cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: దృష్టి మరల్చడానికేనా?

ఎమ్బీయస్‌: దృష్టి మరల్చడానికేనా?

ప్రస్తుతం రాష్ట్రాన్ని పీడిస్తున్న అనేకానేక సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్‌ ఆంధ్ర రాజధానిని మూడుముక్కలు చేస్తున్నట్లు ప్రకటించాడని బాగా ప్రచారం జరుగుతోంది. అధికారపక్షం  మీద సాధారణంగా వచ్చే ఆరోపణే యిది. కొన్ని సందర్భాల్లో అది నిజం కూడా అవుతుంది. కానీ యీ సందర్భంలో నాకు అది అతుకుందని అనిపించటం లేదు. ఎందుకో కారణాలు చెప్తాను. ఇది ఎప్పణ్నుంచో పకడ్బందీగా వేసుకున్న పథకం అనిపిస్తోంది నాకు. ఇసుక పాలసీ విషయంలో కొత్త పాలసీ తయారు కాకుండా ఉన్న అమ్మకాలను నిలిపివేయడం చాలా దారుణ ఫలితాలను యిచ్చిందని గ్రహించాక జగన్‌ తక్కినవన్నీ ప్లాను చేసుకుని ఒక అజెండాతో వరుసగా అన్నీ చేసుకుంటూ పోతున్నాడు. రాజధాని మార్పు (అవును అది మార్పే) గురించి ఆర్నెల్ల ముందే కసరత్తు జరిగిందని, ప్రభుత్వభూములు ఎక్కడున్నాయో గుర్తించమని సిఎం ఆఫీసు వైజాగ్‌ కలక్టరుకు లేఖలు రాసిందని ఆంధ్రజ్యోతి ఉవాచ.

ఆ విధంగా వైజాగ్‌ పరిసరాల్లో భూములను గుర్తించారు. ఖర్చులెంతవుతాయో ఓ లెక్క వేసుకున్నారు. అమరావతిలో చాలా భాగం పూర్తయిన పనులు మాత్రం సాంతం పూర్తి చేసి, తక్కినవాటికి ఫుల్‌స్టాపో, కామాయో పెట్టారు.  బొత్స చేత అమరావతి రాజధానిగా పనికి రాదని ప్రకటింపచేశారు. దానికి రియాక్షన్‌ ఎలా వుందో టెస్ట్‌ చేసుకుని ధైర్యం తెచ్చుకున్నారు. సదరు ప్రకటన అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగనే చేశారు. ప్రకటన రాగానే రైతులు రాస్తా రోకో చేసి, అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలను అడ్డుకుంటారని ఊహించి, ఆ లోపునే అసెంబ్లీ ముగించేశారు. అసెంబ్లీలో ప్రకటనకు 'మూడు రాజధానులు' రంగు పులిమారు. దాంతో అమరావతిలో నిరసనలు వచ్చినా, రాయలసీమ, ఉత్తరాంధ్రలలో హర్షాతిరేకాలు వస్తాయని, డామేజి ఆఫ్‌సెట్‌ అవుతుందని అంచనా వేశారు. 

రాజధానిగా దేన్ని ఎంచుకున్నా హై కోర్టుతో సహా అన్నీ ఒకే చోట పెట్టాలని నిన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రవచించారు. కానీ ప్రకాశం, సంజీవరెడ్డి వంటి దిగ్దంతులు అలా అనుకోలేదు. అందుకని శ్రీబాగ్‌ ఒడంబడిక అని చేసుకుని కోస్తా, రాయలసీమలలో రాజధాని ఒక చోట ఉంటే హైకోర్టు మరో చోట ఉండాలని తీర్మానించారు. దాని ప్రకారం కర్నూలు రాజధాని ఐతే, గుంటూరుకి హైకోర్టు యిచ్చారు. 2014లో మళ్లీ ఆంధ్ర ఏర్పడింది కానీ రాయలసీమకు రాజధాని కానీ హైకోర్టు కానీ ఏదో ఒకటి యివ్వాలి. ఆ ఒప్పందాన్ని బాబు కాలరాసినందుకు రాయలసీమ రగులుతోంది. అందువలన యిప్పుడు హైకోర్టు యివ్వడం న్యాయమైన పద్ధతి. కానీ యిప్పటికీ టిడిపి నాయకులు కర్నూలుకి హైకోర్టు ఎందుకు, బెంచ్‌ యిస్తే చాలు అంటున్నారు, వాళ్లని యింకా మండించడానికి.   

