Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: దిలీప్ - మధుబాల

ఎమ్బీయస్‍: దిలీప్ - మధుబాల

దిలీప్ కుమార్ మరణించగానే వచ్చిన వ్యాసాలన్నిటిలో మధుబాలతో ప్రణయం ప్రసక్తి వచ్చింది. నాకు చాలామంది మెయిల్స్ రాశారు, ఆమె గురించి రాయమని. ఇంతకీ మధుబాల దిలీప్ భార్య కాదు. అతని కున్న కొందరు ప్రేయసుల్లో ఆమె ఒకర్తె. అయితే మధుబాల అందం, జీవితవిషాదం కారణంగా ఆమె ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. పశ్చిమ దేశాల్లో మేర్లిన్ మన్రో ఫోటోలకు గిరాకీ వున్నట్లే మన దగ్గర మధుబాల పోస్టర్లకు యిప్పటికీ గిరాకీ వుంది. ఆమె తరంలో తక్కిన ఎవరికీ యీ గౌరవం దక్కలేదు. దిలీప్ స్టార్ హీరో కాబట్టి, యిద్దరి మధ్య ఏం జరిగింది, వారి ప్రణయం పరిణయంగా ఎందుకు మారలేదు అనే విషయంపై చాలా మందికి ఆసక్తి వుంది. సలీం-అనార్కలిల ప్రేమను తెరపై అమరం చేసిన ‘‘మొఘల్ ఏ ఆజమ్’’ జంటగా దిలీప్, మధుబాలల మధ్య అనురాగం కూడా అంత గాఢంగా వుండాలని ప్రేక్షకులు భావించారు. కానీ ఆ కథలాగానే యీ కథా విషాదంగానే ముగిసింది.

ఇంతకీ ఎవరీ మధుబాల? 1933లో ప్రేమికుల దినంనాడు (ఫిబ్రవరి 14) పుట్టిన అందాలరాశి. అసలుపేరు ముంతాజ్‍జెహా దెహ్లవీ. పఠాన్‍ జాతికి చెందినది. మాతృభాష పుష్టు. ఉర్దూ బాగా వచ్చు. ‘‘బసంత్‍’’ (1942) వంటి 6 సినిమాలలో బేబీ ముంతాజ్‍గా నటించి, ‘‘నీల్‍ కమల్‍’’ (1947)లో రాజ్‍కపూర్‍ సరసన తొలిసారి హీరోయిన్‍ అయి ఏడాదికి నాలుగు చొప్పున 70 పై చిలుకు సినిమాలలో నటించింది. మేర్లిన్‍ మన్రో లాగానే మధుబాల కూడా తన 36వ యేట నిస్సంతుగా మరణించింది. మేర్లిన్‍ది ఆత్మహత్య, మధుబాలది జీవితేచ్ఛ నశించిన సహజ మరణం. మొఘల్ ఏ ఆజం ఆమె సంపూర్ణంగా నటించిన చివరి చిత్రం. ‘‘బాయ్‍ ఫ్రెండ్‍’’, ‘‘హాఫ్‍ టికెట్‍’’, ‘‘పాస్‍పోర్టు’’, ‘‘జ్వాలా’’ చిత్రాలలో కొన్ని భాగాలలో ఆమె డూప్లికేట్లు (చాలా మట్టుకు ఆమె చెల్లెలు చంచల్‍) నటించారు.

1942 లో ‘‘బసంత్‍’’లో బాలతారగా ప్రవేశించిన ఆమె 1947 లో కిదార్‍ శర్మ తీసిన ‘‘నీల్‍ కమల్‍’’లో రాజ్‍ కపూర్‍ సరసన హీరోయిన్‍గా పరిచయమైంది. రాజ్‍తో 3, అశోక్‍ కుమార్‍తో 4 (‘‘మహల్‍’’, ‘‘హౌరా బ్రిజ్‍’’..) దేవ్‍ ఆనంద్‍తో 7 (‘‘కాలా పానీ’’, ‘‘జాలీ నోట్‍’’..), దిలీప్‍ కుమార్‍తో 4 ‘తరానా’’ (1951), ‘సంగ్‍దిల్‍’’, ‘‘అమర్‍’’, ‘‘మొఘల్‍-ఏ-ఆజమ్‍’’ (1960), శమ్మీ కపూర్‍తో 3 (‘‘బాయ్‍ఫ్రెండ్‍’’..), గురుదత్‍తో ‘‘మిస్టర్‍ అండ్‍ మిసెస్‍ 55’’, ప్రదీప్‍ కుమార్‍తో  5,  భరత్‍ భూషణ్‍తో 4 (‘‘ఫాగున్‍’’, ‘‘బర్సాత్‍ కీ రాత్‍’’..)- ఇలా అనేక సినిమాలలో అగశ్రేణి కథానాయకుల సరసన, పెద్ద బ్యానర్‍లకు పనిచేసిందామె!  

