cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: దృశ్యం 2

ఎమ్బీయస్‍: దృశ్యం 2

ఇది చదివే ముందు ‘‘వెంటాడే దృశ్యం’’ వ్యాసం చదవగోర్తాను. దృశ్యం సినిమా రచయిత మొదట మన వాళ్ల దగ్గరకు వస్తే అవతలికి పంపించేవారు. హీరోకి హీరోయిజం ఎక్కడేడ్చిందయ్యా? పోలీసు వాళ్లు తన్నినపుడు కూడా నోర్మూసుకుని కూర్చున్నాడు. ‘నా మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి వెళ్లి గొయ్యిలో పడుతుంది జాగర్త’ వంటి పంచ్ డైలాగులు లేవు అనేవారు. కానీ మలయాళ సూపర్ స్టార్లకు ఆ బాధలు లేవు కాబట్టి ఆయన అక్కడ నెగ్గుకొచ్చాడు. దాన్ని తెలుగులో రీమేక్ చేసినప్పుడు వెంకటేశ్ కాబట్టి అలాగే వేశారు. ప్రతి మధ్యతరగతి తండ్రి ఆయనతో ఐడెంటిఫై అయ్యారు. అదే 50 కోట్ల హీరో అయితే ఏవేవో విన్యాసాలు చేసేవాడు, మనకు ఎలియనేషన్ వుండేది. దృశ్యం సినిమా విడుదలైనప్పుడు అది ‘‘సస్పెక్ట్ ఎక్స్’’ అనే జపనీస్ సినిమా స్ఫూర్తితో తీశారని అన్నారు. అదేమీ కాదని తర్వాత తేలింది. చైనా వాళ్లు దృశ్యం రీమేక్ హక్కులు కొనడంతో అది ధృవపడింది. ఇప్పుడు దృశ్యం 2 తీయడంతో రచయిత, దర్శకుడు జీతూ జోసెఫ్ తను ఎవరి ఊహకూ అందనని నిరూపించుకున్నాడు.

ఈ మలయాళ సినిమా ఓటిటిలో చూడడం మొదలుపెట్టినపుడు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. దృశ్యంలో మొదటి భాగం సరదాగా నడుస్తుంది. దుర్ఘటన తర్వాత హీరో వేసిన ఎత్తులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పోలీసు స్టేషన్‌లోనే అతను శవాన్ని పాతిపెట్టడంతో ఊరట కలుగుతుంది. ఆరేళ్ల తర్వాత మొదలైన యీ సినిమాలో ఆ ఘటన తాలూకు ప్రభావాన్ని చూపిస్తూన్నపుడు మనసు విలవిల్లాడింది. శవం దొరక్కపోవడంతో హీరో కుటుంబం పోలీసుల నుంచి తప్పించుకున్నారు కానీ ప్రజల నోళ్ల నుంచి తప్పించుకోలేక పోయారు. చంపేశాడు, కానీ తెలివితేటలతో దొరక్కుండా తిరుగుతున్నాడు అని అందరూ అనసాగారు. ఆ వచ్చిన కుర్రాడు పిల్ల కోసం వచ్చాడో, తల్లి కోసం వచ్చాడో అంటున్నారు. వాడంతట వాడే వచ్చాడో, వీళ్లు రప్పించారో అని కూడా అంటున్నారు. జరిగిన సంఘటనతో విచలితురాలైన పెద్ద కుమార్తెకు మూర్ఛ రోగం పట్టుకుంది. ప్రమాదం తప్పిపోయిందన్న ధైర్యం పెరిగి, చిన్న కూతురు బేఫర్వాగా వుంటోంది. శవం ఏమైందో తెలుసుకోవాలనే అనవసరపు ఆతృతతో హీరో భార్య భర్తను వేధిస్తోంది.

మొదటి భాగంలో హీరోని చూస్తే జాలి కలుగుతుంది. ఏదో కేబుల్ వ్యాపారం చేసుకుంటూ బుద్ధిమంతుడైన గృహస్తులా వున్నాడని, ఒక తుంటరి కుర్రాడి కారణంగా అతనిపై అనుకోకుండా పిడుగు పడిందని! కానీ రెండో భాగంలో హీరోపై విసుగు కలుగుతుంది. అతను కేబుల్ వ్యాపారంలోంచి సినిమా థియేటరు వ్యాపారంలోకి మారాడు, బాగానే వుంది కానీ, తాగుడు మరిగాడు. పైగా సినిమా తీస్తానంటూ లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఇవన్నీ అవసరమా? అనిపిస్తుంది. ఇవతల ఒక పోలీసాఫీసరు స్నేహితుడి కొడుకు యంగ్ డిటెక్టివ్‌లా రెండో కూతుర్ని ట్రాప్ చేసి రహస్యం బయటకు లాగుదామని చూస్తున్నాడు. ఆ అమ్మాయి ముందూ వెనకా చూడకుండా ఏదోదో వాగుతోంది. ఇక కూతురికి పెళ్లి సంబంధాలు చూసే తాపత్రయంతో హీరో భార్య యింటిపక్క తాగుబోతు భార్యతో అప్పుడప్పుడు నోరు జారుతోంది. ఇదంతా చూస్తే మనకు గాభరాగా వుంటుంది.

