cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : కరోనా వాక్సిన్ – కాదేదీ పబ్లిసిటీ కనర్హం!-1

ఎమ్బీయస్ :  కరోనా వాక్సిన్ – కాదేదీ పబ్లిసిటీ  కనర్హం!-1

కోవిడ్ 19 మానవాళికి ముప్పుగా దాపురించినా, కొందరికి మాత్రం లాభదాయకంగా తయారైందని అనిపిస్తోంది. ఈ మధ్యే కరోనా వైరస్ చిత్రంలో చుట్టూ పొడుచుకుని వచ్చే వాటిని ఆవు పొదుగుతో పోలుస్తూ వేసిన ఒక మంచి కార్టూన్ చూశాను. ప్రయివేటు ఆస్పత్రి వాడు దానిలోంచి పాలు పిండుకుంటూ వుంటాడు. వెనక్కాల ఫార్మా కంపెనీవాడు ఓ పెద్ద బకెట్‌తో నుల్చొనివుంటాడు. నిజానికి ఆ వెనక్కాలే రాజకీయనాయకుల క్యూ కూడా గీయాల్సింది. కరోనా పాజిటివ్ వస్తే ప్రాణాలు ఓ పట్టాన పోవు కానీ, ఆసుపత్రుల దోపిడీకి గురై జేబు ఖాళీ అవుతుందని అనేకమంది చెప్తూన్నారు. రోగం నుంచి త్వరలోనే కోలుకోవచ్చు కానీ, దివాలా నుంచి కోలుకోవడానికి దశాబ్దాలు పట్టవచ్చు. ఆసుపత్రిలో చేరితే యిచ్చేది మామూలు మాత్రలు, వేణ్నీళ్లే కానీ హీనపక్షం 5, 6 లక్షలు దోచుకోకుండా బయటకు వదలటం లేదని జనాలు గగ్గోలు పెడుతున్నారు.

ఇక మందుల కంపెనీల గురించి చెప్పాలంటే, యిప్పటిదాకా ఏది కచ్చితంగా పని చేస్తుందో ఎవరూ చెప్పలేక పోతున్నారు కానీ ఫలానాది పని చేస్తుందట అనే వార్త రాగానే దాని రేటు అమాంతం పెంచేస్తున్నారు. ఉన్న మందులను మార్చి (రీపర్పస్‌డ్) దీనికి మందులు తయారుచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి కానీ అందరూ వాక్సిన్ కేసే చూస్తున్నారు. ఆ కల వాస్తవరూపం ధరించి, వాక్సిన్ తయారై మార్కెట్‌లోకి వచ్చినపుడు ఏ రకమైన దోపిడీ జరుగుతుందో ఊహించడానికే అసాధ్యంగా వుంది. 

నిఝంగా పనిచేసే వాక్సిన్ మార్కెట్లోకి వచ్చినపుడు జనాలు దాని గురించి ఎంత ఆరాటపడతారో ఆలోచించండి. గోల్డ్ రష్‌లా, ఇట్స్ ఏ మ్యాడ్, మ్యాడ్... వ(ర)ల్డ్‌లో నిధికోసం పడే పోటీలా, అందరూ ‘నాకు, నాకు’ అంటూ విరుచుకుని పడిపోరూ? మరోటీ, మరోటీ అయితే ఏమో కానీ యీ వ్యాధి ప్రపంచమంతా వ్యాపించింది. అందువలన అందరికీ కావాలి. ప్రపంచ జనాభా 780 కోట్లనుకుంటే కనీసం నాలుగో వంతు మందికి అంటే 200 కోట్ల మందికి వేయాల్సి వస్తుంది. ఈ టీకా తయారైతే కానీ ఎన్ని డోసులు వేయాలో, బూస్టర్ డోస్ అవసరమో కాదో తెలియదు. 

ఇప్పటికే బ్రిటన్ కొన్ని వాక్సిన్ తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదిర్చేసుకుని 19  కోట్ల డోసులకు బుక్ చేసేసుకుంది. పెద్దన్న ట్రంప్ తెంపరితనం అందరికీ తెలుసు. ముందు నాకివ్వకపోతే ఆటంబాంబు వేసేస్తా జాగ్రత్త అని అనేసినా అనేయగలడు. ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దుకోగా, మన దేశానికి మిగిలేవెన్ని? సరే మాటవరసకి ఒక కోటి డోసులు మన వాటాకు వచ్చాయనుకోండి. ముందు మీకూ, నాకూ యిస్తారా? వైద్యసిబ్బందికి, పోలీసు సిబ్బందికి, పారిశుధ్య పనివారికి ముందుగా యివ్వడం న్యాయం. ఆ తర్వాత రిస్కు ఎక్కువున్నవారికి అలా యిచ్చుకుంటూ రావాలి. కానీ మధ్యలో పలుకుబడి వున్న ధనికులు, నాయకులు చేరిపోతారు. వాళ్లకూ, వాళ్ల బంధుమిత్రులకూ పంచేసుకున్నాకనే డాక్టర్లకు, నర్సులకు యివ్వవచ్చులే అంటారు. ఈ లెక్కన మన దాకా వచ్చేలోపున రోగమేనా ఉపశమించవచ్చు, మనమేనా లోకం నుంచి ఉపసంహరింప బడవచ్చు. 

ఈ సంగతి తెలిసి, మనకు మనసులో ఆరాటం వుంది. వాక్సిన్ లేదా సరైన మందు ఎంత త్వరగా అందుబాటులోకి వస్తుందో, ఎంత త్వరగా యీ కరోనా భయం గుప్పిట్లోంచి బయటపడతామో అని అందరం ఉగ్గబట్టుకుని చూస్తున్నాం. ఈ ఆరాటాన్ని సొమ్ము చేసుకుందామనే ఫార్మా కంపెనీలు ఎదురుచూస్తున్నాయని కార్టూనిస్టు భావం. వారి వెనక్కాలే నాయకులెందుకు వుండాలని నేనంటానంటే కరోనా సంక్షోభం వచ్చాక వివిధ పాలకులు వివిధ రకాలుగా వైఫల్యం చెందినా, అనేకమంది రోగాల పాలై, దేశం, అన్ని రాష్ట్రాలు సకలవిధాలా సర్వనాశనం అయినా ‘మేం మిమ్మల్ని కాపాడేశాం, కాపాడేస్తున్నాం, మేమే లేకపోతే మీరు యింకా అధ్వాన్నమై పోదురు’ అని గొప్పలు చెప్పుకోవడానికి కరోనా వాళ్లకు ఉపయోగపడుతోంది. రేపు ఏ విషయంలోనైనా అభివృద్ధి ఎందుకు జరగలేదు, యిచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగితే ‘కరోనా వచ్చి అతలాకుతలం చేసేసింది కానీ, లేకపోతేనా..’ అని సాకు చెప్పుకోవడానికి అక్కరకు వస్తోంది. 

ఇది ఒక్కటే కాదు, మందో, మాకో, వాక్సినో ఏదో ఒకటి వస్తే అదంతా మా ఘనతే అని చెప్పుకోవడానికి, దేశం లేదా రాష్ట్రం ఏదో సాధించేసిందని పబ్లిసిటీ చేసుకోవడానికి కరోనాను వాడుకుంటున్నారు. నిజంగా ఏదో సాధించి వుంటే చెప్పుకున్నా తప్పు లేదు కానీ కేవలం పబ్లిసిటీ కోసం మనకు లేనిపోని భ్రమలు కల్పించడం క్షమార్హం కాదు. ముఖ్యంగా జబ్బుతో కంటె ఆందోళనతో ఎక్కువ కృంగిపోతున్న యీ సమయంలో మన మనోభావాలతో ఆటలాడుకోవడం, ఒక్కమాటలో చెప్పాలంటే దుర్మార్గం. ఫార్మా కంపెనీలు తమ కంపెనీ షేరు విలువ పెంచుకోవడానికో, ప్రతిష్ఠ తెచ్చుకోవడానికో ఇదిగో వర్షం వచ్చేస్తోంది అని మబ్బుల్ని చూపించవచ్చు. ప్రభుత్వం వారితో చేతులు కలిపితే ఎలా? ప్రజలకు నిజానిజాలు చెప్పవలసిన బాధ్యత వారికి లేదా?

