Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: టిడిపికి ముందు ముఖ్యమంత్రులు

ఎమ్బీయస్: టిడిపికి ముందు ముఖ్యమంత్రులు

1983లో టిడిపి అధికారంలోకి వచ్చేముందు ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెసు ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం. చెన్నారెడ్డి, అంజయ్య ఎలా నిష్క్రమించారో చూశాం. అంజయ్యను అంత త్వరగా తీసేయాల్సి వస్తుందని అధిష్టానం అనుకోకపోవడం వలన ప్రత్యామ్నాయం గురించి తయారుగా లేదు. అంజయ్యను తీసేయగానే నేదురుమల్లి జనార్దన రెడ్డి ముందుకు వచ్చారు. ఆయనంటే పడని పివి, కోన ప్రభాకరరావును ప్రతిగా నిలబెట్టారు. ఎవరికి యిచ్చినా చిక్కే అనుకుంటూ ఆలోచిస్తూ వుంటే ఎన్టీయార్ రంగప్రవేశం చేయబోతున్నారన్న వార్తలు చేరాయి. కాంగ్రెసులో కమ్మలకు ప్రాధాన్యత బాగానే వున్నా, కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా వున్నా, అప్పటిదాకా కమ్మ ముఖ్యమంత్రి రాలేదు. ఎన్టీయార్ వస్తే కమ్మలు అటు తిరిగిపోతారేమో వారిని ఆకట్టుకోవాలి అని ప్రతిపాదించారు. అలా అని రెడ్లని వదులుకోలేరు. అందువలన మధ్యేమార్గంగా భవనం వెంకట్రామ్‌ను ఎంపిక చేశారు.

పివి దిల్లీలో కూర్చుని, ఆంధ్ర రాజకీయాల్లో ఆటలాడారని రాస్తే కొంతమంది నొచ్చుకున్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని రక్షించిన వ్యక్తి అలా చేస్తారా అని అడిగారు. పాలనా సామర్థ్యం వేరు, రాజకీయాలు వేరు. చంద్రబాబు ఐటీ విప్లవం తేవచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేయవచ్చు, గొప్ప సంస్థలు నెలకొల్పవచ్చు, కానీ అనేక రాజకీయపు టెత్తుగడలు వేశాకనే ఆ పదవికి చేరి, అవన్నీ చేయగలిగారు. వైయస్ ఫీజు రీయంబర్స్‌మెంటు ద్వారా అనేక కుటుంబాలకు మేలు చేయవచ్చు, ఆరోగ్యశ్రీ ద్వారా అనేకమంది పేదలను ఆదుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రిగా ఎవరున్నా వాళ్లని ప్రతిఘటించి, కూలదోసి, దశాబ్దాల పాటు కుట్రలు పన్నితేనే ఆ పదవికి చేరగలిగారు. అంతెందుకు గాంధీగారు కొన్ని విషయాల్లో మహాత్ముడే కావచ్చు, కానీ రాజకీయాలకు వచ్చేసరికి పక్షపాతం ప్రదర్శించడం, తనను కాదన్నవాళ్లను తోసిరాజనడం, యిలాటి అనేక చేష్టలు చేశారు.

భవనం కులానికి రెడ్డే కానీ, పేరు చివర తగిలించుకోలేదు. ప్రత్యక్ష ఎన్నికలలో ఎప్పుడూ పాల్గొనలేదు. కౌన్సిల్‌కు ఎన్నికై, దాని ద్వారా చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర విద్యామంత్రిగా పనిచేశారు. అప్పుడు కేంద్రంలో విద్యామంత్రిగా వున్న షీలా కౌల్‌కు యీయనంటే సదభిప్రాయం ఏర్పడింది. ఆవిడా ఇందిరకు సిఫార్సు చేశారట. అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాక కొన్నాళ్లు ఆ శాఖలో కొనసాగించి, తర్వాత ట్రాన్స్‌పోర్టుకి మార్చారు. ఆయన భార్య జయప్రద కమ్మ కులస్తురాలు. చురుకైన కాంగ్రెసు మహిళా నేత. ఇందిరకు యిద్దరూ ఆప్తులే. 1977లో ఇందిర దిల్లీలో అధికారం పోగొట్టుకున్నాక, దివిసీమ బాధితులను పలకరించడానికి వస్తే, జలగం వెంగళరావు ఆవిడ పట్ల నిరాదరణ చూపారు. 

అప్పుడు అధిష్టానం ఏమనుకున్నా సరేనని భవనం దంపతులు ఆవిడకు ఆతిథ్యం యిచ్చారు. ఆయన పలనాడుకి చెందిన రెడ్డి. ఆయన కుటుంబం ఆ ప్రాంతపు లీడరైన బ్రహ్మానంద రెడ్డికి వ్యతిరేకం కాబట్టి, రెడ్డి కాంగ్రెసులో కాకుండా ఇందిరా కాంగ్రెసులో చేరాడు. ఇందిర అది గుర్తుపెట్టుకుని యిప్పుడీ మేలు చేద్దామనుకున్నారు. సౌమ్యుడు, ఏ గ్రూపుకి చెందనివాడు, స్వతహాగా ఏ బలమూ లేనివాడు కాబట్టి తాము చెప్పినమాట వింటాడన్న ధైర్యం. తెలంగాణకు చెందిన యిద్దరు ముఖ్యమంత్రులను వరుసగా దింపి ఆంధ్ర ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టారు కాబట్టి తెలంగాణ వాళ్లు ఏమీ అనుకోకుండా ఆ ప్రాంతానికి చెందిన సి జగన్నాథరావును డిప్యూటీ సిఎంగా చేశారు.

ఎన్టీయార్, భవనం కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ కాబట్టి, భవనంతో స్నేహబంధం చేత రాజకీయాల్లోకి రావడానికి తటపటాయిస్తారనే ఆశ కూడా వుందంటారు. కానీ ఎన్టీయార్‌ను ఇందిర చాలా రోజుల పాటు సీరియస్‌గా తీసుకోలేదు కాబట్టి యీ వాదన సరైనది కాదని నా భావన. ఏది ఏమైనా 1982 ఫిబ్రవరిలో భవనం ముఖ్యమంత్రి అయ్యారు. స్నేహితుడిగా ఎన్టీయార్ హాజరై ప్రమాణస్వీకారం ప్రొటోకాల్ ఎలా వుంటుందో గమనించారు. 1982 మార్చి 29 కల్లా తెలుగుదేశం ప్రకటన చేశారు ఎన్టీయార్. కాంగ్రెసు ద్వారా ముఖ్యమంత్రి అవుదామని తెగ ప్రయత్నించి విఫలమైన నాదెండ్ల మొత్తం కథ నడిపించారు. కానీ కాంగ్రెసులో అసమ్మతివాదులు ఎప్పుడూ చురుగ్గానే వుంటారు కాబట్టి, భవనంను నిద్ర పోనివ్వలేదు. ఆయనపై అనేక పుకార్లు పుట్టించారు. భవనం వెనక ఏ ఎమ్మెల్యే లేరు కాబట్టి ఏ నిర్ణయమూ చప్పున తీసుకోలేక పోయేవారు. ఆయన ఓపెన్ యూనివర్శిటీ ప్రారంభించారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఏమీ లేవు. అహంకారీ కాదు, తెలివితక్కువ దద్దమ్మా కాదు. అయినా ఏడు నెలల కల్లా సెప్టెంబరు కల్లా దిగిపోవాల్సి వచ్చింది. కారణం అసమ్మతి నాయకులు, పత్రికలు.

రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న తనను తొలగించి తన స్థానంలో సి. దాస్‌ను కూర్చోబెట్టినందుకు కోన ప్రభాకరరావు భవనం మీద పగ బట్టి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేశారు. నేదురుమల్లి మరో వైపు నుంచి ఆజ్యం పోశారు. చెన్నారెడ్డిని పంజాబ్‌కు గవర్నరు చేసి పంపించివేయడంతో ఆయన ఊరుకున్నాడు కానీ లేకపోతే ఆయన వర్గమూ గొడవ చేసి వుండేది. భవనం హయాంలో చక్రం తిప్పిన ముఖ్యుల్లో వైయస్‌ ఒకరు. వ్యతిరేకంగా తిరిగిన ప్రముఖుల్లో రోశయ్య ఒకరు. భవనం తనను దూరంగా పెట్టి అవమానించారని ఆయనకు కోపం. రాష్ట్రం నుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థి హషీమ్ ఓడిపోయి, కేవలం ఐదు ఓట్లు మాత్రమే వున్న జనతా పార్టీ అభ్యర్థి బాబుల్ రెడ్డి నెగ్గారు. కాంగ్రెసు నుంచి క్రాస్ ఓటింగు జరగడానికి భవనమే కారణమని అసమ్మతి వాదులు ప్రచారం చేశారు. పదవి దిగిపోయాక భవనం సోదెలోకి లేకుండా పోయారన్న విషయాన్ని గమనిస్తే ఆయనకు యింతటి ప్రజ్ఞ వుందని తోచదు. ఏమైతేనేం, అందరూ భవనంకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయసాగారు. ఆఖరికి ఆయన భార్య జయప్రద కూడా దిల్లీ వెళ్లి ఇందిరా గాంధీకి తన భర్తకు వ్యతిరేకంగా చెప్పి వచ్చారు.

ఇక పత్రికల విషయానికి వస్తే ‘‘ఈనాడు’’ తెలుగుదేశం విజయానికి ఎంత కృషి చేసిందో, ఎన్ని కథనాలు యిచ్చిందో, అందరికీ తెలుసు. సిరిసంపదలలో తులతూగే ఎన్టీయార్ సామాన్య ప్రజల కోసం చైతన్యరథంలో తిరుగుతూ ఎన్ని కష్టాలు పడ్డారో ఫోటోలు వేస్తూ చాలా హైప్ సృష్టించారు. చైతన్యరథం కానీ, ఎన్టీయార్ నిర్విరామ యాత్ర కానీ, అనర్గళ ఉపన్యాసాలూ కానీ నభూతో న భవిష్యతి. ఆ వయసులో ఆయన పట్టుదలకు, ఓపికకు జోహారు. దానికి ప్రజలు స్పందించిన తీరు అపూర్వం. ప్రజలు గంటల కొద్దీ, కొన్ని సందర్భాల్లో రోజుల కొద్దీ వేచి వున్నారు. చైతన్యరథయాత్ర ప్రయోగంలో ఆ వ్యాన్ మీద నుంచే ఉపన్యాసాలు, కాసెట్లు, తెలుగుతనం గురించి పాటలు, పల్లెపల్లెకూ తిరగడాలు.. ప్రతీదీ నవ్యప్రయోగమే. దానికి ‘‘ఈనాడు’’ యిచ్చిన కవరేజీ కూడా అపూర్వం, అద్భుతం. పేపర్లో మూడు వంతులు యిదే వుండేది. అయితే దీనిలో కాస్త మసాలా కూడా వేశారని నా ఫీలింగు. రోడ్డు పక్క స్నానాలూ అవీ ప్రయివేటు వ్యవహారాలు కదా. వాటికి ప్రచారం దేనికి? పైగా ఆయన బట్టలు ఆయనే ఉతుక్కోవడం ఫోటోకోసమే చేశారని నా అనుమానం.

ఎందుకంటే ఉపేంద్ర తన ఆత్మకథ ‘‘గతం-స్వగతం’’లో వ్యాన్‌లో ‘నేనూ రామారావుగారూ, ఆయన అసిస్టెంటు, అటెండరు వుండేవాళ్లం.’ (పేజీ 86) అని రాశారు. వేరే కార్లలో అంగరక్షకులు వుండేవారు. అటెండరు, అసిస్టెంటు, అంగరక్షకులు యింతమంది వుండగా వాళ్లు రామారావుగార్ని బట్టలు ఉతకనిస్తారా? వాళ్లే ఉతకరూ! అదే పుస్తకంలో పేజీ 90లో ‘జనం చైతన్యరథం మీదకు దుముకుతూంటే ఆ తాకిడికి రథం పాడైపోతుందో, పడిపోతుందో అనిపించేది. రామారావుగారికి అంగరక్షకులుగా వున్న సినిమా ఫైటర్లు అటువంటి జనాన్ని త్రోసివేసి కర్రలతో కొట్టేవారు. నాకు చాలా బాధ అనిపించేది. ‘‘ఎంతో ప్రేమాభిమానాలతో వచ్చే జనాన్ని అలా మొరటుగా హింసించకండి.’’ అని వారిని మందలించేవాణ్ని. అయినా వినేవారు కాదు. ‘‘ఆయనకేమైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా?’’ అని ఎదురు ప్రశ్న వేసేవారు. ’ అని రాశారు. ఈ అంగరక్షకుల ప్రస్తావన ఈనాడులో ఎప్పుడూ చదివిన గుర్తు లేదు. ఇలాటి సెన్సారింగు చేసేది ఆ పత్రిక. అంతెందుకు, తర్వాత ‘‘ఆంధ్రభూమి’’కి ఎడిటరైన ఎంవిఆర్ శాస్త్రిగారు అప్పట్లో ‘‘ఈనాడు’’లో ఉద్యోగరీత్యా పత్రిక తరఫున ఎన్టీయార్‌ను యింటర్వ్యూ చేస్తే చాలా సమాధానాల్లో ఎన్టీయార్ అజ్ఞానం బయటపడిందట. ఆఫీసుకి తిరిగి వచ్చాక రామోజీరావుగారి ఆదేశాల మేరకు అవన్నీ కప్పిపుచ్చుతూ, మంచివి చేరుస్తూ  ‘శుద్ధ ప్రతి’ని తయారుచేశామని శాస్త్రిగారే రాసుకున్నారు.

ఈనాడు సంగతి పెద్దగా రాయనక్కరలేదు కానీ భవనం పదవీభ్రష్టత్వంలో ‘‘ఆంధ్రజ్యోతి’’కి కూడా పాత్ర వుందని చాలామందికి తెలియదు. దాని హైదరాబాదు బ్యూరో చీఫ్‌గా, దరిమిలా దానికి సంపాదకుడిగా, మహా టీవీ వ్యవస్థాపక చైర్మన్‌గా వున్న సీనియర్ జర్నలిస్టు ఐ. వెంకట్రావుగారి ఆత్మకథ ‘ఫ్లాష్‌బ్యాక్’ చదివితే ఆ వైనం తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని కెఎల్‌ఎన్ ప్రసాద్ కులరీత్యా కమ్మ. కాంగ్రెసు ఎంపీ. కానీ పత్రికా నిర్వహణలో స్వేచ్ఛ యిచ్చేవారు. కాంగ్రెసు కరపత్రంగా నడపలేదు. ఆయన కేంద్రమంత్రి పదవి ఆశిస్తున్న సమయంలో కొందరు కక్షతో ఆయనపై ఇంగ్లీషులో బుక్‌లెట్ వేసి వందల సంఖ్యలో దేశమంతా పంపిణీ చేశారు. 

ప్రధానికి, ఎంపీలందరికీ కూడా వెళ్లాయి. ఇదంతా కెఎల్‌ఎన్, ఆ పత్రికకు ఎడిటరుగా పనిచేసి మానేసిన నార్ల వెంకటేశ్వరరావు గార్ల మధ్య వచ్చిన తగాదా ఫలితం. ఈ విషయం రాస్తూ వెంకట్రావుగారు ‘అవన్నీ యిప్పుడు ఏకరువు పెట్టడం ఎవరికీ గౌరవం కాదు’ అని తేల్చేశారు. ఈ పుస్తకాలు భవనం అనుమతితో ఆయన కాబినెట్‌లో మంత్రి కార్యాలయంలో నుంచే పోస్టు అయ్యాయని కెఎల్‌ఎన్‌ అనుమానం. పంపిణీ ఆపించమని ఆయన అనేకమంది చేత, జయప్రద గారిచేత కూడా ముఖ్యమంత్రికి చెప్పించారు.

అయినా భవనం నాకు దీని సంగతి తెలియదని అన్నారే తప్ప ఆపడానికి ప్రయత్నించలేదు. దీని కారణంగానో, మరోటో తెలియదు కానీ మంత్రి పదవి రాకపోవడంతో కెఎల్‌ఎన్‌కి భవనంపై కోపం వచ్చింది. దిల్లీలో, హైదరాబాదులో భవనానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిపారు. గద్దె దించడమే ఏకైక కార్యక్రమంగా, రోజూ వ్యతిరేక కథనాలూ, వెక్కిరిస్తూ కార్టూన్‌లూ. అంతా వ్యక్తిగత రంధ్రాన్వేషణ. ‘ఆనాడు మా పత్రికలో రాసిన వార్తలు కొన్నిటిని యిప్పుడు తలచుకుంటే ఒక్కోసారి చిన్నతనంగా అనిపిస్తుంది... అంతరాత్మ అప్పుడప్పుడు ఎదురుతిరుగుతున్నా కేవలం ఉద్యోగధర్మంగా పనిచేసుకుంటూ పోయిన సందర్భాల్లో ఇదీ ఒకటి.’ అని వెంకట్రావుగారు నిజాయితీగా రాసుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆనాడు వ్యవహరించిన తీరును భవనంకు అండగా వున్న వైయస్ బాగా గమనించారు. తను ముఖ్యమంత్రి అయ్యాక ‘ఆ రెండు పత్రికలూ’ అంటూ ఎప్పుడూ అనేవారు. తమ పార్టీకంటూ ప్రత్యేక దినపత్రిక ఉంటే తప్ప ఎదుర్కోలేమని గ్రహించి ‘‘సాక్షి’’ పెట్టించారు.

కాంగ్రెసు పీతలు ఒకదాన్ని ఒకటి వెనక్కు లాక్కుంటూండగా ఓ పక్క ఎన్టీయార్ చైతన్యరథం ప్రజల్లో దూసుకుంటూ పోయింది. మొదట్లో ‘వచ్చేవాళ్లంతా సినిమా మోజుతో వచ్చినవారే తప్ప ఓటర్లు కాదు’ అంటూ ఇందిరకు చెప్తూ వచ్చిన కాంగ్రెసు నాయకులు ఉధృతం అవుతున్న కొద్దీ, ‘ఎన్టీయార్ ప్రభంజనాన్ని ఆపాలంటే భవనం వంటి సౌమ్యుడు, రాజకీయ దుర్బలుడు చాలడు అందుచేత అతన్ని దింపేసి నన్ను ఎక్కించండి’ అని మొదలుపెట్టారు. ఇలా అడిగేవాళ్లు మరీ ఎక్కువై పోవడంతో మళ్లీ వేట ప్రారంభమైంది. భవనంను దింపడంలో ప్రధాన పాత్ర వహించిన నేదురుమల్లి తను ముఖ్యమంత్రి అవుదామనుకుంటే ఆయన జిల్లా వాడే అయిన నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అడ్డుపడ్డారు. ఇలాటి ఏ పేరు గట్టిగా వినబడినా అడ్డుకోవడానికి దిల్లీలో పివి వున్నారు. ఇప్పుడు అంజయ్య కూడా వచ్చి చేరారు. చివరకు ఎంపీగా వుంటూ రాష్ట్రరాజకీయాలకు 12 ఏళ్లు దూరంగా వున్న కోట్ల విజయభాస్కర రెడ్డిని ఎంపిక చేశారు.

1982 సెప్టెంబరు 20న కోట్ల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికలు రెండు నెలలు ముందుకు జరపడంతో కోట్లకు నాలుగు నెలలు మాత్రమే సమయం వుండింది. ‘ఓపెనింగ్ బాట్స్‌మన్‌గా బరిలోకి దింపవలసిన క్రికెటర్‌ను చివరి బాట్స్‌మన్‌గా దింపి కాంగ్రెసు తప్పు చేసింది’ అని చక్కటి వ్యాఖ్య చేశారు వెంకట్రావు గారు. దానికి కారణం విజయభాస్కర రెడ్డి బ్రహ్మానంద రెడ్డి అనుచరుడు. ఇందిరా కాంగ్రెసు ఏర్పడినపుడు దానిలో చేరకుండా, రెడ్డి కాంగ్రెసులో చేరారు. బ్రహ్మానంద రెడ్డితో బాటు ఇందిరా కాంగ్రెసుకు వచ్చారు. ముందే పార్టీలో చేరిన చెన్నారెడ్డికి ఛాన్సు వచ్చింది. జమీందారీ తరహా మనిషి. గంభీరంగా వుండేవారు తప్ప అహంభావం చూపలేదు. అవినీతి అంటని మనిషి.

కోట్ల మంత్రివర్గం కూర్చినపుడు అంజయ్య, భవనం వర్గాలకు ప్రాధాన్యత యివ్వలేదు. పివికి అనుచరులుగా వున్న అమరనాథ రెడ్డి, హయగ్రీవాచారి, మజ్జి తులసీదాస్, పివి చౌదరిలను తీసుకోలేదు. ఇందిరా కాంగ్రెసు ఏర్పడినపుడు పార్టీలో చేరిన విధేయులైన వీరిని పక్కకు పెడితే ఎలా అని వారంతా అధిష్టానంపై ఒత్తిడి తెస్తే అధిష్టానం కోట్లపై ఒత్తిడి తెచ్చి కోట్లకు యిష్టం లేకపోయినా అనేకమందికి పదవులు యిప్పించింది. అయినా ఫిరాయింపుదారులకే ప్రాముఖ్యత లభిస్తోందంటూ కోట్లకు, ఆయనకు మద్దతిస్తున్నందుకు అధిష్టానానికి వ్యతిరేకంగా కొందరు నాయకులు తిరగబడ్డారు. ఈ విధంగా కోట్ల పాలనంతా అసంతృప్తి పొగలు సెగల మధ్య గడిచింది.

మరో పక్క ఎన్టీయార్ రెండు రూపాయలకే కిలో బియ్యం, మధ్యాహ్న భోజన పథకం, చౌకగా విద్యుత్ పథకాలు ప్రజల్లో చొచ్చుకుపోతున్నాయి. ఏదో ఒకటి చేయాలని కోట్లపై ఒత్తిడి పెరిగింది. దాంతో ఆయన 2 రూ. లెందుకు 1.90కే యిస్తాం, మధ్యాహ్న భోజనం పథకమూ పెడతాం, విద్యుత్ యిస్తాం అంటూ ప్రకటించారు. ఈ కాపీయింగు వలన కాంగ్రెసు ప్రభుత్వం  నవ్వులపాలయింది. తెలుగుదేశానికి ఖ్యాతి పెరిగింది. 1983 జనవరిలో అధికారంలోకి వచ్చింది. అందరూ నలుగురు ముఖ్యమంత్రులు మారారనే గుర్తు పెట్టుకున్నారు కానీ నలుగురు పిసిసి అధ్యక్షులు కూడా మారారని మర్చిపోకూడదు.

ఇది కాంగ్రెసు మార్కు పరిపాలన. ఎప్పటి నుంచో యిప్పటిదాకా అదే ధోరణి. ఎవరినీ సరిగ్గా పనిచేయనీయరు. ఎప్పుడూ వెనక్కాల నుంచి కొందరు గుంజుతూనే వుంటారు. అధిష్టానం యితన్ని కొనసాగిస్తూనే వాళ్లని ప్రోత్సహిస్తూ వుంటుంది. ఇద్దరూ కొట్టుకుని తమ వద్దకు వస్తారని, ఎవరూ బలపడలేరని దాని ఆలోచన. పాత విషయాలు తెలియనివారికీ తెలంగాణ విషయంలో ఏం జరిగిందో తెలుసు. విభజనవాదులను, సమైక్యవాదులను యిద్దర్నీ ప్రోత్సహించారు. తమ మనసులో మాట బయటపెట్టకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ తాత్సారం చేసి, అడ్డగోలుగా విభజించి, విభజన హామీలను నెరవేర్చకుండా దిగిపోయారు. రాజకీయ లబ్ధి పొందారా అంటే 42 ఎంపీలుండే రాష్ట్రంలో ఉనికి లేకుండా చేసుకున్నారు.

ఈ కాంగ్రెసు నిర్వాకాన్ని తెలుగుజాతికి అవమానంగా మలిచి, నమ్మించడంలోనే తెలుగుదేశం ప్రజ్ఞ కనబడుతుంది. ముఖ్యమంత్రులను మార్చినా ఏం చేసినా అది పార్టీ అంతర్గత వ్యవహారం. ఇక్కడ తెలుగు ఆత్మగౌరవం అనే సమస్య ఎక్కడ వచ్చింది? ముఖ్యమంత్రి తెలుగువాడే, అతని గోచీ పట్టుకుని లాగినవాడూ తెలుగువాడే, కొత్త ముఖ్యమంత్రీ తెలుగువాడే. మళ్లీ అతని మీద ఫిర్యాదు చేసినవాడూ తెలుగువాడే. తెలుగువాణ్ని తీసేసి ఏ తమిళుణ్నో పెడితే తెలుగు ఆత్మగౌరవం దెబ్బతింది అనవచ్చు. కానీ ఇక్కడ ఎందుకన్నట్లు? ఎన్టీయార్ ప్రాంతీయ పార్టీ పెట్టినపుడు ద్రవిడ పార్టీ విధానాలను కాపీ కొట్టారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని నిరసిస్తూ బిసిలను కూడగట్టిన ద్రవిడోద్యమం దానికి ‘స్వయం మర్యాదై’ అని పేరు పెట్టింది. ద్రవిడోద్యమం చీలినప్పుడు వాళ్లు ఒకళ్లనొకళ్లు తిట్టుకున్న తీరు చూస్తే వీళ్లలో వీళ్లకి ఆత్మగౌరవం వుందా? అని అనుమానం వచ్చింది. అసలు ద్రవిడోద్యమం వచ్చాకనే తమిళ సమాజంలో గౌరవం, సభ్యత లుప్తమై పోయాయని ఎందరో బాధపడతారు. ఇప్పటికీ ద్రవిడ పార్టీ వాళ్లు సాటి తమిళుల పట్ల పరమ కటువైన భాష వాడతారు.

