Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం: రక్తసంబంధం (1984) - 2/2

హిందీ సినిమాకు వస్తే - డాక్టరు కూతురైన హీరోయిన్‌ ఆశా పరేఖ్‌ తన యింట్లో వుండగా ఓ పాట వినిపించింది. అది ఆ రోజు పిక్నిక్‌కు వెళ్లినపుడు వినిపించిన పాటే. అది తన యింట్లోనే వినిపించడంతో ఆశ్చర్యపడింది. ఎవరు పాడుతున్నారని వాకబు చేస్తే అతనో పేషంటు, కంటిచూపు సరిగ్గా లేదు. చీకట్లోనే వుంటాడట అని చెప్పారు హాస్పటల్‌ స్టాఫ్‌. ఆమె అశోక్‌ కుమార్‌ వద్దకు వెళ్లి  పాటను మెచ్చుకుంటూ మాట్లాడింది. 'నా సంగీతం నచ్చింది కానీ నా మొహం చూస్తే అది కూడా నచ్చడం మానేస్తుంది' అన్నాడు అశోక్‌ కుమార్‌. కానీ యీమె కాదంది. నేను ఒక అందమైన కళాకారుణ్ని చూస్తున్నాను అంది. తండ్రి వద్దకు వెళ్లి యితని కచ్చేరీ ఒకటి ఏర్పాటు చేద్దామంది. అతను ఒప్పుకున్నాడు. ఆ కచ్చేరీకి తలిదండ్రులను పిలిచాడు డాక్టర్‌. ఇతని పాట విని ముగ్ధులైపోయారు. అతను బెరుకు కొద్దీ చీకట్లో పాడాడు. చివర్లో హీరోయిన్‌ లైట్స్‌ వేసి, అతనెవరో అందరికీ చూపించింది. అతని అందవికారాన్ని పట్టించుకోకుండా అందరూ సంగీతాన్ని మెచ్చుకున్నారు. ముఖ్యంగా తండ్రి! 'అతనెవరో తెలుసా? అంటూ నీ కొడుకే సుమా' అని హింట్‌ చేశాడు డాక్టర్‌. తండ్రి గతుక్కుమన్నాడు. మర్నాడే డాక్టర్‌ క్లినిక్‌కి ఓ 50 వేలు పట్టుకొచ్చి ఆ గాయకుడికి నా బహుమతిగా యియ్యి అన్నాడు. 'అతను నీ కొడుకే నని గ్రహించినా, నీ తప్పు పదిమందిలో వొప్పుకోవన్నమాట' అన్నాడు డాక్టర్‌. ఎలా వొప్పుకుంటాను? అన్నాడు తండ్రి. సరే నీ ఖర్మ అనుకుని ఆ డబ్బు అశోక్‌కు యివ్వబోయాడు డాక్టర్‌. 

ఈ లోపున హీరోయిన్‌ తనపై గౌరవాన్ని అశోక్‌ కుమార్‌ ప్రేమగా పొరబడ్డాడు. ఆమె ప్రదీప్‌ కుమార్‌ గురించి ప్రేమగీతాలు పాడుకుంటే అవి తన గురించే అనుకున్నాడితను. అయితే ఓ రోజు ఆమె తన ప్రియుడితో చెప్పుకుంది - పోనీ కదాని జాలి చూపిస్తే యితను ప్రేమించాననుకుంటున్నాడు అని. అది చాటుగా విన్న అశోక్‌ మనసు విరిగింది. నాకు కావలసినది జాలి కాదు అనుకున్నాడు. కచ్చేరీ విజయంతో కొద్దిగా పెరిగిన ఆత్మవిశ్వాసం నశించింది. అదే సమయంలో డాక్టర్‌ యీ 50 వేలు పట్టుకొచ్చాడు. ఇచ్చింది  సొంత తండ్రి అని అర్థమై అతనికి కోపం వచ్చింది. ఆ రాత్రే తండ్రి గదికిి వెళ్లాడు. ''నా నోరు మూయించడానికి లంచమా? నన్ను సొంతం చేసుకోలేనప్పుడు ఎందుకీ డబ్బు?'' అన్నాడు. వాపసు యిచ్చేశాడు. ''నా తల్లి కూడా నీ లాటిదేనా? నా ప్రాణానికి ఆవిడెంత విలువ కడుతుందో చూస్తాను'' అంటూ ఆవిడ గదికి వెళ్లాడు. ఆవిడ తన గదిలో నిద్రపోతోంది. చూడగానే భక్తి, ప్రేమ కలిగి ఏమీ అడక్కుండా పాదాలకు నమస్కరించి వచ్చేశాడు. భార్యతో యితను  నిజం చెప్పేసి వుంటాడనుకుని తండ్రి భయపడి, తన యిమేజి పోయిందన్న భీతితో పిస్తోలుతో ఆత్మహత్య చేసుకోబోయాడు. అశోక్‌ కుమార్‌ తిరిగి వచ్చి ఆవిడకు చెప్పలేదులే అని భరోసా చెప్పి వెళ్లిపోతూ వుండగా యింతలో తల్లికి మెలకువ వచ్చి వీళ్ల గదిలోకి వచ్చింది. 'అతని సంగీతాన్ని మెచ్చి డబ్బిస్తే తీసుకోవడం లేదు చూడు' అని ఫిర్యాదు చేశాడు తండ్రి. ఆమె 'నిన్ను చూస్తే నాకు పుత్రవాత్సల్యం లుగుతోంది. తల్లి యిచ్చే డబ్బు వద్దనద్దు' అంటూ ఆ 50 వేలు అతని చేతిలో పెట్టింది. అతను సరేనంటూ తీసుకుని 'తల్లికి పాదపూజ' అంటూ అతను మళ్లీ ఆ డబ్బును తల్లి పాదాల వద్ద పెట్టేశాడు. 'పోనీ మా యింట్లో వుండు' అందామె. ఒప్పుకున్నాడు.