2013లో ప్రధాని అభ్యర్థిగా మోదీ ముందుకు వచ్చినపుడు యావన్మంది ఆయన సామర్థ్యంపై ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాల్లో అవినీతిని పారద్రోలుతానని, స్విస్ బ్యాంకులనుంచి నల్లధనాన్ని వెనక్కి తెప్పించి, అందరి ఖాతాల్లో వేస్తానని చెప్పిన మాటలు జరగకపోయినా ఫర్వాలేదు కానీ సమర్థవంతంగా పనిచేసి దేశాన్ని ముందుకు నడిపిస్తాడని అందరూ ఆశించారు. అవి క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇటీవలి కాలంలో ఆర్థికవ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో మోదీపై నమ్మకం బాగా సడలింది. ఇంతలో మూలిగే నక్కపై తాటికాయలా కరోనా వచ్చిపడింది. అనేక దేశాధిపతులే దీని కారణంగా తలకిందులయ్యారు. కానీ మనం మాత్రం ‘మేరా పాస్ మాఁ హై’ అన్నట్లు ధీమాగా వున్నాం. దానికి తగ్గట్టే మోదీ ఇదెంత రెండు, మూడు వారాల్లో దీని పని పట్టేస్తాం అన్నంత ధైర్యం ప్రకటించారు. 

అందువలననే ఆయన లాకౌడౌన్‌ అన్నా, చప్పట్లు కొట్టమన్నా, దీపాలు ఆర్పమన్నా అన్నిటికీ సై అన్నాం. 

క్రమేపీ ధీమా సడలిపోయింది. కరోనా బెదరలేదు కానీ మనం బెదరడం మొదలెట్టాం. ఇతర దేశాలు ఎదుర్కోని వలస కార్మికుల సమస్య మనకు పెద్ద గుదిబండగా మారింది. టెస్టింగు, వైద్యసదుపాయాల లేమి, శాస్త్రజ్ఞుల నెవరినీ సంప్రదించలేదన్న విషయం బయటకు రావడం – యివన్నీ మోదీ యిమేజిని దెబ్బ తీయసాగాయి. దాంతో యిక ఆయన బాధ్యత యితరులపైకి నెట్టేయడం ప్రారంభించాడు. వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలదే అన్నాడు, లాక్‌డౌన్ కొనసాగించాలో, మానాలో వాళ్లదే నిర్ణయం అన్నాడు, శాస్త్రీయ విషయాలపై సలహాలిచ్చే బాధ్యత ఐసిఎమ్‌ఆర్‌దే నన్నాడు. 

నిజానికి దానికి ముందు నుంచీ యిచ్చిన ప్రాధాన్యత ఏమైనా వుందా? ఎడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో అనుభవం వుందో లేదో చూశారా? ఆ సంస్థలో డాక్టర్లు ఉన్నారా? ఎడ్మినిస్ట్రేటర్లు ఉన్నారా? ఏవీ లేకుండా యిప్పటికిప్పుడు నీదే భారం అనగానే అది అనేక పొరపాట్లు చేసింది. ప్రపంచ స్థాయిలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎంత అభాసుపాలైందో, మన జాతీయ స్థాయిలో ఐసిఎమ్మార్ అదే స్థాయిలో చెడ్డపేరు తెచ్చుకుంది. టెస్టింగ్‌కు ఏ కిట్లు వాడాలో, ఎలా టెస్ట్ చేయాలో లాక్‌డౌన్ విధించాక కూడా ఓ పట్టాన ఆదేశాలు యివ్వలేదు. తను గందరగోళపడుతూ, యితరులనూ గందరగోళంలోకి నెట్టింది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఎవరి చిత్తం వచ్చినట్లు వాళ్లు వ్యవహరిస్తున్నారు. కెసియార్ వ్యవహారం చూస్తున్నాం కదా! 

భారత్‌కు వచ్చిన వైరస్ స్ట్రెయిన్ బలహీనమైనదని, మనపై ఎక్కువ ప్రభావం చూపదని, 5 లక్షల కేసుల కంటె రావని అంటూ వచ్చారు. తీరా చూస్తే మనం కేసుల పరంగా (ఇప్పటికి 13 లక్షలు) ప్రపంచంలో మూడో స్థానానికి చేరాం. టెస్టింగులు సరిగ్గా జరగక కానీ లేకపోతే కేసుల సంఖ్య యింకా పెరిగేదంటున్నారు. జనాభా నిష్పత్తితో పోల్చి మనం ఊరడిల్లవచ్చు కానీ ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశకు చేరామని, వచ్చే నాలుగు వారాల్లో విపరీతంగా పెరుగుతుందని భయపడుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పాలకులపై ప్రజల విశ్వాసం అడుగంటింది. దేశంలో చాలా రాష్ట్రాలలో, కేంద్రంలో ఉన్న బిజెపిపై దీని ప్రభావం పడుతుంది. దాన్ని నిరోధించడానికి మోదీ వాక్సినాయుధాన్ని వాడుతున్నారనే అభిప్రాయం బలపడుతోంది.

ప్రజల మనోస్థయిర్యం పెంచడానికి, తన యిమేజి మరింత దెబ్బ తినకుండా చూడడానికి, పబ్లిసిటీ కోసం ఆగస్టు 15 నాడు యివ్వబోయే ప్రసంగంలో కోవిడ్‌కు స్వదేశీ వాక్సిన్ తయారైపోయిందని ప్రకటించి, ఆ వాక్సిన్ తయారీదారులను తగురీతిలో సత్కరించి, హడావుడి చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దానికి గాను వాళ్లు వాడుకుంటున్నది ఐసిఎమ్మార్‌ను. ఆగస్టు 15 కల్లా, వీలైతే యింకా ముందే కోవిడ్ వాక్సిన్ తయారుచేసి పబ్లిక్‌కు అందుబాటులోకి తేవాలని ఆ సంస్థ రెండు టీకా కంపెనీలకు లేఖ రాయడమే యీ సందేహాలకు కారణం. ఏ పరిశోధనైనా ఫలానా తారీకుకి పూర్తవుతుందని చెప్పగలరా? 

పైగా కోవిడ్ వైరస్ రకరకాల రూపాలను ధరిస్తోందని, కదిలే లక్ష్యం (మూవింగ్ టార్గెట్) వంటి ఆ వైరస్‌ను ఛేదించడం ప్రస్తుతం అసాధ్యంగా తోస్తోందని అందరూ చెప్తూంటే యీ సమయంలో ఐసిఎమ్మార్ యిలా రాయడమేమిటని దేశంలోని సైంటిస్టులంతా ఎద్దేవా చేశారు. టీవీ చర్చల్లో నిత్యం దాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. అబ్బెబ్బే, విధివిధానాల్లో అనవసర జాప్యం లేకుండా త్వరగా చేయమన్నామే తప్ప తుపాకీ కణతలకు గురిపెట్టి వాక్సిన్ అడగలేదు అని ఐసిఎమ్మార్ వివరణ యిచ్చుకున్నా పేలవంగా వుంది. సైంటిస్టులతో నిండివున్న అలాటి సంస్థ అంత అశాస్త్రీయంగా ఎలా వ్యవహరిస్తుంది? ఏదో ఒక రాజకీయ ఒత్తిడి లేకపోతే? అబ్బే లేదు అంటే ఒక ఉన్నత సంస్థ అంత బాధ్యతారాహిత్యంతో లిఖితపూర్వకంగా రాసినప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవద్దా? ఖండించవద్దా?

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2020)