Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌: దిలీప్‌ కుమార్‌, వైజయంతిమాల -2

వైజయంతిమాల దిలీప్‌ సినిమానుండి వెళ్లిపోయిన విషయం చెప్పాను కదా, ఇప్పుడు మరో సినిమాలో యింకొకరి స్థానంలో వచ్చిన సంగతి చెబుతాను. ఆ సినిమా పేరు ''నయా దౌర్‌'' (1957) యంత్రం మనిషికి సహాయకారిగా వుండాలి తప్ప, అతన్ని స్థానంలో వచ్చేసి, అతని పొట్టకొట్టకూడదనే నీతి చెపుతుంది సినిమా కథ. ఓ జట్కావాడు రెండూళ్ల మధ్య బండి నడుపుకుంటూ  వుంటాడు.ఆ వూరి జమీందారు బస్సు ఏర్పాటు చేస్తాడు. అది రావడంతో జనమంతా బస్సు ఎక్కుతారు. వీళ్ల ఉపాధి పోతుంది. ఇదేం ఘోరమని అడగడానికి వెళ్లిన జట్కావాడితో జమీందారు పందెం వేస్తాడు. బస్సు టైముతో సమానంగా జట్కాతో ఊరు చేర్చగలిగితే బస్సు సర్వీసు రద్దు చేస్తానని. దానికోసం అడ్డదారిలో జట్కా వెళ్లగలిగేట్లా ఓ దారి, ఓ వంతెన కట్టవలసి వస్తాయి. జట్కావాడు, అతని ప్రేయసి కలిసి రోడ్డు మొదలెడతారు. క్రమంగా అందరూ కలిసి వస్తారు. మధ్యలో ఓ ప్రేమ త్రికోణం. జట్కావాడి స్నేహితుడు అసూయతో అతనికి ద్రోహం తలపెడతాడు. పోటీ రోజున జట్కావాడు గెలుస్తాడు. జమీందారు తన ఓటమి అంగీకరించి బస్సు తీసేస్తాడు. 

అఖ్తర్‌ మీర్జా యీ కథ రాసి సినీ ప్రముఖులకు చూపిస్తే 'డాక్యుమెంటరీలా వుంది' అంటూ అందరూ తిరస్కరించారు. చివరికి బి.ఆర్‌.చోప్డా వద్దకు తీసుకెళితే ఆయన ఎగిరి గంతేసి తీసుకున్నాడు. దిలీప్‌కుమార్‌ను హీరోగా తీసుకుందామని వెళ్లి కథ వినిపిస్తే 'ఆ కథా..! మెహబూబ్‌ ఖాన్‌ చెప్పారు. వట్టి బోర్‌.' అన్నాడు. అయినా చోప్డా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ రాయించి మళ్లీ పట్టుకెళ్లాడు. ఈసారి దిలీప్‌కు నచ్చింది. హీరోయిన్‌గా మధుబాలను పెట్టుకున్నారు. దిలీప్‌ కుమారంటే అప్పట్లో హీరోయిన్లందరూ పడిచచ్చేవారు. మధుబాల కూడా మినహాయింపు కాదు. ఆమె ''జ్వార్‌ భటా'' సినిమా షూటింగులో అతన్ని కలిసింది. ఇద్దరూ కలిసి ''తరానా'' (1951) సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత నాలుగు సినిమాల్లో జోడీగా నటించడంతో రొమాంటిక్‌ పెయిర్‌గా స్థిరపడ్డారు. మధుబాల దిలీప్‌ అంటే ఆరాధన పెంచుకుంది. సాధారణంగా తను నటించిన సినిమా ప్రీమియర్‌లకు కూడా హాజరు కాని మధుబాల దిలీప్‌ నటించిన ''ఇన్సానియత్‌'' సినిమా ప్రివ్యూకు వచ్చింది. దానిలో ఆమె నటించకపోయినా సరే ! ఇలా ఆరేళ్లపాటు వాళ్ల మధ్య రొమాన్సు నడిచిన తర్వాత ''నయా దౌర్‌'' వచ్చింది. పదిరోజులు మధుబాలతో బొంబాయి స్టూడియోల్లో షూట్‌ చేశాక, రోడ్డు వేయడం అదీ వుంది కదా, ఔట్‌డోర్‌కని మధ్యప్రదేశ్‌ బయలుదేరాలన్నాడు చోప్డా.  బొంబాయి పరిసరాల్లో లొకేషన్స్‌ చూసి అవేమీ నచ్చక భోపాల్‌కు 250 కి.మీ.ల దూరంలో వున్న బుధ్‌నీ వద్ద షూట్‌ చేద్దామనుకున్నారు. ఔట్‌డోర్‌ షూటింగ్‌ మాట వినగానే మధుబాల తండ్రి అతానుల్లా ఖాన్‌ ఎగిరిపడ్డాడు. అతను మధుబాలను తన కనుసన్నల్లో పెంచాడు. ఔట్‌డోర్‌ అంటూ బయటకు వెళితే తన చేయిదాటిపోతుందన్న భయం. 'బొంబాయి పరిసరాల్లో తీయవచ్చుగా' అని చోప్డాతో వాదించాడు. 'శక్తి సామంతా తీసిన 'ఇన్‌సాన్‌ జాగ్‌ ఉఠా' కై ఔట్‌డోర్‌కి పంపించావుగా, ఇప్పుడు పంపించు' అన్నాడు చోప్డా. 'ఠఠ్‌' అన్నాడు మధుబాల తండ్రి. 

వెంటనే చోప్డా దిలీప్‌కుమార్‌ను సంప్రదించాడు. అప్పుడు అతను ''మధుమతి'' సినిమాలో వైజయంతిమాలతో నటిస్తున్నాడు. ''మధుమతి'' కొండలు, గుట్టలు మొత్తం ఔట్‌డోర్‌లో తీశారు. 'వైజయంతిమాలకు ఔట్‌డోర్‌ ప్రాబ్లెమ్‌ లేదు, తనని తీసుకో' అన్నాడు దిలీప్‌. దాంతో మధుబాల ఔట్‌, వైజయింతి యిన్‌.   మధుబాల స్థానంలో వైజయంతిమాల వచ్చి చేరింది. డాక్యుమెంటరీ అని అందరూ భయపడిన సినిమా సూపర్‌ హిట్‌ అయింది. కానీ మధుబాలకు నిర్మాత యిచ్చిన సైనింగ్‌ ఎమౌంట్‌ 30 వేలు హరీమన్నాయి.  వాళ్లు తిరిగి యివ్వలేదు. ఇంతకుముందు చెప్పిన ఉదంతంలో నాగిరెడ్డిగారిలా చోప్డా వూరుకో దలచలేదు. అక్కసు కొద్దీ పేపర్లలో 'నయా దౌర్‌' ఫుల్‌ పేజీ యాడ్‌ యిచ్చి మధుబాల పేరు రాసి, కొట్టేసి, హంసపాదు వేసి పైన వైజయంతిమాల పేరు వేశాడు. మధుబాల కూడా అంతే తిక్కగా  'ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల లిస్టు' అని ఫుల్‌పేజీ యాడ్‌ యిచ్చి 'నయా దౌర్‌' రాసి కొట్టేసింది.

వాళ్ల నాన్న యింకా తిక్కవాడు. చోప్డా మీద కేసు పడేశాడు - మధుబాలను ఉట్టిపుణ్యానికి తీసేశారు అని. దాని మీద చోప్డా  30 వేలు తిరిగి యిచ్చేయాలి అంటూ మధుబాల మీద క్రిమినల్‌ కేసు పడేశాడు. వాళ్ల నాన్న యింకా తిక్కవాడు. చోప్డా మీద కేసు పడేశాడు - మధుబాలను ఉట్టిపుణ్యానికి తీసేశారు అని.  మధుబాల తన తండ్రి పక్షం వహించగా, దిలీప్‌ నిర్మాత పక్షాన నిలిచాడు. తన ప్రియుడు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడని వూహించని మధుబాల మనసు గాయపడింది. వారిద్దరి మధ్య ఎడబాటు కలిగింది. అయితే దిలీప్‌, మధుబాల ఎంత ప్రొఫెషనల్స్‌ అంటే వారి వ్యక్తిగత విభేదాలు వృత్తిని ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. అప్పటికే వాళ్లిద్దరూ ''మొఘల్‌ ఏ ఆజమ్‌'' సినిమాలో సలీం, అనార్కలిగా వేస్తున్నారు. ఆ సినిమా 1951లో ప్రారంభమై 1959 దాకా నిర్మాణం సాగింది. 1957లో దిలీప్‌తో మాటలు మానేసిన తర్వాత కూడా మధుబాల అతనితో ఆ సినిమాలో శృంగార సన్నివేశాలు నటించవలసి వచ్చింది. ఆ సినిమాలో తెరపై వారి రొమాన్సు ఎంత గాఢంగా వుంటుందంటే - ఆ షాటు పూర్తవగానే నాయికా నాయకులు ఎడమొహం పెడమొహంగా కూర్చుంటారు అని ఎవరైనా చెప్పినా మనం నమ్మలేనంత !  (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?