cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: అమిత్ షా సంతకం పెట్టాడా?

ఎమ్బీయస్: అమిత్ షా సంతకం పెట్టాడా?

జగన్ సంతకం పెట్టకుండానే తిరుమల గుళ్లోకి వెళ్లిపోయాడు. పట్టుబట్టలు యిచ్చి వచ్చాడు. ‘మాటలు, మంటలు, వివాదాల మధ్య.. సమర్పయామి’ అంటూ ఆంధ్రజ్యోతి హెడ్‌లైన్స్ యిచ్చింది కానీ సామాన్యుడికి యీ వివాదం పట్టినట్లు తోచలేదు. గతంలో వెళ్లాడు, గతేడాది బ్రహ్మోత్సవాలకూ వెళ్లి బట్టలిచ్చాడు, అప్పుడు లేని రగడ యిప్పుడెందుకు? అనుకున్నాడేమో ఏమో టిడిపి, బిజెపి చేయబోయిన ఆందోళనకు స్పందించలేదు. అంతా మామూలుగానే నడిచిపోయింది. ఈ నాన్-ఇస్యూని ఇస్యూ చేయబోయిన పార్టీలే భంగపడ్డాయి.

రూలంటూ వున్నాక దాన్ని అతిక్రమించిన వారెవరైనా సరే, ఎత్తి చూపించే తీరికా, ఓపికా, ధైర్యం సామాన్యుడికి వున్నపుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. కానీ అతడు ఎన్నికల సమయంలోనే తన అభిప్రాయాన్ని చెపుతున్నాడు తప్ప, తక్కిన సమయంలో ఉదాసీనంగా వుంటున్నాడు. చంద్రబాబు బూట్లు వేసుకుని పూజ చేసినప్పుడూ ఆక్షేపించలేదు, యిప్పుడు జగన్ సంతకం పెట్టకుండా దర్జాగా లోపలకి వెళ్లిపోయినప్పుడూ ఆక్షేపించలేదు. ఇది దురదృష్టకరం. ఇలాటివి టీవీలో కాస్సేపు కాలక్షేపానికి, నాబోటి వాడు రాసుకోవడానికి మాత్రమే పనికి వస్తే ఎలా?

బిజెపి ఎలాగైనా హిందూత్వ కార్డును వాడాలని తెగ ప్రయత్నిస్తోంది. టిడిపి హయాంలో వాళ్ల పార్టీ మనిషే దేవాలయశాఖ మంత్రిగా వున్నాడు. గుళ్లు పడగొట్టారు, దుర్గ గుడిలో అత్యాచారాలు బయటకి వచ్చాయి. సత్రం భూములలో కుంభకోణం జరిగింది, ఇంకా చాలా వివాదాలు వచ్చాయి. అప్పుడు కిమ్మనలేదు. అంతెందుకు 2018 మేలో అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని, తిరుపతి దర్శనానికి కుటుంబంతో సహా వచ్చాడు. ఆయన జైనుడు, హైందవేతరుడు. క్రైస్తవుల లాగానే జైనులు కూడా మైనారిటీలే అని భారత ప్రభుత్వం 2014 జనవరిలోనే స్పష్టం చేసింది. మరి అమిత్ రిజిస్టర్‌లో సంతకం పెట్టాడా అని బిజెపి నాయకులు అడిగారా?

అప్పట్లో టిడిపితో చెడింది కాబట్టి అమిత్ షా బృందంపై టిడిపి కార్యకర్తలు రాళ్లేశారు. అదే హైలైట్ అయింది తప్ప ఆయన సంతకం పెట్టలేదన్న సంగతి హైలైట్ కాలేదు. గుడి సంప్రదాయాల గురించి అప్పుడు బిజెపి మర్చిపోతే ఎలా? సహధర్మచారిణితో మాత్రమే పూజలు చేయాలి అని వాదించినప్పుడు కొడాలి నాని అడిగిన పాయింటు కరక్టే. రామమందిరం శంకుస్థాపన పూజలో మోదీ, యోగి ఆదిత్యనాథ్ భార్యలతో వెళ్లారా? లేదు కదా. అయినా పూజ సక్రమంగా జరిగినట్లు భావించారా లేదా? ఈ ముక్క అడిగితే దానికి సమాధానం చెప్పలేక వింతవింత వాదనలు చేశారు.

‘ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే మోదీని లాగుతారా?’ అని చంద్రబాబు అడిగినట్లు ఆంధ్రజ్యోతి రాసింది. పోలిక వచ్చింది కాబట్టి చెప్పారు. మోదీ భార్యకు దూరంగా వుంటున్నారని లోకాని కంతటికీ తెలుసు. ఇక యోగి ఆదిత్యనాథ్ సన్యాసి. భార్య లేదు. అయినా పూజకు అర్హుడే కదా. భార్య వున్నా వేరే శారీరక కారణాల చేత కూడా ఒక్కోప్పుడు పూజలో పాల్గొనలేక పోవచ్చు. జగన్ భార్య గుళ్లకు రాదని తెలిసి, ఆ కారణంగా జగన్‌ను యిరకాటంలో పెట్టడానికి భార్యాసమేతంగా.. అనే అంశాన్ని వీళ్లు లేవనెత్తినపుడు మరి మోదీ భార్య సంగతేమిటి? అని వాళ్లు అడగరా?

అడిగినందుకు గాను మోదీ పేరు ఉచ్చరించే అర్హత లేదు నీకు అంటూ బిజెపి నాయకులు మండిపడడ మేమిటి? మోదీ పేరెత్తే అర్హతల గురించి ఏదైనా సర్టిఫికేషన్ కోర్సు వుందా? ఇక స్వామి పరిపూర్ణానంద అయితే కొడాలి నానిని ‘పాతరేస్తాం’ అని హెచ్చరించారు. స్వామీజీలు కూడా రాజకీయనాయకుల భాష మాట్లాడితే హిందూమతం యిమేజి దెబ్బ తినదా? మొన్న ఒక స్వామీజీ విశాఖపట్టణం శారదా పీఠం స్వరూపానంద స్వామి గురించి టీవీలో చెప్తున్నారు. 2014లో స్వరూపానంద తన ఖర్చుతో రాజమండ్రిలో 2వేల మందిని స్వామీజీలను పోగేసి, సభ చేసి, దానికి టిడిపి నాయకుడు మురళీమోహన్‌ను ఆహ్వానించాడట. ఆ సభలో ‘జగన్ వస్తే క్రైస్తవవ్యాప్తి పెరిగిపోతుంది కాబట్టి, వైసిపికి ఓటేయకుండా టిడిపి-బిజెపి కూటమికే ఓటేయండి’ అని స్వామీజీలందరూ కలిసి ప్రజలకు పిలుపు నిచ్చారట.

‘టిడిపి అధికారంలోకి వచ్చాక తనకు ప్రాముఖ్యత యివ్వలేదని ఆయన అలిగాడు. ఆ సమయంలో జగన్ దగ్గరయ్యాడు. 2019 నాటికల్లా పార్టీ ఫిరాయించి వైసిపికి ఓటేయమని పిలుపు నిచ్చాడు’ అంటూ యీ స్వామీజీ విమర్శించాడు. నిజమే కావచ్చు కానీ యిక్కడ బాధించే అంశమేమిటంటే 2 వేల మంది స్వామీజీలు కలిసి రాజకీయపరమైన ప్రకటనలు చేశారు. ఇప్పటికీ కొందరు స్వామీజీలు టీవీల్లోనూ, బయటా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇది వారికి తగునా? ఎవరు అధికారంలోకి వస్తారన్నది వారికి సంబంధించని విషయం. ఎవరొచ్చినా హిందూమతాన్ని పరిరక్షించే బాధ్యత వారు చేపట్టాలి. దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోతూ వుంటే, గుళ్లు పాడుబడుతూ వుంటే, అర్చకులకు జీతాలు రాకపోతే కాపాడుకోండని హిందువులను హెచ్చరిస్తూ, వారిని చురుకుగా వుంచుతూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ వుండాలి. వారి పోరాటం లేదా సఖ్యత ప్రభుత్వంతో వుండాలి తప్ప పార్టీలతో కాదు.

