Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: మోదీ కాబినెట్ మార్పులు

ఎమ్బీయస్‍: మోదీ కాబినెట్ మార్పులు

మధ్యమధ్యలో అట్టు తిరగేయడం మంచిదే, మాడిపోకుండా వుంటుంది. ఒకళ్లే మంత్రివర్గంలో పాతుకుపోకుండా, తక్కినవాళ్లకూ ఛాన్సివ్వడం, బాగా పని చేసినవారికి పెద్ద పదవి యివ్వడం, ఓ మాదిరిగా చేసినవారికి క్రింది పదవి యివ్వడం, బాగా చేయనివారిని తీసేయడం.. యివన్నీ మంచిదే. మోదీ తన తొలి టెర్మ్‌లో 2014 మేలో 45 మందితో కాబినెట్ కూర్చారు, నవంబరుకి దాన్ని 66కి పెంచారు. 2016 జులై వచ్చేసరికి 75 అయింది. 2017 సెప్టెంబరుకి 76 అయింది. రెండో టెర్మ్‌లో 2019 మేలో 58 మందితో ప్రారంభించారు. రెండేళ్ల రెండు నెలలకు 12 మందిని తీసేసి, 36 మందిని కొత్తగా చేర్చి, మొత్తం 78 మంది మంత్రులతో కాబినెట్‌ను విస్తరించారు. యుపిఏ-2లో 77 మంది వుంటే బిజెపి జంబో కాబినెట్ అని వెక్కిరించింది. ఇప్పుడు వీరిది జంబో ప్లస్ ఒన్ కాబినెట్ అయింది.

వీరిలో కాబినెట్ రాంక్ ఉన్నది 31 మందికి. సహాయ మంత్రులే అయినా ఇండిపెండెంట్ చార్జి వున్నది యిద్దరికి. సహాయమంత్రులు 45 మంది. 78 మందిలో 59 మంది లోకసభ సభ్యులు, 17 మంది రాజ్యసభ సభ్యులు. కొత్తగా చేరిన వారిలో ఇద్దరికి వేటిలోనూ సభ్యత్వం లేదు. కొత్తగా 6గురు మహిళలను చేర్చి మొత్తం 11 మంది మహిళలను మంత్రులుగా చేశారు. బిజెపి వాళ్లు 74 మంది వుంటే భాగస్వామ్య పక్షాల నుంచి 4గుర్ని తీసుకున్నారు. బయట నుంచి చూస్తే కొన్ని పనులకు లాజిక్ కనబడుతోంది, కొన్నిటికి కనబడటం లేదు. మోదీ ఊహలు, వ్యూహాలు ఆయన కుంటాయనుకోండి. అవి ఏ మేరకు ఫలించాయో 2022 చెప్పేస్తుంది.

మొదటగా కొట్టవచ్చినట్లు కనబడేది – ఎన్నికలు రాబోయే రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యం యివ్వడం, అక్కడి కులసమీకరణల ప్రకారం పదవులు యివ్వడం. యుపి అతి ముఖ్యమైన రాష్ట్రం కాబట్టి, కొత్తగా యిచ్చిన 36 పదవుల్లో 20శాతం అక్కడివారినే తీసుకున్నారు. ఈ 7గురిలో ఎక్కువమంది యాదవేతర బిసిలు. యాదవుల తర్వాత ప్రధాన బిసిలైన కూర్మీల పార్టీ అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పాటిల్‌కు రెండేళ్ల గ్యాప్‌తో మళ్లీ మంత్రిని చేశారు. దీనితో కేంద్ర కాబినెట్‌లో యుపి మంత్రుల సంఖ్య 16కి చేరింది. మోదీ, షాలకు మూలస్థానమైన గుజరాత్‌లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. అక్కడ పటేళ్లకు అసంతృప్తి వుంది. అందువలన ఇద్దరు పటేళ్లతో సహా ముగ్గుర్ని కాబినెట్‌లోకి తీసుకున్నారు. మొత్తం మీద గుజరాత్‌కు 8 పదవులు దక్కాయి. దక్షిణాదిన కర్ణాటక ఒక్కటే బిజెపికి ముఖ్యం కాబట్టి 4 పదవులు కొత్తగా దక్కి మొత్తం 5 అయ్యాయి. వీరిలో ఎడియూరప్ప శిష్యురాలు శోభా కరంజాద్లే ఒకరు. మంత్రి పదవి యిచ్చారు. ముఖ్యమంత్రి పదవి వదులుకున్నందుకు ఎడియూరప్ప డిమాండు కాబోలు.

కాంగ్రెసు నుంచి బిజెపికి ఫిరాయించి మధ్యప్రదేశ్‌ను బిజెపికి అప్పగించిన జ్యోతిరాదిత్య సింధియాను కాబినెట్ పదవితో సత్కరించి పౌర విమానయానం యిచ్చారు. దాంతో ఎంపీ నుంచి 5 గురు మంత్రులయ్యారు. రాజస్థాన్ నుంచి నలుగురున్నారు. మహారాష్ట్రలో అధికారం లేకపోయినా, 4గుర్ని కొత్తగా చేర్చి, మొత్తం 8 మందికి యిచ్చారు. ఝార్‌ఖండ్ చిన్న రాష్ట్రమైనా, అక్కడా అధికారంలో లేకపోయినా ముగ్గురికి యిచ్చారు. బిహార్‌ నుంచి యిప్పటికే నలుగురు వుండగా ఇంకో యిద్దర్ని చేర్చి 6గుర్ని చేశారు. ఒడిశాలో ఇప్పటికే యిద్దరుండగా మరొకర్ని చేర్చి ముగ్గుర్ని చేశారు. పంజాబ్‌లో కూడా ఎన్నికలున్నాయి కానీ రైతు ఆందోళన తర్వాత బిజెపి ఆశలు వదులుకున్నట్లుంది. ఎవర్నీ తీసుకోలేదు. కాబినెట్‌లో పంజాబీ జాట్ సిఖ్కు (రాష్ట్రంలో వారి జనాభా 30శాతం) లేకపోవడం యిదే ప్రథమమట.

బెంగాల్‌లో విజయం సాధించలేకపోయినందుకు కాబోలు, దేబశ్రీ చౌధురి, బాబుల్ సుప్రియో అనే సహాయమంత్రులను తీసేశారు. కానీ బెంగాల్‌లో విస్తరించవలసిన అవసరం వుంది కాబట్టి ఉత్తర బెంగాల్ నుంచి జాన్ బర్లా (టీ ఎస్టేటు ప్రాంతాలకు చెందిన గిరిజనుడు), నీతీశ్ ప్రమాణిక్‌ (రాజబంశీ కులస్తుడు)ను, దక్షిణ బెంగాల్ నుంచి శంతను ఠాకూర్ (మటువా కులస్తుడు), సుభాష్ సర్కార్‌ (జంగల్ మహల్ ప్రాంతీయుడు)లను కాబినెట్‌లోకి తీసుకున్నారు. ఏ బిజెపి ప్రభుత్వంలోనూ బెంగాల్ నుంచి నలుగురు మంత్రులు లేరు. తమిళనాడులో కూడా విస్తరించాలని అక్కడి నుంచి మురుగన్‌ను కాబినెట్‌లో తీసుకున్నారని అంటున్నారు. కేరళ నుంచి ఒకరు యిప్పటికే ఉన్నారు. ఆంధ్రలో విస్తరించనక్కర లేదనుకున్నారో లేక ఆంధ్ర రాజకీయాలతో సంబంధం లేని, ఆంధ్ర నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం తప్ప ఏ పనీ చేసి పెట్టని నిర్మలా సీతారామన్‌ను ఆంధ్ర లెక్కలో వేశారో తెలియదు.

కులసమీకరణాలకు వస్తే – ఈ విస్తరణతో 27 మంది ఓబిసిలకు, 12 మంది దళితులకు, 8 మంది గిరిజనులకు చోటు లభించింది. కాబినెట్ హోదా గల మంత్రులు 31 మంది ఐతే వారిలో 11 మంది యీ వర్గాలకు చెందినవారు. తక్కిన 20 మంది ఒసిలు. (6గురు బ్రాహ్మణులు, 6గురు క్షత్రియులు, ఇద్దరు వైశ్యులు, ఇద్దరు పటేళ్లు, 1 రెడ్డి, 1 భూమిహార్..) హిందూకులాలను ఇన్‌క్లూడ్ చేసుకున్న మోదీ ముస్లిములను మాత్రం ఇన్‌క్లూడ్ చేసుకోలేదు. దేశంలో 14శాతం, యుపిలో 19శాతం ఉన్న ముస్లిముల్లో ఒక్కర్నీ తీసుకోలేదు. 2014 నుంచి మోదీ కాబినెట్‌లో ఒకే ఒక్క ముస్లిం మంత్రి నఖ్వీ, అదీ ప్రాధాన్యత లేని మైనారిటీ వ్యవహారాల శాఖలో! వాజపేయి కాబినెట్లో పనిచేసిన నఖ్వీ, రాజ్‌నాథ్ మాత్రమే మోదీ ప్రస్తుత కాబినెట్‌లో వున్నారు. తక్కినవారంతా మోదీ హయాం వారే! భాగస్వామ్య పక్షాలైన జెడియు నుంచి రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు యిచ్చారు. లోక జనశక్తి పార్టీని చీల్చి వచ్చిన పశుపతి పరాస్‌కూ యిచ్చారు.