ద్రవిడ పార్టీల రూపాయికి పడి (తవ్వ) బియ్యం, మధ్యాహ్నభోజన పథకం కాపీ కొట్టిన ఎన్టీయార్ యీ స్వయం మర్యాదైను ఆత్మగౌరవంగా తర్జుమా చేసి తెలుగునాట అదో నినాదంగా మార్చారు. కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రులలో చెన్నారెడ్డి తప్ప తక్కిన ముగ్గురిపై అవినీతి ఆరోపణలు లేవు. అయినా కాంగ్రెసు అవినీతిపై హోరెత్తించారు. అది సహజం. కానీ ఆత్మగౌరవం నినాదం, ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా కాంగ్రెసు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందనడం అర్థం కాని విషయం. ఇటీవల కేంద్ర ఐటీ శాఖ తెలుగుదేశం సానుభూతిపరుల వ్యాపారకేంద్రాలపై ఆదాయపుపన్ను సోదాలు నిర్వహిస్తే బిజెపి తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని, యిది తెలుగువారిపై దాడి అనీ చంద్రబాబు యిదే తరహాలో వాదించారు. 

ఆత్మగౌరవం గురించి యింత మాట్లాడిన ఎన్టీయార్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు తగినంత గౌరవం ఎప్పుడూ యివ్వలేదు. వీళ్లంతా నేను నిలబెట్టిన తోలుబొమ్మలు అనే అహంభావంతో చులకనగా చూశారు. దగ్గరకు వచ్చి ధైర్యంగా మనసులో మాట చెప్పనిచ్చేవారు కాదు. అందుకే రెండుసార్లు వాళ్లు ఆయనపై తిరగబడ్డారు. ఎన్టీయార్ 1988లో ఒక్క కలంపోటుతో 31 మంది మంత్రులను తీసి పడేసిన విషయం కనీవిని ఎరగనిది. మర్యాదపూర్వకంగానైనా పిలిచి, మీరు చేసిన తప్పు యిది అని ఒక మాట చెప్పలేదు. ఆత్మగౌరవం నినాదం మీద గెలిచాం. ఆయనకే తప్ప మాకు ఆత్మగౌరవం లేదా? అని సీనియర్ మంత్రులు కుమిలిపోయారు.

తమాషా ఏమిటంటే 1983లో కాంగ్రెసును తిరస్కరించిన తెలుగు ప్రజలు ఆరేళ్లు తిరిగేసరికి పిలిచి పట్టం కట్టారు. ఈలోగా కాంగ్రెసు సంస్కృతి ఏమీ మారలేదు. మీ ఆత్మగౌరవం రక్షిస్తామని కాంగ్రెసు హామీ ఏమీ యివ్వలేదు. తెలుగుదేశాన్ని గెలిపిస్తే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నట్లు, మళ్లా ఎన్నుకుందాం అని తెలుగు ప్రజలు అనుకోలేదు. పైగా కల్వకుర్తి ప్రజలు ఎన్టీయార్‌ను ఓడించారు కూడా. టిడిపి కథలో ఎత్తుపల్లాలను యింకొన్ని వ్యాసాల ద్వారా అప్పుడప్పుడు అందిస్తాను. ‌కొందరు పాఠకుల కోరిక మేరకు టిడిపిపై గతంలో రాసిన వ్యాసాల లింకు యిస్తున్నాను. https://telugu.greatandhra.com/mbsblog/tdp-history/

ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?