ఇక్కడే ఒక మాట చెప్పాలి. అసలు దేవాలయాల నిర్వహణ విషయంలో ప్రభుత్వజోక్యం ఎందుకు? అని కొందరు ప్రశ్నిస్తూ వుంటారు. నేనూ కొంతకాలం అదే అనుకునేవాణ్ని. కానీ ఆలోచిస్తే ధనిక దేవాలయాల విషయంలోనే మనం అలా అడుగుతున్నాం. ఏదైనా జీర్ణాలయం కనబడినప్పుడు ప్రభుత్వం దీన్ని తన అజమాయిషీలోకి తీసుకుని ధూపదీపనైవేద్యాలకు ఏర్పాటు చేసి, జీతమిచ్చి ఒక అర్చకుడిని పెట్టి, మేన్‌టెనెన్స్‌కి నిధులివ్వచ్చుగా అనిపిస్తుంది. పన్ను కట్టేవారిలో 80 శాతం మంది హిందువులైనప్పుడు వారి నుంచి వచ్చే పన్నుల్లో కొంత యీ గుళ్లపై ఖర్చు పెడితే తప్పేముంది? అనిపిస్తుంది.

నిజానికి గుడి. చర్చి, మసీదు, గురుద్వారా యిలాటివన్నీ ఎవరు పోషించాలి? ఆయా మతస్తులే కదా. ఆ గ్రామంలో వున్న ప్రజలే దాని నిర్వహణ బాధ్యత వహించాలి. మాకు గడవడానికే కష్టంగా వుండి, బతుకు తెరువు కోసం పట్టణాలు పట్టి పోతూంటే, యీ గుళ్ల సంగతి ఎవడు చూస్తాడు? అంటున్నారు. ‘చూద్దామనుకున్నా ఆ ఆగమధర్మాలూ, మంత్రవిశేషాలూ, ఆలయాచారాలూ మాకేమైనా తెలుసా? పెట్టా? తెలిసినవాళ్లు చచ్చిపోయారు, లేదా సిటీలకు వెళ్లిపోయి స్థిరపడిపోయారు. పూజారి గారి కొడుకు కూడా కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. ఉన్నాయన పోతే గుడి పాడుపెట్టాల్సిందే.’ అంటున్నారు. ఇలాటి గుళ్లన్నిటినీ చూసుకోవల్సినది ఎవరు?

మన తెలుగు రాష్ట్రాలలో వేలాది గుళ్లున్నాయి. అన్నిటికీ భూములు లేవు. ఉన్న భూముల్లో చాలామటుకు అన్యాక్రాంతం అయిపోయాయి. ఒక్కోప్పుడు ప్రభుత్వమే తీసేసుకుని బలహీనవర్గాలకు యిళ్లస్థలాలనో, మరోటనో పంచేస్తోంది. నూజివీడు దగ్గర ఆంధ్రరాజధాని వస్తుందన్న పుకార్లు వచ్చినపుడు అక్కడ గుడి భూములను తీసుకుని రాజధాని కడతారన్నప్పుడు అయ్యో అనుకున్నాను. అప్పనంగా గుడి భూములే దొరికాయా అనుకున్నాను. దేవాలయాల భూముల గురించి సర్వే చేయమని ఆంధ్ర ప్రభుత్వం యీ నెలలోనే డ్రోన్ కార్పోరేషన్‌ను అడిగింది. దాని రిపోర్టు చూస్తే తెలుస్తుంది, ఎన్ని మిగిలాయో, ఎన్ని కాజేశారో! మసీదుల భూముల గురించి, వక్ఫ్ భూముల గురించి యిలాటి ఆరోపణలున్నాయి. అవి కూడా అన్యాక్రాంతం అయిపోయాయట. వాటి గురించి సర్వే చేయిస్తే తెలుస్తుంది.

నిజానికి ప్రతి ఆలయానికి ధర్మకర్తల కమిటీ వుండాలి. వారు గుడిని నిర్వహించాలి. అది సినిమాల్లోనే వుంటుంది తప్ప, యిప్పుడెవరికీ అంత తీరిక లేదు. గుడికి ఆస్తులుంటే, రోజువారీ ఆదాయముంటే అజమాయిషీ చేయడానికి ఉత్సాహం వుంటుంది కానీ ఆదాయమెక్కడ? హిందువుల్లో చాలామందికి ప్రత్యేక సందర్బాల్లో తప్ప గుడికి వెళ్లే అలవాటు లేదు. ఒక్క తమిళుల్లో మాత్రమే ఆ ఉత్సాహం చూశాను. 1985లో మద్రాసుకి బదిలీ అయి, యిళ్ల కోసం క్లాసిఫైడ్ యాడ్స్ చూస్తూంటే ‘వెరీ నియర్ టు టెంపుల్’ అని చేర్చడం చూసి ఆశ్చర్యపడ్డాను. మిగతా చోట్లంతా ‘వెరీ నియర్ టు బస్‌స్టాప్, లోకల్ రైల్వే స్టేషన్..’ అని రాస్తారు. మద్రాసులో అయితే రోజూ పొద్దున్నో, సాయంత్రమో గుడికి వెళ్లే అలవాటు చాలామందికి వుంటుంది. అది దగ్గర్లోనే వుండడం ఒక సెల్లింగ్ పాయింటన్నమాట.

