Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఫడణవీస్‌ వైఫల్యం

ఎమ్బీయస్‌: ఫడణవీస్‌ వైఫల్యం

మహారాష్ట్రలో ఇవాళ శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఫలితాల తర్వాత శివసేన కలిసి రానప్పుడు బిజెపి ఊరకున్నా సరిపోయేది. వ్యర్థప్రయత్నమొకటి చేసి భంగపడింది. ఈలోగానే ''మీ పున:'' (మళ్లీ నేనే) అని ప్రకటించి దేవేంద్ర ఫడణవీస్‌ చిన్నబోయాడు. ఇది యితని రెండో వైఫల్యం. మొదటి వైఫల్యం ఎన్నికల ఫలితం. అతడు సమర్థవంతంగా పాలిస్తున్నాడు కాబట్టి బిజెపి సొంతంగా 160, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 145 కంటె 15 సీట్లు ఎక్కువ తెచ్చుకుంటుంది అని మీడియా రాసింది, అతని పార్టీలో ఉపనాయకులూ అదే నమ్మారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే బిజెపి-సేన కూటమికి 220 సీట్లు రావాలి. కానీ 161 మాత్రమే వచ్చాయి. 164 సీట్లలో పోటీ చేసిన బిజెపికి గతంలో కంటె 17 తగ్గి 105 వచ్చాయి. వాళ్లు 126 స్థానాల్లో పోటీ చేసిన శివసేనకు గతంలో కంటె 7 తగ్గి 56 వచ్చాయి. 'దిల్లీమేఁ నరేంద్ర, ముంబయిమేఁ దేవేంద్ర' అనే నినాదంతో ముందుకెళ్లిన బిజెపి బిత్తరపోయింది. 

బిజెపి అధినాయకత్వం దేవేంద్రను నమ్మి పూర్తి అధికారాలు యిచ్చారు. అతను ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఫిరాయింపులు తెగ ప్రోత్సహించాడు. కానీ 35 మంది ఫిరాయింపుదారుల్లో 19 మంది ఓడిపోయారు. ఇతను తనకు పోటీ వస్తారనుకున్న వారందరికీ టిక్కెట్లివ్వలేదు. ఆఖరి దాకా ఎటూ తేల్చకుండా పెద్ద నాయకులను కూడా కాచుకునేట్లా చేసి, చివరకు మొండిచెయ్యి చూపాడు. దెబ్బకి వాళ్లు బయటకు వెళ్లి స్వతంత్రులుగా పోటీ చేసి, గెలిచారు. ఫలితాల తర్వాత శివసేన మొరాయించినప్పుడు బిజెపి వాళ్లను వెనక్కి రమ్మనమంటే స్పందన లేదు. 

దేవేంద్ర పాలన అంత బాగా వుండి వుంటే అతని కాబినెట్‌లో 9 మంది మంత్రులు ఓడిపోయి ఉండరు. మోదీ వచ్చి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తే మూడు వాటిల్లో బిజెపి ఓడిపోయింది. వాటిల్లో ఒకటైన పర్లీలో బిజెపికి ప్రముఖ నాయకుడు కీ.శే. గోపీనాథ్‌ ముండే కూతురు, గ్రామీణాభివృద్ధి శాఖామాత్యురాలు పంకజా ముండే, తన కజిన్‌, ఎన్‌సిపి అభ్యర్థి ధనంజయ్‌ ముండే చేతిలో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. జలరక్షణ మంత్రి రామ్‌ షిండే ఎన్సీపికి చెందిన రోహిత్‌ పవార్‌ చేతిలో 40 వేల తేడాతో ఓడిపోయాడు. కార్మిక శాఖ సహాయమంత్రి సంజయ్‌ భెగాడే ఎన్సీపీకి చెందిన సునీల్‌ షెల్కే చేతిలో 95 వేల తేడాతో ఓడిపోయాడు. అమిత్‌ షా 16 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించినా 2014లో 260 సీట్లలో పోటీ చేసి 1.47 కోట్ల ఓట్లు (మొత్తంలో 27.8%) తెచ్చుకున్న బిజెపికి, యీసారి 6 లక్షల ఓట్లు తగ్గి 1.41 కోట్ల ఓట్లు (25.6%) వచ్చాయి. 

దాని భాగస్వామి ఐన సేన పరిస్థితి బిజెపి కంటె అధ్వాన్నంగా మారింది. బిజెపి స్ట్రయిక్‌ రేటు (పోటీ చేసిన స్థానాల్లో నెగ్గినవి) 64% కాగా, శివసేనది 44% మాత్రమే! ఠాక్రేల యిల్లు మాతోశ్రీ ఉన్న బాంద్రా ఈస్ట్‌ నియోజకవర్గంలో దాని అభ్యర్థి, మేయరు కాంగ్రెసు అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. వోర్లిలో ఆదిత్య ఠాక్రే 89 వేల మెజారిటీతో నెగ్గి దాని పరువు కాశాడు. 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంటు ఎన్నికలు, 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల శాతం పోల్చి చూస్తే బిజెపికి 27.8%-27.6%-25.2% వచ్చాయి. శివసేనకు 19.4%-23.2%-17.1% వచ్చాయి.

బిజెపి వారు శివసేనతో పొత్తు పెట్టుకుని దాని తర్వాత పెద్ద పార్టీ అయిన ఎన్‌సిపిని పలువిధాలుగా నాశనం చేద్దామని చూశారు. ఎడాపెడా కేసులు పెట్టారు. వాటి భయం చూపి, శరద్‌ అనుయాయులు, సన్నిహితులెందరినో తమ పార్టీలోకి ఫిరాయింప చేసుకున్నారు. అయినా ఎన్‌సిపికి గతంలో కంటె 13 పెరిగి 54 వచ్చాయి. పుణె జిల్లాలో 2014లో 3 వస్తే, యీ సారి 10 వచ్చాయి. అక్కడ దేవేంద్ర మంత్రులిద్దరు ఓడిపోయారు. దేవేంద్ర సొంత జిల్లా ఐన నాగపూర్‌లో 12 సీట్లలో బిజెపికి 2014లో 11 వస్తే యీ సారి 6 మాత్రమే వచ్చాయి. 

బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా తనపై కోఆపరేటివ్‌ బ్యాంకు స్కాము కేసులో నేరారోపణ చేసినపుడు బెదరలేదు. వెళ్లి ఆసుపత్రిలో చేరలేదు. స్వయంగా ఇడి ఆఫీసుకి వస్తానన్నాడు. ఇదంతా ఎన్నికలు ప్రకటించాక కాబట్టి 'మీరు వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుంది, మీరు రాకండి బాబోయ్‌' అంటూ పోలీసులు వెళ్లి శరద్‌ను బతిమాలుకున్నారు. దీనివలన అతని ప్రతిష్ఠ పెరిగింది. ర్యాలీలలో అతను ప్రజాసమస్యల గురించి మాట్లాడాడు తప్ప బిజెపి తన పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తోందంటూ వాపోలేదు. చుక్కాని లేని పడవలో ప్రయాణిస్తున్న కాంగ్రెసుకు తనే చుక్కాని పట్టి గతంలో కంటె 2 ఎక్కువగా 44 వచ్చేట్లు చేశాడు. 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంటు ఎన్నికలు, 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల శాతం పోల్చి చూస్తే ఎన్సీపికి 17.2%-15.5%-16.9% వచ్చాయి. కాంగ్రెసుకు 18%-16.2%-15.7% వచ్చాయి. 

బిజెపికి వచ్చిన ఓట్లలో అర్బన్‌లో 31%, సెమీ అర్బన్‌లో 27%, సెమీ రూరల్‌లో 22%, రూరల్‌లో 25% వచ్చాయి. అంటే అర్బన్‌ రూరల్‌ వ్యత్యాసం 11% (58-47) ఉందన్నమాట. సేనకు రూరల్‌లో 17%, సెమీ రూరల్‌లో 19%,  సెమీ అర్బన్‌లో 16%, అర్బన్‌లో 17% వచ్చాయి. అంటే దానికి రూరల్‌లో 3% (36-33) ఎక్కువ వచ్చాయి. ఎన్సీపీకి రూరల్‌లో 21%, సెమీ రూరల్‌లో 14%, సెమీ అర్బన్‌లో 13%, అర్బన్‌లో 4% వచ్చాయి. అంటే రూరల్‌లో 18% (35-17) ఎక్కువన్నమాట. కాంగ్రెసుకు అర్బన్‌లో 19%, సెమీ అర్బన్‌లో 15%, సెమీ రూరల్‌లో 14%, రూరల్‌లో 15% వచ్చాయి. అంటే దానికి అర్బన్‌లో 15% (34-19) ఎక్కువ వచ్చాయి. దీని అర్థం కాంగ్రెసు (15%), బిజెపి (11%)లకు అర్బన్‌ ప్రాంతాల్లో బలం ఎక్కువ. ఎన్సీపీకి (18%), సేనకి (3%) రూరల్‌లో బలం ఎక్కువ. 

రెండు కూటముల పట్ల విసుగు చెందిన ఓటర్లు చాలామంది ఉన్నారు. అందుకే అన్ని నియోజకవర్గాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. లాటూర్‌లో ద్వితీయ స్థానం నోటాదే (27 వేల ఓట్లు), పాలస్‌-కాడేగావ్‌లో అయితే 21 వేలు! ముంబయిలోని బోరివలీలో 10 వేల ఓట్లు నోటాకు పడ్డాయి. రాజ్‌ ఠాక్రేకు చెందిన ఎంఎన్‌ఎస్‌ 2014లో లాగానే ఒకే ఒక్క సీటు గెలిచింది. కళ్యాణ్‌లో దాని అభ్యర్థి శివసేనపై 6 వేల ఓట్ల తేడాతో గెలిచాడు. 

బిజెపి గ్రామీణ ప్రాంతాలలో బాగా దెబ్బ తినడానికి కారణం - ఫ్యాక్టరీల మూసివేత, నిరుద్యోగం ప్రబలడం, రిటైల్‌ సెక్టార్‌లో ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, క్రాస్‌ ఇన్సూరెన్సు సమస్యలు, కరువు, వరదలు.. యిలాటి రాష్ట్రస్థాయి సమస్యలు. బిజెపి నాయకులు వీటిని వదిలిపెట్టి ఆర్టికల్‌ 370 వంటి అంశాలపై మాట్లాడారు. 66 ర్యాలీలు నిర్వహించిన శరద్‌ పవార్‌ వీటిపైననే మాట్లాడాడు. నిజానికి కాంగ్రెసు యుద్ధభూమి విడిచి పారిపోయింది. సోనియా, ప్రియాంకా యిటువైపు తొంగి చూడలేదు. రాహుల్‌ మొహమాటానికి ఐదు ర్యాలీలు నిర్వహించి వెళ్లిపోయాడు. శరద్‌ ఒక్కడే ఎన్సీపీ, కాంగ్రెసు రెండిటి తరఫునా పోరాడాడు. అందుకే ప్రభుత్వం కూర్పులో కూడా అతను చెప్పినట్లే సోనియా వింది. 

అలాటి శరద్‌పై దేవేంద్ర జోకులు వేశాడు. 'పశ్చిమ మహారాష్ట్రలో బిజెపి దుమ్ము దులిపేస్తుంది. ఎందుకంటే ఎన్సీపీ తరఫున పహిల్వాన్‌లు ఎవరూ లేరు' అన్నాడు. వాళ్లందరినీ తమ పార్టీలోకి గుంజేశామని అతని మిడిసిపాటు. దానికి సమాధానంగా శరద్‌ 'నేను మహారాష్ట్ర రెజిలింగ్‌ అసోసియేషన్‌కు పదేళ్ల పాటు అధ్యక్షుడిగా చేశానని ముఖ్యమంత్రి గారికి తెలియదనుకుంటా. నేను పహిల్వాన్‌లను తయారు చేసే ఘటాన్ని' అన్నాడు. అంతిమంగా అక్కడ 28 సీట్లు గెలిచి ఎన్‌సిపి తన బలం చాటుకుంది. 

ప్రాంతాల వారీగా చూస్తే కొంకణ్‌లో సేనకు 37%, ఎన్సీపీకి 17%, బిజెపికి 15%, కాంగ్రెసుకు 5% ఓట్లు వచ్చాయి. మరాఠ్వాడాలో బిజెపికి 24%, కాంగ్రెసుకు 17%, ఎన్సీపీలో 17%, సేనకు 16% వచ్చాయి. ముంబయి-ఠాణేలో ప్రాంతంలో బిజెపికి 24%, సేనకు 24%, కాంగ్రెసుకు 14%, ఎన్సీపీకి 8% రాగా ఉత్తర మహారాష్ట్రలో బిజెపికి 25%, ఎన్సీపీకి 22%, సేనకు 17%, కాంగ్రెసుకు 13% వచ్చాయి. విదర్భలో బిజెపికి 32%, కాంగ్రెసుకు 25%, ఎన్సీపీకి 8%, సేనకు 7% రాగా పశ్చిమ ప్రాంతంలో ఎన్సీపీకి 26%, బిజెపికి 24%, సేనకు 16%, కాంగ్రెసుకు 13% వచ్చాయి. 

దీని ప్రకారం చూస్తే బిజెపికి అత్యధికంగా విదర్భలోను, అతి తక్కువగా కొంకణ్‌లోనూ బలముంది. దీనికి విపర్యంగా సేనకు విదర్భలో అతి తక్కువగా, కొంకణ్‌లో అతి ఎక్కువగా బలముంది. బిజెపికి కొంకణ్‌లో తప్ప తక్కిన ప్రాంతాలన్నిటిలో కనీసం 24% ఓటు శాతం ఉంది. సేనకు విదర్భలో తప్ప తక్కిన చోట్ల కనీసం 16% ఓటు శాతం ఉంది. ఎన్సీపీకి ముంబయి, విదర్భలలో అతి తక్కువగా ఉండగా పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా ఉంది. ఆ రెండూ తప్పిస్తే కనీసం 17% ఓటు శాతం ఉంది. కాంగ్రెసుకి కొంకణ్‌లో అతి తక్కువగా విదర్భలో అతి ఎక్కువగా వచ్చాయి. కొంకణ్‌ తప్పిస్తే తక్కిన వాటిలో కనీసం 13% ఓటు శాతం ఉంది. 

ఇప్పుడు సేన-ఎన్సీపీ-కాంగ్రెసు కూటమి ఏర్పడింది కాబట్టి దాని బలం కొంకణ్‌లో 58%, మరాఠ్వాడాలో 50%, ముంబయిలో 46%, ఉత్తరలో 52%, విదర్భలో 39%, పశ్చిమలో 55% ఉంది. వీటిలో బిజెపి సేనకు బదిలీ చేసిన ఓట్ల శాతం కూడా కలిసి ఉందని గుర్తు పెట్టుకోవాలి. ఎలా చూసినా విదర్భలో కూటమికి బలం తక్కువగా కనబడుతోంది. సేనను దెబ్బ తీయాలంటే బిజెపి కొంకణ్‌లో పుంజుకోవాలి. శివసేన కూటమికి అర్బన్‌ ప్రాంతాల్లో సేన, కాంగ్రెసు బలం కాగా, రూరల్‌ ప్రాంతాల్లో సేన, ఎన్సీపీ బలం. 

ఎన్నికలలో భంగపాటు తర్వాత కూడా దేవేంద్ర తగ్గలేదు. ఉద్ధవ్‌ ఠాక్రే 50-50 ఫార్ములా గురించి మాట్లాడుతూంటే, అతను దాని గురించి విననే వినకుండా తనే ఐదేళ్లూ సిఎం నని ఎనౌన్సు చేయడం, ఉద్ధవ్‌తో అలాటి ఒప్పందం ఏమీ లేదని ప్రకటించడంతో ఉద్ధవ్‌కు కోపం వచ్చింది. ఫిబ్రవరిలో అమిత్‌ షా తన యింటికి వచ్చినపుడు యీ షరతుకి తను ఒప్పుకున్నాడని చెప్పాడు. ఉద్ధవ్‌ ఫక్తు రాజకీయనాయకుడు కాదు. స్వతహాగా పెద్దమనిషిగా, మెతకవాడిగా పేరున్నవాడు. అతను అబద్ధాలు చెప్తాడంటే తక్కినవాళ్లు నమ్మడం కష్టం. పైగా దేవేంద్ర 'మా మధ్య కుదిరిన ఒప్పందం గురించి తర్వాత చెప్తా' అన్నాడు కానీ యిప్పటిదాకా చెప్పలేదు. ఏదో విధంగా శివసేనతో రాజీ పడి వుంటే, సిద్ధాంత సారూప్యత ఉన్న రెండు పార్టీల సుస్థిర ప్రభుత్వం ఏర్పడేది. కానీ పంతానికి పోవడం వలన 30 ఏళ్ల భాగస్వామిని వదులుకోవలసి వచ్చింది. చేజేతులా కాంగ్రెసుకు ఊపిరి పోసినట్లయింది. 

ఎన్‌డిఏ తక్కిన మిత్రపక్షాలకు కూడా బిజెపి అంటే అపనమ్మకం ఏర్పడే పరిస్థితి వచ్చింది. పాశ్వాన్‌ తన పార్టీని కొడుకు చిరాగ్‌కి అప్పగించేశాడు. బిజెపి నీడలో ఉంటే ఎప్పటికీ ఎదగలేమని, అతను కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. శివసేన ఆ నీడలోంచి బయట పడడం చేతనే కదా, యిప్పుడు ఐదేళ్లూ సిఎం అయ్యే భాగ్యం పొందింది. మనమూ ఝార్‌ఖండ్‌లో మన ముద్ర కొట్టాలి అనుకుని 50 సీట్లలో పోటీ చేస్తానంటున్నాడు. బిజెపి కాస్త పట్టువిడుపులు ప్రదర్శించి వుంటే యీ అవస్థ వచ్చేది కాదు. సేన కాకపోయినా, ఎన్సీపీని చీల్చి పబ్బం గడుపుకుంటామనుకుంటూ ప్రయోగం చేసి విఫలమైంది. 

ఆ ప్రయోగంలో భాగంగా అజిత్‌ పవార్‌ను నమ్మి నిలువునా మునిగింది. శరద్‌ పవారే అతన్ని పంపించి, బిజెపిని అడలగొట్టాడన్న థియరీపై యింతకు ముందే రాశాను. దానికి యింకో కోణం కూడా ఏమిటంటే, నీ మీద ఎసిబి కేసులు కొట్టించేసుకుని రా అని కూడా చెప్పి వుంటాడు. ముఖ్యమంత్రిగా ఉన్న నాలుగు రోజుల్లోనే దేవేంద్ర చేసిన ఘనకార్యం - ఆధారాల్లేవంటూ అజిత్‌పై ఎసిపి పెట్టిన 21 కేసుల్లో 9 కేసులు మూసివేయించడౖం! మరి ఆధారాలు లేకుండానే దేవేంద్ర అతనిపై అన్ని ఆరోపణలు చేశాడా? అజిత్‌ గెలిస్తే ఆర్థర్‌ రోడ్డు జైలు నుంచే పాలన సాగుతుందన్నాడా? 

ఇప్పటిదాకా అవినీతి మచ్చలేని దేవేంద్ర పదవి కోసం ఎంత దిగజారాడో యిప్పుడు స్పష్టంగా తెలిసింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. ఎన్సీపీ మిశ్రమ ప్రభుత్వమే అజిత్‌పై కేసులు ఎత్తివేస్తే బిజెపి నానా అల్లరీ చేసేది. ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా నోరు మూసుకోవలసి వచ్చింది. ఇప్పుడు సేన కూటమి దేవేంద్రపై పగబట్టింది. అతను అవినీతికి పాల్పడ్డాడేమో క్షుణ్ణంగా విచారణ చేయించి, దొరికితే కేసులు పెట్టేస్తుంది. ఎలా చూసినా యిది దేవేంద్ర వైఫల్యమే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?