Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం: రాముని మించిన రాముడు- 2

ఇక తెలుగులో పరిస్థితి చూద్దాం. హిందీలో మేజర్‌ భార్యకు అనారోగ్యమైతే తెలుగులో తల్లికి అనారోగ్యం. ఇక్కడ అనుకోని షాక్‌. చనిపోతున్న మేజర్‌ తల్లి గురించి చెప్పాడు కానీ భార్య గురించి చెప్పలేదు. హిందీలో అయితే నా భార్యను వదినగా చూసుకో అని చెప్పాడు. కానీ యిక్కడ నా స్థానంలో వుండి తల్లిని సేవించుకో అని చెప్పాడు. భార్య సంగతి తెలియక ఒప్పుకున్నాడితను. నిజానికి మేజర్‌ భార్య వేరెవరో కాదు, డాక్టర్‌ రాముని గతంలో ప్రేమించిన వాణిశ్రీయే! ౖ పెళ్లయ్యాక ఫస్ట్‌నైట్‌ నాడే యుద్ధంలోకి రమ్మనమని కబురు రావడంతో మేజర్‌ ఆమెతో సంసారం చేయకుండానే ఆర్మీకి వెళ్లిపోయాడు. ఇది రామూ ఎదురు చూడని సంఘటన. నిజానికి జరిగినదేమిటంటే డాక్టర్‌ ఆర్మీలోకి వెళ్లిపోయాక హీరోయిన్‌ ఆత్మహత్య చేసుకోబోయింది. ఈ మేజర్‌ ఆమెను కాపాడాడు. తండ్రి బాధ చూడలేక యీమె మేజర్‌ను పెళ్లాడడానికి ఒప్పుకుంది. తండ్రి పోయాడు. మేజర్‌తో యీమె వివాహం సంపూర్ణం కాలేదు. ఇంతలోనే అతని మృతి.  అతని స్థానంలో వచ్చిన డాక్టర్‌ రామూ యీమెతో శయనించకుండా ఆమె పాలలో నిద్రమాత్ర వేసి ఆమెను నిద్రపుచ్చుతూ ఆమె శీలం, తన శీలం కాపాడుకుంటూ వస్తున్నాడు. 

ఈ పరిస్థితిలో రాముకి కూడా ఓ జోడీ కావాలి కదా. ఆ పాత్ర వేసినది శ్రీ విద్య. ఆమె ఒక పేదరాలు. తల్లికి అనారోగ్యం. ఆమెకు ఆపరేషన్‌లు ఫ్రీగా చేయడమే కాక, మందులు కూడా ఫ్రీగా యిస్తూ వుంటాడు డాక్టర్‌. అంతే తప్ప వాళ్లిద్దరి మధ్యా ప్రేమ సన్నివేశాలు లేవు యిప్పటిదాకా. మేజర్‌గా నటిస్తూ ఓ క్లబ్‌కి వెళ్లినపుడు అక్కడ యీమె డాన్సర్‌గా కనబడుతుంది. డాన్సు తర్వాత రివాజు ప్రకారం క్లబ్బు మేనేజర్‌, అనుచరుడు ఈమెను రేప్‌ చేయబోతారు. ఎన్టీయార్‌ వెళ్లి వాళ్లను చావగొడతాడు. మాస్‌ హీరో కాబట్టి ఎన్టీయార్‌కి యిది తప్పదుకానీ హిందీలో రొమాంటిక్‌ హీరో దేవ్‌ ఆనంద్‌కి యిలాటి బాధ లేదు. అతనిదంతా ఎమోషనల్‌ డ్రామా. 