మన తెలుగువాళ్లు గుడి విషయంలో చాలా బద్ధకస్తులు. పరీక్షల సమయంలో, పుట్టిన రోజు, పెళ్లి రోజు, లేదా పండగరోజు యిలా సెలక్టివ్‌గానే వెళతాం తప్ప, వారానికి ఓ సారైనా వెళ్లం. పైగా మనకు పొరుగింటి మోజు ఎక్కువ. ఒక్కోసారి దేశంలోని ఒక్కో గుడిని పట్టిస్తాం. శబరిమల, షిర్డీ, నైమిశారణ్యం, వారణాశి, ఉజ్జయిని.. యిలా ఎక్కడెక్కడకో వెళ్లిపోతాం తప్ప ఊళ్లో ఉన్న గుడిని పట్టించుకోము,  ఎవరైనా అక్కడి శిల్పాలు ఎత్తుకుపోతే తప్ప! ఇక గుడిని ఆశ్రయించుకుని ఏ పూజారి వుంటాడు? ఎవరో ముసలాయన వుండిపోయినా, తర్వాతి తరం వాళ్లు అస్సలు వుండరు. ఇలాటి గుళ్లకు ఆదాయం లేనప్పుడు ఎలా మేనేజ్ చేయగలరు?

ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం కూడా ఎదుర్కుంటోంది. చర్చికి వెళ్లేవాళ్లు క్రమేపీ తగ్గిపోతున్నారు. 2015 క్రిస్‌మస్ టైముకి ఇంగ్లండులో కొవెంట్రీలో వున్నాను. మా యింటి పక్కనే ఉన్న చర్చిలో మాస్ జరగలేదు, లైట్లు పెట్టలేదు, స్టార్ వేళ్లాడదీయలేదు. క్రిస్‌మస్ సందర్భంగా లంచ్ యిన్ని పౌండ్లకే యిస్తాం అని హోటళ్లు, యింత డిస్కౌంట్ యిస్తాం అని షాపులు చేసే హడావుడి తప్ప ధార్మికమైన సందడి ఏమీ కనబడలేదు. అమెరికాలో చాలా చర్చిలను అమ్మేస్తూంటే అక్కడి మన ధనిక హిందువులు కొనేసి గుళ్లగా మారుస్తున్నారట.

ఇక్కడ మన గుళ్ల విషయంలో అది సాధ్యం కాదు. మూల విగ్రహాన్ని ప్రతిష్ఠాపించాక దాన్ని తీసేసి తూకం వేసి అమ్మడం కలలో కూడా ఊహించలేం. అలా అని మేన్‌టేన్ చేయలేం. మరి అలాటప్పుడు ప్రభుత్వమే దాని నిర్వహణ చేపట్టక తప్పదు కదా! ప్రభుత్వం చేతిలోకి వెళ్లాక తక్కిన ప్రభుత్వశాఖల్లాగానే అదీ అటూయిటూగా నడుస్తూ వుంటుంది. నిజానికి ప్రభుత్వాదేశాలతో టిటిడి ఆదుకోవడం బట్టి కానీ లేకపోతే అనేక గ్రామాల్లో ఆలయాలు మూతపడి వుండేవి. ఈ పద్ధతిని నిరసించే హిందువులు ట్రస్టులుగా ఏర్పడి, తమ ఊళ్లో గుళ్ల నిర్వహణ చేపట్టాలి. నిర్వహణ అంటే అర్చకుడి సామర్థ్యం, ఆగమనియమాలు గట్రా తెలుసుకుని సవ్యంగా జరుగుతున్నాయో లేదో చూడాలి.