ఢిల్లీకి చెంది బొంబాయికి వలస వచ్చిన ఓ పఠాను కుటుంబంలో పుట్టిన బేబీ ముంతాజ్‍కు ఇద్దరు అక్కలు ముగ్గురు చెల్లెళ్లు. తండ్రి అతావుల్లా ఖాన్‍కి సంపాదన ఏమీలేక యిమెను ఎనిమిదవ యేటనే సినిమాల్లో ప్రవేశపెట్టాడు. సినిమాలలో చేర్పించాడు కానీ చచ్చేటన్ని నిబంధనలు పెట్టాడు. ఇంటినుండే భోజనం, నీళ్లు తీసుకెళ్లాలి. ఎవరితోనూ మాట్లాడకూడదు. సాయంత్రం ఆరుగంటలకల్లా షూటింగు ముగించుకుని యింటికి వచ్చేయాలి. ఇంటికి ఎవరూ రాకూడదు. సినిమా ఫంక్షన్‍లకు వెళ్లకూడదు. జర్నలిస్టులతో మాట్లాడకూడదు. తెచ్చిన డబ్బంతా తన చేతిలో పోయాలి...యిలా! అలా వచ్చిన డబ్బును అతను సినిమాలు తీసి, తీయబోయి తగలేసేవాడు. ‘‘సయ్యద్‍’’, ‘‘షాన్‍-ఎ-అవధ్‍’’, ‘‘మెహబూబా’’ ‘‘లాలీ చందన్‍’’ - ఇవన్నీ అతానుల్లా మధుబాల డబ్బుతో మొదలుపెట్టి సగంలో మానేసిన సినిమాలు- ‘‘సయ్యద్‍’’ మీద మూడు లక్షలు ఖర్చయ్యాక మానేశారు. ‘‘షాన్‍-ఎ-అవధ్‍’’ మానేసిన కారణం ఏమిటంటే - డైరెక్టరు లేటుగా రావడం!

అతానుల్లా పూర్తి చేసి విడుదల చేసిన సినిమాలు - ‘‘నాతా’’ (1955 - సినిమా ఫ్లాప్ అయి, మధుబాల బంగళా తాకట్టు పెట్టవలసి వచ్చింది), ‘‘మహలోం కా ఖ్వాబ్‍’’ (1960) ‘‘పఠాన్‍’’ (1962)! అనేక మంది సినిమాతారల శ్రమను వాళ్ల తలిదండ్రులు దోపిడీ చేయడం గమనించవచ్చు. పెళ్లయితే ఆ దోపిడీ సాగదని తారల ప్రేమను, పెళ్లిని అడ్డుకోవడానికి వాళ్లు చూస్తారు. వాళ్ల చెరలో నుంచి బయటపడ్డాక కూడా ఖర్మ కాలితే ఆ ప్రియుడు, భర్త సైతం దోపిడీ చేస్తూంటారు. వీళ్ల కష్టార్జితంతో సినిమాలనో, వ్యాపారమనో చేసి డబ్బు తగలేస్తారు. మధుబాలకు సర్కిల్ పెరిగితే తన చేయి దాడిపోతుందని తండ్రి భయం. బాంబేలో జరిగిన ఫిలిం ఫెస్టివల్‍కి వచ్చిన అమెరికన్‍ డైరెక్టరు ఫ్రాంక్‍ కాప్రాను చూడడానికి తారామణులందరూ వెళ్లినా మధుబాల వెళ్లలేదు. కానీ ‘మూవీటైమ్స్’ కవరు పేజీ మీద ఆమె ఫోటో చూసి ముగ్ధుడైన కాప్రా ‘‘ఈ అమ్మాయిని డిన్నర్‍కి పిలు, హాలీవుడ్‍కి పరిచయం చేస్తానని’’ అని బి.కె. కరంజియాతో అన్నాడు. కానీ మధుబాల తండ్రి నోరు చప్పరించి ‘‘తనకి ఫోర్క్‌తో తినడం రాదు. డిన్నరుఫుడ్డూ అక్కర్లేదు, హాలీవుడ్డూ అక్కర్లేదు’’ అనేశాడు.

