cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బెంగాల్‌లో బిజెపి దిద్దుబాటు చర్యలు

ఎమ్బీయస్‌: బెంగాల్‌లో బిజెపి దిద్దుబాటు చర్యలు

ఈశాన్య రాష్ట్రాలలో జయపతాకను ఎగరవేసిన బిజెపి బెంగాల్‌లో కూడా తన తడాఖా చూపిద్దామనుకుంటోంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో 25 పార్లమెంటు సీట్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకుని వ్యూహాలు రచిస్తోంది. మమతా బెనర్జీ బిజెపికి దాసోహమనక పోవడంతో, ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌ ఏర్పడితే దానిలో చురుకైన పాత్ర వహిద్దామని ఉవ్విళ్లూరడంతో ఆమెను కట్టడి చేయడానికి సర్వయత్నాలు చేస్తున్నారు.

ఒకప్పుడు బెంగాల్‌లో బిజెపికి నిలవనీడ ఉండేది కాదు. అలాటిది యీనాడు తృణమూల్‌ తర్వాత ద్వితీయస్థానంలో లెఫ్ట్‌ పార్టీలను తోసిరాజని, బిజెపి నిలబడుతోంది. ఆగస్టులో జరిగిన స్థానిక ఎన్నికలలోనే కాదు, యిటీవల జరిగిన అసెంబ్లీ ఉపయెన్నికలలో కూడా ఆ విషయం రుజువైంది. హిందూత్వ శక్తులను ఏకం చేసి, మమతను ముస్లిం అభిమానిగా చూపించి, మతపరంగా ఓట్లు చీల్చి లాభపడదామనే ఉద్దేశంతో బిజెపి వివాదాలను రగులుస్తోంది.

తృణమూల్‌ కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. నిజానికి హింస బెంగాల్‌ రాజకీయాల్లో సర్వసాధారణం. కమ్యూనిస్టు, కాంగ్రెసు, తృణమూల్‌ ముగ్గురూ హింసకు పాల్పడినవారే. ఇప్పుడు కొత్తగా బిజెపి వచ్చి చేరింది. వీటిని పార్టీపరమైన విభేదాలుగా చూడకుండా మోదీ సర్కారు ప్రభుత్వపరంగా ప్రతిచర్యలు తీసుకుంటోంది. 

జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా బిజెపి ర్యాలీలు నిర్వహించబోతే మమత సర్కారు అనుమతి యివ్వలేదు. గతంలో జరిగిన ర్యాలీలు హింసాత్మకంగా మారిన దృష్టాంతాలున్నాయి. దాంతో బిజెపి, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగి, తృణమూల్‌ కార్యకర్తలు బిజెపి కార్యాలయాలపై దాడి చేశారు. దానికి ప్రతిక్రియ చేయాలనుకుంది బిజెపి హై కమాండ్‌. బెంగాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమావేశం కలకత్తాలో జనవరిలో జరిగింది. దానికి కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ హాజరు కావలసి ఉంది. అతను గైరుహాజరయ్యాడు. విదేశీ పెట్టుబడిదారులకు యిది తప్పుడు సంకేతాలను పంపుతోందంటూ మమత మండిపడింది.

బిజెపికి మూలబలం ఆరెస్సెస్‌ క్యాడర్‌. దేశంలో కొన్ని చోట్ల మాత్రమే అది బలంగా ఉంది. అక్కడ బిజెపి సులభంగానే విస్తరిస్తోంది. కానీ తక్కిన అనేక రాష్ట్రాలలో బిజెపికి నాయకులు లేరు. అర్జంటుగా దేశాన్ని కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌గా మార్చేయాలన్న ఆత్రంతో బిజెపి తనకు బలం లేని చోట్ల యితర పార్టీల నుంచి నాయకులను లాక్కుని, ఆ ఫిరాయింపుదారులతో పార్టీని విస్తరిద్దామని, ప్రభుత్వాలను ఏర్పరుద్దామని చూస్తోంది. వారందరూ కాంగ్రెసు లేదా యితర పార్టీల సిద్ధాంతాలతో పెరిగినవారే.

బిజెపి మౌలిక సూత్రాలను నిన్నటిదాకా ఎదిరించినవారే. అయినా బిజెపి కండువాలు కప్పుకుని తమ పాత సంస్కృతిని దీనికి అంటగడుతున్నారు. మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉంటూ వస్తున్న ముకుల్‌ రాయ్‌ను బిజెపి గత నవంబరులో తమ పార్టీలోకి దిగుమతి చేసుకుంది. అమిత్‌ షాకు బూత్‌ స్థాయి మేనేజ్‌మెంటుపై మక్కువ ఎక్కువ. తక్కిన పార్టీలకు తమ ఓటర్లను బూత్‌లకు తెప్పించే సత్తా లేకపోవడం వలన బిజెపి వ్యతిరేక భావాలు ఓట్లగా తర్జుమా కావటం లేదు. బిజెపి వారు పన్నా ప్రముఖ్‌ పేరుతో రాష్ట్రమంతటా కొందరిని నియమిస్తారు.

