Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: నారాయణరెడ్డి గారు

సినారె స్మారకసభలు యింకా జరుగుతూనే వున్నాయి. ఆయనను వ్యక్తిగతంగా తెలిసినవాడిగా కొన్ని విషయాలు రాద్దామనిపిస్తోంది. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని అరుదుగా చూస్తాం. కవుల్లో ఆయనది ప్రత్యేకస్థానం. ప్రాచీన కవితను ఆయన నిరసించలేదు, మరీ ఆధునిక పోకడలు పోలేదు. రెండిటికీ వారధి లాంటివాడు. ఆయన కవిత్వం నాకు హాయిగా తోస్తుంది. చిన్నప్పటి చదువంతా ఉర్దూలోనే సాగడం వలన ఉర్దూ సాహిత్యపు వైభవాన్ని సొంతం చేసుకుని దాన్ని తెలుగులోకి దించగలిగారు. దాశరథికి తప్ప వేరే తెలుగు సినీ కవులకు యీ సౌలభ్యం లేకపోయింది. అందుకే యితరులు వుపయోగించని అనేక విలక్షణ పదప్రయోగాలు ఆయన చేయగలిగారు. ఇంగ్లీషు కూడా బాగా చదువుకున్న వ్యక్తి. మంచి చదువరి. పండితుడు. అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు కాబట్టి ప్రాచీన, ఆధునిక కవులు, సాహిత్యకారులందరినీ బాగా అధ్యయనం చేశాడు. దాశరథికి యీ సౌలభ్యం లేకపోయింది. తొలిదశలో దాశరథి, సినారె కలిసి సికింద్రాబాదు పబ్లిషరు కొండా శంకరయ్యగారికి బాలల బొమ్మల రామాయణం వంటివి రాశారు. తెలంగాణ కవిద్వయంగా మద్రాసులో, ఆంధ్రప్రాంతంలో పర్యటించి తమ కవిత్వంతో ఆకట్టుకున్నారు. అయితే కాలక్రమంలో దాశరథి కంటె నారాయణ రెడ్డి ముందుకు దూసుకుపోయారు. అనేక రకాలుగా విస్తరించారు. ఉస్మానియాలో ఆయన ఉద్యోగం ఆయనకు బాగా సహకరించింది. ఆయన చాలా మంచి ఉపాధ్యాయుడని చెప్తారు. తక్కిన క్లాసుల విద్యార్థులు కూడా యీయన లెక్చర్లు వినడానికి వచ్చి కూర్చునేవారట. 

నారాయణ రెడ్డిగారు రూపసి. కృష్ణశాస్త్రి గారి తర్వాత అందమైన కవుల్లో సినారె పేరు చెప్పాలి. శేషేంద్ర శర్మగారు కూడా ప్రత్యేకంగా కనబడేవారు కానీ ఆయనను చూస్తే నా కెందుకో ఆత్మీయతాభావం కలిగేది కాదు. నారాయణరెడ్డిగారి ఎప్రోచబుల్‌గా వుండేవారు. పైగా మంచి వక్త. ఆరుద్రగారు ఓ సారి అన్నారు - రాత టెక్నిక్కు వేరు, కూత టెక్నిక్కు వేరు అని. కవులందరూ, రచయితలందరూ మంచి వక్తలు కాలేరు. శ్రీశ్రీ, ఆరుద్ర కూడా గొప్ప కవులే కానీ మంచి వక్తలు కారు. నారాయణరెడ్డిగారు మాటలు పొదుగుకుంటూ, ఆచితూచి మాట్లాడుతూ, మాటవిరుపుతో చమత్కారం సాధిస్తూ ఎలాటి సభనైనా రక్తి కట్టించగలరు. హైదరాబాదులో తర్వాత్తర్వాత అనేకమంది వ్యాఖ్యాతలు వచ్చారు కానీ 40, 50 సంవత్సరాల క్రితం నుంచి ప్రభుత్వ ఫంక్షన్‌ కానీ, సినిమా ఫంక్షన్‌కానీ ఆయనే వ్యాఖ్యానం చెప్పేవారు. చక్కగా రాసుకున్న స్క్రిప్టుకు అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో జోడించిన చెణుకులు జోడిస్తూ ప్రేక్షకులను అలరించేవారు. వ్యాఖ్యానమన్నా, ప్రసంగమన్నా నారాయణ రెడ్డిగారినే అందరూ అనుకరించేవారు - ఎట్‌లీస్ట్‌ హైదరాబాదులో! కవిత్వం చదివే ధోరణిలో కూడా ఆయన్నే అనుకరించేవారు. కొన్ని వాక్యాలు రిపీట్‌ చేసినపుడు ఆయన వేర్వేరు విధాలుగా ధ్వనింపచేసి చప్పట్లు అందుకునేవాడు. ఆ టెక్నిక్కు పట్టుబడని వాళ్లు కూడా ఆయన్ని అనుకరిస్తూ ప్రతీ వాక్యం రిపీట్‌ చేసి బోరు కొట్టించేవారు. నారాయణరెడ్డి గారు అధ్యాపకుడు కాబట్టి అనేకమంది ప్రత్యక్ష శిష్యప్రశిష్యులున్నారు. ఆయన కవి, ప్రసంగకర్త, వ్యాఖ్యాత కూడా కాబట్టి అయనను అనుకరించే అనేకమంది ఏకలవ్య శిష్యులూ ఏర్పడ్డారు. 

హైదరాబాదులో ఒక పక్క పాఠాలు చెపుతూ, మరో పక్క సభల్లో విరివిగా పాల్గొంటూ, యివి చాలనట్లు వారాంతాలలో మద్రాసుకి వెళ్లి సినిమా గీతాలు రాసి వచ్చేవారు. ఆయన ప్రధానంగా గేయకవి. అద్భుతమైన లలితగీతాలు, గేయకావ్యాలు రాశారు. అందువలన సినిమా పాటలకు యీజీగా మళ్లగలిగారు. ఆయన సినీరంగ ప్రవేశం గురించి చాలా మందే రాశారు. గత పదేళ్లగా ఆయన సభల్లో పదేపదే చెప్పుకున్నారు. ఒక్కటి మాత్రం నిజం - ఆయన వేగంగా, క్వాలిటీ తగ్గకుండా రాయగలిగేవాడు. మద్రాసులోనే నివాసం వున్నవాళ్లు ఎంత ఔట్‌పుట్‌ యిచ్చారో, యీయన హైదరాబాదు నుంచి వెళ్లి కూడా అంతా యిచ్చేవాడు. మళ్లీ అందులో కూడా అన్ని రకాలూ రాయగలిగాడు. అందుకే శ్రీశ్రీ వెక్కిరించాడు - సినారె, భళారె, సినీ రె-డీమేడ్‌ సరుక్కీ తయారె అని. ఈ లిమరిక్‌కు కాప్షన్‌ ''కిరాణాకొట్టు'' అని పెట్టాడు. అంటే ఏ సరుకు కావాలంటే అది దొరుకుతుందన్నమాట. 

ఆయన ఏయే గొప్ప పాటలు రాశాడన్న విషయం నేను రాయటం లేదు. చాలామందే రాశారు. తను రాసిన పాటల నేపథ్యం గురించి ఓ పత్రికలో ''పాటలో ఏముంది? నా మాటలో ఏముంది?'' అనే శీర్షిక నిర్వహించి, తర్వాత పుస్తకాలుగా కూడా విడుదల చేశారు. పాటల్లో కొత్త పలుకుబళ్లు పరిచయం చేశారు. నిర్మాత దర్శకులతోనే కాదు, సాటి రచయితలతో కూడా ఎన్నడూ పేచీలు పడినట్టు లేదు. ''కర్ణ'' సినిమాకు అన్ని పాటలూ రాస్తున్నపుడు దానికి పోటీగా ''కురుక్షేత్రం'' తీస్తున్న కృష్ణ తమకూ రాయమని అడిగారు. ఆ సినిమాలో లేని ఘట్టమైతేనే రాస్తాను అని చెప్పారు సినారె. సుభద్రార్జునుల మధ్య పాట ఆ సినిమాలో లేదుగా, అది రాయండి అన్నారు కృష్ణ. ఆ పాటే 'మ్రోగింది కల్యాణవీణ'! మద్రాసు రచయితలతో పోలిక చెప్పినపుడు యింకో విషయం కూడా చెప్పాలి. వాళ్లు కొన్ని సినిమాలకు కథ, మాటలు కూడా రాసేవారు. ఈయన వాటి జోలికి పోలేదు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకి తరలి వచ్చాక కూడా ఆయన సినిమాలకు కథలు రాస్తాననలేదు. ఇక మాటల విషయానికి వస్తే నాకు తెలిసి మూడు సినిమాలకు రాశారు. వైఫల్యాన్ని రుచిచూశారు. 

మొదటిది ''ఏకవీర''. డైలాగులు అద్భుతంగా, పూర్తి వచన కవిత్వంలా వుంటాయి. కానీ సినిమా చూసేది సగటు ప్రేక్షకుడు. హాల్లో వుండగా అంతంత కవిత్వాన్ని ఆస్వాదించడం కష్టం. సినిమా అంటే హీరో వలచిన హీరోయిన్‌ను సాధించి పెళ్లాడాలి. ఆ సినిమాలు యిద్దరు హీరోలు. ఇద్దరి ప్రేమా విఫలమే. ఇద్దరు హీరోయిన్లు, వాళ్లిద్దరి ప్రేమా విఫలమే. ఇంత మొరోజ్‌ థీమ్‌కు తోడు అప్పటికప్పుడు అర్థం కాని డైలాగులు తోడవడంతో సినిమా ఫ్లాపయింది. ఆత్రేయ నడిగారట - 'ఏకవీర డైలాగులు ఎలా వున్నాయి?' అని. ''బాగున్నాయి. తెలుగులో వుంటే యింకా బాగుండేవి.'' అన్నారట! సినారె డైలాగులు రాసిన మరో సినిమా ''అక్బర్‌, సలీం, అనార్కలి'' ఆ చిత్ర దర్శకనిర్మాత ఎన్టీయార్‌ మొఘల్‌ ఏ ఆజమ్‌ వలన చాలా ప్రభావితమై పోయారు. తను పృథ్వీరాజ్‌ కపూర్‌ను యిమిటేట్‌ చేయడమే కాక, తెలుగు సినిమా డైలాగులు ఆ సినిమా డైలాగుల ఫక్కీలో రాయమని సినారెను అడిగారు. దాంతో తెలుగు సింటాక్స్‌లో బదులు ఉర్దూ సింటాక్స్‌లో డైలాగులు తయారయ్యాయి. ఉదాహరణకి 'మీరెప్పుడు వస్తారు?'కి బదులు 'వస్తారు మీరు ఎప్పుడు?' టైపన్నమాట. దాంతో ఆ సినిమా డైలాగులూ జనాలకు నచ్చలేదు. కోవై చెళియన్‌ ''దో ఆంఖే బారా హాత్‌''ను తెలుగులో ''మా దైవం''గా తీస్తూ మళ్లీ సినారె చేత రాయించారు. ప్రఖ్యాత హిందీ సినిమాకు అనువాదమే ఐనా సినిమా క్లిక్‌ కాలేదు. డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగినదీ లేదు. చిత్రసీమ హైదరాబాదుకి తరలి వచ్చాక సినారెది మోనోపలీ కాలేదు. అప్పటికే పోటీగా వేటూరి వచ్చేశారు. ఈయనలాగే అన్ని తరహా పాటలూ రాశారు. సినారెకు అశ్లీలగీతాలు రాయకూడదనే పట్టింపు వుంది. వేటూరికి లేదు. ఈయన లాగే ఆయనా వేగంగా రాసేవారు. సినారె లాగే పాటలు తప్ప మాటల జోలికి, కథ జోలికి వెళ్లలేదు.

ఆయనలో చెప్పుకోదగిన మరొక కోణం - ఆయన మంచి ఎడ్మినిస్ట్రేటర్‌. అనేక పదవులు అతి సమర్థవంతంగా నిర్వహించారు. ఏ పదవిలో పనిచేసినా దానికి వన్నె తెచ్చారు. కులపక్షపాతం, ప్రాంతీయపక్షపాతం, అవినీతి వంటి ఆరోపణలు ఎప్పుడూ ఆయన దరి చేరలేదు. అయితే ఆయన స్వతహాగా లౌక్యుడు. అధికారంలో ఎవరున్నా వారితో సర్దుకుపోగల లక్షణం వుంది. పదవుల కోసం బహిరంగంగా భజన చేసినట్లు కనబడలేదు. హుందాగా ప్రవర్తిస్తూనే పనులు జరిపించుకున్నారు. అందుకే ఆయన కెరియర్‌లో ఉత్థానపతనాలు లేవు. ఎప్పుడూ ఎదుగుతూనే పోయారు. ఆయనకు జ్ఞానపీఠ్‌ వచ్చినపుడు లాబీయింగ్‌ వలనే వచ్చిందని కొందరు విమర్శించారు. నా దృష్టిలో ఆయన దానికి పూర్తిగా అర్హుడు. పద్మభూషణ్‌కూ తగినవాడే. భారతరత్న వస్తుందని ఆయన ఆశించారు కానీ రాలేదు. 

రాజ్యసభ ఎంపీగా కూడా రాణించారు. అనేకమంది సినిమా నటులు, క్రీడాకారులు, కళాకారులు రాజ్యసభ ఎంపీలుగా వున్నపుడు సభలకు వెళ్లేవారు కారు. వెళ్లినా నోరు విప్పేవారు కారు. కానీ యీయన మాత్రం తన పదవీకాలంలో 600 దాకా ప్రశ్నలు వేశారట. ఖుశ్వంత్‌ సింగ్‌ వంటి జర్నలిస్టు కూడా రాజ్యసభ సభ్యుడిగా యింత చురుగ్గా వున్నాడనుకోను. ఎంపీగా ఎంపీలాడ్స్‌ నిధులను ఆయన చక్కగా వినియోగించారు. అనేక సాంస్కృతికి సమాజాల హితానికి విరాళాలిచ్చారు. ఆ నిధులను అమ్ముకునే ఎంపీలు కూడా వున్నారని వింటూ వుంటాం. కానీ అలాటి ఖర్మ ఎప్పుడూ పట్టలేదు. మొదటినుంచి దర్జాగానే బతికాడు. దర్జాగానే వెళ్లిపోయాడు.

నాకు చిన్నప్పటి నుంచి ఆయన కవిత్వం యిష్టం. ''కర్పూర వసంతరాయలు'', ''నాగార్జున సాగరం'', ''మధ్యతరగతి మందహాసం''... యిలా ఏం రాసినా నచ్చేది. ''స్రవంతి'' అని దక్షిణ భాషా హిందీ ప్రచార సభ వారు మాసపత్రిక ప్రచురించేవారు. దానిలో ఆయన రచనలు చాలా వచ్చేవి. మా వరప్రసాద్‌కి కూడా ఆయన అభిమాన రచయిత. ఆయన గేయకావ్యాలపై మేం నడిపిన లిఖిత మాసపత్రికలో వ్యాసాలు రాశాడు. ఇద్దరం కలిసి యువభారతి సమావేశాలకు వెళ్లి యితరుల ఉపన్యాసాలతో బాటు సినారె ఉపన్యాసాలు కూడా విని ఉత్తేజితులమౌతూ వుండేవాళ్లం. వరప్రసాద్‌ పారిశ్రామికవేత్త అయ్యాక పారిశ్రామికవేత్తల సమావేశం ఒకదానిలో చక్కటి తెలుగులో మంచి ప్రసంగం చేశాడు. ముఖ్య అతిథిగా వచ్చిన సినారె చాలా యింప్రెస్‌ అయి 'మీరెవరు?' అని వాకబు చేశారు. వరప్రసాద్‌ సంతోషంతో తలమునకలై ఆయనతో స్నేహం పెంచుకుని, వాళ్లింటికి తరచుగా భోజనానికి పిలిచేవాడు. ఆ విధంగా ఆయనకు చాలా ఆప్తుడయ్యాడు. సినారె ఒక పుస్తకాన్ని వరప్రసాద్‌కు అంకితం యిచ్చారు కూడా. 

నేను 1995లో హైదరాబాదుకి తిరిగి వచ్చాక వరప్రసాద్‌ ద్వారా సినారె పరిచయమయ్యారు. మేము ''హాసం'' పత్రిక పెట్టినపుడు ఆయన ప్రోత్సహించారు. బాగోగులు చెప్పేవారు. ''హాసం'' పుస్తకాలు ప్రచురణ చేపట్టాక ఎస్‌.వి.రామారావు గారు రాసిన ''సినారె సినీసూక్తులు'', ఎంకె రాము గారు రాసిన ''సినారె కవిత్వంలో లయాత్మకత'' పుస్తకం ప్రచురించాం. మేం వేసిన అనేక పుస్తకాలు ఆయన ఆవిష్కరించారు. ఎస్‌ వి రామారావుగారి ఆధ్వర్యంలో మేం నడిపే మా ''హాసం క్లబ్బు''కు సినారె అనేకసార్లు వచ్చారు. హాస్యకవితలు, హాస్యరచనలు చేయకపోయినా ఆయనకు హాస్యం యిష్టం. వచ్చి జోకులు చెప్పేవారు. మేం ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా సరే, మనవాళ్లదేగా అంటూ వచ్చేసేవారు. కొన్ని విషయాల్లో ఎంతో పట్టుదలగా వుండే ఆయన, మనుషులు నచ్చితే ఎలాటి భేషజాలకూ పోరు. ఎన్టీయార్‌కు వ్యతిరేకంగా తీసిన ''మండలాధీశుడు'' సినిమాలో సారథి అనే హాస్యనటుడు సినారెను ప్యారడీ చేశాడు. ఎన్టీయార్‌ పాత్ర వేసిన కోట శ్రీనివాసరావుపై ఎన్టీయార్‌ అభిమానులు మండిపడ్డారు. సినారె పాత్రను హాస్యాస్పదం చేసినందుకు ఆయన అభిమానులూ నొచ్చుకున్నారు. కానీ ఆయన సారథిపై వ్యతిరేకత ఏమీ పెట్టుకోనట్లుంది. ఓ సారి సారథికి ''హాసం క్లబ్బు'' తరఫున సన్మానం చేస్తున్నాం. సినారె ఫోన్‌ చేసి 'ఇవాళ కార్యక్రమం ఏమిటి?'' అని అడిగి 'సారథికి సన్మానం' అని చెపితే 'సరే, నే వస్తా' అంటూ వచ్చి ఆయన చేతుల మీదుగా సన్మానం చేశారు. 

సభాకార్యక్రమాల్లో సినారె అనే అంశంపై పెద్ద వ్యాసమే రాయవచ్చు. సాహిత్యసమాజాల పాలిటి ఆయన కల్పతరువు. అర్ధశతాబ్దిగా చూశాను. ఏ చిన్న సంఘం వాళ్లు వెళ్లి పిలిచినా ఆయన వచ్చి ప్రసంగించి ప్రోత్సహించేవారు. పెద్దతనం వచ్చాక రోజూ సభలకు వెళ్లడం హాబీగా మారింది. బహుశా సెలక్టివ్‌ కూడా అయ్యారేమో. కానీ ఎన్నో దశాబ్దాల పాటు అనేక ఔత్సాహిక కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వచ్చారు. యువభారతి వంటి గొప్ప సంస్థకు ఆయన మూలస్తంభం. ఆంధ్ర సారస్వత పరిషత్‌ అయితే చెప్పనే అక్కరలేదు. ఎంతో చేశారు. అందుకే ఆయన భౌతిక కాయాన్ని అక్కడ కొద్దిసేపు వుంచారు. హైదరాబాదు అనే కాదు, అనేక వూళ్లకు వెళ్లి ప్రసంగాలు చేసి, అక్కడి సభలకు గ్లామర్‌ తెచ్చారు. గత పది, పదిహేను ఏళ్లగా రోజూ రవీంద్ర భారతికో, త్యాగరాయ గానసభకో వచ్చి ప్రసంగించి, 8, 8.30 లోపున వెళ్లిపోయేవారు. చాలా సందర్భాల్లో ఆయనే సభాధ్యక్షుడు కాబట్టి అప్పట్లోగా సభ ముగించమనేవారు. ఎవరైనా దీర్ఘోపన్యాసం చేసినా, చెప్పినదే చెపుతున్నా అసహనం ప్రదర్శించేవారు. ఆపేయమనేవారు. తను మాట్లాడేటప్పుడు వేదిక మీద వున్నవారు తమలో తాము మాట్లాడుకుంటూ వుంటే మందలించేవారు. 

ఆయన సభలో వున్న గంటా, గంటన్నరా నిర్వాహకులు కానీ, గాయనీగాయకులు కానీ, ఆర్కెస్ట్రా కానీ, వక్తలు కానీ, అందరూ చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని వుండేవారు. పాటలకు రీసౌండ్‌ పెట్టినా, ఆర్కెస్ట్రా మరీ లౌడ్‌గా వున్నా మార్చమనేవారు. పాటలో శ్రావ్యత వుండాలని నొక్కి చెప్పేవారు. ఒక హెడ్మాస్టరులా అందర్నీ అదిలించేవారు. యువభారతి నాటి రోజుల్లో ఎవరైనా వ్యక్తి గురించి ప్రసంగవ్యాసాలుండి వినబుద్ధిగా వుండేవి. ఈ రోజువారీ మీటింగుల్లో ఒక అంశం గురించి దీర్ఘంగా మాట్లాడడం వుండేది కాదు. పైగా యితర వక్తలు కూడా వుంటారు. అందుకని 10 ని||లు దాటకుండా తన స్వోత్కర్ష కాస్త చెప్పుకుని సన్మానితుల గురించో, సభలో అంశం గురించో ఒకటి రెండు చక్కటి మాటలు చెప్పి ముగించేవారు. పోనుపోను చర్వితచర్వణమై పోయి, కాస్త బోరు కొట్టేది. కానీ ఎప్పటికప్పుడు ఆయన పదాలకు కొత్త విరుపులు వేసో, కొత్త పదబంధం సృష్టించో చివరకు బాగుంది అనిపించేవారు. నేను మొదటిసారి ఆయన ఎదుట సభలో మాట్లాడినపుడు నెర్వస్‌గా ఫీలయ్యాను. అప్పటికే మాట్లాడడం అలవాటైనా, అవేళ క్లుప్తంగా, ముచ్చటగా ప్రసంగం తయారుచేసుకుని యింట్లో రెండు, మూడు రిహార్సల్స్‌ వేసుకుని మాట్లాడాను. విని ఆయన తలవూపారు. చాలు బాబూ అనుకున్నాను. తర్వాత చాలాసార్లు మాట్లాడే సందర్భం వచ్చింది. 

నారాయణరెడ్డిగారిలో వున్న సుగుణాలు రాశాక, ఆయనలో నాకు నచ్చని అంశం కూడా రాయకపోతే యీ ఎలిజీ సమగ్రం కాదు. 1969 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగినపుడు ఆయన సమైక్యవాది. ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పారు కూడా. 'వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణా కాదు' అని. ఆయనకు అప్పుడు అశోక్‌నగర్‌లో యిల్లుండేది. కట్టేనాటికి ముగ్గురు కూతుళ్లే కాబోలు, వాళ్ల పేర్లు గంగ, యమున, సరస్వతి కాబట్టి యింటికి 'త్రివేణి' అని పెట్టుకున్నారు. తర్వాత నాలుగో అమ్మాయి కృష్ణవేణి కూడా పుట్టింది. ఆ యింటి గోడమీద ఉద్యమకారులు 'వీర తెలంగాణ యోధుడా, వేరు తెలంగాణ కోరు' అని బొగ్గుతో రాశారు. 'తెలుగుజాతి మనది' పాట రాసినందుకు ఆయనను తిట్టిపోశారు. అయినా చలించలేదు. అలాటిది యిటీవలి ఉద్యమంలో మాత్రం ఆయన వేరు తెలంగాణ కావాలి అంటూ ప్రకటన యిచ్చారు. అప్పటి సమైక్యవాదులు కొందరు యిప్పుడు వేర్పాటువాదులు అయ్యారు. అభిప్రాయాలు మార్చుకోవడంలో తప్పు లేదు. 

కానీ అన్యాయం ఏమిటంటే - ఆయన 'తెలుగుజాతి మనది - పాట ఎన్టీయార్‌ చెపితే రాశాను. అది నా అభిప్రాయం కాదు' అని స్టేటుమెంటు యిచ్చారు. పాటలో ఏముంది..? మొదటి సంకలనంలో ఆ పాట ఎలా రూపుదిద్దుకుందో ఆయనే స్వయంగా రాశారు. 'తల్లా? పెళ్లామా?' సినిమాకు యీయన పాటలన్నీ రాశారు. ఆ సందర్భంగా మద్రాసులో వున్న ఎన్టీయార్‌తో కబుర్లు చెపుతూ వుండగా వేర్పాటు ఉద్యమం గురించి ఎన్టీయార్‌ వాకబు చేశారు. 'నేను సమైక్యవాదం ప్రబోధిస్తూ ఒక పత్రికలో ఒక గేయం రాశాను. అది అచ్చయింది. వినండి' అంటూ సినారె పాడి వినిపించారు. ఎన్టీయార్‌ అది వింటూనే యిన్‌స్పయిరై 'దీన్ని పాటగా రాసి యివ్వండి. సినిమాలో సందర్భం లేకపోయినా సందర్భం కల్పించి మరీ పెడతాను' అన్నారు. ఈయన పాటగా మార్చి యిచ్చారు. అలాటిది యిప్పుడు అది నా అభిప్రాయం కాదు అని ఎలా అంటారు? ఈ విషయాన్ని ఆత్మీయులు అడగ్గా 'ఏం చేయమంటారు? పాతికమంది యింటిి మీద పడి ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా స్టేటుమెంటు యిస్తావా? లేదా? అని కూర్చున్నారు. తప్పలేదు' అని వాపోయారు. ఆ మాట నిజమే కావచ్చు, హైదరాబాదులో మీడియా కానీ, ఉద్యమకారులు కానీ ఎంత ఎగ్రెసివ్‌గా వున్నారంటే సమైక్యవాదం గురించి ఎవరూ ధైర్యంగా మాట్లాడలేకపోయారు. నిజం చెప్పాలంటే సినారెను నెత్తిన పెట్టుకుని మోసినవారిలో ఆంధ్ర మూలాల ఆర్గనైజర్లే ఎక్కువమంది వున్నారు. ఆయన ఎవరి పట్లా వివక్షత చూపించలేదు కూడా. అయితే యింత స్టేచర్‌ వున్న వ్యక్తి కూడా ఆ బెదిరింపులకు లొంగారే అని బాధ వేస్తుంది. ఆయన యిబ్బందులు ఆయనకుండవచ్చు. ఏది ఏమైనా ఆయన మహానుభావుడు. ఆయనకు యిదే నా అశ్రుతర్పణం. -

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2017)

mbsprasad@gmail.com