cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: యుపిలో బిజెపి పరాభవం

ఎమ్బీయస్‌: యుపిలో బిజెపి పరాభవం

ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌కు, అతని ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ మౌర్యాకు తాము ఖాళీ చేసిన పార్లమెంటు నియోజకవర్గాలలో మార్చి 11న జరిగిన ఉపయెన్నికలలో తీవ్ర పరాజయం ఎదురైంది. నాలుగేళ్ల క్రితం మూడేసి లక్షల మెజారిటీతో గెలిచిన సీట్లవి! 1989 నుంచి యోగి గురువు, యోగి గెలుస్తూ వచ్చిన గోరఖ్‌పూర్‌ పార్లమెంటు సీటు బిజెపి చేజారింది. 10 రోజుల పాటు విపరీతంగా ప్రచారం చేసి, 7, 8 ర్యాలీలు నిర్వహించి 'అభ్యర్థిని కాదు, నన్ను చూడండి' అని ప్రచారం చేసినందుకు కాబోలు ఓటర్లు ఓడించేశారు. బిజెపి వారు యోగిని ఒక స్టార్‌ కాంపెయినర్‌గా చూపిస్తూ కర్ణాటకలో తిప్పుతున్నారు. ఇంట్లో చూస్తే ఈగలమోత అయింది. అమేఠీ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మునిసిపాలిటీలో నెగ్గిన బిజెపి అభ్యర్థిని చూసి బిజెపి మురిసింది.

గుజరాత్‌ ఎన్నికలలో రాహుల్‌ ప్రచారం చేస్తూ ఉంటే అతనికి ప్రతిగా యితన్ని తిప్పింది. ఇప్పుడు యోగి కేసులో గతంలో 5.39 లక్షల ఓట్లు తెచ్చుకున్న మొత్తం పార్లమెంటు స్థానమే 22 వేల ఓట్ల తేడాతో ఎగిరింది. దీనిలో నెగ్గిన ప్రవీణ్‌ నిషాద్‌ను రేపు కర్ణాటకలో కాంగ్రెసు వారు యోగి వెళ్లిన చోటకల్లా తిప్పుతారేమో! ఉపముఖ్యమంత్రి నియోజకవర్గమైన ఫూల్‌పూర్‌లో గతంలో అతను 3.08 లక్షల మెజారిటీ తెచ్చుకున్న చోట యీసారి ఎస్పీ అభ్యర్థి నెగ్గాడు. బియస్పీ చేతులు కలపడం చేతనే యిది సంభవమైందన్న మాట నిజమే కానీ, బిజెపి పాలన పట్ల అసంతృప్తి పెరుగుతోందని గుర్తించడం ఆ పార్టీకి మంచిది. ఎందుకంటే రెండు విఐపి స్థానాలలోనూ యిలా ఉందంటే, యిక తక్కిన చోట యింతకంటె అధ్వాన్న పరిస్థితి ఏర్పడవచ్చు. 

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుతో పొత్తు పనిచేయలేదని గ్రహించగానే అఖిలేశ్‌ 'మాయావతి అత్త సహకరిస్తే బిజెపిని ఓడించవచ్చు' అన్నాడు. మాయావతి బదులివ్వలేదు. ఈ ఉపయెన్నికలు రాగానే ఎస్పీ తన అభ్యర్థులను నిలుపుదామనుకుంది. ప్రతిపక్షంలో ఉండగా బియస్పీ ఉపయెన్నికలలో పాల్గొనదు. అందువలన వాళ్ల సహకారం తీసుకుని, బదులుగా రాజ్యసభ ఎన్నికలలో వాళ్లకు సాయపడదామని అఖిలేశ్‌ అనుకున్నాడు. యుపి నుంచి మార్చి 23న 10 రాజ్యసభ ఎంపీలను పంపాలి. నెగ్గాలంటే 37 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి.

బిజెపి, మిత్రపక్షాలు 8 ఎలాగూ గెలుస్తాయి. ఎస్పీ చేతిలో 47 ఉన్నాయి. ఒక స్థానం గెలిచి, పైన 10 ఉన్నాయి. బియస్పీకి 19 మాత్రమే ఉన్నాయి. భీంరావ్‌ ఆంబేడ్కర్‌ అనే దళిత నాయకుణ్ని రాజ్యసభకు పంపడానికి మాయావతికి యీ 10 అవసరమౌతాయి. తన ప్రతిపాదనను మాయావతి తమ్ముడు, బియస్పీ జాతీయ అధ్యక్షుడు ఆనంద్‌ కుమార్‌కు తెలియపరిచాడు. బియస్పీ గతంలో బిజెపితోనూ, ఎస్పీతోనూ కూడా పొత్తు పెట్టుకుంది కానీ నడవలేదు. ఎన్నికల వేళ బియస్పీ తన ఓట్లను అవతలి పార్టీకి బదిలీ చేయించగలుగుతోంది కానీ అవతలి పార్టీ బియస్పీ అభ్యర్థులకు ఓట్లు బదిలీ చేయించలేక పోతోంది. దళిత అభ్యర్థి అనగానే ఆ పార్టీ సవర్ణ ఓటర్లు తమ ఓట్లు వేయడానికి యిష్టపడటం లేదు. అందువలన తన ఓటు బ్యాంకుతోనే ఒంటరిగా ఆమె పోటీ చేస్తూ వచ్చింది. 

ఎస్పీ, బియస్పీ, బిజెపి మూడూ తమకు మద్దతిచ్చే కులాల బలంతో ఒంటరిగా పోటీ చేస్తూ వచ్చాయి యిన్నాళ్లూ. ఒక్కోసారి ఒక్కోరిది గెలుపు. అమిత్‌ షా వచ్చాక పద్ధతి మార్చాడు. 2017 అసెంబ్లీ ఎన్నికల పాటికి ఎస్పీ, బియస్పీలకు మద్దతిచ్చే కులాలలో చీలిక తెచ్చి తమవైపు తిప్పుకున్నాడు. దాంతో చెరో 22% ఓట్లు తెచ్చుకున్న ఎస్పీ, బియస్పీ కుదేలయ్యాయి. తాము చేతులు కలపకపోతే బిజెపి తమను తుడిచి పెట్టేస్తుందని గ్రహించాయి. మాయావతి యింకో విషయం గమనించింది - దేశంలోని యితర ప్రాంతాల్లో దళిత యువ నేతలు ప్రాచుర్యంలోకి వస్తున్నారు.

గుజరాత్‌ ఎన్నికలలో కాంగ్రెసు వారిని ఉపయోగించుకుంది. తను ఒంటరిగా ఉండిపోతే వారిని యుపిలోనూ ఉపయోగించు కోవచ్చు. తను ఎవరితోనైనా చేతులు కలపకపోతే ముప్పే అనుకుంది. అఖిలేశ్‌ ప్రతిపాదనపై మాయావతి సుముఖత చూపింది. ములాయం సోషలిజం పేరు చెప్పుకుని పైకి వచ్చినా విపరీతమైన కులవాది. తనవారు, పెఱవారు అనే ఫీలింగు బాగా ఉంది. ఎంతసేపూ, తనూ తన కుటుంబం, తన బంధువులు. మాయావతికి అతనితో పొసగలేదు. అఖిలేశ్‌ తండ్రి కంటె భిన్నమైనవాడు. తక్కిన వర్గాలను కూడా కలుపుకుపోదామని చూస్తున్నాడు.

కాంగ్రెసుతో చేతులు కలిపాడు కానీ విఫలమయ్యాడు. ప్రస్తుతం ఎస్పీ అఖిలేశ్‌ చేతిలో ఉంది కాబట్టే, ములాయం ఆగ్రహానికి గురైన రాంగోపాల్‌ యాదవ్‌ ద్వారా మధ్యవర్తిత్వం నడిపాడు కాబట్టి మాయావతి పొత్తుకు సరేనంది. సాధారణంగా జనవరి 15 తన పుట్టినరోజు నాటి సభలో కాంగ్రెసు, బిజెపిలతో బాటు ఎస్పీని కూడా చాకిరేవు పెట్టేది. కానీ యీ ఏడాది పెట్టలేదు. ఇంకో నెల పోయేసరికి మాయావతి తన కార్యకర్తలను డబ్బు కోసం పీడిస్తుందని దాల్‌ బహదూర్‌ కోరీ అనే బిజెపి ఎమ్మెల్యే అసెంబ్లీలో అన్నప్పుడు అతనిపై ఎస్పీ నాయకులు కూడా విరుచుకు పడ్డారు. 

ఈ ఉపయెన్నికలలో రెండు చోట్లా ఎస్పీయే నిలబడింది. బియస్పీ కూడా నిలబడి ఉంటే ఎస్పీ ఓట్లు దానికి బదిలీ అవుతాయో లేదో తెలియక రిస్కు ఉండేది. తను ఎలాగూ పోటీ చేయదు కాబట్టి, ఎస్పీకి మద్దతిచ్చినా నష్టం లేదు, బిజెపి కొమ్ములు విరవవచ్చు అనుకుని మాయావతి సరేనంది. వెంటనే అఖిలేశ్‌ తన పార్టీ సీనియర్‌ లీడరు నరేశ్‌ అగర్వాల్‌తో 'బియస్పీకి ఓ సీటు యిచ్చేయాలి. మిగిలిన ఒక దానిలో జయా బచ్చన్‌ నిలుస్తుంది, నీకు రాజ్యసభ సీటు యీసారి యివ్వటం లేదు' అన్నాడు. అతను వెంటనే సినిమాల్లో డాన్సులు చేసే జయా బచ్చన్‌తో నాకు పోలికా అని బహిరంగంగా అనేసి, బిజెపిలోకి ఫిరాయించేశాడు.

అయినా అఖిలేశ్‌ చలించలేదు. బియస్పీతో కలిసి ముందుకు వెళ్లాడు. ఎస్పీ, బియస్పీ చేతులు కలపడం బిజెపికి హాస్యాస్పదంగా కనబడింది. 'వరదలు వచ్చినపుడు పామూ, ముంగీసా ఒకే చోటకి చేరతాయి' అని యోగి వెక్కిరించాడు. 2014లో గోరఖ్‌పూర్‌లో బిజెపికి 52% అంటే 5.30 లక్షల ఓట్లు, ఎస్పీకి 22% అంటే 2.30 లక్షలు, బియస్పీకి 17% అంటే 1.76 లక్షలు పడ్డాయి. 2018 వచ్చేసరికి ఎస్పీ, బియస్పీ కలిశాయి కాబట్టి 39% ఓట్లు రావాలి. కానీ ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌కి 49% ఓట్లు (4.56 లక్షలు) వచ్చాయి.

బిజెపి అభ్యర్థి ఉపేంద్ర శుక్లాకి 47% (4.34 లక్షలు) వచ్చాయి. అంటే బిజెపికి తగ్గిన 5% ఓట్లతో బాటు తక్కినవారి ఓట్లు కూడా ఎస్పీ అభ్యర్థికి పడ్డాయన్నమాట. యోగి అనవసర విషయాలపై ఎక్కువగా మాట్లాడతాడు. కర్ణాటక వంటి దూరప్రాంతాలకు ప్రచారానికై వెళతాడు. కానీ యుపి పాలనను ఓ తోవలో పెట్టలేకపోతున్నాడు. పైగా గోరఖ్‌పూర్‌లోనే జరిగిన ఆసుపత్రి ప్రమాదంలో చిన్నపిల్లలు చనిపోవడం ఓటర్లను ప్రభావితం చేసి ఉండవచ్చు. గోరఖ్‌నాథ్‌ మఠానికి బిసిలలో ఉన్న పలుకుబడి కారణంగా వాళ్లు బిజెపికి ఓటేస్తూ వచ్చారు. ఈసారి బిజెపి అభ్యర్థి మఠానికి చెందినవాడు కాడు. దాంతో వాళ్లూ చెదిరిపోయారు. మొత్తానికి అన్నీ వర్గాలలో ఓట్లు చీలాయనుకోవచ్చు. 

గోరఖ్‌పూర్‌లో నిషాద కులస్తులు, మల్లాహ్‌ కులస్తులు కలిపి 23% మంది ఉన్నారు. 2014లో రాజపుట్‌ ఐన యోగికి ప్రత్యర్థులుగా ఎస్పీ, బియస్పీ నిషాద కులస్తులనే నిలబెట్టాయి. ఈసారి కూడా ఎస్పీ నిషాదుణ్నే నిలబెట్టింది. సంజయ్‌ నిషాద్‌ అనే నిషాద్‌ పార్టీ అధ్యక్షుడి కొడుకైన ప్రవీణ్‌కు టిక్కెట్టిచ్చింది. ఇతనికి బియస్పీ దళితులతో బాటు ముస్లిములు కూడా తోడయ్యారు. మొదటి నుంచీ ముస్లిములు యాదవులతో చేతులు కలిపి ఎస్పీని బలపరుస్తూ వచ్చారు. బియస్పీ అభ్యర్థి బలంగా ఉంటే అతనికి మద్దతిచ్చారు.

