cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ‘డే ఆఫ్ ద జాకాల్‌’కు 50 ఏళ్లు

 ఎమ్బీయస్: ‘డే ఆఫ్ ద జాకాల్‌’కు 50 ఏళ్లు

డే ఆఫ్ ద జాకాల్‌ అనేది 50 ఏళ్ల క్రితం 1971లో విడుదలైన ఒక థ్రిల్లర్. 1973లో అదే పేరుతో సినిమాగా కూడా వచ్చింది. దాని యిన్‌స్పిరేషన్‌తో మరి కొన్ని రచనలు, సినిమాలు వచ్చాయి. కొందరు నిజజీవితంలో కూడా ఆ తరహా హత్యలు చేశారు, చేయబోయారు. ఈ పుస్తకం గురించి ప్రత్యేకంగా వ్యాసం రాయడానికి కారణమేమిటంటే యిది ఒక పొలిటికల్ ఫిక్షన్. థీమ్ ఏమిటంటే, ఫ్రాన్సు అధ్యక్షుడు షాల్ ద గాల్ (ఛార్లెస్ డిగోల్ అని మనవాళ్లు రాస్తూంటారు) ను ఒక కిరాయి హంతకుడు హత్య చేయడానికి చేసిన విఫల ప్రయత్నం. ద గాల్ పై అనేక హత్యాప్రయత్నాలు జరిగాయి, ఆరిటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కానీ అన్నీ విఫలమయ్యాయి. అతను 1970 నవంబరులో ప్రశాంతంగా మరణించాడు. 1971లో పుస్తకం రిలీజయ్యే నాటికి పాఠకులందరికీ తెలుసు, కథానాయకుడు చేసే ప్రయత్నం విఫలమవుతుందని! క్లయిమాక్స్ తెలిసిపోయాక పుస్తకం చదవబుద్ధవుతుందా? ఈ సందేహంతోనే దీన్ని ప్రచురించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

‘ఆ మాట నిజమే కానీ దీనిలో ముగింపు కంటె నేను యిచ్చిన టెక్నికల్ డిటైల్స్ ముఖ్యం. ఒక యిన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ఫ్రెంచి గూఢచారి వ్యవస్థ గురించి, ఎవరైనా కిరాయి హంతకుడు ఆయుధాలు సమకూర్చుకో దలచుకుంటే ఏ యే దేశాలు తిరుగుతాడు, ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాడు, అతని విజయావకాశాలు ఎన్ని వున్నాయి అనేది పాఠకుడికి ఆసక్తి కలిగిస్తుంది.’ అని రచయిత ఫ్రెడరిక్ ఫోర్‌సైత్‌ (ఈ ఆగస్టు 25కి ఆయనకు 83 నిండుతాయి) వాదించినా పబ్లిషర్లు వినలేదు. అనేక తిరస్కరణల తర్వాత ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఒకసారి అచ్చులో వచ్చాక, దానికి వచ్చిన పేరు అంతాయింతా కాదు. ఫోర్‌సైత్‌ దీని తర్వాత 18 నవలలు రాశాడు, అనేక కథలు రాశాడు. నాకు చాలా యిష్టమైన నవల యిది. కథ చారిత్రక నేపథ్యాన్ని, కథాగమనాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

ద గాల్ (1890-1970) ఫ్రెంచి సేనాని. రెండవ ప్రపంచయుద్ధం కాలం నాటికి మంత్రిమండలిలో ఉన్నాడు కూడా. మొదటి ప్రపంచయుద్ధకాలంలో అగ్రరాజ్యంగా వున్న ఫ్రాన్స్ రెండో ప్రపంచ యుద్ధకాలం నాటికి అంతఃకలహాలతో నీరసించడం చూసి జర్మనీ దండెత్తింది. అధినేతగా వున్న పెటైన్ వాళ్లతో చేతులు కలిపాడు. ద గాల్ ఇంగ్లండ్ పారిపోయి, అతన్ని ఎదిరించాడు. ప్రవాసంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఏర్పరచి అక్కణ్నుంచి జర్మన్ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ నడిపాడు. అందువలన ఫ్రెంచ్ ప్రజలకు ఆదరపాత్రుడయ్యాడు. యుద్ధానంతరం 1944 నుంచి 1946 వరకు ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా వుండి ఫ్రాన్సులో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి రిటైరయ్యాడు. 1958లో అతన్ని మళ్లీ తీసుకుని వచ్చి ఫ్రాన్స్‌కు అధ్యక్షుణ్ని చేశారు. 1965లో మళ్లీ ఎన్నికయ్యాడు. 1969లో ఆ పదవికి రాజీనామా చేసి, రాజకీయాల్లోంచి తప్పుకున్నాడు. ఫ్రెంచి వాళ్లకు యిప్పటికీ అతను హీరోయే. పారిస్ ఎయిర్‌పోర్టుకి అతని పేరే పెట్టారు.

మరి యిలాటివాణ్ని కొందరు ఫ్రెంచివారు చంపడానికి ప్రయత్నించడమేమిటి అంటే దానికో కారణం వుంది. ఇంగ్లండు ప్రధాని అట్లీ మనకు స్వాతంత్ర్యం యిస్తానన్నపుడు చర్చిల్ వంటి ప్రముఖులనేకులు వ్యతిరేకించారు కదా, అలాగే ద గాల్ అల్జీరియాకు స్వాతంత్ర్యం యిస్తానన్నపుడు కొందరు వ్యతిరేకించడంతో ఆగకుండా పగబట్టారు. ఉత్తర ఆఫ్రికాలో ఈజిప్టు, లిబ్యా వంటి 7 దేశాలు చాలా సంపన్నమైనవి. వాటిలో అల్జీరియా ఒకటి. 1830లో ఫ్రెంచి వాళ్లు దాన్ని తమ వలసదేశంగా చేసుకున్నారు. 1848 నుంచి అది ఫ్రెంచ్ సామ్రాజ్యంలో భాగమై పోయింది. అయితే రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అనేక దేశాలలో స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమైనట్లే అల్జీరియాలోనూ ప్రారంభమైంది.

బలమైన ఫ్రెంచి సైన్యాన్ని ఎదుర్కోవడానికి వాళ్లు గెరిల్లా పద్ధతులు అవలంబించి, ఫ్రెంచి సైనికులనేకమందిని చంపారు. 1954 నాటికి అది తారస్థాయికి చేరింది. వాళ్లకు స్వాతంత్ర్యం యిచ్చేసి వదిలించుకుంటే మంచిదని కొందరు ఫ్రెంచివారూ, ఇన్నాళ్లూ యింతమంది సైనికులను పోగొట్టుకున్నది వదిలేసుకోవడానికా అని కొందరూ ఘర్షణ పడేవారు. (అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా నిష్క్రమణపై వాదోపవాదాలు నేటి చరిత్ర). అయితే ద గాల్ ‘జరిగిన నష్టాలు చాలు’ అంటూ 1962లో అల్జీరియాకు స్వాతంత్ర్యం యిచ్చేశాడు.

దానితో అల్జీరియా యుద్ధంలో క్షతగాత్రులైన ఫ్రెంచ్ సైనికులు, ఆత్మీయులను పోగొట్టుకున్న ఫ్రెంచ్ పౌరులు వీరంతా ద గాల్‌పై కత్తి కట్టారు. అతన్ని చంపడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరంతా కలిసి ఓఏఎస్ (ఆర్గనైజేషన్ ఆర్మీ సీక్రెట్) అనే సంస్థ పెట్టుకుని, ద గాల్‌ని చంపడానికి అతి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలను ఫ్రెంచి గూఢచారి వ్యవస్థ భగ్నం చేయగలిగింది. నిజానికి బ్రిటన్ గూఢచారి సంస్థలు స్కాట్లండ్ యార్డ్, ఎంఐ 5ల గురించి గొప్పగా చెప్పుకుంటారు కానీ ఫ్రెంచ్ వ్యవస్థ కూడా తక్కువేమీ కాదు. అంచెలంచెలుగా తమ అధ్యక్షుడి చుట్టూ రక్షణ వలయాలను ఏర్పరచి అతనిపై చేసిన హత్యాయత్నాలన్నిటిని భగ్నం చేయగలిగింది. దాని తాలూకు ఏజంట్లు, ఇన్‌ఫార్మర్లు ఓఏఎస్‌లో చొరబడి, కీలకమైన సమాచారాన్ని అందిస్తూ వుండేవారు.

ప్రఖ్యాత వార్తా సంస్థ రాయిటర్స్‌ 23 ఏళ్ల ఫోర్‌సైత్‌ను జర్నలిస్టుగా చేర్చుకుని 1962 మేలో పారిస్ పంపింది. అతనికి యిచ్చిన పని ఏమిటంటే, ద గాల్‌పై జరుగుతున్న హత్యాప్రయత్నాలు ఏ మేరకు విజయవంతమౌతాయో అంచనా వేసి కథనాలు రాయడం! అది రాయాలంటే కుట్రదారుల బలాబలాలను, ఫ్రెంచి గూఢచారి దళాల సామర్థ్యాన్ని అంచనా వేయగలగాలి. అందుకని ఫోర్‌సైత్‌ చీకటి పడేసరికి బార్లకు వెళ్లేవాడు. అక్కడకు అండర్‌వ(ర)ల్డ్ డాన్లు, పోలీసులు, కుట్రదారులు, ఇన్‌ఫార్మర్లు అందరూ వచ్చేవారు. రహస్య మంతనాలు సాగిస్తూ వుండేవారు. ఇంగ్లీషువాడైన ఫోర్సిత్‌కు ఫ్రెంచ్ భాష వస్తుందని ఎవరూ అనుకునేవారు కారు. అతను ఒంటరిగా కూర్చుని తాగుతూ వీళ్లందరి మాటలు చెవిన పడుతున్నా ఏమీ అర్థం కానట్లు నటిస్తూ, భావరహితంగా గోడల కేసి చూస్తూండేవాడడంతో వాళ్లు నిర్భయంగా మాట్లాడుకునేవారు. ఈ విధంగా అతను ప్రభుత్వ, ప్రభుత్వ వ్యతిరేక వ్యవస్థల గురించి చాలా ఆథెంటిక్ సమాచారాన్ని సేకరించాడు.

ఇదిలా సాగుతూండగానే 1962 ఆగస్టు 22న ఓఏఎస్ అధినేత జీన్ థీరీ నాయకత్వాన ద గాల్‌పై ఒక తీవ్రమైన హత్యాప్రయత్నం జరిగింది. ద గాల్, అతని భార్య, అల్లుడు ఒక కారులో ఎయిర్‌పోర్టుకి మెయిన్ రోడ్డుపై వెళుతూండగా కారుకి ఆటంకం కల్పించి, దూరం నుంచే కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ ద గాల్ ముక్కు పక్క నుంచీ దూసుకు వెళ్లిపోయింది. డ్రైవర్ వారిని సురక్షితంగా ఎయిర్‌పోర్టుకి చేర్చిన తర్వాత ద గాల్ ఏమీ చలించకుండా ‘వాళ్లకు సరిగ్గా షూట్ చేయడం కూడా రాదు’ అని వ్యాఖ్యానించాడు. తన భద్రతదళాలు ఎంత హెచ్చరించినా అతను వినేవాడు కాడు. దాంతో వారి బాధ్యత మరింత పెరిగేది. ఫోర్‌సైత్‌ పారిస్‌లో వుండగానే యీ ఘటన జరగడంతో అతనికి ఆసక్తి మరింత పెరిగి, ద గాల్ బాడీగార్డులతో పరిచయాలు పెంచుకుని సమాచారాన్ని కూపీ లాగే వాడు. కథనాలు పంపేవాడు.

1965లో రాయిటర్స్ నుంచి బయటకు వచ్చేసి, బిబిసిలో చేరాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ల మద్దతున్న నైజీరియాతో బియాఫ్రా యుద్ధం చేస్తోంది. ఇతన్ని నైజీరియాకు వెళ్లి వార్తలు పంపమన్నారు. రెండేళ్లయినా బయాఫ్రా లొంగలేదు. బ్రిటన్ ప్లాన్లు దెబ్బ తినేసిన బియాఫ్రా గురించి రాయడానికి బిబిసి యిష్టపడలేదు. అందుచేత ఫోర్‌సైత్‌ను వియత్నాం వెళ్లి అక్కడ అమెరికా వాళ్లు పడుతున్న అవస్థలు రాయమన్నారు. కానీ యితను బియాఫ్రా వదలనన్నాడు. ఉద్యోగం మానేసి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా మరో ఏడాదిన్నర అక్కడే వుండి కథనాలు అందరికీ పంపేవాడు. ఆ తర్వాత అక్కణ్నుంచి బ్రిటన్ వచ్చేసి తన కథనాలతో 1969లో ‘‘ద బియాఫ్రా స్టోరీ’’ అని నాన్-ఫిక్షన్ పుస్తకం రాశాడు. ప్రఖ్యాత ప్రచురణ సంస్థ పెంగ్విన్ వాళ్లు ప్రచురించినా ఆ పుస్తకం అమ్ముడుపోలేదు. చేతిలో డబ్బయిపోయింది. అప్పులు బాధిస్తున్నాయి. అలాటి సమయంలో ఓ ఫిక్షన్ రాస్తే ఎలా వుంటుందాని ఆలోచన వచ్చింది.

పారిస్‌లో వుండగా ఓఏఎస్ వాళ్ల ఆపరేషన్స్ చాలా సన్నిహితంగా చూశాడు కాబట్టి ‘వీళ్ల గుట్టుమట్లన్నీ ఫ్రెంచి సీక్రెట్ సర్వీసెస్‌కు తెలిసిపోతున్నాయి. ద గాల్‌పై వీళ్ల హత్యాప్రయత్నం సక్సెసవ్వాలంటే వీళ్లు బయటి నుంచి ఎవరినైనా కిరాయి హంతకుణ్ని తెచ్చుకోవాల్సిందే’ అనుకునేవాడు. అది గుర్తుకువచ్చి, ఒకవేళ వాళ్లు అలా ఎవరినైనా నియమించుకుంటే ఏం జరిగేది అని ఊహించి కథ అల్లుకున్నాడు. ఓపెనింగులో 1962 ఆగస్టు నాటి సంఘటనను యథాతథంగా వాడుకుని, అక్కణ్నుంచి కల్పితగాథలోకి వెళ్లిపోయాడు. ఆ నవలే ‘‘ద డే ఆఫ్ జాకాల్’’! దాని కథ యిలా నడుస్తుంది.

ఆ దాడి జరగగానే థీరీని, యితర కుట్రదారులను ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ వాళ్లు అరెస్టు చేసేశారు. వారిలో అర్గౌడ్ ఒకడు. అప్పుడు అతని సహాయకుడు లెఫ్టినెంట్ కల్నల్ మార్క్ రోదాకు కిరాయి హంతకుణ్ని నియమిస్తే మంచిదని తోచింది. అతను ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీసెస్‌కే కాదు, ఓఏఎస్ సభ్యులకు కూడా తెలియనివాడై వుండాలి. తనూ, మరో యిద్దరు సహాయకులు మాత్రమే అతన్ని ఎంపిక చేసి, పని అప్పగించాలి. పని పూర్తయ్యేదాకా గది లోంచి బయటకు వెళ్లకూడదు. ఎవర్నీ రానీయకూడదు. తమ సంస్థ సభ్యుల్లోనే ఎవరి ద్వారా లీకవుతుందో తెలియదు కాబట్టి యీ జాగ్రత్త తీసుకోవాలి. చాలా దూరం నుంచి షూట్ చేయగల ఎక్స్‌పర్ట్ మెర్సినరీ ఎవరున్నారా అని వాకబు చేస్తే మధ్యఅమెరికాలో ఒక దేశాధ్యక్షుడు కారులో వేగంగా వెళుతూంటే చెట్ల చాటు నుంచి ఒక ఆంగ్లేయుడు తుపాకీతో కాల్చి చంపాడని తెలుస్తుంది. అతని పేరు, వివరాలూ కూడా తెలియవు.

మధ్యవర్తుల ద్వారా అతనికి కబురు పెట్టి, రోమ్‌లో ఒక హోటల్‌లో వీళ్లు ముగ్గురూ కలిశారు. అతను వచ్చాడు. 50 వేల అమెరికన్ డాలర్లిస్తే చంపుతానన్నాడు. సగం ముందే యివ్వాలన్నాడు. తక్కినది పని అయిన తర్వాత! తను చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నాడు. తను ఒంటరిగానే పనులన్నీ చేసుకుంటాననీ, ఎవరి సహాయమూ అక్కరలేదనీ, తన ఉనికి ఎవరికీ తెలియకూడదనీ అన్నాడు. తన పేరుని జాకాల్‌గా వ్యవహరించ మన్నాడు తప్ప అసలు పేరు చెప్పలేదు. వీళ్లు ఒప్పుకున్నారు. ఇక అప్పణ్నుంచి ఆ హోటల్‌లో టాప్ ఫ్లోర్‌ను తమకై రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఓఏఎస్‌లోని మాజీ సైనికాధికారుల కాపలా మధ్య అక్కడే వున్నారు. తమలో ఏ ఒకరైనా పొరపాటున పట్టుబడితే పోలీసు టార్చర్ భరించలేక యీ ప్లాను గురించి చెప్పేస్తామోనని భయం వాళ్లకు!

ఇక అక్కణ్నుంచి జాకాల్ చేసే ప్రయత్నాల గురించి సవివరంగా రాసుకుని వచ్చాడు ఫోర్‌సైత్. నిజానికి అతను చేసేది దుర్మార్గమైన పని. కానీ అతను ఒక్కొక్క విషయంపై తీసుకునే శ్రద్ధ చూస్తే పాఠకులుగా మనకు ముచ్చట వేస్తుంది. ఇతను అనుకున్న లక్ష్యం సాధిస్తే బాగుండును అనిపించేస్తుంది కూడా! అతను మొదటిగా చేసిన పని ఏమిటంటే దొంగ పాస్‌పోర్టులు తయారు చేసుకోవడం. ఫ్రెంచి గూఢచారులను తక్కువగా అంచనా వేయకూడదు. వాళ్లు తన జాడలు కనిపెట్టడం మొదలుపెట్టాక, ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ, దొంగ ఐడెంటిటీతో తప్పించుకుపోవాలి. అందుకనే యీ నకిలీ పాస్‌పోర్టులు. మొదటగా అలెగ్జాండర్ డగ్గన్ అనే పేరుతో ఒక బ్రిటిష్ పాస్‌పోర్టు సంపాదించాడు. తర్వాత లండన్ ఎయిర్‌పోర్టులోనే కాపు కాసి, తన ఒడ్డూపొడుగుతో సరిపోలే యిద్దరు విదేశీ యాత్రికుల పాస్‌పోర్టులు దొంగిలించి దగ్గర పెట్టుకున్నాడు.

ఆ తర్వాత ఆయుధ తయారీకి పేరు పడిన బెల్జియం దేశ రాజధాని బ్రస్సెల్స్‌కు వెళ్లి బాగా దూరం నుంచి కాల్చగలిగిన, అతి సన్నని సైలెన్సర్ తుపాకీ తయారీకై ఆర్డరిచ్చాడు. దానితో పాటు పాదరసం పూసిన అతి సన్నటి బుల్లెట్లు కూడా! నిజానికి అలాటివి చేయడం ఒక ఛాలెంజే! కానీ తయారీదారు మారణాయుధాల విషయంలో యితని కున్న విషయపరిజ్ఞానానికి ముచ్చట పడి చేస్తానన్నాడు. ఇతను కూడా మంచి రేటు ఆఫర్ చేశాడు. అక్కణ్నుంచి దొంగ పత్రాలు తయారుచేసే ఒక ఫోర్జర్ దగ్గరకు వెళ్లి ఫ్రాన్సులో యథేచ్ఛగా తిరిగేందుకు డాక్యుమెంట్లు తయారుచేసి యిమ్మనమని ఒక మంచి రేటు ఆఫర్ చేశాడు. మొహానికి కొద్దిగా మార్పులు చేసుకుని ఫోటో తీయించుకుని, దానిపై అతికించమన్నాడు. వాడు సరేనని చేశాడు కానీ దురాశ కొద్దీ యితని ఒరిజినల్ ఫోటో కూడా తీసి, ‘ఏమైనా తేడా వస్తే దీన్ని ఫ్రెంచ్ పోలీసుల కిస్తా. ఇవ్వకుండా వుండాలంటే అదనంగా డబ్బియ్యి’ అని బ్లాక్‌మెయిల్ చేయబోయాడు.

ఇలాటి వాడితో ఎప్పటికైనా ప్రమాదం అనుకున్న జాకాల్ వెంటనే అతన్ని చంపేసి ఓ ట్రంక్ పెట్టలో పడేశాడు. ఒంటరిగా వుంటాడు కాబట్టి శవం బయటపడేలోగా తన పని పూర్తవుతుందని అతని అంచనా. నిజానికి ద గాల్‌ను ఎప్పుడు చంపాలో అతను ఎప్పుడో ముహూర్తం పెట్టుకున్నాడు. లైబ్రరీలకు వెళ్లి ద గాల్ గురించి, అతని అలవాట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఫలానా రోజున ద గాల్ బహిరంగ ప్రదేశంలో దొరుకుతాడని, దూరం నుంచి కాల్చి పారేయవచ్చని లెక్క వేసుకున్నాడు. అతనికి యివ్వాల్సిన డబ్బు (ఆ రోజుల్లో చాలా ఎక్కువ) కోసం ఓఏఎస్ ఫ్రాన్సంతా బ్యాంకులను, దుకాణాలను దోపిడీ చేసి సంపాదించింది. సడన్‌గా యివెందుకు పెరిగాయని ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీసెస్ కంగారు పడింది. పైగా రోదా, అతని సన్నిహితులు రోమ్‌లో ఏమీ చేయకుండా స్తబ్ధంగా వుండడమేమిటని సందేహం వచ్చింది.

వాళ్లను బయటకు రప్పించడం కష్టం కాబట్టి, వాళ్లకు బాడీగార్డుల్లో ఒకడైన విక్టర్ కోవల్‌స్కీపై వల విసిరారు. ఒక దొంగ ఉత్తరం రాసి అతనికి అందేట్లా చేశారు. అతను అది నమ్మి, రోదా అనుమతి తీసుకుని, ఫ్రాన్సుకి వచ్చాడు. వెంటనే వీళ్లు అతన్ని పట్టుకుని టార్చర్ చేసి నిజం కక్కించారు. ఎవరో కిరాయి హంతకుణ్ని నియమించారని, అతని కోడ్‌నేమ్ జాకాల్ అని, అతని ఒడ్డూపొడుగూ యిలా వుంటుందని తప్ప అతను యింకేమీ చెప్పలేక పోయాడు. రోదాను కానీ అతని యిద్దరు అనుచరులను కానీ పట్టుకుని కూపీ లాగడం అసాధ్యం. మరేం చేయాలి? జాకాల్‌ ఎవరో, అతని నిజమైన ఐడెంటిటీ ఏమిటో తెలిస్తేనే కానీ అతన్ని పట్టుకోలేము, ఆ కనిపెట్టడం డిటెక్టివ్ విభాగం పని అని పోలీసు కమీషనర్ అన్నాడు. ఫ్రాన్స్‌లో వున్న బెస్ట్ డిటెక్టివ్ ఎవరు? అంటే డిప్యూటీ కమిషనర్ క్లాడ్ లెబెల్ పేరు చెప్పాడు. అతనెలా సాధించాడో, ఆ కథను ‘‘ఫ్రెడరిక్ ఫోర్‌సైత్ ప్రతిభ’’ వ్యాసంలో చదవవచ్చు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)

mbsprasad@gmail.com

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×