మధుబాల చాలా డిసిప్లిన్‍ ఉన్న మనిషి. ప్రొడ్యూసర్ల కంటే ముందే తన కార్లోవచ్చి సెట్స్‌పై వేచి వుండేది. ఏ డిమాండ్లు చేయకుండా పూర్తి సహకారం అందించేది. వితరణశీలి. దానధర్మాలు చేసేది. పెద్ద తార అయిన తర్వాత కూడా పట్టుబట్టి అతి తక్కువ సమయంలో డాన్సు నేర్చుకుంది. ఇంగ్లీషు కూడా..! అలంకారాలు ఎక్కువ చేసుకోకుండా సహజసౌందర్యం ప్రదర్శించి ప్రేక్షకులనే కాదు. సహనటులను కూడా మతులు పోగొట్టుకునేట్టు చేసేది. పూర్తి ప్రొఫెషనల్‍ అయిన మధుబాల బి.ఆర్‍.చోప్డా వంటి నిర్మాతతో వివాదంలో చిక్కుకుంది. అదీ తండ్రి కారణంగా! అది దిలీప్, మధుబాలల ఎడబాటు ముఖ్యకారణమైంది.

మధుబాల, దిలీప్‌లది తొలి ప్రణయం కాదు. దిలీప్ అంతకుముందు కామినీ కౌశల్‌ను ప్రేమించి వున్నాడు. (ఆయుష్షులోనూ దిలీప్‌కి జోడీ – కామినీ కౌశల్) మధుబాల ప్రేమ్ నాథ్‌ను ప్రేమించి వుంది. ‘‘జానీ మేరా నామ్’’ (1970), ‘‘బాబీ’’ (1973) సినిమాల్లో చూసి ప్రేమ్‌నాథ్ అందాన్ని తక్కువ అంచనా వేయకూడదు. 1950లలో అతన్ని ఇండియన్ డగ్లస్ ఫెయిర్‌బాంక్స్ అనేవారు. అతను రాజ్ కపూర్‌కు బావమరిది. దిలీప్‌కు ఆప్తమిత్రుడు. అతనంటే ఆడవాళ్లు పడి చచ్చేవారు. ‘‘బాదల్’’ (1951) సినిమాలో అతనితో హీరోయిన్‌గా వేసే రోజుల్లో మధుబాల అతనిపై మనసు పారేసుకుంది. ప్రేమ్ నాథ్ హిందూ. తండ్రికి తెలిస్తే చంపేస్తాడు. దిలీప్‌తో స్నేహాన్ని తండ్రి సహించేవాడు. ఎందుకంటే ముస్లిము, పైగా పైకి వస్తున్న హీరో. తన కూతురి ద్వారా అతన్నీ గుప్పిట్లోకి తెచ్చుకుంటే వాళ్లిద్దరినీ పెట్టి సినిమాలు తీసి గడించవచ్చని అతని ప్లాను.

అందువలన ‘‘ఆన్’’ (1952) సినిమాలో నాయక, ప్రతినాయక పాత్రల్లో దిలీప్, ప్రేమ్ వేసేటప్పుడు యిద్దరూ కలిసి కారులో మధుబాల యింటికి వచ్చేవారు. ప్రేమ్ నక్కి కూర్చునేవాడు. దిలీప్ మధుబాలను బయటకు తీసుకెళతానంటే ఆమె తండ్రి ఒప్పుకునేవాడు. కారు సందు మలుపు తిరిగాక ప్రేమ్ బయటకు వచ్చేవాడు. ఇది కొన్నాళ్లు సాగింది కానీ ప్రేమ్ నాథ్‌ ‘‘నేను ‘‘దిలీప్ – ద డాంకీ’’ అనే సినిమా తీస్తా. నువ్వు హీరోవి. నేను డాంకీని.’’ అన్నాడు. దిలీప్‌కు కోపం వచ్చింది. వారి స్నేహం చెడింది. (ఇదంతా మిహిర్ బోస్ రాసిన ‘‘బాలీవుడ్’’ పుస్తకంలో ఉంది) ఇంతలో ప్రేమ్  ‘‘శాంసన్ అండ్ డెలైలా’’ కథ ఆధారంగా తీసిన ‘‘ఔరత్’’ (1953) సినిమాలో నటిస్తూ దానిలో హీరోయిన్ అయిన బీనా రాయ్‌తో ప్రేమలో పడి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ సందడిలో మధుబాల, దిలీప్ దగ్గరయ్యారు.

మధుబాలను ప్రేమ్ నుంచి దిలీప్ ఎగరేసుకుని పోయాడు అనుకుంటే దానికి ప్రేమ్ స్వీట్ రివెంజ్ తీసుకున్నాడు. దిలీప్ ఒకప్పుడు గాఢంగా ప్రేమించిన కామినీ కౌశల్‌ను తన వలపులో బంధించాడు. గతంలో ఆమె గురించి రాసినప్పుడు రాశాను – దిలీప్‌తో ప్రేమను ఆమె కుటుంబం ఎలా అడ్డుకుందో! అది జరిగిన చాలా ఏళ్లకు 1975 ప్రాంతంలో ప్రేమ్ ‘‘జ్ఞానీజీ’’ (1977) అనే సినిమా నిర్మిస్తూన్న సమయంలో అతనితో ప్రేమలో పడింది. అప్పటికి ప్రేమ్‌కు 49, ఈమెకు 48. ఇద్దరూ కారెక్టర్ యాక్టర్స్‌గా వేస్తున్నారు. చండీగఢ్ దగ్గర పింజోరీ గార్డెన్స్‌లో షూటింగు జరుగుతూండేది. వీళ్లిదద్రూ రొమాన్సులో మునిగి తేలేవారు. ఇద్దరూ వివాహితులూ, పిల్లలున్నవాళ్లూ కావడంతో రెండేళ్లకు మించి ప్రణయం సాగలేదు. ఈ సంగతి బచ్చన్ శ్రీవాస్తవ్ అనే ఆయన ఫిల్మీ దునియా 2002 ఆగస్టు సంచికలో రాశారు.

ఇక దిలీప్ కథలోకి మళ్లీ వస్తే వధూవరుల మధ్య 11 ఏళ్లు తేడా వున్నా మధుబాల తండ్రి దిలీప్‌తో పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు – కూతుర్ని హీరోయిన్‌గా పెట్టి తను తీయబోయే సినిమాల్లో హీరోగా దిలీప్ విధిగా నటించాలని! తను పాత్రల విషయంలో చాలా చూజీ అయిన దిలీప్‌కు యిది నచ్చలేదు. ఏ మాత్రం నచ్చకపోయినా, తను అనుకున్నట్లు మార్చకపోయినా వేషాలు వదిలేసుకునే తనకి మధుబాలను పెళ్లి చేసుకుంటే ఆ స్వేచ్ఛ పోతుందనడం దుస్సహమైంది. ఇలాటి షరతు పెట్టవద్దని మీ నాన్నకు చెప్పు అని మధుబాలతో చెప్పాడు. చిన్నప్పటి నుంచి పంజరంలో పెరిగిన చిలుక లాటి మధుబాలకు తండ్రిని ఎదిరించే ధైర్యం లేదు. పెళ్లి చేసేసుకుందాం, తర్వాత అవే సర్దుకుంటాయి అని దిలీప్‌కు నచ్చచెప్పబోయింది. నా కోసం మీ నాన్నను ఎదిరించలేకపోతే ఎలా? అన్నాడు దిలీప్.

‘‘ఢాకే కీ మల్‍మల్‍’’ (1956) సినిమా షూటింగ్‍ సమయంలో నటుడు ఓంప్రకాష్‍ సమక్షంలో దిలీప్‍ మధుబాలకు ప్రపోజ్‍ చేశాడు. ‘‘కాజీ (పురోహితుడు)  రెడీగా ఉన్నాడు. నువ్వు సరేనను. ఇవాళే పెళ్లి. నీ కుటుంబాన్ని విడిచి రావాలి. అదొక్కటే నా షరతు’’ అన్నాడు. మధుబాల మాట నాన్చింది. ఆమె మనసు దిలీప్‍ను వాంఛించింది. కానీ చిన్నప్పటినుండీ పెరిగిన వాతావరణం వల్ల కుటుంబాన్ని విడవలేకపోయింది. ‘‘నాకు మా కుటుంబమూ కావాలి, నువ్వూ కావాలి’’ అంది. ‘‘అది జరగని సంగతని నీకు తెలుసు. దీనర్ధం నేను నీకు అక్కర్లేదన్నమాట’’ అని కోప్పడ్డాడు దిలీప్‍, పెళ్లి ప్రతిపాదన విరమించుకున్నాడు.

బిఆర్ చోప్డా తన ‘‘నయా దౌర్‍’’ (1957) సినిమాకై దిలీప్‍కు జోడీగా మధుబాలను బుక్‍ చేయడం జరిగింది. ఆ సినిమాలో ఔట్‍డోర్‍ షూటింగు కోసం భోపాల్ వెళ్లాలి. అలా విడిగా వెళితే దిలీప్, మధుబాలల మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందేమోనన్న భయంతో మధుబాల తండ్రి ఔట్‍డోర్‍కు వెళ్లడానికి వీల్లేదన్నాడు. దాంతో చోప్డాకు ఒళ్లు మండి ఆమెను తీసేసి, ఆ వేషం వైజయంతిమాలకు యివ్వడంతో బాటు మధుబాలపై కోర్టులో కేసు వేశాడు. ఆ కేసులో దిలీప్‍ను సాక్షిగా పిలిచారు. తమ మధ్యనున్న ప్రేమను పరిగణించకుండా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం (నిజమే అయినా) మధుబాల జీర్ణం చేసుకోలేకపోయింది. వారి మధ్య ఎడబాటు మరింత పెరిగింది. ‘‘మొఘల్‍-ఏ-ఆజమ్‍’’లో సలీం, అనార్కలీలుగా దిలీప్‍, మధుబాలల ప్రేమ చూసిన వారెవరూ ఆ చిత్రనిర్మాణ సమయంలో వారిద్దరి మధ్య మాటలైనా లేవంటే నమ్మలేరు.

వ్యాసం యిక్కడితో ఆపేయవచ్చు కానీ మధుబాల జీవితంలో నాటకీయత తెలియాలంటే నటగాయకుడు కిశోర్ కుమార్‌తో ఆమె వివాహం, ఆమె మరణం దాకా చెప్పడం సబబు. కిశోర్‍, మధుబాలలది విచిత్ర వివాహం. మధుబాల దిలీప్‍ను ప్రేమించేరోజుల్లో వారిద్దరి మధ్యా ప్రేమలేఖలు చేరవేసే పని చేసినది కిశోరే! అలాగే కిశోర్‍తో విడాకులు తీసుకున్న మొదటిభార్య రూమాదేవికి మధుబాల ఫ్రెండు. రూమా కిశోర్‍తో పోట్లాడినప్పుడు ‘‘ఇలా తగవులాడితే నేను కిశోర్‍ను పెళ్లి చేసేసుకుంటా జాగ్రత్త!’’ అని బెదిరించేది. తథాస్తు దేవతలు ఆ మాట నిజం చేసేశారు!

వాళ్లిద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం - ‘‘ఢాకే కా మల్‍మల్‍’’ (1956). ‘‘చల్తీ కా నామ్‍ గాడీ’’ (1958)లో వాళ్ల జంట హిట్‍ అయింది. తర్వాత వచ్చినవి - ‘‘మెహలోం కే ఖ్వాబ్‍’’ (1960), ‘‘ఝుమ్రూ’’ (1960), ‘‘హాఫ్‍ టికెట్‍’’ (1962). ‘‘ఝుమ్రూ’’, ‘‘హాఫ్‍ టికెట్‍’’ రెండూ విజయవంతమైన, వినోదభరితమైన సినిమాలే! ‘‘చల్తీ కా నామ్‍ గాడీ’’ సినిమా తీసేరోజుల్లో కిశోర్‍, మధుబాలల మధ్య పరస్పర ఆకర్షణ ప్రారంభమయింది. అప్పటికే మధుబాల టాప్‍ స్టార్‍, ఎవరికీ అందుబాటులో లేని అందాలరాశి. తన పనేమో, తనేమో తప్ప ఆమె బయట ఎక్కడా కనబడేది కాదు. అటువంటి తార తనతో మాట్లాడడం, తన జోకులకు పడిపడి నవ్వడం కిశోర్‍కు గర్వకారణంగా ఉండేది. అందునా భార్య విడిచివెళ్లిపోయిన డిప్రెషన్‍లో ఉన్నాడు కాబట్టి మధుబాల వంటి స్టార్‍ తనకు యిచ్చిన ప్రాధాన్యతకు అతను ఉప్పొంగిపోయాడు.

మధుబాలకు కూడా కిశోర్‍ చేసే తమాషాలు, సరదా స్వభావం ఎంతో నచ్చాయి. అప్పటిదాకా తను ప్రేమించినవాళ్లంతా సీరియస్‍ టైపే! పైగా ‘‘నయాదౌర్‍’’ కేసు విషయంలో తన బాగోగులు ఆలోచించకుండా సాక్ష్యం చెప్పిన దిలీప్‍ కంటే తనను సరదాగా ఉంచడానికి ప్రయత్నిస్తున్న కిశోర్‍ ఆమెకు నచ్చాడు.  పెళ్లి చేసుకుందామనుకున్న నిర్ణయం ‘‘మెహలోం కే ఖ్వాబ్‍’’ (తెరపై మధుబాల జోడీ ప్రదీప్‍కుమార్‍, కిశోర్‍ జోడీ చంచల్‍) ‘‘హాఫ్‍ టికెట్‍’’ చిత్రాల నిర్మాణం సాగేటప్పుడు మరింత బలపడింది. మధుబాల తండ్రికి యి పెళ్లి అస్సలు యిష్టం లేదు. అయినా దిలీప్‍ వ్యవహారం తర్వాత కూతురి యిష్టాన్ని వ్యతిరేకించే సాహసం చేయలేకపోయాడు. పతాకశీర్షికలకు ఎక్కి దిలీప్‍కుమార్‍తో ప్రణయం చెడిపోయాక మధుబాల ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవలసిన అవసరం ఏర్పడింది మరి!

కిశోర్‍ తల్లిదండ్రులకు అతను ముస్లిమ్‍ను పెళ్లాడడం నచ్చలేదు. బాధపడుతున్న తల్లిదండ్రులను కిశోర్‍ ఊరుకోబెట్టాడు కానీ వాళ్ల చివరిదాకా మధుబాల పట్ల ఉదాసీనంగానే ఉన్నారు. కిశోర్‍కు 1955 దాకా హిట్‍ సినిమాయే రాలేదు. ఆ పాటికే మధుబాల ఓ నలభై సినిమాలలో హీరోయిన్‍. దిలీప్‍ లాటి హీరోని వదిలి కిశోర్‍ వంటి హాస్యనటుడిని పెళ్లి చేసుకోవడం చాలామందికి రుచించలేదు. కానీ మధుబాల తన నిర్ణయం మార్చుకోలేదు. ‘‘నా జీవితంలో హాయి అనుభవించేది అతని సమక్షంలో మాత్రమే’. అంది. 1960 అక్టోబరు 16న జరిగిన కిశోర్‍, మధుబాలలది మతాంతర, భాషాంతర వివాహం.  ఎవరూ మతం మార్చుకోకుండా రిజిష్టరు మేరేజి చేసుకున్నాడు..

పెళ్లి జరిగిన మర్నాడు తను సినిమాల నుండి విరమించుకుంటున్నట్టు మధుబాల ప్రకటించింది. దాంతో ఆమెకు అడ్వాన్సు యిచ్చిన కొంతమంది ప్రొడ్యూసర్లు కేసులు పెట్టారు. వాళ్లతో ఆమె రాజీ కుదుర్చుకుంది. ఎనిమిదవ యేట నుండి మొహానికి రంగు వేసి, వేసి అలసిపోయిన ఆమె 27 ఏళ్ల కైనా విముక్తి దొరికిందనుకుంది. ఇంటిపట్టున ఉండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుందామనుకుంది. తన గుండెలో రంధ్రం ఉందన్న సంగతి అప్పటికే తెలుసు. ఆ విషయం కిశోర్‍కు తెలిపింది కూడా. ఏముంది, ఫారిన్‍ వెళ్లి వైద్యం చేయించుకుంటే అదే నయమైపోతుంది అనుకున్నారిద్దరూ! దానిగురించి పెళ్లి మానుకోనక్కర లేదనుకున్నారు. నిజానికి దానికి వైద్యం అప్పటికి లండన్‍లో కూడా లేదని ముందుగా తెలుసుకోకపోవడం వారి వివాహవైఫల్యానికి దారితీసింది.

మధుబాల కిశోర్‍ మధ్య ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేటంత పెద్ద పరిచయం లేదు. ఎక్కువకాలం ప్రణయం సాగలేదు కూడా. పెళ్లి అయిన తర్వాతనే వారిద్దరి మధ్యా ఎంత వైరుధ్యం ఉందో బాగా తెలిసివచ్చింది. మధుబాల తన కెరియర్‍ను చాలా సీరియస్‍గా తీసుకున్న వ్యక్తి. చిన్నతనంలోనే స్టార్‍డమ్‍ వచ్చేయడంతో అందరూ ఆమెను గౌరవించేవారు. పొగిడేవారు. ఆమె అందం గురించి, అభినయం గురించి ఎటుచూసినా ప్రశంసలే. సినిమాలు తప్ప వేరేలోకం చూడని మధుబాలకు అవగాహన తక్కువ. సినిమాలు మానేశాక  ఆమె మూడీగా తయారయింది. పైగా పెళ్లి అయిన తర్వాత కిశోర్‍ తన అనారోగ్యం గురించి పట్టించుకోవడం మానేశాడని ఆమెకు అనుమానం పట్టుకుంది.

లండన్‍ వెళదా మంటే కిశోర్‍ ‘చూద్దాంలే’ అంటాడు కానీ కదలడు. ఒకవేళ అప్పటికే అతనికి అది నయం కాని వ్యాధి అని తెలిసిందేమో! కిశోర్‍ ఉదాసీనత చూసి ఒక పరిచయస్తుడు మధుబాలతో ‘‘నేను వెంట బెట్టుకుని లండన్‍ తీసుకెళతా రా’’ అన్నాడు. దాంతో సిగ్గుపడి కిశోర్‍ స్వంత ఖర్చుల మీద ఆమెను లండన్‍ తీసుకెళ్లాడు. కానీ అప్పటికే మధుబాలకు సందేహం వచ్చేసింది - ‘‘ఇతనికి నేనక్కరలేదన్నమాట’’ అని. మధుబాల చెల్లెలు ఒకామె ‘‘తన సొంత సినిమాల్లో ఫ్రీగా వేషం వేస్తుంది కదాని కిశోర్‍ మా అక్కను చేసుకున్నాడు కానీ తన మీద ప్రేమకొద్దీ కాదు.’’ అనేసింది. లండన్‍ వెళ్లి చూపించుకునే సరికి తెలిసింది - ఇదేమీ తగ్గే వ్యాధి కాదని. ‘‘ఆపరేషన్‍ చేయడానికి వీలు కాదు. నువ్వు ఏడాదిలోనే పోవచ్చు, లేదా పదేళ్లు బతకవచ్చు. పిల్లలు కనవద్దు. ఎటువంటి ఆందోళనా, మానసిక చింతా పెట్టుకోవద్దు’’ అని చెప్పారు డాక్టర్లు.

కొత్త భార్య యింత డెలికేట్‍ అని తెలియగానే కిశోర్‍కు ఉత్సాహమంతా చచ్చింది. అతని జీవితంలో నవ్వు యిగిరిపోయింది. ఏ సరదాలు చూసి కిశోర్‌ను వరించిందో ఆ సరదా, మొగుడయ్యాక కనబరచ పోయేసరికి మధుబాల నిరాశకు గురయింది. నర్గీస్‍ అనారోగ్యం పాలయినప్పుడు సునీల్‍ దత్‍ ఆమెకు అండగా, ఆసరాగా నిలబడి ఎంతో మానసిక స్థయిర్యాన్ని యిచ్చాడు. కానీ దానికి ముందు వాళ్లిద్దరూ ఎన్నో ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు. కిశోర్‍ విషయంలో అది జరగలేదు. పెళ్లయి కాస్తయినా అనుబంధం ఏర్పడకుండానే ఈ ఉపద్రవం ముంచుకురావడంతో కిశోర్‍ బెంబేలెత్తిపోయాడు.

ఇది మధుబాలను కృంగదీసింది. తనకు భర్త ఆదరణా లేదు, అత్తమామల ఓదార్పూ లేదు. ఇంకెందుకు ఇక్కడ ఉండడం అనుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను చూడడానికి కిశోర్‍ తరచుగా అక్కడికే వెళ్లేవాడు. అనారోగ్య పీడితురాలై, సినిమాల్లో వచ్చిన గుర్తింపు పోగొట్టుకుని యింట్లోనే పడివుండవలసిన 27యేళ్ల మాజీతార మనస్తత్వం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఆమె సినిమాలలో రిటైరైన తర్వాత రిలీజయిన ‘‘మొఘల్‍-ఏ-ఆజమ్‍’ ఆమెను సినీచరిత్రలో మరుపురాని అనార్కలిగా నిలిపింది. కానీ ఆ స్టార్‍డమ్‍ అనుభవించలేని పరిస్థితి ఆమెది. అటువంటి మానసిక స్థితిలో ఆమె బ్యాలన్స్‌డ్‌గా ప్రవర్తించకపోవడం సహజం. కిశోర్‍ మెంటల్‍ బ్యాలెన్స్ కూడా అంతంత మాత్రమే కాబట్టి యిద్దరూ కలిసి జీవితం దుర్భరం చేసుకున్నారు. 

తనను చూడడానికి వచ్చే కిశోర్‍ను ఏడిపించడమే పనిగా పెట్టుకునేది మధుబాల. ‘‘నేను పోయాక మా చెల్లెల్ని చేసుకో’’ అని పట్టుబట్టేది. ‘‘ఛ, ఛ ఆ మాటలెందుకిప్పుడు?’’ అంటే కాదు కూడదనేది. ‘‘సరేలే. చూద్దాం’’ అని అనిపించి, ‘‘చూశావా, నేను ఎప్పుడు పోతానా, మా చెల్లెల్ని చేసుకుందామా అని  చూస్తున్నావ్‍’’ అని అల్లరి పెట్టేది. ఈ గోల భరించలేక కిశోర్‍ వెళ్లడం తగ్గించేవాడు. ‘‘అవున్లే నా మీద ప్రేమ ఉంటేగా, నీ మొదటిభార్య మీద నీకింకా మోజు పోలేదు.’’ అని గొడవ పెట్టేది. మళ్లీ సినిమాల్లో వేస్తేనైనా బాగుపడుతుందేమో ననుకుని ‘‘నిన్ను హీరోయిన్‍గా పెట్టి సినిమా తీస్తా’’ అనేవాడు కిశోర్‍. అంతలోనే ఇంట్లో ఆమె ‘‘మొఘల్‍-ఏ-ఆజమ్‍’’ సినిమా వేసుకుని చూస్తూ ఉంటే అసూయతో భగ్గుమనేవాడు. ‘‘చల్తీ కా నామ్‍ గాడీ’’ చూడవచ్చుగా, ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తావ్‍’. అంటూ అరిచేవాడు.

కిశోర్‍తో వివాహం భగ్నమయ్యాక, ఆమె మంచం మీద పడ్డాక దిలీప్‍ ఆమెను చూడడానికి వెళ్లేవాడు. ‘‘నా ఆరోగ్యం బాగుపడితే నాతో మళ్లీ నటిస్తావు కదా?’’ అని అడిగేదామె దీనంగా. ‘‘తప్పకుండా’’ అంటూ ఆమెను ఓదార్చేవాడతను. 1962 నాటికే మధుబాల ఆరోగ్యం మరింత క్షీణించి నోటివెంట రక్తం పోతుండేది. భార్యాభర్తలిద్దరూ విడిపోవడం తథ్యం అనేది అందరికీ తెలిసిపోయింది. అందువల్ల వారిద్దరూ విడిగానే జీవించినా విడాకులు తీసుకోలేదు. ఆమె హృద్రోగంతో బాధపడి, పడి చివరకు 1969 ఫిబ్రవరి 23న తన 36 వ యేట ఆఖరి శ్వాస విడిచింది. ఆమె శవపేటికను భుజానికి ఎత్తుకున్నవారిలో కిశోర్‍ ఉన్నాడు. ఆ సమయానికి దిలీప్‍ మద్రాసులో ‘‘గోపీ’’ సినిమా షూటింగులో ఉన్నాడు. బొంబాయికి తిరిగి వచ్చి సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లేసరికి అంత్యక్రియలు పూర్తయిపోయాయి. ‘‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం, చాలా ఎమోషనల్‍గా ఉండడం, పూర్తిగా తండ్రి చెప్పుచేతల్లో ఉండడం.. వీటివల్లనే ఆమె జీవితం విషాద భరితమయింది’’ అని నిట్టూరుస్తాడు దిలీప్‍! ఆమె పోయిన తర్వాత ‘ఫిలింఫేర్‍’కు యిచ్చిన యింటర్వ్యూలో కిశోర్‍ ‘‘మధుబాల నా ఫ్రెండు దిలీప్‍కుమార్‍ గర్ల్‌ఫ్రెండుగానే గుర్తుండిపోయింది’’ అని అన్నాడు (ఫోటోలు – మధుబాల, ‘‘బాదల్’’లో ప్రేమ్ నాథ్‌తో, ‘‘మొఘలే ఆజమ్‌’’లో దిలీప్‌తో, ‘‘చల్తీ కా నామ్ గాడీ’’లో కిశోర్‌తో,).

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2021)

mbsprasad@gmail.com

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను