cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బిజెపి - శివసేన పొత్తుకి అడ్డంకులు

ఎమ్బీయస్‌: బిజెపి - శివసేన పొత్తుకి అడ్డంకులు

అక్టోబరులో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి-శివసేన కలిసి పోటీ చేయడానికి నిశ్చయించుకున్నాయి కానీ సీట్ల సర్దుబాటు సంగతి యింకా తేలలేదు. అదిగో, యిదిగో అంటున్నారు. ఇప్పుడు మహాలయపక్షాలంటున్నారు. కానీ అసలు సంగతేమిటంటే అంకెలపై స్పష్టత రాకపోవడం! సేనకు 126 యివ్వడానికి బిజెపి సిద్ధపడుతోంది కానీ సేన మాత్రం తమకు 144 కావాలంటోంది.

ఈ మధ్య సేన మంత్రి ఆ మేరకు ఒక ప్రకటన చేశాడు. ఒకప్పుడు సేన బలంగా ఉండే ఆ రాష్ట్రంలో యిప్పుడు బిజెపి బలంగా ఉంది. మొన్న పార్లమెంటు ఎన్నికలలో మోదీ పలుకుబడికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్న సానుకూలత తోడై మొత్తం 48 ఎంపీ సీట్లలో 41 సీట్లు బిజెపి (25 పోటీ చేసి 23)-సేన(23 పోటీ చేసి 18) గెలుచుకున్నాయి.

2014లో కూడా యిన్నే సీట్లు వచ్చాయి. దాన్ని అసెంబ్లీ నియోజకవర్గాలుగా తర్జుమా చేసి చూస్తే మొత్తం 288 సీట్లలో 220 సీట్లన్నమాట. అప్పటినుంచి బిజెపి ప్రజాదరణ పెరిగిందే కానీ తగ్గలేదు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు, ఎన్‌సిపిలు నానాటికీ తీసికట్టుగా అయిపోయి, నాయకులే మిగలకుండా పోయారు. ప్రస్తుతం ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరక్టరేటు చుట్టూ తిరిగే పరిస్థితిలో ఉన్నాడు.

దేవేంద్ర చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల కారణంగా బిజెపి సొంతంగా 160 దాకా గెలుచుకుని, ఎవరి సాయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని కేంద్ర బిజెపి నాయకత్వంతో బాటు, కొందరు రాష్ట్ర నాయకుల అభిప్రాయం కూడా. అయితే దేవేంద్ర అభిప్రాయం వేరు. సేనతో కీచులాటలు ఉన్నప్పటికి వారితో చేతులు కలపడం మంచిదని అతను వాదిస్తూ వచ్చాడు.

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు కుదరక రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అప్పటిదాకా సేనకు జూనియర్‌ పార్టీగా ఉండే బిజెపి, సేన కంటె 59 ఎక్కువ సీట్లు గెలుచుకుంది. మారిన వాస్తవాలను గుర్తించిన సేన దేవేంద్ర మంత్రివర్గంలో జూనియర్‌ భాగస్వామిగా చేరింది. గత ఐదేళ్లగా వారి కాపురంలో చాలా కీచులాటలు వచ్చాయి. అయినా పార్లమెంటు ఎన్నికలలో దేవేంద్రయే కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి పొత్తు నిలిచేట్లు చేశాడు. సేన తటపటాయిస్తూ ఉంటే ప్రశాంత కిశోర్‌ చేతులు కలపమని సలహా యిచ్చాడట.

మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బిజెపి కూటమి విజయానికి దోహదపడినవి ఫిరాయింపులే. వారికి ప్రత్యర్థులుగా ఉన్న ఎన్‌సిపి, కాంగ్రెసు పార్టీల నుంచి బిజెపి ఎడాపెడా నాయకులను లాగేసుకుంది. కాంగ్రెసు-ఎన్‌సిపి కూటమికి 2014లో 35% ఓట్లు, 7 సీట్లు రాగా 2019లో 34.5% ఓట్లు, 5 సీట్లు వచ్చాయి. 35% ఓట్లు తెచ్చుకున్నా యీ రెండు పార్టీల అధిష్టానవర్గాలూ తమంతట తాము ఆశలు వదిలేసుకున్నట్లు కనబడుతున్నాయి. దాని నాయకులు పార్టీపై ఆశలు వదిలేసుకుని, ఫిరాయించేస్తున్నారు.

ఎన్‌సిపి మొత్తం శరద్‌ పవార్‌ చుట్టూనే తిరుగుతుంది. అతనికి యిప్పుడు 78 ఏళ్లు. అనారోగ్యం. అతని సోదరుడి కొడుకు అజిత్‌ పవార్‌ పార్టీని సరిగ్గా నడపలేకపోయాడు. పైగా అవినీతిపరుడనే ముద్ర ఉంది. అహంకారంతో తన పెదతండ్రి అనుచరులతో సరిగ్గా వ్యవహరించక నిర్లక్ష్యం చేశాడు. అతనిపై కోపం రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన అతని కొడుకు పార్థ్‌ పై ప్రసరించింది. పార్లమెంటు ఎన్నికలలో మావల్‌ నియోజకవర్గం నుంచి నిలబడిన అతను రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇక శరద్‌ పవార్‌ కూతురు సుప్రియా సూలే అంత సమర్థురాలు కాదు.

శరద్‌ బలమంతా సహకార సంఘాలే. అవి పెట్టిన సహకార బ్యాంకులే. అతని అనుచరులు వాటి ద్వారానే డబ్బూ, అధికారమూ తెచ్చుకున్నారు. ఆ సంఘాల్లో అక్రమాలు, అవినీతి సర్వసాధారణం. బిజెపి వాటిని వెలికితీస్తూండడంతో భయపడి వాళ్లు పార్లమెంటు ఎన్నికల ముందూ, తర్వాత పార్టీ మారిపోతున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో శరద్‌ చాలా కష్టపడ్డాడు. 70 ర్యాలీలు నిర్వహించాడు. చంద్రబాబుతో సహా అనేకమంది మోదీ వ్యతిరేకులతో మంతనాలు సాగించి, కేంద్రంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామనే కలలు కన్నాడు. తీరా చూస్తే సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో 4 సీట్లు మాత్రం గెలిచాడు. వాటిలో ఒకటి సుప్రియది. మరొకటి ఉదయరాజే భోంస్లే అనే ఛత్రపతి శివాజీ వారసుడిది. ఇద్దరూ ఎన్‌సిపికి బాగా పట్టున్న పశ్చిమ మహారాష్ట్ర నుంచే గెలిచారు.