తెలుగులో పెద్దకొడుకు కృష్ణ అర్ధరాత్రి తన తల్లిని చూడడానికి వెళ్లాడు. చాటుగా చూసి వచ్చేస్తూంటే దొంగ అనుకుని కొట్టారు. తప్పించుకుని వచ్చేశాడు. ఈ మధ్యలోనే అతన్ని చూసి రెండో కొడుకు భయపడ్డాడు, నానా రభసా చేశాడు. పెద్దకొడుక్కి అది చూడముచ్చటగా వుంది. ఇంటికి వచ్చి తలచుకుని నవ్వుకున్నాడు. రాత్రి తల్లిని తనివితీరా చూడలేకపోయాననే కొరతతో ఆమె ఎప్పుడూ వెళ్లే గుడికి వెళ్లి చాటుగా తల్లిని చూశాడు. ముసుగు వేసుకుని అక్కడి ముష్టివాళ్లతో బాటు కూర్చుని ఆమెను తనివితీరా చూశాడు. తల్లి అతన్ని గమనించింది. ఎవరో తెలియదు కానీ చూడగానే కన్న పేగు కదలి ఆరాట పడింది. ఇంటికి వచ్చి భర్తతో ఆ విషయం చెప్పింది. హిందీ వెర్షన్‌లో పెద్ద కొడుక్కి సంగీతం ఒకటే వచ్చు కానీ తెలుగు వెర్షన్‌లో సంగీతంతో బాటు చిత్రలేఖనం కూడా వచ్చు. అతనిలో ఆత్మవిశ్వాసం నింపడానికి అతని బొమ్మల ఎగ్జిబిషన్‌ పెట్టింది హీరోయిన్‌. చూడడానికి తండ్రి కృష్ణ వచ్చాడు. బొమ్మలు బాగున్నాయి, ఆర్టిస్ట్‌ ఎవరన్నాడు. 'ఓ అనాకారి' అంది హీరోయిన్‌. తన పెద్దకొడుకు బతికి వున్నాడా అని తండ్రికి అనుమానం తగిలింది. పైగా గుడి వద్ద సంఘటన గురించి భార్య చెప్పింది. నిజానిజాలు తెలుసుకోవాలని పాతికేళ్ల తర్వాత పాతస్నేహితుడైన డాక్టర్ని కలిసి నిలదీశాడు. డాక్టరు ఇతను కసిదీరా తిట్టి జరిగినది చెప్పేశాడు. ''వాడి బాగోగులు నువ్వు చూసుకో. ఖఱ్చు నాది. ఇదిగో బ్లాంక్‌ చెక్‌ అన్నాడు.'' అన్నాడు తండ్రి. 

సంగతంతా చెప్పి డాక్టరు దాన్ని పెద్దకొడుక్కి యిచ్చాడు. అతను వెళ్లి తండ్రిని నిలదీశాడు - ''నన్నెందుకు చంపాలని చూశావ్‌? నువ్వూ అనాకారివే కదా. నువ్వు పుట్టగానే నీ తండ్రి నిన్ను ఏ చెత్తకుప్పలోనే ఎందుకు పారేయలేదు? ఎందుకంటే అతను బీదవాడు. కానీ నా తండ్రికి ఇనుపగుండె, ఇనుపపెట్టె వున్నాయి. అందుకే నా కర్మ యిలా కాలింది.'' అని  నిందించాడు. తండ్రి మొహం ఎత్తుకోలేక పోయాడు. నన్ను బహిరంగంగా కొడుకుగా అంగీకరించే ధైర్యం నీకు లేదు, అంగీకరిస్తే నువ్వు చిన్నప్పుడు వదిలిపెట్టేశావని ఒప్పుకోవాల్సి వస్తుంది. నాకు నీ ఆమోదం కావాలి తప్ప డబ్బు కాదు అంటూ చెక్‌ టేబుల్‌ మీద పడేశాడు. ఇంతలో రెండో కొడుకు ఆ గదిలోకి వచ్చాడు. పెద్ద కొడుకు చాటుగా దాక్కున్నాడు. రెండో వాడు వచ్చి 'హోటల్‌కు డబ్బు కావాలి. అడుగుదామనుకుంటే నువ్వే బ్లాంక్‌ చెక్‌ రెడీగా పెట్టావ్‌' అంటూ దాన్ని పట్టుకుపోయాడు. 'చూశారా వాడికే చెక్కు తీసుకునే అర్హత వుంది.' అన్నాడు పెద్దకొడుకు. అతని త్యాగబుద్ధి చూసి తండ్రి మురిశాడు. 'నా తమ్ముడు అమాయకుడు. అవసరమైతే వాణ్ని నేను కాపాడతాను' అన్నాడు పెద్దకొడుకు. తండ్రి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 'నీ గురించి అందరికంటె ముందు నీ తల్లికి సంజాయిషీ చెప్పుకోవాలి. సమయం చూసి నీ ఉనికి గురించి మీ అమ్మకు చెపుతా'' అని తండ్రి మాటిచ్చాడు. పెద్దకొడుకు సంతోషంతో తిరిగి డాక్టరు యింటికి వెళ్లిపోయాడు.  

