Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీ స్నిప్పెట్స్‌- మధుబాల, కిశోర్‌

మధుబాల గురించి చెప్పుకున్నాం కదూ, అసలు మధుబాలకు బాగా పేరు తెచ్చిన వేషం ఏదో తెలుసా? దెయ్యం వేషం! ''మహల్‌'' (1949) సినిమాలో 'ఆయేగా, ఆయేగా ఆనేవాలా..' అంటూ దెయ్యం వేషంలో పాట పాడి తెరమీద అశోక్‌కుమార్‌ మతి, తెర ఎదుట ప్రేక్షకుల మతి పోగొట్టేసింది. తెల్లచీర కట్టుకుని, ఉయ్యాల వూగుతూ, హాంటింగ్‌ మెలడీ పాడుతూ మధుబాల ఒక్కసారిగా తారాపథానికి ఎగిరిపోయింది. అయితే దెయ్యం వేషం వేసి అందర్నీ హడలగొట్టిన మధుబాలను తన దెయ్యం వేషంతో హడలగొట్టి బెదరగొట్టినవాడు కిశోర్‌ కుమార్‌!

''మహల్‌'' సినిమాలో మధుబాల ఓ తోటమాలి కూతురు. బంగళా యజమాని ఐన అశోక్‌కుమార్‌ను భయపెట్టడానికి కామినీ పిశాచంలా నటిస్తుంది. ఆ సినిమా షూటింగు రోజుల్లో హీరోగారి తమ్ముడు హోదాలో కిశోర్‌ కుమార్‌ సెట్స్‌మీదకు అప్పుడప్పుడు వచ్చేవాడు. అప్పటికి అతను చిన్నా, చితకా వేషాలు వేస్తూండేవాడు. మధుబాల హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్‌ అయిపోయింది. ఆమె కోపం తెచ్చుకుంటే అతని పని సరి! అయినా ప్రాక్టికల్‌ జోక్స్‌ అంటే మహా యిష్టం వున్న కిశోర్‌ 'కామినీ పిశాచం' మధుబాలను భూతం వేషంలో బెదరగొడదామనుకున్నాడు. 

ఓ సాయంత్రం వేళ, కాస్త చీకటి పడుతూండగా తన ప్లాను అమలు చేశాడు కిశోర్‌. స్టూడియో పై అంతస్తులో మేకప్‌ రూమ్‌ వుంది. దానికి వెళ్లాలంటే ఓ పెద్ద కారిడార్‌లోంచి వెళ్లాలి. అక్కడ చీకటిగా వున్న ఓ మూల పెద్ద పెద్ద మీసాలున్న మాస్క్‌ ఒకటి వేసుకుని కిశోర్‌ నిలబడ్డాడు. ఆ రోజుకి షూటింగ్‌ అయిపోయాక మేకప్‌ తుడిచివేసుకోవడానికి మధుబాల పైకి వెళుతోంది. కిశోర్‌  ఓ వికృతజంతువులా అరుస్తూ ఆమె మీద పడ్డాడు. అప్పటికి మధుబాలది టీనేజ్‌. పైగా తండ్రి సంరక్షణలోనే పెరిగిన ఛాందసపు కుటుంబానికి చెందిన పిల్ల. బెదిరిపోయి వెర్రిగా అరుస్తూ మెట్లు దిగి పారిపోయి వచ్చింది. 

షూటింగ్‌ పాకప్‌ చేస్తున్న యూనిట్‌లో సభ్యులందరూ ఏమైందాని పరిగెట్టుకుని వచ్చారు. మధుబాల వణుకు చూసి ఏమిటేమిటని అడిగారు. ఆమెకు నోట మాట రాందే! భయంతో మూర్ఛపోబోతున్న ఆమెను చూసి 'యిక చాల్లే' అనుకుని కిశోర్‌ మెట్లు దిగి ఆమె వద్దకు వచ్చి, మాస్క్‌లోంచి మొహం బయటపెట్టి యికిలించాడు. యూనిట్‌ అంతా పకపకా నవ్వారు కానీ విషయం తెలిసి అశోక్‌ కుమార్‌ మాత్రం మండిపడ్డాడు. అప్పటికే అతని ప్రాక్టికల్‌ జోక్స్‌కి విసిగి వున్నాడేమో తమ్ముణ్ని పిలిచి తిట్టిపోశాడు. 

ముక్తాయింపు ఏమిటంటే యిది జరిగిన కొన్నేళ్లకు కిశోర్‌, మధుబాల భార్యాభర్తలయ్యారు.

*********

కిశోర్‌ కుమార్‌ మొదట గాయకుడు అవుదామనుకున్నాడు. కానీ నటనకే ఎక్కువ ఆఫర్లు వచ్చాయి.  ''బాప్‌రే బాప్‌'' (1955) తర్వాత పెద్ద హీరోల సరసన చేరాడు. అతనిపక్కన వైజయంతిమాల, నూతన్‌, మధుబాల, మీనాకుమారి, నిమ్మీ వంటి అగ్రశ్రేణి తారలు నటించారు. క్రమంగా కిశోర్‌ ప్రభ తగ్గింది. అతని మార్కెట్‌ డౌనయింది. దర్శక నిర్మాత 'చిత్రాలయా' శ్రీధర్‌ ''ప్రేమించి చూడు'' సినిమాకు మాతృక అయిన ''కాదలిక్క నేరమిల్లయ్‌'' అనే తమిళ సినిమాను హిందీలో ''ప్యార్‌ కియే జా'' (1966)గా తీశాడు. నాగేశ్వరరావు పాత్రకు శశికపూర్‌ను, జగ్గయ్య పాత్రకు కిశోర్‌ కుమార్‌ను బుక్‌ చేసుకున్నాడు. కిశోర్‌కు అప్పుడున్న మార్కెట్‌ రేటు ప్రకారం పారితోషికం యిస్తానన్నాడు. సరేనన్నాడు కిశోర్‌. 

ఆ సినిమాలో మరో ముఖ్యపాత్ర నాగేశ్‌ది. తెలుగులో చలం వేసిన పాత్ర. అది మెహమూద్‌ వేస్తే బాగుండునని అనుకున్నాడు శ్రీధర్‌. మెహమూద్‌ మొదట్లో చిన్న నటుడిగా ప్రారంభించినా తన 'గ్యాలరీ హ్యూమర్‌'తో ప్రేక్షకులను కితకితలు పెట్టి, ఆకట్టుకుని పాప్యులర్‌ కమెడియన్‌ అయిపోయాడు.  నిర్మాతగా కూడా మారాడు. మార్కెట్లో మంచి డిమాండ్‌లో వున్నాడు. శ్రీధర్‌ వచ్చి తన ప్రపోజల్‌ చెప్పినపుడు మెహమూద్‌ ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే అతనికి ఆ పాత్ర నచ్చలేదు. వెయ్యాలని లేదు. కానీ వచ్చి అడిగినవాడు దక్షిణాదిన పెద్ద నిర్మాత, దర్శకుడు. మెహమూద్‌కి దక్షిణాది నిర్మాతలతో మంచి కనక్షన్లు వున్నాయి. ఆ సంబంధబాంధవ్యాలు చెడగొట్టుకోకుండా వుండాలంటే డిప్లమాటిక్‌గా వ్యవహరించాలి. 

అందువల్ల శ్రీధర్‌కు తను మామూలుగా తీసుకునే పారితోషికాన్ని రెట్టింపు చేసి చెప్పాడు. ఆశ్చర్యకరంగా శ్రీధర్‌ ఒప్పుకున్నాడు. తీరా చూడబోతే ఆ సినిమాలో పారలర్‌ హీరో వేసిన కిశోర్‌ కంటె కమెడియన్‌గా వేసిన మెహమూద్‌కు ఎక్కువ ముట్టినట్టు తేలింది. సినిమా నిర్మాణం జరుగుతూండగా కిశోర్‌కు యీ విషయం తెలిసింది. ఒళ్లు మండింది. హీరోగా తన రోజులు ముగిసిపోతున్నాయని గ్రహించుకున్నాడు. మెహమూద్‌తో ''ఎప్పుడో ఒకప్పుడు దీనికి ప్రతీకారం తీర్చుకుంటానులే'' అన్నాడు నవ్వుతూనే. అతనికి ఆ అవకాశం త్వరలోనే వచ్చింది. అదీ మెహమూద్‌ ద్వారానే!

మెహమూద్‌ ''పడోసన్‌'' (1968) తీస్తూ కిశోర్‌ వద్దకు వెళ్లి ఓ ముఖ్యపాత్ర వేయమన్నాడు. 'పడోసన్‌' అంటే ''పక్కింటి అమ్మాయి'' హిందీ వెర్షన్‌. దానిలో హీరోయిన్‌కు పాటల పిచ్చి. కానీ హీరోకి పాటలు పాడడం రాదు. అప్పుడు హీరో ఫ్రెండు తను కిటికీ చాటున వుండి ప్లేబ్యాక్‌ పాడతాడు. హీరోయిన్‌కి సంగీతం చెప్పే మాస్టారు (మెహమూద్‌ వేశాడా పాత్ర)ను సంగీతపు పోటీలో ఓడిస్తాడు.  ఈ సినిమాను మళ్లీ తెలుగులో తీసినప్పుడు కిశోర్‌ పాత్రను ఎస్పీ బాలు, మెహమూద్‌ పాత్రను సంగీత దర్శకుడు చక్రవర్తి వేశారు. మెహమూద్‌ ప్రతిపాదన విని ''వేస్తాను కానీ పారితోషికం ఎంతో తెలుసా? నువ్వు ''ప్యార్‌ కియే జా''కి తీసుకున్నదానికి రెట్టింపు'' అన్నాడు కిశోర్‌. 

నిర్మాత హోదాలో వున్న మెహమూద్‌ జంకలేదు. ''కిశోర్‌దా, నువ్వు తప్ప వేరొకరు వేయలేని పాత్ర అది. నువ్వడిగినంతా యిస్తా'' అన్నాడు వెంటనే. ఆ నిజాయితీకి కిశోర్‌ చలించిపోయాడు. అందుకే మెహమూద్‌ తర్వాతి చిత్రం 'బాంబే టు గోవా' లో అతిథి పాత్రలో ఉచితంగా నటించాడు. (సశేషం)

- (ఫోటోలు-  ''పడోసన్‌''లో కిశోర్‌ కుమార్‌)  

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?