ఎన్నికల తర్వాత కూడా ఎన్‌సిపిని వదులుతున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి శరద్‌ ఫిరాయింపు రాజకీయాల్లో దిట్ట. ఇతర పార్టీల నుంచి అనేకమంది నాయకులను గుంజుకోవడంలో అసాధ్యుడు. 1999లో కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీ పెట్టుకున్నా, మహారాష్ట్రలో అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని గెలిచాడు. 2004, 2009లలో కూడా! అలాటి శరద్‌కు యీ రోజు అత్యంత సన్నిహితులు కూడా గుడ్‌బై చెప్తున్నారు. వారిలో అజిత్‌ బావమరిది కూడా ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రిగా పని చేసినవారు, యూత్‌ వింగ్‌ జాతీయ అధ్యక్షుడు, పార్టీ ముంబయి నగరాధ్యక్షుడు - వారూవీరూ అని లేదు, అందరూ పార్టీని విడిచేవాళ్లే. చివరకు ఛగన్‌ భుజబల్‌ కూడా ఎన్‌సిపి విడిచి మళ్లీ శివసేనలో చేరతాడని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెసు పార్టీని కూడా నైతికంగా దెబ్బ తీయాలని బిజెపి పార్లమెంటు ఎన్నికల ముందు నుంచే ప్రణాళికలు రచించి అమలు చేసింది. రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ను నాందేడ్‌లో ఎలాగైనా ఓడించాలని కాంగ్రెసు ఎంపీగా చేసిన అతని బావమరిదిని తన పార్టీలోకి లాక్కుని రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ని చేసింది. దాంతో అశోక్‌ 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అతనే కాదు, మరో మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌కు గవర్నరుగా చేసిన సుశీల్‌ కుమార్‌ షిండేని కూడా సోలాపూర్‌లో ఓడించారు. మహారాముంబయి కాంగ్రెసు అధ్యక్షుడు మిళింద్‌ దేవ్‌రా కూడా ఓటమి పాలయ్యేట్లు చేయగలిగారు.  (అతనిప్పుడు మోదీని మెచ్చుకోవడం మొదలెట్టాడు) సునీల్‌ దత్‌ కూతురు ప్రియా దత్‌ పోటీ చేయనంటే కాంగ్రెసు పార్టీ ఆమెపై ఒత్తిడి చేసి నిలబెట్టింది. ఆమెకు తోడు ''రంగీలా'' ఫేమ్‌ ఊర్మిళా మటోండ్కర్‌ను లాక్కుని వచ్చింది. చివరకు ముంబయిలోని ఆరు సీట్లలో ఒక్క దానిలో కూడా కాంగ్రెసు గెలవలేదు. ముంబయి అనే కాదు, థానే, పుణే, నాసిక్‌, కొల్హాపూర్‌, సోలాపూర్‌, నాగపూర్‌ నగరాలన్నిటిలో బిజెపి-సేన తమ బలాన్ని నిరూపించుకున్నాయి. ముంబయి, పుణె, నాగపూరులలో మెట్రోలు రాబోతూండడం అక్కడి ఓటర్లను ఆకర్షించింది.

మొత్తంమీద పార్లమెంటు సీట్లలో బిజెపికి 23, శివసేనకు 18, కాంగ్రెసుకు 1 (గతంలో కంటె ఒకటి తగ్గింది), ఎన్‌సిపికి 4, మజ్లిస్‌కు 1 రాగా ఒక స్వతంత్ర అభ్యర్థి నెగ్గాడు. ప్రాంతాల వారీగా చూస్తే బిజెపి-సేన బలం గురించి అంచనా వస్తుంది. చక్కెర లాబీ కారణంగా ఎన్‌సిపి-కాంగ్రెసుకు బలం ఉన్న పశ్చిమ మహారాష్ట్రలో 10 సీట్లున్నాయి. కాంగ్రెసు, ఎన్‌సిపి నుంచి ఫిరాయింపుదారులను తీసుకుని ఇక్కడ బిజెపి కూటమి 7 గెలుచుకుంది. హట్కామంగళే నియోజకవర్గంలో రాజూ శెట్టీ అనే రైతు సంఘాల నాయకుడు, స్వాభిమానీ పక్ష్‌ పార్టీ వ్యవస్థాపకుడు బిజెపితో పొత్తు పెట్టుకుని 2014లో 1.78 లక్షల ఓట్లతో గెలిచాడు. ఈసారి వారితో తెంచుకుని కాంగ్రెసు కూటమితో చేతులు కలిపాడు. కానీ శివసేన అభ్యర్థి చేతిలో 96 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రాధాకృష్ణ విఖే పాటిల్‌ అనే కాంగ్రెసు నాయకుడి కొడుకు సుజయ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి, బిజెపి పార్టీలో చేరి ఎన్‌సిపి అభ్యర్థిని 2.81 లక్షల ఓట్లతో ఓడించాడు. ఎన్‌సిపి షిరూర్‌ సీటుని సేన నుండి గెలుచుకుంది కానీ కొల్హాపూర్‌, మాధాలను కూటమికి సమర్పించుకుంది.

