Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం: పాండురంగ మహాత్మ్యం - 1/2

ఎన్‌.టి.రామారావు గారు తన స్వంత బ్యానర్‌ ఎన్‌.ఏ.టి. క్రింద 1957లో తీసిన ''పాండురంగమహాత్మ్యం'' సినిమాకు ఆధారం - ''హరిదాస్‌'' అనే 1944 నాటి తమిళ సినిమా. కృష్ణుణ్ని పాండురంగడి రూపంలో కొలిచిన పుండరీకుడనే ఓ మరాఠీ భక్తుడి కథ యిది. కథకు మూలం మరాఠీలో కనబడుతుంది. అందుకే తమిళ సినిమాను సుందరరావు నద్‌కర్ని అనే మరాఠీ ఆయన డైరక్టు చేశారు. తెలుగులో కమలాకర కామేశ్వరరావు చేశారు. సదాచార కుటుంబంలో పుట్టి కూడా దురలవాట్లకు బానిసై, భ్రష్టుడై, మహా పాపియై చివరకు తన తప్పులు తెలుసుకున్న ఓ కామి.. దరిమిలా మోక్షగామి కథ. తమిళంలో యీ సినిమా సూపర్‌ హిట్‌. హీరోగా వేసిన త్యాగరాజ భాగవతార్‌ పాటల వలన అనండి, సినిమా కథ వలన అనండి, ఆ రోజుల్లోనే రెండేళ్లు వరుసగా ఆడి రికార్డులు బద్దలు కొట్టింది. ''జయసింహ'' అనే జానపద సినిమా తీసిన తర్వాత యీ భక్తిరస, జానపద సినిమాను ఎంచుకున్నారు ఎన్‌.టి.యార్‌. తమిళ వెర్షన్‌ను కొద్దిగా మార్చి తీసిన యీ సినిమా కూడా సూపర్‌ మ్యూజికల్‌ హిట్‌ అయింది. తర్వాత చాలా ఏళ్లకు వారి కుమారుడు బాలకృష్ణ హీరోగా ''పాండురంగడు'' సినిమా తయారైంది. ఆ వెర్షన్‌లో మరీ మార్చేశారు. దాని గురించి ప్రస్తావించబోవటం లేదు. 

తమిళ సినిమాలో హీరో విచ్చలవిడిగా తిరగడంతో సినిమా ఆరంభమవుతుంది. జానపద స్టయిల్లో నడుస్తుంది. చివర్లోనే దేవుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడిదాకా పౌరాణిక వాసనలు తగలవు. అయితే తెలుగు సినిమా కాస్త పౌరాణిక టచ్‌తో ప్రారంభించారు. సినిమా చివర్లో ఇంద్రుడు పాండురంగణ్ని సేవించి శాపవిమోచనం పొందుతాడు. ఆ శాపం ఎలా వచ్చిందో, దాని కథేమిటో ఓ పౌరాణికుడి చేత చెప్పిస్తారు. ఒక ముని తపస్సు చెడగొట్టడానికి ఇంద్రుడు యథావిధిగా రంభను పంపి ఆమె చేత కాకపోతే తనే స్వయంగా వచ్చి వజ్రాయుధంతో యితని తల తెగనరికాడు. చనిపోతూ ముని పాషాణమై పొమ్మని యింద్రుడికి శాపం యిచ్చాడు. ఇంతలో శివుడు వచ్చి ఇంద్రుణ్ని దండించబోయాడు. ఇంద్రుడు శరణు వేడితే నారాయణుడు చంద్రభాగా నదీతీరంలో వెలసినపుడు ఆయన పాదం తగిలితే శాపవిమోచనం అవుతుందన్నాడు. అది సినిమా చివరిలో పుండరీకుడు భక్తుడయ్యాక అవుతుంది. 

