cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : కరోనా బ్లేమ్ గేమ్ – 1/2

ఎమ్బీయస్ : కరోనా బ్లేమ్ గేమ్ – 1/2

దేశంలో కరోనా విలయం పెరుగుతున్నకొద్దీ నిందలు వేసుకోవడం పెరుగుతోంది. మద్రాసు హైకోర్టు విపత్కాలలో ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషనర్‌ను ఉరేస్తే తప్పేముందంది. చాలా రాష్ట్రాల హైకోర్టులు అదే పల్లవి ఆలపిస్తున్నాయి. ప్రజాక్షేమం కంటె మోదీకి ఎన్నికలే ముఖ్యమై పోయాయని, అందుకే ఎన్నికల కమిషనర్‌కు అభ్యంతరం చెప్పలేదని విపక్షాలు అంటున్నాయి. జాతీయ ఎన్నికల కమిషనర్ మాత్రమేనా, ప్రతిపక్షపాలిత రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు కూడా స్థానిక ఎన్నికలను నిర్వహించారు కదా, వాటిని ఎందుకు ఆపలేదని బిజెపి అడుగుతోంది. 

కుంభమేళా నిర్వహించి కొంప ముంచారని ప్రతిపక్షాలు అంటూంటే, కేరళలో ఊరేగింపులు ఎందుకు చేస్తున్నారని బిజెపి కాంగ్రెసును అడుగుతోంది. కరోనా పెరిగితే మా తప్పేముంది, ఆరోగ్యమనేది రాష్ట్రాల సబ్జక్టు అని కేంద్రం అంటోంది. మరి అలా అయితే వాక్సిన్లన్నీ మీ గుప్పిట్లో పెట్టుకున్నారేం, మీకో రేటూ, మాకో రేటూనా? అయినా, ఓ పక్క వాక్సిన్‌లు లేవు మొర్రో అంటూంటే, అందరికీ వాక్సిన్ అనే ప్రకటనలేమిటి? వాక్సిన్లు ముందే ఎందుకు బుక్ చేసుకోలేదు? బజెట్‌లో కేటాయించిన సొమ్ముతో వాక్సిన్‌లు ఎందుకు కొనటం లేదు? అని రాష్ట్రాలు అంటున్నాయి.

అందరూ కలిసి ప్రజల మీద పడ్డారు. ‘వీళ్లకు బుద్ధి లేదు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందనగానే విచ్చలవిడిగా తిరిగేసి జబ్బు తెచ్చుకున్నారు. ఇప్పుడేమో ‘రోగం వస్తే ఆక్సిజన్ లేదు, ఆసుపత్రులలో బెడ్స్ లేవు, రెమెడిసివర్ మందు లేదు, ఛస్తే శ్మశానంలో చోటు లేదు. చేర్చడానికి యాంబులెన్సుల రేట్లు పెరిగిపోయాయి, కాల్చడానికి కట్టెల రేట్లు పెరిగిపోయాయి. శవాలను సగంసగమే కాల్చి నదిలోకి తోసేస్తున్నారు’ అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు. ఈ తెలివి ముందే ఉండాల్సింది. పైగా వస్తువుకి కొరత రాగానే యిదే సమాజంలోని కొందరు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు, నకిలీ మందులు అమ్ముతున్నారు. ఇదేనా మానవత్వం?’ అంటూ. అదను చూసి ఆసుపత్రులు నిలువుదోపిడీ చేస్తున్నాయని, ప్రభుత్వం వారిని అదుపు చేయటం లేదని రోగులు నిందిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో వాక్సిన్ కంపెనీలు రేట్లు పెంచలేదా? మేం పెంచితే తప్పా? అని వాళ్లంటున్నారు.

డిమాండు పెరిగి, కొరత వచ్చేసరికి రాష్ట్రాలే జాగ్రత్త పడిపోతున్నాయి. కేరళ తమిళనాడుకి ఆక్సిజన్ సరఫరా ఆపేసింది. తెలంగాణ, మా రాష్ట్రవాసులకే బెడ్స్ చాలలేదంటూ ఆంధ్ర నుంచి యాంబులెన్సులు వస్తే ఆపేస్తోంది. హైకోర్టు చెప్పినా వినటం లేదు. పదేళ్ల ఉమ్మడి రాజధాని సౌకర్యం వుంది కదా, వదులుకుని పోయినందుకు యింత నష్టమాని ఆంధ్రుల ఘోష. ఏం, యీ ఏడేళ్లలో ఉచితాలు పంచుకుంటూ కూర్చోకుండా వైద్యసౌకర్యాలు పెంచుకోలేక పోయారా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేసుకోలేక పోయారా? అని తెలంగాణ వారి వెక్కిరింత. దేశంలో కరోనా పరిస్థితి తీవ్రంగా వుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బిజెపి కాంగ్రెసును నిందిస్తోంది. కరోనాపై విజయం సాధించేశామంటూ తప్పుడు ప్రకటనలు చేసి ఆరోగ్యమంత్రి ప్రజల్లో ఉదాసీనత పెంచారని పరిశీలకులు, డాక్టర్ల అసోసియేషన్లు కేంద్రాన్ని తప్పు పడుతున్నారు. భారతదేశంలో కరోనా నిర్వహణ అధ్వాన్నం చేసి ప్రపంచంలోని దేశాలన్నిటికీ ముప్పు తెచ్చారని అంతర్జాతీయ నిపుణులు నిందిస్తున్నారు.

వాక్సిన్లు ముందే బుక్ చేయలేదని, విదేశీ వాక్సిన్ కంపెనీలు కోరితే అనుమతులు యివ్వలేదని, స్వదేశీ వాళ్లకు సకాలంలో నిధులిచ్చి ఆదుకోలేదని, ఏడాది కాలంగా సన్నద్ధత పెంచుకోకుండా సెకండ్ వేవ్ వచ్చినపుడు ప్రభుత్వం కళ్లు తేలేసిందని, గద్దె మీద కూర్చున్న రాజకీయ నాయకులకు తెలియకపోయినా, సలహాలిచ్చే అధికారులకైనా యింగితం వుండాలని పరిశీలకులు నిందిస్తున్నారు. ఈ పరస్పర నిందల మధ్య సామాన్యుడికి ఎవర్ని నిందించాలో బోధపడక దిక్కులు చూస్తున్నాడు. దేవుణ్ని, యీ కష్టకాలంలో తిట్టుకునే ధైర్యం చేయలేక, తన కర్మను తనే తిట్టుకుంటున్నాడు.

కరోనా ఫస్ట్ వేవ్‌ను సామాన్యుడు ఎలాగోలా తట్టుకున్నాడు కానీ సెకండ్ వేవ్ ఉధృతంగా విరుచుకుపడి ఆత్మీయులను కూడా పొట్టన పెట్టుకుంటూ వుండడంతో, ఎవరి మీద తన ఆగ్రహం వెళ్లగక్కాలో తెలియక ఆక్రోశిస్తున్నాడు. ఫోన్ తీస్తే చాలు, చావు కబురు వినాల్సి వస్తోంది, లేదా ఇంజక్షను కావాలి, ఆక్సిజను కావాలి, బెడ్ కావాలి, శ్మశానంలో స్లాట్ కావాలి, సిఫార్సు చేస్తావా అన్న అభ్యర్థనలు వినాలి. ‘సిఫార్సు లేనిదే శ్మశానమందైనా దొరకదు రవంత చోటు, ఉన్నది మనకు ఓటు, బతుకు తెరువుకే లోటు..’ అన్న పాత పాట మాటిమాటికి గుర్తుకు వస్తోంది. ఈ దుర్భర పరిస్థితికి కారణం ఎవరాని శోధించడం మొదలుపెడితే రాజుగారి ఏడుగురు కొడుకులు వేటకెళ్లిన కథలోలా, ప్రతీవాళ్లూ ఏదో సాకు చూపిస్తున్నారు. పక్కవాళ్ల మీద తోసేస్తున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్‌లో ప్రజలు యింత అక్కసుతో లేరు. మహమ్మారి విరుచుకుపడితే ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? అని అనుకున్నారు. ప్రధానికి అండగా నిలిచారు. ఆయన ఏం చెపితే అది చేశారు. మూడు వారాలు అన్నీ మూసుకుని కూర్చుంటే చాలు, కరోనా చెయిన్ తెగిపోతుంది, ఓర్చుకోండి అంటే ఓర్చుకున్నారు. లాకౌట్ కాలం పెంచినా సరేలే, అవసరం కాబోలు అనుకుని సరిపెట్టుకున్నారు. అయితే సెకండ్ వేవ్ వచ్చేసరికి ఆ సహనం కరువైంది. ఎందుకంటే మొదటి వేవ్‌లో వైద్యసదుపాయాలు లేవేం అని అడిగితే కేంద్ర ప్రభుత్వం ’60 ఏళ్లగా కాంగ్రెసు ప్రభుత్వం ఏమీ చేయలేదు’ అనే రొటీన్ పాటే పాడింది. ఆ 60 ఏళ్లలో తక్కినవాళ్లతోపాటు తామూ పాలించామన్న మాట కావాలని విస్మరిస్తూ! ఆ 60 దాటి, గత ఆరేళ్లగా తామే పాలిస్తున్నామన్న మాట వదిలేస్తూ!

