Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పశ్చిమాన ఓటమి – ఈశాన్యాన గెలుపు

ఎమ్బీయస్‍:  పశ్చిమాన ఓటమి – ఈశాన్యాన గెలుపు

ఈ నెలలో ఫలితాలు వచ్చిన ఉపయెన్నికలలో బిజెపి పశ్చిమ రాష్ట్రాలలో ఓటమి పాలు కాగా, ఈశాన్యాన విజయపతాకం ఎగరేసింది. హరియాణా అసెంబ్లీలో ఐఎన్ఎల్‌డి (ఇండియన్ నేషనల్ లోక్‌దళ్) తరఫున ఉన్న ఏకైక ఎమ్మెల్యే అభయ్ సింగ్ చౌటాలా బిజెపి తీసుకుని వచ్చిన సాగు బిల్లులకు వ్యతిరేకంగా జనవరిలో రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేయడంతో ఎల్లెనాబాద్‌లో ఉపఎన్నిక అవసరం పడింది. ఈసారి బిజెపి అభ్యర్థిని 7 వేల తేడాతో ఓడించి మళ్లీ ఎన్నికయ్యాడు. బిజెపి అభ్యర్థి గోవింద్ కాండా హరియాణా లోక్‌హిత్ పార్టీ సభ్యుడు. దాని అధినేత, ఎమ్మెల్యే గోపాల్ కాండాకు సోదరుడు. ఫిరాయింపుదారులనే నమ్ముకునే బిజెపి అతన్ని పార్టీలో చేర్చుకుని వెంటనే టిక్కెట్టిచ్చింది. అతనికి బిజెపితో అధికారం పంచుకుంటున్న జెజెపి (అభయ్‌కు సోదరుని కుమారుడైన అయిన దుష్యంత్ నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీ)తో బాటు గోపాల్ కూడా మద్దతు యిచ్చాడు. 

గతసారి బిజెపి అభ్యర్థిగా అభయ్‌పై పోటీ చేసి ఓడిపోయిన పవన్ బేనీవాల్ బిజెపి నుంచి కాంగ్రెసులోకి దూకి యీసారి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. అభయ్‌కు 66 వేలు (43%) కాండాకు 59 వేలు (39%), పవన్‌కు 21 వేలు (14%) ఓట్లు వచ్చాయి. మొత్తం 19మంది అభ్యర్థులున్నారు. ఈ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతంలో వుంది. రైతు ఆందోళనలకు అది కేంద్రం. 81% పోలింగు జరిగింది. అయినా బిజెపి-జెజెపి అభ్యర్థి ఆ మేరకు ఓట్లు సాధించాడంటే గొప్పే. అభయ్‌కు గత ఎన్నికలో 12 వేల మెజారిటీ వస్తే యీసారి 5 వేలు తగ్గింది. తగ్గిందే కానీ మూడు పార్టీలు కలిసి శతవిధాల ప్రయత్నించినా, అభయ్ ఓడిపోలేదు. దానితో బిజెపికి భయం పుట్టివుంటుంది. ఇతర రాష్ట్రాలలో కూడా యిలాటి పరిస్థితి వస్తుందని దడిసి కాబోలు, సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది.

ఇక మహారాష్ట్రకు వస్తే నాందేడ్ జిల్లాలోని కాంగ్రెసు సిటింగ్ సీటైన దెగ్లూర్ నియోజకవర్గంలోని ఉపయెన్నికలో కాంగ్రెసు అభ్యర్థి, కోవిడ్ కారణంగా మరణించిన ఎమ్మెల్యే రావ్‌సాహెబ్ అంతపూర్కర్ కుమారుడు జితేశ్ బిజెపి అభ్యర్థి సుభాష్ సబ్నేపై 42 వేల మెజారిటీతో నెగ్గాడు. ఈ ఏడాది మే నెలలో ఎన్‌సిపి సిటింగ్ సీటైన పందర్‌పూర్ ఉపయెన్నికలో బిజెపి 4 వేల తేడాతో గెలిచింది. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో దీనికి ప్రాముఖ్యత ఏర్పడింది. ఫిరాయింపులనే నమ్ముకునే బిజెపి సుభాష్‌ను శివసేన నుంచి ఫిరాయింపు చేసుకుని హరియాణాలో లోకహిత్‌ పార్టీ నుంచి కాండిడేటును లాక్కుని టిక్కెట్టిచ్చినట్లే యితనికీ యిచ్చారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సహా అందరూ వచ్చి ప్రచారం చేశారు. దేవేంద్ర ఫడణవీస్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అక్కడే క్యాంపు వేశారు. కాంగ్రెసు తరఫున అశోక్ చవాన్ ఒక్కడే గట్టిగా ప్రచారం చేశాడు. భాగస్వామ్య పక్షాలైన ఎన్‌సిపి, శివసేన నాయకులు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే ప్రచారానికి రాకపోయినా సహకారం అందించారు.