ముందుగా తమిళ వెర్షన్‌ చూదాం. హీరో పేరు హరిదాసు. తెలుగులో పుండరీకుడు అని పెట్టారనుకోండి. ఈ హరిదాసు సద్బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. సకలశాస్త్రాలు చదివినవాడు. అయితే స్త్రీలోలుడు. గుఱ్ఱంపై తిరుగుతూ పాట పాడుతూ వూళ్లో తిరుగుతూ ఆడవాళ్లను ఆకర్షిస్తూ వుంటాడు. హీరోకి పెళ్లయింది. భార్య యింట్లోనే వుంది. హీరోకి జతగాడైన మారిదాసు విలన్‌. ఊళ్లోకి రంభ అనే వేశ్య వచ్చింది, ఆమె యింటికి తీసుకెళతానని చెప్పాడు. హీరో భార్య గయ్యాళి. అత్తమామలంటే పడదు. ఎప్పుడూ పోట్లాడుతూ వుంటుంది. ఆస్తి అంతా  కొడుక్కి రాసి యిచ్చేశాం కాబట్టి ఏమీ చెయ్యలేం అంటాడు తండ్రి. హీరో తలిదండ్రుల పట్ల పొగరుగా వుంటాడు. ఓ సారి సన్యాసులు వస్తే పనీపాటాలేని సోంబేరులకు తిండి దండగ అని హీరో తిడతాడు. నొచ్చుకున్న తలిదండ్రులు  వూళ్లోనే యింకో యింట్లో వుంటారు.

తెలుగులో కథ కాస్త మార్చారు. తమిళంలో హీరో భార్య గయ్యాళి. ఆమెను చూస్తే జాలి కలగదు. కానీ తెలుగులో ఆమె పాత్రలో షేడ్స్‌ పెట్టి, ఆమె ప్రవర్తన సమంజసంగా వున్నట్టు చూపారు. తెలుగు సినిమా ప్రారంభంలో ఆమె యింకా కాపురానికి రాలేదు. రప్పిస్తే చెడు తిరుగుళ్లు మానతాడు కదాని తల్లి హేమలత తండ్రి నాగయ్యకు చెప్తోంది. పద్మనాభం కూడా చెప్తున్నాడు. ఇతను నాగయ్య తమ్ముడి కొడుకు. మంచివాడు. అన్నను కాపాడదామనుకునేవాడు. ఈ పాత్రను తెలుగులో పెట్టారు. మూలంలో లేదు. నాగయ్య ఎందుకనో కానీ తాత్సారం చేసి, చేసి చివరకు కోడల్ని పుట్టింటినుండి రప్పించాడు.

ఈ లోపునే జరగవలసిన అనర్థం జరిగిపోయింది. ఎన్టీయార్‌కి తెలుగులో యిదే మొదటి సినిమా వేశ్యాసంపర్కం కలిగించాడు శివరావు. ఈ శివరావు పూలవ్యాపారి. పైకి భక్తుడిలా నటిస్తూ యిలాటి వ్యవహారాలు నడుపుతూంటాడు. అతని అసిస్టెంటు బాలకృష్ణ వద్దంటూనే వుంటాడు. ఈ శివరావు వేశ్య (సరోజాదేవి - తెలుగులో యిదే మొదటి సినిమా) వద్దకు వెళ్లి ఎన్టీయార్‌ అందం గురించి చెప్పాడు. ఆమె చెలికత్తె కూడా సర్టిఫై చేసింది. ఇంకేం? ఆమె యితని గురించి వెయిట్‌ చేసింది. ఇతను వెళ్లాడు. రాత్రంతా ఆమెతోనే గడిపాడు. తెల్లవారాక యింటికి చేరాడు. అయితే ఈ లోపునే భార్య కాపురానికి వచ్చింది. గదంతా అలంకరించి అతనికోసం వేచి వుంది. అతను రానేలేదు. పొద్దున్న అత్తగారు పలకరించింది - అబ్బాయి రాత్రి రాలేదా? అని కోడలికి ఒళ్లు మండింది. మీ పెంపకం అలా వుంది. కనిపెంచిన కొడుకు సంగతి తెలియకే అడుగుతున్నారా అని అడిగింది. అలా అనడంలో తప్పేముంది? ఇవన్నీ తెలుగులో చేసిన మార్పులే! 

తమిళ ఒరిజినల్‌లో హీరో వేశ్య డాన్సుప్రోగ్రాం యింట్లోనే పెట్టేశాడు. తనే పాట పాడాడు. భార్య అభ్యంతరపెట్టింది. అబ్బే మొగాడు ఆడవేషం వేస్తున్నాడు అని బుకాయించేశాడు. అయితే మధ్యలో విలన్‌ ఒకడు తయారయ్యాడు. ఇక్కడిదాకా వచ్చాక వేశ్య తనను పట్టించుకోకపోవడంతో మారిదాసుకి కోపం వచ్చింది. దాంతో అతను వెళ్లి హీరో భార్యకి డాన్సు చేసేది ఆడదే అని చెప్పేశాడు, చూపించాడు. భార్యకు కోపం వచ్చి వేశ్యను చావగొట్టింది. వేశ్య పగబట్టింది. ఈ సినిమాలో వేశ్య పాత్ర వేసినది టి ఆర్‌ రాజకుమారి. గొప్ప సౌందర్యవతిగా పేరు. జ్యోతిలక్ష్మి, జయమాలినిలకు పెద్దమ్ము. భార్య పాత్రధారిణి వసంతకోకిలం. వేశ్య ప్రతీకారంతో హీరో భార్యను కిడ్నాప్‌ చేయించింది. చెట్టుకు కట్టి కొట్టించింది. అయితే మారిదాసు పార్టీ ఫిరాయించాడు. వేశ్యకు తెలియకుండా హీరో తలిదండ్రులకు యిలాగ జరగబోతోందని చెప్పేశాడు. వాళ్లు వూళ్లోవాళ్లని పంపించి రక్షించారు.

హీరో భార్య అత్తమామలను మన్నించమంది. ఇంతలో వేశ్య యింకో కుట్ర పన్నింది. మామగారే కిడ్నాప్‌ చేయించాడని కిడ్నాపర్‌ల చేత హీరోకి చెప్పించింది. నోరు విప్పితే చంపేస్తామని మారిదాసుని బెదిరించింది. పాపం తలిదండ్రుల మీద అభాండం పడింది. అది విన్న హీరో ముందు వెనుకలాలోచించకుండా వాళ్లని వూళ్లోంచి పొమ్మన్నాడు. ఇదీ తమిళ ఒరిజినల్‌లో వున్న ఘట్టం. హీరో భార్య వేశ్యను కొట్టడం, ప్రతీకారం తీర్చుకోవడానికి వేశ్యలో నేరప్రవృత్తి - యివి కాస్త ఎబ్బెట్టుగానే వున్నాయనక తప్పదు. హీరో తలిదండ్రులను కోడలు ఇంట్లోంచి పంపిస్తే, వేశ్య ఏకంగా వూళ్లోంచే పంపించింది. తెలుగులో యివన్నీ సున్నితంగా చూపిస్తూ ఒకదానికి మరొకటి లీడ్‌ చేసినట్టు చూపించారు. 

అంజలి కాపురానికి వచ్చాక ఏం జరుగుతుందంటే - ఆమె అందం ఎన్టీయార్‌ను ఆకట్టుకుంటుంది. ఆమె కూడా జాణతనంతో, మాటకారితనంతో భర్తను ఆకట్టుకుంది. అతను యింటిపట్టునే వుండసాగాడు. వేశ్య సరోజాదేవి అది భరించలేకపోయింది. సంధానకర్త శివరావుకి కబురు పెట్టింది. ఎలాగైనా నీ దగ్గరకి తెస్తాను కదా అన్నాడు శివరావు. ఎన్టీయార్‌ వద్దకు వెళ్లి 'వేశ్యకు జబ్బు చేసింది. నిన్ను చూడకపోతే బతకలేనంటోంది' అని చెప్పాడు. ఇదంతా గమనించి ఎన్టీయార్‌ తమ్ముడు పద్మనాభం అతనికి వార్నింగ్‌ యిచ్చాడు. అన్నగారు రాత్రి యిల్లు దాటకుండా జాగ్రత్త పడ్డాడు. శివరావు యింకో ట్రిక్‌ వుపయోగించాడు. 'వేశ్య పుట్టినరోజు, నువ్వు రాకపోతే ఉరివేసుకుంటానంది. పైగా ఇంకోమాట చెప్పింది - పుట్టినరోజుకి అందరూ బహుమతులు తెస్తారు, ఆయన భార్యదే పెత్తనం కదా, ఏమీ తేలేడు కదా, కించపడకుండా యిదిగో యీ హారం పట్టుకొచ్చి బహుమతిగా నలుగురి ఎదుటా యిమ్మనమను అని హారం నా చేతిలో పెట్టింది' అని నాటకం ఆడాడు. ఈ ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌కు ఎన్టీయార్‌ మెత్తబడ్డాడు. వేశ్య వలలో పడ్డాడు. పడవేసినవాడు మధ్యలో శివరావు. (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?