అది కాక, సినిమా మొదట్లోనే జనార్దన్ పాత్రను పరిచయం చేశారు. అతను తన బావమరిదిని హత్య చేసి, పారిపోతూ హీరో శవాన్ని పోలీసుస్టేషన్‌లో పాతిపెట్టడం కళ్లారా చూశాడు. అయితే అతను ఆ రోజే అరెస్టయి, ఆరేళ్ల తర్వాత విడుదలై వచ్చాడు. జీవితంలో మళ్లీ సెటిలవుదామని చూస్తున్నాడు కానీ భార్య ఆగ్రహంగా వుంది. ఎక్కడా పని దొరకటం లేదు. ఈ సీన్లు కాస్త ఎక్కువై విసుగు పుట్టడంతో, పైగా హీరోతో సహా, అతని కుటుంబసభ్యుల ప్రవర్తన సవ్యంగా లేకపోవడంతో చికాకు పడి సినిమా చూడడానికి రెండు బ్రేక్‌లు యిచ్చాను.

‘‘యజ్ఞం’’ కథ గురించి రాసినప్పుడు రాశాను – రచన మనల్ని మానసికంగా వెతకు గురి చేయాలని. ఇక్కడా అదే జరిగింది. సినిమా పూర్తిగా చూసి, మరింత బాధపడాలా అనుకుంటూ వచ్చాను. కానీ సినిమాకు మంచి రివ్యూలు రావడంతో మళ్లీ మొదలుపెట్టాను. చూస్తున్నకొద్దీ ఉత్కంఠ పెరిగింది. సినిమాలో ఏ లూజ్ ఎండూ లేకుండా అన్నిటిని చక్కగా ముడివేశాడు రచయిత. హీరో ప్రతి చర్య ఎంతో దీర్ఘదృష్టితో చేశాడని అర్థమై అప్పుడు సమాధాన పడ్డాను. సినిమాలో గొప్పతనం ఏమిటంటే పోలీసులను అసమర్థులుగా చూపలేదు. ఓపిగ్గా, ఏళ్ల తరబడి ప్లాను చేసి, హీరో యింటిని ‘బగ్’ చేసి సమాచారం రాబట్టుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ప్రత్యక్షసాక్షి దొరికాడో, కేసు రీఓపెన్ చేశారు.

అయితే ఐజీ మొదటి సినిమాలో గీత లాగానే పక్షపాతంతో వ్యవహరించాడు. గీత కొడుకు వీడియోను మాయం చేసి, హీరో కుటుంబానిదే తప్పన్నట్లు చూపబోయాడు. అందుకే విధి వాళ్లకు అనుకూలించలేదు. పోలీసు స్టేషన్‌లో పాతిపట్టిన శవం దొరికినా, హీరోని దోషిగా చూపలేక పోయారు. తాము హీరోని వెంటాడుతున్నామని పోలీసులు అనుకున్నారు కానీ, అతనే తమను అనుక్షణం అనుసరిస్తూ, సిసిటివి ద్వారా పర్యవేక్షిస్తూ, తమ తర్వాతి ఎత్తు ఏమిటో ఊహించి, ముందే దానికి విరుగుడు తయారు చేసి వుంచాడని తెలుసుకోలేక పోయారు. సినిమా చివర్లో చెప్పినట్లు యీ నిత్యభయమే, నిరంతర జాగరూకతే, అనుక్షణం ఎత్తుపైయెత్తులను ఊహిస్తూ వుండడమే అతనికి పడిన శిక్ష.