గతసారి ఎన్నికలలో ముస్లింల ఓట్లు ఎస్పీ, బియస్పీల మధ్య చీలిపోయాయి. కొందరు బిజెపికి కూడా వేశారు. ఆ విషయాన్ని యోగి గుర్తించటం లేదు. మైనారిటీలపై అతను చేసిన వ్యాఖ్యలు చూడండి - '10-20% మైనారిటీలు ఉంటే మతకలహాలు తక్కువగా జరుగుతాయి, 20-35% మంది ఉంటే తీవ్రంగా జరుగుతాయి, 35% కంటె ఎక్కువ ఉంటే ముస్లిమేతరులు అక్కడ బతకలేరు.' 'శంకరుడు ప్రథమయోగి. ఆయన్ను, యోగాను తప్పించుకుందా మనుకునేవారు హిందూస్తాన్‌ను విడిచి పెట్టవచ్చు'  'తన సినిమాలు జనం చూడడం మానేస్తే తను సాధారణ ముస్లిములాగ (పౌరుడు అనలేదు చూడండి) రోడ్ల మీద తిరగాల్సి ఉంటుందని షారుఖ్‌ ఖాన్‌ తెలుసుకోవాలి'. ఇలాటి యింగితం లేని వ్యాఖ్యలు విన్నాక ముస్లిములకు బిజెపిపై మనసు విరిగిందంటే విరగదా?

ఫూల్‌పూర్‌కు వస్తే, మూడు లక్షల మంది ముస్లిములు, మూడు లక్షల మంది దళితులు, రెండు లక్షల మంది కూర్మీలు ఉన్న ఆ సీటు మొదటి నుంచి ఎస్పీకి కంచుకోట. అయితే బిజెపి కూర్మీలను విడగొట్టి ఆ నాయకుడైన మౌర్యాకు సీటు యిచ్చారు. అతను 52% ఓట్లతో 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచాడు. ఎస్పీకి 20% ఓట్లు, బియస్పీకి 17% వచ్చాయి. ఇప్పుడు రెండూ కలిశాయి కాబట్టి 37% రావాలి, కానీ 47% వచ్చాయి. బిజెపి ఓట్లు 13% తగ్గి 39% వచ్చాయి. ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర పటేల్‌కు 3.42 లక్షల ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి కౌసలేంద్ర పటేల్‌కు 2.83 లక్షలు వచ్చాయి. 59 వేల మెజారిటీ. తిరుగుబాటు ఎస్పీ అభ్యర్థి అతిక్‌ అహ్మద్‌కు 48 వేల ఓట్లు వచ్చాయి. బిజెపి గమనించుకోవాల్సిన విషయం ఒకటుంది.

ఈ ఉపయెన్నికలలో పోలింగు శాతం చాలా తక్కువగా ఉంది. గోరఖ్‌పూర్‌లో 47% కాగా ఫూల్‌పూర్‌లో 37% మాత్రమే. బూత్‌ స్థాయి నుంచీ పార్టీ నిర్మాణం అద్భుతంగా ఉందనుకునే బిజెపి కార్యకర్తలు ఏం చేస్తున్నట్లు? ఎన్నికలకు జరిగే వరకు అమిత్‌ షా అన్ని ఏర్పాట్లు చేస్తాడు. తర్వాత మరో రాష్ట్రాన్ని గెలవడానికి వెళ్లిపోతాడు. స్థానిక నాయకులే దాన్ని కొనసాగించాలి. కానీ వివిధ పార్టీల నుంచి నాయకుల్ని పోగేయడం వలన వారిలో వారికి అంత:కలహాలు నడుస్తున్నాయి. ఏ పదవి భర్తీ చేద్దామన్నా పేచీయే. పార్టీ నాయకత్వం జాబితా తయారుచేసినా దాన్ని నాలుగేళ్లగా ఫైనలైజ్‌ చేయలేక ఆ ఖాళీలు అలాగే ఉంచింది. దాంతో కార్యకర్తలకు నిస్పృహ. పైగా ఎమ్మెల్యేలకే యోగి దర్శనం గగనమట. ఇక అంతకంటె తక్కువ స్థాయి వారి మాటేమిటి? అందుకే బిజెపి ఓటర్లందరినీ బూత్‌కు తీసుకువచ్చేవారు కరువయ్యారు. 

బిహార్‌లో నీతీశ్‌ పరిస్థితి ఘోరంగా ఉందని యీ ఉపయెన్నికలు తేల్చాయి. లాలూ ఆర్జేడితో బంధాన్ని తెగగొట్టి జెడియును చేరదీసినందుకు బిజెపి బావుకున్నది లేదు. అరేరియా పార్లమెంటరీ నియోజకవర్గంలో 2014లో ముగ్గురూ విడిగా పోటీ చేసినపుడు బిజెపికి 27%, జెడియుకు 23% వచ్చాయి. ఇప్పుడూ యిద్దరూ చేతులు కలిపి బిజెపి అభ్యర్థిని నిలబెడితే 50% రాలేదు, 43%  మాత్రమే వచ్చాయి. అప్పుడు 42% తెచ్చుకుని నెగ్గిన ఆర్జేడీ, యిప్పుడు, అనగా లాలూ మళ్లీ జైలుకి వెళ్లాక, మరింత బలంతో 49% తెచ్చుకుంది.

త్రిపుల్‌ తలాక్‌ బిల్లు తెచ్చాం కాబట్టి ముస్లిం మహిళలంతా తనకే వేస్తారనుకున్న బిజెపి, జెడియును తోడు తెచ్చుకున్నా కూడా ఆర్జేడి అభ్యర్థి సర్ఫరాజ్‌ ఆలమ్‌ (ఇతను జెడియు నాయకుడు, నీతీశ్‌ బిజెపితో చేతులు కలిపాక ఆర్జేడీలో చేరాడు) చేతిలో 62 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. జహానాబాద్‌ అసెంబ్లీ స్థానంలో జెడియు మద్దతుతో గతంలో ఆర్జేడీ 51% తెచ్చుకుంటే యిప్పుడు ఒంటరిగా 54% గెలిచి 35 వేల మెజారిటీతో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బిజెపి మద్దతున్నా జెడియు 29% మాత్రమే తెచ్చుకుంది. 2014లో బిజెపి భాగస్వామి బిఎల్‌ఎస్‌పి 31% తెచ్చుకుంది. గతంలో కంటె తగ్గాయంటే దాని అర్థం బిజెపి ఓట్లు జెడియుకు బదిలీ కాలేదని! ఇక బిజెపికి లభించిన ఓదార్పు సీటు ఏమిటంటే భబూవా. అక్కడ దాని ప్రత్యర్థి కాంగ్రెసు.

తక్కిన చోట్ల డిపాజిట్టు పోగొట్టుకున్న కాంగ్రెసు యిక్కడ 37% ఓట్లు తెచ్చుకుంది, అదీ ఆర్జేడీ సహకారంతో! తండ్రి జైలుకి వెళ్లినా పార్టీని విజయపథంలో నడిపించగల సత్తా తనకుందని లాలూ కొడుకు తేజస్వి నిరూపించుకున్నాడు. బిజెపి 48% తో నెగ్గింది కానీ జెడియు ఓట్లు దానికి బదిలీ కాలేదని అర్థమౌతోంది. 2014లో బిజెపికి 35%, జెడియుకు 29% వచ్చాయి. రెండూ కలిశాయి కాబట్టి 64% రావాలి, కానీ వచ్చినది 48%. నీతీశ్‌ బిజెపిని వాటేసుకోవడం యిరుపక్షాలలోనూ క్షేత్రస్థాయిలో ఆమోదం పొందలేదని తోస్తోంది.

వీటి వలన అర్థమయ్యేది - యుపి, బిహార్‌లలో కాంగ్రెసు నామమాత్రంగా మిగులుతోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బిజెపికి ఎదురుదెబ్బ తగులుతోంది. ప్రతిపక్షాలు తమ విభేదాలు పక్కన పెట్టి ఏకమైతే బిజెపికి గడ్డుకాలమే! బిజెపి కొత్త ప్రాంతాలు గెలుస్తోంది కానీ నెగ్గిన చోట హిందూత్వ, జాతీయవాదం అంటూ కాలక్షేపం చేసి, పాలన నిర్లక్ష్యం చేయడంతో ఉన్న సీట్లు పోగొట్టుకుంటోంది. ఈ ధోరణి కొనసాగితే 2014 గెలిచినన్ని సీట్లు రావనే భయంతో బిజెపి పొత్తులకై ప్రయత్నించవచ్చు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com