Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: పిల్లలకు సినిమాలు వేరేగా తీయాలా?

ఎమ్బీయస్‌: పిల్లలకు సినిమాలు వేరేగా తీయాలా?

బాలల దినోత్సవం అనగానే బాలల చిత్రోత్సవాలు, ఏర్పాట్లు సరిగ్గా లేవని దర్శకనిర్మాతలు వాపోవడాలు, హాళ్లు నిండలేదని పెదవి విరుపులు, కొంతమంది పిల్లలు మాత్రం ఆనందించారనే  వార్తలు, ఎవార్డులిచ్చే ఫంక్షన్‌లో ఇలాటి పిల్లల సినిమాలు యింకా రావాలనే మంత్రుల ఉద్ఘాటనలు... అన్నీ షరా మామూలే. బాధపెట్టే విషయమేమిటంటే ఆ ఫంక్షన్లు ఏడాది కోసారి నిర్వహించే తంతుగా మారిపోతున్నాయి. పిల్లల సినిమా ఫెస్టివల్‌ వలన ప్రయోజనం సిద్ధించటం లేదు, ఆ సినిమాలను ఎవరూ చూడరు, ఎందుకంటే ఆ సినిమాలను మామూలు థియేటర్లలో రిలీజు చేయరు. టీవీల్లో చూపరు.

సినిమాల ద్వారా పిల్లలను అలరించాలనే లక్ష్యం నెరవేరాలంటే మెయిన్‌స్ట్రీమ్‌ సినిమాలో పిల్లల పాత్రలుండాలి. వాటికి ప్రాధాన్యత ఉండాలి. గతంలో అలా ఉండేది. ''పెళ్లిచేసి చూడు''లో (1952) హీరో 45 ని.ల తర్వాతనే తెరపైకి వస్తాడు. అప్పటిదాకా పిల్లలదే ఫీల్డ్‌డే. మూడు పాటలున్నాయి వాళ్లకి. 'బ్రహ్మయ్యా, ఓ బ్రహ్మయ్యా', 'అమ్మా నొప్పులే..' వంటి పాటలు  హీరో, హీరోయిన్‌ల పాటలతో సమానంగా హిట్టయ్యాయి. బాలతారలకు కూడా ఫాలోయింగ్‌ ఉండేది. ''పెళ్లి చేసి చూడు'', ''కన్యాశుల్కం'', ''తోడికోడళ్లు'' వంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన మాస్టర్‌ కుందుకు వీరాభిమానులు వుండేవారు. హీరోలతో పోల్చదగిన ఫాలోయింగ్‌ ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా మెయిన్‌స్ట్రీమ్‌ సినిమాల్లో పిల్లలకు ప్రాధాన్యత ఉన్న పాత్రలివ్వడం వలననే సాధ్యపడింది.

అచ్చగా పిల్లలతోనే తీసిన సినిమాలున్నాయి. కె ఎస్‌ ప్రకాశరావుగారు ''బూరెల మూకుడు'', ''కొంటె కిష్టయ్య'', ''రాజయోగం'' అనే మూడు సినిమాలు కలిపి 'బాలానందం' (1954) పేర సినిమాగా విడుదల చేశారు. మంచి ప్రయత్నమే కానీ ఆడలేదు. తర్వాత 1982 లో భానుమతి గారు ''భక్త ధృవ, మార్కండేయ, '' తీసిన సినిమా కూడా ఆడలేదు. కానీ పిల్లలు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు ఎన్నో బాక్సాఫీసు బద్దలు కొట్టాయి.

''ముద్దుబిడ్డ'' (1956), ''కృష్ణలీలలు'' (1959), ''లవకుశ'' (1963) ''రాము'' (1966), ''లేతమనసులు'' (1966), ''భక్త ప్రహ్లాద'' (1967), ''బాలరాజు కథ'' (1970), ''బాలమిత్రుల కథ'' (1972) ''పాపం పసివాడు''(1972), ''బాలభారతం'' (1972), ''యశోదాకృష్ణ'' (1975) ''స్నేహం'' (1977), యిలా ఎన్నో...! అనేక సినిమాల్లో పిల్లల నుద్దేశించి హీరో దేశభక్తి గీతాలు, నీతిబోధకమైన పాటలు పాడేవాడు. పిల్లలే సుశీల, జానకిల గొంతుతో అనేక హిట్‌ సాంగ్స్‌ పాడారు. అంతేకాదు, అనేక సాహసకృత్యాలు చేసి ప్రేక్షకుల చప్పట్లు అందుకునేవారు. ఒక్కోప్పుడు వాళ్లతో బాటు ఓ పెంపుడు కుక్క కూడా ఉండేది. 