అవన్నీ పాతకథలు. కరోనా స్థాయిలో ప్యాండమిక్ రాలేదు కాబట్టి, వాళ్లు సిద్ధంగా లేరు. తన తడాఖా చూపించాక గత ఏడాదిగా మీరు ఏం మెరుగు పరిచారు? అని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఆరోగ్యమనేది రాష్ట్ర సబ్జెక్టు. మమ్మల్ని అడుగుతారేం? అంటోంది. మరి 9 గంటల 9 ని.ల 9 సెకన్లకు దీపాలార్పమని, పళ్లాలు బాదమని, చప్పట్లు కొట్టమని, ‘పో కరోనా పో’ అని కేకలు వేయమని రాష్ట్రముఖ్యమంత్రులు చెప్పాయా? హఠాత్తుగా లాక్‌డౌన్ విధించి, వలస కార్మికులను అష్టకష్టాల పాలు చేస్తామని ముఖ్యమంత్రులు చెప్పారా? ఆగస్టు 15 కల్లా వాక్సిన్ తయారుచేసి చేతిలో పెట్టకపోతే డొక్క చించి, డోలు కడతామని ఏ రాష్ట్రం చెప్పింది? మా దగ్గిర తయారైన వాక్సిన్‌ను కేంద్రానికి ఓ రేటుకి, మాకు ఓ రేటుకి యివ్వమని ఏ రాష్ట్రమైనా వాక్సిన్ కంపెనీని ఆదేశించిందా?

ప్రజలు యింత వివరంగా ప్రశ్నలు అడగటం లేదు. డైరక్టుగా మోదీని తిట్టేస్తున్నారు. గతంలో మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే చాలా మందికి జంకు, చుట్టూ వున్న మోదీ భక్తులు ఏమనుకుంటారో, ఏమంటారోనని. ఇప్పుడు అలాటి శషభిషలు లేకుండా ధైర్యం తెచ్చుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, జిఎస్‌టి సృష్టించిన గందరగోళం యింకా తేటపడలేదు, బ్లాక్‌మనీ లేకుండా చేస్తామన్న మాట నీటిమూట అయింది. కరోనాకు ముందు నుంచే నిరుద్యోగిత ఎక్కువై పోయింది. ఈ ఆర్థిక కారణాల కారణంగా మోదీని ఎవరూ బహిరంగంగా తిట్టలేదు. తన దగ్గర ఏదో మంత్రదండం వుంది, పరిస్థితి చక్కదిద్దేయగలడు అని అనుకుంటూ ఉగ్గబట్టుకున్నారు. కితం ఏడాది కరోనా ముప్పు వచ్చినపుడు కూడా ప్రజలు మోదీ నాయకత్వంపై విశ్వాసం పోగొట్టుకోలేదు.

కానీ యిప్పుడు మాత్రం కుటుంబసభ్యులు వైద్యసదుపాయాలు అందక కళ్ల ముందే చనిపోతూ వుంటే, ఓర్పు చూపించలేక పోతున్నారు. గత ఏడాది వృద్ధులు చనిపోతూ వుంటే అయ్యో పాపం అని వూరుకున్నారు. కానీ యీసారి మధ్యవయస్కులు, యువత చనిపోతున్నారు. వాళ్ల మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకా పాతికేళ్ల పాటు తన మేధస్సుతో, విద్యతో సమాజానికి, దేశానికి సేవ చేయగల సత్తా వున్నవాడు అర్ధాంతరంగా రాలిపోతే దేశానికి ఎంత నష్టం? అతని ఖాళీ యిప్పట్లో భర్తీ అవుతుంది? ఇదేదో భూకంపమో, సునామీయో వచ్చి పడి తుడిచిపెట్టేసినట్లు కాదు. తగినంత వార్నింగు యిచ్చి మరీ సెకండ్ వేవ్ వచ్చింది. అయినా మన సన్నద్ధం కాని మనం క్షమార్హులమా? ఇదేనా మనం సూపర్ పవర్‌గా మారడమంటే? ఈ సమయంలో ప్రధానికి కొత్త యిల్లు, కొత్త నగరం కావలసి వచ్చాయా? మన మొహానికి బుల్లెట్ రైళ్లు కావాలా?

ఈ బాధతో రగిలిపోతున్న జనాభాలో కొందరు తెగించి వీడియోలు చేసి వాట్సాప్‌లలో పెడుతున్నారు. పబ్లిక్ వేదికలపై కాకపోయినా ప్రయివేటుగా తిట్టిపోస్తున్నారు. మోదీనే కాదు, మోదీని సమర్థించిన వారికి కూడా అక్షింతలు పడుతున్నాయి. మారు పేర్లతో కామెంట్స్ పెట్టే మోదీ భక్తులు, మారుపేరుకి మరోపేరు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. కరోనా సంగతి ముఖ్యమంత్రులు చూసుకోవాల్సిందే అంటున్న కేంద్ర ప్రభుత్వపు అధినేత మోదీ ఫోన్ చేసి తన మనసులో మాటే చెప్పారు తప్ప పనికి వచ్చే మాట మాట్లాడలేదు, తనను మాట్లాడనీయలేదని ఝార్‌ఖండ్ ముఖ్యమంత్రి వాపోతే, తగుదునమ్మాని జగన్ ‘విభేదాలెన్ని వున్నా ఈ సమయంలో రాజకీయాలు కూడదు, మనందరం కలిసి కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రికి మద్దతివ్వాలి’ అంటూ సుద్దులు చెప్పబోయాడు. అతని పార్టీ ‘మీ నిస్సహాయత దేశాని కంతటికీ తెలుసులే...’ అంటూ జగన్ గూబ గుయ్యిమనిపించింది. నీకు జవాబిచ్చేదేమిటి అని హేమంత్ సొరేన్ ఊరుకున్నాడు. జగన్‌కు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలిసి వుండదు.

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తూ ఆస్పత్రి పడకలు దొరక్క శవాల పక్కన రోగులు పడుక్కుంటున్న సమయంలోనే ప్రత్యర్థుల కంపెనీలు మూయించేయడం రాజకీయమో కాదో జగన్ చెప్పాలి. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు కోకొల్లలు. పట్టుకున్నాక నోటీసు యిచ్చి మూణ్నెళ్లలోనో, ఆర్నెల్లలోనో సరి చేయమంటారు తప్ప రాత్రికి రాత్రి కరంటు కట్ చేసి, ఉద్యోగులను రోడ్డు మీద పడేయరు. హైకోర్టు కలగజేసుకుని తెరిపించాల్సి వచ్చింది. ఇప్పుడున్న మూడ్‌లో మోదీని సమర్థిస్తే నెత్తిన దుమ్ము వేసుకున్నట్లే అని జగన్‌కు తెలిసి వచ్చి వుండాలి. అందరూ మోదీని అనేవారే! గత ఏడేళ్లగా మంచీ, చెడూ అన్నీ మోదీ ఖాతాలోనే పడుతున్నాయి. ‘ఫోన్‌లో మెసేజీ పెట్టగానే రైల్లో భోజనం వచ్చేసింది, సాంబారు బాగుంది. థాంక్స్ టు మోదీ’, ‘ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్స్‌కు కన్సెషన్ యిచ్చింది, థాంక్స్ టు మోదీ’ యిలాటి ఎన్ని ప్రచారాలు చూడలేదు?

