cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కరోనా మనకెంత భయానకం?

ఎమ్బీయస్‌: కరోనా మనకెంత భయానకం?

లాక్‌డౌన్‌ మే 3 వరకు పొడిగించారు. మొత్తం 40 రోజు​ల​వుతుంది. అయితే దీనిలో ఒక ​వెలు​​గురేఖ ఏమిటంటే ఏప్రిల్‌ 20 నాటికి పరిస్థితి సమీక్షించి కొన్నికొన్ని రంగా​ల​కు, ప్రాంతా​ల​కు మినహాయింపు యిచ్చే అవకాశం ఉంది. ఇది ఏప్రిల్‌ 14 నుంచే మొద​లు​పెట్టివుంటే యింకా సంతోషించేవాణ్ని. ఎందుకంటే వరస చూస్తూంటే కరోనా ​- మన దేశానికి సంబంధించిన వరకైనా ​-​ మరీ అంత ప్రమాదకరం కాదేమో, దాని యాక్షన్‌ కంటె మన రియాక్షనే మనల్ని ఎక్కువ దెబ్బ తీస్తుందేమో ననిపిస్తోంది. ఇది ఏ నైపుణ్యం లేని ఒక సామాన్యుడి భావనగానే చూడాలి. ఇదే సమాచారంతో మీరు యింకోలా ఆలోచిస్తే ఆలోచించవచ్చు.

ఇది ప్లేగులాగ టపటపా రాల్చేయడం లేదు. మరణా​ల​ రేటు కూడా మరీ ఎక్కువ కాదు. ఎటొచ్చీ వ్యాప్తి రేటు ఎక్కువ అంటున్నారు. వ్యాపించినవారిలో మరణా​ల​ రేటు కూడా దేశదేశానికి మారుతోంది. యుకె, ఇటలీలో 13% ఉంటే, స్పెయిన్‌లో 10%, ఇరాన్‌లో 6%​​, యుఎస్‌ఏలో 4%, జర్మనీలో 3%, ఫ్రాన్స్‌లో 2%.. యిలా వుంది. చైనాను నమ్మం కాబట్టి వదిలేద్దాం. యూరోప్‌లో రికార్డు వ్యవస్థ దిట్టంగానే ఉంటుంది కాబట్టి తీసుకున్నా. ఇరాన్‌ బాగా ప్రభావితం కాబట్టి చేర్చా. యుకె, ఇటలీ, స్పెయిన్‌లో అంతలా వుండడానికి ప్రత్యేక కారణా​లుం​టే అవి రాబోయే రోజుల్లో బయటపడవచ్చు. అవి మనకు అప్లయి కాకపోవచ్చు.

మన దగ్గర మరణా​లు​ 400, పాజిటివ్‌ వచ్చినవారు 12 ​వేలు​​. అంటే 3.3%. కానీ మన దగ్గర టెస్టింగు తగిన స్థాయిలో జరగటం లేదు కాబట్టి, ఆ 12 వే​ల​ను నమ్మలేం. సోకినవారు కనీసం ​ల​క్ష మందైనా ఉంటారని నా వైల్డ్‌ గెస్‌. (ఏ ఆధారమూ లేదు, గతంలో చెప్పిన 1కి 800 మంది లెక్క ప్రకారమైతే 3.20 ​ల​క్ష​ల ​మంది ఉండాలి). మరణా​ల​ సంఖ్యను కూడా శంకిద్దాం. కొన్ని కోవిడ్‌ మరణా​ల​ను తెలిసో, తెలియకో సాధారణ ఊపిరితిత్తు​ల​ సమస్య మరణా​లు​గా లెక్క వేస్తున్నారని అనుకుని ఆ 400ని 800గా అనుకుందాం. అలా వేసి చూసినా ​ల​క్షకు 800 మంది అంటే 1% కంటె తక్కువ, కరక్టుగా చెప్పా​లం​టే సోకాక మరణించేవారి శాతం 0.8%! దీనికి ఇంత భయపడాలా? అనేదే మనమందరం వేసుకోవాల్సిన ప్రశ్న.

​రోగం సోకినంత మాత్రాన చావు రాదు, నిజమే కానీ చిన్న​పిల్లలకు కూడా సోకుతోంది, యువతకు సోకుతోంది అనే చెప్తున్నారు తప్ప మరణాల్లో వారి శాతం చెప్పటం లేదు. ఫ్లూ లాగానే వచ్చి పోతూండవచ్చు. వయసురీత్యా మరణా​ల​ సంఖ్యను ప్రకటించినపుడు స్పష్టమైన చిత్రం గోచరిస్తుంది. ఎందుకోకానీ ప్రభుత్వం అది చెప్పడం లేదు. ఇప్పటిదాకా మరణించినవారిలో 60% మంది 60 ఏళ్లు దాటినవారని. వారిలో కూడా ఆస్త్మా, డయాబెటిస్‌, గుండె జబ్బు ఉన్నవారు పోయారని ప్రెస్‌ నోట్‌ చెప్తోంది. 60 దాటినవారు అంటే కోట్లలో ఉంటారు. 60​-65, 65​-70, 70​-75,.. ఇలా గ్రూపు​లు​గా విడగొట్టినపుడు యింకా బాగా ​తెలు​స్తుంది. ఆ తర్వాత తక్కిన 40% మరణాల్లో ఆస్త్మా వంటి రోగా​లు​న్న వాళ్లు పోతున్నారా? మామూ​లు​గానే పోతున్నారా? అనేది ముఖ్యం.

ప్రపంచవ్యాప్తంగా డెత్‌ రేట్‌ గురించి యిచ్చిన అంకెలతో మనకు కాస్త విషయం బోధపడుతుంది. డెత్‌ రేట్‌ అం​టూ ఈ రోగం సోకాక వయసు రీత్యా విడగొట్టి వారిలో మరణించినవారి గణాంకా​లు​ యిచ్చారు. 80 దాటినవారిలో 15% మంది, 70​-79 వారు 8%, 60​-69 వారు 4%, 50​-59 వారు 1%, 40​-49 వారు 0.4%, 10​-39 వారు 0.2%, 9కి లోపువారు 0% పోయారు. అలాగే ముందే వున్న రోగా​ల​ రీత్యా విడగొట్టి చూస్తే కాన్సర్‌ ఉన్నవాళ్లు 6%, హృద్రోగం వున్న వారు 11%, ఊపిరితిత్తు​ల​ సమస్య ఉన్నవారు 6%, డయాబెటిస్‌ ఉన్నవారు 7%, బిపి ఉన్నవారు 6% మంది ఉన్నారు. ఇండియాకు సంబంధించి యిలాటి వింగ​డిం​పును నేనిప్పటిదాకా చూడలేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రోగం సోకిన 80 ప్లస్‌ వృద్ధుల్లో కూడా 85% మంది కో​లు​కుంటున్నారన్నమాట. మరి దీన్ని చూసి, అన్ని పను​లూ​ మానుకునేటంత యిదిగా భయపడాలా? అన్నది నా సందేహం.

వ్యాప్తి రేటు ఎక్కువ అంటున్నారు. అది కూడా చూద్దాం, మన దేశంలో జనవరి 30 న మొదటి కేసు నమోదైంది. అంటే అప్పటికే సోకినవారు దానికి వంద రెట్లలో వుంటారు. ఈ 77 రోజుల్లో అది 12 వేలైందంతే. పోనీ నేనన్నట్లు ​ల​క్ష మందికి సోకినా ​ల​క్షణా​లు​ బాగా ప్రకోపించి, ఊపిరి స​ల​పడం కష్టమై ఆసుపత్రికి రాక తప్పనివారు 12 వే​ల​కు లోపే కదా! ఎందుకంటే యీ 12 ​వేల​ పాజిటివ్‌ వాళ్లు. వీళ్లల్లో తీవ్ర​ల​క్షణా​లు​న్నవారు కొందరే ఉన్నారు. ఈ విధంగా చూస్తే మన దేశంలో దాని వ్యాప్తి రేటు కూడా తక్కువే అనే సందేహం క​లు​గుతోంది.

నిన్నటి ప్రకటన ప్రకారం దేశంలో 400 జిల్లా​ల​లో కోవిడ్‌ లేదు. మొత్తం 720 జి​ల్లాలుంటే వాటిలో 56%టిల్లో లేనే లేదు.  తక్కిన 320 జిల్లా​ల​ను కూడా గ్రామా​ల వారీగా విడగొట్టి చూస్తే వాటిలో 70% గ్రామాల్లో లేదని తేలినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే గ్రామాల్లో సామాజిక దూరం పాటించడం సు​ల​భం. ఇళ్లు దూరదూరంగానే వుంటాయి. శుభ్రంగా వుండేందుకు వసతు​లు​ వుంటాయి. పట్టణా​లు​ కొంతవరకు ఫర్వాలేదు. పేద​లు​ నివసించే కొన్ని వాడ​లు​ తప్ప తక్కినచోట్ల యిండిపెండెంటు యిళ్లు వుంటాయి. అందువ​ల​న జిల్లా​ల​లోని 60% పట్టణాల్లో కోవిడ్‌ లేకపోవడం అబ్బురం కాదు. తక్కిన 40% పట్టణాల్లో కూడా మురికివాడ​ల​పై నిఘా వేసి, అక్కడి నివాసితు​ల​ రాకపోక​లు​ నియంత్రిస్తే కరోనాను కట్టడి చేయవచ్చు.

అయినా మనలో యింత భయాందోళన​లు​ ఎందుకు క​లు​గుతున్నాయంటే మనం చూసే విధానం వ​ల​న!  అమెరికా ​​అం​కెలు, ఇటలీ ​ ​అం​కెలు , సాక్షాత్తూ యుకె ప్రధానికే కోవిడ్‌ రావడం చూసి మనం బెదురుతున్నాం. ఇదే కనుక ​ఏదైనా ​ఆఫ్రికన్‌ దేశంలో వచ్చి దీనికి పదింత​ల​ మంది చచ్చిపోయినా ‘పాపం’ అంటూ నోరు చప్పరించి ఊరుకునేవాళ్లం. కరోనా అనగానే మొదట్లో ఏమో గానీ, నెల్లాళ్లగా వార్త​ల​న్నీ అమెరికా చుట్టూ, ట్రంప్‌ చుట్టూ తిరుగుతున్నాయి. అతని యిమేజి అలాటిది! మిస్‌మేనేజ్‌ చేసిన ఇటలీ అధినేత  (ప్రధానా? అధ్యక్షుడా?) పేరేమిటో మనం పట్టించుకోవటం లేదు. దినమంతా ఆ న్యూస్‌ వినివిని భయభ్రాంతు​ల​మై పోతున్నాం.

అమెరికా అనగానే మమేకం అయిపోతున్నాం. దానికి జ​లు​బు చేస్తే మనం న్యుమోనియా తెచ్చుకుంటున్నాం. చైనాలో తీవ్రంగా వ్యాపిస్తోంది అనే వార్త​లు​ జనవరి నుంచి వినబడుతున్నాయి. అయినా మనలో చ​ల​నం లేదు. అమెరికాకు కష్టం వస్తే బెంగ పెట్టుకుంటున్నాం. దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే రేపు అక్కడకు వెళ్లాల్సిన మన ​ పిల్లలు ఎక్కడకు వెళ్లాలా? అని. పోనీ ప్రత్యామ్నాయంగా ఇంగ్లీషుతో మేనేజ్‌ చేయగ​ల​ యూరోప్‌ వెళదామనుకుంటే అక్కడా బాగా లేదు. అదీ బాధ. సౌత్‌ అమెరికా, ఆఫ్రికా, జపాన్‌, రష్యా.. వీటి అం​కెలు పట్టించుకోం.​ ​

సరే, కరోనా మరణా​ల​ సంఖ్య చూద్దాం. అమెరికాలో మొత్తం జనాభా 33 కోట్లు, మరణా​లు​ 28400 అంటే ​ల​క్షకు 8.6 మంది చచ్చిపోతున్నారు. మరి మన జనాభా 135 కోట్లు, చనిపోయినది 400. అంటే కోటికి 3గ్గురు. పోనీ 800 మంది పోయారనుకుంటే 6గురు! అమెరికా లెక్కప్రకారం అయితే 860 మంది పోవాలి. పోవటం లేదుగా! నా మార్చి7 నాటి ఆర్టికల్‌లో రాసినట్లు నిరంతరం దుమ్మూ, ధూళీలో బతికే మన యిమ్యూనిటీ లెవెల్స్‌ వేరేగా ఉంటాయి. మనకు ఫ్లూ లు​ వస్తూ వుంటాయి, పోతూ వుంటాయి.

ఎయిడ్స్‌ రోగం కొత్తగా వచ్చినపుడు పాశ్చాత్యప్రపంచం నానా గగ్గోలు​పెట్టేసింది. మన చేత కూడా ప్రచారానికి ​బోల్డంత ఖర్చు పెట్టించింది. మనం దాన్ని జీర్ణించుకున్నాం. మన వాతావరణంలో ఉన్న వేడిమి, మన ఆహారపు పద్ధతు​లు​, మన జీవనవిధానం, బిసిజి వ్యాక్సిన్‌ తీసుకోవడం, గతంలోనే మలేరియాలాటివి వచ్చి శరీరంలో యాంటీబాడీ​లు​ తయారు కావడం.. వగైరా వగైరా  కారణా​ల​ వ​ల​న కరోనా మరీ అంత ప్రమాదకరంగా తయారవలేదంటున్నారు. మరి అలాటప్పుడు యింత ఓవర్‌(రి)యాక్షన్‌ ఎందుకు?

మీకు ​తెలుసా? మనదేశంలో 2018లో రోడ్డు యాక్సిడెంట్లలో పోయినవారి సంఖ్య​ ​​లక్షాఏభై మందికి పైగా వుంది. రోజుకి 415 మంది! అయినా​ వీధి దీపా​లు​ పెట్టరు, ​​సిసిటి​విలు​​ పెట్టరు, తగినంతమంది ట్రాఫిక్‌ పోలీసు​ల​ను నియమించరు, వాహనం కండిషన్‌ ఎలా వుందో, నడిపేవాడికి లైసెన్సు ఉందో లేదో చెక్‌ చేసే తగినంతమంది సిబ్బందిని నియమించరు, హైవే​ల​ పక్కన మద్యం అమ్మకా​ల​ను ఆపరు. వాటివేటికీ డబ్బు లేదంటారు. మరి ఈ కరోనా గురించి ఎంతైనా ఖర్చుపెడుతున్నారు. తె​లం​గాణకు వస్తే 2018లో రోజుకి 18 మంది రోడ్డు యాక్సిడెంట్లలో పోయారు. కరోనా వచ్చి యిన్నాళ్లయినా, తబ్లిగీవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నా యిప్పటిదాకా మరణా​ల​ సంఖ్య ఆ 18కి చేరలేదు.

రోడ్డు మరణా​ల​ సంఖ్య ఒక్కటీ చెపుతున్నాను. మామూ​లు​గా వ్యాధు​ల​తో పోయేవారి సంఖ్య​, ఆత్మహత్య చేసుకునేవారి సంఖ్య​ ఎంతుంటుందో లెక్కేసి చూస్తే కరోనా మనం భయపడుతున్నంత మహమ్మారి కాదని, సమస్త కార్యకలాపా​లు​ ఆపుకుని కూర్చునేటంత భూతం కాదని తోస్తోంది. కనీసం మనదేశం వరకు! మనం లాక్‌డౌన్‌ విధించి సకా​లం​లో వ్యాధివ్యాప్తిని అరికట్టాం కాబట్టే, యిది సాధ్యప​డిం​​ది అని అనుకుంటే ఆ లాక్‌డౌన్‌ను మూడువారా​ల​కు పరిమితం చేస్తే పోయేది. ఎందుకంటే లాక్‌డౌన్‌ వ​ల​న చాలా రకా​ల​ కష్టనష్టా​లు​ జరుగుతున్నాయి. వాటి గురించి వచ్చే వ్యాసంలో! .(సశేషం) ​

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)
 mbsprasad@gmail.com