ఇదంతా పాత కథ, యిప్పుడు ట్రెండ్‌ మారింది అనకండి. చిరంజీవి ''జగదేకవీరుడు- అతిలోక సుందరి'' (1990) సినిమాను కానీ, బాలకృష్ణ ''ఆదిత్య 369'' (1991)ను కానీ పిల్లల పాత్రలు లేకుండా ఊహించగలమా? వాటికి పూర్ణత్వం సిద్ధించేదా?   అందరం గ్రహించాల్సిందేమిటంటే, పిల్లలు ఆడియన్స్‌లో ప్రధానమైన భాగం. తెరపై జరిగేదాన్ని నిజమని భ్రమించి, పూర్తి స్థాయిలో ఆనందించేది వారే. చిన్నపుడు ఎన్టీయార్‌ తుపానులో గుఱ్ఱాన్ని అడవుల్లో ఉరుకులెత్తిస్తూ ఉంటే, బాలకృష్ణను దెయ్యం బంతాట ఆడుకుంటూ ఉంటే అదంతా నిజమని నమ్మేవాళ్లం. ''సర్వర్‌ సుందరం'' సినిమాలో అసలు సంగతి చూపించేశారు.

స్టూడియో ఫ్లోర్‌లోనే హీరో చెక్క గుఱ్ఱం మీద ఊగుతూంటే, వెనక్కాల అడవులూ, కొండలూ బ్యాక్‌ ప్రొజక్షన్‌లో వేస్తారని, స్టాండింగ్‌ ఫ్యాను సాయంతో ఆకులూ అవీ విసురుతారని, పైనుంచి షవర్‌ ద్వారా నీళ్లు కురిపిస్తారని తెలిసిపోయింది. అప్పణ్నుంచి ఉత్సాహం కాస్త తగ్గింది. ఆ తర్వాత వైర్‌వర్క్‌ అనే మాట వినబడసాగింది.  ఇంకాస్త తగ్గింది. ఇప్పుడైతే అన్నీ బ్లూమాట్‌, గ్రాఫిక్స్‌ అంటున్నారు. హీరో నిజంగా కష్టపడినా 'సిజి'లే అనిపించేస్తోంది. సినిమా నిర్మాణం గురించి తెలిసిన కొద్దీ ప్రేక్షకుడిగా సినిమాను ఎంజాయ్‌ చేయడం తగ్గిపోతూ వుంటుంది. ఇగ్నోరెన్స్‌ యీజ్‌ బ్లిస్‌ అనే మాట సినిమాల విషయంలో కరక్టు. 

బాల్యంలో యిగ్నోరెన్సు పతాకస్థాయిలో వుంటుంది కాబట్టి వాళ్లు సినిమాలను పూర్తి స్థాయిలో ఆనందించగలరు. వాళ్లకు సినిమా నచ్చితే, తలిదండ్రులను పదేపదే థియేటర్‌కు లాక్కు రాగలరు. తండ్రి ఏదైనా ఆర్ట్‌ ఫిల్మ్‌ చూద్దామని, తల్లి సెంటిమెంటల్‌ సినిమా చూద్దామనీ అనుకున్నా పిల్లలు చిరంజీవి సినిమా చూద్దామనుకుంటే, ఆ కుటుంబం చచ్చినట్లు చిరంజీవి సినిమా ఆడే థియేటర్‌ బాటే పడుతుంది. సినిమా అనే కాదు, పిల్లలు పంతం పడితే తలిదండ్రుల చేత ఏ వస్తువైనా కొనిపించగలరు, దేన్నయినా మాన్పించగలరు.

గతంలో అయితే పిల్లలు తలిదండ్రులకు భయపడేవారు. ఇప్పుడు యిద్దరు, ఒక్కో సందర్భంలో అయితే ఒక్కరే సంతానం కావడంతో పిల్లల్ని గారాబం చేయడం ఎక్కువైంది. వాళ్లు చెప్పినట్లు అమ్మా, నాన్నా అడుతున్నారు. చదువు తప్ప తక్కిన అన్ని విషయాలలో పిల్లల మాటే నెగ్గుతోంది. యాడ్‌ మేకర్స్‌ అది గమనించారు. ఈ రోజుల్లో ఏ ప్రోడక్ట్‌ నైైనా సరే యాడ్స్‌ను పిల్లలతో రూపొందిస్తున్నారు. ఇలాటి పరిస్థితుల్లో మెయిన్‌స్ట్రీమ్‌ సినిమాలో వాళ్లకు భాగం లేకుండా చేయడం ఎంత మూర్ఖత్వం!

పిల్లలకు ఫైట్లు చేసేవాళ్లు నచ్చినంతగా సెంటిమెంటల్‌గా, గంభీరంగా నటించేవాళ్లు నచ్చరు. జానపదాల ద్వారా పిల్లలను ఆకట్టుకున్న ఎన్టీయార్‌ తర్వాత, జేమ్స్‌ బాండ్‌, కౌబాయ్‌ పాత్రల ద్వారా కృష్ణ పిల్లల ఫేవరేట్‌ అయ్యారు. నాగేశ్వరరావు, జగ్గయ్య, శోభన్‌బాబు ఎంత హుందాయైన నటులైనా కావచ్చు, మహిళలకు ఫేవరేట్స్‌ కావచ్చు. కానీ పిల్లలకు కారు. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడంలో పిల్లల పాత్ర చాలా ఉంది. నాగార్జున ఎంత మంచి నటుడైనా కావచ్చు, కానీ పిల్లల ఫేవరేట్‌ కాదు. అందువలన అతని మార్కెట్‌ ఒక రేంజ్‌కి మించి వెళ్లదు. పిల్లలకు ఫేవరేట్‌ అయిన హీరో పాత్రను తీర్చిదిద్దేటప్పుడు అతన్ని ఒక పవర్‌ఫుల్‌ పిల్లవాడి పాత్రతో కనెక్ట్‌ చేయాలి.

అప్పుడే పిల్లలు మరింత హుషారు ఫీలవుతారు. కానీ యీ రోజుల్లో సినిమా అంతా హీరో చుట్టూ, మేల్‌ కమెడియన్ల చుట్టూ తిరుగుతోంది. హీరోయిన్‌కే వేల్యూ లేకుండా పోయింది. జనాభాలో 50 శాతం ఉన్న ఆడవాళ్లకే సినిమాలో ఐడెంటిఫై చేసుకునేందుకు పాత్ర లేకుండా పోయింది. ఇక పిల్లలను ఏం పట్టించుకుంటారు? ఈ రోజుల్లో వస్తున్న పిల్లల పాత్రలను కూడా ప్రేమ సన్నివేశాలలో రాయబారులుగా, లావుపాటి పిల్లలను కామెడీ కోసం వాడుకుంటున్నారు  తప్ప సెంటిమెంటు రంగరించిన మంచి పాత్రలు యివ్వటం లేదు.

''బాహుబలి'' వంటి రెండు పార్టుల భారీ సినిమాలో కూడా బలమైన బాలపాత్ర లేదు. హీరో చిన్నపుడు అంటూ కాస్త చూపించారంతే. నిజానికి ''బాహుబలి'' తర్వాత ప్రభాస్‌ హిల్లలకు నచ్చిన హీరో అయివుంటాడు. ఈనాటి పదేళ్ల లోపు పిల్లలు మరో పదేళ్ల పాటు ప్రభాస్‌ సినిమాలు మిస్‌ కాకుండా చూస్తారు. బాల్యంలో పడిన ముద్ర అంత బలంగా ఉంటుంది. ప్రభాస్‌కు తోడుగా సినిమాలో ఓ పిల్లవాడి పాత్ర పెట్టి వుంటే పిల్లలకు మరీ నచ్చేది. 

జానపదాలు, చారిత్రాత్మకాలు, పౌరాణికాలు అరుదుగా వస్తాయి. సాంఘికాలలో హాస్యపాత్రలుగా కాకుండా తెలివైన కుర్రాళ్లతో కంప్యూటర్‌ కుర్రాడు, గణిత మేధావి, బాల డిటెక్టివ్‌ వంటి పాత్రలు కూడా సృష్టిస్తే పిల్లలు ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుంటుంది. అచ్చగా పిల్లల కోసం తీసిన సినిమాలు రేపటి పౌరులకు చేరనే చేరవు. వాటి నుంచి వాళ్లు నేర్చుకునేదీ ఏమీ ఉండదు.

మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా దర్శకనిర్మాతలు పిల్లలకు కూడా ప్రాధాన్యత గల పాత్రలిస్తేనే కుటుంబాలు థియేటర్లకు తరలి వస్తాయి. పిల్లల చేత నటింపచేయడం కష్టమే. కానీ ఆ కష్టానికి సిద్ధపడితే నిర్మాతకూ లాభం, పిల్లలకూ లాభం. లేకపోతే పిల్లలు సినిమాల జోలికి వెళ్లడం మానేసి సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకుంటూ కూర్చుంటారు. పిల్లలతోనే పెద్దవాళ్ల కథను ''రామాయణం'' (1996)గా తీసి హిట్‌ చేసిన గుణశేఖర్‌ యిప్పుడు బాలతారకు ప్రాధాన్యం ఉన్న ప్రహ్లాద కథను ''హిరణ్యకశిప'' పేరుతో తీస్తున్నారు. అది మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాలలో పిల్లలను మళ్లీ లైమ్‌లైట్‌లోకి తీసుకురావచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?