ఏదైనా స్కీము పెట్టాలంటే కొన్నేళ్ల కసరత్తు జరుగుతుంది. ఎందరో అధికారులు, సంబంధిత మంత్రి భాగస్వామ్యం వుండందే యివి కార్యరూపం దాల్చవు. అయినా ఆ ఘనత అంతా మోదీదే అని ప్రచారం. అంతెందుకు, యిప్పుడు డిఆర్‌డిఓ, యితర సంస్థలు, సిసిఎంబితో కలిసి 2020 ఏప్రిల్ నుంచి దశల వారీగా ప్రయోగాలు చేసి కరోనాకు 2 డిజి మందు కనిపెట్టాయని వార్త వచ్చింది కదా. దాన్ని మోదీ ఖాతాలో వేయడానికై వచ్చిన మెసేజి చూడండి. ‘మోదీ మౌనంగా వుంటూ అంతా చూస్తూ వున్నాడు అంటే దాని వెనుక కారణం ఇదే’ అంటే గొప్పలు పోతున్నారు. ఇప్పుడీ మందు వాడకంలోకి వచ్చేలోపున చనిపోయినవారు యీ మాట విని పై లోకం నుంచి పువ్వులు కురిపించరు కదా! ప్రపంచానికి చైనా వైరస్‌ను సరఫరా చేస్తే మనం వాక్సిన్లు సరఫరా చేశాం అని మొన్నటిదాకా హడావుడి చేశారు. ఇప్పుడు మందులు, ఆక్సిజన్ సిలండర్లు, సమస్తం యింకోళ్ల నుంచి, మన కంటె చిన్నా చితకా దేశాల నుంచి కూడా పుచ్చుకునే స్థితికి దిగజారాం. వాళ్లు ఎందుకు యిస్తున్నారు అంటే, మానవతా దృక్పథం, వ్యాపార దృక్పథం కలిసి వుండవచ్చు. దాన్ని కూడా ‘మోదీ మొహం చూసి యిచ్చార’ని చెప్పుకుంటూంటే నవ్వాలో ఏడవాలో తెలియదు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంటు మోదీని ‘సూపర్ స్ప్రెడర్’ అన్నారు. ఆ తర్వాత మే 8న ఆ సంస్థ కేంద్ర ఆరోగ్యశాఖను తూర్పారపడుతూ లేఖ రాసింది. ‘మా సలహాలు బుట్టదాఖలు చేశారు, బద్ధకం (లెథార్జీ) వహించి చర్యలు తీసుకోలేదు. అందుకే యిప్పుడు రోజుకి నాలుగు లక్షల కేసులు వస్తున్నాయి. ఓ మాదిరి నుంచి సీరియస్ కేసులు 40 శాతం పెరుగుతున్నాయి. మీరు కేసులు, మరణాలు ఎందుకు దాచిపెడుతున్నారు? ఆర్టీపిసిఆర్‌లో ఫాల్స్ నెగటివ్ రిపోర్టు వచ్చి, సిటి స్కాన్‌లో పాజిటివ్‌గా తేలిన కేసుల వివరాలు ఎందుకు చెప్పటం లేదు? బజెట్‌లో రూ. 35 వేల కోట్లు కేటాయించిన డబ్బు ఏమవుతోంది?’ అని నిలదీసింది.

కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శిగా పని చేసి, ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో సీనియర్ లీడర్‌షిప్ ఫెలోగా వున్న కె. సుజాతారావు ‘సెకండ్ వేవ్ గురించి సైంటిస్టులు ప్రభుత్వాన్ని చాలాకాలం క్రితమే హెచ్చరించినట్లు సమాచారం. ఈ సమాచారం సరైనది కాదని అధికారులు అనుకున్నారా లేక ప్రధానికి చెప్పేందుకు భయపడ్డారా? ఎన్నికలలో మునిగి తేలుతున్నందున సమయం కేటాయించ లేకపోయారా? ప్రభుత్వం తీవ్రమైన అలసత్వం, ఉదాసీనతతో వ్యవహరించడం న్యాయమేనా?’ అంటూ అనేక ప్రశ్నలు సంధించారు. ఇక విదేశీ మీడియా అయితే చెప్పనే అక్కరలేదు. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

mbsprasad@gmail.com

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×