అనురాగ్ ఠాకూర్, గిరిరాజ్ సింగ్ వంటి హిందూత్వ వాదులకు ప్రమోషన్ యివ్వడం ద్వారా హిందూత్వ వాదాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. వీళ్లిద్దరూ భీమా కోరేగావ్ కేసులో స్టాన్ స్వామి వంటి నిందితులపై విరుచుకు పడిన బ్యాచ్. రాబోయే యుపి ఎన్నికలలో హిందూత్వవాణిని బలంగా వినిపిస్తాడనే బిహార్‌కు చెందిన గిరిరాజ్‌ను స్టేట్ మినిస్టర్ హోదా నుంచి రూరల్ డెవలప్‌మెంట్, పంచాయితీ రాజ్‌కు కాబినెట్ మంత్రిని చేశారు. కోవిడ్ విషయంలో యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించినందుకు కార్మిక మంత్రి సంతోష్ గంగ్‌వార్‌ను వలస కార్మికుల విషయంలో ప్రభుత్వవైఫల్యాన్ని ఆయన నెత్తికి చుట్టి యింటికి పంపారు. ఆరెస్సెస్ కార్యకర్త, అమిత్ షాకు ఆత్మీయుడు ఐన భూపేందర్ యాదవ్‌కు కార్మిక శాఖ యిచ్చారు.

ఆశ్చర్యం కలిగించిన తొలగింపుల విషయానికి వస్తే - కమ్యూనికేషన్, ఐటీ, లా వంటి ముఖ్యమైన శాఖలు నిర్వహించిన సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్‌ను కాబినెట్‌లోంచి సాంతం తొలగిస్తున్నట్లు గంట ముందు దాకా చెప్పనే లేదట. అతను ప్రత్యర్థులపై విరుచుకుపడే రకమే. ఒక రకంగా చూస్తే అతిభాషిత్వమే అతనికి నష్టం కలిగించిందట. మీడియాలో అతనికి ప్రాధాన్యత పెరిగిపోతోందని తోక కత్తిరించారని అనుకుంటున్నారు. 5జిని 100 రోజుల్లో ఆచరణలోకి తెస్తానని చెప్పి యిన్నాళ్లయినా చేయలేకపోవడం అతని అసమర్థత కారణంగానే అని బయటకు చెప్తున్నారు.

అలాగే మరో సీనియర్ ప్రకాశ్ జావడేకర్‌ను తీసివేయడం కూడా ఆశ్చర్యకరమే. కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందలేదని ప్రజలను కన్విన్స్ చేయడంలో ఇనఫర్మేషన్ మంత్రిగా విఫలమయ్యాడని ఆరోపణ. పార్టీలో ప్రముఖ పాత్ర యిస్తారని ప్రస్తుతానికి చెప్తున్నారు. అతని స్థానంలో అమిత్ షాకు అత్మీయుడు, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అనురాగ్ ఠాకూర్‌ను తెచ్చారు. ఆ విధంగా అక్కడి కొత్త ముఖ్యమంత్రికి యిబ్బంది లేకుండా చూశారు. తాము రూపొందించిన విద్యావిధానాన్ని సమర్థవంతంగా అమలు చేయలేదని ఆరెస్సెస్ ఫిర్యాదు చేయడంతో రమేశ్ పోఖ్రియాల్‌ను విద్యామంత్రిగా తీసేసి ధర్మేంద్ర ప్రధాన్‌కు అప్పగించారుట. కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖ చూసిన సదానంద గౌడ పనితీరు నచ్చలేదని తీసేశారుట. ట- అనడం ఎందుకంటే మా మంత్రి సరిగ్గా పనిచేయలేదు కాబట్టి తీసేశాం అని ఏ ప్రభుత్వమూ, ఏ పార్టీ చెప్పదు. వయోభారం చేత, పార్టీలో అతని అవసరం వుంది కాబట్టి, రాష్ట్ర రాజకీయాలకు తిప్పి పంపుదాం కాబట్టి.. అని లీకులు యిస్తుందంతే.

ఇక హర్షవర్ధన్‌ను తీసివేయడం కరోనా కారణంగానే అని అందరికీ తెలుసు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వవైఫల్యాలన్నీ ఆయన నెత్తికి కట్టేసి, తీసేశారన్నది స్పష్టం. నిజానికి కరోనా వచ్చిన దగ్గర్నుంచి మోదీయే వేదికను ఆక్రమించారు. ఆరోగ్యశాఖ ఆయన అధీనంలో నడిచింది. నీతి ఆయోగ్, టాస్క్ ఫోర్స్‌లు, అధికారులతో కమిటీలు ఏర్పరచారు, సమావేశాలు నిర్వహించారు. ప్రజలతో నేరుగా సంభాషించినదీ ఆయనే. హర్షవర్ధన్ స్వయంగా డాక్టరు. కరోనా బీభత్సాన్ని అంచనా వేయగలిగిన వ్యక్తి. అయినా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవలసి వచ్చింది. ఇప్పుడు నింద మూటగట్టుకుని దిగిపోవలసి వచ్చింది. దిల్లీ రాజకీయాలు చూసుకుంటూ ఆప్‌తో తలపడు అని చెప్తారట.

ఆరోగ్య శాఖను గుజరాత్‌కు చెందిన మన్‌సుఖ్ మాండవీయకు యిచ్చారు. కరోనా రోజుల్లో ఆరోగ్యశాఖే పెద్దదనుకుంటే దానికి కెమికల్స్, ఫెర్టిలైజర్ వంటి ముఖ్య శాఖ కూడా కలిపారు. ఔషధాలు కెమికల్స్ కింద వస్తాయి కాబట్టి కొంత లాజిక్ వుందనుకున్నా ఫెర్టిలైజర్స్‌ను వ్యవసాయశాఖకు అప్పగించకుండా, ఆరోగ్యశాఖకు ముడివేయడమేమిటో! అలాగే రైల్వే శాఖ చాలా పెద్ద శాఖ. కరోనా దెబ్బతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కుంటోంది. దాన్ని పీయూష్ గోయల్ నుంచి తప్పించి, అశ్విన్ వైష్ణవ్‌కి కాబినెట్ హోదా యిచ్చి దీన్ని కట్టబెట్టారు. ఈయన రైల్వేను చురుగ్గా ప్రయివేటైజ్ చేస్తారని అంచనా. దానితో బాటు రవిశంకర్ ప్రసాద్ వద్ద వుండే ఐటీ శాఖ కూడా కట్టబెట్టారు. పెగాసస్ అంశంతో బాటు ప్రపంచ ఐటీ దిగ్గజాలన్నీ మన దేశపు కొత్త ఐటీ చట్టాలతో విభేదిస్తున్న నేపథ్యంలో ఆ శాఖా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది కాబట్టి ఈయనకు సహాయ మంత్రిగా రాజీవ్ చంద్రశేఖర్ అనే టెక్నోక్రాట్‌ను నియమించారు. అలాగే అర్బన్ ఎఫయిర్స్ చూస్తున్న పంజాబీ ఖత్రీ హర్దీప్ సింగ్‌ పురికి, పెట్రోలియం శాఖ కూడా యిచ్చారు. మరో ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ సింగ్‌కు కాబినెట్ హోదా లభించి ఎనర్జీ శాఖకు మంత్రి అయ్యారు.

నితిన్ గడ్కరీ సమర్థుడైన మంత్రి. ఆయనకు రోడ్ల శాఖ మాత్రం మిగిల్చి, సూక్ష్మ, మధ్యతరహా సంస్థల శాఖను తీసేసుకుని శివసేన నుంచి బిజెపికి దూకిన మహారాష్ట్ర నాయకుడు నారాయణ రాణేకు యిచ్చారు. రాణే అంటే శివసేనకు పడదు కాబట్టి దీని ద్వారా శివసేన-బిజెపి సఖ్యత వుండదు అని సంకేతం యిచ్చినట్లే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యశాఖలో ఆయుష్, యోగా కూడా భాగమే. ముఖ్యంగా కరోనా వచ్చినతర్వాత వాటి ప్రాధాన్యత మరింత పెరిగింది. కరోనా చికిత్సలోనే కాదు, త్వరగా కోలుకోవడం కోసం అలోపతీతో పాటు సమన్వయం చేయవలసిన అవసరం కనబడుతోంది. మరి యిప్పుడు ఆ శాఖ నుంచి ఆ రెండిటినీ తీసేసి సర్వానంద సోనోవాల్‌కు అప్పగించారు. ఎందుకో తెలియదు. సోనోవాల్‌కు వీటితో బాటు వీటికి ఏ మాత్రం సంబంధం లేని షిప్పింగ్, పోర్టులు యిచ్చారు. అసాంలో అతన్ని తప్పించి హిమాంత శర్మకు ముఖ్యమంత్రి పదవి యిచ్చినపుడే సోనోవాల్‌కు కేంద్రపదవి యిస్తారని తెలుసు.