హైకోర్టు ఉన్నదాన్ని ఎవరూ రాజధాని అనరు. కానీ జగన్‌ హైకోర్టు మాత్రం యిచ్చి దానికి గ్రాండ్‌గా 'జ్యుడిషియల్‌ కాపిటల్‌' అని పేరు పెట్టాడు. సెక్రటేరియట్‌ ఎక్కడుంటే దాన్నే రాజధాని అనాలి. కానీ దానికి ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌ అని పేరు పెట్టి లెజిస్లేటివ్‌ కాపిటల్‌ పేరును అమరావతికి పెట్టారు. ఈ పేర్ల గారడీ ఎందుకంటే అమరావతిలో రాజధాని మాయమై పోయిందని అనిపించుకోకుండా ఉండడానికి. ఎందుకంటే గత ప్రభుత్వం 'రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్నాం' అని చెప్పి రైతుల నుంచి భూములు వసూలు చేసింది. దాన్ని మన్నించినట్లు ఉండాలంటే, అమరావతిని కూడా ఏదో ఒక రాజధాని పేరుతో పిలవాలి. ఆ విధంగా చట్టాన్ని తృప్తిపరచ గలుగుతారు కానీ అమరావతిలో అద్భుత నగరం వస్తుందంటూ హెచ్చు ధరలకు భూములు కొన్నవారిని తట్టుకోవడం ఎలా? వాళ్లు రైతుల పేరు చెప్పి ఉద్యమాలు చేస్తారని తెలుసు.

రైతుల పేరు చెప్పగానే ప్రజలు తప్పకుండా సానుభూతి చూపుతారు. ఉద్యమం వెనుక అమరావతిలో భూకుంభకోణాలు చేసిన పెద్దలున్నారని, రైతుల పేరు చెప్పి తమ ఆస్తులు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని నిరూపించగలిగితే ఆ ఉద్యమం బలహీనపడుతుందని  వైసిపి వారు లెక్క వేశారు. అమరావతిలో 'ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌' జరిగిందని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటలను నిరూపించుకోవడానికి అధికారంలోకి వచ్చాక ఆధారాలు సేకరించ సాగారు. భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమిటో, ఆ భూముల ప్రస్తుత సొంతదార్లెవరో వివరాలు అన్నీ చేతికి తెచ్చుకున్నారు. రాజధాని ప్రకటన చేసేందుకు ముందే సిఆర్‌డిఏ ప్రాంతంలో 4 వేల ఎకరాల సొంతదార్లెవరో సర్వే నెంబర్లతో సహా ప్రకటించేశారు. దాంతో టిడిపి నాయకులందరికీ యీ అమరావతిలో సొంత ప్రయోజనాలున్నాయని అందరికీ అర్థమై పోయింది.

దాంతో పరువు నిలుపుకోవాలంటే ఉద్యమవేడిని చల్లారకుండా చూసుకోవలసిన పని టిడిపిది అయింది. రాజధానిని ముక్కలు చేస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని రాష్ట్రప్రజలందరిలో ఆవేశం తెప్పిద్దామని చూశారు. కానీ అంబ పలకటం లేదు. రాష్ట్రంలో 16 వేల గ్రామాలుంటే వాటిలో పదో వంతు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి. రాజధాని తరలిపోతే మనకు నష్టం కదాని వాళ్లయినా స్పందిస్తారనుకుంటే వాళ్లూ రోడ్ల మీదకు రావటం లేదు. భూములిచ్చిన 29 గ్రామాల్లో రైతులైనా ప్రాణాలకు తెగించి పోరాడతారనుకుంటే, వాటిల్లో 3 గ్రామాల ప్రజలు మాత్రమే పోరాటం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో యీ నిరుత్సాహాన్ని అధిగమించడానికి టీవీ చర్చల్లో, సోషల్‌ మీడియాలో మహా యాక్టివ్‌గా ఉన్నారు, టిడిపి నాయకులు, వారి అభిమానులు. ప్రజలందరూ వేరే సమస్యపై దృష్టి పెట్టకుండా యిదే జీవన్మరణ సమస్య అన్నట్లు ఫీలవాలని వారి ఆశ.

కొన్ని పత్రికలు, టీవీ ఛానెల్స్‌ పొద్దస్తమానూ దాని గురించే మాట్లాడిస్తున్నాయి. ఎందుకంటే ఆ మీడియా పెద్దలకు అక్కడ భూములున్నాయి. వాళ్లు చెప్పే మాటలు ఒకదానిని మరొకటి ఖండించేట్లు ఉన్నాయి. రాజధాని ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదని, హైదరాబాదు 1956 నుండి రాజధానిగా ఉన్నా, ఎన్టీయార్‌ ముఖ్యమంత్రి అయ్యాకనే అంటే 1983 నుంచే అభివృద్ధి చెందిందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాశారు.  ఇక అలాటప్పుడు రాజధాని తరలిస్తే బాధేముంది? రాజధానిగా మారినంత మాత్రాన వైజాగ్‌ అభివృద్ధి చెందుతుందన్న గ్యారంటీ లేదు. రాజధానిని పోగొట్టుకున్నంత మాత్రాన అమరావతి అభివృద్ధి చెందదన్న ష్యూరిటీ లేదు. లొకేషనల్‌ ఎడ్వాంటేజి వలన, స్థానిక ప్రజల కృషి, నేర్పుల వలన అమరావతి ప్రాంతం ఎలాగూ అభివృద్ధి చెందుతుంది. అది ఏ మేరకు అనేదానిపైనే చర్చ. 

చంద్రబాబు చెప్పిన మాయానగరం యిలకు దిగి ఉంటే అంతర్జాతీయ నగరం ఏర్పడి జనాలకు కోట్లు కురిసి వుంటాయని అనుకోవచ్చు. అది బాబు కలలోనే నిలిచిపోయింది. ఆ విషయం మూడేళ్ల క్రితమే తేటతెల్లమై పోయింది. బాబు ముఖ్యమంత్రిగా మళ్లీ వచ్చి వున్నా దాన్ని కట్టగలిగేవారు కారు. ఆయనే కాదు, ఎవ్వరూ కట్టలేరు. కడతానని చెప్పినా నమ్మే పని లేదు. అలాటిది ఇప్పుడు కొత్తగా గగ్గోలు పెట్టడం దేనికి? ఇదివరకు కంటె, అంటే ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియ కంటె ముందున్న పరిస్థితి కంటె యిప్పుడు అధ్వాన్నమై పోయినందుకు అనుకుంటాం. కానీ డిసెంబరు 26 నాటి ఆంధ్రజ్యోతి చదివాక నాకు కనువిప్పు కలిగింది.

''నేనే రాజా - నేనే కూలీ'' అనే ఆ కథనంలో చాలా గణాంకాలు యిచ్చారు. 29 గ్రామాల్లో ఏడాదికి మూడు పంటలు పండించుకుంటూ రైతులందరూ భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటే, ల్యాండ్‌ పూలింగు పేర వాటిని లాక్కుని, వారి నోట మట్టి కొట్టారని అనుకుంటూ వచ్చాను. కానీ కాదుట! వారిలో 86% మంది పరిస్థితి చాలా ఘోరంగా ఉంటూ వచ్చిందట. 34,322 ఎకరాలు యిచ్చిన రైతులు మొత్తం 29,881 మంది అంటే సగటున తలా 1.2 ఎకరాలన్నమాట. దీనిలో 10 ఎకరాల కంటె ఎక్కువ యిచ్చినవారు 159 మంది మాత్రమే. ఎకరం నుంచి రెండు ఎకరాల దాకా భూవసతి వున్నవారు 5227 మంది మాత్రమే. 20,490 మందికి ఎకరం లోపే భూమి ఉంది. తక్కినవాళ్లకు 2 కంటె ఎక్కువ, 10 కంటె తక్కువ ఉందన్నమాట.

29 గ్రామాల్లో 7 గ్రామాల్లో మాత్రమే మూడు పంటలు పండుతాయట. తక్కినవన్నీ వర్షాధారమేనట. ఏడాదికి ఒక పంట, బోరు పడితే రెండో పంట - అంతే! పాడి మీద వచ్చే ఆదాయంతో కలిపి నెలకు రూ.7-8 వేల కంటె ఆదాయం ఉండేది కాదు. అదీ తన పొలంలో తనే కూలీగా పని చేసుకుంటూ, తీరిక సమయాల్లో వేరే చోటకి కూలీకి వెళితే! ఇదీ వాళ్ల పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది? భూపరిహారంగా నెలకు 2500తో మొదలుపెట్టి ఏటా 10% పెంచుకుంటూ పోతోంది. (అది యిప్పుడు ఏ 3300యో అయి వుండవచ్చు) తమ పొలంలో తామే కూలీలుగా చేసుకుంటున్నవారిని వ్యవసాయ కూలీలుగా గుర్తించి కూలీ పరిహారంగా నెలకు రూ. 2500 యిస్తోంది. అంటే దాదాపు 5800 వస్తోంది. ఇది ఏ పనీ చేయకుండా వచ్చేది. పొలం పని ఎటూ లేదు కాబట్టి వేరే చోట కూలికి వెళితే నెలకు 5-6 వేలు సులభంగా వస్తుందనుకుంటాను. 

దేశంలో అనేకమంది రైతులు రిస్కు తీసుకుని వ్యవసాయం చేసి, నకిలీ విత్తనాలతో, నకిలీ ఎరువులతో అవస్థ పడుతూ, పంట చేతి కంది వచ్చే టైముకి మార్కెట్‌ ధర పడిపోయి నానా బాధలూ పడి, ఋణాలు తీర్చలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్న యీ తరుణంలో లాండ్‌ పూలింగులో భూములిచ్చిన రైతులు అదృష్టవంతులని చెప్పాలి. వారికి నెలకు 10 వేలు వస్తోంది. ఇది తమ పొలంలో తాము కూలీలుగా పని చేసుకునే 86% మంది రైతుల మాట. తక్కిన 14% మందికి కూలీ పరిహారం నెలకు 2500 రాదు. కానీ వారికి భూపరిహారం ఎకరాకి 3300 చొ||న వస్తోంది. వేరే ఆదాయ వనరు ఎలాగూ వెతుక్కుంటారు. ఎందుకంటే వారికి యిక్కడ చేయవలసిన పనంటూ ఏమీ లేదు. 

ఇది ఏటా వచ్చే ఆదాయం. ఇది కాక ప్రభుత్వం పొలాన్ని ప్లాట్లుగా చేసి ఎకరాకి (ఎకరం కంటె తక్కువ ఉన్నా ఎకరం కిందే లెక్క వేస్తారట) 1000 చ.గ. నివేశన స్థలం, 250 చ.గ./450 చ.గ. వాణిజ్య స్థలం యిస్తానంది. దానికి తన ఖర్చుతో విద్యుత్‌, నీరు, డ్రైనేజి సౌకర్యం యిస్తానంది. రాజధాని అక్కడ ఉన్నా లేకపోయినా వీటి విలువ తప్పకుండా పెరుగుతుంది. ఎందుకంటే రైతుల కోసం కాకపోయినా ప్రభుత్వం తన వాటాకు వచ్చే వాణిజ్యస్థలం కోసమైనా డెవలప్‌ చేస్తుంది కదా! డెవలప్‌ చేసి వదిలేయకుండా ఏదో ఒక బిల్డింగు కడుతుంది కదా! అందువలన అక్కడ సింగపూరు కమ్మర్షియల్‌ కాంప్లెక్సు కాకపోయినా, కనీసం సినిమా హాలైనా వస్తుంది కదా! ఏ విధంగా చూసినా అమరావతి రైతులకు లాండ్‌ పూలింగు వలన లాభమే తప్ప నష్టం కనబడటం లేదు. ఆంధ్రజ్యోతి అంకెల ప్రకారం (అవి తప్పని పాఠకులకు ఎవరికైనా తెలిస్తే చెప్ప ప్రార్థన) వాళ్లు గతంలో కంటె చాలా మెరుగ్గా అయ్యారు.

ప్రాజెక్టులకు పొలాలిచ్చిన అనేక మంది రైతులకు, గృహస్థులకు పరిహారం రాక, ప్రత్యామ్నాయ స్థలం కేటాయించబడక అలమటిస్తున్నారు. వారితో పోలిస్తే వీళ్లు చాలా చాలా బెటరు. ప్రత్యామ్నాయ స్థలం వీళ్ల పేర రిజిస్టరై పోయింది కూడా. ఆంధ్రజ్యోతి ప్రకారం కొందరు వాటిలో కొంత భాగం అమ్ముకుని, కొంత ఉంచుకున్నారట. అంటే రెడీ క్యాష్‌ కూడా వచ్చేసిందన్నమాట. అందుకే లాగుంది, 'కావాలంటే భూములు వెనక్కి యిచ్చేస్తాం' అని ప్రకటించినా ఎవరూ ముందుకు రావటం లేదు. వ్యవసాయం చేసుకుంటే మిగిలేదేమీ లేదు అని మనకు తెలియకపోయినా వాళ్లకు తెలుసు కదా! ఈ కారణం చేతనే కాబోలు 29 గ్రామాల్లో కేవలం 3 గ్రామాల ప్రజలు మాత్రమే అలజడి చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం డెవలప్‌ చేయను అంటే అందరూ కదిలేవారు.

ఇప్పటిదాకా రైతుల గురించే మాట్లాడాం. కానీ రియల్టర్ల గురించి మాట్లాడితే మాత్రం కథ వేరేలా ఉంటుంది. బాబు చెప్పిన అద్భుతనగరం వెలుస్తుందని నమ్మి, విపరీతమైన ధరలతో అక్కడ భూమి కొన్నవారికి, కేటాయింప చేసుకున్నవారికి నిరాశ కలగడం, తద్వారా కడుపు రగలడం సహజం. తమను ఊరించి, గోతిలో దింపినందుకు బాబుపై కోపం వుండే వుంటుంది. రాజధాని పేరు చెప్పి, ఎంతో కొంత ధరకు ఎవరో ఒకరికి అంటగట్టేస్తే మంచిదని చూస్తూండగా, రాజధాని కూడా తరలిపోతుందని తెలిస్తే కొనే వాడు ఎవరూ దొరకరని అర్థమై పోయి, జగన్‌పై భగ్గుమంటున్నారు. రైతులను అడ్డు పెట్టుకుని యీ సమస్యను సజీవంగా ఉంచుతున్నారు. రాజకీయ కారణాలతో టిడిపి వీరికి మద్దతు ఎలాగూ యిస్తుంది. 

రాజధాని మార్పు నిర్ణయం ఫైనల్‌గా వెలువడినా, కొత్త చోట స్థలాలు గుర్తించడానికి, బిల్డింగులు ఏర్పడడానికి హీనపక్షం ఏడాది పడుతుంది. అప్పటిదాకా దీనిని న్యూస్‌లో ఉంచడం, ఆవేశం చల్లారకుండా చూడడం జరిగే పని కాదు. 1953లో ముఖ్యమంత్రి ప్రకాశం గారు కర్నూలుని రాజధానిగా ప్రకటించగానే, రాజధాని ఆశిస్తున్న విజయవాడ వాసులు పెద్ద ఆందోళన చేపట్టారు. అక్కడున్న ప్రకాశం గారి విగ్రహాన్ని పగలగొడతామని ప్రకటించారు. ఆ విషయం ఆయనకు చెపితే 'పగలకొట్టుకోమను, అది పెట్టమని వాళ్లని అడిగానా? వాళ్లే పెట్టారు, వాళ్లే కూలగొడతారు' అని తీసిపారేశాడాయన. కృష్ణా జిల్లా వారు తర్వాత కూలగొట్టనూ లేదు, ప్రకాశం గారిని మన్నించకుండానూ లేరు. ఆ ఆవేశం చల్లారింది. రాజధాని ఎక్కడ ఉంటే అక్కడకు, అభివృద్ధి ఎక్కడ వుంటే అక్కడికి - మద్రాసు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాదు కానీ - వెళ్లి పెట్టుబడులు పెడుతూనే వచ్చారు తప్ప స్థానికంగానే యిన్వెస్ట్‌ చేస్తామని పట్టుబట్టి కూర్చోలేదు. వీళ్లందరూ రేపు వైజాగ్‌లో స్థలాలు కొని, అపార్టుమెంట్లు కట్టి అమ్మినా ఆశ్చర్యపడకండి.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2019)
mbsprasad@gmail.com