కొంకణ్‌లో 6 సీట్లున్నాయి. బిజెపి కూటమికి 5 రాగా, ఎన్‌సిపికి 1 వచ్చింది. రాయగఢ్‌లో తమ అభ్యర్థి అనంత్‌ గీతే ఎన్‌సిపికి చెందిన సునీల్‌ తత్కారే చేతిలో ఓడిపోవడానికి కారణం ఎన్‌సిపి, పెజంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టి ఓట్లు చీల్చడమే అంటోంది సేన. సింధుదుర్గ్‌-రత్నగిరి నియోజకవర్గంలో సేన అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ వినాయక్‌ రౌత్‌ నీలేశ్‌ రాణేని ఓడించడం చెప్పుకోదగ్గది. నీలేశ్‌ తండ్రి నారాయణ్‌ రాణే ఒకప్పుడు శివసేన నాయకుడు. ఎన్‌సిపిలో ఫిరాయించి, మళ్లీ బయటకు వచ్చి 'మహారాష్ట్ర స్వాభిమాన్‌ పక్ష' అనే సొంత పార్టీ పెట్టుకున్నాడు. విదర్భలో 10 సీట్లుంటే 9 బిజెపి కూటమికి రాగా, అమరావతి నియోజకవర్గం నుంచి నవనీత్‌ రవి రాణి అనే స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. ఆమెకు ఎన్‌సిపి మద్దతు ఉంది. నితిన్‌ గడ్కరీ నాగ్‌పూర్‌ నుంచి నెగ్గాడు కానీ గతంలో కంటె మెజారిటీ 68 వేలు తగ్గింది. ఉత్తర మహారాష్ట్రలోని ఆరు సీట్లలో బిజెపి కూటమి నెగ్గింది.

మరాట్వాడాలోని 8 సీట్లలో బిజెపి కూటమికి 7 రాగా, తక్కిన ఔరంగాబాద్‌ సీటు మజ్లిస్‌ దక్కించుకుంది. హింగోలీలో సిటింగ్‌ కాంగ్రెసు ఎంపీ రాజీవ్‌ సతావ్‌ తను పోటీ చేయననడంతో ఆ పార్టీ శివసేన నుంచి ఫిరాయించిన వాంఖడే బాపూరావుకి టిక్కెట్టు యిచ్చింది. అతను నెగ్గాడు. ఔరంగాబాద్‌లో నాలుగుసార్లుగా నెగ్గుతూ వస్తున్న బిజెపి ఎంపీ చంద్రకాంత్‌ ఖైరే జర్నలిజం లోంచి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన మజ్లిస్‌ అభ్యర్థి ఇంతియాజ్‌ జలీల్‌ చేతిలో 6 వేల ఓట్ల తేడాతో ఓడాడు. శివసేన తిరుగుబాటు అభ్యర్థి, మరాఠా నాయకుడు హర్షవర్ధన్‌ జాధా 2.84 లక్షల ఓట్లు పట్టుకుపోవడంతో అది సాధ్యపడింది. మజ్లిస్‌ గెలుపుకి కారణం ఆంబేడ్కర్‌ మనుమడు ప్రకాశ్‌ ఆంబేడ్కర్‌ స్థాపించిన వంచిత్‌ బహుజన్‌ ఆఘాడీ (విబిఏ) యిచ్చిన మద్దతు. దళిత-ముస్లిముల వేదికగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్‌సిపి-కాంగ్రెసు కూటమితో పొత్తుకి ప్రయత్నించినా కుదరలేదు. దాంతో 47 స్థానాల్లోనూ పోటీ చేసి, 8 స్థానాల్లో ఆ కూటమిని దెబ్బ తీసింది. మరాట్వాడా ప్రాంతంలోనే తన ప్రభావాన్ని బాగా చూపగలిగింది. పార్టీ నాయకుడు ప్రకాశ్‌ దళితులు హెచ్చు సంఖ్యలో ఉన్న అకోలా, షోలాపూర్‌లలో పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయాడు.

ఈ విధంగా బిజెపి-సేన కూటమి అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని వర్గాల్లో విజయకేతనాన్ని ఎగరవేసింది. గతంలో కంటె 2.3% ఎక్కువగా 50.7% ఓట్లు తెచ్చుకుంది. ముంబయి-ఠాణే ప్రాంతంలో అయితే 60%కి చేరింది. సర్వేల ప్రకారం మొత్తం మీద బిజెపికి అర్బన్‌లో 33%, రూరల్‌లో 24% రాగా సేనకు అర్బన్‌లో 19%, రూరల్‌లో 26% ఓట్లు వచ్చాయి. ధనికుల్లో 38% మంది, పేదల్లో 27%, అగ్రవర్ణాల్లో 63%, ఒబిసిలలో 44% ఎస్టీలలో 23%, ఎస్సీలలో 18%, మరాఠాల్లో 20%, ముస్లిముల్లో 9% బిజెపికి వేశారు. సేనకు వేసినవారిలో అగ్రవర్ణాలు 21%, మరాఠాలు 39%, ఒబిసిలు 31%, ఎస్సీలు 12%, ఎస్టీలు 12%, ముస్లిములు 4%, ధనికులు 21%, పేదలు 18% వేశారు. ముస్లిముల్లో 56% మంది కాంగ్రెసుకు, 30% మంది ఎన్‌సిపికి వేశారు. పేదల్లో 19% మంది కాంగ్రెసుకు, 17% మంది ఎన్‌సిపికి వేశారు. అర్బన్‌లో 19% కాంగ్రెసుకు, 13% ఎన్‌సిపికి, రూరల్‌లో 15% కాంగ్రెసుకు, 18% ఎన్‌సిపికి వేశారు.

ఈ ఫలితాలే యిప్పుడు బిజెపి-సేన పొత్తుకు అడ్డుపడుతున్నాయి. ఇద్దరం సరిసమానంగా ఉన్నామని సేన అంటుంది. కాదు, మాకు ఎక్కువ వచ్చాయి కదా అని బిజెపి అంటుంది. అది పార్లమెంటు ఎన్నిక కాబట్టి, ఆ సమయంలో జాతీయవాదాన్ని రెచ్చగొట్టారు కాబట్టి మీకు ఎక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయి. ఇప్పుడు స్థానిక సమస్యలదే ప్రాధాన్యత అంటుంది సేన. పైగా ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని యిప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి బిజెపికి అంత ఆదరణ ఉండదు అంటోంది సేన. ఇద్దరికీ తెలుసు పార్లమెంటు ఎన్నికల సమయం కంటె ప్రతిపక్షాలు మరీ బలహీనంగా ఉన్నాయని. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికే 15 ఏళ్ల కాంగ్రెసు-ఎన్‌సిపి బంధం బలహీనపడింది. ఇద్దరూ విడివిడిగా పోటీ చేశారు. ఎన్‌సిపికి 41 రాగా కాంగ్రెసుకు 42 వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల నాటికి బుద్ధి తెచ్చుకుని కలిసి పోటీ చేశాయి కానీ ఫలితం లేకపోయింది. రెండు పార్టీల క్యాడర్‌ మధ్య సయోధ్య కుదరలేదు.

ప్రస్తుతం చెరో 125 సీట్లు పోటీ చేసి, 38 మిత్రపక్షాలకు వదిలేస్తామని ప్రకటించారు. కానీ ఆ మిత్రపక్షాలేవీ కానరావటం లేదు. పార్లమెంటు ఎన్నికల సమయంలో విబిఏతో పొత్తు పెట్టుకోకపోవడం రాజకీయంగా వీరి కూటమికి హాని చేసింది. ప్రకాశ్‌ అడిగినది ఒక్కటే - రాహుల్‌ గాంధీతో స్వయంగా మాట్లాడతానని! 'మజ్లిస్‌తో పొత్తు పెట్టుకున్న ప్రకాశ్‌తో చర్చలు జరిపినా హిందూ ఓట్లు, తటస్థుల ఓట్లు పోతాయి' అని రాహుల్‌ను స్థానిక కాంగ్రెసు నాయకులు భయపెట్టారు. దాంతో రాహుల్‌ కలననన్నాడు. ముస్లిములకు సీట్లు యిచ్చినా బిజెపి-సేన అదో పెద్ద అంశంగా చేస్తుందని భయపడి కాంగ్రెసు-ఎన్‌సిపి ఒకే ఒక్క సీటును ముస్లిముకి యిచ్చారు. ఇలా ఎటూ కాకుండా చెడ్డారు.

ఈసారి విబిఏను వీళ్లు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే విబిఏ 8 సీట్లు మాత్రమే ఆఫర్‌ చేయడంతో మజ్లిస్‌ దానికి కటీఫ్‌ చెప్పింది. కానీ విబిఏ వీళ్లతో చేతులు కలపనని చెప్పి భారిపా బహుజన్‌ మహాసంఘ్‌ అనే పార్టీతో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెసు-ఎన్‌సిపి కూటమిలో కూడా లుకలుకలున్నాయి. ప్రతీ జిల్లాలోనూ తమకు కనీసం రెండు సీట్లు కేటాయించాలని ఎన్‌సిపి పట్టుబడుతోంది. 5, 6 సీట్ల విషయంలో యిద్దరూ పట్టుదలగానే ఉన్నారు. కాంగ్రెసు తొలివిడతగా 50 సీట్లకు పేర్లు ఖాయం చేసుకుని, తక్కిన వాటిపై కాచుకుని ఉంది. బిజెపి-సేన పొత్తు సందర్భంగా సీట్లు రాని అసంతృప్తులు వచ్చి తమ పార్టీలో చేరతారనుకుంటోంది. వాళ్లూ మహాలయపక్షాల కారణంగానే ఆగామని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం కాంగ్రెసుకు జాతీయ స్థాయిలో నాయకులు లేకుండా పోయారు. అధిష్టానం ఏదీ పట్టించుకోవడం మానేసి పార్టీని గాలికి వదిలేసింది. ఒకప్పుడు మహారాష్ట్రలోని 44 పార్లమెంటు సీట్లలో 41 గెలుచుకున్న ఆ పార్టీ తాజాగా 26టిల్లో పోటీ చేసి ఒకటి మాత్రమే విదర్భ ప్రాంతంలోని చంద్రాపూర్‌) గెలుచుకుంది.  పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసు జాతీయ స్థాయి నాయకులను ఎవర్నీ పంపలేదు. స్థానిక నాయకులైన అశోక్‌ చవాన్‌, సుశీల్‌ కుమార్‌ షిండే వక్తలు కారు. పైగా వాళ్లు అభ్యర్థులు కాబట్టి నియోజకవర్గాలు దాటి పెద్దగా వెళ్లలేదు.

ఇక మిగిలింది ఎన్‌సిపి! దాని మూలవిరాట్టు శరద్‌ పవార్‌ను ఎన్నికల సమయంలో ఇడి కేసులో యిరికించేసింది బిజెపి. శరద్‌ తప్పు చేయలేదని ఎవరూ చెప్పలేం. కానీ ప్రత్యక్షంగా ఇడి, పరోక్షంగా బిజెపి ఎంచుకున్న సమయమే అనుమానాలు రేకెత్తిస్తుంది. రేపు శరద్‌ బిజెపిలో చేరుతున్నాను అన్నాడనుకోండి, యీ వేడి చల్లారిపోతుంది. 'చట్టం తన పని తను చేసుకుపోతుంది' అనే ప్రకటన వెలువడుతుంది. మరో ప్రతిపక్ష నాయకుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన పార్టీ అధినేత రాజ్‌ ఠాక్రే నెత్తిపై కూడా ఇడి కత్తి వేళ్లాడుతోంది. ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ రాజ్‌ ఠాక్రే బిజెపి-సేన కూటమికి వ్యతిరేకంగా కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగాడు. ఏమీ లాభం రాలేదు కానీ బిజెపి-సేన ఆగ్రహాన్ని మూటకట్టుకున్నాడు. రేపోమాపో కోహినూర్‌ మిల్స్‌ కేసులో ఇడి అతన్నీ పిలిపించి ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేయవచ్చు.

బిజెపి-సేనలకు యింతటి సానుకూల వాతావరణం ఉండడమే వారి మధ్య పొత్తుకు ప్రధాన అవరోధంగా మారింది. ఇంతటి సదవకాశం మళ్లీ రాదు కాబట్టి, యిప్పుడే సాధ్యమైనన్ని సీట్లు నొల్లుకోవాలని యిద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే కాస్తయినా తగ్గుతాడేమో కానీ అతని పెద్ద కొడుకు ఆదిత్యకు చాలానే ఆశలున్నాయి. వీలైతే ముఖ్యమంత్రి అయిపోదామని చూస్తున్నాడు.  దేవేంద్ర మహా జనసందేశ్‌ యాత్ర పేరుతో నెల్లాళ్లపాటు 30 జిల్లాలలో 4200 కి.మీ.లు తిరిగి 157 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేశాడు. తనూ తక్కువ తినలేదని చూపుకోవడానికి ఆదిత్య కూడా 'జన ఆశీర్వాద్‌ యాత్ర' పేర టూర్లు చేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా ఉద్ధవ్‌ ప్రయాణాలు చేయలేడు. అందుకే కొడుకుని పంపుతున్నాడు. శివసేన పరిధిని విస్తృత పరచడానికి, మరాఠీయేతరుల ఓట్లు కూడా సంపాదించడానికి ఆదిత్య 'రాష్ట్రంలో ఉన్న వారందరూ అభివృద్ధి చెందాలి' అనే నినాదం ఎత్తుకున్నాడు. దానికై 'ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆదిత్య ఠాక్రే' అనే పేర ఒక వేదిక ఏర్పరచాడు. తన పుట్టిన రోజు వేడుకలలో 40 మంది పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యేట్లు చూసుకుని, తన బలాన్ని చాటుకున్నాడు.

2014లో బిజెపి-సేన మధ్య చర్చలు భగ్నం కావడానికి కారణం ఆదిత్యయే. 288లో 151 సీట్లు పోటీ చేసి తీరతాం అని అతను పట్టుబట్టాడు. మూడు సీట్ల గురించి మంకుపట్టు పట్టాడు. చివరకు అతని పంతం వలననే సేన విడిగా పోటీ చేసి 63 సీట్లు తెచ్చుకుంది. బిజెపికి 122 వచ్చాయి. మళ్లీ యిలాటి ప్రమాదం జరగకూడదని ఉద్ధవ్‌ తన కొడుకుని ఆపడానికి చూస్తున్నాడు. అందుకే 'ఆదిత్య సిఎం పదవి గురించి అడుగుతున్నాడుగా' అని అడిగినప్పుడు దేవేంద్ర 'ఉద్ధవ్‌ ఆ విషయం ప్రస్తావించినప్పుడే ఆలోచిస్తాను' అనేశాడు. తన పని తీరే తనను గెలిపిస్తుందన్న ధీమా అతనిది.

'ఎయిర్‌పోర్టులు, హైవేస్‌ వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్యక్రమాల్లో ఎన్నో పెట్టుబడులు పెట్టాం, గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల కి.మీ.ల రోడ్లు వేశాం, 20 ఏళ్లగా పెండింగులో ఉన్న 27 ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేశాం, 1800 గ్రామాలకు కుళాయిల ద్వారా తాగునీరు యిచ్చాం, మహారాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయు (అవగాహనా ఒప్పందాలు)లలో 45% అమలు లోకి వచ్చాయి. గుజరాత్‌, కర్ణాటకలలో కూడా యీ కన్వర్షన్‌ రేటు 35%కి మించి లేదు.' అని అతను చెప్పుకుంటున్నాడు. పదవిలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అతనే!  రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఉన్నా, నోట్ల రద్దు, ఆర్థిక అస్తవ్యస్తత కారణంగా అనేక చిన్నా, పెద్దా పరిశ్రమలు మూతబడి నిరుద్యోగం ప్రబలినా వ్యక్తిగతంగా అతని ప్రతిష్ఠ మసకబారటం లేదు. ఈ విషయాన్ని శివసేన మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే పొత్తు ఖరారు అవుతుంది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2019)
mbsprasad@gmail.com

 


×