దేశంలో టెర్రరిజం పెరుగుతూనే వుంది, కశ్మీర్ కుంపటి రగులుతూనే వుంది, హోం శాఖకు ఎంతో పని. రెండేళ్ల అనుభవం సంపాదించిన సహాయ మంత్రి కిషన్ రెడ్డిని మార్చేశారు. అమిత్ షాకు కొత్తగా కోఆపరేషన్ శాఖ సృష్టించి కట్టబెట్టారు. అసలా శాఖ ఎందుకు సృష్టించారో అర్థం కావటం లేదు. సహకారం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కేరళలో, మహారాష్ట్రలో సహకార రంగం రాజకీయాలను ప్రభావితం చేస్తోందని గ్రహించి, వాటిపై పట్టు సాధించడానికై యీ శాఖను సృష్టించారని అంటున్నారు. కిషన్ రెడ్డికి కాబినెట్ హోదా దక్కినందుకు పదోన్నతి అనాలో, అతి ముఖ్యమైన హోం శాఖ నుంచి టూరిజం, కల్చరల్ ఎఫయిర్స్ వంటి రాజకీయంగా అప్రాధాన్య శాఖ యిచ్చినందుకు డిమోషన్ అనాలో తెలియకుండా వుంది. కరోనా దెబ్బకి టూరిజం దెబ్బ తినేసింది. మామూలు ప్రయాణాలు పునరుద్ధరింపబడే పరిస్థితి ఏడాది దాకా రాకపోవచ్చు. అందుచేత టూరిజం చెప్పుకోదగ్గ శాఖ అనుకోవడానికి లేదు. సాంస్కృతిక వ్యవహారాల విషయంలో చేసేదేముంది? కిషన్ రెడ్డిని టూరిజం శాఖకు కేబినెట్ మంత్రి చేసినంత మాత్రంలో యిక్కడి జనాలు బిజెపికి ఓటేస్తారా!?

వాజపేయి-అడ్వాణీ శిష్యులుగా పేరుబడిన ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్, సదానంద గౌడ (కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖ చూశారు), రమేశ్ పోఖ్రియాల్ (విద్యాశాఖ), తావర్ చంద్ గెహలోత్ (సామాజిక న్యాయం శాఖ), హర్షవర్ధన్‌లకు ఉద్వాసన పలకడం జరిగింది. ఆ నాటి ప్రముఖుల్లో రాజ్‌నాథ్ మిగిలారు. యుపి ఎన్నికల తర్వాత ఆయన్ని కూడా ఉపరాష్ట్రపతిని చేసి, అడ్వాణీ శిష్యుడైన వెంకయ్యనాయుణ్ని క్రియాశీలక రాజకీయాల్లోంచి తప్పించినట్లే తప్పిస్తారని ఊహాగానాలున్నాయి.

ఏది ఏమైనా కొత్త కాబినెట్ కొలువు తీరింది. వీరిలో 60 ఏళ్లకు లోపున్నవారు 44 మంది ఉన్నారు. పలువురు విద్యాధికులు వున్నారు. వ్యక్తిగతంగా ప్రతిభావంతులే అయినా మోదీ పనిచేయనీయాలి. మోదీ హయాంలో ఆయనకు అత్మీయులైన అధికారులతో నింపుకున్న పిఎంఓ (ప్రధాని కార్యాలయం) యే అన్ని పనులూ చక్కబెడుతోందని, మంత్రులకు స్వేచ్ఛ వుండటం లేదనీ అభియోగాలున్నాయి. అందుకే దేశంలో ప్రతి మంచికి, ప్రతి చెడుకి మోదీని బాధ్యుణ్ని చేయడం జరుగుతోంది. అమిత్ షా కూడా ఆయనలో భాగమనీ, ఆయన ఆలోచనలు అమలు చేసే వ్యక్తి మాత్రమేననీ ప్రజలు అనుకుంటున్నారు. కొత్త మంత్రులు వాళ్ల పరిధిలోనైనా బాగా పనిచేయాలని కోరుకుందాం. నిజానికి ఆర్థిక వ్యవహారాల వైఫల్యానికి తీసివేయాల్సిన నిర్మలను కొనసాగించారు. ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ, కార్మిక శాఖ – ఇలా ఎన్నో ముఖ్యమైన శాఖల పని తీరు మీదనే మన బతుకులు, మోదీ యిమేజి ఆధారపడి వున్నాయి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?