Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: దొందూ దొందే

ఎమ్బీయస్‌: దొందూ దొందే

ఆంధ్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌కు, ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య వివాదం నానాటికీ చికాగ్గా తయారైంది. జగన్‌ ఎదుట ఎన్నో సమస్యలున్నాయి. ఆరేళ్ల వయసున్న రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేదు, తగినన్ని పరిశ్రమలు లేవు, ఆర్థిక పరిస్థితి బాగా లేదు, తలకు మించిన అప్పులున్నాయి, జీవితానికంతా సరిపడే హామీలు నెత్తిమీద వేళ్లాడుతున్నాయి. ఇన్ని వున్నపుడు ఒక్కోటీ నిదానంగా, జాగ్రత్తగా చక్కబెట్టుకుంటూ రావాలి. సాధ్యమైనంతవరకు అందర్నీ సంప్రదిస్తూ, అవరోధాలను చాకచక్యంగా ఎదుర్కుంటూ వెళ్లాలి. కానీ జగన్‌లో విపరీతమైన దుందుడుకుతనం కనబడుతోంది. తనను వ్యతిరేకించిన ప్రతి వ్యక్తిని, ప్రతి వ్యవస్థ్థను శత్రువుగా చూడడం జరుగుతోంది. అందుకే అడుగడుగునా చిక్కులు ఎదురవుతున్నాయి.

టిడిపి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించటం లేదన్నది నిజమే. అది మరోలా ఎందుకుంటుంది? పార్టీ పుట్టిన తర్వాత ఎరుగనంత చావుదెబ్బ కొట్టినవాడి పట్ల ఉదారంగా ఉండాలా? అందుకే జగన్‌ పాలన సవ్యంగా సాగకుండా యుక్తులు, సుయుక్తులు, కుయుక్తులు అన్నీ పన్నుతుంది. ఇన్నేళ్లగా మనుగడలో వుండి జాతీయస్థాయిలో కూడా కొన్నాళ్లు చక్రం తిప్పిన పార్టీ ఎప్పటి నుండో అన్ని వ్యవస్థల్లో విత్తనాలు నాటుకుంటూ వచ్చి, యిప్పుడు అవసరం వచ్చిన వేళ ఆ చెట్ల ఫలాలు కోసుకోకుండా వుంటుందా?

ఇక సాక్షి తప్ప తక్కిన తెలుగు మీడియా వారికి వంత పాడుతుందన్నది ఏమైనా కొత్త విషయమా? ఇవన్నీ యిలా వుండగానే తనకు అమోఘమైన మెజారిటీ దక్కింది కదా! ఇక బాధెందుకు? టిడిపి మాటల్ని, మీడియా మాటల్ని మేం నమ్మలేదు అని ప్రజలు కరాఖండిగా చెప్పాక కూడా ప్రతిపక్షంపై, మీడియాపై నోరు పారేసుకోవడం దేనికి? వైసిపి ఎమ్మేల్యేలు, మంత్రులు హద్దు మీరి, మర్యాద అతిక్రమించి తిట్లకు దిగుతున్నపుడు ‘అవసరం లేదు’ అని వారించే బాధ్యత జగన్‌కు లేదా?

తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు సజావైన పాలన అందించడం జగన్‌ కర్తవ్యం. పాలన అంటే  ప్రజకు మేలు చేస్తున్నానంటూ, అనుకుంటూ తనకు చిత్తమొచ్చినట్లు చేయడం కాదు. దేనికైనా ఒక ఫ్రేమ్‌వర్క్‌ ఉంది. దానికి లోబడే ఏ పనైనా జరగాలి. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు లోకానికి తోచాలి కూడా. ఒక్కోసారి అనుకున్నంత వేగంగా పనులు జరగవు. సిద్ధాంతపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు వుంటాయి. వాటిని ఓర్పుతో, ఓపికతో అధిగమించాలి. అడ్డు వచ్చిన ప్రతివాడి తలకాయ నరుక్కుంటూ పోతానంటే వ్యవస్థ చూస్తూ ఊరుకోదు.

ఇది అనేక చెక్స్‌ అండ్‌ బేలన్సెస్‌తో కూడిన వ్యవస్థ. ఒక వ్యక్తి తనకు తోచినట్లు చేసుకుంటూ పోకుండా అడ్డుకట్టలు వేసే రాజ్యాంగం మనది. గుమాస్తా ఉద్యోగానికి అప్లయి చేయాలన్నా వాళ్లిచ్చిన ఫార్మాట్‌లో చేయాలి. జగన్‌ వద్ద బండెడు మంది సలహాదారులున్నా వాళ్లు ఆ ఫార్మాట్‌ గురించి చెప్పటం లేదు. అందుకే అతని సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయ మీద మొట్టికాయలు వేస్తూ పోతోంది. తలబొప్పి కట్టినా తీరు మార్చుకోవడం లేదు. కోర్టులన్నిటిలో చంద్రబాబు మనుషులున్నారు అనే ఒక్క నిందతో కోర్టు అక్షింతలు దులిపేసుకుంటున్నారు. ఎవరి మనుషులున్నా మన వాదన నెగ్గేట్లా కేసును ప్రెజంటు చేయగలగాలి, బిల్లులో ఎలాటి  లూప్‌హోల్స్‌ లేకుండా చూసుకోవాలి. ఈ పని చేయలేని సహాదారులు దండగమారి వారే. 

మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెట్టారు, నెగ్గింది, కౌన్సిల్‌కు వెళ్లింది, అక్కడ చట్టంలోని వెసులుబాటు ఉపయోగించుకుని మండలి చైర్మన్‌ తనకు తోచినట్లు చేసేశారు. ఆయనది తప్పుంటే, ఆ విషయమై కోర్టుకు వెళ్లాలి. మరో పక్క సెలెక్టు కమిటీ ఏమంటుందో వినాలి. దీనికి కాస్త టైము పడితే పట్టనీ, ఏమౌతుంది? ఒక వేళ కౌన్సిల్‌లో పాసై వుండినా, కరోనా దెబ్బకు ఎలాగూ ఆలస్యమయేది కదా! అదంతా అనవసరం, నేను అనుకున్న వెంటనే జరగలేదు అనుకుని కౌన్సిల్‌ రద్దు తీర్మానం చేసేసి, దాని ఆమోదం కోసం కేంద్ర బిజెపి ముందు సాగిలబడుతూ, నియంత అని ముద్ర వేయించుకుని... అవసరమా యిదంతా?

మండలి చైర్మన్‌లాగే విశేషాధికారం పేరుతో ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ వ్యవహరించారు. ఎవరినీ సంప్రదించే పని లేదు, యిది అత్యంత గోప్యంగా చేయాల్సినది (?) అంటూ ఎన్నికలు వాయిదా వేశారు. దాన్ని ఎదుర్కునేందుకు కొన్ని విధివిధానాలుంటాయి. వాటిని ఉపయోగించాలి తప్ప, ఆయన కులాభిమానంతో ప్రవర్తించాడు అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి బహిరంగంగా కులప్రస్తావన చేయడమేమిటి? బాబు దళితుల గురించి చేయలేదా అనేది పిచ్చి వాదన, ఆయన వైసిపికి ఆదర్శపురుషుడా?

రమేశ్‌ కుమార్‌ వింతవింతగా ప్రవర్తించారు. ఆయన్ని కోర్టుకి లాగి, ఉద్యోగ సంబంధమైన నియమాలను ప్రస్తావిస్తూ సంజాయిషీ కోరి, ఆయన ఎంత అనుచితంగా ప్రవర్తించాడో లోకానికి ఎత్తి చూపించవలసిన అవసరం ఉంది. కోర్టుకి వెళ్లి వాదించాలి. ఆయన ప్రవర్తనను లోకమంతా గర్హించాక, అభిశంసించాలి. ఆయనంతట ఆయనే రాజీనామా చేసే పరిస్థితి రప్పించాలి. అలా చేయకుండా ఠపీమని పదవీకాలాన్ని తగ్గించేయడమేమిటి?

మీ చేతిలో వుంది కాబట్టి తగ్గించారు అనుకున్నా అది రాబోయే కమిషనర్లకు వర్తిస్తుంది తప్ప ఉన్నవాళ్లకు వర్తించదు కదా. ఈ విషయాన్ని కోర్టు ఎలాగూ తప్పుపడుతుంది, తప్పు సవరించుకోమంటుంది. ఒకవేళ జరిగినది ఒప్పేనంటే అప్పుడే వేరేవాళ్లని వేసుకుని వుండాల్సింది. ఎందుకంటే కరోనా దెబ్బ వలన యిప్పట్లో ఎన్నికలు లేవు. కానీ ఎన్నికల కమిషనర్‌ లేకపోతే రాష్ట్రంలో కరోనా యింకా వ్యాపించి వేస్తుందేమోనన్నట్లు అప్పటికప్పుడు కనకరాజ్‌ గారిని పట్టుకుని వచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టడం దేనికి?

ఆంధ్రకు సంబంధించిన వలస కార్మికులు యితర రాష్ట్రాలలో అఘోరిస్తున్నారంటూ జగనే చెప్తున్నారు. వారిని తరలించే ఉపాయం చూడలేదు కానీ యీయన్ని మాత్రం ఆగమేఘాల మీద రప్పించేశారు. ఆయనా చార్జి పుచ్చేసుకుని, తన నియామకానికి అనుకూలంగా అఫిడవిట్లు వేసుకుంటున్నాడు. రేపు కోర్టు రమేశ్‌ కుమార్‌నే కొనసాగించాలి అంటే మరి యీయన ఎక్కడ కూర్చుంటాడో మరి! రాష్ట్రానికి యిద్దరు కమిషనర్లుండాలి అంటూ మరో ఆర్డినెన్సు తెస్తారా? ఒకరు ఐఏఎస్‌, మరొకరు మాజీ జడ్జి, ఇద్దరూ పదవి కోసం కాట్లాడుకుంటున్నారంటే ఎంత ఎబ్బెట్టుగా వుంటుంది?

కనకరాజ్‌ గారిని ఎంచుకోవడంలో రాజకీయ విజ్ఞత కూడా లోపించింది. రమేశ్‌ గారి కులం ప్రత్యేకంగా ప్రస్తావించి, జగన్‌ తనది వ్యక్తులను కులం కళ్లతో చూసే నైజమని బహిరంగంగా చాటుకున్నారు. ఆ కులంలో అందరికీ తను వ్యతిరేకిని కాదు, కులాభిమానంతో అధికార దుర్వినియోగం చేసినవారికి మాత్రమే వ్యతిరేకిని అని చాటుకోవలసిన అవసరం ఉంది. అలాటప్పుడు తాను తెచ్చే వేరే వ్యక్తి అదే కులానికి చెందినవాడిగా చూసుకోవడం రాజకీయంగా అవసరం. అది చేయకుండా దళితుణ్ని తెచ్చానని చెప్పుకోవడం, దళితుడనగానే అయితే తప్పకుండా క్రైస్తవుడై వుంటాడు అని కొన్ని వర్గాలు ప్రచారం చేయడం, జగన్‌ క్రైస్తవాభిమానానికి యిదో మచ్చుతునక అనడం జరిగిపోయాయి.

ఇదీ ముందే ఊహించదగిన పరిణామం. తబ్లీగీ సమావేశం వలన కరోనా విపరీతంగా వ్యాప్తి చెందడం, తర్వాత కూడా వాళ్లు క్వారంటైన్‌కు వెళ్లకుండా మొరాయించడం, వెళ్లినవారు అక్కడి వైద్యసిబ్బందిని వేధించడం చేత దేశంలో ముస్లిము వ్యతిరేకత విపరీతంగా ప్రబలింది. ఇది తక్కిన మైనారిటీలపై కూడా ఎంతోకొంత ప్రసరించడం ఖాయం. ఇలాటప్పుడు క్రైస్తవ దురభిమానం ఉందని ముద్రపడిన ముఖ్యమంత్రి మరింత జాగ్రత్తగా వుండాలి. కానీ జగన్‌కు యివేమీ అర్థమవుతున్నట్లు తోచటం లేదు. సంక్షేమ పథకాలంటూ ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచితే చాలు, ఓటర్లు యివేమీ పట్టించుకో రనుకుంటున్నారు. బాబు కూడా తక్కువ పథకాలు చేపట్టలేదు. కానీ 26 సీట్లే తెచ్చుకున్నారు. ప్రత్యర్థుల పట్ల, ఎదురు నిలిచిన అధికారుల పట్ల అసహనాన్ని ప్రత్యక్షంగా కనబరచి, తటస్థుల ఆదరణ కోల్పోయారు. ఇప్పుడు జగన్‌ అదే పని చేస్తున్నారు.

ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారి కృష్ణ కిశోర్‌ ఉదంతం ఒక ఉదాహరణ. ఆయనను చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవప్‌మెంట్‌ బోర్డ్‌కి సిఇఓగా నియమించారు. జగన్‌కు ఆయనపై మంట ఎందుకంటే 2010లో ఇన్‌కమ్‌టాక్స్‌ ఎడిషనల్‌ కమిషనర్‌గా ఆయన జగతి పబ్లికేషన్స్‌పై దాడులు నిర్వహించి రూ.123 కోట్ల పన్ను విధించాడు. అది ఆయన అధికారవిధుల్లో భాగమే. అప్పుడు కేంద్రంలో వున్న కాంగ్రెసు ప్రభుత్వం మెప్పు కోసం కాస్త అతి చేస్తే చేసి వుండవచ్చు. దానికి గాను పగ బడితే ఎలా? తను రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఆయన్ని కేంద్ర సర్వీసుకు పంపివేయకుండా, అలా అని యిక్కడ ఏ పదవీ యివ్వకుండా అవమానపరచడమే కాక జీతం ఆపేశారు. పైగా ఇడిబిలో వుండగా అక్రమాలకు పాల్పడ్డారని ఎసిబి చేత కేసు పెట్టించి, సస్పెండ్‌ చేశారు.

చివరకు ఏమైంది? సెంట్రల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ ట్రైబ్యునల్‌ సస్పెన్షన్‌ ఎత్తివేసింది. ఆయన్ని సొంత డిపార్టుమెంటుకి తిప్పి పంపేయమని ఆదేశించింది. ఆయన్ని యిప్పుడు డిపార్టుమెంటు ప్రమోషన్‌తో సత్కరించింది. ఐటి ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆఫీసులో ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా నియమించింది. ఇది ఆయనకు నైతిక విజయమే కదా. మరి జగన్‌ సర్కారు వేసిన అక్రమాల కేసు గతి ఏమైనట్లు? చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి జగన్‌ శిక్షింపబోయి, బోల్తా పడ్డాడు అనుకుని కొందరు ఊరుకుంటే, కమ్మవాళ్లతో పెట్టుకుంటే అంతే మరి అని కొందరు వ్యాఖ్యానిస్తారు. రెండో మాట ఎందుకు వచ్చిందంటే ఆయనే అధికారులను కులాల వారీగా చీలుస్తున్నాడు కాబట్టి.

ఇప్పుడు రమేశ్‌ కుమార్‌ విషయంలో కూడా కోర్టు ప్రభుత్వానికి గడ్డిపెడితే ‘కమ్మ అధికారులను పని చేసుకోనీయటం లేదు’ అనే మాట రావడం ఖాయం. రమేశ్‌ కులాభిమానంతో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాడని జగన్‌ అన్నారు. కానీ యీయన గతంలో కులాభిమానం చాటుకున్న దాఖలాలు ఏవీ లేవని సీనియర్‌ పాత్రికేయులు అంటున్నారు. మర్యాదగా వుంటూ, ఉద్యోగంలో  అలసిపోకుండా కాలక్షేపం చేసిన మనిషే తప్ప చెప్పుకోదగ్గ మంచి గానీ, చెడు గానీ, ఎవరికైనా ఉపకారం కానీ, అపకారం కానీ చేసిన మనిషిగా పేరు లేదట. ఈయన నియామకం కులం కారణంగానే జరిగిందని వైసిపి ఆరోపణ.

అబ్బే, నిజానికి బాబుకు యీయనపై దృష్టి లేదు, వేరే ఆయన్ని సూచిస్తే, గవర్నరు నరసింహన్‌ పట్టుబట్టి యీయన నియామకానికి ఒప్పించారు అని టిడిపి అంటోంది. అది నిజమే కావచ్చు. వీళ్లంతా ఐఏఎస్‌లు. తమ సొంత ప్రతిభతో ఆ స్థాయి చేరతారు తప్ప కులం పేరుతో ఉద్యోగం సంపాదించుకున్నవారు కారు. మహా అయితే మంచి పోస్టింగు తెచ్చుకుని వుండవచ్చు. అనేక కులాల రాజకీయ నాయకుల దగ్గర పనిచేయాల్సి వుంటుంది. పోనీ తన కులం వారికి సాయపడదామనుకున్నా కొన్ని నియమాలకు లోబడే చేయాల్సి వుంటుంది తప్ప ఔట్‌ ఆఫ్‌ ద వే చేయడం కుదరదు. ఈయనకైతే అలా చేసే తెగువ కూడా లేదుట.

జగన్‌ దగ్గర కూడా యీయన మొన్నటిదాకా అలాగే కాలక్షేపం చేశాడు. టిడిపి వాళ్లకు అందుకే మంట పుట్టింది. వైసిపి హింసాకాండతో రాష్ట్రం అల్లకల్లోలమై పోతున్నా తన ఉద్యోగం కాపాడుకోవడానికి ఏమీ చేయకుండా గుడ్లప్పగించి చూస్తున్నాడని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తిట్టిపోశారు. ఏకగ్రీవాలు ఎక్కువగా వుండడంలో ఆశ్చర్యం లేదని, అంతా సవ్యంగానే ఉందని యీయన అంటూ వచ్చాడు. అలాటిది హఠాత్తుగా ప్లేటు ఫిరాయించడం అత్యంత ఆశ్చర్యకరంగా వుంది.

ఆయన చేసిన మూడు పనులు ఆయన స్వభావానికి విరుద్ధంగా తోస్తున్నాయి. ఒకటి - రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషన్‌ సెక్రటరీకి కూడా చెప్పకుండా ఏకంగా ఆరువారాల పాటు ఎన్నికలు వాయిదా వేయడం! అలా వాయిదా వేయించడానికి టిడిపి రకరకాల కారణాలు చెపుతూ వచ్చింది. వాటిలో కరోనా ఒకటి. ఈయన దాన్ని ఎంచుకున్నాడు. నిజానికి అప్పటికి దేశంలో కరోనా గురించి పూర్తి అవగాహన ఎవరికీ రాలేదు. కేంద్రమే ఎమర్జన్సీ అనుకోవటం లేదు.

ఈయనకు ప్రత్యేక దూరదృష్టి వుందనుకున్నపుడు ప్రభుత్వాధికారులతో చర్చించి, తన ఆలోచనావిధానాన్ని విశదీకరించి వుంటే వారూ ఎలర్టయ్యేవారు. ఎందుకంటే కరోనా వలన ఎన్నికలు మాత్రమే ప్రభావితం కావు. యావత్తు జనజీవితం స్తంభించింది. ‘మన ముఖ్యమంత్రి గారు లైట్‌గా తీసుకుంటున్నారు కానీ దీనివలన ఎంతో ప్రమాదం పొంచి వుంది, టెస్టింగు కిట్స్‌, పిపిఇలు దగ్గర పెట్టుకోమనండి, డాక్టర్ల సెలవు కాన్సిల్‌ చేయమనండి’ అని సాటి ఐఏఎస్‌లకు హితవుగానైనా చెప్పాల్సింది. ఎన్నికలు వాయిదా వేస్తే చాలు, కరోనా పని పట్టినట్లే అని అనుకోవడం బాగా లేదు. 

రెండోది - ఎన్నికను ఆరువారాల పాటు వాయిదా వేసి, ఎన్నికల కోడ్‌ను మాత్రం అమలు చేస్తూ మొత్తం పాలనాధికారాన్నీ తన చేతిలోకి తీసుకోవాలని చూడడం. కొందరు ఉన్నతాధికారులను బదిలీ చేసేసి, అప్పుడే పాలన మొదలు పెట్టేశారు కూడా. కరోనా ఉగ్రత గురించి ఆయనకు నిజంగా అవగాహనే వుండి వుంటే కరోనా కష్టకాలంలో రాష్ట్రపాలనంతా తన నెత్తిన వేసుకుందామని అస్సలు అనుకునేవాడు కాదు. గతంలో ఏ చీఫ్‌ సెక్రటరీగానో చేసి వుంటే రాష్ట్రం మొత్తం నడిపిన అనుభవం వుండి వుండేది. ఆయన జిల్లా కలక్టరుగా పని చేసినది కూడా ఒక్క ఏడాదే. ఎక్కువకాలం సెక్రటేరియట్‌లో శాఖల్లోనే పని చేశారు. చివర్లో గవర్నరు దగ్గర సెక్రటరీ ఉద్యోగం అంటే చాలా దిలాసా అయిన ఉద్యోగమే తప్ప పనిభారం ఎక్కువ వుండదు.  

మోహన్‌ కందా గారు తన జ్ఞాపకాల్లో రాశారు - తన కెరియర్‌ తొలినాళ్లలో తనకు యిష్టం లేకున్నా అప్పటి గవర్నరు శారదా ముఖర్జీ దగ్గర సెక్రటరీగా చేరాల్సి వచ్చిందని, ఆవిడ తర్వాత వచ్చిన కెసి అబ్రహాం గారు కొనసాగమని ఎంత కోరినా, బతిమాలుకుని సాధ్యమైనంత త్వరలో బయటపడ్డానని! సాధారణంగా ఐఏఎస్‌లందరికీ యాక్టివ్‌గా వుండాలని ఉంటుంది. ఈ రమేశ్‌గారు 53 ఏళ్ల వయసులో తన దక్షత, అనుభవం చూపగలిగే మంచి చురుకైన పోస్టుకి కాకుండా గవర్నరు దగ్గర ఉద్యోగంలోకి వెళ్లిపోయారంటేనే ఆయన ధోరణి తెలుస్తోంది. వెళ్లినాయన రిటైరయ్యేదాకా ఏడేళ్ల పాటు అక్కడే వుండిపోయారు. అక్కణ్నుంచి ఎన్నికల కమిషనర్‌గా వచ్చారు. అప్పణ్నుంచి స్థానిక ఎన్నికలు ఒక్కసారీ నిర్వహించలేదు, బాబు వాయిదా వేస్తూ పోవడం వలన! అలాటాయన చేతిలో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రం వుండి వుంటే ఏం జరిగేదో చెప్పలేం.

ఇక మూడోది విషయం - కేంద్ర హోం శాఖకు ఉత్తరం రాయడం. గతంలో స్థానిక ఎన్నికల రచ్చ గురించి నేను రాసినపుడు ఆయన ఆ ఉత్తరం రాసి వుండరని, టిడిపి అనుకూల మీడియాయే దాన్ని పుట్టించి, గొడవ చేస్తోందని నమ్మాను. ఎందుకంటే అప్పటికి తను రాయలేదని ఆయన ఎఎన్‌ఐ కు చెప్పి వున్నాడు. ఆ తర్వాత కూడా దాని గురించి ఎంత చర్చ జరిగినా కలుగులోంచి బయటకు రాలేదు. గతంలో ఓ సారి ఓ వ్యాసం రాశాను - అబద్ధపు తీగతో నిజం డొంక కదిల్చిన ఉండవల్లి అని. ఒక కాల్పనికమైన కేరళగ్రామం పేరు ఉపయోగించి, ఉండవల్లి జయపాల్‌‌ రెడ్డి గారిచేత విభజన బిల్లులో ఆయన వహించిన పాత్ర గురించి కక్కించారు.

అలాగే విజయసాయి రెడ్డి, పాపం రమేశ్‌ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశారు అంటూ కేసు పెట్టడంతో రమేశ్‌ చచ్చినట్టు కలుగులోంచి తల బయటకు పెట్టి ‘ఫోర్జరీ కాదు, నేనే రాశా’ అని ఒప్పుకోవలసి వచ్చింది. ఈ ముక్క చెప్పుకోవడానికి అంత భీతి ఎందుకు? రాయలేదని ఎఎన్‌ఐకు అబద్ధం చెప్పడం దేనికి? దాని రికార్డు ఆఫీసులో లేకుండా చేయడం దేనికి? డిపార్టుమెంటు సెక్రటరీకి కూడా చెప్పకపోవడమేమిటి? వైసిపి వాళ్లు ఏమైనా చేసేస్తారని భయమా? అంత భయం ఉంటే ఆ ఉద్యోగంలో వుండడం అనవసరం.

ఎందుకంటే సాధారణంగా ఎన్నికల ఆఫీసర్లందరూ ఓటర్లకు ధైర్యం చెపుతారు. ‘నిర్భయంగా ఓటేయండి, ఓటేస్తే చేతులు నరికేస్తామని నక్సలైట్లు బెదిరించినా బెదరకండి.’ అని. మరి ఆయనకే ధైర్యం లేకపోతే ఎలా? ఇక పోలింగు సమయంలో సాధారణ ప్రభుత్వోద్యోగులు, మహిళలతో సహా, అనేకమంది మారుమూల ఊళ్లకు వెళ్లి పోలింగు డ్యూటీ చేస్తారు. దొంగ ఓట్లు వేయనీయకపోతే నీళ్లు కూడా పుట్టనివ్వమని, ఊరు పొలిమేర దాటనివ్వమని వీరిని స్థానిక నాయకులు బెదిరిస్తారు.

అలాటి బెదిరింపులు తట్టుకుని, గతంలో బ్యాలట్‌ బాక్సులను, యిప్పుడు ఇవిఎంలను ప్రాణాల కంటె మిన్నగా కాపాడుకుంటూ రాత్రి ఎంత లేటయినా వ్యాను వచ్చేవరకు బిక్కుబిక్కుమంటూ కూర్చుని చివరకు పై ఆధికారులకు అప్పగించేవరకూ ఊపిరి కూడా గట్టిగా పీల్చుకోరు వీరు. ప్రజాస్వామ్యం యీ మేరకైనా నిల్చి వుందంటే వీళ్లంతా చూపిన ధైర్యసాహసాలే కారణం. ఇలా ఎన్నిక యంత్రాంగంలో బ్యాలట్‌ బాక్సు మోసే అటెండరు దగ్గర్నుంచి అందరూ గుండెదిటవుతో, బాధ్యతతో పని చేస్తూండగా, అందరి కంటె ఉన్నత స్థానంలో వున్న యీయన నాకు భయం అంటూ పిరికితనం చూపకూడదు కదా!

ధైర్యం అనేది మనిషిని బట్టి వుంటుంది. పోలీసు ఉద్యోగంలో చేరి దొంగంటే నాకు భయమండీ అంటే కుదురుతుందా? ఆ ముక్క ఉద్యోగంలో చేరేముందు ఆలోచించుకోవాల్సింది అంటారు. అలాగే, యీయన స్వతహాగా పిరికివాడైతే యిలాటి క్లిష్టమైన పోస్టింగు 2016లో ఆమోదించ కూడదు. అప్పటికే ఆంధ్రలో వైసిపి పార్టీ బలంగా వుందని తెలుసు. అయితే అధికారంలో, కాకుంటే ప్రతిపక్షంలో వుంటుందని తెలుసు. వైసిపి నాయకుడికి ఫాక్షన్‌ కుటుంబ నేపథ్యం వుందనీ తెలుసు. 2019లో టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చినా, స్థానిక ఎన్నికలు ఎప్పటికో అప్పటికి నిర్వహించక తప్పదని తెలుసు. ఆ ఎన్నికలలో ప్రతిపక్షంలో వున్న వైసిపి తనను బెదిరిస్తుందని ఊహించలేదా? బెదిరిస్తే తట్టుకోలేను, నాకెందుకొచ్చిన గొడవ యిది అనుకున్నపుడు యీ పోస్టెందుకు తీసుకోవడం?

ఆయన అంతకు ముందు ధైర్యవంతుడే కానీ యిప్పుడే హఠాత్తుగా అధైర్యం కమ్మేసింది అనుకుందాం. ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరైనా గూండా వలన భయం తోస్తే నిరక్షరాస్యుడైన సామాన్యుడు కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్‌ రాయించుకుంటాడు. అది లేనిదే కథ ముందుకు సాగదు కనక. ఎందుకు ఫిర్యాదు చేశావ్‌ అని గూండా తంతాడేమోనన్న బెదురు మనసులో మెదలుతున్నా, అతను జంకడు. ఆ సామాన్యుడికి వుండే దమ్ము కూడా ఈయనకు లేదు. ముఖ్యమంత్రి మీదే ఫిర్యాదు చేస్తున్నాను, ప్రభుత్వం చేతిలోనే పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి ఫిర్యాదు తీసుకోరనుకున్నాను అంటే హాస్యాస్పదంగా వుంటుంది. అనేకమంది ప్రభుత్వం మీద, ఎమ్మేల్యేల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద ఫిర్యాదు చేస్తూంటారు, కోర్టుల్లో కేసులు పడేస్తూ వుంటారు.

ఫిర్యాదు అర్జీ తీసుకున్నా దానిపై చర్య తీసుకోరనుకున్నాను అన్నా అదీ చెల్లదు. ఫిర్యాదంటూ చేసి చూడాలి కదా! పోలీసు దగ్గరకు వెళ్లడం యిష్టం లేదు, అప్పుడేం చేయాలి? గవర్నరు దగ్గరకి వెళ్లాలి. ఎందుకంటే తనను నియమించింది ఆయనే. ఎన్నిక కమిషనర్‌ స్వతంత్రతను కాపాడడానికి రాజ్యాంగం గవర్నరు చేతనే ఆయనను నియమింప చేసింది. ఉద్యోగులందరికీ చేరిన మరుక్షణం నుంచి కంఠోపాఠమయ్యే మాట ఒకటి వుంది - ‘త్రూ ప్రాపర్‌ ఛానెల్‌’ అని. అది తెలియకుండానే యీయన యిన్నేళ్లు పని చేశారంటే నమ్మలేం.

గవర్నరు దగ్గరకు ఎందుకు వెళ్లలేదు? ఆయన ముఖ్యమంత్రి కింద పనిచేయడు కదా! ఈయన వెళ్లి చెపితే ఆయనే కేంద్రానికి చెప్పి సెంట్రల్‌ ఫోర్సెస్‌తో రక్షణ ఏర్పాటు చేసేవాడేమో! గవర్నరుకు కూడా ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉందని తోచిందేమో, వెళ్లలేదు. ఇటీవలి కాలం లో ప్రధాని దగ్గర్నుంచి, సామాన్య అధికారి దాకా తను చెప్పదలచినది చెప్పడానికి ట్విటర్ వాడేస్తున్నారు. బాబు పనితీరు నచ్చనపుడు, ఐవైఆర్‌ సోషల్‌ మీడియా ద్వారా విమర్శలు చేశారు. అది నియమాలకు వ్యతిరేకం కాదు కాబట్టే బాబు ప్రభుత్వం కేసు పెట్టలేక పోయింది.

ఇప్పుడు రమేశ్‌ కుమార్‌ ఆ మార్గాన్ని ఎంచుకుని వుంటే ఆయన్ని బెదిరించేవాళ్లు భయపడేవాళ్లు. ఈయన బాత్‌రూమ్‌లో జారిపడినా మనల్నే తప్పుపడతార్రా బాబూ అని దాడి చేయడానికి భయపడతారు. ‘‘మల్లీశ్వరి’’ సినిమాలో దేవదాస్‌ కనకాల చేత యీ తరహా డైలాగు చెప్పించారు. ఈయన అదీ చేయలేదు. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. మరి ఆఫీసులో దాని ఆనవాళ్లు ఏమీ లేకుండా చేయడంలో అర్థం ఏమిటి? హోం శాఖకు ఫిర్యాదు చేశాక, వాళ్లు చీఫ్‌ సెక్రటరీకి చెప్పి అదనపు బలగాలు యిమ్మనడమో, కేంద్ర పోలీసులను పంపడమో చేస్తారు కదా, అప్పుడైనా ఫిర్యాదు సంగతి బయట పడుతుంది కదా!

అది కాన్ఫిడెన్షియల్‌ లెటర్‌ కాబట్టి... అంటే పంపేవరకే రహస్యం. తదుపరి పరిణామాల వలన యీ రహస్యం ఎలాగూ బయటపడుతుంది. బ్యాంకుల్లో అయితే యిలాటి లెటర్స్‌ను ప్రైవేట్‌ అండ్‌ కాన్ఫిడెన్షియల్‌ కాప్షన్‌తో సెపరేట్‌ నెంబరింగ్‌తో పంపుతాం. ఫైల్‌లో కాపీ పెడతాం. మేనేజరు బదిలీ అయి వెళ్లేటప్పుడు తర్వాతి మేనేజరుకి యీ  ఫైల్ అందించడం జరుగుతుంది. ఈయన తన అభ్యర్థనకు రికార్డు లేకుండా చేయడం వింతగా వుంది. ఆయన ఎన్నికల కమిషనర్‌ హోదాలో రాయలేదు, వ్యక్తిగత హోదాలో రాశాడు అనుకుంటే ఆఫీసు సిబ్బంది సేవలు ఉపయోగించుకోకూడదు.

పైగా అది రహస్యం అనుకుని వుంటే మీడియాకు ఎలా చేరవేశాడు? తనిష్టానికి వ్యతిరేకంగా చేరితే ఎవరు లీక్‌ చేశారో వాళ్లపై ఫిర్యాదు చేయాలి కదా! చేయలేదేం? ఇలా అన్ని అవకతవకగానే చేసి జగన్‌ సర్కారును అప్రతిష్ఠపాలు చేయడమొక్కటే ఈయన ధ్యేయం అని మామూలు వాళ్లు కూడా అనుకునేట్లు చేశాడు. ఆ ఉత్తరం యీయన రాశాడా, మరెవరైనా రాసిపెట్టారా, రాసిపెట్టినదానిలో యీయన మార్పులు చేర్పులు చేశాడా అన్నదానిపై నాకు యింట్రస్టు లేదు. దానిపై ఆయన సంతకం ఉంది. ఉత్తరం నాదే అని ఆయన అన్నాడు. అది చాలు.

ఇక ఉత్తరంలో సంగతులకు వస్తే - హింసాత్మక ఘటనలు జరిగాయి,  నామినేషన్లు అడ్డుకున్నారు, బలవంతంగా ఉపసంహరింప చేశారు అన్నాడాయన. మరి ఆయన విచారణకు ఆదేశించి, అక్కడి ఎన్నికలు రద్దు చేశారా? బాధితులకు న్యాయం చేశారా? రాష్ట్రంలో భయానక వాతావరణం వుందని చూపించడానికి మాత్రమే వాటిని వాడుకున్నారా? ఇక ఏకగ్రీవాల గురించి ఆయన 2014తో పోల్చి లెక్కలు యిచ్చి, ఎంపిటిసిలో అప్పట్లో 2%, యిప్పుడు 24% అనీ, జెడ్‌పిటిసిలో యీ వ్యత్యాసం మరీ ఎక్కువగా వుందని యిప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా చెప్పారు.

2014 మార్చిలో పరిస్థితి ఎలా వుంది? నెల తర్వాత జనరల్‌ ఎలక్షన్లు రాబోతున్నాయి. వాటిలో విజయానికై టిడిపి, వైసిపి, కాంగ్రెసు మూడూ విపరీతంగా పోటీ పడుతున్నాయి. వాటికి రిహార్సల్‌గా స్థానిక ఎన్నికలను పరిగణించి అభ్యర్థులందరూ తమ పార్టీ అధినేతను యింప్రెస్‌ చేసేందుకు శ్రమించారు. విభజన వలన తాము ఏ మేరకు నష్టపోతామో అప్పటికింకా కాంగ్రెసుకు తెలిసిరాలేదు. హేమాహేమీలందరూ అందులోనే ఉన్నారు. అందువలన మూడూ తమకు బలం వుందనుకుంటూనే గోదాలోకి దిగినపుడు ఏకగ్రీవాులు ఎక్కువగా ఎందుకుంటాయి?

దానితో పోలిస్తే 2020 మార్చిలో పరిస్థితి ఎలా వుంది? ఏడాది కితమే వైసిపి అసెంబ్లీ ఎన్నికలో విజయదుందుభి మోగించింది. వచ్చిన దగ్గర్నుంచి సంక్షేమ పథకాలతో ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్థిక విధానాల వైఫల్యాలు ప్రజల కింకా అనుభవంలోకి రాలేదు. కాంగ్రెస్‌ నామమాత్రమై పోయింది. అభ్యర్థులే లేరు. ఘోరపరాజయం తర్వాత టిడిపి క్యాడరంతా చెల్లాచెదరయ్యారు. బాబు నీరసించారని, లోకేశ్‌ ఎక్కిరాలేదని, జగన్‌ మరో ఐదేళ్లు పాలించినా ఆశ్చర్యం లేదనే లెక్కతో నాయకులు పార్టీ వీడుతున్నారు. లేదా స్తబ్దంగా వుంటున్నారు. పార్టీ అమరావతికే అంకితం కావడంతో తక్కిన ప్రాంతాల్లోని టిడిపి వారు తమ స్థానాలపై ఆశలు వదులుకున్నారు.

ఖర్చు పెట్టి యీ ఎన్నికలలో గెలిచినా చేయగలిగేదేమీ లేదు. ఎలాగోలా అవస్థ పడి ప్రజలు వైసిపి పాలనతో విసిగిపోయారని నిరూపించినా దాని ఫలాలు అందుకునేందుకు దగ్గర్లో జనరల్‌ ఎన్నికలు లేవు, ఉపయెన్నికలూ లేవు. బిజెపి, జనసేనలు మీడియా ముందు వీరంగం వేయగలవు కానీ క్షేత్రస్థాయిలో అభ్యర్థులను వెతుక్కోవలసిన స్థితిలోనే వున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీతో తలపడేవారెవరు? ఏకగ్రీవాల సంఖ్య పెరగడంలో ఆశ్చర్యమేముంది?

అసంబద్ధమైన 2014 పోలిక చూపించి, రమేశ్‌ ఆరోపణలు చేయడం తర్కవిరుద్ధంగా వుంది. అన్నిటికీ మించి, ఆయన తన లేఖలో ‘అధికార పార్టీ నాయకత్వానికి ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉంది, వారు హైదరాబాదు కూడా చేరగలరు, నా ప్రత్యర్థుల నుండి నాకూ, నా కుటుంబానికి ప్రమాదం వుంది’ అని రాయడం ఏ అఫీషలూ చేయడు. ప్రత్యర్థులనేది రాజకీయపదం. ఫ్యాక్షన్‌ నేపథ్యం, రాయలసీమ రౌడీలు, పులివెందల పంచాయితీ... టిడిపి పరిభాష తప్ప అధికారుల పరిభాష కానే కాదు.  ఏవైనా వుంటే వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి చెప్తారు తప్ప అక్షరరూపంలో అలాటి భావాలను ప్రకటించరు. అధికార పార్టీ నాయకత్వం అంటే ఏమిటి? అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వున్నారు. అందరూ ఫ్యాక్షనిస్టు నేపథ్యం కలవారా?

నేపథ్యం ఉన్నంత మాత్రాన యిప్పుడు ఫాక్షనిస్టు అనగలమా? రుజువులున్నాయా? రమేశ్‌ కుమార్‌కు యిలాటి లేఖలు, యింతటి కటువైన భాషలో రాసిన నేపథ్యం ఉందా? ఈ వర్ణన టిడిపిది, ఆంధ్రజ్యోతిది. అది యీయన లేఖలో ప్రతిబింబించడంతో ఈయనను టిడిపి ప్రభావితం చేసిందనే అనుమానం బలంగా కుగుతోంది. ఎలా ప్రభావితం చేయగలిగింది? కులం పేరు చెప్పి.. అంటే నమ్మబుద్ధి కావటం లేదు. కులంపై ఎంత ప్రేమ ఉన్నా తన స్టేచర్‌ను బలి యిచ్చేటంత వుందనుకోను.

ఆయనపై ఏదో ఒత్తిడి వుండవచ్చు. బ్లాక్‌మెయిల్ అనుకుంటే ఆయన గతంలో ఏదో తప్పు చేసి వున్నాడని తెలియాలి. మనకు తెలియదు కాబట్టి చెప్పలేం. భవిష్యత్తులో ఏదో మేలు చేస్తామని ఆశ పెట్టారా? ఆ క్విడ్ ప్రో కో ఏమిటో యిప్పట్లో తెలియదు. మొత్తానికి ఏదో  ఒక బలమైన ఒత్తిడి వలననే రమేశ్‌ అలా చేసి వుంటారని అనుకోవాలి. మొత్తం వ్యవహారంలో జగన్‌, రమేశ్‌ యిద్దరూ తమ స్థాయికి తగినట్లు వ్యవహరించలేదని, దొందూ దొందే అనీ నా వ్యక్తిగత అభిప్రాయం. విభేదించేవారు విభేదించవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?