Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: వివక్షతపై నల్లవారి వినూత్న నిరసన

ఎమ్బీయస్‌: వివక్షతపై నల్లవారి వినూత్న నిరసన

నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ పోటీల పూర్తయ్యాక అమెరికా జాతీయగీతం ఆలపించబడింది. ఛాంపియన్స్‌గా ఎన్నికైన ఫిలడెల్ఫియా ఈగిల్స్‌ టీములోని కొందరు సభ్యులు ఆ సమయంలో నిటారుగా నిలబడకుండా ఒక మోకాలు వంచి నేలపై కూర్చున్నారు. ఇటీవలి కాలంలో నిరాయుధులైన నల్లవారి పట్ల అమెరికన్‌ పోలీసుల అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి నిరసన తెలపడానికి వారా మార్గం ఎంచుకున్నారు.

నిజానికి 2016లోనే కాలిన్‌ కేపెర్నిక్‌ అనే అతను యిదే కారణానికి యిలాగే చేశాడు. తక్కిన టీముల్లో కూడా యిది వ్యాపించింది. దాంతో 2017 వచ్చేసరికి కోపెర్నిక్‌ను ఏ టీమూ తీసుకోలేదు. అప్పట్లో యిలాటి నిరసనలను ఖండించిన ట్రంప్‌ కోపెర్నిక్‌ వెలికి తనే కారణమని గొప్పలు చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఫిలడెల్ఫియా ఈగిల్స్‌ చేసిన పనిని కూడా ఖండిస్తూ జాతీయగీతాలపనలో నిలబడకుండా మన దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను అవమానించారన్నాడు. అంటూనే ఆ టీముకు, వెయ్యి మంది వారి అభిమానులకు జూన్‌ రెండోవారంలో వైట్‌హౌస్‌లో విందు యిస్తానని ఆఫర్‌ చేశాడు.

అయితే టీము సభ్యుల్లో నల్లవారు ట్రంప్‌ ఆహ్వానాన్ని మన్నించడానికి నిరాకరించారు. ఫుల్‌ టీము రావటం లేదు కాబట్టి, విందు కాన్సిల్‌ అన్నాడు ట్రంప్‌. నల్లవారిపై అత్యాచారాలు చాలాకాలంగా సాగుతున్నా ట్రంప్‌పై యీ ఆటగాళ్లు కసి పెంచుకోవడానికి కారణం - కాన్ఫిడెరేట్‌ నాయకుల స్మారక చిహ్నాల విషయంలో ట్రంప్‌ వైఖరి!

19వ శతాబ్దపు అమెరికాలో బానిసల వ్యాపారం జోరుగా సాగేది. కొందరు ఆఫ్రికాకు వెళ్లి బలిష్టులైన ఆఫ్రికన్‌ వారిని జంతువులను పట్టినట్లుగా పట్టి, అమెరికాకు తీసుకుని వచ్చి బానిసలుగా విక్రయించేవారు. వీరికి జీతం బత్తెం ఉండేది కాదు. వాళ్లకి ఓపిక ఉన్నంతకాలం యజమానులు పని చేయించుకుని, అమ్మేసేవారు. కాల్చి చంపేసినా దిక్కూ దివాణం లేదు. వాళ్లను గొడ్ల కంటె హీనంగా చూసేవారు. భార్య, భర్త, పిల్లల్ని విడగొట్టి వేలం వేసేసేవారు.

కొద్దికాలం పోయాక యిది అమానుషం అని అమెరిన్లలో కొందరికి తోచింది. బానిసత్వం రద్దు చేయాలనే ఉద్యమం ప్రారంభించారు. అబ్రహాం లింకన్‌ దానికి నాయకుడిగా ఉండి ఉత్తరాది రాష్ట్రాల మద్దతు సంపాదించాడు. అయితే 11 దక్షిణాది రాష్ట్రాలలో పెద్దపెద్ద తోటలుండేవి. వాటిలో పని చేయడానికి బానిసలు కావాలి కాబట్టి వాళ్లు యీ రద్దును వ్యతిరేకించి, తమ రాష్ట్రాలన్నీ కలిపి కాన్ఫెడెరేషన్‌ అని ఏర్పరచుకుని 1861లో దేశం నుంచి విడిపోయారు. వీరి సేనలకు, జాతీయ ప్రభుత్వ సేనలకు మధ్య నాలుగేళ్ల పాటు అంతర్యుద్ధం నడిచింది. చివరకు 1865లో కాన్ఫెడెరేట్‌ సేనలు ఓడిపోయి, బానిసత్వం రద్దయింది.

ఓడిపోయినా ఆ సైన్యంలో కొందరు వీరులున్నారు. వారి విగ్రహాలు, వారి పేరన కట్టిన పెద్దపెద్ద భవనాలు ఉన్నాయి. ఇది అమెరికా చరిత్రలో భాగం. 20 వ శతాబ్దపు తొలినాళ్లల్లో మళ్లీ శ్వేతజాత్యహంకారం తలెత్తింది. అప్పుడు వాళ్లు సడెన్‌గా యీ కాన్ఫెడెరేట్‌ నాయకులను గుర్తు తెచ్చుకుని వాళ్ల విగ్రహాలు ఎడాపెడా పెట్టేశారు. తర్వాతి రోజుల్లో కూ క్లక్స్‌ క్లాన్‌ వంటి శ్వేతఅతివాద సంస్థలు యీ కాన్ఫెడెరేట్‌ జండాలను, యీ విగ్రహాలను తమ ఉద్యమాలకు ప్రతీకలుగా వాడుకున్నారు.

ఒబామా వంటివాడు దేశాధ్యక్షుడు అయినా ఆఫ్రో-అమెరికన్లలకు సమస్యలు తగ్గలేదు. 2015 జూన్‌లో సౌత్‌ కరోలినాలో చర్చికి వెళుతున్న 9మంది ఆఫ్రో-అమెరికన్లను డైలాన్‌ రూఫ్‌ అనే అతను కాల్చి చంపేశాడు. ఆ కేసు విచారిస్తూండగా రూఫ్‌, కాన్ఫెడెరేట్‌ జండా పక్కన నిలబడి తీయించుకున్న ఫోటో కనబడింది. దాంతో కాన్ఫెడెరేట్‌ కాలానికి చెందిన చిహ్నాలన్నీ ధ్వంసం చేయాలనే డిమాండ్‌ బయలు దేరింది. అదే నెలలో సౌత్‌ కరోలినాకు గవర్నరుగా ఉన్న నిక్కీ హేలీ (భారతీయమూలాలున్న వనిత) స్టేట్‌ హౌస్‌ నుంచి కాన్ఫెడెరేట్‌ జండాను తీసిపారేసింది.

దేశం మొత్తం మీద 718 పబ్లిక్‌ మాన్యుమెంట్లు, విగ్రహాలు, 109 పబ్లిక్‌ స్కూళ్లు, వాళ్ల పేరు పెట్టిన 80 ఊళ్లు, మొత్తం 1503 చిహ్నాలున్నాయి. ఆనాటి సంఘటనలు గుర్తు చేస్తూ ఆరు రాష్ట్రాలలో 9 ప్రభుత్వసెలవులున్నాయి. 10 అమెరికన్‌ మిలటరీ బేస్‌లకు ఆ హీరోల పేర్లు పెట్టారు. ఇవన్నీ తొలగించడానికి 100 ప్రయత్నాలు జరిగాయి. 2015 నుంచి కాన్ఫెడెరెన్సీ తాలూకు 60 చిహ్నాలు తొలగించడమో, పేర్లు మార్చడమో జరిగింది. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక తెల్లవారి దురంహకారానికి ఆజ్యం పోసినట్లయింది. నల్లవారి మీద దాడులు జరిగినప్పుడల్లా ఆ విగ్రహాలు పూర్తిగా తొలగించాలనే డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. 2017 ఆగస్టులో వర్జీనియాలో జనరల్‌ రాబర్డ్‌ లీ విగ్రహాన్ని తీసేయడానికి ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినపుడు దాన్ని వ్యతిరేకిస్తూ శ్వేతజాతీయులు ఆందోళనకు దిగారు.

ఇక అప్పణ్నుంచి ఆ విగ్రహాలు తీసేయాలా వద్దా అన్నదానిపై విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల వారు తీసేస్తున్నారు కానీ మరి కొన్ని దక్షిణాది రాష్ట్రాల వారు 'అవి మా ప్రాంతపు గౌరవానికి, పోరాటపటిమకు చిహ్నాలు, చరిత్రలో భాగం. ఈ రోజు మీకు నచ్చలేదని ఎలా తీసేస్తారు?' అంటున్నారు. ఒకప్పుడు దేశంలో బానిసత్వం ఉందనేదానికి, కొందరైనా దాన్ని సమర్థించారనే దానికి యివి చిహ్నాలు, వాటిని కొనసాగించడం అవమానకరం కదా అని జాతీయవాదుల వాదన. 

ఈ వివాదంలో ట్రంప్‌ లాటివాడు తలదూర్చకుండా ఉంటాడా? 'ఆ విగ్రహాలు తీసేయకూడదు. అవి మన వారసత్వం. జార్జి వాషింగ్టన్‌ కూడా బానిసలకు యజమానిగా ఉండేవాడు. అందుకని ఆయన విగ్రహం తీసేస్తామా?' అని వాదించాడు. కానీ కొన్ని సంస్థలు అలా అనుకోలేదు. యేల్‌ యూనివర్శిటీ జాన్‌ కాల్‌హౌన్‌ అనే బానిసల వ్యాపారి యిచ్చిన విరాళాలతో కట్టిన కాలేజీకి అతని పేరు పెట్టింది. ఇప్పుడీ గొడవ రావడంతో 2017 ఫిబ్రవరిలో కాలేజీ పేరు మార్చేసింది.

బ్రౌన్‌ యూనివర్శిటీకి విరాళమిచ్చిన బ్రౌన్‌ కుటుంబం కూడా బానిసల వ్యాపారంతోనే డబ్బు సంపాదించింది. ఆ పేరు కొనసాగించాలా వద్దా అన్న మీమాంసలో పడింది యూనివర్శిటీ. కాన్ఫెడెరేట్‌ తరఫున పోరాడిన కుటుంబాలకు చెందిన యిప్పటి వారసులు ఒక బృందంగా ఏర్పడి, ఈనాటి కళ్లతో ఆ నాటి చరిత్రను బేరీజు వేయకూడదని, అలనాటి చిహ్నాలను తుడిచిపారేయకూడదని వాదిస్తున్నారు. విగ్రహాల తొలగింపును అడ్డుకుంటున్నారు. ఇటువంటి విషయాల్లో ఎవరి దృక్కోణం వారికి ఉండవచ్చు.

కానీ ట్రంప్‌ విషయానికి వస్తే అతను శ్వేతజాత్యహంకారానికి ప్రతీకగా పేరుబడ్డాడు కాబట్టి అతను చేసిన వ్యాఖ్యకు అంత ప్రాముఖ్యత వచ్చి నల్లవారు అతనిపై మండిపడుతున్నారు. ఫిలడెల్ఫియా ఈగిల్స్‌ జట్టు ఆటగాళ్ల లాటి వాళ్లు నిర్భయంగా నిరసన తెలుపుతున్నారు కూడా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?