Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: దక్కిందానికి లెక్కుందా?

మనకు పుట్టుకతో సంక్రమించిన హక్కు - సణుగుడు. అది లేదు, యిది లేదు, ఉన్నా తగినంతగా లేదు అని కనిపించని దేవుడి మీద పడి ఏడుస్తూ ఉంటాం. మనకేం యివ్వాలో దేవుడికి తెలియదు పాపం అనుకుంటూ ఆయన బొమ్మ కనబడగానే కోరికల లిస్టు చదవడం ప్రారంభిస్తాం. అవి తీరిస్తే మన తరఫు నుంచి ఏమిస్తామో కూడా చెప్పేస్తాం. మరుక్షణం నుంచి మొక్కులు తీరతాయేమోనని చూసి, తీరకపోతే పరాకు ఏలరా అని పాటలు పాడి, ఆ తర్వాత కోపం తెచ్చుకోవడానికి ఉపక్రమిస్తాం.

ఈ సందడిలో ఆయన అడక్కుండానే మనకు ఏం యిచ్చాడు అనేది లెక్కే వేయం. ఎవరైనా గుర్తు చేయబోతే 'నాకు ప్రత్యేకంగా చేసినదేముందండీ, అందరికీ యిచ్చినట్లే నాకూ కాళ్లూ, చేతులూ యిచ్చాడు. అదేమైనా ఉద్ధరింపా?' అని మండిపడతాం. అంత తీసిపారేశామే, కాళ్లూ చేతులూ అంత తేరగా ఉన్నాయా? అవి లేనివాళ్లను, ఉండీ సరిగ్గా పనిచేయనివారినీ, ఆపదల్లో పోగొట్టుకున్నవారినీ అడిగి చూస్తే తెలుస్తుంది.

నిద్రలో బెణికి వేలు కదల్చలేకపోతే యివాళ లాప్‌టాప్‌ చూడడం ఎలా, సెల్‌ ఆపరేట్‌ చేయడం ఎలా, డ్రైవ్‌ చేయడం ఎలా అని  గగ్గోలు పెట్టేస్తామే, అలాటిది పక్షవాతం వచ్చినవాడి సంగతేమిటని ఆలోచించవద్దా? ఇప్పటిదాకా పక్షవాతం రానందుకు సంతోషించవద్దా? మీ పిల్లవాడికి ఫస్ట్‌ ర్యాంకు రాలేదని ఏడుస్తున్నావు, అసలు పాసే కాని కుర్రాడి తల్లితండ్రులు, చదవమంటే యింట్లోంచి పారిపోయిన పిల్లాడి తలిదండ్రులు, అవకరంతో పుట్టిన పిల్లలున్న తలిదండ్రులు, పిల్లలే లేని తలిదండ్రులు, పెళ్లే కాని స్త్రీపురుషులు - వీళ్లందరి గురించీ ఒక్కసారి ఆలోచిస్తే నువ్వెంతటి అదృష్టవంతుడివో తెలుస్తుంది. అందుకే 'థింక్‌ అండ్‌ థాంక్‌' అనే నానుడి పుట్టింది. తలచి చూస్తే, తరచి చూస్తే మనకు నూటికి 90 మంచివి ఉన్నాయని, 10 మాత్రమే లేవని అర్థమవుతుంది. దీన్నే కౌంటింగ్‌ ద బ్లెస్సింగ్స్‌ అని కూడా అంటారు. దేవుడు మనకు ప్రసాదించినవి లెక్క వేసుకోవడమన్నమాట.

తక్కిన 10 తెచ్చుకోవడానికి యీ 90 ఉపయోగించుకోవచ్చన యింగితం లేకుండా, అది కూడా అప్పనంగా యిచ్చేయాలని మన కోరిక. అంటే మానవప్రయత్నానికి ఏ సావకాశమూ లేకుండా దేవుడే అన్నీ మనకు అమర్చేయాలన్నమాట. ముఖ్యంగా మన ఫిర్యాదు - డబ్బు గురించి. డబ్బుంటే తక్కినవన్నీ అవే వస్తాయని ప్రగాఢ నమ్మకం. డబ్బు సంపాదించే సాధనాలు యిచ్చాడుగా అని ఎవరైనా అంటే తెల్లబోయి చూస్తాం. ఎక్కడండీ, ఖాళీ జేబుల్తో యీ లోకంలోకి పంపించాడు అంటాం. మరి ఎవరైనా వచ్చి ఓ లక్ష యిస్తాం, ఓ కన్ను యిచ్చేయండి అంటే యిస్తామా? ఇవ్వం. అంటే మన కంటి విలువ లక్షకు పైన అన్నమాట. రెండు కళ్లకు రెండు లక్షలు. కాళ్లు, చేతులు, కిడ్నీ, లివరు, పాంక్రియాస్‌,  వీటన్నిటికీ లెక్క కట్టి చూస్తే మన శరీరమే పది లక్షలకు తక్కువ విలువ చేయదు.

అనుమానం వస్తే కిడ్నీ మార్కెట్‌లో రేటు కనుక్కోండి. అంటే శరీరమే పది లక్షల పెట్టుబడి. దాని మీద మీరు ఏడాదికో లక్షయినా సంపాదించలేరా? గలరు. బ్యాంకులో వెళ్లి కూర్చుంటే వాళ్లు వడ్డీ యివ్వరు కానీ, ఆ అవయవాలను ఉపయోగిస్తే తప్పకుండా ఆదాయం వస్తుంది. ఎంత బాగా ఉపయోగించగలిగితే అంత ఎక్కువ వస్తుంది. ఒక్కోసారి బుర్ర పనిచేయక తప్పుడు లెక్కలు వేసి, వ్యాపారంలో డబ్బు పోగొట్టుకోవచ్చు, కానీ మళ్లీ దాన్ని రాబట్టుకునే తెలివితేటలు కూడా దేవుడు మీకు యిచ్చాడు. ప్రతీ జీవికీ ఎంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా బతకగలిగే, పరిస్థితి బట్టి తనను తాను మార్చుకోగలిగే తెలివితేటలు యిచ్చాడు దేవుడు. పశుపక్ష్యాదులన్నీ వాటిని పూర్తిగా వినియోగించుకుంటాయి తప్ప ఆత్మహత్య చేసుకోవు. 

ఆత్మహత్య చేసుకునే పనికి ఒడిగట్టేది మానవుడు ఒక్కడే. ఎందువలన? నిస్పృహ. దానికి కారణం నిరాశ. దానికి కారణం దురాశ. సాధారణంగా రావలసినదాని కంటె, వచ్చే అవకాశం ఉన్నదాని కంటె ఎక్కువ వస్తుందని ఆశ పడడం, అది రాలేదని నిరాశ పడడం, పరిస్థితి ఎన్నటికీ బాగుపడదని ముందుగానే తీర్మానించుకోవడం, ఎందుకైనా మంచిదని ఎదురు చూసే ఓర్పు లేకపోవడం. అందుకే రోజుకి యిన్ని ఆత్మహత్యలు. ఒక్కోదాని కారణం వింటే మతిపోతుంది.

లోకంలో ఉన్న కష్టాలన్నీ తనకే ఉన్నట్లు ఫీలవడంతోనే వస్తుంది ఆత్మహత్య ఆలోచన. ఇరుగుపొరుగు వాళ్ల కష్టాలు తెలుసుకుంటే మనకు ఎన్ని కష్టాలు లేవో తెలుస్తుంది. ఆసుపత్రికి వెళితే మనకు ఎన్ని రోగాలు లేవో తెలుస్తుంది. మురికివాడల్లోకి వెళ్లి చూస్తే దారిద్య్రం మనకెంత దూరంలో ఉందో తెలుస్తుంది. లేదు, నేను ఏమీ తెలుసుకోను అని చీకట్లోనే ఉండిపోతే యిలాటి ఆలోచనలు వస్తాయి. లోకాన్ని పరికించాలి, జీవితాలు తెలుసుకోవాలి, జీవితచరిత్రలు చదవాలి. మన కెంత దక్కిందో స్పష్టమవుతుంది. అప్పుడు ఫిర్యాదు చేయడానికి మాటలు తడుముకోవలసి వస్తుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com