మేజర్‌ వేషంలో వున్న దేవ్‌ నందాను తీసుకుని గుడికి వెళ్లాడు. అది సాధన చూసింది. అపార్థం చేసుకోవడానికి యింతకంటె మంచి సందర్భం యింకేముంటుంది? ఇంటికి వెళ్లిపోవడానికి పెట్టె సర్దుకుంది. ఆనంద్‌ పరుగుపరుగున వెళ్లి అసలు విషయం చెప్పాడు. కాస్త ఆలస్యంగా చెప్పడంతో నమ్మబుద్ధిగా తోచలేదు సాధనకు. తన ఇంటికి వెళ్లిపోయింది. ఇవతల మేజర్‌ భార్య నిలదీసింది. నువ్వు మారిపోయావంది. విసుగెత్తిన ఆనంద్‌ 'ఆ మేజర్‌ వర్మ చనిపోయాడనుకో' అన్నాడు. తల్లితో కూడా 'నీ కొడుకు చనిపోయాడనుకో' అన్నాడు. వేరే అమ్మాయితో ప్రేమలో పడి యిలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు వాళ్లు.

తెలుగు సినిమాలో డాక్టరు వాణిశ్రీ పాలల్లో ఎప్పటిలాగానే నిద్రమాత్ర వేయబోయాడు కానీ అవేళ ఎవరో దానిలో భంగు కలిపారు. ఆమె చెలరేగి మీద పడబోయింది. ఓ కిటికీ పగలకొట్టింది. హడావుడిగా దగ్గరకు వెళ్లిన తల్లికి గాజుపెంకు గుచ్చుకుంది. డాక్టర్‌ కాబట్టి తనే ఆపరేషన్‌ చేశాడు. అవసరమైతే రక్తం యిచ్చాడు. ఇక వాణిశ్రీకి అనుమానం వచ్చేసింది. నువ్వెరని నిలదీసింది. తన భర్త పోయాడని తెలిశాక వితంతువుగా బతుకుదామనుకుంది. ముసలావిడ బతికున్నంతకాలం ఆవిడకోసం యిద్దరం నటిద్దాం అన్నాడు రాము. 'లేడనుకున్న డాక్టర్‌ వున్నాడు. ఉన్నాడనుకున్న మేజర్‌ లేడు' అని నిట్టూర్చింది వాణిశ్రీ, ఈ విధంగా తెలుగు సినిమాలో బోల్డు డ్రామా కలిపారు. మేజర్‌ భార్య డాక్టర్‌ పాత ప్రియురాలు కావడం వలన డ్రామా పండింది. కారెక్టర్‌ ఎలివేట్‌ అయింది. 

మళ్లీ హిందీ సినిమాకు వస్తే - సినిమా మిలటరీవాళ్లు యుద్ధంలో ఓ పట్టాన పోరు కదా. మన మేజర్‌ వర్మ కూడా బతికి వచ్చాడు. యుద్దఖైదీగా పట్టుబడి కాలు పోగొట్టుకుని వూళ్లోకి దిగాడు. కుంటివాడై పోయానన్న ఆత్మన్యూనతతో వస్తున్న మేజర్‌ను ఓ ఫ్రెండ్‌ చూసి ఆశ్చర్యపడ్డాడు. నీ స్థానంలో వచ్చినవాడు నీ భార్యకు మొగుడిగా మసలుతున్నాడే అన్నాడు. మేజర్‌కు కోపం వచ్చింది. ఆనంద్‌ను చంపబోయాడు. ఇంత నమ్మకద్రోహమా? అన్నాడు.  ఆనంద్‌ విషయాలు వివరించాడు. కావలిస్తే డాక్టరు నడుగు అన్నాడు. అప్పుడు మేజర్‌లో పశ్చాత్తాపం మొదలైంది. నా భార్య నన్ను ఆదరించదు. నువ్వే ఆమెను పెళ్లిచేసుకో అని బతిమాలాడు. అతనిలో వున్న ఆత్మన్యూనతను పోగొట్టడానికి ఆనంద్‌ అతన్ని గుడికి రమ్మన్నాడు. నందాను వెంటపెట్టుకుని వచ్చాడు. పనిలో పనిగా తన ప్రేయసి సాధనను కూడా రమ్మన్నాడు. నందాతో 'ఏదైనా ప్రమాదంలో నీ భర్త అవిటివాడైతే ఏం చేస్తావ'ని అడిగాడు. ఆమె శరీరం కంటె ఆత్మ ముఖ్యమంది. అది విని సంతృప్తి పడిన మేజర్‌ భార్యను అక్కున చేర్చుకున్నాడు. అపార్థాలు తొలగిపోయాయి. మేజర్‌ భార్య కలిశారు. ఆనంద్‌ ప్రేయసి ఒక్కటయ్యారు. 

