Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఏం చూసుకుని బిజెపికి యీ ధైర్యం?

ఎమ్బీయస్‌: ఏం చూసుకుని బిజెపికి యీ ధైర్యం?

మన తెలుగువాళ్లు పౌరాణిక పాత్రల్లో సైతం ఆత్మీయుల మధ్య యుద్ధం జరిగితే చూసి, ఆనందిస్తారు. కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం... యిలా బంధువులు, ఆత్మబంధువులు కూడా సినిమా లేదా నాటకం చివర్లో 'నీ సంగతి ఎవరికి తెలియదు, తొల్లి అలా చేయలేదా, యిలా చేయలేదా?' వంటి ఎత్తిపొడుపుల పద్యాలు పాడుకుంటూ  ఉంటే చప్పట్ల వర్షం కురిపిస్తారు. చివర్లో శివుడో, బ్రహ్మూ ప్రత్యక్షమైలోకకళ్యాణం కోసం యిద్దరూ మీ మీ అస్త్రాలు విరమించండి అంటాడు.

దాంతో ఆ పాత్రలు తమ వెక్కిరింతలు మర్చిపోయి మళ్లీ చెట్టాపట్టాలు వేసుకుని వెళ్లిపోతారు. ప్రేక్షకులు కూడా ఖుష్‌. ప్రస్తుతం ఆంధ్రలో బిజెపి-టిడిపిల మధ్య యీ పరస్పర నిందా ఘట్టమే నడుస్తోంది. స్థానిక బిజెపి నాయకులు, టిడిపి నాయకులు రెచ్చిపోయి సవాళ్లు విసురుకుంటున్నారు. మనం కన్నార్పకుండా చూడడంతో టీవీ ఛానెళ్ల రేటింగ్స్‌ పెరుగుతున్నాయి. 

కాస్త స్థిమితపడి ఆలోచిస్తే 'నిజానికి యీ అంకం ఎప్పుడో రావాలిగా! ఇవన్నీ యిప్పుడే ఎందుకు బయటపెట్టుకుంటున్నారు? ఇన్నాళ్లూ అందరూ చెపుతున్నవే యిప్పుడే కనిపెట్టినట్లు యీ హంగామా ఏమిటి?' అనిపిస్తుంది. డైలాగుల్లోనే కాదు, పాలిటిక్స్‌లోనూ టైమింగ్‌ చాలా ముఖ్యం. ఇప్పటిదాకా ఎలా మభ్యపెడుతూ వచ్చినా, యిప్పుడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. నిర్మొగమాటంగా చెప్పాలంటే 2014 నుంచి బిజెపి ఆంధ్ర పట్ల ఒకేలా ప్రవర్తిస్తూ వచ్చింది. కారణాలు ఏమైనా టిడిపి దానికి తాళం వేస్తూ వచ్చింది.

బిజెపిది అన్యాయం అన్నవాళ్లను కూకలు వేస్తూ వచ్చింది. కానీ యీ హనీమూన్‌ ఎన్నికలకు ముందే అంతమవుతుందని సామాన్యుడికి కూడా తెలుసు. ఎందుకంటే ఆంధ్ర ఏర్పడ్డాక ప్రభుత్వం తరఫున ఒక్క పనీ నడవలేదు. బండి నడుస్తోందంటే దానికి కారణం ప్రజలు అష్టకష్టాలు పడుతూ తమ బతుకుబండి తాము యీడ్చుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ గ్యాస్‌ కబుర్లేనని, అమరావతి, పోలవరం సుదూర స్వప్నాలేననీ 2015 చివరి నాటికే అందరికీ తెలిసివచ్చింది. అందుకే ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేవారి ఉబలాటం తగ్గిపోయింది. 

2019 ఎన్నికల నాటికి చూపించుకోవడానికి ఒక్క విజయమూ కనబడదని, ఎన్నికల్లోకి దూకేముందే బాబు తమ నాన్‌-పెర్‌ఫార్మెన్స్‌కు ఎవరో ఒకరిపై నింద వేస్తారని అందరికీ అర్థమైంది. ప్రతిపక్షంపై నింద మోపుదామంటే వాళ్లలో చాలామందిని తమలో కలిపేసుకుని నిర్వీర్యం చేసేశారు. అసెంబ్లీలో ఎవరైనా నోరెత్తితే సస్పెండ్‌ చేసేస్తున్నారు. వాళ్ల నాయకుడు అసెంబ్లీకి రాకుండా తన పాటికి తను పాదయాత్రలు చేసుకుంటున్నాడు.

ఆ పార్టీ కార్యకర్తలు పోలవరం ప్రాజెక్టు దగ్గరకి వెళ్లి, అమరావతి కట్టడాల వద్దకు వెళ్లి ధర్నాలు చేసి, లారీలకు అడ్డంగా పడుక్కుని ఆపించటం లేదు. అందుచేత వాళ్ల వలన పనులు ఆగిపోయాయి అనలేరు. ఇక మిగిలింది మిత్రపక్షం బిజెపియే కాబట్టి అది నిధులివ్వలేదు, సహకరించలేదు అనాలి. అది ముందే అనేస్తే వాళ్లక్కోపం వచ్చి అయితే సంకీర్ణంలోంచి బయటకు నడవండి అంటారేమో తెలియదు.

మీకిచ్చిన నిధుల వినియోగంపై ఓ కమిషన్‌ వేసి విచారిస్తాం జాగ్రత్త అని అన్నాఅనవచ్చు. అందువలన నాలుగేళ్ల పాటు వాళ్లతో భుజాభుజాలు రాసుకుని, పూసుకుని తిరిగి సన్మానాలు చేసి, వారి వీపు వీరు, వీరి వీపు వారు గోక్కుని, ఆంధ్రలో ప్రగతి చూసి ప్రపంచదేశాలన్నీ కుళ్లుకుని ఛస్తున్నాయని అనుకూల మీడియాలో రాయించుకుని, అన్నీ అయ్యాక ఎన్నికలకు ఏడాది ముందు ముహూర్తం పెట్టుకుని మరీ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టెక్కుతారు అని అందరూ అనుకున్నారు. అదే అక్షరం తప్పకుండా జరిగింది. 

టిడిపి పక్షాన్నుంచి ప్లానంతా పెర్‌ఫెక్ట్‌గా ఉంది. కేంద్రంపై దుమ్మెత్తి పోయడం రాష్ట్రాలకు అతి సులభమైన పని. పన్నుల రూపేణా మా డబ్బు తీసుకుని, నిధుల రూపంలో మళ్లీ మాకు యివ్వడానికి మీకేం పోయేకాలం? అని గగ్గోలు పెట్టవచ్చు. 'రాష్ట్రం సత్యం, కేంద్రం మిథ్య' అని ఆదిశంకరాచార్య లెవెల్లో ఎన్టీయార్‌ ఎప్పుడో కొటేషించారు. దానికి ఉత్తరాది ప్లస్‌ హిందీ రంగు కూడా పులిమితే మరింత కలర్‌ఫుల్‌ అవుతుంది. 'మీ కోసం ప్రపంచమంతా నివ్వెరపోయేలా రాజధాని కడదామని నేను రాజమౌళి నుంచి స్పీల్‌బెర్గ్‌ దాకా అందర్నీ సంప్రదిస్తూ ఉంటే యీ దుష్ట దుర్మార్గ కేంద్రం మోకాలడ్డుతోంది.

వాళ్లయితే పోలవరం ఎప్పుడు కడతారో అనే సందేహంతో రాజధానితో పాటు ఆ బాధ్యత కూడా వహించడానికి నేను యింకో రెండు గంటల నిద్ర తగ్గించుకుని సిద్ధపడినా దానికీ మోచేతులడ్డం పెడుతోంది. మన ఆత్మగౌరవం దెబ్బ తింది. ఆంధ్రులకు మళ్లీ ఆత్మగౌరవం దక్కాలంటే, ఎన్టీయార్‌ ఆత్మ శాంతించాలంటే టిడిపి మళ్లీ గద్దె నెక్కేదాకా మీరు నిద్ర పోకూడదు.' అని బాబు ప్రజల్లోకి వెళతారు.

'గత నాలుగేళ్లగా యీ ఆత్మగౌరవం ఏమైంది? హోదా కోసం, ప్యాకేజీ చట్టబద్ధతకోసం, తెలంగాణతో నీటి వాటాల పంపిణీ కోసం, హైదరాబాదులో ఉమ్మడి ఆస్తుల పంపకం కోసం కేంద్రంపై పోరాడదామని అన్నవాళ్లని తిట్టిపోసినపుడు ఏమైంది యీ పౌరుషం, యీ తెలివితేటలు? విభజన చట్టంలోని హామీల్లో ఏమీ అమలు చేయకపోయినా, రైల్వే జోన్‌ సైతం యివ్వకపోయినా ఐదో బజెట్‌ వరకూ నిద్దుర పోతున్నారా?' అని ప్రజలు అడుగుతారన్న భయం లేదు వాళ్లకి.

ప్రతీదానికీ ఏదో ఒక కారణం చెప్పగల నేర్పు ఉంది బాబుకి. ఔనౌనౌనౌను ఆయన కౌటిల్యుడు, నోరు తెరిచినా, తెరిచి మాట్లాడకపోయినా, ఆవులించి ఊరుకున్నా దాని వెనక పెద్ద చాణక్యం ఉంది అని మనను ఒప్పించే మీడియా ఉంది. సాధారణ ప్రజలకు సంగతి అర్థమవుతూనే ఉన్నా 'సరే, బాబు తప్పులు చేస్తున్నాడు, అయితే మనకు ప్రత్యామ్నాయం ఏముంది? జగనా!? ఎంతో అనుభవం, రాజనీతిజ్ఞత ఉన్న బాబునే మోదీ యిలా ఆడిస్తూంటే అయితే ఆవేశం లేకుంటే విషాదవదనం తప్ప మరేమీ కనబరచని జగన్‌ నెగ్గుకు రాగలడా? మనను గట్టెక్కించ గలడా?' అనే సందేహం పీడిస్తూ బాబే శరణ్యం అనుకుంటున్నారు. నంద్యాల ఉపయెన్నికలో ఆ విషయం తేటతెల్లమైంది. టిడిపి పార్టీని విడిచి ఎవరూ వెళ్లటం లేదు కాబట్టి, మహా అయితే కొన్ని సీట్లు తగ్గవచ్చేమో కానీ మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమా టిడిపికి ఉంది.

మరి బిజెపికి ఏ ధైర్యం ఉందని టిడిపితో తలపడింది? ఇన్నాళ్లూ రాష్ట్రానికి ఏమీ చేయలేదని కనబడుతూనే ఉంది. కారణాలు ఏమైనా చెప్పవచ్చు. కానీ ఎన్నికలున్న యితర రాష్ట్రాల పట్ల చూపుతున్న ఔదార్యం ఆంధ్ర పట్ల ఎందుకు చూపలేదో బిజెపి నాయకులు సమర్థించుకోవడం మహా కష్టం. కాంగ్రెసు ప్రత్యేక హోదా ఐదేళ్లే యిచ్చింది, మేమైతే పదేళ్లు, పదిహేనేళ్లు యిస్తాం అంటూ వాగ్దానాలు చేసి, దిల్లీని మించిన రాజధాని కట్టిస్తామని చెప్పి, పోలవరం జాతీయ ప్రాజెక్టును టిడిపికి అప్పగించేసి చేతులు దులిపేసుకుని, యిప్పుడు ఓటర్లను ఎలా ఫేస్‌ చేద్దామనుకుంటున్నారనేది అర్థం కావటం లేదు.

మోదీకి ఎంతైనా యిమేజి ఉండవచ్చు. కానీ దాన్ని ఓట్లగా అనువదించాలంటే స్థానికంగా బిజెపి నాయకులు గట్టివాళ్లుండాలి. పార్టీ నిర్మాణం ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి నాయకులందరూ తెలంగాణ వారు కావడానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఆరెస్సెస్‌ అక్కడ బలంగా ఉంది. కానీ ఆంధ్రలో ఆరెస్సెస్‌, జనసంఘ్‌, తదాది బిజెపి ఎప్పుడూ బలహీనమే. మధ్యతరగతి వారి పార్టీగానే ఉంది. ఇప్పుడు వారందరూ అది ఆంధ్రకు అన్యాయం చేసిందనే కోపంతో ఉన్నారు. 'మోదీ ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత నిజాయితీపరుడైనా కావచ్చు, కానీ ఆంధ్రను చిన్నచూపు చూస్తున్నాడనేది వాస్తవం' అని సగటు బిజెపి అభిమాని వాపోయే పరిస్థితి ఉంది. 

ఇలాటి పరిస్థితుల్లో హఠాత్తుగా స్థానిక బిజెపి నాయకుల చేత బాబును, టిడిపిని తిట్టించి, బిజెపి ఏం బావుకోబోతోంది? టిడిపితో తెగతెంపులు చేసుకుంటుందా? అది సాధ్యమా? వైసిపితో పొత్తు పెట్టుకుంటే యిద్దరికీ నష్టమేనని పరిశీలకుల అంచనా. బిజెపి విడిగా పోటీ చేసి, ఎన్నికల తర్వాత టిడిపి, వైసిపిలలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారి మద్దతు తీసుకుంటుందని కొందరి ఊహాగానం.

అదే నిజమైతే విడిగా పోటీ చేస్తే బిజెపికి ఎన్ని సీట్లు వస్తాయి? ఆంధ్రకు అన్యాయం చేసింది అనే నింద పడిన కాంగ్రెసుకు 2014లో ఎన్ని సీట్లు వచ్చాయి? బిజెపి రణనీతి ఏమిటో అర్థం కావటం లేదు. మొదటి పేరాలో చెప్పినట్లు బ్రహ్మూ, ఈశ్వరుడో వచ్చేదాకా యీ నిందాపర్వం సాగించి తర్వాత నాటకం సుఖాంతం చేస్తారా? ఈ అంశంపై మనం చర్చించాల్సినది చాలా ఉంది. వచ్చే వ్యాసాల్లో మరి కొన్ని సంగతులు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?