కథ యిక్కడికి వచ్చి ఆగింది కదా. దీన్ని కంచికి తీసుకుని వచ్చినది రెండో కొడుకు ఫ్రెండ్స్‌. హిందీ వెర్షన్‌లో ఏమవుతుందంటే హోటల్‌ మేనేజర్‌, డాన్సర్‌ కలిసి కుట్రపన్నారు. నీ వల్లనే నాకు గర్భం వచ్చిందని రెండో కొడుకుని బెదిరించి, నాలుగు లక్షలు యిమ్మంది డాన్సర్‌. అతను యింట్లోంచి దొంగిలించి పట్టుకుపోతూ వుంటే యింట్లో ఆశ్రయం పొందుతున్న అశోక్‌కుమార్‌ అతన్ని పట్టుకున్నాడు. తండ్రి రెండో కొడుకుని తిట్టి యింట్లోంచి పొమ్మన్నాడు. తల్లికి, రెండో కొడుకు అశోక్‌ కుమార్‌పై కోపం వచ్చింది.  కానీ త్వరలోనే అతనికి తన స్నేహితుల కుట్ర తెలిసింది. వాళ్లని దండించబోతే వాళ్లే యితన్ని బందీచేసి నాలుగు లక్షలు యిమ్మనమని తండ్రికి కబురంపారు.

తెలుగులో గర్భాల గోల లేదు కానీ, విలన్‌లు హోటల్‌లో అండర్‌గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్‌ స్మగ్లర్ల సమావేశం ఏర్పాటు చేసి, అందర్నీ కాల్చేసి వాళ్ల బంగారం లాక్కున్నారు. అనుకోకుండా అది చూసిన రెండో కొడుకు వాళ్లను తిడితే హిందీలో లాగానే బంధించేసి తండ్రిని డబ్బు పట్టుకురమ్మన్నారు. హిందీలో తల్లి అతన్ని ఆపార్థం చేసుకుని తిట్టింది. అప్పుడు డాక్టరు తల్లికి యితనెవరో చెప్పాడు. ఆమె బాధపడింది. రెండో కొడుకుని విడిపించడమెలా అని అందరూ సందిగ్ధంలో పడినప్పుడు పెద్దకొడుకు తను వెళ్లి తమ్ముణ్ని, డబ్బునీ రక్షించబోయాడు. తెలుగు సినిమాలో వద్దని తండ్రి అడ్డుపడితే అతనికి స్పృహ పోగొట్టి, అతని వేషంలో (పోలిక ఒకటే కాబట్టి) విలన్ల దగ్గరకు వెళ్లాడు. చివరకు తమ్ముడు రక్షింపబడ్డాడు కానీ అన్నగారు విలన్ల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఒక ఓదార్పు ఏమిటంటే తండ్రి చివరిలో పశ్చాత్తాపపడి యితను ఫలానా అని అందరికీ చెప్పేయడం, పెద్దకొడుకు తల్లి వొడిలో కనుమూయడం జరుగుతుంది. రెండో కొడుక్కి హీరోయిన్‌తో పెళ్లవుతుంది.

ఇదీ ఒక అభాగ్యుడి కథ. మనం సాధారణంగా గుణానికంటె రూపానికి ఎక్కువ ప్రాధాన్యం యిస్తాం. అందమైన వాళ్లకి వుండే ఎడ్వాంటేజెస్‌ అందవికారమైనవాళ్లకు వుండవు. కానీ వాళ్లకు  యితరమైన కళలు వుంటాయి. వారిని ఆదరిస్తే ఆ కళలు వెలుగులోకి వస్తాయి. ఈ విషయాన్నే మనసుకు హత్తుకునేట్లు చెప్పారు యీ సినిమాలో. నాగభూషణం ''బికారి రాముడు'' అనే నాటకం, సినిమా కూడా యిలాటి థీమ్‌ మీదే తయారైంది. (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?