తెలుగులో యింత సింపుల్‌గా ముగించలేదు. అక్కడా మేజర్‌ బతికి కుంటికాలుతో వచ్చాడు. దానికి ముందు హిందీలో గుడి సీనులాగ తెలుగులో శ్రీ విద్య తల్లి డాక్టర్‌ను, మేజర్‌ భార్యతో కలిసి చూసింది. అపోహ పడింది. అప్పుడు డాక్టర్‌ తను మేజర్‌ని కానని చెప్పాడు. వాళ్లు సందేహిస్తూ వుంటే డాక్టర్‌గా వాళ్లకు చేసినవన్నీ గుర్తు చేశాడు. ఇతను డాక్టరన్నమాట వాళ్లకు రూఢి అయింది. శ్రీవిద్య యితన్ని ప్రేమించింది. తన పాతప్రేయసికి పెళ్లయిపోయింది కాబట్టి ఆమెని మర్చిపోయి యీమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడితను. మేజర్‌ యింట్లో తల్లి అన్నదానం చేస్తానంది. దానికి మేజర్‌ ముసుగు వేసుకుని వచ్చాడు. తన కళ్లెదురుగా డాక్టరు, తన భార్య వాణిశ్రీ అన్యోన్యంగా నటించడం చూసి అపోహపడ్డాడు. హిందీలో లాగే డాక్టర్‌ను చంపబోయాడు. ఆ టైముకి కుక్క అడ్డుపడింది. భార్య నిలదీసింది. యుద్ధంలో బతికి వచ్చిన తర్వాత భార్య సంగతి మరిచిపోయారేం అంటూ నిలదీసింది. అపోహలు తొలగిపోయాయి కాబట్టి సినిమా అయిపోవచ్చు కానీ యిక మేజర్‌ తల్లి పై ఫోకస్‌ పెట్టారు. కొడుకు కుంటివాడు కావడం ఆమె తట్టుకోలేదు అన్న పాయింటుపై కథ నడిపారు. మేజర్‌ను శ్రీవిద్య యింట్లో దాచి డాక్టర్‌ ఓ నాటకం ఆడాడు. తన కాలు విరిగినట్లుగా వచ్చాడు. అప్పుడు 'నీ తల్లి నిన్ను అవిటివాడుగా చూడలేదు. నేను చచ్చిపోతా ' అని వాణిశ్రీ అంది. అది విని తల్లి 'కాలు లేకపోయినా ఫర్వాలేదు, ఎంతైనా నా కొడుకేగా' అంది. అప్పుడు డాక్టరు నేను ఫలానా, నీ కొడుక్కి ఫలానా విధంగా జరిగింది అని చెప్పి ఆమెను శ్రీవిద్య యింటికి తీసుకెళ్లాడు. అక్కడ విలన్లు ఆమెను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూంటే మన మేజర్‌ ఒక కాలుతోనే వాళ్లతో ఫైట్‌ చేస్తున్నాడు. డాక్టర్‌గారు కూడా చేరారు. ఒకరికి బదులు యిద్దరు ఎన్టీయార్‌లు ప్రేక్షకులకు కనువిందుగా ఫైట్‌ చేశారు. సీదాసాదాగా సాగిపోయే హిందీ సినిమా కథను తీసుకుని ఈ విధంగా మలుపులు పెట్టి మనవాళ్లు చక్కగా యింప్రోవైజ్‌ చేశారు. (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?