శిఖ్కు మతం యిటీవలే వచ్చింది కాబట్టి ఆదాయం సమస్యను ఎదుర్కోవడానికి వారు మంచి విధానం అమలు చేస్తారు. గురుద్వారా నాలుగు గోడలకూ షాపులు పెట్టనిస్తారు. వాటి మీద వచ్చే అద్దెతో గురుద్వారా నడుస్తుంది. గురుద్వారాలు కూడా పరిమిత సంఖ్యలోనే వుంటాయి. అవన్నీ ఎస్‌జిపిసి అనే కేంద్రీకృత వ్యవస్థ అజమాయిషీలో నడుస్తాయి. హైందవాలయాల విషయంలో అది నడవదు. ఎందుకంటే మనం గుడి మాడా వీధుల్లో వుండే దుకాణాలపై గుడికి అజమాయిషీ వుండదు. ఆదాయమేదైనా వుందా అంటే దర్శనానికి పెట్టిన టిక్కెట్ల అమ్మకం ద్వారానే రావాలి. పైగా మనకు లెక్కకు మిక్కిలి గుళ్లున్నాయి. కొన్నిటికే డిమాండు. కొత్తగా కట్టిన గుళ్లకు వున్న డిమాండు చీకటి గర్భాలయాలతో, స్తంభాలకు నూనె కారుతూ, గబ్బిలాల వాసన వేసే పాత గుళ్లకు వుండదు.

ఇక తిరుపతి రిజిస్టర్ విషయానికి వస్తే, ఒక పాఠకుడు 1890 నాటి విషయాన్ని ప్రస్తావించారు. రూల్స్ అనేవి మారుతూన్నపుడు తాజాగా అమల్లో వున్నవి చెప్పాలి కానీ ఎప్పటిదో చెప్తే ఎలా? అనేక విషయాల్లో ఆలయ నియమాలు, సంప్రదాయాలు ఎలా మారుతూ వచ్చాయో పివిఆర్‌కె ప్రసాద్ రచన ‘నాహం కర్తా..’ చదివితే తెలుస్తుంది. తిరుమలలో తీర్థం యిచ్చే స్థలం నుంచి ఆయన మార్పించాడు. 1890లో అందరికీ ధర్మదర్శనమే. మరి యిప్పుడు? డబ్బిచ్చినవారికి శీఘ్రదర్శనం. అప్పట్లో గుడికి వచ్చేవారి సంఖ్య తక్కువ కాబట్టి మతపరంగా విడగొట్టగలిగేవారు కాబోలు. ఇప్పుడు 70-80 వేలమంది రోజుకి వస్తూంటే వారిని విడగొట్టడం సాధ్యమా? అయినా ప్రస్తుతం రూలు ఏమంటోందో నాకు క్లియర్‌గా తెలియటం లేదు. 1990లో, 2009లో, 2014లో మూడు సార్లు జీఓ యివ్వవలసిన అవసరం ఎందుకు పడిందిట?

శబరిమల విషయంలో కూడా యిటీవల ఒక వయోపరిమితి లోని స్త్రీలను అనుమతించమంటూ పెద్ద రగడ జరిగింది. చాలామంది ప్రఖ్యాత మలయాళీలు రాశారు. వాళ్ల అన్నప్రాశనలు శబరిమల గుళ్లోనే తమ తల్లుల చేతుల మీదుగా జరిగాయని. బిడ్డను కనే వయసులో వున్న మహిళ వయసు ఊహించవచ్చు. అప్పట్లో అనుమతించినా, యిప్పుడు రూలు మార్చేసి, రానీయటం లేదు. పైగా గతంలో కూడా లేదని వాదిస్తున్నారు. నేనేమంటానంటే రూలంటూ పెట్టాక, దాన్ని అమలు చేయాలి. లేకపోతే ఎత్తేయాలి. ఒకరికి ఒకలా, మరొకరికి మరొకలా వర్తింపచేయకూడదు.

అజాగళస్తనం అంటే ఏమిటని ఎవరో అడిగారు. అజమంటే మేక, గళమంటే మెడ, స్తనం అంటే చన్ను. మేక మెడచన్నులలో పాలు రావు, ఎందుకూ ఉపయోగపడవు. ఆకారానికే తప్ప, ఉపయోగానికి పనికిరాని వాటిని అజాగళస్తనాలంటారు. రూల్సు అనేవి అమలుకు అనువుగా వుండాలి, లేకపోతే అవి ఒట్టి పేరుకే రూల్సుగా మిగులుతాయి. అన్యమతస్తులను గుర్తించడం కష్టం కాబట్టి రూలు – ఇప్పటికీ ఉంటే – ఎత్తివేయడం సబబు. బిజెపికి పొత్తుదారు కాబట్టి పవన్ కళ్యాణ్ భార్య సంతకం పెట్టనక్కరలేదు, రాజకీయ ప్రతికక్షి కాబట్టి జగన్ పెట్టాలి అని వాదించే అవకాశం వుండకూడదు.

బిజెపి మొదట్లో చాలా హడావుడే చేసింది కానీ ఎందువల్లనో చివర్లో తగ్గింది. ప్రజల స్పందన లేదని అర్థం చేసుకున్నారేమో తెలియదు. కానీ ఎబిన్ టీవీ వెంకట కృష్ణ ‘ఆందోళన చేయాలని మీ బిజెపి వాళ్లు తీర్మానం చేశారు, కానీ తర్వాత మార్చేశారు. మార్పు సంగతి తెలియని భానుప్రకాశ్ ఒక్కరే ఆందోళన చేశారు.’ అని తన ఛానెల్‌కి వచ్చిన బిజెపి అధికార ప్రతినిథిని దబాయించే ప్రయత్నం చేశారు. ‘మేం తీర్మానం చేయలేదు మొర్రో’ అని ఆయన మొత్తుకున్నా యీయన వినలేదు.

ఏ వివాదమూ లేకుండా జగన్ గుడికి వెళ్లివచ్చేయడం టిడిపికి జీర్ణం కావటం లేదు. టిడిపి అభిమాని ‘రేపు’ నరసింహారావుగారు టీవీ5లో మాట్లాడుతూ జగన్ పెట్టుకున్నవి ‘పంగనామాలు’ అన్నారు. జగన్‌పై కోపంతో వైష్ణవనామాలను అలా ప్రస్తావిస్తే ఎలా? ఎబిఎన్ ఛానెల్‌లో ఓ ముస్లిము జర్నలిస్టు మాట్లాడుతూ తిరుపతి గుళ్లోకి వెళ్లాడు కాబట్టి జగన్ క్రైస్తవం వదిలేసినట్లే అన్నారు. నేను మసీదు కెళ్లి తల కప్పుకుంటే, మా పిల్లవాడికి ఒంట్లో బాగాలేదని ఫకీర్ చేత తావీజు కట్టిస్తే, సాయిబాబా గుడికి వెళితే, నేను ముస్లిమునై పోతానా? బోధగయకు వెళ్లి బుద్ధుడికి నమస్కరిస్తే, అక్కడి ధర్మచక్రం తిప్పితే బౌద్ధుడిని అయిపోతానా? తల కప్పుకుని గురుద్వారాకి వెళితే, జైనదేవాలయానికి వెళ్లి తీర్థంకరులకు నమస్కరిస్తే శిఖ్కుని, జైనుణ్ని అయిపోతానా? చర్చికి వెళ్లి ఏసుక్రీస్తుకి నమస్కరిస్తే క్రైస్తవుణ్ని అయిపోతానా? వేలాంగణ్ని మేరీమాతకు మొక్కుకునే తమిళ హిందువులు అనేకమందిని చూశాను నేను. మన భారతీయ సంస్కృతే అలాటిది. ఎందుకైనా మంచిదని అందరికీ ఓ దణ్ణం పెట్టేస్తాం. ఇదంతా తెలిసి కూడా వితండ వాదనలు చేయడం ప్రజలకు ఏహ్యత కలిగిస్తుంది.

చివరిగా చెప్పాలంటే – నియమం పాటించని ముఖ్యమంత్రిని నిలదీయక ప్రజలు పొరపాటు చేస్తే, నాన్-ఇస్యూని పట్టుకుని అతి చేయబోయి, బిజెపి, టిడిపి మరింత పెద్ద పొరపాటు చేశాయి. బిజెపి యింతటితో వదిలిపెట్టకపోవచ్చు. హిందూత్వయే వారికి మిగిలిన ఆయుధం కాబట్టి ఎడాపెడా వాడేస్తారు. తిరుపతి రిజిస్టర్ మాట ఎత్తితే మాత్రం అవతలివాళ్లు అడగాల్సిన ప్రశ్న - ‘అమిత్ షా సంతకం పెట్టాడా?’ అని. దానికి వారి నుంచి వచ్చే సమాధానం – అధికారులు అడగలేదు అని. మరే అదే సమాధానం జగన్‌కూ వర్తిస్తుంది కదా!

(ఫోటో - అమిత్ షా తిరుపతి భార్యాసమేతంగా వచ్చినప్పటిది, పక్కనున్నది జగన్ సంతకం గురించి ఆందోళన చేసిన భానుప్రకాశ్)

ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)
mbsprasad@gmail.com

 


×