Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: వృద్ధనారీ పతివ్రతా

ఎమ్బీయస్‌: వృద్ధనారీ పతివ్రతా

బాబుకి హఠాత్తుగా జ్ఞానోదయం అయింది - బిజెపి చాలా అన్యాయం చేసేస్తోందని. తెలుగు రాష్ట్రాలలో హైస్కూలు కుర్రాడికి కూడా రెండేళ్ల క్రితమే స్పష్టంగా తెలిసిపోయింది, మోదీ ఆంధ్రకు ఎంగిలి చెయ్యి కూడా విదల్చటం లేదని. రాజకీయ దురంధరులతో నిండిన టిడిపికి మాత్రం యిప్పుడే అర్థమైందట. బిజెపి ఏమీ యివ్వలేదని, యివ్వబోదని! అదేదో జోక్‌ ఉంది.

ఒకతను కిళ్లీ కొట్టు వద్ద అరటిపండు కొనబోయి, వద్దులే అని తిరిగి యిచ్చేసి చాక్లెట్టు తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. కొట్టువాడు డబ్బులో? అంటే అరటిపండు యిచ్చి దానికి బదులుగా చాక్లెట్టు తీసుకున్నాను కదయ్యా అంటాడు. పోనీ అరటిపండుకి డబ్బియ్యి అంటే అది తీసుకోలేదు కదా, వెనక్కి యిచ్చేసానుగా అంటాడు. అలాగే బిజెపి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల మధ్య ఆటలాడుతోంది. 

14వ ఫైనాన్సు కమిషన్‌ సిఫార్సు మేరకు హోదా ఎత్తేశాం అంటుంది. దానిలో అలా లేదు కదా అంటే అది వినబడనట్లు ప్యాకేజీ యిస్తున్నాం కదా అంటుంది. ప్యాకేజీలో యిన్ని షరతులేమిటి, పోనీ హోదాయే పడేయండి అంటే దానికి బదులుగానే ప్యాకేజి కదా అంటుంది. టిడిపి నాయకులు ఏమీ యివ్వలేదంటారు, బిజెపి వాళ్లు బోల్డు యిచ్చామంటారు. ఈ నాటకాలతో జనాలు విసిగిపోయినా బాబు కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను తనే నమ్మించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఐదేళ్ల టర్మ్‌ ఆఖరి దశకు వచ్చాక కళ్లు తెరిచి సత్యం కనుగొన్నట్లు నటిస్తున్నారు.

'బిజెపి నిజరూపం గురించి మీరు రెండు, మూడేళ్లగా చెపుతూనే ఉన్నా నేను కానుకోలేదు సుమా' అని జనాలకు చెప్పి మన్నించమనటం లేదు. ఇదే సరైన టైమింగ్‌ అన్న బిల్డప్‌ యిస్తూ అనుకూల మీడియా ఆయనను పొగిడేస్తోంది. ఆయన సేఫ్‌జోన్‌లోకి వచ్చేశారట. మంత్రుల రాజీనామాతో ప్రజలు ఉపశమనం పొందారట. హోదా గురించి ఆశలు రేకెత్తించినవారంతా దోషులేట. 

ఈయన్ను యీ మాత్రానికైనా లాక్కుని వచ్చిన ఘనత జగన్‌దే. లోపలి ఉద్దేశం ఏదైనా పైకి మాత్రం ప్రత్యేక హోదాయే శరణ్యం అనే పాట వదలకుండా పాడుతూ వచ్చాడు. హోదా ముగిసిన అధ్యాయం, చింపేసిన పేజీ అని టిడిపి, జనసేన కలిసి పాడుతూ వచ్చి ఫోకస్‌ అంతా ప్యాకేజీ మీదే పెట్టినా, జగన్‌ హోదా మంత్రం జపిస్తూనే ఉన్నాడు.

ఏ మాట కా మాట చెప్పాలంటే 2014 నుంచి కాంగ్రెసు హోదా కోసం ఉద్యమాలు చేస్తూ వచ్చింది కానీ జనం దృష్టిని ఆకర్షించలేకపోయింది. అసలే దాని హిస్టరీ అంతంతమాత్రం. చేసిందంతా చేసి, యిప్పుడు హోదా అంటే ఏం లాభం అని జనాలు యీసడించారు. జగన్‌ పాదయాత్రలో హోదా గురించి మాట్లాడినది జనాల్లోకి బాగా వెళ్లినట్లుంది. ప్యాకేజీలో రావల్సిందింతో తేల్చడానికి పవన్‌ కళ్యాణ్‌ నిజనిర్ధారణ కమిటీ వేసినప్పుడు కూడా సాక్షి టీవీ హోదా తప్ప మరో దాని గురించి మాట్లాడలేదు.

చివరకు కమిటీ నివేదిక ఏమైందో, ఏం చెప్పిందో సోదిలోకి లేకుండా పోయింది. హోదాయే బర్నింగ్‌ టాపిక్‌ అయిపోయింది. అది గ్రహించి తక్కిన టీవీ ఛానెల్సన్నీ హోదా పాటే ఎత్తుకున్నాయి. టీవీ మైకుల ముందు స్కూలు పిల్లల నుంచి సామాన్య జనాల దాకా హోదా వలన లాభాల గురించి ఝమాయించి మాట్లాడుతున్నారు.  కమిషన్ల కక్కుర్తితోనే బాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారని సామాన్యుడు కూడా అంటున్నాడు. ఇవన్నీ చూసి గతంలో హోదా గురించి అడిగితే జైలుకి పంపుతానన్న బాబు కూడా హోదా కావల్సిందే అనడం మొదలుపెట్టారు. హోదా అంత ముఖ్యమే అయితే నీతి ఆయోగ్‌ ముందు మీ ప్రభుత్వం హోదా గురించి ఎందుకు అడగలేదు? అని బిజెపి నాయకులు అడిగే ప్రశ్న ఆయన్ను చికాకు పెడుతోంది. 

హోదా గురించి ప్రజల్లో వచ్చిన అవగాహనే బాబును కార్యాచరణవైపు నెట్టింది. ఇక యిప్పుడు బిజెపిని తిట్టడంలో టిడిపి ముందుండాలనుకుంటోంది. ఇన్నాళ్లూ వెనకేసుకుని వచ్చారు కదా, యీ కటీఫ్‌ ఏదో ముందే చేయలేకపోయారా? అని తక్కిన పార్టీలు అంటే మొదటినుంచీ కలహం పెట్టుకోవాలా అని దబాయిస్తున్నారు. మొదటి నుంచీ అక్కరలేదు కానీ 2016 సెప్టెంబరులో స్పష్టంగా చెప్పాకైనా గోదాలోకి దిగి ఉంటే ఏదైనా ఫలితం ఉండేది కదా, నాలుగేళ్లయ్యాక యిప్పుడు బెదిరించి లాభమేమిటి అని అడిగితే దానికి సమాధానం లేదు. అసెంబ్లీ సీట్ల పెంపు లేదని కుండ బద్దలు కొట్టడంతోనే పేచీ పెట్టుకున్నారని బిజెపివారి అనుమానం ! కావచ్చు. పార్టీ నిండా ఫిరాయింపుదారులే. అందరికీ టిక్కెట్లు యివ్వడం అసాధ్యం. 

బాబుకి కేంద్రంలో పలుకుబడి సున్నా అని జనాలకు తెలిసిపోయింది. బాబు అమాయకంగా బిజెపిని నమ్మి కూర్చున్నారు అంటే తెలుగువాళ్లెవరూ నమ్మరు. ఈయనలో ఏదో లొసుగు ఉండబట్టే మోదీ ఆడిస్తున్నాడు, యీయన ఊరుకుంటున్నాడు అనే భావం బలపడుతోంది. ఓటింగుపై దీని ప్రభావం తప్పక ఉంటుంది, దీనికి తోడు తిరుగుబాటు అభ్యర్థులు కూడా రంగంలో ఉంటే మరీ కష్టం. అందువలన సీట్ల పెంపు అనేది అత్యవసరం. అది తీరకపోవడంతో బిజెపితో కయ్యం పెట్టుకున్నారంటున్నారు. 

బాబుకి హఠాత్తుగా విభజన విషయంలో బిజెపి పాత్ర గుర్తుకు వచ్చింది. లోకసభలో తలుపులు మూసేసిన ఘట్టంలో బిజెపికి కూడా పాలు ఉందంటున్నారు. కాంగ్రెసు, బిజెపి యిద్దరూ చేతులు కలపడంతోనే లోకసభలో, రాజ్యసభలో విభజన బిల్లు గట్టెక్కిందని చిన్నపిల్లలకు కూడా తెలిసినా, బాబు యిన్నాళ్లూ ఒట్టి కాంగ్రెసునే తిడుతూ వచ్చారు. ఇన్నాళ్లకు బిజెపి పాత్రను గుర్తించారు. బాబు స్వరం మార్చగానే ఆయన అనుకూల మీడియా కూడా బిజెపిని దుమ్మెత్తిపోయడం ప్రారంభించింది. మోదీ, బాబు యిద్దరూ కలిసి ఆంధ్రను ఉద్ధరించేస్తారని, ఎక్కడికో తీసుకుపోతారని కాన్వాస్‌ చేస్తూ వచ్చిన మీడియా యిప్పుడు మోదీ ఆంధ్రపై ఎంతలా కత్తి కట్టారో చెప్పసాగింది. వాళ్ల ప్రకారం - 'ఉమాభారతి జలవనరుల మంత్రిగా ఉన్నపుడు 'మీ బాబుపై మోదీకి కోపమా? పోలవరం ఫైళ్ల మీద క్వెరీలు వేస్తూండమని ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయే' అని ఆంధ్ర నాయకులను అడిగింది. 

గోధ్రా అల్లర్ల తర్వాత బాబు తనపై చేసిన వ్యాఖ్యలను మరవలేని మోదీ 2014లో వైసిపితో పొత్తు పెట్టుకుందామనుకున్నారు. తక్కిన బిజెపి నాయకులు ఆయనపై ఒత్తిడి తెచ్చి టిడిపితో పొత్తు పెట్టించారు. సింగపూరు మాజీ ప్రధాని లీ చనిపోయినపుడు బాబు అక్కడకు వెళదామనుకుంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి యివ్వలేదు. ప్రధానితో వెళ్లే బృందంలో బాబుకి చోటివ్వలేదు. వైజాగ్‌ సిఐఐ సమావేశాలకు అబుదాబీ యువరాజును బాబు పిలుద్దామంటే ఆ అభ్యర్థన విదేశాంగ శాఖ ద్వారా ప్రధాని కార్యాలయానికి వెళ్లి అక్కడే ఉండిపోయింది...' ఇలా! వీటిలో దేన్నీ సంశయించడానికి లేదు కానీ యివన్నీ యిప్పుడే చెపుతున్నారేం? అనే సందేహం వస్తోంది. 

2014 మేలో అధికారంలోకి రాగానే మోదీ ఆంధ్రకు ప్రత్యేక హోదా ప్రకటించలేదు. 9,10 షెడ్యూల్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విషయంలో కానీ, జలవనరుల పంపిణీ విషయంలో కానీ యిరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించలేదు. ఆంధ్రకు ఏదో చేస్తామని ప్రకటనలు చేయలేదు. వెంకయ్య నాయుడు ఒక్కరే ఏదో గ్యాస్‌ కొడుతూ వచ్చారు. అవేవీ అమల్లోకి రాలేదు. హోదా ప్రకటిస్తే అక్కడకు తరలి వెళ్లాలని అనుకున్న పారిశ్రామిక వేత్తలు యీ వ్యవహారాలన్నీ చూసి తటపటాయించారు. ఆంధ్రకు పెట్టుబడులు రాలలేదు. ఆంధ్రకు సంబంధించిన ఫైళ్లను పట్టించుకోవద్దని మోదీ తన మంత్రులకు సూచనప్రాయంగా తెలియచేశారని, ఎవరూ ఆయనను ఎదిరించే స్థితిలో లేరనీ నా బోటి సామాన్యుడికే 2014 చివరి కల్లా అర్థమై పోయింది. అలాటిది బాబుకి తెలియకుండా ఉంటుందా? కచ్చితంగా తెలుసు. అయినా ఆయన ప్రజల్ని వంచిస్తూ వచ్చారు. 

హోదా వస్తోందని కొన్నాళ్లు, ప్రత్యేక ప్యాకేజీ వస్తోందని కొన్నాళ్లూ అబద్ధాలు చెపుతూ వచ్చి, అమరావతి గురించి భ్రమలు కల్పిస్తూ వచ్చి ఆంధ్రకు పెట్టుబడులు తెద్దామని చూశారు. అసలు సరుంటూ ఉంటే మార్కెటింగు ఉపయోగపడుతుంది. సరుకే లేనప్పుడు మార్కెటింగ్‌ మేనేజరు ఏం చేయగలడు? ఈ పబ్లిసిటీ వలన పెట్టుబడులు రాలేదు కానీ స్థలాల ధరలు, జీవనవ్యయం పెరిగి సామాన్యుడి నడ్డి విరిగింది. కేంద్రం నుంచి ఏమీ రావటం లేదని తెలిసినా, యిన్నాళ్లూ జనాలను ఎందుకు మాయమాటల్లో ముంచారో సంజాయిషీ చెప్పవలసిన తరుణం వచ్చింది. కానీ చెప్పటం లేదు. మొన్న దాదాపు 2 లక్షల కోట్ల బజెట్‌లో కూడా కేంద్ర సాయాన్ని వేల కోట్లలో చూపించారు. కేంద్ర బజెట్‌లో అలాటి ఫిగర్‌ రిఫ్లెక్ట్‌ కావటం లేదు. మరి వీళ్లెలా వస్తుందనుకుంటున్నారు? ఇప్పటికీ బుకాయింపే!

బిజెపి నాయకులు అప్పుడప్పుడు ఆంధ్రకు లక్షల కోట్లు యిచ్చాం అని ప్రకటనలు చేస్తూన్నా, ఆంధ్ర ప్రజలెవ్వరూ బిజెపి ఆంధ్రకేదో ఒరగబెట్టిందని నమ్మలేదు. తిరుపతి వెంకన్న సాక్షిగా యిచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోలేదు, మొదటి సంవత్సరం లోటు పూడ్చలేదు, అక్కడి ఎసెంబ్లీ ఎన్నికల ముందు బిహార్‌కి నిధులు ప్రకటించాడు, కశ్మీర్‌కు ప్రకటించాడు, మన ఋణమాఫీని ఒప్పుకోలేదు కానీ తన పార్టీ పాలించే రాష్ట్రాల్లో ఒప్పుకుంటున్నాడు, మన ముఖ్యమంత్రికి ఎపాయింట్‌మెంటే యివ్వటం లేదు, ప్రశ్నిస్తానన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించనే లేదు ... యిలా అనుకుంటూనే వస్తున్నారు. అయినా బాబు అవేమీ విననట్లు నటిస్తూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా 'సూర్యుడు తూర్పున ఉదయించాడా? తెలియలేదుస్మీ' అని తెల్లబోయినట్లు నటిస్తున్నారు. సమైక్య ఉద్యమం నడిచినప్పుడు కాంగ్రెసు నాయకులూ యిలాటి వేషాలే వేశారు. 

విభజన తథ్యం అని దిల్లీలో ఖరారై పోయి, ఆ విషయం వాళ్లకు చెప్పినా అది తెలియనట్లు నటిస్తూ, తమ పనులు చక్కబెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెలుగు దేశం నాయకత్వం అదే పని చేస్తూ వచ్చింది. ఇన్నాళ్లకు ఏ కారణం చేతనో తెర చింపేశారు. ఇప్పుడు చూడండి - 'అమరావతి కోసం రైతులు వేల కోట్ల విలువైన భూములు యిచ్చారు. దానితో పోలిస్తే కేంద్రం యిచ్చే 2500 కోట్లు ఒక లెక్కా?' అని అడుగుతున్నారు. ఈ ముక్క ఎప్పుడో అనుకోవాల్సింది.

కేంద్రం సహకరించటం లేదని 2014 చివరికే గ్రహింపుకి వస్తే యీ రైతులకు యింతలేసి వాగ్దానాలు చేయకుండా, దశల వారీగా రాజధానిని ప్లాను చేయవలసింది. ఓ అయిదువేల ఎకరాలతో మొదలుపెట్టి కేంద్రం తీరు చూసి, ఆపై విస్తరించవలసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టవలసినదాన్ని పరిమితం చేసుకుని తక్కినది ప్రైవేటు రంగంలో విస్తరించుకోమన వలసినది. ప్రయివేటు పెట్టుబడిదారులైతే రైతులకు రెడీ క్యాష్‌ యిచ్చేవారేమో! బాబు అన్నీ నెత్తిన వేసుకుని, డిజైన్లు, మోడల్స్‌ అంటూ నాలుగేళ్లు గడిపేశారు. ఇప్పుడు బిజెపిని నమ్మి మోసపోయాం అంటూ రైతుల నెత్తిన చెంగు వేశారు. 

బిజెపి వాళ్లు స్పష్టంగా చెప్తున్నారు. దిల్లీ గిల్లీ జాన్తానై, నయా రాయపూర్‌ స్థాయికి కట్టుకుంటే చాలులే అని. అది పుష్కరంగా సాగుతూంది. మీదీ అంతే, మీకు ఎక్కువేమీ లేదు అని. ఆట్టే మాట్లాడితే మాకు ఎలాగూ అధికారం యివ్వరు కాబట్టి, అంతకంటె తక్కువే అని. అంటే అమరావతి హుళక్కే అన్నమాట. పోలవరం బాధ్యత నాది అని కేంద్రం అంటే కాదు, నాకివ్వండి అని బాబు దాన్ని చేతిలో తీసుకుని దాన్నీ వివాదాలమయం చేశారు. 2019 నాటికి అమరావతి లేదు, పోలవరం లేదు. అవి వస్తాయని ఆశ పెట్టుకుని, నిరాశ పడేవాళ్లు కోట్లలో ఉండవచ్చు. వాళ్లను ఫేస్‌ చేయడానికి బాబు యిప్పుడు టర్మ్‌ పూర్తి కాబోయే ఆఖరి సంవత్సరంలో పతివ్రత వేషం కట్టారు. ఈ వేషమూ అరకొరగా ఉంది. మంత్రి పదవులు వదిలేశారు కానీ ఎన్‌డిఏలోంచి బయటకు రావటం లేదు. మేం వచ్చేస్తే వైసిపి దూరదామని చూస్తోంది అంటున్నారు. దూరితే దూరావచ్చు.

విజయసాయి రెడ్డి 'ప్రత్యేక హోదా ఏ పార్టీ యిస్తానంటే వారికే మా మద్దతు' అంటూనే 'కాంగ్రెసు హామీ యిచ్చింది కదా, మరి దానికి యిస్తారా?' అంటే 'అబ్బే దాన్ని నమ్మం అంటున్నారు.' అంటే మిగిలింది బిజెపియే కదా. దానికే మద్దతిస్తాం అని బాహాటంగా చెప్పడమే కదా. కాంగ్రెసు పార్టీకి కనీసం ఒక మోరల్‌ ఆబ్లిగేషన్‌ ఉంది. రాజ్యసభలో ఆ పార్టీ ప్రధాని హామీ యిచ్చారు. బిజెపి ఏ విధమైన ఆబ్లిగేషనూ ఫీలవ్వటం లేదని నాలుగేళ్లగా తెలిసిపోయింది. అయినా వైసిపి బిజెపివైపే మొగ్గు చూపుతోంది. హోదా గురించి ఏ హామీ లేకుండా టిడిపి బయటకు రాగానే ఎన్‌డిఏలో వైసిపి చేరుతుందా? నాకు అనుమానమే! ప్రస్తుతం బిజెపి అంటే ఆంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. 

మోదీ అంటే జనాలు మోజు పడే రోజుల్లో దాన్ని ఎదిరించి, యీ రోజు వాళ్లతో కలవడం ఆత్మహత్యాసదృశం కదా! అలా కలవాలంటే హోదా ప్రకటన రాబట్టాలి. కానీ బిజెపి యిస్తుందా? ఇస్తే యిన్నాళ్లూ ఎందుకివ్వలేదు అనే ప్రశ్న ఎదురవుతుంది కదా! ఇచ్చేవాళ్లమే కానీ బాబు నిజాయితీగా వ్యవహరించలేదు కాబట్టి దాచిపెట్టాం, యిప్పుడు బయటకు తీశాం అనాలి. అంటారా? అన్నా అనవచ్చు. ఇప్పటికే బాబు క్రెడిబిలిటీని దెబ్బ తీసే విధంగా 'ఇచ్చిన నిధులు వేరేవాటికి మళ్లించారని, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు యివ్వలేదని' బిజెపి నాయకులు ప్రకటనలు యిస్తున్నారు. 

బిజెపి పట్ల టిడిపి, వైసిపి వ్యవహారం గందరగోళంగా ఉంది. హోదా హామీ యిస్తే బిజెపిని సమర్థిస్తాం అంటూన్న వైసిపి, దానిపై అవిశ్వాస తీర్మానం పెడతానంటోంది, నిరసనగా ఎంపీల చేత రాజీనామా చేయిస్తానంటోంది. 2014లో బిజెపి వలన మాకు ఒక్క ఓటు పడలేదు. స్థానిక ఎన్నికలలోనే మా సత్తా చూపాం. సాధారణ ఎన్నికలలో మా సొంతబలంతో నెగ్గాం అంటున్నారు. మరి అలాటప్పుడు యిన్నాళ్లూ బిజెపి ఆగడాలు సహించడం దేనికి? కేంద్రంలో అధికారంలో ఉన్నారనా? రేపు కాంగ్రెసు వస్తే దానికీ దాసోహమంటారా? కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండకపోతే రాష్ట్రానికి నిధులు రాలవా? అలా అయితే ప్రజలు ఏకంగా బిజెపినో, కాంగ్రెసునో ఎన్నుకోవచ్చు కదా! 

ప్రాంతీయ పార్టీలను ఎందుకు ఎన్నుకోవడం? బిజెపి మోసం చేసింది అంటూనే బాబు యిప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టనంటున్నారు. వైసిపి పెడతానంటోంది కానీ దానివలన ఫలితం ఉంటుందా వీగిపోతుంది కదా అని సన్నాయి నొక్కులు నొక్కేవారు గమనించవలసినది, అనేక అవిశ్వాస తీర్మానాలు వీగిపోతాయి కానీ పెడుతూనే ఉంటారు. ఎందుకు? నిరసన తెలపడానికి. ప్రభుత్వాన్ని మధ్యమధ్యలో దుమ్ము దులపడానికి. బాబు తన ఎంపీల రాజీనామా కూడా లేదంటున్నారు, ఎన్‌డిఏలోంచి బయటకు వస్తామనటం లేదు. ఇప్పటికైనా గట్టిగా స్టాండ్‌ తీసుకోకపోతే ఎలా? 

నిజానికి ఏడాది క్రితమే బాబు బిజెపిని ఎదిరించి బయటకు వచ్చి ఉంటే మూడో ఫ్రంట్‌ నాయకత్వం ఆయనకే దక్కేది. ఇప్పుడు కెసియార్‌ ఆ యినీషియేటివ్‌ తీసుకుని అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. బాబు యిప్పుడు మూడో ఫ్రంట్‌లో చేరతా అంటే కెసియార్‌ నాయకత్వాన్ని ఆమోదించినట్లే. అది ఆయనకు మింగుడు పడుతుందా? చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాననుకుంటూ బాబు ప్రతిదానికీ తటపటాయిస్తున్నారు. ఎన్టీయార్‌ సమైక్యవిధానాన్నే నమ్ముకుని ఉంటే తెలంగాణలో యిప్పటికీ పార్టీ వెలుగుతూ ఉండేది. రెండు కళ్ల సిద్ధాంతం అంటూ తెలంగాణ యూనిట్‌ పోగొట్టుకున్నారు. బిజెపి అడుగడుగునా పరాభవిస్తున్నా ధైర్యంగా ఎదిరించ లేకపోతున్నారు. 

మిత్రధర్మం పాటిస్తున్నా అంటూ తనను తానే నమ్మించుకున్నారు. మిత్రత్వం అనేది యిద్దరూ ఫీలవ్వాలి అనే మౌలిక సూత్రం మర్చిపోతే ఎలా? ఏడాది దాటినా ఎపాయింట్‌మెంట్‌ యివ్వనపుడు నిద్రపోయిన ఆత్మగౌరవం యిప్పుడే నిద్ర లేచిందంటే హాస్యాస్పదంగా లేదా? టిడిపి కేంద్ర కాబినెట్‌ లోంచి బయటకు వచ్చేస్తుంది అనే లీకులు యిచ్చిన తర్వాత కూడా మోదీ బాబు ఫోన్‌ రిసీవ్‌ చేసుకోలేదట. 7.30 నుంచి 10.30 దాకా ప్రయత్నించి విఫలమై అప్పుడు బాబు మంత్రుల రాజీనామా ప్రకటన విడుదల చేశారు. ఆ విషయం బాబే చెప్పారు. పూచికపుల్లంత విలువివ్వని బిజెపితో యిన్నాళ్లూ కాపురం చేసి యిప్పటికైనా విడాకులు యివ్వకుండా, సూటుకేసు సర్దుకుని నట్టింట్లో కూర్చుంటే జనం ఎలా నమ్ముతారు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?