, రేఖ మూర్ఛపోయింది. బిశ్వజీత్ బిత్తరపోయాడు. రేఖ, ఆమె తల్లి పెద్ద గొడవ చేసేశారు. మాకెవ్వరూ ముందు చెప్పలేదు, బిశ్వజీత్ యిలా 5 ని.ల పాటు ముద్దు పెట్టుకుంటూ వుంటే ఫిల్మ్ యూనిట్టంతా యీలలు వేసి, గోల చేశారు. అవమానం భరించలేకపోయాను అని రేఖ చెప్పుకుంది. బిశ్వజీత్ ‘నా ఆనందం గురించి ముద్దు పెట్టుకోలేదు. నటనలో భాగంగానే, దర్శకుడు చెప్పినట్లు చేశానంతే’ అని చెప్పుకున్నాడు. ఎందరో అగ్రతారలతో నటించిన బిశ్వజీత్‌పై ఎటువంటి ఫిర్యాదూ లేదు కాబట్టి అందరూ అతని మాటను విశ్వసించారు. దర్శకుడిదే తప్పన్నారు. 

మొదటి సినిమా తయారు కాకుండానే, రేఖకు విపరీతంగా పబ్లిసిటీ వచ్చేయడంతో http://8ate.blogspot.com/2011/09/how-biswajeet-brought-on-indias-kissing.html పబ్లిసిటీ కోసమే రేఖ రచ్చ చేసింది అన్నవారూ వున్నారు. ఎలాగైతేనేం, సినిమాకు దర్శకుడు మారి, ఎలాగోలా పూర్తి చేసి ‘‘దో షికారీ’’గా పేరు మార్చారు. సెన్సార్ చిక్కుల్లో పడి పదేళ్ల తర్వాత రిలీజై ఫ్లాపయింది. రేఖ యీ లోపున పెద్ద హీరోయిన్ అయిపోయింది. 1974 నాటికి అగ్రతారగా అయిపోయి, రాజేంద్ర కుమార్, సునీల్ దత్, ధర్మేంద్ర, అమితాబ్ పక్కన వేషాలు వేస్తూన్నా, పాత సంఘటన మర్చిపోయి బిశ్వజీత్ సినిమాలో వేసింది.

ఇంతా చేసి ఆ సినిమా ఘోరంగా ఫ్లాపయింది. అక్కడితో బిశ్వజీత్ హిందీ హీరో వేషాలు ఆగిపోయాయి. కానీ బెంగాలీ సినిమాల దర్శకనిర్మాతగా కొనసాగాడు. 1980లో వచ్చిన బెంగాలీ సినిమాలో ‘‘బాబా తారక్‌నాథ్’’ సినిమా తర్వాత అతను హీరో వేషాలు వేసినది లేదు. టీవీ సీరియళ్లలో వేశాడు, తీశాడు. వాటిల్లో కొన్నే సక్సెస్ కావడంతో ప్రస్తుతం బిశ్వజీత్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే వుంది. కొడుకు మాత్రం ఉజ్జ్వలంగా వెలుగుతున్నాడు. వ్యక్తిగత జీవితానికి వస్తే మొదటి భార్య రత్న ద్వారా ప్రసేనజిత్, పల్లవి పుట్టారు. 

ఇద్దరూ యాక్టర్లే. బిశ్వజీత్ మొదటి భార్యను వదిలేసి రంగస్థల రచయిత్రి, దర్శకురాలు ఐన ఇరా ఆనే ఆమెను చేసుకోవడంతో కొడుక్కి, యితనికి పేచీ వచ్చింది. తర్వాతి రోజుల్లో ప్రసేనజిత్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుని అవి భగ్నమై 2002లో అర్పితా పాల్‌తో మూడో వివాహం చేసుకున్నాక, ఆమె తండ్రీకొడుకులను కలపడానికి ప్రయత్నించి, 2013కి సాధించింది. ఇప్పుడు యిద్దరి మధ్య సయోధ్య ఉంది. బిశ్వజీత్ ద్వితీయ వివాహం వలన కలిగిన ప్రీమా కూడా నటీమణే.

ఇప్పుడు ప్రకటించిన ఎవార్డును బిశ్వజీత్‌కు మార్చిలో యిస్తారట. ఏది ఏమైనా యీ అవార్డు సందర్భంగా పాత హిందీ సినిమాలను ఓ సారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంగా వుంది. పైనున్న ఫోటోలు – పై వరుసలో మొదటిది నా బోటి వాళ్లకు గుర్తుండి పోయిన బిశ్వజీత్ రూపం. రెండోది ‘‘మేరే సనమ్’’లో ‘పుకార్‌తా’ పాట దృశ్యం. మూడోది ‘‘బీస్ సాల్ బాద్’’లో వహీదాతో, కింది వరుసలో మొదటిది, ‘‘కిస్మత్’’లో ఆడవేషంలో, రెండోది ‘‘రాహ్‌గీర్’’లో డీ గ్లామరైజ్‌డ్ వేషం, మూడోది ప్రస్తుతం 84 ఏళ్ల వయసులోని ఫోటో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?