వాళ్లు ఒక్కోళ్లు 500 ఓట్లు పడేట్లా చూడాలి. బెంగాల్‌లో 77 వేల బూత్‌లు ఉన్నాయి. వారికి పన్నా ప్రముఖ్‌లను నియమించే పని అమిత్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌కు అప్పగించాడు. కానీ అతను అంతమందిని పోగేయలేక పోయాడని 2017 సెప్టెంబరులో కలకత్తాకు వచ్చినపుడు అమిత్‌కు అర్థమైంది. అప్పుడు అమిత్‌ చూపు ముకుల్‌పై పడింది. బూత్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్టయైన అతను కాంగ్రెసు పార్టీలో ఉంటూ వచ్చి, తృణమూల్‌ అధికారంలోకి వచ్చాక 2011లో ఆ పార్టీలో చేరాడు. అప్పణ్నుంచి మమతకు ఆప్తుడిగా వుంటూ, ఆ పార్టీ తరఫున బూత్‌ మేనేజ్‌మెంటును పటిష్టపరిచాడు. 

ముకుల్‌ రాయ్‌ తమ పార్టీలోకి రావడం బెంగాల్‌ బిజెపి నాయకులకు యిష్టంగా లేదు. మమతా ఆర్థిక నేరాలలో ముకులే సూత్రధారి అని 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలోనే కాదు, మూడేళ్లగా బిజెపి హోరెత్తించింది. అతన్ని ఝాడిస్తే మమతను జైలుకి పంపడం సులభమని అనేక ర్యాలీలలో సీనియర్‌ బిజెపి నాయకులు అనేకసార్లు ప్రకటించారు. అలాటిది ఇప్పుడతను పెద్ద మొనగాడంటూ పార్టీలోకి ఎఱ్ఱ తివాచీ వేసి పిలుచుకు రావడమేమిటని దిలీప్‌ ఘోష్‌ ఘోష. అతనికి ఆరెస్సెస్‌తో బాటు బెంగాల్‌కు కేంద్ర బిజెపి పరిశీలకుడు కైలాస్‌ విజయవర్గీయా మద్దతు కూడా ఉంది.

'ముకుల్‌ను ఒళ్లో పెట్టుకుని మమత అవినీతి గురించి ఏదైనా అందామంటే ఎలా?' అని వారి ప్రశ్న. ముకుల్‌ రాగానే అతని వెంట తృణమూల్‌లో పెద్ద తలకాయలు కొన్ని వచ్చేస్తాయని ఆశపడిన బిజెపికి యిటీవల ఆశాభంగమైంది. నోయాపాడా అసెంబ్లీ నియోజకవర్గంలో మధుసూదన్‌ ఘోష్‌ అనే కాంగ్రెసు ఎమ్మెల్యే మరణంతో ఖాళీ ఏర్పడి జనవరి 29న ఉపయెన్నిక జరిగింది. ఆ స్థానంలో 2001లో, 2011లో తృణమూల్‌ తరఫున నెగ్గిన మంజూ బోస్‌ ముకుల్‌ అనుయాయురాలు. 2016లో మధుసూదన్‌ చేతిలో ఓడిపోయింది. తన భర్త మరణానికి కారణం తృణమూల్‌ కార్యకర్తలే నంటూ ఆరోపించి మమత ఆగ్రహానికి గురైంది.

అందువలన ఆమెను బిజెపిలోకి లాక్కుని వద్దామని ముకుల్‌ ప్లానేసి కైలాస్‌కు పరిచయం చేశాడు. అతను సిఫార్సు చేయడంతో బిజెపి సెంట్రల్‌ ఎలక్షన్‌ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్న జెపి నడ్డా 'నోయాపాడా నియోజకవర్గం నుంచి మా పార్టీ తరఫు అభ్యర్థి మంజూ బోస్‌' అని ప్రకటించాడు. వెంటనే మంజూ దాన్ని ఖండించింది. తను తృణమూల్‌తోనే ఉంటాననీ, పార్టీ మారనని ప్రకటించింది. బిజెపికి తలవంపులైంది. చివరకు సందీప్‌ బెనర్జీని నిలబెట్టింది. తృణమూల్‌ సునీల్‌ సింగ్‌ అనే అతన్ని నిలబెట్టి 63 వేల తేడాతో సందీప్‌ను ఓడించింది. 

ముకుల్‌ రాయ్‌ సామర్థ్యం మీద అమిత్‌కు అనుమానం వచ్చి, అరవింద్‌ మేనన్‌ను బెంగాల్‌లో పార్టీ యిన్‌చార్జిగా పంపిస్తాడనే వార్తలు వచ్చాయి. మలయాళీ ఐన అరవింద్‌ బెంగాల్‌లో ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా పనిచేయడం చేత బెంగాలీ ధారాళంగా మాట్లాడగలడు. అతను మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ చౌహాన్‌కు సహాయకుడిగా ఉంటూ వ్యాపమ్‌ కుంభకోణాన్ని తెలివిగా మేనేజ్‌ చేశాడు. అందుకే 2016లో అతన్ని దిల్లీ పిలిపించి బిజెపి పాలసీ మేకింగ్‌ సెల్‌లో అవకాశం యిచ్చారు. తాజాగా గుజరాత్‌ ఎన్నికలలో అతని సేవలు ఉపయోగించుకున్నారు. బెంగాల్‌లో తృణమూల్‌ కండబలానికి సరైన జవాబు యివ్వగల సమర్థుడు అరవిందే అని అమిత్‌ అభిప్రాయమట. మేలోపున మోదీ బెంగాల్‌లో పాల్గొనే ఆరు ర్యాలీలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాటి నిర్వహణ ఎవరికి అప్పగిస్తారో చూడాలి.

(ఫోటో - ముకుల్‌ రాయ్‌, కైలాశ్‌ విజయవర్గీయా)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com