పోలీసులు తనను కేసులో ఎలా యిరికిస్తారో ముందే వూహించి, దాన్ని సినిమా కథగా ఒక సినీరచయితకు చెప్పి అతని చేత ఒక నవల రాయించి, దాన్ని కోర్టులో చూపించి, పోలీసులు ఆ పుస్తకం చదివి, దానితో ప్రభావితమై తనను అన్యాయంగా యిరికించారని హీరో వాదించడం వాహ్ అనిపిస్తుంది. హీరో తప్పించుకోవడానికి ముఖ్యకారణమైన డిఎన్‌ఏ శాంపుల్ మార్పుకై హీరో ఎంతో ముందుగా ప్లాన్ చేసినా, సరిగ్గా అదే రోజు అతని స్నేహితుడు డ్యూటీలో వుంటాడని ఎలా అనుకోగలిగాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ బాధితుడు కాబట్టి విధి అతని పక్షాన వుందని మనం అనుకోవచ్చు. కొద్దిపాటి పొయెటిక్ లిబర్టీ లేకపోతే ఏ కథా రక్తి కట్టదు. చివర్లో గీత, భర్త అడిగిన దాన్ని యిచ్చేసి, ఇకనైనా మమ్మల్ని వదిలేయవచ్చు కదా అనడంతో హీరోపై మనకు జాలి కలుగుతుంది.

సమాజంలో అనేక మంది యువకులు యువతులను వేధిస్తున్నారు. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తామని, చాకుతో మొహం చెక్కేస్తామని, ఫోటో మార్ఫింగు చేసి అందరికీ పంపుతామని బెదిరిస్తూ వుంటారు. ఈ సినిమాలో హతుడు అలాటి బాపతే. కూతురు కాకపోతే తల్లయినా ఫర్వాలేదనే కాముకుడు. అతనికి శిక్ష పడాల్సిందే అని మనకు గాఢంగా అనిపిస్తుంది. అయితే ఆత్మరక్షణకై హత్య చేసినా, ముద్దాయిలను న్యాయస్థానంలో నిలబెట్టాలని, జజ్ గారు వాళ్లు కరుణించి వదిలిపెట్టేయాలని కోరుకుంటాం. కానీ యిక్కడ హతుడి తల్లి న్యాయాన్యాయవిచక్షణ లేని పోలీసు అధికారిణి. తన కొడుకుది తప్పేమీ లేదని, హీరో కుటుంబమే కుట్ర పన్నిందని సాక్ష్యాలు తారుమారు చేయగల దిట్ట. అందుకే హీరోకు యీ మార్గం పట్టడం తప్ప గతి లేకపోయిందని మనకు తోస్తుంది.

అనుకోకుండా హత్య చేసి హీరో కుటుంబం బావుకున్నదేమీ లేదు. వాళ్లు కొత్తవాళ్లంటే భయం. సమాజం ఒక విధంగా వాళ్లను వెలి వేసింది, వెక్కిరిస్తోంది. పెద్దమ్మాయికి పెళ్లి కావడం కష్టంగా వుంది. చివర్లో జజ్ చెప్పినట్లు యీ కుటుంబమే హత్య చేసిందని యావత్తు సమాజానికి తెలుసు. కానీ ప్రత్యర్థులుగా నిలిచిన రెండు కుటుంబాలూ చెరో రకంగా బాధిత కుటుంబాలే. ఎవరో ఒక్కరికే న్యాయం జరుగుతుంది. ఎవరికి దొరుకుతుందనేది లభించే సాక్ష్యంపై ఆధారపడుతుంది.

ఈ సినిమాలో యిద్దరు హంతకులున్నారు. హీరో కూతురు, జనార్దన్. కూతురికి, హత్యను మాపు చేసిన హీరోకి శిక్ష పడలేదు కానీ జనార్దన్‌కు ఆరేళ్ల శిక్ష పడింది. ఇద్దరికీ కుటుంబం ముఖ్యమే. హీరో తన కుటుంబాన్ని రక్షించడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడినట్లే, జనార్దన్ భార్యతో సర్దుబాటు చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు డబ్బు కోసమే పోలీసు సాక్షిగా మారాడు. ఈ ఆరేళ్లలో హీరో ఆర్థికంగా బాగుపడ్డాడు. అతను కనుక ఆ రోజు శవాన్ని మాయం చేసి వుండకపోతే అతని గతీ జనార్దన్ గతి అయి వుండేదే! అతని కుటుంబమూ రోడ్డు మీదకు వచ్చేదే! తన కూతురు చేసిన హత్యను హీరో తన నెత్తిపై వేసుకున్నాడు. పైగా హతుడు కుటుంబంపై దాడికి వచ్చినవాడు. జనార్దన్ విషయంలో అతనే క్షణికావేశంలోనైనా స్వయంగా హత్య చేశాడు. పైగా సొంత బావమరిదిని. అందుకే యిద్దరికి వేర్వేరు విధాలుగా జరిగింది.

