Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: సినిమాల్లో కేటగరైజేషన్

ఎమ్బీయస్‍: సినిమాల్లో కేటగరైజేషన్

మోహన్‌బాబు యిచ్చిన స్టేటుమెంటులో ఒక మంచి పాయింటు చెప్పారు. 300, 350 టిక్కెట్లతో చిన్న సినిమాలు నిలబడవు. 30, 50లతో పెద్ద సినిమాలు నిలబడవు అని. దానికి పరిష్కారం ఏమిటి అనేది పరిశ్రమకు సంబంధించిన అన్ని వర్గాల వారూ కలిసి ఆలోచించాలి. సినిమా టిక్కెట్టు రేట్లు ఎలా వుండాలి అనేదానిపై కమిటీ వేశారు. వాళ్ల ఆలోచనలేవో వాళ్లకుంటాయనుకోండి. నాకు మాత్రం కేటగరైజేషన్ అనే కాన్సెప్టు గురించి తీవ్రంగా చర్చిస్తే మంచిదని తోస్తోంది. ఈ థియరీ సింపుల్‌గా చెప్పాలంటే - రైల్లో స్లీపరు, ఎసి3, ఎసి2 అనే క్లాసులున్నట్లే, థియేటర్లో బెంచీ, కుర్చీ, బాల్కనీ వంటి క్లాసులున్నట్లే లాగానే మూడు కేటగిరీల థియేటర్‌ లుండాలి. వాటికి ఫీడ్ చేసే మూడు కేటగిరీల సినిమాలుండాలి. అప్పుడు అన్ని రకాల సినిమాలూ బతుకుతాయి, అన్ని రకాల ప్రేక్షకులూ థియేటర్లకు వస్తారు.

నిత్యావసరం కానీ సినిమా గురించి ఎందుకిన్ని వ్యాసాలు రాస్తున్నారని కొందరు అడుగుతున్నారు. గతంలోనే రాశాను - సినిమా ఒక పరిశ్రమ. స్వాతంత్ర్యానంతరం యీ స్థాయిలో ఏ పరిశ్రమా పెరగలేదనిపిస్తుంది. అప్పటి టర్నోవరును యిప్పటి టర్నోవరుతో పోల్చి చూడండి. ఎన్ని రెట్లు పెరిగిందో తెలుస్తుంది. ఎన్ని భాషలు, ఎన్ని పాటలు, ఎంతమంది కళాకారులు, ఎంతమంది సాంకేతిక నిపుణులు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ పరిశ్రమపై లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయి. మీకు సినిమా వినోదమే కావచ్చు, కానీ వాళ్లకు అన్నం పెట్టే అన్నపూర్ణ. మన జాతి సృజనాత్మకత ప్రదర్శించడానికి అతి పెద్ద కాన్వాస్ సినిమాయే! కొంతమంది హ్రస్వదృష్టి వలన ఆ పరిశ్రమ దెబ్బ తినకూడదు. దాన్ని నమ్ముకున్న లక్షలాదిమంది ఓహో అని కాకపోయినా ఫర్వాలేదన్నట్లు బతికితే చాలు. దేశమంతా యిది వర్తిస్తుంది, తెలుగువాళ్లకు మరీ వర్తిస్తుంది. ఎందుకంటే మన తెలుగువాళ్ల జనాభాతో పోలిస్తే మన సినిమాల ఔట్‌పుట్‌ కానీ, వాటిపై ఆధారపడినవారి నిష్పత్తి కానీ చాలా ఎక్కువ.

ప్రస్తుత సమస్య గురించి పదేపదే అనుకోవడం జరిగింది. 80-100 కోట్ల పెద్ద సినిమాలకు రెవెన్యూ రావాలంటే అధికధరలకు బెనిఫిట్ షోలు (ఎవరి బెనిఫిట్‌కు? అసలీ మాటే మార్చేసి, ప్రీమియం షో అని పెట్టాలి) వేయాలి. అదే థియేటర్లో ఏ అదనపు సదుపాయాలూ సమకూర్చకుండా మొదటి రెండువారాలు అధికధరలకు టిక్కెట్లు అమ్మనివ్వాలి. ఇంతా చేసి సినిమా బాగుంటుందో లేదో ఎవరూ చెప్పలేరు. బాగుండకపోతే తమను చీట్ చేసినట్లు ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అందుకే ఆ పద్ధతికి స్వస్తి పలకాలి. సరే, ఆ సినిమా వెళ్లిపోయాక చిన్న సినిమాను ఆడించి, అదే టిక్కెట్టు ధర పెడితే జనాలు చూడడానికి రావటం లేదు, ఈ పాటి సినిమాను టీవీలో చూసుకోవచ్చులే అని. అవి ఆడకపోవడంతో చిన్న సినిమాలు తీయడానికి ఎవరూ రావటం లేదు. గతంలో పాత సినిమాలను మార్నింగు షోలలో క్లాసు కన్సెషన్‌తో చూపించేవారు. అంటే పరోక్షంగా టిక్కెట్టు ధర తగ్గించినట్లేగా! అనేక సినిమాల్లో మొదట రిలీజైనప్పుడు సొమ్ము చేసుకోకపోయినీ రీరన్‌లలో డబ్బు రాబట్టుకున్నాయి.

కమ్మర్షియల్ సినిమాలను ప్రైమ్ ‌టైమ్ (మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో)లలో ప్రదర్శించి, కొత్తవే అయినా ఆఫ్‌బీట్ సినిమాలను మార్నింగు షోలలో ప్రదర్శించిన సందర్భాలున్నాయి. ‘‘మా భూమి’’ సినిమా హైదరాబాదులో మార్నింగు షోలలోనే 100 రోజులాడింది. రోజుకి ఒక ఆటే కాబట్టి మౌత్ పబ్లిసిటీ క్రమంగా పెరిగి, సినిమాకు డబ్బు తిరిగి వచ్చేసింది. ఇలా ప్రోడక్టును మార్కెట్లో పుష్ చేయడానికి రకరకాల మార్గాలు అవలంబించేవారు. అప్పటి కంటె ఇప్పుడు టివి, ఒటిటి వంటి ప్రత్యామ్నాయాలు వచ్చాయి కాబట్టి కొత్తకొత్త టెక్నిక్కులు అవలంబించాలి. అవేమీ లేకుండా చిన్నసినిమా, పెద్దసినిమా దేనికైనా ఒకటే ధర, కొంటే కొనండి, లేకపోతే మానేయండి అనడంతో రెండో ఆప్షనే బాగుందనుకుని మానేస్తున్నారు. పెద్ద హీరోల వీరాభిమానుల క్రేజ్‌ను పండగ సమయాల్లో ఎన్‌క్యాష్ చేసుకోవడం అనే ఏకైక కాన్సెప్టు మీద సినిమాలు నడిపిద్దామని చూడడంతో అసలు ముప్పు వస్తోంది.

ఆర్‌ఆర్ఆర్ అనే ఒక్క సినిమా రిలీజుపై ఎన్ని పెద్ద  సినిమాల జాతకాలు ఆధారపడ్డాయో చూస్తే ఆశ్చర్యం వేయడం లేదూ! దానితో పోటీ పడితే నెగ్గుకు రాలేమన్న భయంతో అందరూ వెనక్కి తగ్గడం, తీరా చూస్తే ఆ సినిమాయే వేరే కారణాల వలన వెనక్కి తగ్గడంతో సంక్రాంతి రిలీజులపై ఆశ పెట్టుకున్న అనేక వర్గాల వారు నిరాశకు గురి కావడంతో పాటు, ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నారు కూడా.  దాని కారణంగా వెనక్కి నెట్టుకున్న పెద్ద సినిమాల వాళ్లకు ఎంత వడ్డీ నష్టం! దేన్నయినా ఒక టైముకి ప్లాను చేసిన తర్వాత అది జరగకపోతే తర్వాత కూడా తర్వాత అదే ఫలితం వస్తుందన్న నమ్మకం లేదు. ఈ లోపున ఆ థీమ్‌తో మరో చిన్న సినిమా వచ్చేయవచ్చు. హీరోకు యింకో సినిమా కారణంగా ఫ్లాప్ రావచ్చు. మధ్యలో ఏదైనా సంఘటన జరిగి, ప్రేక్షకుల మూడ్ మారవచ్చు. ఏదో ఒక విధంగా రిస్కు ఎదుర్కోవాల్సిందే!

పెద్ద సినిమాలు రావటం లేదు కాబట్టి, చిన్న సినిమాలకు ఫీల్డు డే అనీ, అవి వచ్చి దున్నేస్తాయనీ అనుకోవడానికి లేదు. ఎన్నో చిన్న సినిమాలు నిరుత్సాహ పరుస్తాయి. పెద్ద చేపల కారణంగా చిన్న చేపలు స్వాహా అయిపోతున్నాయి అనేది కొంతవరకే కరక్టు. చిన్న సినిమాల్లో కొన్ని మాత్రమే బాగా తయారవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం – వాటిపై తీసేవారితో సహా ఎవరికీ నమ్మకం లేకపోవడం! ప్రస్తుత పరిస్థితుల్లో అవి రిలీజు అవుతాయని, యిప్పుడున్న టిక్కెట్టు రేట్లు పెట్టి వాటిని చూడడానికి ఎవరైనా వస్తారనీ ఎవరూ గట్టిగా అనుకోరు. అందువలన పెట్టుబడి పెట్టేవాడు రాడు. పెట్టినా కోటి, కోటిన్నరలో తీసేయ్ అంటాడు. ఇక దర్శకుడే కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అన్నీ చూసుకోవలసి వస్తుంది. పారితోషికం పెద్దగా తీసుకోని కొత్త నటీనటులతో తీయాల్సి వస్తుంది. ఈ సినిమా హిట్టయితే తర్వాతి సినిమాలో మీకే ఛాన్సిస్తా, అప్పుడు మీకు రేటు పెంచుతా అంటూ మొహమాట పెట్టి మ్యూజిక్, కెమెరా, ఎడిటింగు వాళ్లను ఏర్పరచుకోవాలి. 

సెట్టింగులు లేకుండా, మంచి లొకేల్స్ లేకుండా, సాంకేతిక నైపుణ్యం లేకుండా అడుగడుగునా రాజీ పడుతూ సినిమా తీయాల్సి వస్తుంది. ఆ కారణంగానే సెక్స్‌నో, కామెడీనో, సస్పెన్స్‌నో నమ్ముకుని అతి చౌకగా సినిమా తీస్తున్నారు. కొత్తవాళ్లు కదా, రీషూట్ చేద్దామంటే షూటింగు దినాలు పెరిగితే నిర్మాత ఒప్పుకోడు. కథలో లోపాలున్నాయేమో ఎవర్నయినా అనుభవజ్ఞుణ్ని కథాచర్చల్లో కూర్చోబెడదామా అంటే అమ్మో డబ్బడుగుతాడని భయం. ఇలా చుట్టేసిన సినిమాను ఏ డిస్ట్రిబ్యూటరూ రిలీజు చేయడానికి ముందుకు రావటం లేదు. రిలీజు కాని సినిమాకు పనిచేసిన కళాకారులు, సాంకేతిక నిపుణుల బాధ వర్ణనాతీతం. ఏ కళకైనా మొదట కావలసినది ఆత్మానందం. తర్వాత యితరుల ముందు తన విద్య ప్రదర్శించి మెప్పు పొందడం. మెప్పు అరకొరగా వచ్చినా ఫర్వాలేదు కానీ తన ప్రదర్శన జనాలకు చేరాలనే ప్రతీవాడూ కోరుకుంటాడు. దానివలన సంపాదన అనేది తర్వాతి విషయం. ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాలు వెలిబుచ్చేవాడికి, యూట్యూబ్‌లో వీడియోలు చేసేవాడికి, షార్ట్ ఫిల్మ్‌స్‌లో పని చేసేవారికి డబ్బాశ వుందని అనగలమా? భావవ్యక్తీకరణ లేదా కళాప్రదర్శనే వారి లక్ష్యం.

కష్టపడి చేసిన సినిమా థియేటరు మొహం చూడకుండా నిర్మాత ఆఫీసులోనే పడి వుంటే ఏం లాభం? అది బయటకు వచ్చి, దాన్ని చూసి వేరెవరైనా పిలుస్తారేమోనని ఎన్నాళ్లు ఎదురు చూడాలి? ఎలాగోలా తంటాలు పడి థియేటర్లో రిలీజు చేసినా, ఫుల్ టిక్కెట్టు డబ్బిచ్చి చూడడానికి ప్రేక్షకులు రెడీ కావటం లేదు. అగ్రహీరోతో తీసిన భారీ సినిమా రెండు వారాల తర్వాత దొరికే రేటుకే, యీ సినిమాను చూడడం దండగ అనిపిస్తుందతనికి. ఇదొక విషవలయం. ప్రేక్షకులు చూడరని నిర్మాతలు డబ్బు పెట్టరు, డబ్బు యిబ్బందివలన, ఒక్కడే అన్ని పనులూ చేపట్టి, చౌకబారుగా సినిమా తీయడంతో క్వాలిటీ దెబ్బ తిని, ప్రేక్షకులు చూడరు. మధ్య తరగతి సినిమాలకు కూడా యిలాటి కష్టాలు కొద్దోగొప్పో వుంటున్నాయి. అవి రిలీజు కావడమూ కష్టంగానే వుంటోంది.

అందువలన ప్రతీ ఊళ్లోనూ ఎ, బి, సి క్లాసు థియేటర్లుండాలి. ఎసి, డిటిఎస్, యితర హంగులు లేకుండా సాధారణ ఏర్పాట్లతో వుండే సి క్లాసు థియేటరు అనుకుంటే దానిలో 5 కోట్ల బజెట్ లోపు సినిమాలను రిలీజు చేసి, దాని టిక్కెట్టు రేంజ్ తక్కువగానే పెట్టవచ్చు. అంటే దానిలోనూ వివిధ రకాలైన బెంచీ, కుర్చీ, బాల్కనీ క్లాసులు ఎలాగూ వుంటాయి. ఎ క్లాసు థియేటర్లంటే పెద్ద స్క్రీను, త్రిడి, డిటిఎస్, కావాలంటే పెర్‌ఫ్యూమ్ వంటి ఉన్నతస్థాయి సాంకేతికతతో బాటు సీట్లు విశాలంగా, తక్కువ సంఖ్యలో వుండవచ్చు. కాంటీను రేట్లు కూడా ఎక్కువగా వుండి సినిమాహాలుకి వెళ్లడం అంటే విలాసవంతమైన ఓ ఎక్స్‌పీరియన్స్ అనిపించే స్థాయిలో వుండాలి. వాటికి హెచ్చు రేట్లు పెట్టవచ్చు. 50 కోట్ల కంటె ఎక్కువ బజెట్‌తో తీసిన సినిమాలను వీటిలో విడుదల చేయవచ్చు. 5-50 కోట్ల మధ్య బజెట్‌లో తీసిన సినిమాలను బి కాటగిరీ థియేటర్లలో విడుదల చేయవచ్చు. వీటిలో సీట్లు, సౌకర్యాలు మధ్యస్తంగా వుంటాయి.

ఈ ఎ,బి,సి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు విడివిడిగా వుంటారని అనుకోవడానికి లేదు. మనం చూడండి, ఫ్యామిలీతో లేకుండా ఒక్కరమే వున్నామంటే ఏదో ‘దర్శిని’ తరహా సెల్ప్‌-సర్వీస్ హోటల్లో నిలబడి తినేస్తాం. ఫ్యామిలీతో ఉన్నామంటే నీట్‌గా వుండే ఉడిపి హోటల్ తరహా హోటల్‌కు వెళతాం. ఏ మేరేజ్ యానివర్శరీయో వుందంటే త్రీస్టార్ హోటల్‌లో బఫె తింటాం. అలాగే సినిమా స్థాయి బట్టి థియేటర్ను ఎంచుకుంటాం. ‘‘జాతిరత్నాలు’’ సినిమా చూడడానికి డిటిఎస్, 70 ఎంఎం స్క్రీన్ అక్కర్లేదనుకుంటాం. ఆర్‌ఆర్‌ఆర్‌ను చిన్న స్క్రీన్‌పై చూడాలనుకోం. రైల్లో వెళ్లినపుడు కూడా పగటిపూట నాలుగైదు గంటల ప్రయాణమైతే ఎసి ఛైర్ కార్ చాలనుకుంటాం. రాత్రి ప్రయాణం వుందంటే థర్డ్ ఎసి కొంటాం. రాత్రి ఆలస్యంగా పడుక్కునే అలవాటో, పొద్దున్నే లేచే అలవాటో ఉంటే కూర్చోవడానికి వీలుగా సెకండ్ ఎసి కొంటాం.

ఒకే వూళ్లో యీ ఎ,బి,సి థియేటర్లు లభ్యం కావాలి. ఊరి జనాభా బట్టి టిక్కెట్లు పెడితే అనర్థం. వి ఎపిక్ సినిమా థియేటరు అన్ని హంగులతో కడితే, అది రూరల్ ఏరియాలో వుందన్న కారణంగా తక్కువ రేటు టిక్కెట్టంటే థియేటరు బతికేదెలా? థియేటరు స్థాయిని బట్టి, టిక్కెట్టు రేటుండాలి. బి, సి థియేటర్లంటే చిన్నచూపు అక్కరలేదు. గుర్తుంచుకోండి, నేల టిక్కెట్టు వాళ్లే సినిమాలకు మహారాజ పోషకులు. రిపీట్ ఆడియన్స్ వాళ్లే. నిర్మాతలకు లాభాలు కురిపించేది, సూపర్ స్టార్లను, మెగాస్టార్లను తయారు చేసేది వాళ్లే. టైమ్‌పాస్ కానీ సమయాల్లో రేటు తక్కువగా వుంటే చూసిన సినిమా అయినా మళ్లీ చూస్తాం. బయట ఎండగా వుందని, సినిమా థియేటరుకి వెళ్లి ఏదో ఒక సినిమా చూసిన రోజులున్నాయి. ఇప్పుడైతే వంద గుణకారాలు, భాగహారాలు వేయాల్సి వస్తోంది, టిక్కెట్టు ధర పేలిపోతోంది కాబట్టి!

ఈ థియరీ బాగానే వుందనిపించినా యీ థియేటర్లకు ఫీడింగు ఎలా అన్నదే ప్రధాన సమస్య. ఎ క్లాసు సినిమాలు సగటున రెండు, రెండున్నర వారాలాడతాయనుకుంటే ఏడాదికి కనీసం 20 సినిమాలు రావాలి. సి క్లాసు సినిమాలు వారం ఆడతాయనుకుంటే 50 రావాలి. బి క్లాసు సినిమాలు 30, 40 రావాలి. టిక్కెటు రేట్లు తగ్గించి, థియేటర్లను అందుబాటులోకి తెస్తే బి, సి కేటగిరీ సినిమాలు తయారు కావడం కష్టం కాదు. కానీ ఎ క్లాసు సినిమాలు 20 తయారు కావడమే కష్టం. దానికి డిమాండు వున్న హీరోలు సహకరించాలి. ఏడాదికి 2, 3 సినిమాలు వేయడం అలవాటు చేసుకోవాలి. రిస్కు తీసుకోవడానికి భయపడి, ఏళ్ల తరబడి చెక్కుతూ కూర్చోకూడదు. ఈ కేటగిరీ పద్ధతి అమలై ఒకటి, రెండేళ్లు గడిస్తే బి కేటగిరీలోంచి కొందరు హీరోలు ఏ కేటగిరికీ వెళ్లి, ఆ 20 సంఖ్యను సాధ్యం చేయగలరు.

ఈ ప్రతిపాదనలో గుణదోషాలు సినీరంగంలో వున్నవారికి బాగా తెలుస్తాయి. ఒక సింపోజియం వంటిది పెట్టి అన్ని వర్గాల నుంచి మాట్లాడించి, ప్రతిపాదనలు క్రోడీకరించి, ప్రభుత్వాలతో మాట్లాడి అమలు చేయించుకోవాలి. ఎవరికి వారే బిగుసుకుని కూర్చుని, తమ సినిమా విడుదల సమయంలోనే నోరు విప్పి, తక్కిన సమయాల్లో లౌక్యం ప్రదర్శిస్తే సినీపరిశ్రమకు సంక్షోభం తప్పదు. నూటికి 90 సినిమాల ఫ్లాపు నుంచి నూటికి 75కి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుని దానిపై మేధోమథనం చేయాలి. అప్పుడు ఏదో ఒక మార్గం తోచకపోదు. సినిమా పరిశ్రమ బాగుండాలి, నలుగురికి ఉపాధి దొరకాలి, సినిమాలు బాగా ఆడి, దానిపై పన్నులతో తమకు ఆదాయం రావాలని ఏ ప్రభుత్వమైనా అనుకుంటుంది కాబట్టి, దాన్ని ఒప్పించడమూ కష్టం కాదు.

చివరగా, ఎ, బి, సి థియేటర్లు ఏవైనా సరే, భద్రత విషయంలో, కనీసావసరాల విషయంలో ఏ మాత్రం వెసులుబాటు యివ్వకూడదు. హైదరాబాదులో శివపార్వతి ఉదంతం కనువిప్పు కావాలి. భద్రత గురించి పట్టుబడితే కక్షసాధింపు ముద్ర వేయకూడదు. అధికారుల అవినీతి, ప్రభుత్వ ఉదాసీనత, ప్రేక్షకుల పాలిట గండంగా, అగ్నిగుండంగా పరిణమించకూడదు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?