cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ః కథ- క్రైస్తవం నిజంగా గొప్పదే!

ఎమ్బీయస్‍ః కథ-  క్రైస్తవం నిజంగా గొప్పదే!

పారిస్‍లో జహనాట్‍ అనే ధనికుడైన క్రైస్తవ వ్యాపారి వున్నాడు. తన లాగానే వస్త్రవ్యాపారి అయిన అబ్రహాం అనే యూదుడు అతనికి  మంచి స్నేహితుడు. అబ్రహాం వంటి నిజాయితీపరుడు, సద్గుణరాశి క్రైస్తవుడు కాకుండా అన్యమతాన్ని నమ్మి మరణానంతరం పరలోకంలో అవస్థలు పడతాడని జహనాట్‍ జాలిపడేవాడు. క్రైస్తవమతం ఎంత గొప్పదో మాటిమాటికి ప్రబోధిస్తూ దానిలో చేరమని హితబోధలు చేస్తూ వుండేవాడు. ‘‘దానిలో ఎంత మంచి వుండకపోతే అది నానాటికీ ప్రపంచమంతా వ్యాపిస్తోందంటావ్‍? అందుకైనా దాన్ని గొప్పతనాన్ని ఒప్పుకో’’ అనేవాడు.

అతనిపై గౌరవంతో అబ్రహాం అన్నీ వినేవాడు కానీ తను పుట్టి పెరిగిన మతాన్ని వదలవలసిన అవసరం ఏమీ కనబడటం లేదని చెప్పేవాడు. అయినా జహనాట్‍ తన ప్రయత్నం మానలేదు. చెప్తూనే వుండేవాడు. కొన్నాళ్లకు అబ్రహాం ‘‘జహనాట్‍, నీపై గౌరవం కొద్దీ నీ మాటలు వింటూ వచ్చాను. ఇప్పుడొక పని చేద్దామనుకుంటున్నాను. రోమ్‍ వెళ్లి నడిచే దేవుడుగా మీరంతా కొనియాడే పోప్‍ను, ఆయన అనుయాయూలను చూసి వస్తాను. వారి నడవడి గమనించి వారెంత పవిత్రమూర్తులో తేల్చుకుంటాను. అప్పుడు క్రైస్తవంలో చేరాలో లేదో నిర్ణయించుకుంటాను. ఒకవేళ నేను వద్దనుకుంటే నువ్వు ఆ పైన దాని గురించి ప్రస్తావించకూడదు.’’ అన్నాడు.

మిత్రుడు ఒక మెట్టు దిగివచ్చినందుకు మామూలుగా అయితే జహనాట్‍ సంతోషించి వుండాలి. కానీ రోమ్‍ వెళ్లి అక్కడి మతాధికారుల జీవనశైలి గమనిస్తాననడంతో అతని గుండెల్లో రాయి పడింది. ‘‘క్రైస్తవం గురించి తెలుసుకోవడానికి నువ్వు రోమ్‍ వెళ్లడం దేనికి? మతపరమైన సందేహాలేవైనా వుంటే మన పారిస్‍లో వున్న మతాధికారుల వద్దకు తీసుకెళతాను. వాళ్లు తీరుస్తారు. నీలాటి ధనిక వ్యాపారి రోమ్‍కు వెళ్లడం ప్రమాదకరం కూడా. ఎవరైనా దోచుకోవచ్చు’’ అంటూ నిరుత్సాహ పరిచాడు. అయినా అబ్రహాం రోమ్‍ వెళ్లి తీరతాననడంతో యిక ఆశలు విడిచాడు. అతని వద్ద క్రైస్తవమతం గురించి ప్రస్తావించడం మానాడు.

కానీ అబ్రహాం తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. అనుకున్న ప్రకారం రోమ్‍కు వెళ్లాడు. ఆ వూళ్లో యూదువ్యాపారులు అతనికి స్వాగతం పలికారు. తనెందుకు వచ్చానో చెప్పకుండా ఆ వూళ్లోనే వుండి పోప్‍ గురించి, కార్డినల్స్ గురించి, యితర మతపెద్దల గురించి వాకబు చేశాడు. ఇంకొన్ని విషయాలు తన తెలివితేటలతో గ్రహించాడు. మొత్తం మీద అతనికి అర్థమైనదేమిటంటే వారికి లేని దురలవాటు లేదు, మద్యపానం, స్త్రీవ్యామోహం, విపరీత ధనాశ అన్నీ వున్నాయి. 

శృంగారవిషయాల్లో వారు అసహజ వైఖరిలో కూడా ఆనందం పొందుతున్నారు. వారికి అత్యంత సన్నిహితులెవరంటే వేశ్యలు, అందమైన యువకులు. సన్యాసినులను కూడా వారు వదిలిపెట్టటం లేదు. ఈ విషయాల్లో ఒకరిపై మరొకరికి ఈర్ష్యాసూయలు మిక్కుటంగా వున్నాయి. వాళ్లకు దేవుడిపై భయమూ, భక్తి ఏమీ లేదు. తమ స్వార్థం కోసం క్రైస్తవుల రక్తం అమ్మడానికైనా తెగించే రకాలు వాళ్లు. కొన్నాళ్లు అదే వూళ్లో వుండి, యిక తెలుసుకోవలసినది ఏమీ లేదని అనిపించాక పారిస్‍కు తిరిగి వచ్చి తన స్నేహితుడికి కబురు పెట్టాడు.

గుండెలు పీచుపీచుమంటూండగా జహనాట్‍ అబ్రహాం వద్దకు వెళ్లి ‘‘హోలీ ఫాదర్‍ గురించి, కార్డినల్స్ గురించి నీ అభిప్రాయం ఏమిటి, మిత్రమా?’’ అని అడిగాడు. అబ్రహాం తను సేకరించిన సమాచారమంతా చెపుతూండగా అతను దిగాలు పడ్డాడు. ఇవన్నీ తనకు తెలియని విషయాలు కాదు కానీ స్నేహితుడికి కూడా తెలిసిపోయాయే అని దిగాలు పడ్డాడు. ‘‘ఇంతకీ ఏం తేల్చావ్‍?’’ అని అడిగాడు చివర్లో.

‘‘వీళ్ల జీవితాలు చూశాక నాకు ఒక విషయంలో గట్టి నమ్మకం కుదిరింది. ఇంతటి పాపాత్ములు మతపెద్దలుగా వున్నా కూడా క్రైస్తవం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందంటే దానిలో ఏదో ఒక మహిమ వుందనిపిస్తోంది. వీళ్ల దుష్కర్మలు పట్టించుకోకుండా ఎందరో యి మతంలో మారుతున్నారంటే క్రైస్తవదేవుడు చాలా శక్తివంతుడని నమ్ముతున్నాను. అందుకే ఆ మతంలోకి మారడానికి నిశ్చయించుకున్నాను.’’ అన్నాడు.

ఇది నిజంగా అన్న మాటో, వ్యంగ్యమో అర్థం కాక జహనాట్‍ కాస్సేపు కొట్టుమిట్టులాడాడు. బాప్టిజం ఎక్కడ చేయించుకోవాలి అని అతను అడిగినప్పుడు ఆనందాశ్చర్యాలతో తలమునకలయ్యాడు. ఆ హోలీ ఫాదర్‍ను, అతని అనుచరులను పరలోకంలో దేవుడు తప్పక దండిస్తాడో లేదో తెలియదు కానీ వారి కారణంగా క్రైస్తవం వ్యాప్తి చెందుతున్నందుకు సంతోషించాడు. (మూలం - బొకాచియో రాసిన డెకామెరాన్‍)

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×