ఫిరాయింపులతో గెలుద్దామనుకున్న బిజెపి ఉధృతికి అడ్డుకట్ట వేయడానికి అశోక్ చవాన్ తన బావమరిది, నాందేడ్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన భాస్కర్ పాటిల్ ఖట్‌గావ్‌కర్‌ను ఉపయోగించుకున్నాడు. అతను కాంగ్రెసులో వుండేవాడు. 2014లో అశోక్‌పై అలిగి పార్టీ విడిచి వెళ్లి బిజెపిలో చేరాడు. అతన్ని పార్టీలోకి లాక్కుని వచ్చాడు. ఒళ్లు మండిపోయిన బిజెపి అశోక్ చవాన్‌కు బుద్ధి చెప్పడానికి అతనికి సంబంధించిన సుగర్ మిల్లు వ్యాపారంపై సడన్‌గా అనుమానాలు తెచ్చేసుకుంది. మిల్లుకు ఋణాలిచ్చిన బ్యాంకులపై సరిగ్గా ఎన్నికకు ముందు ఇన్‌కమ్‌టాక్స్ అధికారులను తోలారు. ఇన్ని చేసినా, రేదర్ యిన్ని చేయడంతో, ఓటర్లకు కాంగ్రెసు అభ్యర్థిపై యీ సానుభూతి కూడా తోడై,  109 వేల ఓట్లతో (57%) గెలిపించారు. సుభాష్‌కు 67 వేలు (35%) రాగా, వంచిత్ బహుజన్ అఘాడీకి చెందిన ఉత్తమ్ ఇంగోల్‌కు 11 వేలు వచ్చాయి. ఇది ఎస్సీలకు రిజర్వ్ ఐన సీటు. 63% పోలింగు జరిగింది. శివసేన కూటమి పాలనలో మహారాష్ట్రలో శాంతిభద్రతలు కరువయ్యాయని, అన్ని రకాల మాఫియాలకు నిలయంగా మారిందని బిజెపి చేస్తున్న ఆరోపణలకు ఆ నియోజకవర్గ ఓటర్లు స్పందించినట్లు లేదు.

ఎస్టీకి రిజర్వ్ అయిన దాద్రా, నగర్ హవేలీ పార్లమెంటు స్థానానికి వస్తే – అక్కడ స్వతంత్ర ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్య కారణంగా ఖాళీ ఏర్పడింది. అతని భార్య కళాబెన్ దేల్కర్‌ను శివసేన పార్టీలోకి చేర్చుకుని తన అభ్యర్థిగా నిలబెట్టింది. తొలిసారిగా మహారాష్ట్ర బయటకు అడుగుపెట్టిన శివసేన మహారాష్ట్రలో తన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెసు అభ్యర్థి మహేశ్ ధోడీతో పాటు, బిజెపి అభ్యర్థి మహేశ్ గావిట్‌ను కూడా ఓడించింది. శివసేనకు 118 వేల ఓట్లు రాగా బిజెపికి 67 వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెసుకు 6వేల ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికలో మోహన్, సిటింగ్ బిజెపి ఎంపీ నాటూభాయ్ పటేల్‌పై 9 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇప్పుడు అతని భార్యకు 41 వేల మెజారిటీ వచ్చింది. మోహన్ జీవించి వుండగా కాంగ్రెసులోనూ, బిజెపిలోనూ కూడా వున్నాడు. ఇప్పుడు అతని భార్య శివసేనలో చేరి గెలిచింది.

పశ్చిమం నుంచి ఈశాన్యానికి వస్తే యిక్కడే బిజెపి దుమ్ము దులిపింది. ముఖ్యంగా అసాంలో! బిజెపి పరిస్థితి ఎలా వుందంటే మోదీకి మాత్రమే పాప్యులారిటీ వుంటోంది. అందుకే ఏ రాష్ట్ర ఎన్నికలైనా సరే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పకుండా మోదీ బొమ్మే చూపిస్తున్నారు. స్థానికంగా ప్రముఖుడైన బిజెపి నాయకుడెవరూ లేక అనేక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడుతోంది. ఈశాన్యానికి మాత్రం ఆ బెదురు లేదు. అక్కడ కాంగ్రెసులో తర్ఫీదై వచ్చిన హిమాంత విశ్వశర్మ వున్నాడు. అతను అసాం మాత్రమే కాక, తక్కిన ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి పతాకం ఎగిరేట్లు చేస్తున్నాడు. అనేక ప్రాంతీయ పార్టీలతో బిజెపికి పొత్తు కుదిరేట్లు, కొనసాగేట్లు చేస్తున్నాడు. దేశమంతా బిజెపి హిందూత్వ పేరు చెప్పి మైనారిటీలను భయపెడుతుంది, కానీ అక్కడ మాత్రం కాదు. ఎందుకంటే అక్కడ వాళ్లవే మెజారిటీ ఓట్లు. ఏ రోటి దగ్గర ఆ పాట పాడి ఒకప్పుడు కాంగ్రెసుకి కంచుకోటగా వుండే ఈశాన్యభారతాన్ని యీరోజు బిజెపి చేజిక్కించుకుంది

జనాభాలో 75% మంది క్రైస్తవులున్న మేఘాలయను ఐదు పార్టీల (వాటిలో బిజెపి కూడా ఒకటి) కూటమి ఐన మేఘాలయ డెమోక్రాటిక్ కూటమి పాలిస్తోంది. ఉపయెన్నికలు జరిగిన మూడు సీట్లనూ కైవసం చేసుకుంది. కూటమిలో ప్రధాన పక్షమైన జేమ్స్ సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) మేరింగ్‌నెంగ్ నియోజకవర్గంలో ఎన్‌పిపికి చెందిన పైనియాడ్ సింగ్, కాంగ్రెసుకు చెందిన హైలాండర్‌ హార్‌మాల్కిపై 2 వేల ఓట్ల తేడాతో నెగ్గారు. రాజబాలా నియోజకవర్గంలో ఎన్‌పిపికి చెందిన అబ్దుస్ సాలెహ్ కాంగ్రెసుకు చెందిన హషీమా యాసిన్‌పై 2 వేల ఓట్ల తేడాతో నెగ్గారు. ఈ రెండు నియోజకవర్గాల్లో గతంలో కాంగ్రెసు గెలిచింది. మాఫ్లాంగ్ నియోజకవర్గంలో ఎన్‌పిపి భాగస్వామ్య పక్షమైన యుడిపికి చెందిన యుజిన్‌సన్ లింగ్డో, కాంగ్రెసుకి చెందిన కెన్నడీ కొర్నెలియస్‌పై 4 వేల ఓట్ల తేడాతో నెగ్గారు. గతంలో యీ స్థానంలో స్వతంత్రుడు నెగ్గాడు.

జనాభాలో 87% మంది క్రైస్తవులున్న మిజోరంను మిజో నేషనల్ ఫ్రంట్ పాలిస్తోంది. బిజెపికి ఒక్కడే ఎమ్మెల్యే వుండడం చేత మంత్రి పదవి యివ్వకపోయినా అది ఎన్‌డిఏలో భాగస్వామ్య పక్షమే. తురియల్ నియోజకవర్గంలో జరిగిన ఉపయెన్నికలో ఆ పార్టీ అభ్యర్థి లాల్‌డానిగ్లియానా జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కు చెందిన లాల్తాన్‌ను వెయ్యి ఓట్ల తేడాతో ఓడించాడు. 2018లో జోరామ్‌యే యీ సీటు గెలిచింది. కాంగ్రెసు అభ్యర్థి మూడోవాడిగా నిలిచాడు. జనాభాలో 88% మంది క్రైస్తవులున్న నాగాలాండ్‌లోని షామాటర్-చెస్సార్ నియోజకవర్గంలో కూడా బిజెపి మిత్రపక్షమైన ఎన్‌డిపిపి (నేషనల్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ) అభ్యర్థి పోటీ లేకుండా నెగ్గాడు. గతంలోనూ ఆ సీటు ఆ పార్టీదే.

ఇక అసాంకు వస్తే – అక్కడ ఉపయెన్నికలు జరిగిన 5టిలో మూడిటిని బిజెపి, రెండిటిని బిజెపి ప్రభుత్వంలో భాగస్వామి ఐన యుపిపిఎల్ (యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్) గెలుచుకుంది. భవానీపూర్‌ నియోజకవర్గంలో 2021 మార్చి ఎన్నికలలో ఏఐయుడిఎఫ్ తరఫున గెలిచిన ఫణిధర్ తాలూక్‌దార్‌ను బిజెపి పార్టీలోకి ఫిరాయింప చేసుకుని ఉపయెన్నికలో తన అభ్యర్థిగా నిలబెట్టింది. అతను 64 వేల ఓట్లు తెచ్చుకుని, కాంగ్రెసు అభ్యర్థి శైలేంద్ర నాథ్ దాస్‌ను 25 వేల తేడాతో ఓడించాడు. ఏఐయుడిఎఫ్‌ది అభ్యర్థి జుబ్బార్ ఆలీకి యీసారి 6 వేల ఓట్లు వచ్చాయి. థౌరా నియోజకవర్గంలో 2021 మార్చి ఎన్నికలలో కాంగ్రెసు తరఫున గెలిచిన సుశాంత బొర్గోహైన్‌ను బిజెపి పార్టీలోకి ఫిరాయింప చేసుకుని ఉపయెన్నికలో తన అభ్యర్థిగా నిలబెట్టింది. అతను 50 వేల ఓట్లు తెచ్చుకుని 31 వేల తేడాతో రైజోర్ దళ్ అభ్యర్థిని ధైజ్యా కొన్వార్‌ను ఓడించాడు. కాంగ్రెసు అభ్యర్థి 6 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

మారియానీ నియోజకవర్గంలో 2021 మార్చి ఎన్నికలలో కాంగ్రెసు తరఫున గెలిచిన రూపజ్యోతి కూరీని బిజెపి పార్టీలోకి ఫిరాయింప చేసుకుని ఉపయెన్నికలో తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఆమె 55 వేల ఓట్లు తెచ్చుకుని 40 వేల తేడాతో కాంగ్రెసు అభ్యర్థి లుహిత్ కొన్వార్‌ను ఓడించాడు. ఇలా బిజెపి తరఫున నెగ్గిన ముగ్గురూ ఫిరాయింపుదారులే! గోసాయిగావ్ నియోజకవర్గంలో 2021 మార్చిలో బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి నెగ్గగా ఉపయెన్నికలో యుపిపిఎల్ అభ్యర్థి జిరోన్ బసుముతారీ 59 వేల ఓట్లు తెచ్చుకుని 28 వేల ఓట్ల తేడాతో కాంగ్రెసు అభ్యర్థి జోవెల్ తుడును ఓడించాడు. తామూల్‌పూర్ నియోజకవర్గంలో యుపిపిఎల్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి జోలెన్ దైమారీ 87 వేల ఓట్లు తెచ్చుకుని స్వతంత్ర అభ్యర్థి గణేశ్ కచారీని 57 వేల తేడాతో ఓడించాడు.

దీనితో 126 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి 62 సీట్లు గెలుచుకుంది. మార్చి ఎన్నికలలో 60 వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన మజూలీ నియోజకవర్గంలో త్వరలో ఉపయెన్నిక జరిగినప్పుడు అది బిజెపికి రావడం ఖాయం. ఇంకొకర్ని ఫిరాయింపు చేసుకుని 64 సీట్లు తెచ్చుకోగలిగితే సొంతంగా సింపుల్ మెజారిటీ వచ్చేస్తుంది. భాగస్వాములపై ఆధారపడవలసిన అవసరం లేదు. అసాంలో యీ గెలుపుకి కారణం హిమాంత విశ్వశర్మ అని వేరే చెప్పనవసరం లేదు. ఉపయెన్నికల తీరు చూస్తే అనేక రాష్ట్రాలలో బిజెపి ఫిరాయింపుదార్ల మీదనే ఎక్కువగా ఆధారపడినట్లు తోస్తుంది. కొన్ని చోట్ల నెగ్గింది, మరి కొన్ని చోట్ల ఆ మంత్రం పారలేదు. (ఫోటో – పైన అభయ్ చౌటాలా, కళాబెన్, క్రింద అశోక్ చవాన్, జేమ్స్ సంగ్మా, హిమాంత శర్మ)

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

mbsprasad@gmail.com

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా