cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: మందుకి కులం రంగు అంటుతుందా?

ఎమ్బీయస్‍:  మందుకి కులం రంగు అంటుతుందా?

ఆనందయ్య మందు గురించి నిన్న మరో వివరణ వచ్చింది. తక్కిన మందులన్నీ ఓకే కానీ కంట్లో వేసే మందులో హానికరమైన పదార్థాలున్నట్లు ఐదు సంస్థలు తెలిపాయని ఆంధ్ర ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. హైకోర్టు ఆ రిపోర్టులు తను స్వయంగా చూస్తానంది. ఆనందయ్య తరఫు లాయరు హానికరం కాదని వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల తెలిపిందన్నారు. కళ్లకు హాని అని చెప్పిన సంస్థల్లో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, శంకర నేత్రాలయ వంటి సంస్థలున్నాయని ప్రభుత్వం అంటోంది. జులై 1 దాకా ఏ విషయమూ తేలదు. తక్కిన మందుల పంపిణీ సాఫీగా జరుగుతున్నట్లుంది. ఇవి కరోనా మందులు కాదని, కరోనాకు వేసుకోవాల్సిన మందులన్నీ వేసుకుంటూ వీటిని వాడితే ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పి మరీ పంపుతున్నారు.

ఈ మందు విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించినందుకు సంతోషం. మందును సాంతం కొట్టి పారేయకుండా, అలాగని ఆకాశానికి ఎత్తివేసి దివ్యౌషధమని ప్రచారం చేయకుండా, తగినంత విలువ నివ్వడం సమంజసంగా వుంది. కంటి మందు విషయంలో మరింత జాగ్రత్త వహించడం కూడా భావ్యమే. ఎందుకంటే పొట్టలోకి వెళ్లే మందుల్లో ఏమైనా తేడా వుంటే సులభంగా బయటకు పోతుంది. 

కళ్లతో ప్రయోగాలు చేయలేము. పైగా సర్టిఫికెట్టు యిచ్చిన ఆయుర్వేద కళాశాలకు నేత్రవైద్యంలో ఏపాటి పరిశోధనానుభవం వుందో తెలియదు. ఎల్వీ ప్రసాద్ నేత్రసంస్థ, శంకర నేత్రాలయల అధ్యయనాలు కొట్టిపారేసేట్లు వుండవు. మన దేశంలో ప్రతీదీ రాజకీయం అవుతుంది కాబట్టి ఈ మందు విషయంలో కూడా జరిగింది. సోమిరెడ్డి, కాకాని తిట్టేసుకున్నారు. మందు ఖరీదు అంత తక్కువగా వున్నపుడు దానిలో పెద్ద కుంభకోణం జరిగిపోయిందని సోమిరెడ్డి ఎలా అన్నారో ఆయనకే తెలియాలి. సోమిరెడ్డి ఏదో అన్నంత మాత్రాన వెధవ, గిధవ అంటూ పబ్లిగ్గా తిట్టడం ఏ విధమైన సంస్కారమో కాకాని చెప్పాలి.

ఇలాటివి సరే కానీ, యిప్పుడీ మందు విషయంలో కులం కోణం ఒకటి తొంగి చూసింది. మల్లెపల్లి లక్ష్మయ్య అనే విశ్లేషకులు జూన్ 3 నాటి ‘‘సాక్షి’’లో ‘దేశీయ వైద్యానికి అసలు వారసుడు’ పేర ఒక వ్యాసం రాసి ఆనందయ్యది గొల్లకులం అని ప్రస్తావించి అక్కణ్నుంచి ప్రాచీన కాలం నుంచి, దేశీయ వైద్యం బౌద్ధులకు, నిమ్నకులాల వారికి తెలుసని, బ్రాహ్మణ వర్గంపై నింద వేసే వరకు వెళ్లిపోయారు. వ్యాసకర్త రాసినదాని ప్రకారం - ‘క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చరకుడు చరకసంహిత రాశాడు. అది బౌద్ధం అనంతరం రాసిన గ్రంథం. .. బుద్ధుడు వైద్యుడు, బౌద్ధారామాలు ఆరోగ్య కేంద్రాలు. .. వేదాలు, మహిమలు తప్ప వైదికమతాన్ని ఆచరిస్తున్న పురోహిత బ్రాహ్మణవర్గం వైద్యంపై దృష్టి పెట్టలేదు, వైద్యులను సామాజిక వెలివేతకు గురి చేశారు.

‘..క్రీ.పూ. ఒకటవ శతాబ్దం తర్వాత వచ్చిన బ్రాహ్మణ రాజ వంశాలైన శుంగ, కణ్వ వంశాలు బౌద్ధాన్ని దెబ్బ తీసిన రోజుల్లో వచ్చిన మనుధర్మంలో వైద్యుడు ఎలాటి పవిత్ర కార్యక్రమాల్లో, ప్రత్యేకించి యాగాల్లో పాల్గొనకూడదని రాశారు. తర్వాత వైదికమతం బ్రాహ్మణమతంగా మారి అదే ఆయుర్వేదాన్ని తమ సొంతం చేసుకున్నారు. ఇతర కులాలకు నేర్పించకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో వైద్యం పూర్తిగా బ్రాహ్మణుల సొంతమై పోయింది. అయితే మిగతా ప్రజలు బౌద్ధుల నుంచి నేర్చుకున్న విజ్ఞానం, తమ అనుభవంతో సంపాదించుకున్న జ్ఞానంతో వైద్యాన్ని అలవర్చుకున్నారు.’

ఇది చదివితే బౌద్ధంతోనే వైద్యం ప్రారంభమైనట్లు, సామాన్య ప్రజలందరూ బౌద్ధం ద్వారానే వైద్యం నేర్చుకున్నట్లు తోస్తుంది. బౌద్ధం తర్వాతే చరకసంహిత వచ్చింది సరే, మరి బుద్ధుడి కంటె ముందువాడైన శుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీలే చేసేశాడు. ఆయనకు వైద్యం ఎవరు నేర్పేరో! జైనంలో కూడా వైద్యగ్రంథాలున్నాయి. ఈయన దాన్ని ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. బౌద్ధం, జైనం కంటె ముందునుంచి హిందూమతం వుంది కదా! వాళ్లలో ఎవరూ వైద్యులుండేవారు కాదా? చరకుడు, శుశ్రుతుడు నిమ్నవర్గం వాళ్లన్న దాఖలా ఏమైనా వుందా? విద్యాభ్యాసం చాలా తక్కువమందిలో వుండే ఆ రోజుల్లో వీళ్లు సంస్కృతంలో పుస్తకాలు రాశారంటే ఉన్నతవర్గీయులే కావడానికి అవకాశాలు ఎక్కువ కదా! వైద్యులను అంత అంటరానివాళ్లగా చూస్తూంటే మరి రాజవైద్యులు ఎందుకు వుండేవారుట? బ్రాహ్మణాధి ఆధిపత్యకులాల వారు తమకు రోగం వస్తే ఎవరి దగ్గరకు వెళ్లేవారుట?

జనసామాన్యానికి తెలిసిన వైద్యం (నాటు లేదా దేశీయ వైద్యం, సిద్ధ, మూలికావైద్యం వగైరాలు అని ఆయన రాయలేదెందుకో) గురించి చెప్తూ మధ్యలో ‘.. అదే ఆయుర్వేదం’ అంటూ కప్పగంతు ఎందుకు వచ్చింది? ఈ వైద్యాలన్నిటికీ ఆలవాలం అడవిలోని వృక్ష, జంతు సంపదే కదా! అడవిలో గిరిపుత్రులతో బాటు మునులు, ఋషులు కూడా వుంటారు కదా! వారు విద్యాబుద్ధులు నేర్చుకున్నవారు కాబట్టి వివిధ మూలికలపై పరిశోధనలు చేసి వుండవచ్చు, గ్రంథస్తం చేసి వుండవచ్చు. మరి వారందరినీ వెలి వేశారా? వ్యాసకర్తకు దొరికినదల్లా మనుధర్మం ఒకటే! అది ఏ కాలంలో ఏ స్థాయిలో,  ఏ మేరకు అమలయ్యిందో తెలియదు కానీ, యీ బాపతు విమర్శకులందరికీ దొరికినది అదొక్కటే! దాని ప్రకారం శిక్షలు పడిన ఉదాహరణలేవైనా చరిత్రనుంచి వీరు ఎత్తి చూపించగా నేను యిప్పటిదాకా చూడలేదు.

పోనీ యీయన చెప్పిన ప్రకారమే అనుకున్నా పురోహిత బ్రాహ్మణ వర్గం వైద్యంపై దృష్టి పెట్టలేదనుకుందాం. మరి తక్కిన బ్రాహ్మణ వర్గాలేం చేశాయో రాయాలిగా! వైదిక మతం బ్రాహ్మణమతంగా మారి బ్రాహ్మణులు ఆయుర్వేదాన్ని తమ కబంధహస్తాల్లో బిగించుకునే ముందు ఏ బ్రాహ్మణుడూ ఆయుర్వేదాన్ని నేర్చుకోలేదని, చికిత్స చేయలేదనీ వీరు చెప్పగలరా? పోనీ ఆ తర్వాత ఏ బ్రాహ్మణేతరుడూ ఆయుర్వేదాన్ని అభ్యసించలేదనీ, ఉపయోగించలేదనీ చెప్పగలరా? బ్రాహ్మణులు జనాభాలో ఏ 3-4 శాతమో వుంటారనుకుంటే, వాళ్లందరూ వైద్యవృత్తి మాత్రమే చేపట్టారని చెప్పలేం కదా! వారిలో పురోహితులు, మంత్రులు, ఉద్యోగులు, సైనికులు, సేనాపతులు, రాజులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, యితర వృత్తులవారు అందరూ వున్నారు కదా! వాళ్లంతా పోగా ఏ 1 శాతమో మిగిలితే వాళ్లు మాత్రమే వైద్యులా? తక్కిన 99 శాతం మందికి వాళ్లే వైద్యం చేశారా? ఇది తర్కానికి నిలుస్తుందా?

అసలు వైద్యాన్ని కులానికి ముడిపెట్టి చూడడమే అనవసరం. పెడితేగిడితే వైద్యంలో శస్త్రవిభాగాన్ని మంగలి కులస్తులకు కాస్త కట్టబెట్టవచ్చు. ఎందుకంటే కత్తులతో వ్యవహరించడంలో వాళ్లు నేర్పరులు. వ్రణాలు తీసివేయడం, ముక్కు, చెవి, గోళ్లు వంటి సున్నితమైన భాగాలతో లాఘవంగా వ్యవహరించడం వాళ్లకు వృత్తి నేర్పిన విద్య. వ్యాసకర్త లక్ష్మయ్య కూడా మంగలి మంత్రసానులు వుండేవారని రాసేవారు. మరి వీళ్లను సంఘబాహ్యులుగా చూసిందా మన సమాజం? ఏ శుభకార్యమైనా మంగలి, మంగళవాద్యాలు లేకుండా జరిగిందా? మైనర్ సర్జరీలతో బాటు మందూ మాకూ వేయడం కూడా నేర్చుకుని వుంటారు. సిద్ధవైద్యం చేసే మంగలి కులస్తులు నాకు తారసిల్లారు. బెంగాల్‌లో వైద్య అనే కులమే వుంది. వాళ్లు రెండు ఇంటిపేర్లు కలిసి వుంటాయి (సేన్‌-గుప్తా, దాస్‌-గుప్తా...). తాము బ్రాహ్మణులతో సమానమని చెప్పుకుంటారు వాళ్లు. కొందరు జందెం వేసుకుంటారు కూడా.

అసలు ఏ సమాజంలోనైనా వైద్యులను నీచంగా చూసే ప్రశ్న ఎక్కడ వస్తుంది? వైద్యం అనేది యింటివైద్యంతో ప్రారంభమవుతుంది. ఆటల్లో గాయమైతే, పుండుకి చీము పడితే కట్టు కట్టేది అమ్మో, బామ్మో కదా! వాళ్లను అమర్యాదగా చూస్తామా? కడుపు నొప్పి వస్తే ఏ గచ్చాకో, పుచ్చాకో నూరి మందు వేసినవాణ్ని చీదరించుకుంటామా? ఆ వైద్యుడు ఏ కులస్తుడు, ఏ మతస్తుడు అన్నది యిప్పుడూ, అప్పుడూ, ఎప్పుడూ చూడం. హస్తవాసి వుంటే చాలు. మోకరిల్లుతాం. ఇక ఆయుర్వేదాన్ని బ్రాహ్మణులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని లక్ష్మయ్య అంటున్నారు. దేశంలో తరతరాలుగా ఆయుర్వేదవైద్యం చేస్తున్న వారి గణాంకాలు తీసి చూస్తే తెలుస్తుంది, అన్ని కులాల వారూ యిందులో వున్నారని! ఆయుర్వేదం ఒక్కటే కాదు, సిద్ధ, దేశీయ వైద్యాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. వ్యాధి తగ్గించినవాడే దేవుడు! అతడి కులంతో మనకు పనేముంది?

ఇక ఈయన ప్రస్తావించిన మనుధర్మ సూక్తి సంగతికి వస్తే – యజ్ఞయాగాదుల్లోకి వైద్యుణ్ని రానివ్వవద్దని రాసి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అక్కడ జనసమ్మర్దం విపరీతంగా వుంటుంది. అంటువ్యాధిగ్రస్తులతో మెలగే వైద్యులకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం వుంది కాబట్టి వారి ద్వారా జనాలకు రోగం సంక్రమించే ప్రమాదం వుంది కాబట్టి, ఆ జాగ్రత్త చెప్పివుంటారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న వైద్యులను వాళ్ల యిరుగుపొరుగు వాళ్లు కట్టడి చేయడం చూశాం. మీరు ఆస్పత్రులకు వెళ్లకుండా యింట్లోనే వుండండి, లేదా ఆసుపత్రుల్లోనే వుండండి, వెళ్లి వస్తూ వుంటే మాకు కరోనా సోకుతుంది అని వాళ్లు అభ్యంతర పెట్టారు. ఎంతో ప్రగతి సాధించి, శానిటైజర్లు, మాస్కులు, గ్లవ్‌లు, పిపిఇ కిట్స్ వచ్చిన యీ కాలంలోనే యీ భావన వుంటే, అవేమీ లేని ఆ కాలంలో జనసందోహం వున్నచోటుకి వైద్యుల ప్రవేశాన్ని నిషేధించడంలో ఆశ్చర్యమేముంది?

అయితే లక్ష్మయ్య దీనికి కూడా పెడర్థం తీశారు. ‘రుగ్మత బాపడానికి రోగులను అంటుకోవాలి కాబట్టి, అలా అంటుకోవడం ద్వారా వాళ్లు మలినమై పోయారని వైదిక పెద్దలు భావించార’ని ఈయన తీర్మానించారు. అందుకే యాగాల్లోకి రానీయలేదట! పోనీ రోగి కులరీత్యా అస్పృశ్యుడు, అంటుకున్నాడు కాబట్టి.. అనడానికీ లేదు. రోగం వచ్చినవాణ్ని అంటుకుంటే మలినమై పోయినట్లే అని ‘వైదిక పెద్దలు’ భావించారట! అంటే కుటుంబసభ్యులకైనా సరే జ్వరం వస్తే వాళ్లను స్పృశిస్తే, వాళ్ల నాడి పట్టుకుని చూస్తే మలినమై పోయారని వాళ్లు భావించారా? వహ్వా, ఏం లాజిక్! వైద్యులను అంత నీచంగా చూసి వుంటే వైద్యుడైన ధన్వంతరిని సాక్షాత్తూ విష్ణువు అవతారంగా ఎలా కొలిచారట? రామాయణంలో వానరులకు వైద్యం చేసిన సుషేణుణ్ని ఎవరూ నీచంగా చూసినట్లు లేదే! ఔషధపర్వతం సంజీవని తెచ్చినందుకే హనుమంతుణ్ని లక్ష్మణప్రాణదాత అని కొలిచేస్తున్న మనం మందు నూరి నోట్లో పోసినవాణ్ని వెలి వేస్తామా? వైద్యో నారాయణో హరిః అన్న సంస్కృతి మనదని మర్చిపోతే ఎలా?

అసలు యీ గొడవంతా ఎందుకు వచ్చింది? ఆనందయ్య కులరీత్యా గొల్లకులం వాడు, మూలికా వైద్యం ఆయనకు కుటుంబవారసత్వంగా వచ్చింది అని చెప్పి, తన్మూలంగా బిసిలందరూ గొప్పవారు అని చెప్పదలిస్తే చెప్పుకోవచ్చు. అంతమాత్రం చేత తక్కిన కులాలవారిపై బండ వేయడం దేనికి? ఆనందయ్య మందుకు వెంఠనే అనుమతి యివ్వకుండా, శాస్త్రీయ నివేదికలు వచ్చేవరకు ఆగిన ముఖ్యమంత్రిని టిడిపి వారు దుమ్మెత్తి పోశారు. వ్యాసకర్త టిడిపి పక్షపాతి అయివుండి, జగన్ బ్రాహ్మణుడై వుంటే అప్పుడు థీమ్ చక్కగా కుదిరేది. అసలు బ్రాహ్మలు తరతరాలుగా బిసిల దేశీయ వైద్యాన్ని తొక్కేస్తూ వచ్చారు, ఆనందయ్యది తాజా ఉదాహరణ అంటూ రెచ్చిపోయి వుండేవారు. అసలీ కులం గొడవ ఎందుకు తీసుకురావాలో నాకు ఎంత ఆలోచించినా అర్థం కాదు.

ఇక్కడో విషయం చెప్పాలి. 1996లో రామర్ పిళ్లయ్ అనే అతను తమిళనాడులో హెర్బల్ పెట్రోల్ అని అమ్మసాగాడు. మన తెలుగు పత్రికలు కూడా అతన్ని ఆకాశానికి ఎత్తివేశాయి. నేను దానిపై సమాచారం సేకరించి అతనొక ఫ్రాడ్ అని తేల్చుకుని వ్యాసం రాశాను. (అతను ఫ్రాడ్ అని సిబిఐ నిర్ధారించి, 20 ఏళ్ల తర్వాత మూడేళ్ల జైలు శిక్ష వేయించింది). అప్పట్లో ఆంధ్రజ్యోతి ఆదివారం, ఆంధ్రజ్యోతి వీక్లీ నా ఆర్టికల్స్‌ను పోటీపడి ప్రచురించేవి. కానీ యీ వ్యాసం వేయడానికి యిద్దరూ తిరస్కరించారు. అదేమంటే ‘రామర్ పిళ్లయ్ బిసి. మా తమిళనాడు రిపోర్టరు ద్వారా అతని గ్రామానికి వెళ్లి, వివరాలు సేకరించి, అతని పేద నేపథ్యాన్ని హైలైట్ చేస్తూ యిది బిసిల విజయమని హర్షిస్తూ ఆంధ్రజ్యోతి ఆదివారంలో ఆర్టికల్ వేశాం. ఇప్పుడిలా వేస్తే బాగుండదు.’ అన్నారు. ఏ కులస్తుడైతేనేం? ఫ్రాడ్ ఫ్రాడే కదా అంటే వాళ్లు వినలేదు. చివరకు ఆ వ్యాసాన్ని ‘‘మయూరి’’ అనే వీక్లీకి పంపితే వాళ్లు వేశారు.

ఇలా వుంటుంది పాత్రికేయల దృష్టికోణం. ఆనందయ్య విషయంలో - ఆయనకు మూలికావైద్యం తెలుసు. మందు చేశారు, దానిలో హానికర పదార్థాలు లేవు, అది కరోనాపై ఎలా పనిచేస్తుందో క్లినికల్ ట్రయల్స్ ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు వేలాదిమంది వాడుతున్నారు కాబట్టి, దాని ఎఫికసీ సంగతి తెలుస్తుంది. ఇంతవరకు మనకు చాలు. ఆయన ఏ కులస్తుడైనా మనకు అనవసరం. రోగానికి, వైద్యానికి కులంతో పని లేదు. ఆనందయ్య మందు వాడేవాళ్లు యిక్కడ యింకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇలాటి దేశీయ వైద్యం చేసేవాళ్లు సాధారణంగా పూర్తి స్థాయి వైద్యులు కారు. వాళ్లు ఒక పర్టిక్యులర్ రోగాన్ని మాత్రం నయం చేయగలరు. 

కామెర్లకు పసరు మందు యిచ్చేవాళ్లు దాన్ని మాత్రమే తగ్గించగలరు. దానివలన సైడ్ ఎఫెక్ట్‌స్ వస్తే వాటిని నయం చేయడానికి వాళ్ల చేతకాదు. ఎందుకంటే ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ అనేది ఐదేళ్ల కోర్స్. ఎన్నో నేర్పుతారు. అవన్నీ వీళ్లకు, జస్ట్ ఓ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అబ్బేయవు. ‘‘న్యూటన్’’ హిందీ సినిమాలో చూపించారు – దండకారణ్యంలో పుట్టి పెరిగిన ఓ గిరిజన టీచరు చెప్తుంది. ఒక చెట్టుమీద తిరిగే చీమల చేత కుట్టించుకుంటే మలేరియా రాదని! ఆ విషయం తెలిసినంత మాత్రాన ఆమె వైద్యురాలు అయిపోదు కదా!

వాక్సిన్ కూడా అందరి మీదా ఒకలా పనిచేయడం లేదు. కొందరికి సైడ్ ఎఫెక్ట్‌స్ వస్తున్నాయి, కొందరికి రావడం లేదు. వేసుకున్నాక కొందరికి కరోనా రావటం లేదు, కొందరికి వస్తోంది. ఆ రావడంలో కూడా కొందరికి తీవ్రంగా వస్తోంది, కొందరికి మైల్డ్‌గా వస్తోంది. రోగి వయసు, రోగం తీవ్రత బట్టి వైద్యుడు డోసేజి, పొటెన్సీ నిర్ణయిస్తాడు. ఆనందయ్య మందులో అందరికీ ఒకే మోతాదులో మందు పంపించేస్తున్నారు.

రోగిని ప్రత్యేకంగా పరీక్షించి మందిచ్చే అవకాశం లేదు. హోలిస్టిక్‌గా ట్రీట్ చేయడం లేదు. దీనివలన మంచి జరిగితే బాగే, పనిచేయకపోయినా ఫర్వాలేదు. కానీ ఏదైనా తేడా చేస్తే, కాంప్లికేషన్స్ వస్తే మాత్రం రెగ్యులర్ డాక్టర్లు – ఆయుర్వేదమో, అలోపతియో – వద్దకు వెళ్లాల్సిందే. ఇది దివ్యౌషధం అనుకుని ఆజాగ్రత్తగా వున్నా, అవాంఛిత లక్షణాలను గమనించడంలో అశ్రద్ధ చేసినా ప్రమాదం వుంది. నేను ఆనందయ్య గారి మందుని కించపరచటం లేదని, దానికీ, దాన్ని తీసుకునే విధానంలోనూ వున్న పరిమితులను గుర్తించగోరుతున్నానని గ్రహించగలరు. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2021)

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×