Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: యుపి స్థానికంలో బిజెపిది ఏ పాటి విజయం?

నవంబరులో యుపిలో జరిగిన స్థానిక ఎన్నికలలో బిజెపి సాధించిన విజయంపై చాలామందికి స్పష్టత లేనట్టు తోస్తోంది. 16 మునిసిపల్‌ కార్పోరేషన్లలో (నగర నిగమ్స్‌) 14 మేయరు పదవులు బిజెపి గెలవడంతో, అమిత్‌ షా తమది 'లాండ్‌స్లయిడ్‌ విక్టరీ' అని ప్రకటించడంతో  'యుపిలో కాషాయం హవా' అని చాలా పత్రికలు, టీవీ ఛానెళ్లు హెడింగ్స్‌ పెట్టేశాయి. యోగి ఆదిత్యనాథ్‌ 8 నెలల పాలనతో సంపాదించుకున్న పాప్యులారిటీ మోదీ పాప్యులారిటీకి తీసిపోదని కథలు అల్లేశాయి. దానితో పాటు జరిగిన నగర పాలిక పరిషద్‌ ఎన్నికలను, నగర పంచాయితీ ఎన్నికలను పట్టించుకోవడం మానేశాయి.

అందుకే చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో బిజెపి బలహీనంగా ఉందన్న వాస్తవం వెలుగులోకి రాలేదు. గణాంకాలు వల్లె వేసే ముందు గ్రహించవలసినదేమిటంటే నగరాల్లో, అంటే పెద్ద పట్టణాల్లో బిజెపి బలంగా ఉంది కానీ తక్కిన చోట లేదు. అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా దెబ్బ తిన్న ఎస్‌పి, బియస్‌పి పూర్తిగా తుడిచి పెట్టుకుపోలేదు. ఆర్నెల్లలోనే పుంజుకుని తమ ఉనికిని చాటుకున్నాయి. అందరి కంటె ఎక్కువగా లాభపడినది స్వతంత్రులు. వీళ్ల పుట్టుపూర్వోత్తరాలేమిటో, ఏ భూమికపై గెలిచారో పత్రికలు కవర్‌ చేయలేదు. వీళ్లు పార్టీ టిక్కెట్టు దొరకని తిరుగుబాటు అభ్యర్థులా, కులనాయకులా అనేది ఏమీ తెలియదు.

ముందుగా కార్పోరేషన్ల గురించి మాట్లాడదాం. వీటిలో గెలవడం బిజెపికి కొత్త కాదు. 2012లోనే, బిజెపి ప్రతిపక్షంలో ఉండగానే, మోదీ  కానీ యోగి కానీ తెరపైకి రానప్పుడే 12 కార్పోరేషన్లలో 10 గెలిచింది. అంటే 83%. ఇప్పుడు 16 కార్పోరేషన్లలో 14 గెలిచింది. అంటే 87%. కొత్తగా వచ్చి చేరిన నాలుగు కార్పోరేషన్లు బిజెపినే గెలిపించాయి కానీ పశ్చిమ యుపిలో ఉన్న మేరఠ్‌, ఆలీగఢ్‌ స్థానాలు బియస్పీకి పోగొట్టుకుని ద్వితీయస్థానంలో నిలిచింది. ఇవి మేయరు స్థానాలు. ఇక మొత్తం కార్పోరేటర్ల సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే 1299 మందిలో 596 బిజెపి గెలిచింది. అంటే 46%, ఐదేళ్ల క్రితం కంటె 15% పెరిగింది.

బిజెపి గెలిచిన స్థానాల్లో బియస్పీ 2 చోట్ల, ఎస్పీ 5 చోట్ల, కాంగ్రెసు 4 చోట్ల, మజ్లిస్‌ 1 చోట ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. మనం ముఖ్యంగా గ్రహించవలసినది యీ ఎన్నికలలో పాల్గొన్న చోట్ల జనాభాలో 10% మంది మాత్రమే నివసిస్తారు. దీనికి తొమ్మిది రెట్లు  మంది నివసించే మునిసిపల్‌ కౌన్సిళ్లు, పంచాయితీల్లో బిజెపి పరిస్థితి యిలా లేదు. తక్కిన పార్టీల విషయం చూద్దాం. కార్పోరేషన్స్‌లో ఎస్పీ 192 (15%) సీట్లు గెలుచుకుంది. బియస్పీ 147 (11%) సీట్లలో గెలిచింది. కాంగ్రెసు 110 (8%) గెలిచింది. 2012 స్థానిక ఎన్నికలు వేటిల్లోనూ ఎస్పీ, బియస్పీ పోటీ చేయకపోవడం వలన పోల్చి చూడడం కష్టం.  225 (17%) మంది స్వతంత్ర అభ్యర్థులు కార్పోరేటర్లుగా గెలిచారు.

మునిసిపల్‌ కౌన్సిల్‌ (నగర పాలికా పరిషద్‌) - దీనిలో కోటి మంది ఓట్లేశారు. 5217 వార్డులున్నాయి. గెెలిచినవారు ఎన్నుకునే చైర్మన్లు 198 మంది ఉన్నారు. 5217 వార్డుల్లో బిజెపి 914 వార్డుల్లో మాత్రమే గెలిచింది. (అంటే 18%) అన్నమాట. తక్కినవారు 4303 సీట్లు గెలిచారు.  మొత్తం మీద 34% ఓట్లతో 18% వార్డులే గెలిచినా మొత్తం మునిసిపల్‌ కౌన్సిళ్లలో 35% అంటే 68 వాటిలో బిజెపి తన మునిసిపల్‌ చైర్మన్లను గెలిపించుకోగలిగింది. ఎస్పీ 45 (23%) చైర్మన్‌ పదవులను, బియస్పీ 29 (15%) చైర్మన్‌ పదవులను, కాంగ్రెసు 9 (5%) పదవులను గెలుచుకోగలిగాయి. స్వతంత్రులు  ఎస్పీతో సమానంగా 45 చైర్మన్‌ పదవులను గెలుచుకోగలిగారు. 2012 ఎన్నికలలో 137 మంది స్వతంత్రులు గెలిచారు. వీరిలో ఎస్పీ, బియస్పీ మద్దతున్నవాళ్లు ఉండే వుంటారు.

నగర పంచాయితీలు - వీటిలో 2.55 కోట్లు ఓట్లేశారు. 5390 సీట్లు ఉన్నాయి, గెలిచినవారు ఎన్నుకునే 438 నగర పంచాయితీ చైర్మన్లు ఉన్నారు. 5390 సీట్లలో బిజెపి 662 మాత్రం (అంటే 12% అన్నమాట) గెలిచింది. ఇతరులు 4728 గెలిచారు. మొత్తం మీద 12% సీట్లే గెలిచినా మొత్తం నగర పంచాయితీల్లో 23% అంటే 100 వాటిలో బిజెపి తన పంచాయితీ చైర్మన్లను గెలిపించుకోగలిగింది. ఎస్పీ 83 (19%) చైర్మన్లను, బియస్పీ 45 (10%) చైర్మన్లను, కాంగ్రెసు 17 (4%) చైర్మన్లను గెలిపించుకుంది. స్వతంత్రులు బిజెపి కంటె 80% ఎక్కువగా 182 (42%) పంచాయితీ చైర్మన్‌ పదవులు గెలిచారు. 2012లో స్వతంత్రులు 366 స్థానాల్లో గెలిచారు. ఈ సారి అన్ని పార్టీలు పోటీ చేసినా, స్థానిక సమస్యలు ప్రధానాంశంగా ఉండే మునిసిపాలిటీ, నగర పంచాయితీలలో మొత్తం 10607 వార్డుల్లో 7230 వార్డుల్లో అంటే 68% చోట్ల స్వతంత్రులు గెలిచారు.

ఈ ఫలితాలను చూస్తే కొన్ని విషయాలు బోధపడతాయి. యుపి స్థానిక ఎన్నికలలో బిజెపిది ఎంతమాత్రం ఘనవిజయం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఫలితాలు రాబట్టలేదు. నగర పట్టణ ప్రాంతాల్లో రాబట్టింది కానీ కానీ జనాభాలో 22% మాత్రమే అక్కడ నివసిస్తారు. అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 8% ఓట్లు తగ్గాయి. అది కొన్ని ప్రాంతాల్లో 5% ఉంది, కొన్ని చోట్ల 5-9% ఉంది, మరి కొన్ని చోట్ల వారణాశి, బరేలీ, ఝాన్సీ, మధురా వంటి చోట్ల 10% ఉంది.

ఈ తగ్గుదల 8 నెలల పాలన కారణంగానా? అసెంబ్లీ, కార్పోరేషన్‌లలో వేర్వేరు అంశాలపై ఓటింగు  జరుగుతుంది కాబట్టి తగ్గిందా? పోనుపోను తెలుస్తుంది. ఏది ఏమైనా గ్రామాల్లో బలపడవలసిన అవసరం బిజెపికి ఉంది. కానీ అది ఎస్పీ, బియస్పీల కంటె మెరుగైన పరిస్థితిలోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో చావు దెబ్బ తిన్న ఆ పార్టీలు తుడిచి పెట్టుకుని పోలేదు. యోగి పరిపాలన సవ్యంగా నడవకపోతే వారు పుంజుకునే అవకాశం ఉంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com