జనార్దన్ చేసిన హత్య కుటుంబాన్ని చీల్చింది. హీరో కూతురు చేసిన హత్య కుటుంబాన్ని మరింత దగ్గరకు చేర్చింది. మొత్తం సినిమాలో స్త్రీపాత్రలన్నీ బాధకు గురయ్యాయి. అనుకోకుండా హత్య చేసిన పెద్దమ్మాయి మూర్ఛరోగి అయిపోయింది. ఆమె తల్లికి నిరంతర భయం, ఆందోళన. రహస్యం బయటపెట్టేసే బలహీనత. చిన్న కూతురుకి భయం ఉన్నా నిర్లక్ష్యంతో ముప్పు తేబోయింది. హతుడి తల్లి గీత పుత్రశోకంతో పగబట్టిన ఆడపులిలా అయిపోయింది. కానీ ఆమె భర్త తూకం తప్పలేదు. అతనికి ఉచితానుచితాల విచక్షణ వుంది. హద్దు మీరవద్దని భార్యను హెచ్చరిస్తూనే వుంటాడు. ఐజీ దాస్ దీన్ని ఒక యుద్ధంగా చూస్తూ, నియమాలకు విరుద్ధంగానైనా గెలవాలని చూస్తూంటాడు. హీరో అయితే తన ఆందోళన కనబర్చకుండా చాలా కూల్‌గా వుంటాడు. ఐజీతో మెంటల్ గేమ్స్ ఆడి, అతన్ని ఓడిస్తాడు.

ఈ సినిమాలకు దృశ్యం అనే పేరు పెట్టడం కూడా సముచితంగా వుంది. ఎందుకంటే మొదటి భాగంలో హీరో దొంగ సాక్ష్యాలు సృష్టించడానికై, పక్కూరివాళ్లకు తాము చూడనిదాన్ని చూసినట్లు భ్రమింపచేస్తాడు, తారీకుల విషయంలో గందరగోళానికి గురిచేస్తాడు. తను నిరంతరం చూసే దృశ్యరూపమైన సినిమాల ద్వారా యీ ఐడియాను గ్రహిస్తాడు. ఇక రెండవ భాగంలో అయితే థియేటరు ద్వారా ప్రేక్షకులకు సినిమా దృశ్యాలను చూపిస్తూనే, తను బయటి ప్రపంచాన్ని నిరంతరం గమనించడానికి తన థియేటరు ఆఫీసులో సిసిటివిలు చూస్తూంటాడు. మొదటిదానిలో దృశ్యం మానసికమైనదైతే, రెండో భాగంలో దృశ్యం భౌతికమైనది. పోలీసులు యితని యింటిని బగ్గింగ్ చేసి వినగలిగారు మాత్రమే, కానీ యితను వాళ్లు తన కేసు తిరగతోడితే జరగబోయే సంఘటనలను ముందుగానే మనో యవనికపై దృశ్యాలుగా చూసి, తదనుగుణంగా ప్రవర్తించాడు కాబట్టి, దీనిలో మానసిక దృశ్యమూ వుంది. పోలీసులు గతాన్ని, వర్తమానాన్ని మాత్రమే డీల్ చేశారు, కానీ హీరో భవిష్యత్తును కూడా డీల్ చేశాడు. రాబోయే సన్నివేశాలను స్క్రిప్టు చేసి, డైరక్టు చేసి, ఇమేజెస్ సృష్టించి, ప్రత్యర్థులకు ‘బొమ్మ’ చూపించాడు.

ఇంత చేయడానికి కారణం అతని ఆత్మస్థయిర్యం. తన కుటుంబం నేరం చేసింది కానీ పాపం చేయలేదనే విశ్వాసం. అతని అంతరాత్మ క్లీన్‌గా వుంది. నేరం చేస్తే శిక్ష తప్పదు. కోర్టు శిక్ష వేస్తే కొన్ని ఏళ్లకు వేస్తుంది. అదీ ఒక్కరికే! కానీ నేరాన్ని దాచడం ద్వారా తన కుటుంబసభ్యులు నలుగురూ యావజ్జీవిత శిక్ష అనుభవిస్తున్నారనే స్పృహ అతనికి వుంది. ఈ బాధ తప్పించుకోవడానికి నేరం ఒప్పేసుకుంటే ఏ పాపమూ చేయని భార్యాబిడ్డల పరువు బజార్న పడుతుంది. అది జరగడం యిష్టం లేదు కాబట్టి యీ గేమ్ అతను ఆడుతూనే వుండాలి. అవతల ఐజీ (రెండో భాగంలో మాజీ) గీత క్రూరత్వం మనకు కోపం తెప్పిస్తూ వుంటుంది కాబట్టి, మనం హీరో పక్షానే వుంటాం. ఈ సినిమాను వివిధ కోణాల్లో అర్థం చేసుకోవడానికి ‘‘ఫ్రంట్‌లైన్’’లో సిఎస్ వెంకిటేశ్వరన్ రాసిన వ్యాసం నాకు చాలా ఉపకరించింది. వారికి నా కృతజ్ఞతలు. (సమాప్తం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు